నా జీవిత యాత్ర-3/వ్యక్తిసత్యాగ్రహోదంతం

14

వ్యక్తిసత్యాగ్రహోదంతం

1940 - 46 లో నేను తిరిగీ జెయిలుకు వెళ్ళక పూర్వమూ, ఆ తర్వాతా జరిగిన సంఘటనలన్నీ చరిత్రాత్మకమైనవి. జెయిలు అనుభవాలను గురించి వ్రాస్తూన్న ఈ సందర్భంలో ఆ చరిత్రాత్మక ఘటనలకు తావులేదు.[1] నేను ఇక్కడ జెయిలు అనుభవాలను గురించి మాత్రమే వ్రాయదలచాను. దానివల్ల చదువరులు వివిధ సందర్భాలలో నేను జెయిలుకు వెళ్ళినప్పుడు పొందుతూవచ్చిన అనుభవాలను ఒకదాని తర్వాత ఒకటిగా చదివి, సంగతి సందర్భాలు సరిగా గ్రహించగలుగుతారు. ఈ పట్టున పూర్వ చరిత్రంతా పూర్తిగా విశద పరచక పోయినా, అవసరమయినంతవరకూ సూచనప్రాయంగా చెపుతూ, మదరాసురాష్ట్ర పరిపాలనా యంత్రాన్ని రెండున్నర సంవత్సరాలు చేతపట్టిన తర్వాత, మళ్ళీ ఎల్లా తిరిగి జెయిళ్ళలో ప్రవేశించామో, తెలపాలని ఉంది. నన్నూ, నాతో సహజీవనంచేస్తూ వచ్చిన మంత్రుల్నీ, శాసన సభ్యుల్నీ, ఇతర కాంగ్రెసువాదుల్నీ పదే పదే జెయిళ్ళపాలుజేసిన ఆ వింత సన్నివేశాలను గురించి మనవి చేస్తాను.

రెండవ ప్రపంచయుద్దం

రెండవ ప్రపంచయుద్దం 1939 సెప్టంబర్‌ మాసంలో రగుల్కుంది. యుద్ద ప్రారంభ సమయానికి మేమంతా మంత్రులంగానే ఉన్నాం. మన దేశపు ప్రత్యేకమైన అనుమతి వగైరాలతో నిమిత్తం లేకుండా, మనం ఆంగ్లేయులచే పరిపాలించబడుతూన్న కారణంగా, మన దేశీయులు ఆంగ్లేయుల తరపున ఆ యుద్ద జ్వాలలలో తప్పని సరిగా ఇరుక్కున్నారు. ఆ సమయంలో బ్రిటనునుంచి మాకు కొన్ని వార్త లందాయి. బ్రిటిష్ కాబినెట్ వారు భారత రాజ్యాంగ చట్టాన్ని సవరించే హక్కును సంపాదించి, ఆ యుద్ధపు రోజులలోనే మన భారతదేశానికి బ్రిటిష్‌వారు చేయగలిగిన మంచి నంతటినీ చేయదలచుకున్నారనీ ఆ వార్తల సారాంశం. మేము, ప్రజల బాధ్యతలు నిర్వహించ వలసిన మంత్రులుగా ఆ ప్రతిపాదనలకు మా సమ్మతిని ఇవ్వజాలమని చెప్పాము.

ఈ విషయంలో కాంగ్రెసును గాని, కేంద్రశాసనసభ వారినిగాని ఆంగ్లేయులు సంప్రదించ లేదు. బ్రిటిష్ క్యాబినెట్, సెక్రటరీ ఆఫ్ స్టేట్ తీసుకున్న ఈ నిర్ణయానికీ, దేశాభిప్రాయానికీ విరుద్ధంగా వైస్రాయి ధనాన్నీ, జనాన్నీ పోగుచేస్తూన్న విధానానికీ నిరసనగా, కాంగ్రెసు అధిష్ఠానవర్గం పరిపాలనాయంత్రాన్ని చేబట్టిన వివిధ రాష్ట్రీయ కాంగ్రెసు మంత్రులతో నయినా సంప్రతించకుండా, రాజీనామాలు ఇవ్వడానికి సమయా సమయాలయినా ఆలోచించకుండా, ఒక్క మాటుగా - రాజ్యాంగాలను సాగిస్తూన్న ఏడు రాష్ట్రాల కాంగ్రెసు మంత్రులనూ, తదితరులనూ రాజీనామా లివ్వవలసిందని ఆదేశించింది.

