నారాయణీయము/నవమ స్కంధము/35వ దశకము

||శ్రీమన్నారాయణీయము||
నవమ స్కంధము

35వ దశకము - శ్రీరామచరితము-2

35-1-శ్లో.
నీతస్సుగ్రీవమైత్రీం తదను హనుమతా దుందుభేః కాయముచ్ఛైః
క్షిప్త్వాంగుష్ఠేన భూయో లులువిథ యుగపత్ పత్రిణా సప్తసాలాన్।
హత్వా సుగ్రీవఘాతోద్యతమతులబలం వాలినం వ్యాజవృత్త్యా
వర్షావేలామనైషీర్విరహతరలితస్త్వం మతంగాశ్రమాంతే॥
1వ భావము:-
రామావతారమును ధరించిన - శ్రీమన్నారయణమూర్తీ! హనుమంతునితో కలిసి నీవు ఋష్యమూక పర్వతమును చేరితివి; 'సుగ్రీవునితో' మితృత్వమును పొందితివి; కాలిబొటనవ్రేలితో విగత రాక్షసి 'దుంధుభి' శరీరమును బహుదూరముగా విసరివేసితివి. సప్త సాలవృక్షములను ఏకబాణముతో నీవు పడగొట్టితివి. సుగ్రీవునిపై పగపూని, శత్రుత్వమువహించి- పలుమారులు హతమార్చుటకు తలపడుచున్న సుగ్రీవుని సోదరుడు, అతిబలవంతుడు అయిన వాలిని వధించితివి. పిదప, 'మాతంగముని' ఆశ్రమ సమీపమున, సీతావియోగమునకు విలపించుచూ, ఆ వర్షాకాలమంతయూ గడిపితివి.

35-2-శ్లో.
సుగ్రీవేణానుజోక్త్యా సభయమభియతా వ్యూహితాం వాహినీం తాం
ఋక్షాణాం వీక్ష్య దిక్షు ద్రుతమథ దయితామార్గణాయావనమ్రామ్।
సందేశం చాంగులీయం పవనసుతకరే ప్రాదిశో మోదశాలీ
మార్గే మార్గే మమార్గే కపిభిరపి తదా త్వత్ప్రియా సప్రయాసైః॥
2వ భావము:-
రామావతారము ధరించిన - శ్రీమన్నారయణమూర్తీ! (వర్షాకాలము గడిచి) శరత్కాలము ప్రవేశించెను. అప్పుడు నీ సోదరుడగు లక్ష్మణుడు (సీతాన్వేషణ జరపని) సుగ్రీవుని గట్టిగా హెచ్చరించెను. లక్ష్మణుని మాటలకు భీతిచెందిన సుగ్రీవుడు తన వానరసైన్యమునంతనూ నీ ఎదుట నిలిపెను; వారు అన్నిదిశలలోను నీ పత్నిని వెదుకుటకు సంసిద్ధులై నీముందు వినమ్రముగా నిలిచిరి. వారిలో (శ్రేష్టుడగు) హనుమంతునికి - 'సీతాదేవికి' చూపించుటకై నీ వేలి ఉంగరమునిచ్చి సందేశమును పంపితివి. అంతట వానరులందరూ వివిధ మార్గములలో తిరుగాడుచూ 'సీతాదేవిని' వెదకుటకు శ్రమించిరి.

