నారాయణీయము/దశమ స్కంధము/75వ దశకము

||శ్రీమన్నారాయణీయము||
దశమ స్కంధము

75వ దశకము - కంసవధ


75-1
ప్రాతస్సంత్రస్తభోజక్షితిపతివచసా ప్రస్తుతే మల్లతూర్యే
సంఘే రాజ్ఞాం చ మంచానభియయుషి గతే నందగోపే౾పి హార్మ్యమ్।
కంస సౌధాధిరూఢే త్వమపి సహబలస్సానుగశ్చారువేషో
రంగద్వారం గతో౾భూః కుపితకువలయాపీడనాగావలీఢమ్॥
1వ భావము :-
భగవాన్! మరుసటిదినము ఉదయముననే (నీ రాకతో భీతినొందిన) ఆ భోజరాజు ఆజ్ఞతో - రంగస్థల ప్రాంగణమున ఘంటానాదము మ్రోగించబడెను. అది - మల్లయుద్ధము ప్రారంభమగుచున్నది అనుటకు సూచన. ఆ మల్లయుద్ధమును తిలకించుటకు వచ్చిన పెద్దలు వారివారి సముచిత స్థానములలో కూర్చొనిరి. కంసుడు ఆ రంగస్థల భవన పైభాగమున తనకై (ప్రత్యేకముగా) ఏర్పరిచిన ఉన్నతాసనమును అలంకరించెను. నందుడునూ అచ్చటనే ఉన్న ఒకఆసనమున ఆసీనుడయ్యెను. అప్పుడు ప్రభూ! నీవు చక్కని వస్త్రములు ధరించి -నీ అన్న బలరామునితోను, మిత్రులతోను - ఆ రంగస్థల ద్వారము వద్దకు వచ్చితివి. లోపలకు ప్రవేశించుచున్న మిమ్ము - ' కువలయాపీడ' అను ఒక (రాక్షస) ఏనుగు ఆగ్రహముతో అడ్డముగా నిలచి - నిరోధించెను.
 
75-2
పాపిష్ఠాపేహి మార్గాద్ర్దుతమితి వచసా నిష్ఠురక్రుద్దబుద్ధేః
అంబష్ఠస్య ప్రణోదాదధికజవజుషా హస్తినా గృహ్యమాణః।
కేళీముక్తో౾థ గోపీకుచకలశచిరస్పర్ధినం కుంభమస్య
వ్యాహత్యాలీయథాస్త్వం చరణభువి పునర్నిర్గతో వల్గుహాసీ॥
2వ భావము :-
భగవాన్! అదిచూచి - నీవు ఆ 'కువలయాపీడ'తో - " పాపిష్టివాడా! తొలగుము! ఈ మార్గమును వీడుము! దూరముగా పొమ్ము!" అని పలికితివి. అంతట, దుష్టుడు, కోపిష్టివాడు అయిన మావటివానిచే ప్రేరేపించబడి - ఆ 'కువలయాపీడ' అతివేగముగా నిన్ను పట్టుకొనుటకు ప్రయత్నించెను. అప్పుడు ఆ ఏనుగు కాళ్ళనడుమ దాగుకొనుచు - బయటకు వచ్చుచు - మధురముగా నవ్వుచూ - అవలీలగా తప్పించుకొనుచు - ప్రభూ! నీవు గోపికల వక్షస్థలములను పోలిన ఆ రాక్షస ఏనుగు కుంభస్థలమును నీ పిడికిళ్ళతో కొట్టుచుంటివి.
 
