నా జీవిత యాత్ర-2/గాంధీగారి విడుదల జూహూ సంప్రదింపులు

12

గాంధీగారి విడుదల:జూహూ సంప్రతింపులు

ఆ రోజులలోనే గాంధీగార్ని ఆపరేషన్ నిమిత్తం యరవాడ జైలునుంచి "సెసూన్" హాస్పిటలుకు మార్చారు. దరిమిలా విడుదల చేశారు. ఆయన విడుదలై జైలునుంచి బయటికివచ్చి పరిస్థితులను విలియా వేసుకునే దాకా అవి ఎల్లాంటి పరిణామాలను పొంది ఎల్లా ఎల్లా మారాయో అన్న సంగతి అర్థం కాలేదు. తన సన్నిహిత అనుచరులూ, దేశ సేవకులూ ఎల్లా వ్యవహరించి ఆయన తలపెట్టిన విధానాలకు ఎటువంటి విఘాతాలు తీసుకు వచ్చారో అప్పటికిగాని ఆయనకు అర్థం కాలేదు. విడుదల అయ్యాక విశ్రాంతి కోసం, బొంబాయికి సమీపాన ఉన్న జూహూ సముద్ర తీరాన కొంతకాలం ఉండమని ఆయనకు డాక్టర్లు సలహా యిచ్చారు.

గాంధీగారు జూహూ మకాంలో ఉండగానే, ఆ విశ్రాంతి రోజులలోనే అనేకులతో సంప్రతింపులు జరిపారు. అ సంప్రతింపులన్నీ "జూహూ సంప్రతింపు"లనే పేరుతో ఒక అధ్యాయాన్నే రూపొందించాయి. గాంధీగారు తన కార్యక్రమానికి అనుగుణంగా తనచే ప్రతిపాదింపబడిన బహిష్కరణ విధానాల నన్నింటినీ పునరుద్దరించమన్నారు. కాని, దాస్-మోతిలాల్‌గారలు దానికి వ్యతిరేకించారు. ఆ ఇరుపక్షాల మధ్యా నడచిన ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ "జూహూ విభేదా"లన్న పేరున ప్రచురింపబడ్డాయి.

బెల్గాం కాంగ్రెసు అధ్యక్షత

ఆ తర్వాత అహమ్మదాబాదులో అఖిల భారత కాంగ్రెసు కమిటీ మీటింగు జరిగింది.[1]ఆ మీటింగులో గాంధీగారి స్థానం తిరిగి ప్రతిష్ఠ చేయబడింది. ఆ సంవత్సరంలో బెల్గాంలో జరుపదలచిన కాంగ్రెసుకు గాంధీగారిని అధ్యక్షత వహించ వలసిందని అనుచరులందరూ కోరి ఒప్పించారు. కాని ఆయన ఆ కాంగ్రెసు అధ్యక్ష పదవి అంగీకరించకుండా ఉండవలసింది. ఆయన శక్తి సామర్థ్యాలు కాంగ్రెసు ప్రెసిడెంటు పదవి నలంకరించనంత మాత్రము చేత తరిగిపోయేవి కాదు. ఆయన్ని కాంగ్రెసు అధ్యక్ష పదవికీ అంగీకరించమని, ఎవరెవరు ప్రోత్సహించారో, ఏ ఉద్దేశంతో ప్రోత్సహించారో నాకు తెలియదు. గాంధీగారితో ఆనాడుగాని, ఈనాడుగాని త్రివిధ బహిష్కార విధాన తాత్కాలిక విరమణకు కారకులు ఆనాడు వర్కింగు కమిటీలో నున్న ఆయన ముఖ్య అనుచరులయిన నమ్మినబంట్లే నన్న సంగతి ఎవరయినా చెప్పారో లేదో నాకు తెలియదు. "కౌన్సిల్ యెంట్రీ" విధానంలో దరిమిలా జరిగిన అల్లకల్లోలాలన్నీ ఆయన చెవిని పడ్డాయో లేదో నాకు తెలియదు. బహుశ:ఆయన ఆ క్షణంలో మనో దౌర్బల్యంవల్ల అనాలోచితంగా కాంగ్రెసు అధ్యక్ష పదవిని అంగీకరించి ఉంటారు. దరిమిలా 1931 లో కూడా ఆయన అటువంటి అనాలోచిత కార్యానికే అంగీకరించారు. రెండవ రౌండ్ టేబిల్ సమావేశానికి వెళ్ళడానికి ఒప్పు కోవడమే ఆ 31 నాటి అవివేక కార్యం అని నా ఊహ.

