నారాయణీయము/దశమ స్కంధము/82వ దశకము
||శ్రీమన్నారాయణీయము||
దశమ స్కంధము
82- వ దశకము - ఉషాపరిణయము- నృగమహారాజునకుశాపవిముక్తి
82-1
ప్రద్యుమ్నో రౌక్మిణేయస్స ఖలు తవ కలా శంబరేణాహృతస్తం
హత్వా రత్యా సహప్తో నిజపురమహరద్ రుక్మికన్యాం చ ధన్యామ్।
తత్పుత్రో౾థానిరుద్ధో గుణనిధిరవహద్రోచనాం రుక్మిపౌత్రీం
తత్రోద్వాహే గతస్త్వం న్యవధి ముసలినా రుక్మ్యపి ద్యూతవైరాత్॥
1వ భావము :-
భగవాన్! నీకూ రుక్మిణికి జన్మించిన ‘ప్రద్యుమ్నుడు’ జన్మించిన వెంటనే, అతనిని 'శంబరుడు' అను రాక్షసుడు అపహరించుకొని పోయెను. అలా ప్రద్యుమ్నునిగా పుట్టిన వాడు పూర్వం భస్మమైన మన్మథుడే. అతడు కొంతకాలము తరువాత ఆ శంబరుడిని సంహరించి 'రతీదేవితో' కలిసి ద్వారకకు తిరిగి వచ్చెను. వచ్చిన పిమ్మట ధన్యురాలగు రుక్మికూతురు 'రుక్మావతిని' వివాహమాడెను. వీరి కుమారుడే 'అనిరుద్ధుడు'. ఈ అనిరుద్ధుడు రుక్మి పౌత్రియగు 'రోచనను' పరిణయమాడెను. ఆవివాహ మహోత్సవములో బలరామడు, రుక్మి జూదమాడిరి. అప్పుడు జరిగిన గొడవలో బలరాముడు రుక్మిని చంపివేసెను.
82-2
బాణస్య సా బలిసుతస్య సహస్రబాహోః
మాహేశ్వరస్య మహితా దుహితా కిలోషా।
త్వత్పౌత్రమేనమనిరుద్ధమదృష్టపూర్వం
స్వప్నే౾నుభూయ భగవన్। విరహాతురా౾భూత్॥
2 వ భావము :-
భగవాన్! శ్రీకృష్ణా! 'బాణాసురుడు' 'బలిచక్రవర్తి' కుమారుడు; వేయిచేతులుగలవాడు'; గొప్ప శివభక్తుడు. అతనికి 'ఉష' అను ఒక కుమార్తె కలదు. ఒకరోజున ఆమె స్వప్నములో 'అనిరుద్ధుని' చూచెను. అప్పటినుండియు ఆమె అతనిగురించియే పరితపించుచు విరహతాపము అనుభవించుచుండెను. నీ పౌత్రుడగు 'అనిరుద్ధుడుని' ఆమె మునుపెన్నడును చూచియుండలేదు.
82-3
యోగిన్యతీన కుశలా ఖలు చిత్రలేఖా
తస్యాస్సఖీ విలిఖతీ తరుణానశేషాన్।
తత్రానిరుద్థముషయా విదితం నిశాయాం
ఆనేష్ట యోగబలతో భవతో నికేతాత్॥
3వ భావము :-
భగవాన్! కృష్ణా! ఆ ఉషాకన్య విరహబాధను చూచి యోగశక్తులలో నిపుణురాలగు ఆమె చెలికత్తె చిత్రలేఖ తరుణ వయస్కులగు రాజపుత్రుల చిత్రపఠములను చిత్రించి ఆ 'బాణుని' కుమార్తె ఉషకు చూపెను. ఆ రాకుమారి వారిలో 'అనిరుద్ధుని' గుర్తించెను; చిత్రలేఖ తన యోగశక్తితో ఒకరాత్రి ఆ 'అనిరుద్ధుని', ప్రభూ! నీ నగరమునుండి మాయముచేసి రాజకుమార్తెవద్దకు చేర్చెను.