కాంగ్రెసు మంత్రివర్గాల రాజీనామా

మే మందరం, మారు మాటాడకుండా, ఆ కాంగ్రెసు హైకమాండువారి ఆజ్ఞానుసారం, 1939 అక్టోబరు నెలాఖరుకు, రాజీనామాలిచ్చేశాం. దేశంలో ఉన్న పదకొండు రాష్ట్రాలలోను ఏడింట పరిపాలనా యంత్రాన్ని చేపట్టి ఉన్న కాంగ్రెసు వాదులందరూ ఒక్కసారిగా బయటకు వచ్చిన కారణంగా, బ్రిటిష్‌వారు వెంటనే కాళ్ళ బేరానికివచ్చి, భారతదేశంలో ఏదో ఒక విధంగా రాజీపడతారని తలచాం. కాంగ్రెసు హైకమాండు వారూ అటువంటి అభిప్రాయం తోనే మమ్మల్నందర్నీ ఒక్కుమ్మడిగా బయటకు రమ్మన్నారు. కాని నాకుమాత్రం ఏవో అనుమానా లుండిపోయాయి.

రాజీనామాలు జరిగిన వెంటనే వైస్రాయ్‌గారికీ, కాంగ్రెసువారికీ మధ్య సంప్రదింపు లారంభ మయ్యాయి. బ్రిటిష్‌వారు కూడా ఏదో కొంతవరకూ వంగి, లొంగి ఏదయినా అంగీకారానికి వద్దామనే యోచనలో ఉండడాన్ని, ఈ సారి రాజీ ఏదో జరుగుతుందనే అందరమూ ఆశపడ్డాము. వైస్రాయ్ ఇచ్చిన ఘనమైన 1940 ఆగస్ట్ 'ఆఫర్‌' ప్రకారం, ప్రభుత్వ నిర్వాహక సంఘం (Executive Council) సభ్యులను విస్తరింప జేయడం విషయంలో బ్రిటిష్‌ వారూ కాస్తంత దారిలోకి వచ్చారు.

కాని అది కాంగ్రెసువారి వాంఛల దృష్టిలో బహుస్వల్పం. కాంగ్రెసు వారు ఆ ఆగస్టు ప్రతిపాదనలకు ఎంతమాత్రమూ ఒప్పుకో లేదు. 1940 లో పూనాలో ఆమోదించ బడిన కాంగ్రెసు తీర్మానాన్ని అనుసరించి ఉన్న కోర్కెలకు ఆంగ్లేయులు వెంటనే అంగీకరించాలని కాంగ్రెసువారు తమ సూచనలను అందజేశారు. ఆ ప్రకారం జాతీయ, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడాలని (National and Provincial Governments) తమ వాంఛితార్థంగా కాంగ్రెసువారు తెలియబరచారు.

అహింసాత్మక విధానానికి స్వస్తిచెప్పి, కాంగ్రెసువారు జనాన్నీ, ధనాన్నీ సేకరించి, బ్రిటన్‌పై కాలుదువ్విన నియంతల తలదన్నడానికి ఒప్పుకున్న కారణంగా ఆంగ్లేయులూ కొంత వరకూ మెత్తబడ్డారు. మహాత్మాగాంధీ గారికి ఈ విధానం అంగీకార యోగ్యంగా కనిపించ లేదు. కాని, పదిహేనుగురు కార్యనిర్వాహక సభ్యులలోనూ పదిమంది అటువైపే మొగ్గి, తన పక్షాన అయిదుగురు మాత్రమే ఉన్న పరిస్థితిని గమనించి, తన పట్టువిడిచి, రాజగోపాలాచారి మున్నగు తన పక్షీయులకు ఆశీర్వచనాలను అందజేస్తూ ప్రక్కకు తప్పుకున్నాడు.

పూనాసభలో నా జోస్యం

కాంగ్రెసు కార్యనిర్వాహక వర్గసభ్యులు చాలామంది, వైస్రాయిగారూ, సెక్రటరీ ఆఫ్ స్టేటూ, లొంగి తీరతారనే నమ్మారు. కాని ఈ విషయంలో నా అనుమానాలు నాకు ఉన్నాయి. పూనా తీర్మానం ఆమోదించబడిన మర్నాడు, పూనా లా కాలేజీ స్టూడెంట్స్ సభలో నన్ను ఉపన్యసించ వలసిందని కోరిన పిలుపును పురస్కరించుకుని ఆ సభలో ఉపన్యసించాను. నా ఉపన్యాసంలో పూనా తీర్మానం ఒక పెద్ద పొర పాటనీ, బ్రిటిషువారు ఆ తీర్మానంలో ఇమిడిఉన్న ప్రతిపాదనలకు ఒప్పుకోరనీ, కొద్దివారాలలో కాంగ్రెసువారు ముఖాలు వేల వేసుకుని గాంధీగారి కాళ్ళమీద పడి, "నీవే మాకు శరణ్యం, నీవే దారి చూపాలి" అని వేడుకుంటారనీ, మళ్ళీ ఏ ప్రత్యక్ష్యచర్యకో పూనుకుంటేనేగాని బ్రిటిషువారు లొంగరనీ నేను అన్నాను.

