నా జీవిత యాత్ర-2/మతవర్గాల మధ్య మళ్ళీ మళ్ళీ కలహాలు
16
మతవర్గాల మధ్య మళ్ళీ మళ్ళీ కలహాలు
ముల్తాన్‌లో 1922 లో హిందూ మహమ్మదీయ సంఘర్షణలు సంభవించింది మొదలు, ఏటేటా వివిధ ప్రాంతాలలో హిందూ మహమ్మదీయ కలహాలు జగుతూనే వచ్చాయి. నేను కేంద్ర సభలో సభ్యుడుగా ఉంటూ కూడా, "స్వరాజ్య" పత్రికా నిర్వహణ చూసేవాడిని. ముల్తాన్ కొట్లాటలు లగాయితు దేశంలో ఎక్కడ ఏ మారుమూల కొట్లాటలు జరిగినా అక్కడికి హుటాహుటీ వెళ్ళేవాడిని. ముల్తాన్ సంఘటనలు జరిగి సంవత్సరం తిరగకుండానే షహజాన్‌పూరులో కొట్లాటలు చెలరేగి, తర్వాత మీరట్‌లోనూ, బెరిల్లీలోనూ జరిగిన కొట్లాటలు ఇతర ప్రాంతాలకు ప్రాకి, నాగపూరు, లాహోరు, కలకత్తాలలో కూడా సంఘర్షణలు జరిగాయి.
ముల్తాన్ కొట్లాటల నాటికి నేనింకా వర్కింగు కమిటీ మెంబరుగా ఉంటూ ఉండడాన్ని, ఇతర మెంబర్లతో కలసి ముల్తాను వెళ్ళానని లోగడ తెలిపి ఉన్నాను. మదనమోహన మాలవ్యా, హకీం అజ్మల్‌ఖాన్, అబ్దుల్ కలాం అజాద్, రాజేంద్రప్రసాద్, జమన్‌లాల్ బజాజ్, వల్లభ్‌భాయి పటేల్, సి. రాజగోపాలాచారిగార్లు, నేను కలిసే ముల్తాన్ వెళ్ళాము. అక్కడి సంగతులన్ని స్వయంగా విచారించి సంగతి సందర్భాలు సవ్యంగా గ్రహించాలనేదే మా ఉద్దేశం. స్వరాజ్య పత్రికా సంపాదకునిగా కూడా నాకు ఈ విషయాలు ఆమూలాగ్రంగా గ్రహించాలనే ఆదుర్దా ఉండేది. మాకు కనబడిన దృశ్యం చాలా బీభత్సంగానూ, భయోత్పాతంగానూ ఉంది. తగల బెట్టబడిన షాపులూ, హత్యలు జరిగిన తావులూ, కొల్లగొట్టబడిన ఆలయాలూ, విరగ్గొట్టబడిన విగ్రహాలూను. ఎక్కడ చూచినా ఇదే దృశ్యం. ముఖ్యంగా ఆరు అడుగుల ఎత్తూ, మూడడుగుల వెడల్పూ గలిగిన సుందర విగ్రహం ఒకటి రెండు ముక్కలుగా పడి ఉండడం ఇంకా, ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా, నాకళ్ళకు కట్టినట్ట్లే ఉంది. అందమయిన ఆడవారు తమకు జరిగిన అన్యాయాలను గురించి విన్నవించుకోడానికి మమ్మల్ని చుట్టుముట్టారు. వారు స్త్రీ జన సహజమయిన సిగ్గూ, లజ్జా వదలి బాహాటంగా కమిటీవారి ఎదుట తమకు జరిగిన అవమానాలూ, మానాపహరణాలూ చెప్పలేకపోయారు. పాపం, వారు ఆ పద్మాషుల చేతులలో ఎంతెంత బాధలు అనుభవించారో కదా! ఆ హృదయ విదారక విషయాలన్నీ స్వయంగా విన్నవారిలో ఒక్క మాలవ్యాగారు మాత్రమే నిగ్రహించుకో గలిగారు.
హిందూ వనితను కాపాడిన మహమ్మదీయ స్త్రీ
ఒక మహమ్మదీయ స్త్రీ సాక్ష్యాన్ని తీసుకోవడానికి మమ్మల్ని ఒక మహమ్మదీయుని ఇంటికి తీసుకు వెళ్ళారు. ఆమె పరదా వెనుక నుంచే సాక్ష్యం ఇచ్చింది. ఒక హిందూ యువతిని రౌడీలు ఎల్లా తరిమారో, ఆమె ఎల్లా ఎల్లా తప్పించుకుని తన యిల్లు జొచ్చి రక్షణ కోరిందో అన్నీ వివరించింది. ధైర్యం వహించి ఎల్లా తను ఆ అమ్మాయి లోపలికి ప్రవేశించిన వెంటనే గభాల్న తలుపులు బిగించి, గుండాల రాకను అరికట్ట గలిగిందీ వర్ణించింది. ఆ అమ్మాయిని బైటకు పంపించకపోతే వారు ఇల్లెక్కి పెంకులు ఊడదీసి అల్లరి పెడతాం అని యెంత బెదరించినా లొంగక ధైర్యంగా ఆ పిల్లకు రక్షణ యిచ్చింది. ఆమె చెపుతూన్న యీగాథ విన్న మా కమిటీ మెంబర్ల కందరకూ కళ్ళవెంబడి నీళ్ళు కారాయి. మేము ముల్తాను వదిలే లోపల మాకు విడిదిగా ఇవ్వబడిన ధర్మశాల అవ రణలోనే ఒక సభ యేర్పాటు జేశాం. స్త్రీల గోడంతా విన్న మాలవ్యాగారు సుదీర్ఘ ఉపన్యాసం చేశారు. ఆ ఉపన్యాస మధ్యలో ఆయన కళ్ళ వెంబడి ధారాపాతంగా నీళ్ళుకారాయి. హిందువులకు ప్రభుత్వంవారి చేతులలో రక్షణ కలగడం దుర్లభమనీ, మున్ముందు ప్రజలే జట్లు జట్లుగా ఏర్పడి ఆత్మరక్షణ చేసుకోవాలనీ సూచిస్తూ, హింసను హింసతోనే ఎదుర్కొని అయినా ఆత్మరక్షణ చేసుకోవాలనీ, బలవంతంగా మతం మార్చుకోవలసిన కుటుంబాలవారు "శుద్ధి" క్రియతో తిరిగీ హిందూ మతంలో పూర్వస్థానాలు పొంది, ఆయా కులలాకే చెందేలాగున చేయాలనీ ఉద్ఘాటించారు. అటువంటి పరిస్థితులలో ఆ ప్రకారంగా శుద్ధి అన్నది కాంగ్రెసువారి ప్రాపకంలో బలం చేకూర్చుకుంది.