స్వరాజ్యవాదులకు కాంగ్రెసు అప్పగింత

గాంధీగారికి వ్యతిరేకంగా పనిచేసే శక్తులు ఎంత మాత్రంగా ఉన్నాయో గ్రహించి, వాటిని ప్రోత్సహించి తమ వైపు త్రిప్పుకోవాలనే ఉద్దేశంతో దాస్-మోతిలాల్‌గారలు బెల్గాం కాంగ్రెసుకు హాజరవుతూన్న ప్రతినిధుల నందరినీ పలకరించి చూశారు. నిజమే. గాంధీగారు నిర్భంధంలో ఉన్న ఆ రెండు సంవత్సరాలలోనూ దేశంలో ఏర్పడిన చీలికలు, కలిగిన పరిణామాలూ, నాయకుల మధ్య నడచిన వాదోప వాదాలూ, పరిస్థితుల మార్పులూ మొదలయినవన్నీ దేశీయులలో మానసిక ఆందోళన కలిగించాయన్న సంగతి నిశ్చయమే. అనుమానం యెంత మాత్రం లేదు. కాని గాంధీగారు స్వయంగా హాజరయిన ఏ సభలోనూ, ఎటువంటి క్లిష్ట పరిస్థితులలోనూ కూడా, ఆయనకు అపజయమన్నది లేనేలేదు. బెల్గాం కాంగ్రెస్‌లో పోటీ తీవ్రరూపం దాల్చింది. ఓటింగు చాలా ముమ్మరంగానే సాగింది. దాస్-మోతిలాల్‌ గార్లపై గాంధీగారికే విజయం లభించింది. అయినప్పటికీ కూడా, తనకు లభించిన విజయం అత్యల్పమైన మెజారిటీతో లభించినదన్న కారణంగా, కాంగ్రెసును దాస్-మోతిలాల్ గారల పరం చేయడానికి తాను సంసిద్ధుడననీ, వారు తమ "కౌన్సిల్ యెంట్రీ" పదకాన్ని నిశ్చింతగా అమలు జరుపుకోవచ్చుననీ చెప్పి ఆయన తప్పుకున్నారు.

కాన్పూరు కాంగ్రెస్

అఖిల భారత చరఖా సంఘ స్థాపన కర్త మహాత్ముడే. ఆ చరఖా సంఘాన్ని స్థాపించి ఆయన ఖాదీ విభాగాన్ని కాంగ్రెసునుండి విడదీసి, దానికి ప్రత్యేక స్థాయిని సంపాదించారు. తాను అఖిల భారత చరఖా సంఘ అధ్యక్ష పదవిని స్వీకరించి, కాంగ్రెసును స్వరాజ్య వాదులకు అప్పగించారు. ఈ విధంగా గాంధీగారు నిర్మాణ కార్యక్రమం విభాగానికి ఒక విధంగా అంకితమే అయ్యారు.

దాస్-మోతిలాల్‌గారలు, ధైర్యంగా ముందుకు వచ్చి, వెంటనే "కౌన్సిల్ ఎంట్రీ" విధానాన్ని కాంగ్రెసు అంగీకరించేటట్లు చేయలేకపోయారు. వారు మరుసటి సంవత్సరం సరోజనీదేవి అధ్యక్షతను జరిగిన కాన్పూరు కాంగ్రెస్ [2] వరకూ ఆగవలసి వచ్చింది. ఆ కాన్పూరు కాంగ్రెసులో తాము "కౌన్సిల్ ఎంట్రీ" విధానాన్ని అవలంబించి, కాంగ్రెసు టిక్కెట్టుమీద ఎన్నికలలో పాల్గొనడానికి నిశ్చయించారు.

ఎన్నికల సంరంభం

1926 లో జరిగిన జనరలు ఎన్నికలలో దేశం మొత్తంమీద ఎన్నో ప్రాంతాలనుంచి కాంగ్రెసు టిక్కట్టుమీద రాజ్యసభకి యెన్నిక అయ్యారు. నేను గుంటూరు, కృష్ణా, తూర్పు-పశ్చిమ గోదావరి జిల్లాలకు ప్రతినిధిగా రాజ్యసభికి ఎన్నిక అయ్యాను. రాజ్యసభకే అన్న మాటేమిటి, శాసన సభలకు కూడా చాలా రాష్ట్రాలలో అనేక అభ్యర్థులు కాంగ్రెసు టిక్కట్టుమీదనే ఎన్నిక అయ్యారు. నిజంగా కాంగ్రెసువారే తలుచుకుని ఉంటే, మంత్రులయి పరిపాలనా యంత్రాన్ని చేబట్టి, 1921 నుంచీ అవిచ్చిన్నంగా సాగుతూన్న జస్టిస్‌పార్టీ వారికీ, వారి పరిపాలనా విధానానికీ స్వస్తి చెప్పేవారు. కాని కాంగ్రెస్ వారికి మంత్రు లమవుదాం అనే ఉద్దేశం లేదు.

చెన్నరాజధానిలో మాత్రం, అధిక సంఖ్యాకులుగా కాంగ్రెస్ వారు శాసన సభకు ఎన్నిక అయిన కారణంగా, మంత్రి పదవులు సంపాదించి, రాజ్యాంగాన్ని చేపట్టి, చేపట్టిన రాజ్యాంగ చక్రాన్ని నడపకుండా, బినామీగా ఉండాలనే అభిలాష జనించింది. జనించిన అభిలాషకు తల ఒగ్గారు. ఈ విషయాన్ని మున్ముందు బాగా విస్తరిస్తాను.

బెల్గాంలో కాంగ్రెసు జరిగిన తర్వాత మొదటిసారిగా అఖిల భారత కాంగ్రెసు కమిటీవారి మీటింగు పాట్నాలో జరిగింది. గాంధీగారు ఒక్క సంవత్సరం పాటు అన్నిరంగాల నుండి రిటయిరవుతానన్నారు. ఆ ప్రకారం , పాట్నా కాంగ్రెసులో, తమకూ కాంగ్రెసుకూ మధ్యనున్న వ్యవహారాలన్నిటినీ చక్క పెట్టుకుని, స్వరాజ్యవాదుల అంగీకారాన్ని కూడా లాంచన ప్రాయంగా తీసుకున్నారు.

  1. 1924 జూన్‌లో.
  2. కాన్పూరు కాంగ్రెసు (1925)లో కాంగ్రెసువారు స్వరాజ్య పార్టీవారి శాసన సభా ప్రవేశ కార్యక్రమాన్ని చేపట్టి, ఎన్నికలలో పాల్గొనడానికి నిశ్చయించారు.