నేను అనుకున్న ప్రకారమే వైస్రాయ్ పూనా తీర్మానాన్ని తిరస్కరించడమూ, కాంగ్రెసు హైకండ్‌వారు, "మీరే మాకు శరణ్యం, మీరే మాకు ఏకైక నాయకులు, మీరు కలుగజేసుకుని బాధ్యత వహించి దేశరక్షణమార్గం ఆలోచించాలి" అని కోరారు. నెల తిరక్కుండా పూనా తీర్మానం రద్దయి, బొంబాయి తీర్మానం అంగీకరించబడింది, అహింసాత్మక విధానమే శరణ్యం, మహాత్మా గాంధీయే మాకు ఏకైక నాయకుడు, ఆయనే తిరిగి దారి చూపించాలి అనే భావన అందులో ఉంది.

గాంధీజీ తాను చేయదలచిన పని నిర్దుష్టంగా అఖిల భారత కాంగ్రెసు కమిటీవారితో చెప్పేశాడు. యుద్దం దినాలలో తాను శాసన ధిక్కార మనేది పెద్ద ఎత్తున ప్రజ లందరూ ఒక్కకుమ్మడిని చేయడానికి ఒప్పుకోననీ, వ్యక్తి సత్యాగ్రహాన్ని మాత్రమే ప్రోత్సాహిస్తాననీ, యుద్ధ సమయంలో అనుచితంగా జారీ చేయబడిన ఆర్డినెన్స్‌ద్వారా స్వేచ్ఛగా మాటలాడే హక్కు కూడా మానవులకు లేకుండా చేయబడిన కారణంగా ఈ ఆర్డినెన్స్‌ను ధిక్కరిస్తూ వ్యక్తి సత్యాగ్రహం చేయవచ్చుననీ ఆయన సూచించాడు.

ఆరంభంలో ఎవ్వరూ ఈ వ్యక్తి సత్యాగ్రహ మన్నది అంత బ్రహ్మాండంగా విజయవంతం అవుతుందని తలచలేదు. నేను అఖిల భారత కాంగ్రెసు కమిటీవారికీ, మహాత్మునికీ కూడా, ప్రజానీకం మీ ఆజ్ఞకు ఎప్పుడూ బద్దులేనని చెప్పిఉన్నాను. ఆ బొంబాయి తీర్మానాన్ని పురస్కరించుకుని వ్యక్తి సత్యాగ్రహం 1940 నవంబరులో ఆరంభ మయింది. ఈ దెబ్బతో మంత్రులుగానూ, శాసన సభా సభ్యులుగానూ, నాయకులుగానూ, వినాయకులుగానూ ఉండే పెద్దలు, చిన్నలు అందరూ జెయిలు గోడల వెనకాలకు దారి చూసుకున్నారు.

మళ్ళీ జెయిలుకి

నేను మొదట్లో డిసెంబరు ఆఖరుకి జైలుకు వెళ్ళాలని నిశ్చయించుకున్నా, తప్పని సరిగా నా అభిప్రాయాన్ని మార్చుకుని ఉద్యమాన్ని నడపడానికే ఉద్యుక్తుడ నయ్యాను. అందువల్ల మా రాష్ట్ర కాంగ్రెసువారి ఆదేశానుసారంగా మొదటి జట్టులోనే 1940 నవంబరు 26 న జెయిలుకు సిద్ధమయ్యాను.

లోగడ నేను ఆంధ్ర రాష్ట్రీయ కాంగ్రెసు కమిటీ అధ్యక్ష పదవికి రాజీనామా ఇచ్చిఉన్నా రాబోయే సంఘటనల దృష్టితో, నన్నే తిరిగి రాష్ట్రీయ కాంగ్రెసు కమిటీకి అధ్యక్షుడుగా ఎన్నుకున్నారు. ఆ స్థానంలో 1937 జూలైలో రాజ్యతంత్రాన్ని చేపట్టే పర్యంతమూ ఉన్నాను. తిరిగీ జెయిలుకు వేళ్ళేలోపల, సుమారు తొమ్మిదిమాసాలపాటు, యావత్తు రాష్ట్రాన్ని పర్యటించి దానిని సరిఐనదారిలో పెట్టమని నన్ను కోరారు.