సహజీవన సౌభాగ్యం
వార్తాపత్రికలలో ప్రచురించబడిన వార్తలనుబట్టి "రంజాం" పండుగ సందర్భంగా ఏర్పాటయిన ఉత్సవాలమీద రాళ్ళు పడడంతో యీ రగడంతా ఆరంభం అయినట్లు కనబడుతుంది. వార్తలలోని నిజానిజాలు గ్రహించాలనే తలంపుతో మున్ముందుగా యీ గలాటాకు పూర్వం హిందూ మహమ్మదీయ ప్రజల మధ్య సామరస్యం ఏ తీరున ఉంది అనే విషయం గ్రహించాలని తలచాము. పరిస్థితులు అనుకూలించినప్పుడు సేకరించిన సమాచారమంతా సమగ్రంగా నా "స్వరాజ్య" పత్రికలో ప్రచురిద్దాం అనే ఉద్దేశంతో వివరంగా తెలియవచ్చిన వార్తలూ, గ్రహించగలిగిన సత్యాలూ వ్రాసుకున్నాను. అచ్చట హిందూ మహమ్మదీయుల మధ్యమైత్రి చాలా మంచి స్థాయిలోనే ఉండేది అన్న గట్టి నమ్మకం మా కందరికీ కలిగింది.
ఒక మసీదుకూ, ప్రఖ్యాత ప్రహ్లాద దేవలయానికీ మధ్య సరిహద్దుగా ఒక మామూలు గోడ మాత్రమే ఉంధనీ, మసీదులోని ప్రార్థనలూ, ఆలయంలోని అర్చనలూ అంతరాయాలు లేకుండా యుగయుగాలుగా సాగుతూ వచ్చాయనీ గ్రహించాం. ప్రహ్లాదుని జన్మస్థానం ముల్తాన్. అచ్చటి ప్రహ్లాద ఆలయం చాలా పురాతన మయినదే. ఆ ఆలయం సరిహద్దులలోనే మసీదు నిర్మాణం కాకతాళీయంగా జరిగింది. ఆలయపు అర్చనలూ, మసీదు ప్రార్థనలూ ఎన్ని సంవత్సరాలనుంచో అవిచ్చిన్నంగా సాగుతున్నాయన్న విషయమై ద్వంద్వాభిప్రాయం లేదు. హిందూ మహమ్మదీయ సామరస్యం సవ్యంగానూ, ఆదర్శవంతంగానూ ఉండేదన్న విషయానికి ఇంతకన్నా ప్రబలమయిన సాక్ష్యం ఏముంటుంది?
ఎన్నికలు తెచ్చిన ముప్పు
ఈ సంగతి తెలుసుకున్నాక ఈ అల్లరులకు అసలు కారణాలు ఏమయి ఉంటాయా అని సుదీర్ఘంగా విచారణలు జరిపాం. సేకరించిన సమాచారంవల్ల పురపాలక సంఘపు ఎన్నికల కోలాహలమే ఈ తగాయిదాలకు మూలకారణమని తేలింది. అంతకు ఆరుమాసాలక్రితం జిల్లాబోర్డు ఉపాధ్యక్ష పదవికి కూడా ఎన్నికలు జరిగాయి. అక్కడి పురపాలక సంఘం చాలా పురాతన మయింది. అనేక సంవత్సరాలుగా అక్కడి "పీరు" కుటుంబంవారు పురపాలక సభ్యులపేర్లు సూచించడమూ, ప్రజలు వారినే ఎన్నుకోవడమూ ఆచారంగా ఉండేది. ఈ ఆచారానికి విరుద్ధంగా ముల్తాన్ కాంగ్రెసువారు "పీరు" అభ్యర్థికి ప్రత్యర్థిగా ఇంకొకరిని నిలబెట్టారు. అల్లా నిలబెట్టిన కాంగ్రెసు అభ్యర్థికి జయం చేకూరింది.
అంతకుముందు బోర్డు వైస్‌ప్రెసిడెంటు ఎన్నిక విషయంలోనూ అలాగే జరిగింది. ఆ రోజులలో సహకార నిరాకరణ ఉద్యమం ముమ్మరంగా సాగుతోంది. అప్పటికి ఇంకా గాంధీగార్ని నిర్బంధంలోకి తీసుకోలేదు. వీలు చిక్కితే దానిని అణగద్రొక్కుదామని కాంగ్రెసు వ్యతిరేకులు తలచేవారు.
వారు ఈ సంఘటనను సాకుగా తీసుకుని పీరు కుటుంబంవారికి పురెక్కించారు. గాంధీగారి హిందూ మహమ్మదీయ మైత్రి అన్న ప్రబోధం బూటకపు ప్రచారమనీ, అది మహమ్మదీయులను ఓడించి అణగద్రొక్కడానికే పుట్టినదనీ నమ్మబలికారు. అదే మొట్టమొదటి సంఘటన అవడంచేత కాంగ్రెసు వ్యతిరేకులు ఎంతగా బోధించినా పీరు కుటుంబంవారు పట్టించుకోలేదు. వారు వ్యాకులత చెందనమాట సత్యమే అయినా, ఆ వోటమి తమ కుటుంబ గౌరవాన్ని మట్టుపెట్టడానికి ఉద్దేశింప బడిందని మాత్రం విశ్వసించలేదు. కాగా తమ హోదా చెడిందనీ నమ్మలేదు.
ఆరుమాసాల అనంతరం వచ్చిన పురపాలక సంఘపు ఎన్నికలలో కూడా అదేరీతిని 'పీరు' కుటుంబీకులు నిర్ణయించిన అభ్యర్థికి పోటీగా కాంగ్రెసువారు ఇంకొకర్ని నిలబెట్టడమూ, 'పీరు' అభ్యర్థి ఓడిపోవడమూ జరిగేసరికి, 'పీరు' కుటుంబీకులకు అది తలవంపనే అభిప్రాయం బాగా నాటుకుంది. కాంగ్రెస్సును కూలద్రోయాలని వాంఛించే అధికార వర్గంవారు కూడా ఇదే మంచి అదను అని తలచి, ఆ 'పీరు' కుటుంబపు పెద్దలను కలసి, హిందూ మహమ్మదీయ మైత్రి అన్నది ఒక బురఖా అనీ, ఆ బురఖా క్రింద కాంగ్రెసువారు తమ పరువు తీస్తున్నారనీ, మహమ్మదీయులను శక్తిహీనుల్ని చేస్తున్నారనీ, నిజానికి కాంగ్రెసువారికి హిందూ మహమ్మదీయ మైత్రిపై విశ్వాసం లేదనీ బోదించారు.
