నా జీవిత యాత్ర-3/మదరాసు కాంగ్రెస్ - స్వాతంత్ర్య తీర్మానం

2

మదరాసు కాంగ్రెస్ - స్వాతంత్ర్య తీర్మానం

గౌహతి కాంగ్రెస్ (1926) అధ్యక్షుడుగా శ్రీనివాసయ్యంగారు మరుసటి సంవత్సరపు కాంగ్రెస్‌ను మదరాసుకు ఆహ్వానించడమూ, ఆ ఆహ్వానాన్ని మన్నించి 1927 లో డా॥అన్సారీ అధ్యక్షతను చెన్నపట్నంలో కాంగ్రెస్‌ను జరపడమూ సంభవించింది. ఆ మదరాసు కాంగ్రెసువారు రెండు ముఖ్య మయిన తీర్మానాలని ప్యాసు చేశారు: మొదటిది స్వాతంత్ర్యానికి సంబంధించింది; రెండవది సైమన్ కమిషన్‌ను బహిష్కరింప వలసింది అన్నది.

హజరత్ మొహనీ అభిలాష

దేశానికి స్వాతంత్ర్యం అనే అభిప్రాయం 1921 లో అహమ్మదాబాదు కాంగ్రెస్‌లో ఆవిర్భవించింది. అదే రోజులలో అహమ్మదాబాదులో జరిగిన ముస్లిం కాన్ఫరెన్స్ అధ్యక్షుడయిన హజరత్ మొహనీ (Hazrath Mohani) దేశ స్వాతంత్ర్యం పట్ల తాను సుముఖుడనేనని వ్యక్తపరిచాడు. స్వభావసిద్ధంగా మహాత్మగాంధీ, తాను స్వయంగా ప్రత్యక్ష చర్యలకు సిద్ధమయ్యే పరిస్థితి ఉత్పన్నమయ్యేదాకా, మితవాదిగానే ఉండాలని కోరుకునే బాపతు వారు. అందుచేత హజరత్‌మొహనీ, స్వాతంత్ర్య ప్రస్తావన వచ్చినప్పుడు, తాను స్వాతంత్ర్యాన్నే కాంక్షిస్తున్నానని చెప్పేసరికి, ఆ కబురు విని గాంధీగారు విస్తుపోయారు.

తాను శాసనధిక్కారం ప్రవేశ పెట్టేలోపల, నిర్మాణం కార్యక్రమ బాగా అమలు జరగాలనీ, ప్రజలు కాంగ్రెసు పక్షాన నిలవడానికి కావలసిన ప్రబోధం చేసి, వారికి అవసరమైన విజ్ఞానాన్ని కలుగజేయాలనీ, గాంధీగారు వాంఛించేవారు. దేశం రాజకీయంగా ఇంకా మొదటిమెట్టుమీదనే ఉన్న ఆ రోజులలో, మొహనీ తాను దేశ స్వాతంత్ర్యాన్ని కాంక్షిస్తున్నానని చెప్పడం, గాంధీగారి లాంటి వారికైనా విస్మయ కారణం గదా!

ఆ పరిస్థితులలో, తాను హజరత్ మొహనీ అభిలాషతో ఏకీభవించి తానూ స్వాతంత్ర్యం కావాలనే వాడనే అని అనకపోతే ఏవయినా విపరీత పరిణామా లుత్పన్న మవవచ్చునని తలచి, హజరత్ మొహనీకి ఆయన ఒక హెచ్చరిక మాత్రం చేశాడు. "లోతుపాతులు గ్రహించి మరీ స్వాతంత్ర్యం అన్నమాట ఉచ్చరించు."

అహమ్మదాబాదు కాంగ్రెస్ జరిగిన కొద్దిరోజులలోనే హజరత్ మొహనీని నిర్భంధించడమూ, ఆయనపై మోపబడిన కేసు విచారణ అయి, ఆయనకు రెండు సంవత్సరాలు కారాగార శిక్ష విధించడమూ జరిగింది.

