నా జీవిత యాత్ర-1/కుటుంబ పరిస్థితులు

20

కుటుంబ పరిస్థితులు

నారెండోతమ్ముడు జానకిరామయ్య మద్రాసులో నేను బారిష్టరు అయిన తరవాత యఫ్. ఏ. చదివి మెడికల్‌కాలేజీలో జేరాడు. మెడికల్‌కాలేజీలో రెండుసంవత్సరాలు చదివాక అతన్ని ఇంగ్లండు పంపాను. అక్కడ ఎడింబరోలో 5 సంవత్సరాలు యఫ్. ఆర్. సి. యస్. చదివి హౌస్ సర్జన్‌గా ఉంటూ ఉండేవాడు. ఆ తరవాత, మొదటి ఐరోపా మహాసంగ్రామంలో ఐ. యమ్. యస్. లో టెంపరరీ కమిషన్‌పొంది యుద్ధంలోచేరాడు. కాని, మెసపొటేమియా మొదలైనచోట్ల పనిచేసి అక్కడి సైనికాధికార్లతో తగాదాలుపడి తిరిగివచ్చి, మద్రాసు చేరుకుని అక్కడ ప్రాక్టీసు పెట్టాడు. మొత్తంమీద అక్కడ ప్రాక్టీసు బాగానే అందుకుంది. అల్లోపతీలో ఉత్తీర్ణుడు అయినా హోమోపతీ అంటే అతనికి ఎక్కువ నమ్మకము. అందులో అతను చాలా కృషిచేశాడు. ఇప్పటికీ అతనికి అది అంటేనే అభిమానము. బారిష్టరుగా పేరుప్రతిష్ఠలు వచ్చి జీవితపు అంతస్తు పెరగడంతోనే ఇంట్లో ఎవరికి ఏ చిన్నజబ్బు వచ్చినా, నేను పెద్దపెద్ద ఎక్స్‌పర్టుల్ని పిలిచే స్థితిలో పడ్డాను. నాకు ఖూన్ తొట్టివైద్యంమీద నమ్మకం ఉందికాని ఈ హోమియోపతీ అంటే ఇష్టం వుండేది కాదు. ఇంత శ్రమపడి అల్లోపతీ చదువుకుని జానకిరామయ్య హోమోపతీ ప్రాక్టీసు చెయ్యడం నాకు యిష్టంగా ఉండేదికాదు. అందుచేతనే నా తమ్ముడు వైద్యుడైనా నా యింట్లో వైద్యం యితరుల చేతిమీదుగానే జరుగుతూ ఉండేది.

