నారాయణీయము/ప్రథమ స్కంధము/1వ దశకము

ఓం నమో భగవతే గురువాయుపురాధీశాయ
ఓం నమోగభవతే వాసుదేవాయ
నారాయణభట్ట తిరికృతం

||శ్రీమన్నారాయణీయము||


1వ దశకము - భగవన్మహిమాను వర్ణనం

1-1-శ్లో.
సాంద్రానందావబోధాత్మకమనుపమితం కాలదేశావధిభ్యాం
నిర్ముక్తం నిత్యముక్తం నిగమశతసహస్రేణ నిర్భాస్యమానం।
అస్పష్టం దృష్టమాత్రే పునరురు పురుషార్థాత్మకం బ్రహ్మతత్త్వం
తత్తావద్భాతి సాక్షాత్ గురుపవనపురే హంత భాగ్యం జనానామ్||
1వ. భావము.
పరిపూర్ణమయిన ఆనందమును కలిగించునది, పోలికలేనిది, కాలాతీతమైనది, పరిమితిలేనిది, బంధములతో సంబంధము లేనిది, వేలకొలది వేదములచే ప్రకాశవంతమయినది, భౌతికదృష్టికి అస్పష్టమయినది, పురుషార్ధప్రధానమయిన మోక్షమును ప్రసాదించునది, అయిన బ్రహ్మతత్వము సాక్షాత్తు శ్రీకృష్ణుని రూపమున భక్తజనులననుగ్రహి౦చుటకు, గురవాయూరులో అవతరించినది.


1-2- శ్లో.
ఏవందుర్లభ్యవస్తున్యపి సులభతయా హస్తలబ్ధే యదన్యత్
తన్వా వాచా ధియా వా భజతి బత జనః క్షుద్రతైవ స్ఫుటేయమ్
ఏతే తావద్వయం తు స్థిరతరమనసా విశ్వపీడాపహత్యై
నిశ్శేషాత్మానమేనం గురుపవనపురాధిశమేవాశ్రయామః||
2వ. భావము.
దుర్లభమయిన బ్రహ్మ తత్వము శ్రీకృష్ణుని రూపమున అతి చేరువలో గురవాయూరు పురమున అవతరించినది. త్రికరణశుద్ధిగా నిన్ను అర్చించి ఆనందమును పొందక ఇతర దేవతలను ఆశ్రయించుట నిష్ప్రయోజనము. కృష్ణా! ఇహపరమయిన సకలపీడలను నివారించుటకు, ఆత్మభూతుడవగు నిన్ను మాత్రమే ఆశ్రయించదము.

1-3- శ్లో.
సత్త్వం యత్తత్ పరాభ్యామపరికలనతో నిర్మలం తేన తావత్
భూతైర్భూతేంద్రియైస్తే వపురితి బహుశః శ్రూయతే వ్యాసవాక్యమ్
తత్ స్వచ్ఛత్వాద్యదచ్ఛాదితపరసుఖచిద్గర్భనిర్భాసరూపం
తస్మిన్ ధన్యా రమంతే శ్రుతిమతిమధురే సుగ్రహే విగ్రహే తే||
3వ. భావము.
పంచభూతములు, ఇంద్రియములతో ఆవిష్కృతమయున నీ రూపమునకు, త్రిగుణాతీతము నిర్మలము అయిన శుద్ధసత్వగుణ రూపమైన పరతత్వమే కారణమని, వ్యాస భగవానునిచే చెప్ప బడిన వాక్యము వలన తెలియుచున్నది. గుణములచే ఆవరింపబడనిదియు, స్వచ్ఛమయినదియు, ఙ్ఞానానందముచే ప్రకాశించునదియు అయిన నీ రూపమును స్మరించుటలో ఆనందమును; భావన చేయుటలో మాధుర్యమును అనభవించు నీ భక్తులు ధన్యులు.