82-4
కన్యాపురే దయితయా సుఖమారమంతం
చైనం కథంచన బబంధుషి శర్వబంధౌ।
శ్రీనారదోక్తతదుదంతదురంతరోషైః
త్వం తస్య శోణితపురం యదుభిర్న్యరుంధాః॥
4వ భావము :-
భగవాన్! కృష్ణా! 'అనిరుద్ధుడు' ఆ 'ఉష' రాకుమారితో కలిసి అంతఃపురములో విహరించుచు ఆనందముగా రోజులు గడుపుచుండెను. ఒకరోజున, శివభక్తుడు అగు 'బాణు మహారాజు' అది చూచి ఆ 'అనిరుద్ధుడిని' బంధించెను. ప్రభూ! నీకు ఈ వార్త నారదుడు తెలిపెను. అదివిని నీవు అమితమగా కోపించితివి; యాదవసేనతో బయలుదేరివెళ్ళి ఆ 'బాణుని' రాజధానియగు 'శోణితపురమును' ముట్టడించితివి.
82-5
పురీపాలశ్శైలప్రియదుహితృనాథో౾స్య భగవాన్
సమం భూతవ్రాతైర్యదుబలమశంకం నిరరుధే।
మహాప్రాణో బాణో ఝటితి యుయుధానేన యుయుధే
గుహః ప్రద్యుమ్నేన త్వమపి పురహంత్రా జఘటిషే॥
5వ భావము :-
భగవాన్! కృష్ణా! హిమవంతుని పుత్రికయగు పార్వతీదేవికి పతి అయిన 'శివుడు ఆ 'శోణితపురమునకు' ' క్షేత్రపాలకుడు. తన భూతగణములతో శివుడు మిమ్ము ఎదుర్కొనెను; యుద్ధమునకు సిద్ధమయ్యెను. మహాశక్తివంతుడగు 'బాణుడు' యుయుధానుడు అను యాదవునితోను, స్కందుడు ప్రద్యమ్నునితోను యుద్ధము చేసిరి. త్రిపురాసుర సంహారియగు శివుడు ప్రభూ! నీతో తలపడి యుద్ధముచేసెను.
82-6
నిరుద్ధాశేషాస్త్రే ముముహుషి తవాస్త్రేణ గిరిశే
ద్రుతా భూతా భీతాః ప్రమథకులవీరాః ప్రమథితాః।
పరాస్కందత్ స్కందః కుసుమశరబాణైశ్చ సచివః
స కుంభాండో భాండం నవమివ బలేనాశు బిభిదే॥
6వ భావము :-
భగవాన్! కృష్ణా! యాదవ సైన్యముపై శివగణము ప్రయోగించిన సకల అస్త్రములను నీవు నిర్వీర్యము చేసితివి. నీవు ప్రయోగించిన అస్త్రములకు భూతగణములు పారిపోయెను, ప్రమధగణ వీరులు వధించబడిరి; శివుడు అలసిపోయి మోహవశుడయ్యెను; ప్రద్యమ్నునిచేతిలో స్కందుడు తీవ్రముగా గాయపడి వెడలిపోయెను; 'బాణుని' మంత్రియగు 'కుంభాండుని' శిరస్సును బలరాముడు తన గదతో అప్పడేచేసిన కుండను బద్ధలుకొట్టి పిండిచేసినట్లుగా ధ్వంసముచేసి హతమార్చెను.
82-7
చాపానాం పంచశత్యా ప్రసభముపగతే ఛిన్నచాపే౾థ బాణే
వ్యర్థేయాతే సమేతో జ్వరపతిశనైరజ్వరి త్వజ్జ్వరేణ।
జ్ఞానీ స్తుత్వాథ దత్త్వా తవ చరితజుషాం విజ్వరం స జ్వరో౾గాత్
ప్రాయో౾ అంతర్జానవంతో౾పి చ బహుతమసా రౌద్రచేష్టా హి రౌద్రాః॥
7వ భావము :-
భగవాన్! కృష్ణా! అప్పుడు వేయి హస్తములుగల 'బాణుడు' అయిదువందల ధనుర్బాణములతో మీతో యుద్ధమునకుతలపడెను. ఆ యుద్ధములో అతని 'బాణములు ధనుస్సులు ఖండించబడి అతని పరాక్రమము వ్యర్ధముకాగా బాణుడు వెనుతిరిగి వెడలిపోయెను. అప్పుడు 'బాణుడు' ప్రార్ధించగా సకల జ్వరములకు అధిపతియగు 'శైవజ్వరము' విజ్రుంభించి యుద్ధరంగమును ప్రవేశించెను. ప్రభూ! నీవాజ్వరమును శ్రీఘ్రమే నిరోధించితివి. ఆ 'శైవజ్వరము' నీ ఎదుటకు వచ్చి నిన్ను శరణుజొచ్చెను; స్తుతించెను; నీ చరితమును కీర్తించువారు జ్వరరహితు లగుదురని పలికి వెడలిపోయెను. రుద్రుని భక్తులగు అసురులు కొందరు జ్ఞానసంపన్నులయు ఉండియూ తమోగుణముతో క్రూరచర్యలకు పాల్పడుచుందురు.
