నా జీవిత యాత్ర-2/హిందూ-మహమ్మదీయ సాంఘిక సంబంధాలు

4

హిందూ-మహమ్మదీయ సాంఘిక సంబంధాలు

బెజవాడలో (విజయవాడలో) జరిగిన అఖిలభారత కాంగ్రెసు సమావేశమూ *[1]మహమ్మదాలీ, షౌకత్‌అలీల కృషీ, మహమ్మదీయ స్వచ్ఛందసేవకుల సేవా, ఆంధ్రరాష్ట్రంలోనే గాక అనేక రాష్ట్రాలలో హిందూ-మహమ్మదీయ ఐకమత్య సౌధ నిర్మాణానికి శంకుస్థాపన చేశాయి. డాక్టరు కిచులీనీ, అలీద్వయాన్నీ, "ఫత్వా" ఖైదీలనూ విడుదలజేసే పర్యంతమూ, రీడింగ్ ప్రభువు ప్రతిపాదించిన రాజీ సూచనలను పరిశీలించను అన్న గాంధీగారి తిరస్కృతితో స్వాతంత్ర్య సంపాదనార్థం దేశం యావత్తూ ఏ ప్రకారంగా ముందంజ వేస్తోందో ఆంగ్లేయులకు ఆకళింపయింది.

భారతదేశం స్వాతంత్ర్యం సాధించడంకోసం అవలంబించిన అహింసాత్మక విధానం తొలి ఘట్టాలలోనే సాధించిన విజయాలను ఏమాత్రం సౌమ్యదృష్టితో చూసివుండినా, కోట్లాది భారత ప్రజ స్వాతంత్ర్యంకోసం ఎంతగా తహతహలాడుతుందో బ్రిటిషువారికి అవగాహన అయివుండేది. కాని మన దురదృష్టవశాత్తూ బ్రిటిషువారు హిందూదేశంపట్ల అవలంబించిన రాజ్యతంత్రానికి సౌమ్యదృష్టి అనేది పూర్తిగా లోపించింది. లార్డ్ రీడింగ్‌వంటి వ్యక్తికికూడా యీ దేశం పట్ల, దేశీయులపట్ల న్యాయమైన దృష్టి లోపించిందనీ, కుతంత్రాలతోనే రాజీ ప్రతిపాదనలు ప్రతిపాదింపబడ్డాయనీ మాకు ఆకళింపయింది. దాస్, మోతిలాల్ గార్లు తాము గాంధీగారికంటె ఉన్నతస్థాయిలోనివారం అనే అహంభావంతో, ఆదిలోనే వారితో భేదాభిప్రాయం కలిగివున్నారు. నాగపూరు కాంగ్రెసు[2]లో ప్రతపాదింపబడిన అహింసాత్మక సహకార నిరాకరణోద్యమ తీర్మానం అత్యధికమైన మెజారిటీతో ఆమోదింపబడి, గాంధీగారి కార్యక్రమానికి ప్రోత్సాహం లభించిన కారణంగా చిత్తరంజన్ దాసుగారు తప్పనిసరిగా దానికి తల ఒగ్గవలసి వచ్చింది. తన కుమారుడే గాంధీగారి ప్రథమ శిష్యుడయిన కారణంగా, మోతిలాల్ నెహ్రూగారుకూడా గాంధీగారి విధానాన్ని శిరసావహించవలసి వచ్చింది.

అందువలన దాస్, మోతిలాల్‌గార్లకు సహకార నిరాకరణోద్యమంపట్ల గాంధీగారికున్నంత విశ్వాసం లేదన్న విషయం విశదం అవుతూనేవుంది. గాంధీగారి "పిలుపు" ను అనుసరించి, ప్రాక్టీసు విరమించి ఉద్యమంలో చేరేనాటికి దాస్, మోతిలాల్‌గారలు తమతమ రాష్ట్రాలలో చాలా ఉన్నతస్థాయిలో న్యాయవాదవృత్తి సాగించేవారు. అటువంటి ప్రముఖులే వృత్తులు విడచి, ఉద్యమంలో చేరి జైళ్ళకు వెళ్ళడానికి సిద్ధమవడంచేత, వందలాది వారికి అనుచరులై నారు. గాంధీగారి పిలుపును అనుసరించే ఉద్యమంలో చేరినవారైనా, వారి హృదయాలలో గాంధీగారి విధానాలపట్ల ఏదో ధర్మసందేహం లాంటిది పీకుతూ వుండడంచేతనే వా రిరువురూకూడా గాంధీగారి కార్యక్రమంలో పూర్తి విశ్వాసం ఉంచలేకపోయారు.