ఈ ప్రకారంగా ఆ మహానగరంలో హిందూ మహమ్మదీయ కలహాలు తల ఎత్తడమూ, ఐకమత్య ప్రయత్నాలు అడుగంటడమూ సంభవించాయి. రంజాం ఊరేగింపు మీద రాళ్ళు రువ్వబడ్డాయన్న ఫిర్యాదులోని నిజానిజాలు ఎల్లా ఉన్నా, ఈ ముల్తాన్ కొట్లాటలు లోకలు బోర్డు మ్యునిసిపల్ ఎన్నికలలో తలయెత్తా యన్నది మాత్రం నిర్వివాదాంశం.
నిజంగా రాళ్ళు రువ్వడమే ఖాయం అయితే, ఆ గలాటా ఆప్రాంతంలోనే అంతమయ్యేదిగాని, ఒకేసారిగా వూరులోని అన్నిమూలలా అంటుకునేదికాదు. హిందువులను అవమానించడానికీ, ఆలయాలు కొల్లగొట్టి, విగ్రహాలు ధ్వంసం చేయడానికి వివిధప్రాంతాలలో ఏకకాలమందే చేరిన గుంపులూ, ఆ పనికోసం సేకరించి జాగ్రత్త చేసిన గునపాలూ, పలుగులూ వగైరాలు ఊరేగింపుమీద రాళ్ళు పడడం అన్నది వట్టిదని రుజువు చేస్తున్నాయి. ఈ కొట్లాటలు జరిగిన కొలది దినాలలోనే వెళ్ళి విచారణ సాగించిన మాకు మాత్రం, పట్నం మొత్తంమీద ఏకకాలంలో జరిగిన విధ్వంసకపు టేర్పాట్లన్నింటికీ మూల కారణం మ్యునిసిపల్ ఎన్నికలే అన్న దృఢవిశ్వాసం కలిగింది.
కాంగ్రెసు పరపతికి దెబ్బ
ఈ విచారణ ముగిశాక అక్కడే ఒక మీటింగు పెట్టుకుని, కులమతాలతో నిమిత్తం లేకుండా, బాధితుల తక్షణ సహాయార్థం పదివేల రూపాయలు మంజూరు చేశాం. అంతేకాదు, ఆ ధనాన్ని మౌలానా అబ్దుల్‌కలాం అజాదుగారికీ, పండిత మదనమోహనమాలవ్యా గారికీ అందజేయాలనిన్నీ తీర్మానించాం. మేము ముల్తాన్‌లో కొద్ది రోజులు ఉన్నా ఆ ధనం పై వారికి అందజెయ్య బడలేదు. అంతేకాదు, అప్పటికీ యిప్పటికీ కూడా ఆ డబ్బు బాధితులకొరకు లవలేశమూ వినియోగపడలేదు. జమన్‌లాల్ బజాజ్ కోశాధిపతి అయినా, కీలకం రాజగోపాలాచారిగారి చేతులలో ఇరుక్కుంది. 1923 లో నేను వర్కింగు కమిటీ సభ్యత్వం వదులుకునే పర్యంతం నాకూ, రాజగోపాలాచారి గారికీ ఉంటూ వచ్చిన సాన్నిహిత్యం పురస్కరించుకుని, నేను ఆ ధనాన్ని వెంటనే విడుదల చేయవలసిందని స్వయంగా కోరినప్పటికి, దానిని ఆయన మంజూరు చేయలేదు. దాస్-మోతిలాల్ గార్లకూ, గాంధీగారికీ మధ్య 1921 నాటి ఒప్పందాల విషయంలో ఏర్పడిన భేదాభిప్రాయాలను గురించి ఇదివరలోనే చెప్పిఉన్నాను. చిత్తరంజందాస్ గారితోపాటు మౌలానా అబ్దుల్‌కలాం అజాదుగారున్నూ జైలులో ఉన్నారు. మిత్రులు రాజగోపాలాచారిగారు ఎల్లాగయినా అజాదుగారిని నో చేంజర్ వర్గానికి త్రిప్పుకోవాలనే పట్టుదలతో, ఆ యత్నం కొనసాగేదాకా అజాదుగారి చేతికి ఆ డబ్బు యివ్వకూడదని బిగించుకు కూర్చున్నారు. ఆ ప్రయత్నం విఫలమయిన తర్వాతనయినా ఆ ధనం వినియోగపడుతుందని నేను వాంచించాను. కాని నా ఆశ నిరాశే అయింది. అ ప్రకారంగా బాధితుల కివ్వదలచిన ధనరూపక సహాయం పంపకందార్ల చేతులలో కయినా రాకుండానే ఆగిపోయింది. వర్కింగు కమిటీవారి తీర్మానం వమ్మయిపోయి మూలపడింది. నిజానికి మేము ఇవ్వగలిగిందీ, ఇవ్వదలచిందీ అతి స్వల్పమే అయినా, అదనుకి అ సొమ్ము పంపకంచేసి ఉండిఉంటే కాంగ్రెసు సదుద్దేశాన్ని రుజువుచేసి, కాంగ్రెసు గౌరవాన్ని కాపాడగలిగేవారం. ప్రజలలో కాంగ్రెసుపట్ల విశ్వాస గౌరవాలు వర్ధిల్లేవి. అవసరమయినప్పుడు ఆర్తులకు సేవచేయ గలగడం నిజంగా ఎన్నివిధాలో కాంగ్రెసు భావికి తోడ్పడేది. హిందూ మహమ్మదీయ మైత్రి దృడతరం అవడానికి ఉపన్యాసాల ద్వారానే గాక క్రియాత్మకంగా కూడా దోహదం చేసినట్టు అయేది. బహుశ:పండ్రెండు మాసాల అనంతరం షహజాన్‌పూరులో కొట్లాటలు జరగకుండా ఉండేవి. ఎప్పుడయితే ఇస్తామన్న ధనాన్ని పంచి పెట్టకలేకపోయామో, అప్పుడే నాయకుల గౌరవం మంటకలసింది.
పార్టీ విభేదాలు తెచ్చిపెట్టిన ముప్పు
ఇలాంటి పరిస్థితులలో నో ఛేంజ్, ప్రోఛేంజ్ పార్టీలవారు తమ హక్కుల గురించీ ఆదర్శాల విషయమై ఆర్భాటాలు చేస్తూ, కక్షలు పెంచుకుంటూ ఉండేవారన్నమాట!