నేను రాష్ట్రం అంతా పలుసార్లు పర్యటించాను. ఆయా జిల్లాలలో స్వయంసమృద్ధి ప్రాతిపదికగా అనేక గ్రామాలలో నిర్మాణ కార్యక్రమం సాగించాను. పశ్చిమ గోదావరి జిల్లాలోని జోగన్న పాలెంలోనూ, ఆమదాల దిమ్మె అనబడే అనంతపురం జిల్లా గ్రామంలోనూ అలాంటి కార్యక్రమాలు ఆరంభించాను.

తతిమ్మా పది జిల్లాలలోనూ కూడా స్వయంసమృద్ధి పథకాలకు అనుగుణంగా ఉంటాయను కున్న పల్లె లన్నింటినీ విమర్శనాత్మక దృష్టితో పరిశీలించాము. ఆయా గ్రామాల ఆర్థికాది పరిస్థితులనూ గమనించాము. నాతోడి వర్కర్లను అప్రమత్తతో ఉండమనీ, ఉద్యమం ఏ క్షణాన్నయినా ప్రారంభించబడవచ్చుననీ హెచ్చరిక చేశాను.

దక్షిణభారతంలో ఆంధ్రావనేగాక, తమిళ, కన్నడ, మలయాళ రాష్ట్రాలు కూడా ఇటువంటి స్వాతంత్ర్య సమరాలలో ఎప్పుడూ వెనకాడవన్న సంగతి నాకు తెలుసు. వచ్చిన పిలుపును మన్నించి ఒకటి రెండుసార్లు కార్యనిర్వాహక సభకు హాజరయ్యాను. ఏ గ్రామంలో జరిగినా ఆఖిల భారత కాంగ్రెసు కమిటీ మీటింగుల కన్నింటికీ హాజ రయ్యాను. కాని మంత్రిగా నున్న రోజులలో ఏ మీటింగ్‌లోనూ నోరు విప్పి ఏ విధమయిన ఉపన్యాసమూ ఇవ్వలేదు. పూనా మీటింగులో కూడా నేను మాటలాడలేదు.

కాని బొంబాయిలో నోరు విప్పక తప్పలేదు. గాంధీగారి పక్షాన నిలిచిన అయిదుగురికీ, వారికి వ్యతిరేకంగా అహింసాత్మక విధానానికి స్వస్తి చెప్పాలని తలచిన ఆ పదిమందికీ మధ్య ఉన్న అభిప్రాయభేదాలు అసలెల్లా ఉత్పన్నమయ్యాయో గ్రహించాలని నిర్ణయించుకున్నాను. అందువల్లనే ఆ బొంబాయి మీటింగులో నోరు విప్పవలసి వచ్చింది.

అహింసా విధానానికి రాజాజీ వ్యతిరిక్తత

పూనా మీటింగులోనూ అంతకు పూర్వమూ కూడా గాంధీగారు తమంతట తామే విరమించు కున్నారని తలచాను. కాని తరవాత నాకు గ్రాహ్యమైందేమిటంటే - ఆయన తన శక్తివంచన లేకుండా రాజగోపాలాచారి ప్రభృతులను కాంగ్రెసుకు గడచిన ఇరవై సంవత్సరాలుగా పట్టుగొమ్మగా ఉంటూన్న అహింసావిధానాన్ని ఆహుతి చేయవద్దని కోరారనీ, అలాంటి క్లిష్టపరిస్థితులలో ఉద్యోగాది హోదాలమీద మమకారాలు పెట్టుకోవడం న్యాయం కాదనీ, బ్రిటిషువారు తమకు హోదా లిచ్చినా చేతులు కట్టీ, మూతులు బిగించి మరీ ఇస్తారనీ, ఎటొచ్చీ వారు జారీ చేసే ఆర్డరును కంటితో చూసి చేతితో సంతకం చెయ్యగల హక్కే తమకు మిగులుతుందని వివరంగా చెప్పారనీ, ఇంత స్పష్టంగా పరిస్థితులు లెలా ఉండగలవో ఆలోచించి చెప్పినా, ఆ పదిమంది కార్యనిర్వాహకవర్గీయులు తాము గాంధీగారి కంటె తెలివయినవారమనే తలచరాని. పూనాలో గాంధీగారు తనకు తానుగా విరమించు కోలేదనీ, తనపై తన అహింసాత్మక విధానానికి వ్యతిరేకంగా విశ్వాసరాహిత్య తీర్మానంలాంటిదే ఆమోదించబడిందన్న భావనే ఆయన్ని బాధ పెట్టిందని గ్రహించాను.