లక్నో ఒప్పందం

స్వాతంత్ర్య సమరదీక్షనూ, సహకారనిరాకరణ విధానాన్నీ అవలంబించకపూర్వం కాంగ్రెసు నాయకులుగా ఉండేవారి కందరికీ గవర్నమెంటువారు మంచి మంచి ఉద్యోగాలు ఇవ్వడం అప్పుడు ఆచారంగా ఉండడంవల్ల, నూతనంగా కాంగ్రెసులో చేరినవారి దృష్టి, ఇటు ఆత్మార్పణతో కూడుకున్న అహింసాత్మక ఉద్యమవిధానం మీదనే కాక,అటు ఉద్యోగాన్వేషణమీద కూడా ఉండేదన్న విషయం మరువకూడదు. 1916 లో లక్నో కాంగ్రెసులో ఆమోదింపబడిన కాంగ్రెసు-ముస్లిం లీగ్ ఒప్పందమనే హిందూ మహమ్మదీయ సామరస్యపు బీజం దేశరాజకీయ వాతావరణంలో అనుకోకుండా నాటుకుంది. లక్నో ఒప్పందం మహాత్మాగాంధీ, తిలక్ మహాశయుల దీవనలు అందుకుని, 1921-22 సంవత్సరాలనాటికి సత్పలితాలను సాధించింది. ఈ హిందూ - మహమ్మదీయ సామరస్యబీజాలు 1917 లో హెచ్. ఇమాంగారి అధ్యక్షతను పుంజుకున్నాయి. 1918 లో బొంబాయిలో జరిగిన స్పెషల్ కాంగ్రెసు వారి ఆమోదాన్ని కూడ కట్టుకున్నాయి. అ తర్వాత కూడా ఏటేటా జరుగుతూ వచ్చిన వివిధకాంగ్రెసు సభలతో ఆమోదాలమీద ఆమోదాలు అ "లక్నో పాక్టు"కు అందుతూనే వచ్చాయి.

లక్నోపాక్ట్ అధారంగా ఉద్యోగాది హోదాలలో మెట్టుపై మెట్టు ఎక్కగలిగిన అనాటి ముస్లిం నాయకులు అంతటితో ఆగక ఇంకా ఉన్నతస్థాయిలోకి రావాలనీ, ఇంకా ఎక్కువ ఫలితాలను సాధించాలనీ ఆందోళన సాగించారు. ఏటేటా తమ ప్రయత్నాలను ఉద్దృతం చేస్తూ, లక్నోపాక్ట్‌లో తాము సాధించింది అత్యల్పమనీ, ఇంకా యింకా తమ హక్కులూ, హోదాలూ పెరగాలనీ వారు ఉత్తర హిందూస్థానంలో ఉర్దూ రచనద్వారా ప్రచారంచేసి ముస్లింలను రెచ్చకొట్టారు.

ఈ రచనల పరిణామమూ ఫలితాలూ వగైరాలన్ని "హిందూ-మహమ్మదీయ సంఘర్షణలు" అన్న శీర్షికలక్రింద ముల్తాన్‌లో జరిగిన 1922 నాటి హిందూ మహమ్మదీయ సంఘర్షణలను గురించి వ్రాస్తూ వివరించాను. ప్రస్తుతం, యీ విషయాన్ని మనకూ, ప్రభుత్వం వారికి మధ్య సాగుతున్న పోరాటంతో జతపరుస్తున్నాను. రక్తాన్ని చవిచూస్తూ, ఉద్యోగాది హోదాలకోసం ఉద్దృతంగా ప్రచారం సాగించ గలిగిన యోధులు, గాంధీగారి నిర్బంధంతో లక్నోపాక్ట్‌ను పున:పరిశీలన చేసి తీరాలని గట్టిగా పట్టుపట్టారు.