1-4-శ్లో.
నిష్కంపే నిత్యపూర్ణే నిరవధిపరమానందపీయూషరూపే
నిర్లీనానేకముక్తావళిసుభగతమే నిర్మలబ్రహ్మసింధౌ
కల్లోలోల్లాసతుల్యం ఖలు విమలతరం సత్త్వమాహుస్తదాత్మా
కస్మాన్నో నిష్కళస్త్వం సకల ఇతి వచస్త్వత్కలాస్వేవ భూమన్||
4వ. భావము.
భూమన్! పరబ్రహ్మతత్వము చలనములేని సముద్రము వంటిది. పరిపూర్ణమయినది. పరిమితిలేని పరమానందమను అమృతముతో నిండినది. బ్రహ్మఙ్నానముతో లయము పొంది ముక్తులయిన వారితో కలిసి మిక్కిలి మనోహరమయినది. శుద్ధసత్వగుణమను అలలతో నిండినది. మరియు పరబ్రహ్మతత్వము నిరాకారమయినదని చెప్పబడినది. ఐనను ఆతత్వరూపమయిన నీవు సకలము నందు వ్యాపించి ఉన్న సకల శక్తి సంపన్నుడవు.

1-5-శ్లో.
నిర్వ్యాపారో౾పి నిష్కారణమజ। భజసే యత్క్రియామీక్షణాఖ్యాం
తేనైవోదేతి లీనా ప్రకృతిరసతి కల్పా౾పి కల్పాదికాలే।
తస్యాస్సంశుద్ధమంశం కమపి తమతిరోధాయకం సత్త్వరూపం
సత్త్వం ధృత్వా దధాసి స్వమహిమ విభవాకుంఠ వైకుంఠ రూపం||
5వ. భావము.
వైకుంఠవాసా! నీవు జన్మరహితుడవు, క్రియారహితుడవు. అయినను 'ఈక్షణము' అను సంకల్పముతో సృష్టిక్రియను స్వీకరించితివి. కల్పాదికాలమున స్ధిరరూపములేక నీ యందే ఐక్యమై యున్న ప్రకృతిని ఆవిర్భవింపచేసి నీవు శుద్ధసత్వ రూపమును ధరించితివి.

1-6-శ్లో.
తత్తే ప్రత్యగ్ర ధారాధర లలితకళాయావలీ కేళికారం
లావణ్యస్యైకసారం సుకృతిజనదృశాం పూర్ణపుణ్యావతారమ్।
లక్ష్మీనిశ్శంకలీలానిలయనమమృతస్యందోహమంతః
సించత్సంచింతకానాం వపురనుకలయే మారుతాగారనాథ||
6వ. భావము.
గురవాయూరు పురాధీశా! నీలమేఘవర్ణమును పోలిన శరీరచ్ఛాయను కలిగి, నీలికలువ వంటి సుకుమారమయిన దేహకాంతితో, అధికమయిన లావణ్య సౌందర్యముతో ప్రకాశించు నీ రూపము పుణ్యాత్ములయిన వారి కన్నులకు పూర్ణపుణ్యావతారము. లక్ష్మీదేవి నిజరూపమునకు నిలయము. లక్ష్మీదేవి నిశ్శంకగా పూజించుకొను లీలానిలయము. అటువంటి నీరూపమును ఆశ్రయించువారి అంతఃకరణ, పరతత్వము అను అమృతప్రవాహముతో నిండి, ఆర్ధ్రతతో అహ్లాదభరితమగును. అట్టి నీ రూపమును నేను సదా ధ్యానించదను.

1-7-శ్లో.
కష్టా తే సృష్టి చేష్టా బహుతరభవఖేదావహా జీవభాజామ్
ఇత్యేవం పూర్వమాలోచితమజిత! మయా నైవమద్యాభిజానే।
నో చేజ్జీవాః కథం వ మధురతరమిదం త్వద్వపుశ్చిద్రసార్ధ్రం
నైత్ర్తేః శ్రోత్రైశ్చ పీత్వా పరమరససుధాంభోధిపూరే రమేరన్||
7వ. భావము.
అజితా! సంసార పరమైన కష్టములను అనుభవించి దుఖితుడనై భగవంతుని సృష్టి దుఃఖకరమైనదని భావించితిని. వాస్తవమునకు నీ సృష్టి లేనిచో జనులు నీ ఙ్ఞానందరూపము వలన కలుగు ఆర్ద్రతను, కనులతో చూచుటవలన చెవులతో వినుట వలన పొందు మాధుర్యమును, పరమానందము అను అమృతసాగరమును ఎట్లు అనుభవించదరు?

