నారాయణీయము/నవమ స్కంధము/34వ దశకము

||శ్రీమన్నారాయణీయము||
నవమ స్కంధము

34వ దశకం - శ్రీరామచరితము-1

34-1-శ్లో.
గీర్వాణైరర్ధ్యమానో దశముఖనిధనం కోసలేష్వృష్యశృణగే
పుత్రీయామిష్టిమిష్ట్వా దదుషి దశరథక్ష్మాభృతే పాయసాగ్ర్యమ్।
తద్భుక్త్వా తత్పురంధ్రీష్వపి తిసృషు సమం జాతగర్భాసు జాతో
రామస్త్వం లక్ష్మణేన స్వయమథ భరతేనాపి శత్రుఘ్ననామ్నా॥
1వ భావము:-
దశముఖుడైన రావణాసురుని వలన దేవతలు పెక్కుబాధలకు లోనగుచుండిరి. వారు అప్పుడు, ఆ అసురనాయకుని వధించమని ప్రభూ! నారాయణమూర్తీ! నిన్ను ప్రార్ధించిరి. అదే సమయమున ఋష్యశృంగ మహాముని - కోసల దేశరాజయిన దశరథమహారాజుచే పుత్రకామేష్టి యాగము జరిపించు చుండెను. ఆయాగఫలముగా లభించిన మహిమాన్విత పాయసమును ఋష్యశృంగుడు దశరథునకు ఇచ్చెను. ఆ మహారాజు ఆపాయసమును తనపత్నులకు ఇవ్వగా వారు దానిని భుజించి గర్భవతులయిరి. అప్పుడు, స్వయముగా నీవే 'శ్రీరాముడి' గాను, నీ అంశతో 'లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు' నీకు సోదరులుగాను జన్మించిరి.

34-2-శ్లో.
కోదండీ కౌశికస్య క్రతువరమవితుం లక్ష్మణేనానుయాతో
యాతో భూస్తాత వాచా మునికథితమనుద్వంద్వశాంతాధ్వ ఖేదః।
నౄణాం త్రాణాయ బాణైర్మునివచనబలాత్ తాటకాం పాటయిత్వా
లబ్ద్వా౾స్మాదస్త్రజాలం మునివనమగమో దేవ సిద్ధాశ్రమాఖ్యమ్॥
2వ భావము:-
ప్రభూ! ఒకనాడు, నీ తండ్రియగు దశరథుడు - 'విశ్వామిత్రునికి' ఇచ్చిన మాటప్రకారము, నీవు ఆ ముని 'యాగమును రక్షించుటకు, లక్ష్మణుడితో కలిసి, కోదండమును చేతపట్టి ఆ మునివెంట బయలుదేరితివి. మార్గాయాసము తెలియకుండుటకు, ఆ మహాముని మీకు 'బలా, అతిబలా' అను శక్తివంతమయిన రెండు మంత్రములను ఉపదేశించెను. విశ్వామిత్రుని అనుజ్ఞతో (మార్గమధ్యమున) నీవు రాక్షసియగు 'తాటకిని' వధించి ప్రజలను రక్షించితివి. అప్పుడు విశ్వామిత్రుని ఉపదేశముతో నీవు అనేక మహాస్త్రములను పొందితివి; ఆ మునివెంట - తపోవనమగు 'సిద్ధాశ్రమమును' చేరితివి.