ముల్తాన్ సంఘర్షణ: నా దర్యాప్తు

నిజానికి మొట్టమొదటిదైన ముల్తాన్ సంఘర్షణ[3]మతద్వేషం కారణంగా ఉత్పన్నం కాకపోయినా అప్పట్లో అ రూపం దానికి అంటగట్టారు. కాంగ్రెసు కార్యనిర్వాహక సభ్యులుగా వ్యవహరిస్తూన్న మేము అప్పట్లో అ ముల్తాన్ తిరుగుబాటు సంభవించిన వెనువెంటనే ముల్తాన్ ప్రాంతం పర్యటించి, సంఘర్షణ కారణాలను పరిశీలింప సాగాము. ముఖ్యంగా నేను వర్కింగు కమిటీ మెంబరుగానేగాక "స్వరాజ్య" పత్రికా సంపాదకునిగా కూడా, సంఘర్షణకు కారణాలను క్షుణ్ణంగా పరిశీలించదలచాను. నిజానికి ముల్తాన్ సంఘటనకూ, మతోద్రేకాలకూ సంబంధమే లేదు. ముల్తాన్‌లో పురపాలకసంఘం అన్నది యేర్పడ్డ నాటినుంచీ, అక్కడ పేరు ప్రఖ్యాతలూ, పలుకుబడి ఉన్న "పీరు" కుటుంబంవారు పురపాలక అధ్యక్షస్థానానికి ఒక వ్యక్తిని సూచించడమూ, అ వ్యక్తే యేకగ్రీవంగా ఎన్నిక అవడమూ జరుగుతూ వచ్చింది కాని, అ సంవత్సరం ఒక హిందూ కాంగ్రెసువాదికి, పీరు కుటుంబీకులు నిర్ణయించిన మహమ్మదీయునికి మధ్య పోటీ జరగడమూ, అందు హిందూ కాంగ్రెసువాది నెగ్గడమూ సంభవించడంతో "పీరు" కుటుంబీకులకు చాలా అవమానం జరిగిపోయిందనే కారణంగా అక్కడ ఆ సంఘర్షణ జరిగింది.

చౌరీ చౌరా సంఘటన కారణంగా కాంగ్రెసువారు తమ ఉద్యమాన్ని విరమించడమూ, దొరికిందే సందుగా యుక్తియుక్తంగా వ్యవహరించిన లార్డ్ రీడింగ్ నేర్పరితనమూ కలిసి కాంగ్రెసులో చీలికలు తీసుకువచ్చాయి. దాస్, మోతిలాల్ ప్రభృతులు గాంధీగారినీ వారి సహకార నిరాకరణ విధానాన్నీ త్రోసిపుచ్చి అస్థానంలో "కౌన్సిల్ ప్రవేశ పదకాన్ని" అమలు జరపాలనే నిశ్చయానికి వచ్చారు.