ఒకసారి బహుశ: 1921 సంవత్సరంలో అనుకుంటాను - నా పెద్దకొడుకు నరసింహానికి టైఫాయిడ్ జ్వరం వచ్చింది. దానికి కేశవపాయి వైద్యం చేస్తూవచ్చాడు. కాని వ్యాధి స్వాధీనం కాలేదు. ఆ కుర్రవాడి చెవిలోనించి చీము వచ్చేది, అందుచేత అప్పట్లో చెవి వైద్యంలో ఘటకుడైన శంకరనాదం పిళ్లెచేత వైద్యం చేయించాను. తాత్కాలికంగా చీము కట్టింది కాని, అసలు రోగం నివృత్తి కాలేదు. దాని తరవాతే టైఫాయిడ్ జ్వరం. వైద్యులు కడుపులో జబ్బుకి చికిత్స చేస్తూవచ్చారు. రోగి కాళ్లూ, చేతులూ కొట్టుకుంటూ నిస్పృహగా ఉండడంచేత జానకిరామయ్య అది మెదడుకి సంబంధించి ఉంటుందని చెప్పాడు. కాని అతనిమాట నేనుగాని, చికిత్సచేసే వైద్యుడుగాని వినిపించుకోలేదు. చివరికి రోగి బ్రతకడని పరమేశ్వరుడిమీద భారం వేసే స్థితికి వచ్చాక, జానకిరామయ్య వైద్యం చేశాడు. ఆ జబ్బు సప్రెషన్ ఆఫ్ డిస్‌ఛార్జివల్ల సంభవించి ఉంటుందని ఊహించి, దానికి రస సంబంధమైన హోమియోపతి మందు ఒక్క మోతాదు యిచ్చాడు. దానికి సంబంధించిన పుస్తకాలలోని విషయాలు అన్నీ నాకు చదివి వినిపించాడు. ఆ మందుతో రెండుచెవులనించీ రసి కారి, దానికి దారి చాలక ముక్కునించికూడా రసి వచ్చింది. అప్పుడు శంకరనాదంపిళ్లె సహాయంతో ముక్కూ చెవులూ శుభ్రపరిచాడు. రోగం మళ్ళింది. కాని నాలిక స్తంభించిపోయింది. చెవులు వినిపించడం మానేశాయి. ఆ స్థితిలో నేను కలకత్తా ఆలిండియా కాంగ్రెసు కమిటీకి పోవలసివచ్చి కుర్రవాణ్ణి అతనికి అప్పజెప్పి వెళ్ళిపోయాను. జానకిరామయ్య సలహామీద కలకత్తాలో ఉన్న కొందరు హోమియోపతీ వైద్యుల సలహాలు తీసుకున్నాను. కాని, ఈ లోగానే జానకిరామయ్య కృషివల్ల మాట వచ్చి చెవులుకూడా వినిపించడం మొదలు పెట్టాయి. అప్పటినించీ అతని వైద్యం అంటే నాకు నమ్మకం కుదిరింది. అనేకసార్లు అతను అలోపతీవల్ల కుదరని రోగాలు సాధించడం నేను ఎరుగుదును. ఈ వైద్యసాధనతో ప్రయోజకుడై జానకిరామయ్య సుఖంగా జీవయాత్ర సాగిస్తున్నాడు.

నేను రాజమహేంద్రవరంలో ప్రాక్టీసు ప్రారంభించిన కొద్ది రోజులకే నా మేనల్లుళ్లు మైనంపాటి నరసింహం, సుబ్బారావు వగైరాలూ, వాళ్ళ చెల్లెళ్ళూ రాజమహేంద్రవరం చేరుకున్నారు. వాళ్ళందరి చదువూకూడా అక్కడే జరిగింది. నా మేనగోడళ్ళ పెళ్ళిళ్ళుకూడా నేనే చేశాను. అందరూ చదువుకుని ప్రయోజకు లయ్యాక, ఎవళ్ళంతట వాళ్ళు గుట్టుగా జీవితయాత్ర చేస్తున్నారు.

కుటుంబ విషయమైన ఈ ప్రస్తావన ముగించడానికి ముందు నా జీవితానికి వెలుగు యిచ్చిన హనుమంతరావు నాయుడుగారిని గురించి వ్రాయవలసి ఉంటుంది. నేను రాజమహేంద్రవరం ఛైర్మన్‌గా ఉన్న కాలంలో ఆయన్ని కౌన్సిలు సెక్రటరీగా నియమించాను. నేను ఇంగ్లండు వెళ్ళి బారిష్టరు పరీక్షకి చదవడానికి నిశ్చయించుకోవడం విని, ఆయన ఎంతో సంతోషించారు. నేను బారిష్టరుని అయి తిరిగి వచ్చాక, మద్రాసులో ప్రాక్టీసు పెట్టిన కొద్దిరోజులకి ఆయన్ని మద్రాసు తీసుకువచ్చి కొంతకాలం మా యింట్లో ఉంచుకున్నాను. అప్పట్లో ఆయనకి వంట్లో ఖాయిలా ప్రవేశించింది. ఆ ఖాయిలాకి చికిత్సకూడా చేయించాను. తరవాత కొంతకాలానికి ఆయన కీర్తిశేషులైనారు. ఆయన కుటుంబానికి నేను శక్తివంచన లేకుండా తోడ్పడ్డాను అనే తృప్తి ఉన్నప్పటికీ, ఆయన నా జీవిత భాగానికి చేసిన సేవ ఎన్నటికీ మరవలేను.