'స్వరాజ్య' పదం వెనక చరిత్ర

స్వాతంత్ర్యం ప్రతి భారతీయునికీ జన్మ హక్కు, న్యాయత: ఈ స్వాతంత్ర్య వాంఛ కాంగ్రెసుతోపాటే 1885 లో ఉత్పన్నమై, కాంగ్రెసు ఆశయమై నిర్విరామకృషికి ఆలవాలమై యుండవలసిందే, కాని, మితవాదుల చేతులలో కాంగ్రెసు ఉన్నంత కాలమూ వారికి స్వతంత్రాన్ని గురించి తలపెట్టడానికి తావే లేకపోయింది. 'స్వరాజ్యం' అన్న ముక్కే వారికి చుక్కెదురుగా కనబడేది. లోకమాన్య బాలగంగాధర తిలక్ మొట్టమొదటిసారిగా "స్వరాజ్యం నా జన్మహక్కు" అన్న నినాదాన్ని ఉచ్చరించినప్పుడు, అ మితవాదులకా ముక్కలు శరీరంలో వణుకు పుట్టించాయి.

'స్వరాజ్యం' అన్న పదం ఉపయోగించిన కారణంగా తిలక్ మహాశయుడు చిక్కులలో పడే పరిస్థితి ఉత్పన్నమయినప్పుడు, దాదాభాయి నౌరోజీగారు 1906 లో కాంగ్రెస్ అధ్యక్షుడుగా లండన్ నుంచి భారతదేశానికి వచ్చి 'స్వరాజ్య' అన్న పదాన్ని విపులీకరించి, 'స్వరాజ్‌' అనగా పూర్తి స్వాతంత్ర్యమనీ, ఆ రోజులలో ఎన్నో దేశాల వారు బ్రిటిషువారికి బద్ధులయి అనుభవిస్తూన్న స్వాతంత్ర్యంలాంటిదనీ నిర్వచనం ఇవ్వ వలసివచ్చింది.

అధమం అప్పటినుంచీ అయినా ఆ మితవాదులు ఏటేటా ఆ 'స్వరాజ్యాన్ని' వాంఛిస్తూ ఉండి ఉండవలసింది. అల్లా 1917 వరకూ జరిగి ఉంటే ఎంతో బాగుండేది. 1917 లోనే కాంగ్రెసు మితవాదుల చేతులలోంచి మారి, కొద్దికాలం తిలక్ మహాశయుని అడుగుజాడలలో నడుస్తూ, గాంధీగారి కైవసం అయింది.

మితవాదులా 'స్వరాజ్యాన్ని' కోరలేకపోయారు. 'స్వరాజ్య' అన్న పదానికి వెనుక ఇంత చరిత్ర ఉన్నా, హజరత్ మొహనీ 'స్వరాజ్య' అన్న పదం వాడి:ఉంటే, ఆ కోర్కెలో తప్పేమీ లేదని గాంధీజీ గుర్తించి ఉండవలసింది. కాని వెనువెంటనే జరిగిన హజరత్ మొహనీ నిర్భంధమూ, కేసూ, విచారణా గమనించిన నాకూ, ఇతర మిత్రులకూ కూడా గాంధీగారు అన్న 'లోతు పాతులు గ్రహించి మరీ స్వాతంత్ర్యాన్ని గురించి మాట్లాడు' అన్న హెచ్చరిక లోని 'లోతుపాతు' అన్న పదాన్నే అడ్డం పెట్టుకుని హజరత్ మొహనీ పైన ప్రభుత్వంవారు విరుచుకు పడ్డారా అనిపించింది. అదే "స్వాతంత్ర్యం" అన్న ఆశయానికి ప్రాతిపదికా, జన్మ కారణమూ అయింది.

సాంబమూర్తి ఉబలాటం

తర్వాతి పరిస్థితులుకూడా గమనిద్దాం. లోగడ కొంత కాలంగా మద్రాసు శాసన సభ స్పీకర్‌గా పనిచేసిన బులుసు సాంబమూర్తిగారు, కలగబోయే పరిణామాలను విలియా వేసుకోకుండా, "స్వాతంత్ర్యం" కోసం ప్రాకులాడ నారంభించాడు. సాంబమూర్తిగారూ, నేనూ మప్ఫయి యేండ్లకుపైగా కలిసి పనిచేస్తూ ఉన్నవారమే. ఆరంభ దినాలలో లాయర్లంగా పనిచేశాం. తర్వాత ఇరువురమూకూడా ప్రాక్టీసు విరమించుకుని, స్వాతంత్ర్య సమరంలోకి కలిసేదూకి పనిచేస్తున్నాం. 1921 లో జరిగిన ఆ మొట్టమొదటి గోదావరి జల్లా రాజకీయ సభా కార్యక్రమాలు నా అధ్యక్షతనే జరిగాయి. అప్పుడు నేనే సాంబమూర్తిగారి 'స్వాతంత్ర్య' తీర్మానాన్ని ఎదుర్కున్నాను. అప్పట్లో గాంధీగారికిలాగే కావలసిన తయారీలేందే 'స్వాతంత్ర్యం' అన్న పదం వాడితే ప్రభుత్వంవారి చేతులలో ఎటువంటి ఫలితాలకు లోనుగావలసివస్తుందో అన్న భయం నన్నూ ఆవరించే ఉందన్నమాట!