చక్రవర్తులవారి వింత ప్రవృత్తి

నేనూ, చక్రవర్తుల రాజగోపాలాచారిగారూ కూడా వర్కింగు కమిటీ సభ్యులమే. అప్పుడే కలకత్తా జైలునుంచి విడుదల అయిన పండిత మదనమోహన మాలవ్యాగారూ, అబుల్ కలాం అజాద్ గారూ కూడా మాతోబాటు ముల్తాన్‌లో సమావేశమయిన కార్యనిర్వాహక సభలో పాల్గొన్నవారే. ముల్తాన్ బాధితులకు వలయు సహాయం చేసి తీరాలనే నిశ్చయించుకున్నాం పదివేల రూపాయలు బాధితులకు పంచి పెట్టడానికి గాను మంజూరు చేశాం. అయితే రాజగోపాలాచారిగారు యేమయినా సరే సొమ్ము యివ్వనని బిగుసుకు కూర్చున్నారు. దాస్, మోతిలాల్ గార్లకు వ్యతిరేకంగా "నో చేంజర్స్" (శాసన సభా బహిష్కార వాదులు) పార్టీకి నాయకునిగా రాజగోపాలాచారిగారిని నిలబెట్టి, వారికి యెంతో మద్దత్తు ఇచ్చాను. కాని నాకు రాజగోపాలాచారిగారితోనూ, వారి పద్దతులతోనూ పరిచయం తక్కువ అవడాన్ని వారి వింత ప్రవృత్తి నాకు అర్థంకాలేదు. బాధితులకు పంచిపెట్టడానికి యివ్వవలసిన అ పదివేలరూపాయలూ వెంటనే మాలవ్యాగారికి యివ్వకపోతే, ఆయనా, అబుల్ కలాం అజాద్‌గారూ "నో ఛేంజి" దృక్పథానికి మార్తారని వారి అంచనా. నిర్బందానికి పూర్వమూ, నిర్బందానంతరమూ కూడా అజాద్ దాస్‌గారికి కావలసిన ముఖ్య స్నేహితుడే. అటువంటి పరిస్థితులలో బాధితులకు పంచిపెట్టుటకు యివ్వవలసిన పదివేలు యివ్వకపోతే, అజాద్ మా "నో చేంజి" దృక్పథానికి ఎల్లా మారుతారని రాజగోపాలాచారిగారు వూహించారో నాకు అర్థం కాలేదు. కానీ నాటికీ నేటికీ కూడా బాధితులకు పంచిపెట్టాలనుకున్న డబ్బు, రాజగోపాలాచారిగారి చేతినుండి రానేలేదు. హిందూ-ముస్లిం విచక్షణ లేకుండా "బాధితుడు" అవునా కాదా అన్న దృష్టితోనే అ పదివేలూ పంచి పెట్ట దలచాం. కాని రాజగోపాలాచారిగారి కారణంగా యేమీ చెయ్యలేకపోయాం. ఏది ఏదయినా గాంధీగారిని నిర్బంధించిన కొద్ది రోజులలోనే జరిగిన ముల్తాన్ విప్లవం మా కందరికీ కనువిప్పు అయింది.

హిందూ మహమ్మదీయ మైత్రి మా ఆశయం అంటూ చాటుతూన్న కాంగ్రెసు అధినేత మహాత్మాగాంధీ నిర్బంధం జరిగిన తక్షణం మీరు నిలబెట్టిన అభ్యర్థిని కాంగ్రెసువారు ఎల్లా ఓడించారో చూచారా అంటూ "పీరు" కుటుంబీకులను రెచ్చకొట్టాలని "సానుభూతి" సాకుతో కొంత మంది స్వప్రయోజన పరులు ప్రయత్నాలు సాగించారు. కాని పీరు కుటుంబంవారు అప్పట్లో అట్టె పట్టించుకోకుండా ఆత్మనిగ్రహంతో శాంతం వహించారు. ఆర్నెల్ల తర్వాత జిల్లాబోర్డు ఉపాధ్యక్ష పదవికి ఎన్నిక విషయంలో తిరిగీ అదే ప్రకారంగా "పీరు" అభ్యర్థి కాంగ్రెసువారి చేతిలో ఓడడం సంభవించే సరికి, కథ అడ్డం తిరిగింది. దాన్తో అనుకోని విధంగా అగ్నిరాజుకుంది. కొద్ది రోజులలోనే కొంప లంటు కున్నాయి. తుగ్లక్ రోజులలో కూడా జరుగనట్టి ఘోరపరిణామాలు జరిగిపోయాయి. ముల్లాన్‌లో కొట్లాటలు విజృంభించాయి.

ఈ సందర్బంలో నేను సేకరించిన వివరాలన్నీ వేరే శీర్షిక క్రింద విపులంగా విశద పరుస్తాను. ఒక్క విషయం మాత్రం పరమసత్యం. ముందుగా యోచించి వేసుకున్న ప్లాను ప్రకారంగా పట్నం నలుమూలలా ఒకేసారి అగ్నిజ్వాలలు లేచాయి. కుట్రదారులు ముందుగా ప్లాను వేసుకున్నారన్నది మాత్రం ఖాయం. ఏమయితేనేం 1922 లో గాంధీగారి నిర్బంధానంతరం వారి యోచనతో ప్రారంభింపబడ్డ హిందూ-మహమ్మదీయ ఐకమత్య సాధనికి మాత్రం గొడ్డలిపెట్టే అయింది.

