నారాయణీయము/దశమ స్కంధము/87వ దశకము

||శ్రీమన్నారాయణీయము||
దశమ స్కంధము

87- వ దశకము - కుచేలోపాఖ్యానము


87-1
కుచేలనామా భవతస్సతీర్థ్యతాం గత స్స సాందీపనిమందిరే ద్విజః।
త్వదేకరాగేణ ధనాదినిఃస్సృహో దినాని నిన్యే ప్రశమీ గృహాశ్రమీ॥
1వ భావము :-
భగవాన్! శ్రీకృష్ణా! కుచేలుడు నీకు బాల్యస్నేహితుడు. నీ అభిమాని. 'సాందిపని ముని' ఆశ్రమములో నీకు సహాధ్యాయి. సిరిసంపదలయందు పేరాశలేక గృహస్థాశ్రమములో ప్రశాంతముగా జీవనము గడుపుచున్న ఒక పేద బ్రాహ్మణుడు.

87-2
సమానశీలా౾పి తదీయ వల్లభా తథైవ నో చిత్తజయం సమేయుషీ।
కదాచిదూచే బత వృత్తిలబ్ధయే రమాపతిః కిం న సఖానిషేవ్యతే॥
2వ భావము :-
భగవాన్! శ్రీకృష్ణా! అతని పత్ని అతనికి తగిన గుణవంతురాలు. ఆర్ధిక ఇబ్బందులతో ఆమె మనసున ప్రశాంతత కోల్పోవుచుండెను. ఆమె కుచేలునితో ఒకనాడిట్లనెను. "నీమిత్రుడు - లక్మీపతి అయిన శ్రీకృష్ణుని ఎందుకు కలవరాదు? అతను మనకు సహాయపడవచ్చును కదా!" అని పలికెను.

87-3
ఇతీరితోయం ప్రియయా క్షుధార్తయా జుగుప్సమానో౾పి ధనే మదావహే।
తదా త్వదాలోకనకౌతుకాద్యయౌ వహాన్ పటాంతే పృథుకానుపాయనమ్॥
2వ భావము :-
భగవాన్! శ్రీకృష్ణా! సంపద మనిషికి మదము కలిగించునన్న భావనతో కుచేలుడు ధనార్జనపై అయిష్టుడై ఉండెను. అయినప్పటికీ దారిద్ర్యముతో భార్యపలికిన మాటలువిని, ఆపైన చిరకాలముగా చూడని నిన్ను చూడవచ్చునన్న కోరికతో కొన్ని అటుకులు కొంగున మూటకట్టుకొని నీ వద్దకు పయనమయ్యెను.

87-4
గతోయమాశ్చర్యమయీం భవత్పురీం గృహేషు శైబ్యాభవనం సమేయివాన్।
ప్రవిశ్య వైకుంఠ మివాప నిర్వృతిం తవాతిసంభావనయా తు కిం పునః॥
4వ భావము :-
భగవాన్! కుచేలుడు నీ ద్వారకాపురినిచేరి ఆ నగరవైభవమునకు ఆశ్చర్యపోయెను; రమణీయముగా శోభిల్లుచున్న రుక్మిణీదేవి భవనమును ప్రవేశించెను. వైకుంఠమును తలపించు ఆ భవనమును చూచి కుచేలుడు పరమానందమును పొందెను. ప్రభూ! శ్రీకృష్ణా! నీవప్పుడు కుచేలునకు ఎదురేగి ఆదరముతో ఆహ్వానించి అతనిని ఆదరించితివి; నీ ఆదరణతో అతడు అమితానందమును పొందెను.

87-5
ప్రపూజితం తం ప్రియయా చ వీజితం కరే గృహీత్వా౾కథయః పురాకృతమ్।
యదింధనార్థం గురుదారచోదితైరపర్తువర్షం తదమర్షి కాననే॥
5వ భావము :-
ప్రభూ! శ్రీకృష్ణా! మీరిరువురు విశ్రాంతిగా కూర్చొని మాట్లాడు కొనుచుండగా రుక్మిణీదేవి వింజామరతో విసురుచు సపర్యచేయసాగెను. కుచేలుని హస్తమును నీ చేతిలోనికి తీసుకొని, 'సాందీపని ముని' ఆశ్రమములో సహవిద్యార్ధులుగా నున్నప్పటి విషయములను ముచ్చటించు కొనసాగిరి. గురుపత్నిఆజ్ఞతో ఒకనాడు వంటచెరుకు తెచ్చుటకు అడవికి వెళ్ళినప్పుడు కురిసిన అకాలవర్షములో మీరు పడ్డ కష్టములను కుచేలునికి గుర్తుచేసితివి.

