నారాయణీయము/దశమ స్కంధము/76వ దశకము

||శ్రీమన్నారాయణీయము||
దశమ స్కంధము

76వ దశకము - ఉద్ధవునిదౌత్యము


76-1
గత్వా సాందీపనిమథ చతుష్షష్టిమాత్రైరహోభిః
సర్వజ్ఞస్త్వం సహా ముసలినా సర్వవిద్యా గృహీత్వా।
పుత్రం నష్టం యమనిలయనాదాహృతం దక్షిణార్థం
దత్వా తస్మై నిజపురమగా నాదయన్ పాంచజన్యమ్॥
1వ భావము:-
ప్రభూ! కృష్ణా! అనంతరము - సర్వజ్ఞుడవగు నీవు బలరామునితో కలిసి 'సాందీపని' ముని వద్దకు వెళ్ళి అరువది నాలుగు దినములలో సమస్త విద్యలను అభ్యసించితివి. 'సాందీపని' మునికి గురుదక్షిణగా మరణించిన అతని కుమారునిని యమలోకమునుండి తెచ్చి ఇచ్చితివి. (కడుపులో శంఖము కలిగిన పంచజనుడు అను రాక్షసుడు ఆ గురుకుమారుని అపహరించి అతనిని చంపివేసెను. నీవు ఆ రాక్షసుని వధించి - ధరించిన) పాంచజన్యము అను శంఖమును పూరించుచు నీవు మధురానగరమునకు తిరిగివచ్చితివి.

76-2
స్మృత్వా స్మృత్వా పశుపసుదృశఃప్రేమభారప్రణున్నాః
కారుణ్యేన త్వమపి వివశః ప్రాహిణోరుద్ధవం తమ్।
కిం చాముష్మై పరమసుహృదే భక్తవర్యాయ తాసాం
భక్త్యుద్రేకం సకలభువనే దుర్లభం దర్శయిష్యన్॥
2వ భావము:-
భగవాన్! నీపై ప్రేమానురాగములతో, వ్యధచెందుచున్న వ్రజములోని - సుందర గోపకాంతలు నీకు పదేపదే గుర్తుకు వచ్చుచుండిరి; దయార్ద్రహృదయుడవగు నీవు వారిపట్ల వివసుడవగుచుంటివి. ఒకరోజున - నీవు నీ ప్రియమిత్రుడగు ఉద్ధవుని - నీ సందేశములతో బృందావనమునకు పంపితివి. నీ జ్ఞాపకములతో ఉద్విగ్నులగుచున్న ఆ గోపికలను ఊరడించుటకే కాక, నీపై ఆ గోపికలకు గల (సకలభువనవాసులకు దుర్లభమగు) ప్రగాఢ భక్తిని కూడా - అతనికి తెలియజేయవలనని తలచితివి.
 
76-3
త్వన్మాహాత్మ్యప్రథిమపిశునం గోకులం ప్రాప్య సాయం
త్వద్వార్తాభిర్భహు స రమయామాస నందం యశోదామ్।
ప్రాతర్దృష్ట్వా మణిమయరథం శంకితాః పంకజాక్ష్యః
శ్రుత్వా ప్రాప్తం భవదనుచరం త్యక్తకార్యస్సమీయుః॥
3వ భావము:-
భగవాన్! నీ అనుజ్ఞతో ఉద్ధవుడు సంధ్యాసమయమునకు గోకులమును చేరెను. సంపదలతో- సుఖసంతోషములతో విలసిల్లుచున్న ఆ గోకులమును చూచి అది అంతయూ నీ మహత్యమే అని గ్రహించెను. నీ తలిదండ్రులగు యశోదానందులకు నీ క్షేమసమాచారమును తెలిపి వారిని ఆనందపరచెను; ఆ రాత్రి అచ్చటనే బసచేసెను. ప్రాతఃకాలమున పంకజాక్షులగు గోపవనితలు - అచ్చట నిలిచి ఉన్న మణిఖచితమగు రథమును చూచి, ప్రభూ! నీవే వచ్చయుందువని తలచిరి; కాని ఆ వచ్చినది నీ అనుచరుడగు ఉద్ధవుడని విని, ఎచ్చటిపనులను అచ్చటనే వదిలి వారందరూ నందుని ఇంటివద్ద చేరిరి.
 