34-3-శ్లో.
మారీచం ద్రావయిత్వా మఖశిరసి శరైరన్యరక్షాంసి నిఘ్నన్
కల్యాం కుర్వన్నహల్యాం పథి పదరజసా ప్రాప్య వైదేహగేహమ్।
భిందానశ్చాంద్రచూడం ధనురవనిసుతామిందిరామేవ లబ్ద్వా
రాజ్యం ప్రాతిష్ఠథాస్త్వం త్రిభిరపి చ సమం భ్రాతృవీరైస్సదారైః॥
3వ భావము:-
ప్రభూ! 'సిద్ధాశ్రమమున' - విశ్వామిత్రుని యజ్ఞము నాశనముచేయుటకు యత్నించుచున్న 'రాక్షసుడు మారీచుని' పారద్రోలితివి. (అతని సహచర గణమయిన) ఇతర రాక్షసులను నీ బాణములతో వధించితివి. విదేహరాజ్యమునకు వెళ్ళుచూ, మార్గమధ్యమున నీ పాదధూళితో 'అహల్యకు' శాపవిమోచనము కలిగించితివి. 'విదేహరాజ్యమున' - 'శివధనస్సును' విరిచి 'సీత రూపమున' భూమి నుండి ఉద్భవించిన లక్ష్మీదేవిని పరిణయమాడితివి; వీరులగు నీ సోదరులు తమ పత్నులతో కలిసి నిన్ను అనుసరించగా సీతాసమేతుడవై, నీవు నీ రాజ్యమునకు వెడలితివి.

34-4-శ్లో.
అరుంధానే రుషాంధే భృగుకులతిలకే సంక్రమయ్య స్వతేజో
యాతే యాతో౾స్వయోధ్యాం సుఖమిహ నివసన్ కాంతయా కాంతమూర్తే।
శత్రుఘ్నేనైకదా౾థో గతమతి భరతే మాతులస్యాధివాసం
తాతారబ్ధో౾భిషేస్తవ కిల విహతః కేకయాధీశపుత్ర్యా॥
4వ భావము:-
శ్రీమన్నారయణమూర్తీ! మార్గమధ్యమున (నీవు నీరాజ్యమునకు వెడలుచుండగా) భృగువంశమునకు తలమానికము వంటి పరశురాముడు నిన్ను అడ్డగించి తనవద్ద కల విష్ణుచాపమును ఎక్కుపెట్టమని దర్పముగా పలికెను. తదుపరి, 'శ్రీరాముని' రూపమున నున్న నిన్ను గుర్తెరిగి, ఆ పరశురాముడు తనతేజమును నీకు సంక్రమింపజేసి వెడలిపోయెను; నీవు అయోధ్యానగరము చేరి సీతాదేవితో సంతోషముగా నుంటివి. ఒకనాడు భరతుడు శతృఘ్నునితో కలిసి తన మేనమామ రాజ్యమునకు వెడలెను. ఆసమయమున దశరథమహారాజు 'శ్రీరామునికి' పట్టాభిషేకము చేయుటకు నిశ్చయించెను. కాని ఆ పట్టాభిషేకమునకు, దశరథుని మూడవ భార్యయగు 'కైక' విఘ్నము కలిగించెను.

34-5-శ్లో.
తాతోక్త్యా యాతుకామో వనమనుజవధూసంయుత శ్చాపధారః
పౌరానారుధ్య మార్గే గుహనిలయగతస్త్వం జటాచీరధారీ।
నావా సంతీర్య గంగామధిపదవిపునస్తం భరద్వాజమారాత్
సత్వా తద్వాక్యహేతోరతిసుఖమవసచ్ఛిత్రకూటే గిరీంద్రే।
5వ భావము:-
అప్పుడు, రామావతారమున ఉన్న ఓ! నారాయణమూర్తీ! వనవాసమునకు వెళ్ళమనిన నీ తండ్రి మాటను మన్నించి, నీవు ధనుర్ధారివై, నీ భార్య సీతతోనూ, సోదరుడు (లక్ష్మణుడు) తోను కలిసి వనముల కేగితివి; నిన్ను అనుసరించుచున్న ప్రజలను వారించి వారిని వెనుకకు పంపివేసితివి. 'గుహుని' నివాసమునకు చేరి జటధారివై నారవస్త్రములను ధరించితివి; నావ నధిరోహించి గంగానదిని దాటి భరద్వాజమునీంద్రుని ఆశ్రమమునకు చేరి ఆ మునీశ్వరునకు భక్తితో నమస్కరించితివి. ఆ మునీశ్వరుడు నిన్ను చిత్రకూట పర్వతమునకు ఏగి అచట నివసించమని పలుకగా నీవా పర్వతమును చేరి ఆనందముగా నివసించితివి.