75-3
హస్తప్రాప్యో౾ప్యగమ్యో ఝటితి మునిజనస్యేవ ధావన్ గజేంద్రం
క్రీడన్నాపత్య భూమౌ పునరభిపతతస్తస్య దంతం సజీవమ్।
మూలాదున్మూల్య తన్మూలగమహితమహామౌక్తికాన్యాత్మమిత్రే
ప్రాదాస్త్వం హారమేభిర్లలితవిరచితం రాధికాయై దిశేతి॥
3వ భావము :-
భగవాన్! నిన్నే ధ్యానించు మునీశ్వరులకు - సాక్షాత్కరించి అంతలోనే అదృశ్యమయినట్లు , ఆ కువలయాపీడకు కనిపించి కనిపించకుండా వర్తించుచు - దాని తొండము పట్టునుండి తప్పించు కొనుచు - దూరముగా పోవుచు - కొంతసమయమట్లు క్రీడించి -ఆ ఏనుగును పడగొట్టితివి. ఆ ఏనుగు లేచి - తిరిగి నీ మీదకు వచ్చుచుండగా, నీవు ఆ కువలయాపీడ - దంతములను సమూలముగా పెరికివేసి వాటితోనే దానిని చంపివేసితివి. ఆ దంతములకు పొదగబడిన విలువైన ముత్యములను తీసి- ప్రభూ! 'రాధ' కొఱకు కంఠహారము చేయించమని - నీ ప్రియమిత్రునికిచ్చితివి.
 
75-4
గృహ్ణనం దంతమంసే యుతమథ హలినా రంగమంగా౾విశంతం
త్వాం మంగళ్యాంగభంగీరభసహృతమనోలోచనా వీక్ష్య లోకాః।
హంహో ధన్యో ను నందో న హి న హి పశుపాలాంగనా నో యశోదా
నో నో ధన్యేక్షణాః స్మస్త్రిజగతి వయమేవేతి సర్వే శశంసుః॥
4వ భావము :-
భగవాన్! ఆ 'కువలయాపీడ'ను హతమార్చి - దాని దంతమునొకదానిని నీ భుజమున ధరించి - నీవా మల్లయుద్ధ రంగస్థలమును ప్రవేశించుచుండగా, నయనానందకరమగు నీ మంగళకర శరీరసౌష్టవమును చూచిన - ఆ ప్రజలకు అత్యంత ఆకర్షణీయముగా కనిపించితివి. " ఆహా! ఈ బాలుని తండ్రియగు నందుడు ఎంతటి ధన్యుడో కదా! కాదు..కాదు - ఇతనితో కలిసి విహరించిన గోపికలు ధన్యులు! కాదు..ఇతని తల్లియే ధన్యురాలు. కాదు...కాదు- ఇతనిని చూడగలిగిన కన్నులుగలిగిన మనమే - త్రిలోకవాసులందరిలోను ధన్యులము! ", అని అక్కడ ఉన్నవారందరూ తలచసాగిరి.
 
75-5
పూర్ణం బ్రహ్మైవ సాక్షాన్నిరవధిపరమానందసాంద్రప్రకాశం
గోపేషు త్వం వ్యలాసీర్న ఖలు బహుజనైస్తావదావేదితో౾ భూః।
దృష్ట్వా౾థ త్వాం తదేదం ప్రధమముపగతే పుణ్యకాలే జనౌఘాః।
పూర్ణానందా విపాపాస్సరసమభిజగుస్త్వత్కృతాని స్మృతాని॥
5 వ భావము :-
ప్రభూ! కృష్ణా! నీవు అవధులులేని జ్ఞానానంద స్వరూపమనియు - గోపాలుర మధ్య సంచరించుచున్న - సాక్షాత్తు పరబ్రహ్మస్వరూప మనియు మధురలో చాలామందికి తెలియదు. మధురలోని ఆ మల్లయుద్ధరంగ ప్రాంగణములో ప్రప్రథమముగా నిన్ను చూచిన ఆ మధుర ప్రజలు - వారి పాపములు నశించి వారి పుణ్యవశమున నిన్ను దర్శించితిమని భావించిరి; నీ లీలలను కీర్తించిరి; వ్రజములో నీచేత జరపబడిన అద్భత సంఘటనలను చర్చించుకొనుచూ అత్యంత ఆనందమును పొందిరి.
 