లక్నోపాక్ట్ జరిగిన తేదీనుండీ జాతీయ దృక్పథం రాజబాటను వదలి గళ్ళీల ద్వారా ఉద్యోగాది అన్వేషణా విధానాలలో పడిపోయింది. గాంధీగారు నిర్బంధింపబడేవరకూ, లక్నోపాక్ట్ పున:పరిశీలన చెయ్యాలి అనే ఆందోళన పుట్టడానికే అవకాశం కలుగలేదు. సందు దొరికే సరికి ప్రభుత్వాధికారంలోనూ, పదవులలోనూ ఉద్యోగాలలోనూ ఉన్న పెద్దలే అనేక విధాల ప్రోద్బలం యిచ్చి, లక్నోపాక్ట్‌లో మార్పులు వచ్చి తీరాలి, మనకు యింకా ఎన్నెన్నో హక్కులు భుక్తం కాగల అవకాశాలు లభించాలి అనే నినాదాలూ, కోర్కెలూ వగైరా లేవనెత్తారు. అవి హద్దులుమీరి ఉద్దృతంగా విజృంభించాయి.

గాంధీగారి నిర్బంధంతోనూ వారికి విధింపబడ్డ అరు సంవత్సరాల కారాగార శిక్షకారణంగానూ, దాస్, మోతిలాల్, గాంధీజీల మధ్య ఉత్పన్నం అయిన భేదాభిప్రాయాలతోనూ కాంగ్రెసుకు దుర్దినాలు ఆరంభం అయ్యాయని ఒప్పుకోక తప్పదు. అప్పట్లోనే మేము మేల్కాంచి ముందు జాగ్రత్తలు తీసుకోవలసింది. శాంక్షన్ అయిన పదివేలూ కూడా ఎల్లాగయినా బాధితులకు అందజేసి ఉండవలసింది. కాని రాజగోపాలాచారిగారు అజాద్‌ను తమ పక్షానికి త్రిప్పుకోడానికి యిదే అదను అని భావించి, చేసిన కాలయాపన కారణంగా నిమిషాల మీద కొంపలు అంటుకుంటాయన్న సంగతే మాకు స్ఫురించక పోవడం దురదృష్టం. అప్పటికీ కొందరు మిత్రులు రాబోవు విపరీత పరిణామాల విషయం హెచ్చరికలు చేశారు.

మోతిలాల్ రాజాజీగార్లు కలిసి సమిష్టిగా హిందూ-మహమ్మదీయ సఖ్యసాధనకు పాటు పడడానికి బదులు, వారిలో వారు "నో చేంజ్" "ప్రో చేంజ్" విధానాల పేరిట వివాదాలలోపడి, తమ తమ పార్టీల అభివృద్దుల కోసమే పాటుపడ్డారు గాని సత్వర చర్యలు తీసుకోకుండా "అత్తగారి మీదకోపం కొద్దీ కూతుర్ని కుంపట్లో కూచోపెట్టిం"దన్న సామెతగా, ముల్తాన్ బాధితులను సమయానికి ఆదుకోడానికి బదులు, మంజూరైన పదివేల విరాళాన్నీ త్రొక్కిపెట్టి, ఉద్యమానికే తీరని అపకారం చేశారు. పార్టీల బలాబలాలు వృద్దిచేసుకునే ఉద్దేశంతోనే దేశవ్యాప్తంగా ప్రచారంచేసి తమ తమ అభిప్రాయాల కను గుణంగా లోకుల్ని మార్చాలనే తాపత్రయంతో భారతదేశపు టన్ని మూలలకూ వెళ్ళి దాస్, మోతీలాల్‌గార్లు ప్రచారాలు సాగించారు.