34-6-శ్లో.
శృత్వా పుత్రార్తిఖిన్నం ఖలు భరతముఖాత్ స్వర్గయాతం స్వతాతం
తప్తో దత్వాంబు తస్మై నిదధిథ భరతే పాదుకాం మేదినీం చ।
అత్రిం నత్వా౾థ గత్వా వనమతివిపులం దండకం చండకాయం
హత్వా దైత్యం విరాధం సుగతిమకలయశ్చారుః। శారభంగీమ్॥
6వ భావము:-
ప్రభూ! శ్రీమన్నారయణమూర్తీ! "పుత్రుడవగు నీవు వనవాసమునకు వెడలగనే - దుఃఖముతో దశరథుడు మరణించెనని" భరతుడు నీకు తెలిపెను. అదివిని నీవు సంతాపము చెంది, నీ తండ్రికి జలతర్పణము గావించితివి. భరతుడు కోరగా అతనికి నీ పాదుకలను ఒసగితివి; రాజ్యభారమును అప్పగించితివి. పిమ్మట 'అత్రి' మహర్షిని దర్శించి, చిత్రకూట పర్వతమునుండి దండకారణ్యమునకు వెడలితివి. అతి విస్తారమయిన ఆ దండకారణ్యమున భయంకరాకారుడగు 'విరాధుడు' అను' రాక్షసుని సంహరించితివి; 'శరభంగ' మునీశ్వర ఆశ్రమమునకు వెళ్ళి ఆ మునివరునకు సద్గతిని అనుగ్రహించితివి.

34-7-శ్లో.
నత్వా౾గస్త్యం సమస్తాశరనికరసపత్రాకృతిం తాపసేభ్యః।
ప్రత్యశ్రౌషీః ప్రియైషీ తదను చ మునినా వైష్ణవే దివ్యచాపే।
బ్రహ్మస్త్రే చాపి దత్తే పథి పితృసుహృదం వీక్ష్య భూయో జటాయుం
మోదాద్గోదాతటాంతే పరిరమసి పురా పంచవట్యాం వధూట్యా॥
7వ భావము:-
రామావతారమును ధరించిన నారాయణమూర్తీ! అనంతరము నీవు 'అగస్త్యాశ్రమమునకు' వెళ్ళి ఆ మునీశ్వరునకి నమస్కరించితివి; అచటచేరిన తాపసులకు- వారిని బాధించుచున్న అసురగణముల నెల్లరును సంహరించెదనని ప్రతిజ్ఞ చేసితివి; వారికి అభయమొసగితివి. 'అగస్త్యముని' ఇచ్చిన విష్ణుఛాపమును (ధనస్సును) మరియు బ్రహ్మాస్త్రమును స్వీకరించితివి. మార్గమధ్యమున నీ తండ్రి దశరథుని మిత్రుడగు 'జటాయువును' చూచితివి. పిదప, గోదవరీ తీరముచేరి, పంచవటిలో నీ పత్నియగు సీతతో కలిసి ఆనందముగా విహరించసాగితివి.

34-8-శ్లో.
ప్రాప్తాయాః శూర్పణఖ్యా మదనచలధృతేరర్థనైర్నిస్సహాత్మా
తాం సౌమిత్రౌ విసృజ్య ప్రబలతమరుషా తేన నిర్లూననాసామ్।
దృష్ట్వైనామ్ రుష్టచిత్తం ఖిరమభిపతితం దూషణం చ త్రిమూర్ధం
వ్యామింసీరాశరానప్యయుతసమధికాంస్తత్క్షణాదక్షతోష్మా
8వ భావము:-
ఒకనాడు 'శూర్పణఖ' అను రాక్షస స్త్రీ అచ్చటకు వచ్చి, ప్రభూ! నారాయణమూర్తీ! వాంఛాలోలయయై 'శ్రీరాముని' రూపమున నున్న నిన్ను అభిలషించగా (ఏకపత్నీవ్రతుడవైన) నీవు ఆమెను లక్ష్మణుని వద్దకు పంపితివి; లక్ష్మణుడు మిక్కిలి కోపించి ఆ 'శూర్పణఖ' ముక్కును, చెవులును కోసివేసెను. 'శూర్పణఖను' అట్లు చూచిన 'ఖరుడు', 'దూషణుడు', 'త్రిశరుడు'అను రాక్షసులు అత్యంత ఆగ్రహముతో నిన్ను ఎదుర్కొనిరి. తత్క్షణమే నీవు వారిని వధించితివి; వారితోపాటు పదివేలకుమించిన వారి రాక్షస సేనలనుకూడా నీవు సంహరించితివి.