నా కీ విషయాలన్నీ బొంబాయి మీటింగుకు వెళ్ళిందాకా తెలియవు. గాంధీగారిని పూనా మీటింగులో కాదన్న ఆ పదిమంది పెద్దలే ఈ బొంబాయి మీటింగుకు ఆహ్వానకర్త లయ్యారు. అందువల్ల తర్జనభర్జన చెయ్యవలసిన అంశాలు అంతగా కనబడలేదు. బొంబాయి మీటింగులో గాంధీగారిని తిరిగి నాయకత్వం వహించమని కోరి, వారి అడుగుజాడలలోనే నడవాలి అన్న తీర్మానంపై మామూలు తర్జన భర్జనలూ, అవును కాదు అనే తర్కవితర్కాలు ఆ పదిమంది మధ్యనే జరిగాయి. ఈ తర్జనభర్జనలు జరుగుతూ ఉండగా, ఒకరు ఇటువంటి పరిస్థితి ఉత్పన్నం అవడానికి రాజగోపాలాచారిగారే కారకులని ఆయన్ని దుయ్యబట్టుకున్నారు. ఆ కారణంగా రాజగోపాలాచారిగారు జవాబు ఇస్తూ, తాను తన స్వంత అభిప్రాయాన్ని వ్యక్తపరిచాననీ, ఈ రోజున కూడా అహింసా విధానంపై తనకు నిజంగా సదభిప్రాయం లేదనీ, కాంగ్రెసు ఆ అహింసాత్మక విధానానికి స్వస్తి చెప్పడమే తన వాంఛ అనీ అన్నాడు.

గాంధీగారికి నా హామీ

రాజగోపాలాచారిలాంటి వ్యక్తి అహింసావిధానంపై అట్టి అభిప్రాయం వెల్లడించినందుకు విచారిస్తూ, జనం హింసాత్మక విధానంవైపు మొగ్గుతున్నారని గ్రహించడాన్ని, నా మనోభావాన్ని వ్యక్తం చెయ్యడం న్యాయమని తలచాను. ముందుగా నేను మాటలాడుతానని గాని, మాటలాడవలసి వస్తుందనిగాని నేను భావించలేదు. అయినా, నాటి సభాధ్యక్షుడు నన్ను ఆఖరి ఉపన్యాసకునిగా నిర్ణయించారు. అందరి సభ్యుల అభిప్రాయాలను గ్రహించిన తరవాత మాటలాడగలగడం ఒక సదవకాశంగానే భావించాను.

దక్షిణ భారతదేశంలో ఉన్న పరిస్థితుల నన్నింటినీ ఆ బహిరంగోపన్యాసంలో వివరించాను. మనలోనే ఉన్న పంచమాంగ దళం వారి చర్యలు కూడా వివరించాను. గాంధీ గారిని ఎప్పుడూ దక్షిణ హిందూదేశం విస్మరించలేదనీ, వారి అహింసాత్మక విధానంపట్ల ఎప్పుడూ సుముఖమేననీ, వారి అడుగుజాడలలో నడుస్తూ వారు ప్రారంభించిన, ప్రారంభించ బోయే ఏ విధమయిన శాసన ధిక్కార కార్యక్రమాని కయినా జోహారు లర్పిస్తూ, దక్షిణ దేశవాసులు సర్వదా సన్నద్ధులేననీ చెప్పాను. భాషాప్రయుక్త రాష్ట్రాల నన్నింటినీ సహకార నిరాకరణ ఉద్యమ ప్రారంభాలనుంచీ క్షుణ్ణంగా ఎరిగి ఉన్నవాడననీ, నేను మంత్రిత్వ హోదాలో పర్యటించిన రోజులలో ఆ రాష్ట్ర ప్రజల హృదయాలను పూర్తిగా అవగాహన చేసుకున్నానని, గాంధీగారి అడుగుజాడలలో నడుస్తూ, ఆయన ఆరంభించే అన్ని ఉద్యమాలలోనూ, ఆయన వెంట ఉండడానికి వా రెప్పుడూ తయ్యారనీ నొక్కి వక్కాణించాను.

