నారాయణీయము/దశమ స్కంధము/90వ దశకము

||శ్రీమన్నారాయణీయము||
దశమ స్కంధము

90- వ దశకము - దశకము-విష్ణుమహత్త్వము


90-1
వృకభృగుమునిమోహిన్యంబరీషాదివృత్తే-
ష్వయి తవ హి మహత్త్యం సర్వశర్వాదిజైత్రమ్।
స్థితమిహ పరమాత్మన్।నిష్కలార్వాగభిన్నం
కిమపి యదవభాతం తద్ది రూపం తవైవ॥
1వ భావము :-
భగవాన్! శ్రీమన్నారాయణా! వృకాసురుడు, భృగుమహార్షి, మోహిని, అంబరీషాదుల వృత్తాంతములు, ఘనమగు నీ మహత్యములకు మచ్చుతునకలు. నీ ఉన్నతశక్తి శర్వాదిదేవతలకు సహితము లేదు. వారందరికన్నను మిక్కిలి మహత్యముకల పరమాత్మవు నీవు. ప్రభూ! విభిన్నముగా అవతరించి ఏది ప్రకాశించుచున్నదో ఆ రూపము నీవే!

90-2
మూర్తిత్రయేశ్వరసదాశివపంచకం యత్
ప్రాహుః పరాత్మవపురేవ సదాశివో౾స్మిన్।
తత్రేశ్వరస్తు స వికుంఠపదస్త్వమేవ
త్రిత్వం పునర్భజసి సత్యపదే త్రిభాగే॥
2వ భావము :-
భగవాన్! శ్రీమన్నారాయణా! బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర మరియు సదాశివ అను ఈ అయిదు తత్వములు పరతత్వరూపములని చెప్పబడుచున్నవి. ఆ అయిదింటిలో నీవు సదాశివ పరతత్వరూపము. వైకుంఠమున నెలకొనియున్న ఈశ్వర (పరమేశ్వర) తత్వరూపము కూడా నీవే! అంతియేకాక, బ్రహ్మ, విష్ణు మరియు రుద్రుడు అను రూపములతో సత్యలోకమున ఆవిర్భవించినది కూడా, ప్రభూ! నీవే!

90-3
తత్రాపి సాత్త్వికతనుం తవ విష్ణుమాహుః
ధాతా తు సత్త్వవిరళో రజసైవ పూర్ణః।
సత్వోత్కటత్వమపి చాస్తి తమోవికార-
చేష్టాదికం చ తవ శంకరనామ్ని మూర్తౌ॥
3వ భావము :-
భగవాన్! శ్రీమన్నారాయణా! సత్వగుణ సంపన్నమయినది నీ ‘విష్ణు’రూపము. సత్వగుణముతోపాటు రజోగుణము కలది నీ ‘బ్రహ్మ’రూపము. సత్వగుణమేకాక తమోగుణముకూడ కలిగిన నీ మూడవ రూపమే 'శంకరుడు'. పరమాత్మా! నీ రూపము సర్వగుణాత్మకము.

90-4
తం చ త్రిమూర్త్వతిగతం పరపూరుషం త్వాం
శర్వాత్మనాపి ఖలు సర్వమయత్వహేతోః।
శంసంత్యుపాసనవిధౌ తదపి స్వతస్తు
త్వద్రూపమిత్యతిదృఢం బహు నః ప్రమాణమ్॥
4వ భావము :-
భగవాన్! శ్రీమన్నారాయణా! నీవే త్రిమూర్తులకు మూలము. త్రిమూర్త్యాత్మకము అయున పరతత్వము కూడా నీవే! సర్వము తానే అయి ఉన్నవాడు శర్వుడు (శివుడు) అని వ్యవహరించబడుచు ఉపాసించబడుతున్న పరతత్వరూపము కూడా నీవే అని చెప్పుటకు, ప్రభూ! ధృఢమైన ధృష్టాంతములు కలవు.

90-5
శ్రీ శంకరో౾పి భగవాన్ సకలేషు తావత్
త్వామేవ మానయతి యో న హి పక్షపాతీ।
త్వన్నిష్ఠమేవ స హి నామసహస్రకాది-
వ్యాఖ్యాద్భవత్ స్తుతిపరశ్చ గతిం గతో౾ంతే॥
5వ భావము :-
భగవాన్! శ్రీమన్నారాయణా! భగవత్పాదులగు శంకరాచార్యులు విష్ణుసహస్ర నామమునకు భాష్యము వ్రాసి సహస్ర నామములతో నిన్ను స్తుతించిరి; పరతత్వరూపము ఇది అని నిర్ద్వందముగా చెప్పకపోయినను, ప్రభూ! వారు నీ విష్ణు రూపమునకు పరతత్వరూపమును ఆపాదించిరి; అంత్యమున నీ సాయుజ్యమును పొందిరి.

90-6
మూర్తిత్రయాతిగమువాచ చ మంత్రశాస్త్ర-
స్యాదౌ కలాయసుషమం సకలేశ్వరం త్వామ్।
ధ్యానం చ నిష్కళమసౌ ప్రణవే ఖలూక్త్వా
త్వామేవ తత్ర సకలం నిజగాద నా౾న్యమ్॥
6వ భావము :-
భగవాన్! ఆదిశంకరులు బ్రహ్మ,విష్ణు, మహేశ్వరుల మూర్తిత్రయమునకు పరతత్వము మూలము అని పేర్కొనిరి. 'ప్రపంచసారము' అను మంత్రశాస్త్రగ్రంథములో ఆ పరతత్వము నీవేయనియు, నీ రూపమ నల్లకలువపుష్పమువలె మనోహరమైన ఛాయ కలిగియుండునని వర్ణించిరి. ప్రణవమును ఆశ్రయించి పరతత్వమును (నిష్కలత్వమును) ధ్యానము చేయమని పేర్కొనుచు, ఆ నిష్కలత్వమును ధ్యానించుటకు సకలమునందు వ్యాపించియున్న నీ రూపమునే సూచించిరి.