87-6
త్రపాజుషో౾స్మాత్ పృథుకం బలాదథ ప్రగృహ్య ముష్టౌ సకృదాశితే త్వయా।
కృతం కృతం నన్వియతేతి సంభ్రమాద్రమా కిలోపేత్య కరం రురోధ తే॥
6వ భావము :-
ప్రభూ! శ్రీకృష్ణా! కుచేలుడు నీకొఱకు తెచ్చిన అటుకులు నీకిచ్చుటకు బిడియముతో సంకోచించుచుండెను. అదిగ్రహించి వాటిని బలవంతముగా నీవే అతనినుంచి తీసుకొని ఒక గుప్పెడు నోటిలో వేసుకొంటివి. ఇంకనూ తిననెంచుచున్న నిన్ను రుక్మిణీదేవి వేగముగా వచ్చి "చాలు! చాలు!", అని నీ చేతిని పట్టుకొని నిన్ను ఆపివేసెను.

87-7
భక్తేషు భక్తేన స మానితస్త్వయా పురీం వసన్నేకనిశాం మహాసుఖమ్।
బతాపరేద్యుర్ర్ధవిణం వినా యయౌ విచిత్రరూపస్తవ ఖల్వనుగ్రహః॥
7వ భావము :-
ప్రభూ! కృష్ణా! భక్తులకు దాసుడవగు నీ ఆదరణను పొందిన కుచేలుడు ఆ రాత్రి సుఖముగా ద్వారకానగరమున నిద్రించెను. మరుసటి దినమున ఏ సహాయమును నీనుంచి స్వీకరంపకనే కుచేలుడు ఆ నగరమును వీడి వెడలిపోయెను. భగవాన్! నీ భక్తులను నీవు వివిధములగా అనుగ్రహించెదవు. నీ మహిమలు అనంతములు.

87-8
యది హ్యయాచిష్యమదాస్యదచ్యుతో వదామి భార్యాం కిమతి వ్రజన్నసౌ।
త్వదుక్తిలీలాస్మితమగ్నధీః పునః క్రమాదపశ్యన్ మణిదీప్రమాలయమ్॥
8వ భావము :-
ప్రభూ! శ్రీకృష్ణా! కుచేలుడు ఇంటికి తిరిగిపోవుచు ఇట్లు తలపోయసాగెను. "నేను అర్థించి ఉండినచో అచ్యుతుడు నాకు తప్పక ధనసహాయము చేసియుండెడివాడు. ఇప్పుడు నా భార్యకు ఏమి చెప్పుదును?" అని తలపోయుచు, తన గృహప్రాంత దరిదాపునకు వచ్చెను. అతనికి అక్కడ క్రమక్రమముగా మణిమయఖచితమై ప్రకాశించుచున్న ఒకగృహము కనిపించెను.

87-9
కిం మార్గవిభ్రంశ ఇతి భ్రమన్ క్షణం గృహం ప్రవిష్టస్స దదర్శ వల్లభామ్।
సఖీపరీతాం మణిహేమభూషితాం బుబోధ చ త్వత్కరుణాం మహాద్భుతామ్॥
9వ భావము :-
ప్రభూ! శ్రీకృష్ణా! "నేను మార్గము తప్పివచ్చితినా! ఏమి?" అని కుచేలుడు ఒక క్షణము భ్రమించెను. గృహంతర్భాగమును ప్రవేశించి అచ్చట తన భార్య ఇతర స్త్రీలతో కలిసి ఆభరణములను అలంకరించుకొని యుండుట చూచెను. అది తన గృహమే అని గ్రహించెను. భగవాన్! ఇది అంతయూ అద్భుతమగు నీ కృపవలననే అని తెలుసుకొనెను.

87-10
స రత్నశాలాసు వసన్నపి స్వయం సమున్నమద్భక్తిభరో౾మృతం యయౌ।
త్వమేవమాపూరితభక్తవాంఛితో మరుత్పురాధీశ।హరస్వ మే గదాన్॥
10వ భావము :-
ప్రభూ! శ్రీకృష్ణా! కుచేలుడు మణిఖచితమగు ఆ భవనములో నివసించుచున్నను నిరంతరమూ భక్తితో నిన్నే తలచుచూ జీవించెను; అంత్యమున ముక్తిని పొందెను. భక్తుల అభీష్టములు తీర్చు ఓ! గురవాయూరు పురనాథా! నా రోగమును హరించుము అని నిన్ను అర్ధించుచున్నాను.

దశమ స్కంధము
87వ దశకము సమాప్తము
-x-