ఇల్లా చెప్పినప్పుడు నా దృష్టిలో కేవలం ఆంధ్రదేశ మొక్కటే లేదు. ఈ రాష్ట్రంలోని భాషా విభాగాలన్నీ నా ఎదుట నిలచాయి. మాలో మాకు ఉత్పన్నమయిన అంత:కలహంలాంటి భేదాభిప్రాయ పరిస్థితులలో ఇచ్చిన ఈ నా ఉపన్యాసం దేదీప్యమానంగా వెలిగింది. [2]

ఈ సందర్భంలో ఇంత మాత్రమే దీనిని గురించి చెప్తాను. అది అయినా గాంధీ గారికీ, ఆయన విశ్వాస పాత్రులయిన ఆ అయిదుగురు అనుచరులకూ రాజగోపాలాచారి గారు తన స్వకీయమైన అభిప్రాయభేదాన్ని ఎల్లా వ్యక్త పరిచారో గ్రహించడానికే. ఆ అభిప్రాయాన్ని అనుసరించి, ఆయన కార్యనిర్వాహక సంఘ సభలోనూ, ఒక ఉద్యమం ఆరంభించడానికి సన్నాహ మవుతూన్న కాలంలోనూ, మేము జెయిళ్ళకు వెళ్ళాకా కూడా ఎల్లా మమ్మల్నీ, దేశాన్నీ చికాకుల్లో ముంచెత్తాడో గ్రహించడం కూడా న్యాయం.

భావే ఎన్నికకు నాయకుల అభ్యంతరాలు

బొంబాయి తీర్మానంపట్ల రాజగోపాలాచారిగారి మనస్సులో ఉన్న అనిష్టత ఆ విధంగా వ్యక్తం అయింది. గాంధీగారి ప్లానుప్రకారం ఆరంభం కానున్న వ్యక్తి సత్యాగ్రహం, ఆ వ్యక్తి సత్యాగ్రహం వినోబా భావే గారి నాయకత్వాన ఆరంభించడం రాజగోపాలాచారికి ఎంత మాత్రమూ ఇష్టంలేదు. వార్దాలో జరిగిన కార్య నిర్వాహక వర్గ సభకు నేను ప్రత్యేక ఆహ్వానంపై వెళ్ళాను. ఆ సభలో గాంధీగారు తాను అవలంభించ దలచిన కార్యక్రమ పద్ధతినంతా వివరించారు. ఈ యుద్ధ సమయంలో వ్యక్తి సత్యాగ్రహాన్నేగాని, సమష్టిసత్యాగ్రహాన్ని వాంఛించను అని ఆయన అన్నప్పుడు, ఆయన అభిప్రాయాన్ని అంగీకరించ డానికి వెనుకాడిన వారు కేవలం ఇరువురు మాత్రమే కనబడ్డారు.

వినోబా భావే నాయకత్వాన ఈ వ్యక్తి సత్యాగ్రహాన్ని ఆరంభించ నున్నానని గాంధీగా రనేటప్పటికి పెద్ద కలకలమే బయల్దేరింది. కొంతమందికి ఆయన ఎవరో తెలియదు. ఆయనకూ ఈ రాజకీయాలకూ ఉన్న సంబంధం ఏమిటో అసలు ఎవ్వరికీ తెలియదు. అందువల్ల ఆయన చేతిమీదుగా ఈ ఉద్యమం ఆరంభంకావడం అన్యాయమన్నారు. ఎన్నో త్యాగాలుచేసి జెయిళ్ళకు వెళ్ళిన హేమాహేమీ లనేకులుండగా ఈయన మీ కెక్కడ దొరికా డన్నారు. కాంగ్రెసు అధ్యక్షులుగానూ, కార్యనిర్వాహకవర్గ సభ్యులుగానూ సేవ చేసిన వారెవరూ పనికి రాలేదా అని అడిగారు. వినోబా భావేను మొదటి సత్యాగ్రహిగా నిశ్చయించే టప్పకి, గాంధీగారి అనుంగు శిష్యులూ, సదా ఆయన్ని అంటిపెట్టుకుని ఉండేవారూ, ఆ అయిదుగురూ కూడా అదేం పనండీ అని అడిగారు.