స్వరాజ్య సమరంలో సాంబమూర్తిగారి పాత్రను గురించి ఇదివరకే చెప్పి ఉన్నాను.

జవహర్‌లాల్ చొరవ

చెన్నపట్నం కాంగ్రెసులో, అప్పుడే జినీవా నుంచి వచ్చిన జవహర్‌లాల్ నెహ్రూగారి ముఖత: ప్రతిపాదించబడింది సాంబమూర్తిగారి 'స్వాతంత్ర్య' తీర్మానమే. మదరాసు కాంగ్రెస్ రోజులలోకూడా మహాత్మా గాంధీగారు 'స్వాతంత్ర్య' తీర్మానానికి ప్రతికూలురే. జవహర్‌లాల్‌గారు తీర్మానాన్ని ప్రతిపాదించే సమయంలో గాంధీగారు ఆ కాంగ్రెసు పెండాలు గేటు దాకావచ్చి, లోపల ఏం జరుగుతోందని అడిగి, జవహర్‌లాల్ నెహ్రూ స్వాతంత్ర్య తీర్మానంపై మాట్లాడుతున్నారని విని, వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ, 'ఏదో బడి పిల్లల బెడదలే' అన్నారు.

ఆ రోజులలో దేశంలోని స్వాతంత్ర్యవాదుల నందరినీ అరెస్టుచేసి, కేసులుపెట్టి జెయిళ్ళకు పంపిస్తారనే వదంతి బాగా నాటుకుపోయి ఉంది. తన్ను కాదని జవహర్‌లాల్ ఆ తీర్మానాన్ని ప్రతిపాదించాడనే అభిప్రాయం గాంధీగారికి కలిగి నట్లుంది. ఈ విషయంగా తన కుమారుడు జైలుకు వెళ్ళడము మోతీలాల్‌ నెహ్రూగారి కెంత మాత్రం ఇష్టం లేదు. అసలు ఆయన స్వతంత్ర్యాన్ని వాంఛించే బాపతు కాదు. ఆఖరికి డొమినియన్ వ్టేటస్ (అధినివేశ ప్రతిసత్తి) అన్న పదజాలంమీద కూడా నిలబడే బాపతుకాదు. ఆయన ఎప్పుడూ రాజీ ప్రతిపాదనలకు సుముఖుడు.

ఎప్పుడూ కలహానికి కాలు దువ్వి, తిరుగుబాటును వాంచించే బెంగాల్ రాష్ట్రం కూడా, ఆ 1925 లో చిత్తరంజన్ దాస్‌గారి మరణం కారణంగా, వెనక్కి జంకింది. దాస్‌గారి మరణం ఒక పెద్ద కధ. దానిని గురించి ప్రత్యేకంగా చెపుతాను. బెంగాల్, అనేక కారణాలవల్ల, మదరాసు కాంగ్రెస్‌వారు 'స్వాతంత్ర్య' తీర్మానాన్ని ప్యాసుచేసిన సమయంలో, ఒక రకమయిన నిరుత్సాహ స్థితిలో పడిపోయి ముందుకు రాలేక పోయింది.

బెంగాల్‌వారు 1928 కాంగ్రెస్‌ను కలకత్తాకు ఆహ్వానించారు. ఎల్లా గయినా కాంగ్రెసు అధ్యక్షునిగా పండిత మోతీలాల్ నెహ్రూగారినే ఎన్నుకుని, చెన్నపట్నంలో ఆయన కుమారునిచేతనే ప్రతిపాదించబడి ప్యాసయిన 'స్వాతంత్ర్య' తీర్మానాన్ని బుట్ట దాఖలు చేయించాలని 'బెంగాల్‌' వాంఛించింది.