76-4
దృష్ట్వా చైనం త్వదుపమలసద్వేషభూషాభిరామం
స్మృత్వా స్మృత్వా తవవిలసితాన్యుచ్చకైస్తాని తాని।
రుద్ధలాపాః కథమపి పునర్గద్గదాం వాచమూచుః
సౌజన్యాదీన్ నిజపరభిదామప్యలం విస్మరంత్యః॥
4వ భావము:-
భగవాన్! నిన్నుపోలిన వేషభూషణములతో ఉన్న ఉద్ధవుడు, ఆ గోపకాంతలకు మనోహరముగా - నీవలె కనిపించెను; దానితో వారికి పదేపదే నీ చర్యలు జ్ఞప్తికి రాసాగెను. వారి కంఠములు రుద్ధమయ్యెను; వారు ఏమియు మాటలాడలేకపోయిరి. కొంతసమయమునకు వారిని వారే సంభాళించుకొని-ఎదుట ఉన్నవాడు తమ వాడు కాడు- పరాయివాడు అన్న ఎరుకయేలేక - గద్గధకంఠములతో, ప్రభూ! కృష్ణా! నీ చర్యలను ప్రస్తావించసాగిరి.
 
76-5
శ్రీమన్ కిం త్వం పితృజనకృతే ప్రేషితో నిర్దయేన
క్వాసౌ కాంతో నగరసుదృశాం హా। హరే। నాథ। పాయాః।
ఆశ్లేషాణామమృతవపుషో హంత తే చుంబనానామ్
ఉన్మాదానాం కుహకవచసాం విస్మరేత్ కాంత। కా వా॥
5వ భావము:-
భగవాన్! ఆ గోపకాంతలు ఉద్ధవునితో ఇట్లుపలికిరి. "అయ్యా! మిమ్ములను ఆ నిర్దయుడగు కృష్ణుడు తన తలిదండ్రులకొఱకు (మాత్రమే) పంపెనా (మాకొఱకు కాదా!)? మధురానగర సుందరీ మణులకు మనోహరుడగు - ఆ కృష్ణుడు ఎక్కడ ఉండెను? 'ఓ! హరీ! నాధా! మమ్ము రక్షింపుము. నీ ప్రగాఢ ప్రేమను, నీ ఆలింగనాది అనురాగ చేష్టలను - నీ చతురోక్తులను - కృష్ణా! అమృతతుల్యమగు నీ రూపమును' - మాలో ఏ వనిత అయిననూ మరువగలదా?" అని అనిరి.
 
76-6
రాసక్రీడాలులితలలితం విశ్లథత్కేశపాశం
మందోద్భిన్నశ్రమజలకణం లోభనీయం త్వదంగమ్।
కారుణ్యాబ్ధే। సకృదపి సమాలింగితుం దర్శయేతి
ప్రేమోన్మాదాద్భువనమదన। త్వత్ప్రియాస్త్వాం విలేపుః॥
6వ భావము:-
భగవాన్! కృష్ణునిపై వారికిగల - ప్రేమోన్మాదముతో ఆ గోపకాంతలు (ప్రభూ! నిన్ను ఉద్దేశించి) ఇంకనూ ఇట్లు పలికిరి. "విశ్వమోహనా! దయాసాగరుడవగు నీవు - రాసక్రీడ చేయుచున్నప్పుడు - చెదరిపోవుచున్న నీ కేశపాశములతో - శ్రమతో చిందిన చిరుచెమట బిందువులు నీ దేహమున అతిసుందరముగా కనిపించుచుండగా - ఆ నీ దేహమును మేము ఆలింగనము చేసుకొనునట్టి అనుభూతిని మరల మాకు ప్రసాదించుము"- అని పలుకుచు విలపించసాగిరి.
 
76-7
ఏవం ప్రాయైర్వివశవచనైరాకులా గోపికాస్తాః
త్వత్ సందేశైః ప్రకృతిమనయత్ సో౾థ విజ్ఞానగర్భైః।
భూయస్తాభిర్ముదితమతిభిస్త్వన్మయీభిర్వధూభిః
తత్తద్వార్తాసరసమనయత్ కానిచిద్వాసరాణి॥
7వ భావము:-
భగవాన్! వ్యధచెందిన మనసులతో నిగ్రహము కోల్పోయి - అట్లు మాట్లాడుచున్న గోపకాంతలకు - ఉద్ధవుడు నీ సందేశమును వినిపించెను. అదివిని, ఆ గోపకాంతలు, ప్రభూ! నీవు ఎల్లప్పుడు తమతో (తమ ఆత్మలతో) రమించు ఆత్మారాముడవను సత్యానుభూతిని పొందిరి; తమని తాము నిగ్రహించుకొనిరి. నీవే సర్వస్వమని తలచుచున్న ఆ గోపికలకు నీ వృత్తాంతములను వివరించుచూ ఉద్ధవుడు మరికొన్ని దినములు ఆ వ్రేపల్లెలో గడిపెను.
 