34-9-శ్లో.
సోదర్యా ప్రోక్త వార్తావివశ దశముఖాదిష్టమారీచమాయా-
సారంగం సారసాక్ష్యా స్పృహితమనుగతః ప్రావధీర్భాణఘాతమ్।
తన్మాయాక్రందనిర్యాపిత భవదమనుజాం రావణస్తామహార్షీత్
తేనార్తో౾పి త్వమంతః కిమపి ముదమధాస్తద్వధోపాయలాభాత్॥
9వ భావము:-
శ్రీమన్నారయణమూర్తీ! దశముఖుడైన 'రావణాసురుడు’ - తనసోదరి 'శూర్పణఖ' జరిగినది చెప్పగా విని, కోపోద్రిక్తుడై, 'రాక్షసుడు మారీచుని', ‘మాయలేడి' రూపము ధరించమని ఆజ్ఞాపించెను. తామర రేకులవంటి కన్నులుగల 'సీత' ఆ (మాయ) లేడిని చూచి తనకు కావలెనని రాముని కోరెను. ప్రభూ! నీవు ఆ 'మాయలేడిని' నీ బాణముతో వధించితివి. మాయలేడి రూపమున ఉన్న 'మారీచుడు' (రాముని అనుకరణతో) చేసిన ఆక్రందనను విని, లక్ష్మణుని సీత బయటకు పంపెను. అప్పుడు రావణుడు సీతను అపహరించెను. సీతాపహరణ రామునికి శోకకారణమే అయిననూ రావణాసురుని సంహరించుటకు అది కారణభూతమగునని ప్రభూ! నీవు సంతసించితివి.

34-10-శ్లో.
భూయస్తన్వీం విచిన్వన్నహృత దశముఖస్త్వద్వధూం మద్వధేనే౾
త్యుక్త్వాయాతే జటాయౌ దివమథ సుహృదః ప్రాతనోః ప్రేతకార్యమ్।
గృహ్ణనం తం కబంధం జఘవిథ శబరీం ప్రేక్ష్య పంపాతటే త్వం
సంప్రాప్తో వాతసూమం భృశముదితమానాః పాహి వాతాలయేశ॥
10వ భావము:-
ప్రభూ! నారాయణమూర్తీ! శ్రీరాముని అవతారముననున్న నీవు నీ పత్నియగు 'సీతను' వెదుకుచూ మార్గమధ్యమున 'జటాయువును' చూచితివి. రావణుడు తనను సంహరించి - సీతను (నీ భార్యను) తీసుకొని వెళ్ళెనని నీకు చెప్పి 'జటాయువు' స్వర్గస్తుడయ్యెను. నీవు ఆ 'జటాయువుకు' ప్రేతకర్మలు నిర్వర్తించితివి. మీ సోదరులిరువురిని పట్టుకొనిన రాక్షసుడు 'కబంధుని' వధించి అచటనుండి 'శబరి' వద్దకు వెళ్ళితివి. ఆమె ఆతిథ్యమును స్వీకరించి, అచటనుండి పంపానదీతీరమునకు చేరితివి. అక్కడ వాయుపుత్రుడగు 'హనుమంతుని' కలిసి ఆనందించితివి. అట్టి గురవాయూరు పురాధీశా! నన్ను రక్షింపమని నిన్ను ప్రార్ధించుచున్నాను.

నవమ స్కంధము
34వ దశకము సమాప్తము.
-x-