గాంధీగారు, ఈ విషయంలో మీ అభిప్రాయం ఏమిటని రాజగోపాలాచారి గారిని అడిగితే, అసలీ కార్యక్రమమే అదోలా ఉందనీ, దేశీయు లెవ్వరూ దానిని ఆమోదించరనీ, ఈ ఉద్యమం పూర్తిగా నేలమట్టం అవుతుందనీ ఆయన అన్నాడు. నేను మాత్రం, మరేం పరవాలేదన్నాను. కార్య నిర్వాహకవర్గ సభ్యునిగా వారందరితోనూ కలసి మెలసి పనిచేసి ఉన్నందువల్ల, ఆ సభ్యులందరి ముందూ గాంధీగారితో అల్లా అనడానికి సాహసించాను. "ఇప్పటికి ఇరవై సంవత్సరాలుగా ఈ దేశానికి స్వాతంత్ర్యం సంపాదించాలని తమరు అన్నివిధాలా పాటుబడుతున్నారు. మీ యందూ, మీ పద్ధతియందూ అభిప్రాయ భేదమున్నవారితో గూడా మీరు నెట్టుకొస్తూనే ఉన్నారు. అందువల్ల ఏ సందర్భంలో ఏ ఉద్యమం ఎల్లా ఆరంభించాలో తమకు బాగా తెలుసు. మీ ఉద్యమాలన్నీ ఎప్పుడూ ఉన్నత స్థాయిని అందుకుంటూనే ఉన్నా" యన్నాను.

"నా ఉద్దేశంలో ఈ ప్రస్తుత ఉద్యమం ఈ యుద్ధసమయంలో స్వరాజ్య సంపాదన కోసం లేవదీసింది కాదనీ, భారతదేశానికి స్వాతంత్ర్య మివ్వ నిరాకరించిన కారణంగా, వారికి - ఆ బ్రిటిషువారికి - వారి చర్యలకూ కేవలం సవాలుగానే ఈ ఉద్యమం ప్రారంభించ బడింది గనుక భారతదేశం తన మార్గం తాను చూసుకోగల శక్తికి ఆంగ్లేయుల అడ్డును నామ మాత్రంగా సడలించడానికీ, భారతీయుల అనుమతీ, అంగీకారమూ అన్నవి లేకుండా ఈ యుద్ధాన్ని తీసుకువచ్చి వారి నెత్తిన రుద్దడంచేత కేవలం సవాలుగా నడుపబడే ఈ ఉద్యమం పట్ల, ఎవరికి ఎలాంటి అనుమానమున్నా, నాకేమీ లే"దన్నాను.

అభ్యంతరాలకు గాంధీజీ జవాబు

వినోబా భావేను ప్రప్రథమ వ్యక్తి సత్యాగ్రహిగా తాను నిర్ణయించిన సందర్భంలో వచ్చిన అభ్యంతరా లన్నింటినీ గాంధీగా రీవిధంగా సమాధానమిచ్చారు. "నేను వినోబా భావేను ఎన్నుకొనడానికి ముఖ్య కారణం ఆయన స్వయంగా అహింసావాది. నా తర్వాత నాస్థానాన్ని ఆక్రమించగల సమర్థుడు ఆయనే. ఈ ఇరవై సంవత్సరాలూ ఆయన నిర్మాణాత్మక కార్యక్రమంలో మునిగి తేలుతున్నాడు."

కార్యదర్శి కృపాలనీ అన్నాడు: "వినోబా భావే మనలో ఎవరితో నయినా సమానంగా కీర్తి ప్రతిష్టలు సంపాదించి ఘనతకు ఎక్కే ఉండును. ఆయన విషయం ఎందువల్లనో ఇంత వరకూ గాంధీగారు పట్టించుకోని కారణంగా ఆయన అల్లాగే తనకు నిర్దేశింపబడిన కార్యాన్ని సక్రమంగా నిర్వహిస్తూ కాలక్షేపం చేస్తూన్నాడు. ఈపట్టున గాంధీగారు ఆయన విషయం పట్టించుకున్నారు కాబట్టి, ఆయన కీర్తి ప్రతిష్ఠలు దేశీయులు గ్రహించ గలుగుతారు." గాంధీగారు వినోబా భావే తరవాత జవహర్‌లాల్ నెహ్రూ గజ్జెకడతా రన్నారు. అక్కడ చేరినవారి కెవ్వరికీ గాంధీగారి మనస్సులో ఉన్నదేమిటో తెలియదు. ఆయన కార్యక్రమం ఆయనకే తెలియాలి. ఎవరి తరవాత ఎవ్వరో, ఎప్పుడు ఎవ్వరికి పిలుపు వస్తుందో ఏమీ అర్థంగాని అయోమయ స్థితిలోనే సభ్యు లందరూ అలా ఉండి పోయారు.

