నారాయణీయము/దశమ స్కంధము/80వ దశకము
||శ్రీమన్నారాయణీయము||
దశమ స్కంధము
80- వ దశకము - శ్యమంతకోపాఖ్యానము
80-1
సత్రాజితస్త్వమథ లుబ్ధవదర్కలబ్ధం
దివ్యం స్యమంతకమణిం భగవన్నయాచీః।
తత్కారణం బహువిధం మమ భాతి నూనం
తస్యాత్మజాం త్వయి రతాం ఛలతో వినోఢుమ్॥
1వ భావము :-
ప్రభూ! కృష్ణా! సత్రాజిత్తు అను ఒక రాజు సూర్యుని ఆరాధించి, అతనినుండి స్యమంతకము అను ఒక దివ్యమణిని పొందెను. ఒకప్పుడు నీవు ఆ రాజును లుబ్ధునివలె -ఆ స్యమంతకమణిని నీకు ఇమ్మని అడిగియుంటివి. ఆ అడుగుటలోఎన్నో కారణములు ఉండి ఉండవచ్చును కాని , నీయందే అనురక్తితోయున్న ఆ సత్రాజిత్తు కుమార్తెయగు సత్యభామను నీవు వివాహమాడవలెనను తలంపుకూడా నీకాసమయములో ఉండి ఉండవచ్చునని నేను భావించుచున్నాను.
80-2
అదత్తం తం తుభ్యం మణివరమనేనాల్పమనసా
ప్రసేనస్తద్ర్భాతా గళభువి వహన్ ప్రాప మృగయామ్।
అహన్నేనం సింహో మణిమహసి మాంసభ్రమవశాత్
కపీంద్రస్తం హత్వా మణిమపి చ బాలాయ దదివాన్॥
2వ భావము :-
భగవాన్! కృష్ణా! అల్పబుద్ధికలిగిన, నీ మహత్తుతెలియని ఆ సత్రాజిత్తు నీకు ఆ మణిని ఈయలేదు. ఒకరోజున అతని సోదరుడగు ప్రసేనుడు విలువైన ఆ దివ్యమణిని తనకంఠమున ధరించి అడవికి వేటకై వెళ్ళెను. ప్రకాశించుచున్న ఆ మణిని మాంసఖండమని భ్రమపడి ఒక సింహము ఆ ప్రసేనుని చంపివేసెను; కపిశ్రేష్టుడు భల్లూకరూపుడు అగు జాంబవంతుడు, ఆ సింహమును సంహరించి ఆ మణిని సంగ్రహించెను; తన బాలునికు ఆటవస్తువుగా ఇచ్చెను.
80-3
శశంసుః సత్రాజిద్గిరమనుజనాస్త్వాం మణిహారం
జనానాం పీయూషం భవతి గుణినాం దోషకణికా।
తతస్సర్వజ్ఞో-పి స్వజనసహితో మార్గణపరః
ప్రసేనం తం దృష్ట్వా హరిమపి గతో౾భూః కపిగుహామ్॥
3వ భావము :-
ప్రభూ! కృష్ణా! దోషముఎంచు స్వభావము కలవానికి సద్గుణములు కలవానిలో ఇసుమంత దోషము కనిపించినను వానికి అది అమృతమువలె తోచును. ప్రసేనుడు తిరిగి రాకపోవుటతో సత్రాజిత్తు చెప్పిన మాటలువిని నీవే ఆమణిని అపహరించితివని అక్కడి ప్రజలు నమ్మిరి. సర్వమూ ఎరిగియూ ఏమీతెలియనివానివలె అప్పుడు, నీవు నీ స్వజనులతో కలిసి ఆ మణిని వెదుకుటకు బయలుదేరితివి. అట్లు వెతుకుచూ వెళ్ళుచుండగా ఒకచోట మరణించిన ప్రసేనునిని మరియు ఒక సింహపు మృతకళేబరమును చూచితివి; కనిపించిన కాలిగుర్తులననుసరించి ఆ జాంబవంతుని గుహను చేరితివి.