1-8-శ్లో.
నమ్రాణాం సన్నిధత్తే సతతమపి పురస్తైరనభ్యర్ధితాన-
ప్యర్థాన్ కామానజస్రం వితరతి పరమానందసాంద్రాం గతిం చ।
ఇత్థం నిశ్శేషలభ్యో నిరవధికఫలః పారిజాతో హరే! త్వం
క్షుద్రం తం శక్రవాటీద్రుమమభిలషతి వ్యర్థవర్థివ్రజో౾యమ్||
8వ. భావము.
హరీ! నీ రూపము జనులను అనుగ్రహించుటకు అవతరించిన పారిజాతవృక్షము (కల్పవృక్షము). వినమ్రులయి నిన్ను స్మరించిన వారి ఎదుట నీవే స్వయముగా నిలిచి వారి మనోభిష్టములను తీర్చెదవు. పరిపూర్ణమయిన గతిని (ముక్తిని) ప్రసాదించదవు. ఈ విధముగా అవధి లేని మహా ఫలములను అనుగ్రహించు పారిజాతవృక్షము నీ రూపము నందు ఉండగా నీ మహిమ తెలుసు కొనలేనివారు దేవలోకము నందలి పారిజాతవృక్షమును తమ కోరికలు తీర్చుటకు యాచించుచున్నారు.

1-9-శ్లో.
కారుణ్యాత్కామమన్యం దదతి ఖలుపరే స్వాత్మదస్త్యం విశేషాత్
ఐశ్వర్యాదీశతే౾న్యే జగతి పరజనే స్వాత్మనో౾పీశ్వరస్త్యమ్l
త్వయ్యుచ్చైరారమంతి ప్రతిపదమధురే చేతనాః స్ఫీతభాగ్యాః
త్వం చాత్మారామ ఏవేత్యతులగుణగణాధారా! శౌరే! నమస్తే||
9 భావము.
కృష్ణా! ఇతర దేవతలు భక్తుల యందు కలుగు కరుణచే వారి కోరికలను తీర్చెదరు. నీవు మాత్రము భక్తులకు నీ ఆత్మనే ఇచ్చెదవు. ఇతర దేవతలు తమ శక్తులచే లోకమును పరిపాలించగలరు. నీవు జీవుల చిత్తములందు ఙ్ఞానానందముతో ప్రకాశించుచూ జగత్తునే పరిపాలించుచున్నావు. నీ నామమును ఉచ్ఛరించుచూ ఆనందమును పొందు భక్తుల ఆత్మలతో రమించు ఆత్మారాముడివి నీవు. పోలిక లేని సత్వగుణములకు నిలయమయిన శౌరీ !నమస్తే! .

1-10-శ్లో.
ఐశ్వర్యం శంకరాదీశ్వరవినియమనం, విశ్వతేజో హరాణాం
తేజస్సంహారి వీర్యం, విమలమపి యశో నిస్పృహైశ్చోపగీతం।
అంగాసంగా సదా శ్రీరఖిలవిదసి, న క్వాపి తే సంగవార్తా
తద్వాతాగారవాసిన్! మురహర! భగవచ్ఛబ్దముఖ్యాశ్రయో౾సి||
10వ. భావము.
మురాసురుని సంహరించినవాడా! సంపూర్ణ ఐశ్వర్యం, శంకరుడు మున్నగు సకల దేవతల నియామకత్వం, బ్రహ్మాదులతోసహా విశ్వంలోని సకల తేజస్సులను హరించగల తేజస్సు, వీర్యం, నిస్పృహులయిన మహానుభావులచే కీర్తింపబడు నిర్మలమయున కీర్తి, సర్వదా ఆశ్రయుంచి ఉండు లక్ష్మీదేవి, సర్వజ్ఞతలతో విరాజిల్లేవాడవు . నీవు సర్వసంగ పరిత్యక్తవు, వైరాగ్య శోభితుడవు. భగవంతుడు అను శబ్దమునకు పూర్తిగా తగినవాడవు.

ప్రథమస్కంధము
1వ దశకము సమాప్తము.

-x-