90-7
సమస్తసారే చ పురాణసంగ్రహే విసంశయం త్వన్మహిమైన వర్ణ్యతే।
త్రిమూర్తియుక్ సత్యపదత్రిభాగతః పరం పదం తే కథితం న శూలినః॥
7వ భావము :-
మాధవాచార్యులవారు 'సమస్త పురాణ సంగ్రహము' అను గ్రంధమును రచించిరి. ఆ గ్రంధములో 'శివునినే' పరమదైవముగా అర్చించమని పేర్కొనియూ, ప్రభూ! శ్రీమన్నారాయణా! నీ మహిమలనే ఎక్కువ వర్ణించిరి. సత్యలోకము మూడు భాగములుగా విభజించబడి యుండెననియూ, అందు వైకుంఠమను పరమపదము విష్ణుమూర్తి స్థానమనియూ పేర్కొనిరి.

90-8
యద్భ్రాహ్మకల్ప ఇహ భాగవతద్వితీయ-
స్కంధోదితం వపురనావృతమీశ ధాత్రే।
తస్యైవ నామ హరిశర్వముఖం జగాద
శ్రీమాధవశ్శివపరో౾పి పురాణసారే॥
8వ భావము :-
మాధవాచార్యులు, భాగవత ద్వితీయ స్కందములో విశ్వసృష్టి ఆరంభమప్పుడు బ్రహ్మకమలమునుండి ఉద్భవించిన బ్రహ్మదేమునకు సాక్షాత్కరించిన భగవత్ రూపమును; హరి, హర అను రెండు నామములతో చెప్పిరి. శివభక్తుడై యుండియూ వారు తన గ్రంథములో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల రూపము ఒకే పరతత్వరూపమని చెప్పిరి. ప్రభూ! నారాయణా! ఆ పరతత్వరూపము నీవే!

90-9
యే స్వప్రకృత్యనుగుణా గిరిశం భజంతే తేషాం ఫలం హి ధృఢయైవ తదీయభక్త్యా।
వ్యాసో హి తేన కృతవానధికారిహేతోః స్కాందాదికేషు తవ హానివచో౾ర్థవాదైః॥
9వ భావము :-
తమతమ స్వభావములకు అనుగుణముగా శివభక్తులు ధృఢభక్తితో పరమశివుని ఆరాధించి ఫలమును పొందుచుందురు. వ్యాసమహర్షి 'స్కాంద' మొదలగు పురాణములలో పరమశివునియందు ధృఢభక్తి కలిగి లబ్ధిపొందవచ్చని పలుకుచూ, ప్రభూ! నారాయణా! న్యూనతపరుచు కొన్ని వ్యాఖ్యలు నీపై చేసిరి. వాటిని అర్థవాదముగా గ్రహించవలెనేగాని అన్యథా కాదు.

90-10
భూతార్థకీర్తిరనునాదవిరుద్ధవాదౌ త్రేధార్థవాదగతియః ఖలు రోచనార్థాః
స్కాందాదిశేషు బహనోత్ర నిరుద్థనాదౌ త్వేత్తామసత్వపరిభూత్యుపశిక్షణాద్యాః॥
10వ భావము :-
ఏదో ఒక ప్రయోజనము ఆశించి వినువారికి ఆసక్తి కలిగించుటకు చెప్పు అతిశయోక్తులను అర్థవాదమనియు; ఉన్నవిషయమునే అత్యధికముగా వర్ణించుటను భూతార్థవాదమనియు; ఇట్లయి ఉండవచ్చునని ఊహించి వర్ణించుటను అనువాద అర్థవాదమనియు; ప్రమాణమునకు నిలబడ లేని విషయమునకు విషయములు కల్పించి కీర్తించుటను విరోధవాద అర్థవాదమనియు అందురు. స్కందపురాణము మొదలగు పురాణములలో వ్యాసమహర్షి నిన్ను తామసుడు అనుటయూ, మరికొన్నిచోట్ల పరాభవమును పొందితివి అనుట, శివుడు నీకు చెప్పెను అనునదియు, ప్రభూ! నారాయణమూర్తీ! అవి విరుద్ధ అర్థవాదమునకు చెందినవే!

90-11
యత్ కించిదప్యవిదుషా౾పి విభో మయోక్తం
తన్మంత్రశాస్త్రవచనాద్యభిదృష్టమేవ।
వ్యాసోక్తిసారమయ భాగవతోపగీత।
క్లేశాన్ విధూయ కురు భక్తిభరం పరాత్మన్॥
11వ భావము :-
భగవాన్! నాస్వల్ప పరిజ్ఞానముతో మంత్ర శాస్త్రములోని కొన్ని విషయములను మాత్రము చెప్పితిని. వ్యాసునిచే రచించబడిన సకలగ్రంథసారమనబడు భాగవతములో పరమోన్నతముగా కీర్తించబడిన పరమాత్మా! ఓ! గురవాయూరు పురాధీశా! నా కష్టములను తొలగించుము. నీయందు పరిపూర్ణ భక్తిని ప్రసాదించుము అని నిన్ను ప్రార్ధించుచున్నాను.

దశమ స్కంధము పరిపూర్ణం
90వ దశకము సమాప్తము
-x-