షహజాన్‌పూర్ సంఘటన

ముల్తాన్ సంఘటనల అనంతరం, పండ్రెండుమాసాల తర్వాత షహజాన్ ఉదంతం జరిగింది ఈ రెండు ఉదంతాల మధ్యకాలం అంతా, "నో చేంజ్", "ప్రో ఛేంజ్" పార్టీల స్వంత ప్రచారాలతోనే వృధా అయిపోయింది. గాంధీగారు జైలుకువెళ్ళిన కారణంగా, కార్యనిర్వాహక వర్గీయులలో ఉత్పన్నమయిన పరిస్థితులు ఇలా పరిణమించాయి. అనుకున్న ప్రకారం బాదితుల కా సహాయం చేయలేక పోయాము. నిజానికి యీ కారణంగా కార్యనిర్వాహక వర్గంనుండి తప్పుకోవాలని తలచాను. కాని, రాజగోపాలాచారిగారు తాము చేస్తున్న తప్పును గ్రహించగలుగుతారనీ, దనాన్ని యిచ్చి తీర్తారనీ, తిరిగీ మన కాంగ్రెసు మర్యాద కాపాడగలుగుతామనీ తలుస్తూ కార్యనిర్వాహక వర్గంలో ఉండిపోయాను. వీలయినప్పుడల్లా రాజగోపాలాచారిగారిని హెచ్చరిస్తూ ఎన్ని తంటాలుపడ్డా రాజాజిగారి కుందేటికి మూడే కాళ్ళవడాన్ని, వారి పట్టు భల్లూకపు పట్టయిపోయింది. ఆ సంగతి పూర్తిగా నిర్దారణయ్యేనాటికి షహజాన్ పూఠ్ సంఘటనకూడా జరిగేపోయింది.

వెంటనే నేను స్వయంగా బయల్దేరి వెళ్ళి అక్కడ జరిగిన ఉదంతాన్ని గురించి వివరాలు సేకరించాను. ఇదీ ముల్తాన్ సంఘటనంత ఉద్దృతమయినదే, ముల్తాన్-షహజాన్‌పూర్ సంఘటనల మధ్యకాలం పండ్రెండు మాసాలున్నా, మా కాంగ్రెసు పెద్దలూ నాయకులూ ఏ విధంగానూ కలుగ జేసుకోకుండా చూపిన అలసత కారణంగానే షహజాన్‌పూర్ సంఘటన జరిగిందని అ ప్రాంతంలో వుంటూవున్న కాంగ్రెసువారేగాక, ఏ పార్టీకి చెందని పెద్దలుకూడా అభిప్రాయం వ్యక్తపరిచారు. ఆ పండ్రెండు మాసాలలోనూ, హిందూ-మహమ్మదీయ స్పర్ధల విషయంలో కాంగ్రెసువారు పట్టించుకోని కారణంగా, లక్నోపాక్ట్‌లో మహమ్మదీయులకు తీరని అన్యాయమే జరిగిపోయిందనే ప్రచారం బాగా బలపడిపోయి, ఆ లక్నో ప్యాక్ట్‌ను తిరగదోసి ముస్లింలకు ఇంకా ఇతోధికంగా ఉపకరించే విధానంగా ఆ పాక్ట్‌ను మార్చాలనే నినాదం బలాన్ని చేకూర్చుకుంది. అంతేకాదు. వృత్తి వ్యాపారాలన్నీ హిందువుల చేతులలో ఉండడాన్నే, మహమ్మదీయులలో బీదరికం తాండవ మాడుతోందనే ప్రచారం సాగింది. నా విచారణ సారాంశంగా షహజాన్‌పూర్ సంఘటన ఆర్దికమైన ఇబ్బందులవల్లా, అధికధరలవల్లా జరిగిందని రుజువయింది. ఈ అర్ధికపు టిబ్బందులకూ, ధరల పెరుగుదలకూ మూలకారణం హిందూ వ్యాపారస్థులదేనన్న నినాదం బలపడింది. ఇట్టి విధంగా హిందూ-మహమ్మదీయ సాంఘిక సంబంధాలు క్లిష్టపరిస్థితులకు లోనయ్యాయి.

గాంధీగారిని నిర్బంధించేవరకూ అహింసాత్మక విధానాను గుణంగానే వ్యవహరించిన ఖిలాఫత్ వాలంటీర్లూ, మహమ్మదీయ స్వచ్చంద సేవకులూ షహజాన్‌పూరు సంఘటన నాటికి నూతన పంధా త్రొక్కి, క్రొత్త తీరున వ్యవహరించడానికి నిశ్చయించుకున్నారన్న మాట! ప్రఖ్యాత హిందూ కాంగ్రెసు నాయకులవద్దా, గ్రామంలోని ఇతర పెద్దలవద్దా నేను స్వయంగా సేకరించిన సాక్ష్యంలో, మహమ్మదీయ స్వచ్చంద సేవక దళాలు పనిచేస్తూన్న తీరును గురించి విపులంగా సమాచారాన్ని సేకరించాను. కత్తిసామూ, కర్రసామూలాంటి హింసాత్మక పద్ధతులలో మహమ్మదీయ వాలంటీర్లకు శిక్షణ గరపబడుతోందనీ, పైకి కాంగ్రెసు శాంతి దళ చిహ్నాన్ని ధరించినా, అంతరంగికంగా హింసాత్మక విధానాలలో తర్ఫీదు పొందుతున్నారనీ తెలిసింది.