ఈ రకమయిన అలజడులూ, ఎత్తు పై ఎత్తులూ లక్నో ఒడంబడిక జరిగిన నాటినుంచీ, అనగా 1916 నుంచీ, 1922 లో ముల్తాన్ కొట్లాటలు జరిగే పర్యంతమూ తలేత్తుతూనే ఉన్నాయి. ముల్తాన్ ఉదంతం యీ పై కారణాల వల్లనే అంత ఉద్ద్రుతంగా సాగిందని అనడానికి వీలులేకపోయినా, ఆ అలజడికి ఈ ఒడంబడికలు కారణాలు కావనిమాత్రం అనలేము.
ముల్తాన్ కొట్లాటలు జరిగిన తర్వాత, లక్నో ఒడంబడికలో మార్పులు చెయ్యాలనే వాదం ప్రబలమైంది. కాంగ్రెసు నాయకులలో పెచ్చు పెరిగిన అలసత, ముల్తాన్ ఉదంతమూ మహమ్మదీయులలో అసంతృప్తిని రేకెత్తించడానికీ, అవకాశవాదులు ఆందోళన చెయ్యడానికి తోడ్పడ్డాయి. ఆ రోజులలో అచ్చయి పంచిపెట్టబడిన సారస్వతం అంతా అవకాశవాదుల ఎత్తుగడలను రుజువు చేస్తుంది. ఒకవంక కాంగ్రెసును మట్టుబెట్టాలని ప్రభుత్వంవారు, ఇంకొకవంక హిందూ మహమ్మదీయ మైత్రి ప్రాతిపదికగా ప్రారంభింపబడిన సహకార నిరాకరణ ఉద్యమాన్ని తుదముట్టించాలని ఎదిరి పార్టీవారు యత్నాలు ముమ్మరంగా సాగిస్తూఉంటే, ఈ నోఛేంజ్-ప్రోఛేంజ్ కక్షలవారి కలహాలు అలనాటి 'నీరో' ఉదంతాన్ని స్ఫురణకు తెచ్చేవిగా ఉన్నాయి. రోమునగరం తగులబడిపోతూంటే, చీకూ చింతా లేకుండా నీరో ఫిడేలు వాయించుకుంటూ కూచున్నాడట!
పండ్రెండు మాసాల అనంతరం మళ్ళీ షహజాన్‌పూర్‌లో హిందూ-మహమ్మదీయ కలహాలు సంభవించాయని చెప్పిఉన్నాను. ఈ ఉదంతం వివరించేముందు, 'సింధు' ప్రాంతంలో మా పర్యటన విశేషాలు ఎరుక పరచడం అవసరం అనుకుంటాను. అవి ఆ సంఘటనలను సరిగా గ్రాహ్యం చేసుకోవడానికి తోడ్పడతాయని నా తలంపు.
సింధు పర్యటన ముచ్చటలు
నేనూ, శ్రీ విఠల్‌భాయ్ పటేల్‌గారూ, డా.చేత్రాం మున్నగు ప్రముఖులతో కలసి యేఒక్క ముఖ్యప్రాంతాన్ని వదలకుండా యావత్తు సింధు రాష్ట్రాన్నీ చుట్టివచ్చాం. లోలోపల చిల్లర తగాయిదాలుంటూ ఉన్నా, ఖాదీ మాత్రం సింధు పంజాబు ప్రాంతాలలో బాగా నాటుకుంది. దక్షిణ పంజాబు ప్రాంతాలలోనూ, సింధు రాష్ట్రంలోనూ ఉన్న ప్రతి 'ఖాదీ' భాండారాన్ని పరిశీలించాం. ఖాదీ ఉద్యమం 1921-22 సంవత్సరాలలో దేశం మొత్తం మీద చాలా ఉన్నత స్థాయినే అందుకుంది. పంజాబు ఖద్దరు సున్నితానికీ, మన్నికకూ మాత్రమేగాక పలు రంగులలో చూడ ముచ్చటగా తయారుచేయబడుతోంది. యావత్తు సింధు రాష్ట్రంలోనూ ఖాదీ మంచి ఉన్నత స్థాయిలోనే ఉంది.
మేము పర్యటించిన కరాచీ, నక్కరు, హైదరాబాదు (సింధు) మున్నగు ముఖ్య నగరాలలో హైందవ నారీమణుల జీవితాలు ఎంత దుర్భరంగా ఉన్నాయో మున్ముందుగా బైటపడింది. రాష్ట్రం మొత్తం మీద మహమ్మదీయులే జాస్తి హిందువులు అత్యల్ప సంఖ్యాకులుగా దుర్భర జీవితం సాగిస్తున్నారు. హిందూ యువతులను అపహరించడ మన్నది మహమ్మదీయులకు వెన్నతోబెట్టిన విద్య అయింది. బ్రిటిషు రాజ్యాంగం వారు ఆ స్వల్ప విస్తీర్ణంగల సింధు ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా రూపొందించడం అన్నది నిజానికి అనుచితకార్యం. అది బొంబాయి రాష్ట్రంలో కలసి ఉన్నంతకాలమూ, హిందువులు ఆ ప్రాంతంలో అల్పసంఖ్యాకులే అయినా, వారికి అసంతృప్తులూ, బాధలూ అన్నవి అట్టే ఉండేవికావు.
మేము సింధులో ఉండగా అబ్దుల్లా హరూన్‌గారిని కలుసుకున్నాము. ఇప్పటిలా అప్పట్లో వారికి మతోన్మాదం లేదనే అనాలి. పరస్పరం అభిప్రాయాలు వెలిబుచ్చుకోడానికి మా సన్నివేశాలు ఎంతగానో ఉపకరించేవి. రాష్ట్రం మొత్తంమీద ఎక్కడకు మేము వెళ్ళినా మాకు హృదయపూర్వక స్వాగతాలే లభించేవి.