75-6
చాణూరో మల్లవీరస్తదను నృపగిరా ముష్టికో ముష్టిశాలీ।
త్వాం రామం చాభిపేదే ఝటఝటితి మిథో ముష్టిపాతాతిరూక్షమ్।
ఉత్పాతాపాతనాకర్షణవివిధరణా న్యాసతాం తత్ర చిత్రం
మృత్యోఃప్రాగేవ మల్లప్రభురగమదయం భూరిశో బంధమోక్షాన్॥
6 వ భావము :-
భగవాన్! మల్లయుద్ధక్రీడ ప్రారంభమయ్యెను. భోజరాజగు కంసుని ఆజ్ఞతో 'చాణూరుడు' మరియు 'ముష్టికుడు' అను గొప్ప మల్లయుద్ధ వీరులు - నీతోను, నీ అన్న బలరామునితోను మల్లయుద్ధమునకు దిగిరి. వారు మిమ్ములను బలముగా కొట్టుచు, ముష్టిఘాతములతో గుద్దుచు మీతోతలపడిరి. వారు మీపైకి దుముకి మిమ్ము త్రోయుచు, క్రిందకు లాగుచు పలురీతులలో యుద్ధము చేయసాగిరి. అట్లు మల్లయుద్ధముచేయునప్పుడు - వారిరువురు మీకు చిక్కియూ ప్రభూ! మరణించుటకు ముందు (నీ ఇచ్ఛతో) పలుమార్లు బంధమోక్షమును పొందిరి.
 
75-7
హా ధిక్ కష్టం కుమారౌ సులలితవపుషౌ మల్లవీరౌ కఠోరౌ
న ద్రక్ష్యామో వ్రజామస్త్వరితమితి జనే భాషమాణే తదానీమ్।
చాణూరం తం కరోద్ర్భామణవిగళదసుం పోథయామాసిథోర్వ్యాం
పిష్టో౾భన్ముష్టికో౾పి దృతమథ హాలినా నష్టశిష్టైర్దధావే॥
7వ భావము :-
భగవాన్! కృష్ణ, బలరాములతో - చాణూరుడు, ముష్టికుడు మల్లయుద్ధమునకు తలపడగానే అక్కడ ఉపవిష్టులయిన పెద్దలు, ప్రజలు - "చాణూరుడు, ముష్టికుడు బలవంతులు - కృష్ణ, బలరాములు చాలా అర్భకులు, సుకుమారులు - వీరు యుద్ధమునకు సమఉజ్జీలుకారు. మనమీ ఘోరమును చూడలేము, ఇచ్చటనుండి వెళ్ళపోవుదుము"- అని వారిలో వారు తర్కించుకొనసాగిరి. వారు చూచుచుండగానే ఇంతలో, ప్రభూ! 'చాణూరుని' నీ రెండు హస్తములతో ఎత్తి గిరగిరా త్రిప్పుచు వాని శరీరమును నేలపై బలముగా కొట్టి - వాని ఉసురు తీసివేసితివి. బలరాముడునూ - ముష్టికుని బలముగా కొట్టి నేలపైవేసి వానిని వధించెను. ఇదిచూచిన - మిగిలిన మల్లయోధులు అచ్చటనుండి పారిపోయిరి.
 