1941-42 సంవత్సరాలలో జిన్నాగారూ, ముస్లింలీగు వారూ కనబరచిన వింత ధోరణి అర్థం చేసుకోవాలంటె, మనం వెనుకటి చరిత్ర పుటలు తిరుగవేసి, లక్నో పాక్ట్ దగ్గరనుంచీ జరిగిన సంఘటల నన్నింటినీ నెమరు వేసుకోవాలి. ఈ రోజులలో నా జీవితమంతా నేను కాంగ్రెసు సేవలోనే వినియోగించాను. అందువలననే వారికీ మనకీ ఉన్న అభిప్రాయ బేదాలు ఎల్లా దూరతీరాలకు జేరుకున్నాయో, ఏ విధంగా వారికి మనకీ మధ్య ఉన్న ప్రవాహం విస్తరించిందో, త్రోసి రాజే అయినా ఆటకట్టని విధంగా పరిస్థితులు మార్పుచెంది బిగుసుకు పోయాయో అర్థం అవుతుంది. ఇట్టి క్లిష్ట పరిస్థితులు ఉత్పన్నం అవడానికి తోడుపడిన మూలకారణాలూ, పేరుకొని బైటపడ్డానికి వాడబడ్డ చికిత్సా విధానమూ ముందు తరాల వారికయినా సరిగా అవగాహన కావడానికి గాను, జరిగిన చారిత్రక సంఘటనలు వివరంగా వివరింపబడాలి గదా!

భావి భద్రతకోసమూ, దేశ సౌభాగ్యంకోసమూ, అవలంబింప తగ్గ రాజ్యాంగ విధానం విషయమై అనుసరించవలసిన పద్ధతులను గురించీ ఆఖరుసారిగా అ కాంగ్రెసు అధినేతలను అడిగే యత్నంలో అ నాడు నేనున్నాను. మత సామరస్యం కొరవడిన కారణంగా ఉత్పన్న మయిన పరిస్థితులను గురించి విపులీకరించిన సందర్భంలో ఈ నా తుది నిర్ణయాన్ని గురించి విశద పరచాను.

ఎక్కడ యే ప్రాంతంలో సాంఘిక సంఘర్షణ జరిగినా, వెనువెంటనే ఆ ప్రాంతానికి వెళ్ళి, దర్యాప్తు సాగించి, అక్కడ ఉన్న పరిస్థితులను అవగాహన చేసుకోవడమన్నది కేవలం కాంగ్రెసు కార్య నిర్వాహక సంఘ సభ్యునిగా మాత్రమే కాదనీ, "స్వరాజ్య" పత్రికా సంపాదకునిగా కూడా నా విధిని నిర్వహించాలనే అభిలాషే నన్నాల్లా లాక్కుపోయేవని లోగడ మనవిచేసి వున్నాను. 1922 ఆరంభంలో ముల్తాన్ సంఘర్షణ, తర్వాత షహజాన్‌పూర్ సంఘర్షణ చరిత్రాత్మకం అయ్యాయి.

అఖిల పక్ష సమావేశం

అటువంటి విప్లవాత్మక దినాలలోనే, ఆ 1922 లోనే సర్ శంకరన్‌నాయరుగారి అధ్యక్షత క్రింద బొంబాయిలో అఖిల పక్ష రాజకీయ మహాసభ జరిగింది. ఒకప్పుడు సర్ శంకరన్‌నాయరు కాంగ్రెసు అధ్యక్ష స్థానాన్ని అలంకరించిన వ్యక్తే. ఆయన రాజకీయ విధానానికి అయనేసాటి. రీడింగ్ ప్రభువు ప్రతిపాదించిన రాజీ సూచనలను సరి శీలించగల వ్యక్తి సర్ శంకరన్‌నాయరేనని. శంకరన్‌నాయర్‌ లాంటి రాజకీయ వేత్తే ఆ ప్రతిపాదనలకు సరియయిన నిర్వచనమూ, స్థానమూ ఇవ్వగలడనే తలంపుతో మాలవ్యాజీ వారిని, అధ్యక్ష స్థానంలో నిలిపి ఆ బొంబాయి సమావేశానికి ప్రత్యేకత కలిగించారు.