చేపలతో చెలికారం
మాకు ఒక నది ఒడ్డున నీటిని ఒరుసుకుని ఉన్న బంగాళాలో మకాం యిచ్చారు. ఆ నదీ తీరంలో ఒక అపురూప దృశ్యం మా కంట బడింది. నదిలోని చిన్న పెద్ద చేపలన్నీ మా చేతులలో ఉండే ఆహారాన్ని గ్రహించాయి. ఆ చేపలకి చాలా కాలంగా ఈ అలవా టుందిట!నదీ తీరానికేమిటి, ఒడ్డుమీదకు కూడా కొంతదూరం వచ్చి గబుక్కుని ఆహారాన్ని అందుకుని నీటిలోకి పోయేవి. కంటితో చూచిందాకా నమ్మడానికి వీలులేని దృశ్యం అది. ఆ ప్రాంతీయులు అంత అహింసాత్మకంగా ఆ చేపలతో సహజీవనం సాగించేవారని అన్నా అందులో ఈషణ్మాత్రమూ అసత్యం ఉండదు.
ప్రభుత్వంవారు అణగ ద్రొక్కాలనుకున్నా, నాయకులను జైళ్ళపాలు జేసినా కాంగ్రెసు గౌరవం మకుటాయమానంగా ఉంటూన్న రోజులవి. అందువలన మేము రాష్ట్రం అంతా తిరిగి హిందూ మహమ్మదీయ మైత్రి వలని లాభాలను గురించి ఉపన్యాసలిచ్చాం. హృదయ విదారకమయిన ముల్తాన్ ఉదంతాలు రేపిన హృదయ తాపం చల్లారకుండానే మాకు అ ప్రాంతాలన్ని తిరగ గలిగిన అవకాశం చిక్కింది. ఆ ప్రాంతాలన్నీ అధిక సంఖ్యాకులయిన మహమ్మదీయుల ఆధిపత్యంలోవే. అలాంటి విషమ పరిస్థితులలో ఆ ప్రాంతాలలో హిందూ మహమ్మదీయ మైత్రిని గురించి ఉపన్యాసా లివ్వగలిగాం అంటే , అవకాశవాదులు రెచ్చకొట్టకుండా ఉండి ఉంటే హిందూ మహమ్మదీయ విభేదాలకీ, కొట్లాటలకూ తావు లేదనే అనవలసి వస్తుంది. చేజిక్కిన అవకాశాన్ని చిక్కబట్టుకుని, కాంగ్రెసు నాయకులే గనుక, ధనాన్ని పోగుజేసి బీదసాదలకూ బాధితులకూ పంచి పెట్టడానికి-ఒక్క పంజాబులోనే అన్నమాటేమిటి, ఇటు బెంగాలులోనూ, మహమ్మదీయులు ఉద్దతంగా ఉన్న యు.పి. మున్నగు రాష్ట్రాలలోనూ కూడా- అవసరమయిన ఏర్పాట్లుచేసి ఉద్యమాన్ని సక్రమంగా నడపగలిగి ఉంటే, హిందూ మహమ్మదీయ విభేదాల్ని మొగ్గ తొడక్కుండానే తుంచేసేవారం. ముల్తాన్ దుస్సంఘటనల కారణంగా, ఎన్నోప్రాంతాలు పర్యటించి, అక్కడి పరస్థితులు పరిశీలించి, సాధక బాధకాలను గ్రహించి ఒక బరువైన హృదయంతో మేము ఇండ్లకు చేరాం. గయా కాంగ్రెసు సమీపిస్తూన్న కొద్దీ, తమ తమ పక్షాలకే ప్రాముఖ్యం రావాలనే అత్రుతతో, నోఛేంజ్, ప్రోఛేంజ్ పార్టీలవారు తంటాలు పడుతూన్న రోజులవి. వీటిని గురించీ, గయా కాంగ్రెసు అంతర్నాటకాలను గురించీ లోగడ సుదీర్ఘంగా తెలియపరచే ఉన్నాను.
అవకాశవాదులు రేపిన అల్లర్లు
షహజాన్‌పూర్ కొట్లాటలను గురించి కాస్త విపులంగా యోచిద్దాం. వీనికి ముఖ్యకారణం లక్నో ఒడంబడికలకు మించిన, సదుపాయాలు తమకు కావలంటూ కొందరు మహమ్మదీయ నాయకులు లేవదీసిన ప్రచారమే. హిందువులు స్వతస్సిద్దంగా పిరికివారనీ, తాము గనుక అల్లర్లు లేవదీస్తే ఇతోధికంగా తమ కోర్కెల్ని మన్నించి తీరకయేం జేయగలరన్నదే అ మహమ్మదీయ నాయకుల విశ్వాసం. ముల్తాన్ ఉదంతం జరిగిన తర్వాత పంజాబులో సుహృద్భావం వృద్ధిగావడానికి కాంగ్రెసు వారు తగు చర్యలు తీసుకోలేదు గదా! అందువలన అ రెండు మతాలవారి మధ్యా పొగ రాజెయ్యడానికి, దుష్టశక్తుల్ని రేపడానికీ ఇదే అదనని అవకాశవాదులు తలచారు. ముల్తాన్ సంఘటనల తరవాత, కాంగ్రెసువారి స్తబ్దతవల్లనే, మళ్ళీ షహజాన్‌పూర్ అల్లర్లూ, కలతలూ తలయెత్తాయని చేప్పాలి.
షహజాన్‌పూరు సంఘటనలకు ఆర్థిక కారణాలే మిక్కుటం. ఆహార వస్తువుల ధరలు అధికారులు అదుపులో పెట్టకపోవడమే యీ చికాకులకు ముఖ్య కారణం అనక తప్పదు. అంతేకాదు, అల్పసంఖ్యాకులయిన హిందువుల చేతులలోనే విస్తారంగా ఈ వ్యాపారాలు ఉండడమూ, ధరల కంట్రోళ్ళన్నీ ఆ హిందువుల చేతులలోనే ఉండడమూ బలవత్తర కారణాలయ్యాయి. ధరలు తగ్గించడానికి హిందూ వర్తకులు ఎంత మాత్రం ఒప్పుకోలేదు. దాన్తో అక్కడా అక్కడా లూటీలు, దోపిడీలు ఆరంభం అయ్యాయి. కొంపలు కూడా కొన్ని కొన్ని ప్రాంతాలలో తగల పెట్టబడ్డాయి. ఇటుక, సిమెంటు, రాతి గోడల మధ్య భద్రపరచబడిన పెద్ద పెద్ద ఇనుప పెట్టలే వూరివెలపలకు, మూడు నాలుగు మైళ్ళ దూరాన వున్న మారు మూలలకు తరలింపబడి పగల గొట్టబడ్డాయి.