35-3-శ్లో.
త్వద్వార్తాకర్ణనోద్యద్గరుదురుజవసంపాతిసంపాతివాక్య-
ప్రోత్తీర్ణార్ణోధిరంతర్నగరి జనకజాం వీక్ష్య దత్త్వాం౾గుళీయమ్।
ప్రక్షుద్యోద్యానమక్షక్షపణచణరణః సోఢబంధో దశాస్యం
దృష్ట్వాప్లుష్ట్వాచ లంకాం ఝటితి స హనుమాన్ మౌళిరత్నం దదౌతే॥
3వ భావము:-
రామావతారము ధరించిన - శ్రీమన్నారయణమూర్తీ! వానరవీరులట్లు 'సీతాదేవిని' వెదుకుచూ తిరుగుచుండగా - వారికి జటాయువు సోదరుడగు 'సంపాతి' కనిపించి, 'సీత' - రావణుని 'లంకలో' ఉన్నదని చెప్పెను. ఆ మరుక్షణమే 'సంపాతికి' కాలిపోయి - పోయిన రెక్కలు తిరిగిరాగా ఆకాశమున ఎగిరిపోయెను. 'సంపాతి' మాటననుసరించి ' హనుమంతుడు' సముద్రమును లంఘించి సముద్రమధ్యముననున్న 'లంకానగరమును' చేరెను. అచ్చట జనకుని పుత్రికయగు 'సీతాదేవిని' కనుగొనెను; 'శ్రీరాముడిచ్చిన' అంగుళీయమును ఆమెకు ఇచ్చెను. పిదప 'సీత' ఉన్న (ప్రదేశము తప్ప) ఉద్యానవనమంతటను ధ్వంసముచేసెను. రావణకుమారుడైన 'అక్షయకుమారుని' హతమార్చెను; (ఇంద్రజిత్తు ప్రయోగించిన) బ్రహ్మాస్త్రమునకు బద్దుడై, దశముఖుడగు రావణాసురుని దర్శించెను; పిదప లంకను దహించి- రామునకీయమని 'సీత' ఇచ్చిన (చూడామణి) రత్నమును తెచ్చి, ప్రభూ! నీకు ఇచ్చెను.

35-4-శ్లో.
త్వం సుగ్రీవాంగదాదిప్రబలకపిచమూచక్రవిక్రాంతభూమీ
చక్రోభిక్రమ్య పారే జలధి నిశిచరేంద్రానుజాశ్రీయమాణః।
తత్ప్రోక్తాం శత్రువార్తాం రహసి నిశమయన్ ప్రార్థనాపార్థ్యరోష-
ప్రాస్తాగ్నేయాస్త్రతేజస్త్రసదుదధిగిరా లబ్దవాన్ మధ్యమార్గమ్॥
4వ భావము:-
శ్రీమన్నారయణమూర్తీ! శ్రీరాముని రూపమున ఉన్న నీవు - సుగ్రీవుడు, అంగదుడు మొదలగు పరాక్రమవంతులగు వానరప్రముఖులతో కలిసి - సముద్రము దాటి 'లంకను' చేరుటకు సముద్రతీరమును చేరితివి. అదేసమయమున, రావణుని సోదరుడగు 'విభీషణుడు' వచ్చి, నిన్ను ఆశ్రయించి నీ శరణుకోరెను. ఆ విభీషణుడు - రహస్యముగా నీకు నీ శత్రువు (రావణుని) వివరములను తెలిపెను. (లంకను చేరుటకు) దారినీయమని సముద్రుని ప్రార్ధించిన - నీ ప్రార్ధన వ్యర్ధమయ్యెను. అప్పుడు నీవు కోపించి, ఆ సముద్రునిపై 'ఆగ్నేయాస్త్రమును' ప్రయోగించితివి. ఆ అస్త్ర తేజమునకు భయపడి, సముద్రుడు నీవు లంకనుజేరుటకు సముద్రమధ్యమున మార్గమునొసగెను.

35-5-శ్లో.
కీశైరాశాంతరోపాహృతగిరినికరైః సేతుమాధాప్య యాతో
యాతూన్యామర్ద్య దంష్ట్రానఖశిఖరిశిలాసాలాశస్త్రైః స్వస్తైన్యైః।
వ్యాకుర్వన్ సానుజస్త్వం సమరభువి పరం విక్రమం శక్రజేత్రా
వేగాన్నాగాస్త్రబద్ధః పతగపతిగరున్మారుతైర్మోచితో౾ భూః॥
5వ భావము:-
ప్రభూ! శ్రీమన్నారయణమూర్తీ! శ్రీరాముని రూపముననున్న నీవు అప్పుడు, ఆ వానరులచే అన్నిదిక్కులనుండీ - పర్వతశిలలను గుట్టలు గుట్టలుగా తెప్పించితివి; సముద్రముపై లంకనుజేరుటకు సేతువును నిర్మింపజేసితివి; వానరసైన్యముతో ఆ సేతువునుదాటి లంకను జేరితివి. వానరవీరులు - వారి కోరలను, గోళ్ళను, శిలలను మరియు వృక్షములను ఆయుధములుగా చేసుకొని ఆ లంకలోని రాక్షసులను హింసించిరి. నీవు నీ సోదరుడగు లక్ష్మణునితో కలిసి నీ పరాక్రమమును చూపితివి. రావణకుమారుడగు ఇంద్రజిత్తు నాగాస్త్రమును ప్రయోగించగా నీవును, నీ సోదరుడగు లక్ష్మణుడును ఆ నాగాస్త్రమునకు బంధించబడిరి. అప్పుడు పక్షిరాజగు గరుత్మంతుడు వచ్చి తనరెక్కల గాలితో మిమ్ములను బంధవిముక్తులు గావించెను.