నిజంగా ఆయన హృదయాంతరాళంలో శంకరన్‌నాయర్ వల్ల కార్యసాధనం అవుతుందనే నమ్మిక ఉంది. కాని గాంధీ విధానాలకు శంకరన్‌నాయరు ప్రబల విరోధి అన్నమాట మాలవ్యాగారు విస్మరించి ఉండవచ్చును. గాంధీగారి విధానాలనీ, కాంగ్రెసు చర్యలనూ ఖండించి, బ్రిటిషువారి యందు తనకున్న గౌరవాభిమానాలనూ, విశ్వాసాన్నీ రుజువు పరచుకోవచ్చుననే ఆలోచనతో శంకరన్‌నాయరు ఆ అధ్యక్ష స్థానానికి అంగీకరించాడు. అ సమావేశంలో గాంధీగారూ ఉపన్యసించారు.

అధ్యక్షుని "వాకౌట్"

సర్ శంకరన్‌నాయరు ఉపన్యసిస్తూ, ఉపన్యాసం మధ్యలో ఉద్రేకపూరితుడయి, తన అధ్యక్ష స్థానం విడిచి, నిరసన సూచకంగా సభా మండపాన్ని వదలి, ఆచార విరుద్దంగా బైటకు వెళ్ళిపోయాడు. ఆ అవేశంలో తన టోపీని అక్కడ వదలి, ఇంకొకరి టోపీని నెత్తిన పెట్టుకొని బైటకు నడిచాడు. బొంబాయి పట్టణవాసీ, పేరున్న బారిష్టరూ అయిన జోనఫ్ బాప్తిష్టాగారు వారి వెనుకాలే గట్టిగా కేకవేస్తూ, "శంకరన్‌నాయరుగారూ| మీతలను ఇక్కడవదలి, నాతలను మీ భుజాలమీద ఎక్కించుకున్నా" రని అరిచారు. శంకరన్‌నాయరు గేటుదాటేలోపలే ఆయన్ని పట్టుకుని, "నీ టోపీని వదలి నాటోపీ పట్టుకుపోతున్నావయ్యా" అంటూ హెచ్చరించి తన టోపీని తాను తెచ్చుకున్నారు.

ఈ ప్రకారంగా నడచిన యీ కాన్పరెన్స్‌లో చెప్పుకోదగ్గ విషయాలేవి సాధింపబడలేదు. తర్వాత సర్ శంకరన్‌నాయరు "Gandhi and Anarchy" అన్న ఒక పుస్తకం వ్రాశాడు. ఈ దేశానికి కావలసిన రాజకీయ స్వాతంత్ర్యం విషయంలో ఆయనకున్న అభిప్రాయం అది.

ఈ సంఘటనలన్నీ 1922 మార్చి 13 వ తేదీనాడు జరిగిన గాంధీగారి నిర్బంధానికి ముందే సంభవించి వుండడాన్ని, వైస్రాయి గారికీ ఆయన కౌన్సిల్ వారికీ బలం చేకూరింది. ఆ రోజులలో యీ విషయాలపై వచ్చిన విమర్శనలూ, విరసనలూ-అవి యేమూలనుంచి, ఎవరివద్దనుంచి వచ్చిన వయినా-గాంధీగారూ పట్టించుకోలేదు. పైగా అహమ్మదాబాదు సెషన్సు కోర్టులో ఆయన ఇచ్చిన "Sermon on the Mount" వంటి వాజ్మూలంతో ఆయన కీర్తి నలుదిశలా దేదీప్యమానంగా వ్యాపించింది.

  1. *1921 మార్చి-ఏప్రిల్ నిర్మాణ కార్యక్రమ విషయమై త్రివిధ బహిష్కారాల మీద తీర్మానాలుచేసి, దేశ ప్రజలతో కాంగ్రెసు కార్యక్రమం జరిపించాలని ఈ సమావేశం ఆదేశం.
  2. 1920 లో జరిగినది.
  3. 1922 లో