ఒక విధంగా, లక్నో ఒప్పందాలు పున:పరిశీలన చెయ్యాలి, మహమ్మదీయులకు ఇతోధికంగా హక్కులూ, అధికారాలూ, ఆర్థికసౌకర్యాలూ కలుగ జెయ్యాలి అన్న ప్రచారమే యీ కలతలకు మూల కారణం అన్నది నిర్వివాదాంశం, లక్నో ఒడంబడిక లోప భూయిష్ఠమనే మాట ప్రతి మహమ్మదీయుని నోట ఉండే దన్నమాట! నిజానికి 1916లో జరిగిన యీ ఒడంబడిక తర్వాత రేగిన దుమారాన్ని కాంగ్రెసువారూ, సహకార నిరోధక వర్గాలవారూ, స్వరాజ్య పార్టీవారూ గమనించి అవసర చర్యలు తీసుకుని ఉండి ఉంటే, ఇంత అసహనం, గందరగోళం, రక్తపాతం వగైరా ఉండేవి కావు. ఇది యేదో ఒక రోజున, ఒక నెలలో, ఒక సంవత్సరంలో తలయెత్తిన తగవులాట కాదు. ఆ లక్నో ఒడంబడిక మూలంగా లాభాలు పొంది, ఉద్యోగాదులలో పై మెట్లు ఎక్క గలిగిన ఆ జనానికి ఆశ యెక్కువయి, ఇంకా సంక్షోభాలు తీసుకు రాగలిగితే తమకు ఇంకా లాభాలూ, క్షేమాలూ దక్కుతాయనే ఉద్దేశంతో ఈ గలాటాల వెనుక ఉండి ఉద్రేకాలు రెచ్చగొట్టి నాటక మాడారని తెలియ వచ్చింది.
బ్రిటిషువారు చేసిన తీరని ద్రోహం
ఈ లక్నో ఒడంబడిక ఆధారంగా కాంగ్రెసూ, ముస్లిం లీగూ కలిపి తయారు చేసిన స్వపరిపాలన ప్రణాళికే 1918 లో మాంటేగ్-ఛెల్మ్‌స్ఫర్డ్‌గార్లకు అందజేయబడ్డాయి. కాని అప్పట్లో ఆ సూచనలు తిరస్కరించబడ్డాయి. ఈ ఉమ్మడి ప్రతిపాదనలో జిన్నాగారి చెయ్యి కూడా ఉంది. ఈ ప్రతిపాదనలకు మాంటేగ్ త్రోసిపుచ్చిన కారణంగా లక్నో ఒప్పందాలు రద్దయి పోయాయనే సాకుతో, ఆ ఒడంబడిక సవ్య మయింది కాదు, అందులో మహమ్మదీయులకు ఉపకరించే షరతులు లేవనే ఆందోళన లేవతీయబడింది. సరళమైన సూటి మార్గాన్నే అవలంబించాలనే కొత్త నాయకుల విధానం పై విషయాన్ని అంతగా పట్టించుకోలేదు. పైగా వారికి ఈ మితవాదుల ప్రాధేయ పూర్వక యాచనా విధానమూ నచ్చలేదు. ఇలాంటి పరిస్థితిలో, 1918లో, కాంగ్రెసు మితవాదుల చేతులనుండి అతివాదుల చేతులలోకి మారింది.
నిజంగా మాంటేగ్-ఛెల్మ్‌స్‌స్ఫర్డ్‌గారలు 1918లో ఆ ప్రతిపాదనలను అంగీకరించి, ఒక నూతన ప్రణాళికను రూపొందించి ఉంటే, ఈ దేశంలో ద్వంద్వ పరిపాలనకి స్థానం ఉండేది కాదు. హిందూ మహమ్మదీయ కలహాలూ చెలరేగేవి కావు. అంతేకాదు, అటుపిమ్మట సుమారు పాతిక సంవత్సరాలపాటు నడచిన హిందూ మహమ్మదీయ సంఘర్షణలలో ఏ పాపమూ ఎరగని నిరపరాధుల రక్తం ప్రవహించి ఉండేదికాదు. ఉభయవర్గాల వారూ సమర్పించిన ఆ ప్రతిపాదనలను 1917 నవంబరు మాసంలో మాంటేగ్ బృందం త్రోసిపుచ్చారు.
అవి భారతీయ రాజకీయాలలో గాంధీగారు తలదూరుస్తూన్న రోజులు. ఆయన కూడా ఎలాగయినా మాంటేగ్ ప్రభృతులచేతా, బ్రిటిషుగవర్నమెంటు వారిచేతా ఈ ప్రతిపాదనలను అంగీకరింప జేయాలని చాలా తంటాలుపడ్డారు. ఆయన ఈ కాంగ్రెస్-లీగ్ ప్రతి పాదనలను దేశభాషలలోకి తర్జుమా చేయించి, ఆ విన్నపంమీద లక్షకుపైగా సంతకాలు సేకరించి, 1917 లో జరిగిన కలకత్తా కాంగ్రెసు నాటికే ప్రభుత్వం వారికి అందజేశాడు.
నాటినుంచి నేటివరకూ హిందువులకూ మహమ్మదీయులకూ సామరస్యం కుదరలేదంటూనే కాలయాపనచేస్తూ వస్తూన్న యీ బ్రిటిషు వారు ఆనాడు ఆప్రణాళికను త్రోసిపుచ్చి, మనకూ మనదేశానికి తీరని ద్రోహాన్ని చేశారు. పైగా వారు ఏ నోటితో భారతీయులు సంపూర్ణ స్వరాజ్యానికి అనర్హులని చెపుతున్నారో అర్థం కాదు. నిజానికి ఆ ప్రణాళికను అంగీకరించని కారణంగా ఈనాటివరకూ దేశంలో చెలరేగిన హిందూ మహమ్మదీయ కలహాలకు బాధ్యులు వారే. వారి మూలం గానే యీ చికాకులన్నీ దేశంలో ప్రబలుతున్నాయని వారిపై నేరారోపణ చేయడం సమంజసం. కాంగ్రెసును చేపట్టిన నూతన వర్గీయులు కూడా ఈ పరిస్థితులకు కొంతవరకూ బాధ్యులు. వారు సత్వర చర్యలు తీసుకుని, అవసరమయిన ప్రబోదాలూ, ప్రచారం చేస్తూ బాధితులకు ఆర్థికాది సహాయాలు చేసి వుండివుంటే పరిస్థితులు చక్కబడే ఉండేవి. అటు ప్రభుత్వంవారూ, ఇటు కాంగ్రెసువారూ కూడా స్వలాభాపేక్షతోనూ, అలసవల్లనూ అవసర చర్యలను తీసుకోకపోడంచేత దేశంలో దుష్టశక్తులు వీరవిహారం చేశాయి. కలహాలు రెచ్చగొట్టగల పుణ్యాత్ములు ముందుకు రాగలిగారు.