35-6-శ్లో.
సౌమిత్రిస్త్వత్ర శక్తి ప్రహృతిగలదసుర్వాతజానీతశైల-
ఘ్రాణాత్ ప్రాణానుపేతో వ్యకృణుత కుశృతిశ్లాఘినం మేఘనాదమ్।
మాయాక్షోభేషు వైభీషణవచనహృతస్తంభనః కుంభకర్ణం
సంప్రాప్తం కంపితోర్వీతలమఖిలచమూభక్షిణం వ్యక్షిణోస్త్వమ్॥
6వ భావము:-
శ్రీరాముని రూపముననున్న - శ్రీమన్నారయణమూర్తీ! ఆ యుద్ధమున, నీ సోదరుడగు లక్ష్మణుడు ఒక శక్తివంతమయిన అస్త్రముచే గాయపడి - ప్రాణాపాయస్థితికి లోనయ్యెను. అప్పుడు వాయుపుత్రుడగు హనుమంతుడు ఔషధములు కల పర్వతమును (సంజీవిని) తేగా, ఆ పర్వతగాలిని ఆఘ్రాణించి లక్ష్మణుడు పునర్జీవితుడయ్యెను; మాయోపాయములను ప్రయోగించు ఇంద్రజిత్తును సంహరించెను. రావణుని మాయలకు (మాయాసీతను ఎదుట నిలపగా) నీవు కలతచెందితివి; విభీషణుని వాక్కులతో అశాంతిని తొలగించుకొంటివి. తరువాత మహాబలవంతుడగు 'కుంభకర్ణుడు' భూమిని దద్ధరిల్లింపజేయుచూ యుద్ధరంగమునకు వచ్చి, నీ సైన్యమును బక్షించసాగెను. ప్రభూ! ఆ కుంభకర్ణునుని నీవు హతమార్చితివి.

35-7-శ్లో.
గృహ్ణాన్ జంభారిసంష్రేషితరథకవచౌ రావణేనాభియుధ్యన్
బ్రహ్మాస్త్రేణాస్య భిందన్ గళతతిమబలామగ్నిశుద్ధాం ప్రగృహ్ణాన్।
దేవశ్రేణీవరోజ్జీవితసమరమృతై ఋక్షసంఘైః
లంకాభర్త్రా చ సాకం నిజనగరమగాః సప్రియః పుష్పకేణ॥
7వ భావము:-
శ్రీమన్నారాయణమూర్తీ! శ్రీరాముని రూపముననున్న నీవు - దేవేంద్రుడు పంపిన రథమును, కవచమును స్వీకరించితివి. యుద్ధమున రావణుని పదితలలనూ బ్రహ్మాస్త్ర్రముతో ఖండించితివి. తదనంతరము అగ్నిచే పునీతయైన 'సీతను' స్వీకరించితివి; యుద్ధమున మరణించిన వానరులను - దేవతలు పునర్జీవితులను చేసిరి. రావణమరణానంతరము - లంకాధిపతియైన విభీషణునితోను, వానరులతోను, సీతతోనూ కలిసి నీవు పుష్పకవిమానములో నీ పురమగు అయోధ్యను చేరితివి.