80-4
భవంతమవితర్కయన్నతివయాః స్వయం జాంబవాన్
ముకుందశరణం హి మాం క ఇహ రోద్ధుమిత్యాలపన్।
విభో। రఘుపతే। హరే। జయ జయేత్యలం ముష్టిభిః
చిరం తవ సమర్చనం వ్యధిత భక్తచూడామణిః॥
4వ భావము :-
భగవాన్! వాస్తవమునకు.ఆ జాంబవంతుడు నీ భక్తుడు. వయసు ఉడిగినవాడగుటచే నిన్ను గుర్తించలేకపోయెను. నీవు అతని గుహలోనికి ప్రవేశించగానే శత్రువని తలచి నీతో యుద్ధమునకు తలపడెను. "నాకు ముకుందుడే శరణు!! నన్ను ప్రతిఘటించుట – ఎవరితరము! ప్రభూ! రామా! హరీ! నీకు జయము జయము!! " అని ఉద్ఘోషించుచు, ప్రభూ! ఆ భక్తశిఖామణి నిన్ను తన పిడిగుద్దులతో చాలాసమయము అర్చించెను.
80-5
బుద్ధ్వా౾థ తేన దత్తాం నవరమణీం వరమణిం చ పరిగృహ్ణన్।
అనుగృహ్ణన్నముమాగాః సపది చ సత్రాజితే మణిం ప్రాదాః॥
5వ భావము :-
భగవాన్! కొలది సమయము తరువాత శక్తి ఉడిగిన జాంబవంతుడు నిన్ను శ్రీరాముడివని గుర్తించెను. ప్రభూ! కృష్ణా! ఆ జాంబవంతుడు అప్పుడు నవరమణియగు తనకుమార్తెను జాంబవతిని మరియు వరమణియగు స్యమంతకమణిని నీకు భక్తితో సమర్పించెను; నీవు స్వీకరించి జాంబవంతుని అనుగ్రహించితివి. పురమునకు తిరిగి వచ్చి ఆ స్యమంతకమణిని ఆ సత్రాజిత్తునకు ఇచ్చివేసితివి.
80-6
తదను స ఖలు వ్రీడాలోలో విలోలవిలోచనం
దుహితరమహో ధీమాన్ భామాం గిరైవ పరార్పితామ్।
అదిత మణినా తుభ్యం లభ్యం సమేత్య భవానపి
ప్రముదితమనాస్తస్తైవాదాన్మణిం గహనాశయః॥
6వ భావము :-
ప్రభూ! కృష్ణా! సత్రాజిత్తు నీపై అపవాదుమోపినందులకు పశ్చాత్తాపముతో సిగ్గుపడి నీముందు తలవంచుకొనెను. ఆరాజు వేరొకరికిచ్చెదనని మునుపే మాటఇచ్చియుండియూ చంచల నేత్రములు కల తన కుమార్తె సత్యభామను మరియు ఆ స్యమంతకమణిని కూడా నీకు సమర్పించెను. గంభీరహృదయుడవగు నీవు మాత్రము సత్యభామను స్వీకరించి ఆ స్యమంతకమణిని అతనికి తిరిగి ఇచ్చివేసితివి.
80-7
వ్రీడాకులాం రమయతి త్వయి సత్యభామాం
కౌంతేయదాహకథయాథ కురూన్ ప్రయాతే।
హీ గాందినేయకృతవర్మగిరా నిపాత్య
సత్రాజితం శతధనుర్మణిమాజహార॥
7వ భావము :-
ప్రభూ! కృష్ణా! సిగ్గు ఆభరణముగాగల ఆ సత్యభామను నీవు పరిణయమాడి ఆమెతో నీవు ఆనందముగానుంటివి. ఇట్లుండగా ఒకనాడు కుంతీపుత్రులు పాండవులు లక్కగృహములో దహనమయినారను వార్తవచ్చెను. నీవప్పుడు కౌరవరాజ్యమునకు బయలుదేరి వెళ్ళితివి. అప్పుడు అక్రూర, కృతవర్మలచే ప్రేరితుడై శతధన్వుడు సత్రజిత్తును చంపి, ఎంత సిగ్గుచేటది! అతనినుంచి స్యమంతకమణిని అపహరించెను. ఈ శతధన్వునికే సత్యభామను ఇచ్చెదనని సత్రాజిత్తు పూర్వము మాటయిచ్చియుండెను.