మాలవ్యాజీ మనస్తాపం
1922 ముల్తాన్ కొట్లాటలనాటి హిందూ మహమ్మదీయ మత వర్గాల వారి మనోబావాలకీ, షహజాన్‌పూరులో 1923లో జరిగిన కలహాల నాటి వారి మనోభావాలకీ వున్న తేడాపాడాలు విలియా వేసుకోవడం ఇప్పట్టున న్యాయం. ముల్తాన్ కొట్లాటల నాటి నిరాశా, షహజాన్‌పూర్ కలహాల నాటి నిస్సహాయతా గ్రహించిన మాలవ్యా మహాశయుడు ఆత్మరక్షణ కోసమూ, దేశభద్రతకోసమూ ప్రాయచ్ఛిత్తాలూ, శుద్ధులూ, పుణ్యాహవచనాలూ, హోమాలులాంటివి జరిపించి, ఆత్మ రక్షణకోసం బలవంతంగా మతాలు మారవలసివచ్చిన హిందువులు తిరిగి తమ మతంలో, సంఘంలో, పూర్వకులంలో ప్రవేశించడానికి సావకాశం కల్పించాలన్నాడు. మాలవ్యాలాంటి సదాచార సంపన్నుడూ, సనాతనుడూ కూడా హఠాత్తుగా హిందూమతంలోకి పున:ప్రవేశానికి అవకాశం కల్పించాలని అన్నాడంటే, ఆ నాటి అమానుష పరిస్థితులకి ఆయన ఎంతగా పరితపించాడో అర్థం అవుతుంది. అంతే కాదు. ఆయన నిగూడంగా అహింసా సిద్దాంతాల మతలబును విస్తరించి విశదపరచాడంటే, అందులో ఆ సిద్ధాంతాలను ప్రబోధించిన గాంధీగారు జైలులో ఉన్న రోజులలో తాను వాటిని పరిస్థితుల కనుగుణంగా వ్యాఖ్యానించబూని, అహింస అంటే హింసను సహించడం మాత్రమేకాదనీ, ఎదుర్కోవడంవల్ల సిద్దాంతభంగం కాదనీ హితవు చెప్పాడంటే, ఆ నాటి కల్లోలాలు ఆయన పవిత్ర హృదయాన్ని ఎంత కల్లోలపరచాయో అర్థం అవుతుంది. ఆనాడు మాలవ్యా మహాశయుడు ఇచ్చిన సలహా యావత్తు భారతదేశంలోని హిందువులకూ ఎంతో మనోధైర్యాన్ని ఇచ్చింది.
నిజానికి "శుద్ధి", "సంగతం" అన్నవి మాత్రమే ఉంటే సంఘ సుఖజీవనానికి చాలదు. తిండీ, గుడ్డా అన్నవి కూడా, మతంతో నిమిత్తం లేకుండా, హిందూ మహమ్మదీయాదుల కందరికీ సమంగా కావలసిన అత్యవసర వస్తుసముదాయమే కదా! వీటిని లభింపజేయడానికి నిర్మాణాత్మక కృషి, ప్రచారమూ అత్యవసరం. సహనం, పరస్పర సహకారం మొదలైన వాటితో కూడిన నిర్మాణాత్మక కృషి జరగక పోవడంచేత సంఘజీవనం కుంటుపడిందన్నది సత్యదూరం కాదు. అసలు ముల్తాన్ కలతలు ప్రజల సుఖజీవనాన్నీ మనోభావాలనీ చికాకుపరచి వారిని నికృష్టజీవనానికి దిగజార్చిన స్థితి గమనార్హమే కదా!
మేకవన్నె పులులు
మతసామరస్యానికి కావలసిన సత్వర చర్యలను విస్మరించి మాలవ్యా మహాశయుడు "శుద్ది" "సంగతం" అంటూ వాపోతూఉంటే, వీలు చిక్కినప్పుడల్లా దెబ్బతీయాలనీ, కల్లోలాలు లేవదీసి హింసా కాండ సాగించాలనీ మహమ్మదీయుల బుర్రలకి బాగా పట్టిపోయింది. ఇంకా తమాషా యేమిటంటే, అలాంటి హింసాభావాల్ని పెంపొందించుకున్న వారిలో కొందరి భుజాలమీద అహింసా చిహ్నం కొట్టొచ్చినట్లు కనబడుతూ వచ్చింది. కాగా అటువంటి వారంతా కాంగ్రెసు యూనిఫారంలో తిరుగుతూన్న ప్రబుద్ధులే! ఈ విషయం, షహజాన్‌పూర్ ఉదంతాల అనంతరం అక్కడి పరిస్థితులను పరిశీలించి కారణాలను గ్రహిద్దాం అని మేము ఆ ప్రాంతంలో పర్యటిస్తూన్న సందర్భంలో బయల్పడింది. కాంగ్రెసు స్వయం సేవక సంఘం తాలూకు వాలంటీర్లూ, కాంగ్రెసు యూనిఫారంలో నడయాడుతూన్న మహమ్మదీయ స్వయంసేవకులూ, కత్తిసామూ, కర్రసామూ వగైరాలలో తర్పీదు పొందుతున్నారన్న విషయం అప్పుడు రుజువయింది. ఈ విషయం మనస్సులో ఉంచుకుంటే పాఠకలోకానికి అనాటి హిందూ, మహమ్మదీయ మస్తిష్కాలలో ఎటువంటి ఊహలు కలిగేవో, 1923 నాటి షహజాన్‌పూర్ సంఘటనలు ఎలా సంభవించాయో అన్నీ బాగా అర్దం అవుతాయి.