82-8
బాణం నానాయుధోగ్రం పునరభిపతితం దర్పదోషాద్వితన్వన్
నిర్లూనాశేషదోషం సపది బుబుధుషా శంకరేణోపగీతః।
తద్వాచా శిష్టబాహుద్వితయముభయతో నిర్భయం తత్ప్రియం తం
ముక్త్వా తద్దత్తమానో నిజపురమగమస్సానిరుద్ధస్సహోషః॥
8వ భావము :-
భగవాన్! కృష్ణా! ఇదిజరిగిన తరువాత 'బాణుడు' సహస్రబాహువులు తనకు కలవన్న అహంకారముతో తన సకల ఆయుధములను ధరించివచ్చి మరల నిన్ను ఎదుర్కొనెను. ప్రభూ! నీవు అతని సహస్రహస్తములను ఖండించి అతనిని దోషరహితుడిని చేసితివి. అంతట పరమశివుడు నీ ఎదుట నిలచి నిన్ను కీర్తెంచెను. శివుని కోరికమేరకు ఆ శివభక్తుడగు 'బాణునికి' రెండు హస్తములు ప్రసాదించితివి; అతనిని భయరహితుడిని చేసితివి. 'బాణుడు' సమర్పించిన సకలగౌరవములను స్వీకరించి ఉషా అనిరుద్ధులతోకలిసి ద్వారకాపురికి తిరిగి వచ్చితివి.
82-9
ముహుస్తావచ్ఛక్రం వరుణమజయో నందహరణే
యమం బాలానీతౌ దవదహనపానే౾నిలసఖమ్।
విధిం వత్సస్తేయే గిరిశమిహ బాణస్య సమరే
విభో విశ్వోత్కర్షీ తదయమవతారో జయతితే॥
9వ భావము :-
భగవాన్! నీవు దేవేంద్రుని పలుమార్లు ఓడించితివి. నందుని అపహరించినప్పుడు వరుణదేముడిని, మృతుడైన నీ గురుపుత్రుని తీసుకొని వచ్చుచున్నప్పుడు యమధర్మరాజును వినమ్రులను గావించితివి. కాండవదహనమప్పుడు ఆ కార్చిచ్చును అణచి అగ్నిదేముడిపై విజయము సాధించితివి. గోవత్సములను అపహరించినప్పుడు బ్రహ్మదేముడికి గర్వభంగము చేసితివి. ఇప్పుడు బాణాసుర యుద్ధములో పరమశివుని సహితము జయించితివి. ప్రభూ! కృష్ణా ! నీ ఇతర అవతారములు అన్నింటికంటెనూ ఎన్నోవిజయములు సాధించిన నీ ఈ కృష్ణావతారము మహోత్క్రష్టమయినది.
82-10
ద్విజరుషా కృకలాసవపుర్ధరం
నృగనృపం త్రిదివాలయమాపయన్
నిజజనే ద్విజభక్తిమనుత్తమాం
ఉపదిశన్ పవనేశ్వర। పాహి మామ్॥
10వ భావము :-
భగవాన్! కృష్ణా! ఒకప్పుడు నృగుమహారాజు, దానము చేసిన గోవును మరియొక బ్రాహ్మణునికి సహితము ఇచ్చుటచేత, శాపమునకు గురిఅయి ఊసరవెల్లి రూపముతో ఒక కూపములో పడియుండెను. నీవా నృగుమహారాజును అనుగ్రహించి నిజరూపమును ప్రసాదించితివి; దేవలోకమునకు పంపితివి. ద్విజ భక్తికలిగియుండవలెను. బ్రాహ్మణుల సొమ్ము తెలిసికాని తెలియకకాని అపహరించరాదు" అని నుడివితివి. అట్టి గురవాయూరు పురాధీశా! నన్ను రక్షింపుము. రోగమునుండి కాపాడుము.
దశమ స్కంధము
82వ దశకము సమాప్తము
-x-