80-8
శోకాత్ కురూనుపగతామనలోక్య కాంతాం
హత్వా ద్రుతం శతధనుం సమహర్షయస్తామ్।
రత్నే సశంక ఇవ మైథిలగేహమేత్య
రామో గదాం సమశిశిక్షత ధార్తరాష్ట్రమ్॥
8వ భావము :-
ప్రభూ! కృష్ణా! తండ్రి మరణవార్త విని సత్యభామ దుఃఖముతో వ్యధచెందెను; కౌరవ రాజ్యమున యున్న నీవద్దకు వచ్చెను. ఆమెశోకముచూసి నీవు తక్షణమే మిథిలా నగర సమీపమున ఆ శతధన్వుని వధించితివి; నీ భార్యను సంతోషపరిచితివి. స్యమంతకమణి శతధన్వుని వద్దలేకపోవుటతో బలరాముడు మిధిలాధిపతి రాజగృహమున కొంతకాలము అతనికి అతిధిగానుండెను. ఆ సమయముననే ధుర్యోధనుడు బలరాముని వద్ద గదాయుద్ధమును అభ్యసించెను.
80-9
అక్రూర ఏష భగవన్। భవదిచ్ఛయైవ
సత్రాజితః కుచరితస్య యుయోజ హింసామ్।
అక్రూరతో మణిమనాహృతవాన్ పునస్త్వం
తస్యైవ భూతిముపధాతుమితి బ్రువంతి॥
9వ భావము :-
భగవాన్! కృష్ణా! నీ ఇచ్ఛవలననే, నీ భక్తుడగు అక్రూరుడు దుర్వర్తనుడగు సత్రాజిత్తు మరణమునకు కారణమయ్యెననియు; ఆ అక్రూరునికి శ్రేయస్సు సిరిసంపదలు అనుగ్రహించుటకే నీవు అతని వద్దనే స్యమంతకమణి ఉందని గ్రహించియు, అతని వద్దనుండి తీసుకొనలేదని, విజ్ఞుల భావన.
80-10
భక్తస్త్వయి స్థిరతరః స హి గాందినేయః
తస్యైవ కాపథమతిః కథమీశ జాతా।
విజ్ఞానవాన్ ప్రశమవానహమిత్యుదీర్ణం
గర్వం ధ్రువం శమయితుం భవతా కృతైవ॥
10వ భావము :-
భగవాన్! కృష్ణా! అట్లుకానిచో సర్వము తెలిసిన జ్ఞాని, నిగ్రహము కలవాడు, నీయందు స్థిరమైనభక్తి కలిగినవాడు అగు అక్రూరునివంటి వానికి స్యమంతకమణి అపహరణ అను దుష్టఆలోచన ఎట్లుకలుగును? ఇది నీ ఇచ్ఛవలెననో లేక అతని మనస్సున పొడచూపిన అహంకారమును అణచివేయుటకో ఇది జరిగి ఉండవచ్చును.
80-11
యాతం భయేన కృతవర్మయుతం పునస్తం
ఆహుయ తద్వినిహితం చ మణిం ప్రకాశ్య।
తత్రైవ సువ్రతధరే వినిధాయ తుష్యన్
భామాకుచాంతరశయః పవనేశ।పాయాః॥
11వ భావము :-
ప్రభూ! కృష్ణా! నీ భయముతో కృతవర్మతో కలిసి పారిపోయిన అక్రూరునిని తిరిగి నీవద్దకు పిలిపించితివి. అతనివద్ద గుప్తముగా నున్న స్యమంతకమణిని బహిర్గతము కావించితివి; ఉత్తమ గుణములుగల ఆ అక్రూరునికే ఆ మణిని తిరిగి ఇచ్చివేసితివి; నీవు నిశ్చింతగా సంతోషముగా సత్యభామతో రోజులు గడిపితివి. అట్టి గురవాయూరు పురవాసా! రోగమునుండి కాపాడుము. నన్ను రక్షించుము.
దశమ స్కంధము
80వ దశకము సమాప్తము