76-8
త్వత్ప్రోద్గానైస్సహితమనిశంసర్వతో గేహకృత్యం
త్వద్వార్తైవ ప్రసరతి మిథస్సైవ చోత్స్వాపలాపాః।
చేష్టాః ప్రాయస్త్వదనుకృతయస్త్వన్మయం సర్వమేవం
దృష్ట్వాతత్ర వ్యముహాదధికం విస్మయాదుద్ధవో౾యమ్॥
8వ భావము:-
భగవాన్! ఆ గోపికలు తమ ఇంటి పనులను చేసుకొనుచున్నప్పుడు నీ లీలలను పాటలుగా పాడుకొనుచు, నీ చిలిపి చేష్టలను కథలుగా చెప్పుకొనుచు, ప్రతిపనిలోనూ నిన్నే అనుకరించుచు, కలలయందు సహితము నిన్నే కనుచు - తలచుచూ, సర్వవేళల సర్వావస్థల యందును సర్వస్వము నీవే అని భావించసాగిరి. అట్టి గోపికలనుచూచి, ప్రభూ! ఉద్ధవుడు ఆశ్చర్యచకితుడయ్యెను.
 
76-9
రాధాయా మే ప్రియతమమిదం మత్ప్రియైవం బ్రవీతి
త్వం కిం మౌనం కలయసి సఖే మానినీ మత్ప్రియేవ।
ఇత్యాద్యేవ ప్రవదతి సఖి।త్వత్ప్రియో నిర్జనే మాం
ఇత్థం వాదైరరమయదయం త్వత్ప్రియాముత్పలాక్షీమ్॥
9 వ భావము:-
భగవాన్! నీకు ప్రియమయిన 'రాధ'ను చూచినప్పుడు ఉద్ధవుడు ఇట్లు పలికెను. "కృష్ణుడును- నేనును, మేమిద్దరమే ఉన్న సమయములలో - 'రాధకు ఇది అనినచో ఇష్టము, రాధయూ ఇటులే మాటలాడును, స్నేహితుడా - రాధవలె నీవేల మౌనముగానుంటివి? అని పదేపదే నిన్ను తలుచుచుండును". అని ప్రభూ! నీ విషయములట్లు చెప్పుచు- ఉద్ధవుడు - పద్మములవంటి నేత్రములు కల ఆ రాధను ఊరడించెను.
 
76-10
ఏష్యామి ద్రాగనుపగమనం కేవలం కార్యభారాత్
విశ్లేషే౾పి స్మరణదృఢతాసంభవాన్మాస్తు ఖేదః।
బ్రహ్మానందే మిలతి న చిరాత్ సంగమో వా వియోగః
తుల్యో వః స్యాదితి తవగిరా సో౾కరోన్నిర్వ్యథాస్తాః॥
10వ భావము:-
భగవాన్! ఉద్ధవుడు నీ సందేశమును ఆ గోపికలకు ఇంకనూ ఇట్లు చెప్పెను. 'నీవు త్వరలోనే వ్రజమునకు వచ్చెదవనియు; ఇప్పుడు రాకపోవుటకు - కార్యభారమే కారణమనియు, వియోగసమయములో - స్మరణముచేత అనురాగము ప్రగాఢమగుననియు, దుఖించవలదనియు, వియోగ సమాగమములు రెంటిలోను సమమగు బ్రహ్మానందము వారికి లభించగలదనియు' ఉద్ధవుడు ప్రభూ! నీ మాటలుగా చెప్పి - వారి మనసులలోని దుఃఖమును పోగొట్టెను.
 
76-11
ఏవం భక్తిస్సకలభువనే నేక్షితా న శ్రుతా వా
కిం శాస్త్రౌఘైః కిమిహ తపసా గోపికాభ్యో నమో౾స్తు।
ఇత్యానందాకులముపగతం గోకులాదుద్ధవం తం
దృష్ట్వా హృష్టో గురుపురపతే।పాహి మామామయౌఘాత్॥
11వ భావము:-
ప్రభూ! కృష్ణా! "నీ ఎడల ఆ గోపికలకుగల భక్తి – సకలభువనములులో ఎచ్చటను ఎప్పుడును ఎవ్వరును వినలేదు, కనలేదు, శాస్త్రముల వలన ఉపయోగమేమి? తపస్సులతో ప్రయోజనమేమి? నిర్మలమైన శుద్ధ భక్తితో నీ అనుగ్రహము పొందిన ఆ గోపికలకు నమస్కరింతును." అని ఉద్ధవుడు తలచుచు ఆనందముగా ఆ గోకులమును వీడి, ప్రభూ! నీ వద్దకు వచ్చెను. అట్లు తిరిగి వచ్చిన ఉద్ధవునిచూచి ఆనందించిన ఓ! గురవాయూరు పురాధీశా! ఈ రోగముబారినుండి రక్షింపుము అని ప్రార్ధించుచున్నాను.
 
 
దశమ స్కంధము
76వ దశకము సమాప్తము