కమిషన్ బహిష్కరణ తీర్మానం

సైమన్ కమిషన్ బహిష్కరణ తీర్మానాన్ని గురించి మళ్ళీ కాస్త చర్చిద్దాం. మొట్టమొదటి కాంగ్రెసు దినాలనుంచీ బ్రిటిష్‌వారు భారతీయులపట్ల ప్రదర్శిస్తూ ఉన్న వైఖరీ, అవలంబిస్తూ ఉన్న దగా పద్ధతీ, మోసకారి విధానమూ గమనించి గ్రహిస్తూన్న భారతీయులు ఆంగ్లేయ విధానాలతో విసుకుజెంది ఉన్నారు. నాయకులూ, దేశంలోని చిన్న పెద్దలూ - అందరికీ బ్రిటిష్ విధానం పట్ల విముఖతే కలిగింది. ఆ కారణంచేత బహిష్కరణ తీర్మానం విస్తారం తర్జన భర్జనలు అవసరం లేకుండానే అంగీకరించబడింది.

తీర్మానం ఆమోదించబడిన వెంటనే దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెసు కమిటీలకీ, ప్రజానీకానికీ కూడా సైమన్ కమిషన్ బహిష్కరించవలసిందనీ, పూర్తిగా హర్తాలు చేయవలసిందనీ ఆదేశాలు ఇవ్వ బడ్డాయి. కొంతమంది నాయకులకు శాసన ధిక్కారమూ, 'బాయ్‌కాట్‌' తీర్మానాదులలో అంతగా ఆసక్తి లేకపోయినా, ఇది కేవలం బహిష్కరణే గదా, ఇందులో శాసన ధిక్కారాది కార్యక్రమాలు ఏమీలేవు గనుక కమిషన్‌ని 'బాయ్‌కాట్‌' చేసి, హర్తాలు అమలు పరుద్దాం అని, తమలో తాము తర్జన భర్జనలు చేసుకుని, ఒక నిర్ణాయానికి వచ్చారు.

దేశం ఈ తీర్మానాన్ని ఆసక్తితో అమలు పరచింది. కమిషన్ ఎక్కడకు వెళ్ళినా నల్ల జెండా లెదురయ్యాయి. అందువల్లనే ఈ బహిష్కరణ అంత ఘనంగా సాగింది. ఆ కాంగ్రెస్ అధ్యక్ష పదవి, శ్రీనివాసయ్యంగారి భుజస్కంధాల మీదనుంచి, ఆ 1927 డిసెంబరులో డా॥ అన్సారీగారి భుజాలమీదికి వాలి ఊరుకుంది.

సక్లత్‌వాలాకి విందు

బ్రిటిష్ పార్లమెంట్‌లో భారతీయ సభ్యుడుగా ఉంటూ ఉన్న సక్లత్‌వాలా 1927 లో హిందూ దేశానికి వచ్చాడు. ఆయన కేంద్ర శాసన సభా కార్యక్రమాన్ని వీక్షించి, ఆ శాసన సభా సభ్యులలో ముఖ్యులు అనుకున్నవారందరితోనూ, దేశంలో ఉన్న రాజకీయ పరిస్థితిని గురించి తర్కవితర్కాలు చేశాడు.

ఆయన చాలా ఉత్సాహవంతుడూ, మంచి తెలివయిన వాడూను. కాని తన దేశభవిష్యత్తు ఏమిగానున్నదో అనే వ్యాకులంతో చాలా మన:క్లేశంలో ఉన్నాడు.

ఆయన రాకను పురస్కరించుకుని కేంద్ర శాసన సభలోని కాంగ్రెసు మెంబర్లంతా కలసి ఆయన గౌరవార్థం ఒక పెద్ద ప్రాత:కాల విందును ఏర్పరచారు. నాతో ఆయన సంప్రతించిన సందర్భంలో దేశం యావత్తూ ఒక్క త్రాటిమీద, ఒక్కమాట మీద ఉండి, సంఘీభావంతో వ్యవహరించా లన్నారు. తాను జన సమూహంతో కలిసిమెలిసి ఏ విధమయిన కార్యక్రమమూ ఎప్పుడూ జరుపలేక పోయానని వాపోయాడు. ఇదంతా 1927 మార్చిలో కేంద్ర శాసన సభలో జరిగిన విషయం.