గాంధీ అనుయాయుల అనుమానాలు

కొన్నాళ్ళపాటు ఈ ఉద్యమ విజయాన్ని గురించి అనేక అనుమానాలు వ్యక్తపరుప బడ్డాయి. ప్రభుత్వం వారు ముందు జాగ్రత్త కోసమని, సత్యాగ్రహం చెయ్యబోతున్నాడు గనుక జవహర్‌లాల్ నెహ్రూను అరెస్టు చేస్తున్నామని చెప్పి, ఆయన్ని నిర్భంధలోకి తీసుకున్నారు. నాలుగు సంవత్సరాల శిక్ష విధించ బడింది.

ఆ మర్నాడు పత్రికలలో ఒక స్టేట్‌మెంట్ వెలువడింది. అందులో నెహ్రూ తరవాత గాంధీగారి ఆశ్రమవాసులు ఇరవై నలుగురు సత్యాగ్రహం చెయ్యడానికి సిద్ధంగా ఉన్నారని తెలుప బడింది. ఈ ప్రకటన ఇంకా అనుమానస్పదమై, బహుశ: "ఈ ఉద్యమం ఇంతటితోటే" అనికూడా కొంద రనుకున్నారు.

గాంధీగారికి అతి సన్నిహితులూ, ముఖ్యులూ, ఆత్మీయులూ అనుకున్నవా రెవ్వరికీ గాంధీగారి హృదయం అర్థం కాలేదు. చిత్తరంజన్‌దాస్, లాలా లజపతిరాయ్‌ వంటి ప్రముఖులు కూడా గాంధీగారి హృదయం చాలా లోతయినదనీ, దానిని ఎప్పుడూ ఆయన విప్పిచెప్పరనీ, కార్య నిర్వాహక సభ్యులకుగూడా ఆయన హృదయం అర్థం కాదనీ, వారితోకూడా మనస్సు విప్పి తన అభిప్రాయం ఎప్పుడూ చెప్పలేదనీ వివరించారు. ఈ పట్టునకూడా గాంధీగారి అనుచరులకూ, ఆయనతో కలసి మెలసి పనిచేసే వారి కెవ్వరికీ కూడా ఆయన హృదయం అర్థం కాలేదు.

బయల్దేరిన పుకార్లలో, ఈ తడవ ఆయన నిర్మాణ కార్యక్రమంలో పాల్గొన్న వారిని తప్ప, రాజకీయ రంగంలో నిమగ్ను లయిన కాంగ్రెసు వారి నెవ్వరినీ ఈ రంగంలోకి రానివ్వడని చెప్పుకోసాగారు. కొందరు సన్నిహితులూ, కార్య నిర్వహణ దక్షులూ అయినవారి నోట విన్న వార్తలు ప్రజా హృదయాన్ని ఇంకా కుంగదీశాయి. ఈ ఉద్యమం యావత్తూ ఒక చిన్న టపాకాయిలా టప్పుమని ఎగిరి పోతుందన్నారు. ఆ అఖిల భారత చరఖా సంఘంతో సంబంధంవున్న వాళ్ళు - ఆ వడికేవాళ్ళూ, నేసేవాళ్ళూ, ఉద్యమాన్ని తుస్సుమనిపించకపోతే వేరే ఏం చెయ్యగల రన్నారు. ఎప్పుడూ గాంధీగారి విధానం అట్లాగే ఉంటుంది. కాంగ్రెసు శాసన సభ్యులనూ, మంత్రులుగా పనిచేసిన పెద్దలనూ జెయిళ్ళకు పంపించే లోపల ఆయన ఇటువంటి తమాషాలే చేస్తాడన్నారు. ఆశ్రమ వాసులతోపాటు అఖిల భారత కాంగ్రెసు కమిటీ మెంబర్లను కూడా జత చెయ్యడం ఆరంభించారు.

  1. వారు ప్లాను చేసి, వ్రాయడం పడని తరువాతి ఖండంలో "కాంగ్రెసు గవర్న్ మెంట్ - అటుపిమ్మట" అన్న ప్రకరణంలో ఆ విషయాలన్నీ గుదిగుచ్చ దలచారు.
  2. ఈ ఉపన్యాసం ఆఖరు పేజీలో 'ఎపెండిక్స్‌" కింద ముద్రింపించ దలచారు.