మీరట్ సంక్షోభం
మూడవ దఫా సంభవించిన హిందూ మహమ్మదీయ సంక్షోభం మీరట్‌లో. అప్పట్లో అక్కడ పేరూ, పలుకుబడి ఉన్న రాజకీయనాయకులలో నా మిత్రులయిన బారిష్టర్లు కొందరున్నారు. అక్కడ ఆ కొట్లాట జరిగిన మరుక్షణమే నేను అక్కడికి వెళ్ళాను. కాని ఉభయ పక్షాల నాయకుల ఆవేశాలు బాగా పెరిగిపోయి ఉండడం చేత అప్పటి కప్పుడే నిష్కపటంగానూ, ధారాళంగానూ, స్వేచ్చగానూ, మా మనోభావాలను మరుగుపరచకుండా వారితో చర్చించగల అవకాశం మృగ్యమయిందనే అనవలసి ఉంది. చర్చించాం, బాగా లోతుగానే తర్జనభర్జనలు సాగించాం. కాని ఎంతసేపూ అవతలివారిదే దోషము అనే ధోరణిలోనే నడిచింది వారితో చర్చ. మీ వల్లనే కొంప లంటుకున్నా యని హిందువులంటే, మీ వల్లనే సర్వనాశన పరిస్థితి ఏర్పడిందని మహమ్మదీయులన్నారన్నమాట! లోగడ నేను మొదటి రెండు కొట్లాటలకూ ప్రధానమయిన కారణాలను వివరించే ఉన్నాను. నేను కార్యనిర్వాహక సంఘ సభ్యుడ నయ్యుండీ కూడా, మంజూరయిన ధానాన్ని ఏ కారణాలవల్ల ఆత్మార్పాణ జేసిన ఆ బాధితులకు అందచేయలేకపోయానో కూడా వివరించే ఉన్నాను. ఏటేటా ప్రో ఛేంజ్-నో ఛేంజ్ తెగల మధ్య రగులుతున్న మంటలు రాజుకుంటూనే ఉన్నాయనీ చెప్పే ఉన్నాను. ఈ నోఛేంజ్, ప్రో ఛేంజ్ పార్టీలతో విసిగిపోయిన డాక్టర్ అన్సారీ, సరోజనీదేవీ, నేనూ కొంతమంది ఇతర మిత్రులతో కలసి "సెంటర్‌పార్టీ" అనే మధ్యమ వర్గ సంఘాన్ని స్థాపించాం. మా ఉద్దేశం పై రెండు కక్షల వారినీ సన్నిహితులను జేసి, వారి మధ్య సామరస్యం కుదర్చాలనే. ఈ మధ్యే మార్గపు మనిషిగా నేను ఎక్కడయినా హిందూ మహమ్మదీయ కలహం జరిగిందని తెలసిన తక్షణం ఆ తావుకు వెళ్ళి సంగతి సందర్భాలు విచారించే వాడిని.
కొట్లాటలపై కొట్లాటలు
సొంత జేబులోంచి ఖర్చుపెట్టుకుంటూ ఏటేటా ఈ అల్లర్లు జరిగిన తావులన్నీ సందర్శిస్తూ వచ్చాను. ఇక్కడ 1924-27 సంవత్సరాల మధ్య జరిగిన అల్లర్లులను గురించి ప్రస్తావిస్తాను. 1925 మే మాసంలో కలకత్తాలోను, 1925-27 సంవత్సరాలలో బొంబాయిలోను అల్లర్లు జరిగాయి.
బహుశ: 1927 ఈ సంక్షోభాలకు చాలా చెడ్డ సంవత్సరం అని అనవలసి ఉంటుంది. 1927 ఆగష్టు 29 వ తేదీన లార్డ్ ఇర్విన్ కేంద్ర శాసన సభలో సభ్యుల కందించిన సమాచారాన్నిబట్టి, ఉత్తర ప్రదేశ్, బొంబాయి, పంజాబు, మధ్యప్రదేశ్, బీహారు, బెంగాలు రాష్ట్రాలలోనూ, డిల్లీలోనూ జరిగిన కొట్లాటలు మొత్తం 26 అనీ, అవి ఆగష్టు 25 నాటికి గత 18 మాసాల లోపలనే జరిగినవనీ తెలియవచ్చింది. పంజాబులో రెండు, ఢిల్లీలో రెండు, బెంగాలులో రెండు, ఉత్తర ప్రదేశ్‌లో పది, మధ్యప్రదేశ్ లో రెండు, బీహారులో రెండు, బొంబా యిలో ఆరు కొట్లాటలు జరిగాయి. ఈకొట్లాటలలో నిహతులయిన వారి సంఖ్య 250; క్షతగాత్రులు 2500 మంది.
ఇంచు మించుగా కలతలురేగి, అల్లర్లు జరిగిన అన్నిప్రాంతాలకూ నేను వెళ్ళాను. ఎటొచ్చీ ఆ వూరి అల్లరికీ, ఈ వూరి అల్లరికీ మధ్య వ్యవధిలేని సందర్భాలలో ఒకొక్క ఊరు వదలి వెయ్యవలసి వచ్చింది. నేను అల్లర్లు జరిగిన వెనువెంటనే వెళ్ళి, సంగతి సందర్భాలు విచారించి, ఇరుపక్షాలవారివద్దా సంజాయిషీ, సేకరించి, జరిగిన సంగతులన్నీ సకారణంగా నోటు చేసుకునేవాణ్ణి. చాలా ఘోరంగా జరిగిన నాగపూరు కొట్లాటల సంగతి విని అక్కడికి వెళ్ళాను. నాగపూరులోనూ, లాహోరు కొట్లాటల్లోనూ కూడా చాలామంది చంపబడ్డారు. పెక్కుమందికి గాయాలు తగిలాయి. ప్రతీ ప్రాంతంలోనూ శాంతిని నెలకొల్పి, మత సామరస్యాన్ని పునరుద్ధించడానికై శాంతి సంఘాలు స్థాపింపబడ్డాయి.
ఐకమత్య సూచనలు
కలకత్తా ఘోరాలు
అంతవరకూ జరిగిన కొట్లాటల కంటే కలకత్తా సంక్షోభమే చాలా ఘోరంగా పరిణమించింది. తాము దానిని అణచగలమనే విశ్వాసంతో మహాత్మా గాంధీగారు, సేన్ గుప్తాగారితో కలిసి ఆ ప్రాంతానికి హడావిడిగా వెళ్ళారు, కాని అక్కడి పరిస్థితులు ఏనాడో చెయ్యి దాటిపోయి అదుపులో ఉంచడానికి వీలులేని పరిస్థితికి దిగజారిపోయాయనీ, ఈ పరిస్థితులు ఇల్లాగే ఇంకా కొంతకాలం సాగితే ఇరు వైపులా వేలాది జనం నిహతు లవుతారనీ, బహుశ: అప్పటికిగాని వారు కళ్ళు తెరవరనీ వాపోతూ, తన నిస్సహాయ స్థితిని గాంధీగారు ఒప్పుకున్నారు. అ తర్వాత వారు-ఒక పనికి మాలిన హింసాకాండలో ఇరుక్కుని, అనవసర రక్తపాతానికి కారకుల మయ్యామన్న సంగతి గ్రహించారు. ఇది 1924 లో గాంధీగారి విడుదల అయిన తర్వాత రెండేళ్ళకు జరిగిన సంఘటన.