'నా జీవితయాత్ర' ప్రథమ ఖండము

ప్రథమ ముద్రణ (1946)కు

శ్రీ తల్లావఝల శివశంకరశాస్త్రి

పరిచయము

అమెరికా దేశీయుడు ఒకడు స్వీయచరిత్రకు Education అని పేరు పెట్టినాడు. ఆంగ్లేయ స్త్రీ My Apprenticeship అనీ, ఐర్ దేశీయుడు Summing up అనీ తమ చరిత్రలకు నామములుంచి నారు. వారి ఉద్దేశానుసారముగా ఆ నామకరణము అనుగుణమైనది. మన నాయకుడు ఆంధ్రకేసరి పూజ్యశ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు "నా జీవితయాత్ర" అని స్వీయచరిత్రకు పేరు పెట్టడమువల్ల జీవితాన్ని యాత్రగా భావించినట్టు కనిపిస్తున్నది. ఒక దృష్టితో చూస్తే జీవితము యాత్రాప్రాయమే. కొందరు యాత్రికులు లక్ష్య శుద్ధితో బయలుదేరి గమ్యస్థానము చేరుతారు. చాలమంది యాత్రచేస్తూ అవాంతర విషయాలలో అడుగు పెట్టడమూ, కొంత దూరము పోవడమూ, పక్కకు తిరగడమూ, కడకు గమ్యస్థానము చేరడమూ సంభవిస్తుంది. ప్రకాశం పంతులు ద్వితీయ శ్రేణిలో చేరిన యాత్రికుడు. నలుగురితో పాటు జీవయాత్ర ప్రారంభము చేసినప్పటికీ క్రమేణ నాయకుడై ఆఖరుకు ఆంధ్రకేసరి అయినాడు.

పూవు పుట్టగానే పరిమళము అన్నట్టు పంతులు బాల్యమునుంచీ ప్రముఖుడే. పల్లెపట్టున గాని, పట్టణాలలో గాని, ప్రధాన నగరములో గాని, చివరకు పరదేశములో గాని ఆయన ప్రాముఖ్యము ఎప్పుడూ ప్రకట మవుతూనే ఉన్నది. సహజముగానే దృఢగాత్రు డైన వానికి బుద్ధివైభవము తో డైనప్పుడు ప్రాముఖ్యము కలగక తప్పదు. కృష్ణానదికి దక్షిణమున రాతి భూమిలో పుట్టుక, సావాసగాండ్లతో సాము గరిడీలు, స్వచ్ఛందవృత్తి, అనూచాన సంపదను బట్టి ఆరువేల నియోగికి సంక్రమించే సహజదర్పము, ప్రథమములో సౌఖ్యము, అనంతరము అర్థనాశము, అధిక కష్టములు, ఆత్మోద్ధరణ వాంఛ - ఇవి అన్నీ కదంబ ప్రాయము అయి పంతులు అద్భుత వ్యక్తి అయినాడు. దు:ఖాభి భూతుడు కానివాడు ధీరుడు కాలేడు. ఆదినుంచి నేటివరకు ఆంధ్ర కేసరికి వివిధ వ్యథలు కలుగుచునే ఉన్నవి. అందుచేతనే అంతటి ద్రఢిమ ఏర్పడి అంతరాయములలో ఆయన ప్రముఖుడే కాని, పరాఙ్ముఖుడు కావడము లేదు.

మొన్న మొన్నటి వరకు ఆంధ్రుడికి సంపన్న న్యాయవాదే గణ్యుడు. అందుచేతనే ఆనాడు పంతులు న్యాయవాద వృత్తిమీద మనసుపోయి మదరాసు లా కాలేజీలో చదవడమూ, రాజమహేంద్రవరములో వకీలుగా ఉండడమూ సంభవించినది. ఊర్ద్వదృష్టి ఉన్నవాడు ఊరుకో లేడు. ఆయన ఉత్త ప్లీడరుగా ఉండక న్యాయ విద్యలో ప్రశస్తమైన బారిష్టరు పట్టము తెచ్చుకొని రాజధానికే పోయి నిరుత్సాహ చ్ఛాయ దగ్గరకు రానీయక ధైర్యముతో అడ్డంకులను అన్నిటినీ ప్రతిఘటించి అన్ని విధముల ప్రాభవము పొందినాడు. సడలని పట్టుదల వల్లనే జయము సమకూరుతున్నది.

అభిమానవంతుడు, ఆత్మోద్ధర ణాభిలాషి, అన్య జన లక్ష్యము లేనివాడు. అగ్రగణ్యుడు అయినప్పటికీ ప్రకాశ ప్రధాని బాల్యములో పడిన అవమానములు, అనుభవించిన కష్టములు, చేసిన చిలిపి పనులు, శృంగార చేష్టలు దాచిపెట్టకుండా నిజముగా ఉద్ఘాటించి నాడు. సహజముగా స్వచ్ఛ బుద్ధి కలవారు, ధైర్యస్థైర్యములు ఉన్నవారూ ఉన్నది ఉన్నట్టుగా సత్యము చెప్పగలరు. పంతులు ప్రకటము చేసిన విషయములు ఆయనమీద ఆదరము కలిగించడమే కాక, అన్యులకు ఆదర్శము కూడా అవుతవి. కృతజ్ఞతా మాధుర్యము "జీవిత యాత్ర"లో చాలా తావుల వెల్లివిరిసింది. ప్రత్యుపకార పరిమళము బహుస్థానాలలో వాసించినది. పురుష పుంగవము ఆత్మ లాభముతో సంతుష్టి చెందక అన్య క్షేమము ఆకాంక్షిస్తుంది. ఉత్తముడు దేశ సౌభాగ్యము కోసము నిజశక్తులు వినియోగిస్తాడు. దేశసేవ వివిధ విదాల జరుగుతుంది. ఉత్తేజకములైన ఉపన్యాసములవల్ల గాని, ఉత్తమ పత్రికా నిర్వహణమువల్ల గాని, ఉదారాచరణవల్ల గాని పురుషుడు కర్మవీరుడు కాగలుగుతాడు. పంతులు వీ టన్నిటిలో పరిశ్రమ చేసి కలికాప్రాయముగా అంతర్నిహితమైన దేశభక్తిని కమనీయ కుసుమముగా వికసింపజేసినాడు. మహాపురుషుల సాంగత్యమువల్లను, సహజ ప్రతిభవల్లను ఆంధ్రకేసరికి పంచాశద్వర్ష ప్రాంతములో జీవ యాత్రలో లక్ష్యము గోచరించింది.

ఈ గ్రంథములో వివృతమైన వ్యక్తికీ, నాకు సుపరిచితమైన మూర్తికీ వ్యత్యాసము కనపడడము లేదు. ఆయన మాటల వలెనే ఇందులో పలుకులు కూడా తేటలు. రచన సానపెట్టిన రత్నమువలె రమణీయము. విస్తరించి విశేషములు చెప్పినట్లయితే మరింత దీప్తి కలిగేది తాత్పర్యార్థము తలపోసినట్ట యితే కథానాయకుడు ఆంధ్ర కేసరి అని అన్వర్థము అవుతుంది.


ఇతి శివమ్!

సాహితీ సమితి, తెనాలి,
1946 ఆగష్టు 20..
శివ శంకర శాస్త్రి

బారిస్టరు శ్రీ ప్రకాశం పంతులు