ప్రకాశిక

ఆంధ్రకేసరి ప్రకాశంపంతులుగారు మహా పురుషులు. నూటికి కోటికి ఒక్కడుగ జన్మించే మహా మానవుల కోవలోని వారు ఆయన. ఈ సంవత్సరం ఆయన శతజయంతి ఉత్సవం దేశమంతటా వైభవంగా జరుపుకుంటున్నాం. ఈ మహోత్సవ సందర్భంలో పంతులుగారి సమగ్ర జీవిత చరిత్ర ఆంధ్రులకు అందజేయ గలుగుతున్నందుకు ఆనందిస్తున్నాం.

ఇటీవలే, ఎమెస్కో పాకెట్ పుస్తక ప్రచురణలలో ద్విశతమానం (200) పూర్తిచేయ గలిగామని మా పాఠకులకు తెలుసు. ఈ విజయానికి కారకులైన మా పాఠకులను, ఈ పుస్తకాలు పంపకం చేసే మా ఏజెంట్లను ఈ సందర్భంలో మేము హృదయ పూర్వకంగా అభినందిస్తున్నాము. కాగితము కొరత, కాగితపు ధరలతోపాటు ప్రచురణకు సంబంధించిన ఖర్చులన్నీ పెరిగిపోతూండటం, ఏమైనా ఈ పుస్తకాల వెలలు పెంచరాదన్న నియమం-మొదలైన ఇబ్బందులన్నీ ఎదుర్కొంటూ ఇంతవరకు ఈ ప్రచురణ కార్యక్రమాన్ని సాగించ గలగడానికి నిశ్చయంగా మా పాఠకుల, ఏజంట్ల ప్రోత్సాహాదరణలే కారణం.

ఎమెస్కో పోకెట్ పుస్తక పరంపరలో ఇంతవరకు ప్రచురిస్తూన్న నవలలు, కథలు, ఆధునిక సాహిత్యం లోను, కావ్యాలలోను ఎన్నికైన ప్రముఖ రచనల ఎమెస్కో ముద్రణలు, సంప్రదాయ సాహిత్యం వగైరాలతో పాటు మహాపురుషుల జీవిత చరిత్రలు కూడా ప్రచురించడం మంచిదని, ఆవశ్యకమనీ మిత్రులు, అభిమానులు కొంత కాలంగా మాకు చేస్తూ వచ్చిన సూచనను ఇప్పుడు కార్యరూపంలో పెట్ట గలుగుతున్నాం.

ఈ ఎమెస్కో చరిత్రల పరంపరలను ఆంధ్రమహానాయకులలో అగ్రగణ్యులైన ప్రకాశం పంతులుగారి ఆత్మకథ "నా జీవితయాత్ర"తో శుభారంభం చేయగలగటం అదృష్టం.

ప్రకాశం పంతులుగారు 1942 లో క్విట్టిండియా ఉద్యమంలో పాల్గొని బ్రిటిష్ ప్రభుత్వపు అతిథిగా కారగారవాసం చేస్తూన్న సమయంలో ఈ గ్రంథం రచించారు. అనంతరం 1945 లో ఆయన విడుదల అయి వచ్చి; 1946 లో చెన్నరాష్ట్ర, ముఖ్యమంత్రిగా ఎన్నిక అయిన తరువాత ఈ ఆత్మకథలో ప్రథమఖండం మాత్రం 'శిల్పి' ప్రచురణల వారు ప్రకటించారు. మిగిలిన వ్రాతప్రతి యావత్తూ అచ్చు కాకుండా అలాగే ఉండిపోయింది. ఆ వ్రాతప్రతిని ఇప్పుడు మాకు అందించిన మిత్రులు శ్రీ అద్దేపల్లి నాగేశ్వరరావు (అద్దేపల్లి అండ్‌కో, సర్వస్వతీ పవర్ ప్రెస్, రాజమహేంద్రవరం) గారికి మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం.

అయితే, పంతులుగారి "నా జీవితయాత్ర" రచన 1940 - 41 వరకు సాగిన చరిత్రతోనే ఆగిపోయింది. "మిగిలిన కథ నా స్నేహితులెవరైనా వ్రాసి పూర్తిచేస్తారు" అని పంతులుగారు 3 వ ఖండం చివర రాశారు. పంతులుగారి సంకల్పానుసారంగానే ఇప్పుడు ప్రకాశంగారి పరిశిష్ట జీవిత చరిత్ర రచించి ఈయవలసినదిగా మేము పంతులుగారి సన్నిహిత అనుచరులై, చిరకాలం ఆయనకు కుడిభుజంగా ప్రస్తుతిగన్న శ్రీ తెన్నేటి విశ్వనాథం గారిని కోరగా, వారు ఎంతో సంతోషంగా ఈ పనికి పూనుకుని, పంతులుగారి శేషరాజకీయ జీవిత విశేషాలే కాక, 1, 2, 3 ఖండాలలో పంతులుగారు వ్రాయకుండా వదలివేసిన 1937 లో చెన్నరాష్ట్ర మంత్రివర్గంలో ఉపనాయకులుగాను, రెవిన్యూ మంత్రిగాను పనిచేసిన కాలపు విశేషాలు వగైరాలు కూడా ఈ అనుబంధ సంపుటిలో అభివర్ణించారు. ఉత్సాహంతో, దీక్షగా, స్వల్పకాలంలో ఈ అనుబంధ సంపుటిని రచించి ఇచ్చిన శ్రీ తెన్నేటి విశ్వనాథం గారికి మా ధన్యవాదాలు.

ప్రకాశం శతజయంతి సందర్బంలో ఆ మహనీయుని సంస్మరణ చిహ్నంగా ఈ ప్రచురణను వెలువరించ దలచుకొన్నామని మా సంకల్పం తెలిపి ఈ గ్రంథానికి ఉపోద్ఘాతం రచించ వలసినదిగా పంతులుగారి ముఖ్యసహచరులైన రాష్ట్రపతి శ్రీ వి. వి. గిరిగారిని, ప్రస్తావనవ్రాయ వలసినదిగా ఆంధ్ర ప్రదేశ ముఖ్యమంత్రి, విద్వాంసులూ అయిన శ్రీ పి. వి. నరసింహారావు గారిని మేము అర్థించగానే ఆ ప్రముఖ నాయకు లిద్దరూ ఈ ప్రయత్నానికి హర్షించి ఈ గ్రంథానికి పరిచయ వ్యాసాలు రచించి మాకు సకాలంలో అందజేసినందుకు వారికి మా కృతజ్ఞతా పూర్వక అభివందనములు.

ఆంధ్రకేసరి ప్రకాశం పంతులుగారి అమర స్మృతికి ఇది ఎమెస్కో అంజలి!

భవదీయులు,

యం. శేషాచలం అండ్ కో.