35-8-శ్లో.
ప్రీతో దివ్యాభిషేకైయుతసమధికాన్ వత్సరాన్ పర్యరంసీః
మైథిల్యాం పాపవాచా శివశివ కిల తాం గర్భిణీమభ్యహాసీః।
శత్రుఘ్నేనార్దయిత్వా లవణనిశిచరం ప్రార్ధయాశ్శూద్రపాశం
తావద్వాల్మీకిగేహే కృతవసతిరుపాసూత సీతాసుతౌ తే॥
8వ భావము:-
శ్రీమన్నారయణమూర్తీ! నీవు అయోధ్యను చేరగా - పవిత్రజలములతో నీకు పట్టాభిషేకము జరిగినది; నీవు సంతోషముతో పెక్కుసంవత్సరములు రాజ్యమును సుభిక్షముగా పరిపాలించితివి. (ఇట్లుండగా ఒకనాడు) గర్భవతియైన మైధిలి (సీతాదేవి) పై నిందావాక్కు నీచెవిని పడగా - శివ,శివా! ఆమెను విడిచివేసితివి. 'లవణుడు' అను రాక్షసుని 'శత్రుఘ్నునిచే' సంహరింపజేసితివి. అధర్మచింతనతో తపమాచరించుచున్న 'శంభూకుని' వధించితివి. ఆసమయమున సీతాదేవి వాల్మీకి ఆశ్రమమున నీపుత్రులకు జన్మనిచ్చెను.

35-9-శ్లో.
వాల్మీకేస్త్వత్సుతోద్గాపితమధురకృతే రాజ్ఞయా యజ్ఞవాటే
సీతాం త్వయ్యాప్తుకామే క్షితిమవిశదసౌ త్వం చ కాలార్థితో౾భూః।
హేతోః సౌమిత్రిఘాతీ స్వయమథ సరయూమగ్ననిశ్శేషభృతైః
సాకం నాకం ప్రయాతో నిజపదమగమో దేవ! వైకుంఠమాద్యమ్॥
9వ భావము:-
శ్రీమన్నారాయణమూర్తీ! శ్రీరాముని రూపముననున్న నీవు యజ్ఞము నిర్వర్తించుచుండగా 'వాల్మీకి మహాముని', నీపుత్రులచే (నీ) రామాయణమును మధురముగా గానము చేయించెను. ఆయజ్ఞవాటిక వద్ద 'వాల్మీకిముని' ఆజ్ఞాపించగా నీవు 'సీతను' తిరిగి పరిగ్రహించుటకు సంసిద్ధుడవైతివి. కాని, 'సీతాదేవి' తనతల్లి భూదేవితో కలిసి అంతర్ధానమయ్యెను; కాలయముడు - నిన్ను వైకుంఠమునకు తిరిగి రావలెనని ప్రార్థంచెను. అంతట నీవే ఒక కారణము సృష్టించి లక్ష్మణుని ముందుగనే వైకుంఠమునకు పంపితివి. అనంతరము నీవు నీ స్వజనులతోను, భృత్యులతోను కలిసి సరయూనదియందు మునిగి అంతర్ధానమయితివి; నీస్వస్థానమగు వైకుంఠమును చేరితివి.

35-10-శ్లో.
సో౾యం మర్త్యావతారస్తవ ఖిలు నియతం మర్త్యశిక్షార్థమేవం
విశ్లేషార్తిర్నిరాగస్త్యజనమపి భవేత్ కామధర్మాతిసక్త్వా।
నోచేత్స్వాత్మానుభూతేః క్వ ను తవ మనసో విక్రియా చక్రపాణే।
స త్వం సత్త్వైకమూర్తే। పవనపురపతే। వ్యాధును వ్యాధితాపాన్॥
10వ భావము:-
శ్రీమన్నారాయణమూర్తీ ! నీవు ఆత్మానందానుభూతిని పొందు ఆత్మారాముడివి. నరుని రూపమున శ్రీరామునిగా జన్మించి - సత్యమార్గము మరియు ధర్మమార్గమునను జీవించిన ఆదర్శమూర్తివి. ఏవికారములేని శుద్ధసత్వగుణమే రూపముగాగల - చక్రపాణీ! మానవునివలె కష్టముననుభవించి ఇతరులకు మార్గము చూపిన ధర్మమూర్తివి. అట్టి గురవాయూరు పురాధీశా! నారోగమును హరించమని నిన్ను ప్రార్ధించుచున్నాను.
 
నవమ స్కంధము
35వ దశకము సమాప్తము.
-x-