75-8
కంసః సంవార్య తూర్యం ఖలమతిరవిదన్ కార్యమార్యాన్ పితౄంస్తాన్
ఆహంతుం వ్యాప్తమూర్తేస్తవ చ సమశిషద్ దూరముత్సారణాయ।
రుష్టో దుష్టోక్తిభిస్త్వం గరుడ ఇవ గిరిం మంచమంచన్నుదంచత్
ఖడ్గవ్యావల్గదుస్సంగ్రహమపి చ హఠాత్ ప్రాగ్రహీరౌగ్రసేనిమ్॥
8వ భావము :-
భగవాన్! అప్పుడు కంసుడు 'భేరీనాదమును' ఆపివేయించెను; ఏమిచేయుటకు తోచని దుస్థితిలో (మూఢుడై) నీ తల్లితండ్రులను, నందుడు మొదలగు పెద్దలను హతమార్చమనియు, సర్వజ్ఞుడవు - సర్వవ్యాపివి అగు నిన్ను పారద్రోలమనియు - తన భటులకు ఆజ్ఞాపించెను. అప్పుడు ఆ దుష్టకంసుని పలుకులకు ఆగ్రహించి - గరుత్మంతుడు పర్వతముపైకి ఎగిరిన చందముగా - నీవా కంసుని సింహాసనము పైకి ఎగిరితివి. కంసుడు తన ఖడ్గమును గిరగిరా త్రిప్పుచు నిన్ను అడ్డుకొనుటకు ప్రయత్నించెను; నీవు హఠాత్తుగా - మహా బలముతో - ఆ ఉగ్రసేన కుమారుడగు కంసుని పట్టుకొంటివి.
 
75-9
సద్యో నిష్పిష్టసంధిం భువి నరపతిమాపాత్య తస్యోపరిష్టాత్
త్వయ్యాపాత్యే తదైవ త్వదుపరి పతితా నాకినాం పుష్పవృష్టిః।
కిం కిం బ్రూమస్తదానీం సతతమపి భియా త్వద్గతాత్మా స భేజే
సాయుజ్యం త్వద్వధోత్థాపరమ।పరమియం వాసనా కాలనేమేః॥
9వ భావము :-
ప్రభూ! నీవు ఆ కంసుని క్రిందపడవైచి అతని వక్షస్థలముపై కూర్చుంటివి; పిడికిళ్ళతో కొట్టి కొట్టి ఆ దుష్టుని చంపివేసితివి. అదిచూచి దేవలోకమునుండి దేవతలు పూలర్షము కురిపించిరి. సర్వకాల సర్వావస్థలందూ నీ భయముతో నిన్నే తలచుచూ గడిపిన భాగ్యమున - ఆకంసుడు నీ సాయుజ్యమును పొందెను. కంసుడు పూర్వజన్మమున కాలనేమి అను రాక్షసుడు; అతని కోరికమేరకే భగవాన్! ఇది అంతయూ జరిగినది.
 
75-10
తద్ భ్రాతౄనష్ట పిష్ట్వా ద్రుతమథ పితరౌ సన్నమన్నుగ్రసేనం
కృత్వా రాజానముచ్ఛైర్యదుకులమఖిలం మోదయన్ కామదానైః।
భక్తానాముత్తమం చోద్ధవమమరగురోరాప్తనీతిం సఖాయం
లబ్ధ్వా తుష్టో నగర్యాం పవనపురపతే।రుంధి మే సర్వరోగాన్॥
10వ భావము :-.
భగవాన్! నీవు కంసుని ఎనిమిది మంది సోదరులను కూడా వెనువెంటనే వధించితివి. నీ తల్లితండ్రులగు దేవకీ వసుదేవులను బంధవిముక్తులనుచేసి వారికి ప్రణమిల్లితివి. నీ మాతామహుడు, కంసుని తండ్రియగు ఉగ్రసేనుని తిరిగి రాజును చేసితివి. కంసుని భయముతో ఎక్కడెక్కడకో వలసపోయిన యాదవులందరినీ రావించి - వారి కోరికలను తీర్చి - వారిని ఆనందపరిచితివి. ప్రభూ! నీ భక్తులలో 'ఉద్ధవుడు' ఉత్తమ భక్తుడు, బృహస్పతినుండి నీతిశాస్త్రమును అభ్యసించినవాడు. ఆ 'ఉద్ధవుని'కి మిత్రునిగా - ఆ రాజ(మధురా)నగరములో కొంతకాలము ఆనందముగా గడిపితివి. శ్రీకృష్ణుని రూపములో కంసవధ జరిపిన నారాయణమూర్తీ! గురవాయూరు పురాధీశా! ఈ రోగమును హరించుము.
 
దశమ స్కంధము
75వ దశకము సమాప్తము
-x-