ఇంకా జీవించే వున్నారు. నెల్సన్, పీనల్ కోడ్ చెప్పడంలో నిధి. అప్పట్లో అతని వ్యాఖ్యానమే ప్రమాణంగా వుండేది. ఈ అధ్యాపకులంతా చాలా పేరుకెక్కిన వాళ్ళు. నేను లా కాలేజిలో చదివిన సంవత్సరం బహుశ్రద్ధగా చదివాను. ఇండియన్ లా అంతా చాలా క్షుణ్ణంగా చదివాను. నా విషయంలో మిత్రులంతా కూడా మొదటి తరగతిలో వస్తానని అనుకున్నారు. కాని పరీక్షల్లో అప్పుడప్పుడు జరుగుతూ వుండేటట్లుగానే ఆశాభంగం అయింది. మొత్తం మీద 650 మార్కులు వచ్చినా, నాకు బాగా వచ్చిన క్రిమినల్ ప్రొసీజరుకోడు పేపరు అతిగా చదవడం వల్ల సరిగ్గా రాయలేక పోయాను. దాంతో నేను రెండో తరగతిలో వచ్చాను. అంటే సెకండ్ గ్రేడ్ ప్లీడరీ పట్టా మాత్రమే లభించింది.

పరీక్ష పాసుకావడంతోనే ఒంగోలు వచ్చాను. సర్టిఫికెట్ వచ్చేటప్పటికి ఇంకా కొంతకాలం పడుతుంది. ఈ లోగానే నేను ఒంగోలులో యాథాలాపంగా ఐదారు క్రిమినల్ కేసుల్లో పనిచేసి గెలిపించాను. అప్పటికింకా క్రిమినల్ కోర్టుల్లో దేశభాషల్లో వాదించడమే కనక, సర్టిఫికెట్ లేక పోయినా పాసయినట్టు దాఖలా వుండడంవల్ల వకాల్తా పనిచెయ్యడానికి అనుమతి దొరికింది. అప్పటికింకా మా అమ్మగారు హోటలుతో శ్రమపడుతూ, శ్రీరాములు చదువు సాగిస్తోంది. నేను ఏదో ఆషామాషీగా పనిచేసి రెండుమూడువందల రూపాయలు సంపాదించాను. దాంతో ఆ తాలూకాలో నాలుగుమూలలా వున్న బంధువుల మూలంగా నామాట బాగా వ్యాప్తి చెందింది. అందుచేత నాకొక సమస్య వచ్చింది. బంధువులు, చిన్ననాటి మిత్రులు కలిసి నన్ను ఒంగోలులో ప్రాక్టీసు పెట్టమని బలవంతం చేశారు. రాజమహేంద్రవరం ఊరుగాని ఊరనీ, అక్కడ బి.ఎల్.లూ, ఫస్టుగ్రేడులూ చాలామంది వున్నారనీ, సెకండుగ్రేడు ప్లీడరికి అట్టే అవకాశం వుండదనీ ఈ కారణాలవల్ల బంధువులందరికీ దగ్గిరిగా వుండే ఒంగోలులో ప్రాక్టీసు పెట్టమని నిర్బంధించారు.

కాని, నేను అంగీకరించలేదు. నాకు చిన్నప్పటినించీ విద్యాబుద్ధులు చెప్పి, నా విద్యకోసం తమ కుటుంబాన్ని కూడా అసౌకర్యాల పాలుచేసి నామీద అత్యంతమూ ఆశతో వున్న హనుమంతరావు నాయుడుగారికి ఆశాభంగం కల్పించడం నాకు న్యాయం కాదని నిష్కర్షగా చెప్పాను. హనుమంతరావు నాయుడుగారు మొదటినించీ నాతోపాటు తమ మేనల్లడైన పిళ్లారిసెట్టి నారాయణరావు నాయుడికి కూడా విద్యాబుద్ధులు చెప్పేవారు. అతను చాలా సామాన్యమైన కుటుంబంలోంచి వచ్చాడు. అతనికి నాయుడుగారు జీతం వగైరాలు ఇచ్చి ఇంట్లో పెట్టుకుని శ్రద్ధగా చదువు చెప్పించారు. అతనూ నాతో బాటే చదువుకుంటూ వుండేవాడు. అప్పుడప్పుడు నాటకాల్లో చిల్లర పాత్రలు ధరించేవాడు. నాయుడుగారి మనస్సులో అతనికి కూతుర్నిచ్చి పెళ్ళి చేద్దామనే ఆశ వుండేది. కాని, నారాయణరావు మెట్రిక్యులేషనూ, యఫ్.ఏ. అయ్యాకా తన భవిష్యత్తు కోసం ఆయన్ని ఒదిలిపెట్టి కలెక్టరు దగ్గర శిరస్తారుగా వుండిన తాయి శేషగిరిరావు నాయుడుగారి కుమార్తెని పెండ్లి చేసుకుని తద్వారా ఉన్నతవిద్య సంపాదించాడు. అప్పుడు అతనిచర్య అనేక విధములైన విమర్శలకు గురి అయింది. మొత్తంమీద నేను నాయుడుగారి దగ్గర ఉండడానికి నిశ్చయించి, రాజమహేంద్రవరం వచ్చేశాను. కొద్దిరోజుల్లో కుటుంబం అంతా ఒంగోలునించి రాజమహేంద్రవరం మార్చడానికి నిశ్చయించి, అక్కడవున్న వ్యవహారమంతా ఆపివేయడానికి తగిన ఏర్పాట్లు చేశాను.

సర్టిఫికెట్ రావడంతోటే రాజమహేంద్రవరంలో 1894వ సంవత్సరంలో ప్రాక్టీసు పెట్టాను. ప్రస్తుతం కంభంవారివీథిలో మాదిరెడ్డి వీరాస్వామి నాయుడుగారి ఇంటికెదురుగా కొత్తగా నిర్మించబడిన రెండు కొట్లల్లో ప్రాక్టీసు ప్రారంభించాను. ప్రాక్టీసుకి కావలసిన పరికరాలు, కర్రపెట్టెలు జంబుఖానాలు, కుర్చీలు, బల్లలు మొదలయిన ఆర్భాటాలన్నీ సుబ్బారావు పంతులు గారివంటి పెద్ద ప్లీడర్లకే వుండేవి. అప్పటికి రాజమహేంద్రవరంలో ప్రసిద్ధిగా ప్లీడరీ చేస్తూన్న వాళ్ళని గురించి, ప్లీడర్ల పరిస్థితుల్ని గురించి కొంచెం సూక్ష్మంగా రాస్తాను.

న్యాయవాదులంతా బి.ఎల్.ప్లీడర్లు, ఫస్టుగ్రేడు ప్లీడర్లు,