నారాయణీయము/దశమ స్కంధము/59వ దశకము

||శ్రీమన్నారాయణీయము||
దశమ స్కంధము
59వ దశకము – వేణుగానము


59–1
త్వద్వపుర్నవకలాయకోమలం ప్రేమదోహనమశేషమోహనమ్।
బ్రహ్మతత్త్వపరచిన్ముదాత్మకం వీక్ష్య సమ్ముముహురన్వహం స్త్రియః॥
1వ భావము. :-
భగవాన్! నీరూపము అప్పుడే విచ్చుకొనిన నల్లకలువ ఛాయను పోలియున్నది; ఆ పుష్పమువలె - అతి కోమలముగానున్నది. బ్రహ్మతత్వము -సచ్చిదానందస్వరూపమూ అయిన నీ ఈ రూపము సకల జీవులకూ ఆకర్షణీయముగను, సమ్మోహితముగను ఉన్నది. ప్రభూ! ఇదిచూచుచున్న - వ్రజములోని గోపికలకు నీపై ప్రేమానురాగములు - దినదిన ప్రవర్ధమానమగుచుండెను.
 
59-2
మన్మథోన్మథితమానసాః క్రమాత్ తద్విలోకనరతాస్తతస్తతః
గోపికాస్తవ న సేహిరే హరే। కాననోపగతిమప్యహర్ముఖే॥
2వ భావము. :-
భగవాన్! మదనపరవశలయిన - వ్రజములోని ఆ గోపికలలో - నిన్ను పదేపదే చూడవలెనను కోరిక రోజురోజుకు అధికమగుచుండెను. క్షణమయిననూ నిన్ను విడిచి ఉండుటకు వారు ఇష్టపడకుండిరి; నీవు గోవులతో వనమునకు వెళ్ళిననూ వారు ఓర్చుకొనలేకపోవుచుండిరి.
 
59-3
నిర్గతే భవతి దత్తదృష్టయస్త్వద్ గతేన మనసా మృగేక్షణాః।
వేణునాదముపకర్ణ్య దూరతస్త్వద్విలాసకథయాభిరేమిరే॥
3వ భావము. :-
నీవు - గోవులు, గోపాలురతో కలిసి వనమునకు వెళ్ళినప్పుడు, ఆ గోపికలు తమ మనసులలో, ప్రభూ! నిన్నే నిలుపుకొని, దూరమునుండి వినవచ్చుచున్న - నీ వేణుగానమును వినుచూ, నీ లీలలను ఒకరితోనొకరు చెప్పుకొనుచు - ఆనందించుచుండిరి. (నీ రాకకై ఎదురుచూచుచుండిరి).
 
59-4
కాననాంతమితవాన్ భవానపి స్నిగ్దపాదపతలే మనోరమే।
వ్యత్యయాకలితపాదమాస్థితః ప్రత్యపూరయత వేణునాళికామ్॥
4వ భావము. :-
భగవాన్! ఆలమందలతో నీవు వనమునకు వెళ్ళినప్పుడు - నీవు అచ్చట ఒక చల్లని వృక్షఛ్ఛాయలో - వ్యత్యస్తముగా (కుడిపాదమును ఎడమపాదముపైనుంచి) నిలబడి - నీ చేతులతో అలవోకగా వేణువును పట్టుకొని, ఆ వేణువు రంధ్రములనుండి ఊపిరిని ఊదుతూ, నీవు శ్రావ్యముగా వేణుగానము చేయుచుంటివి. (ఆహా! ఏమి మనోహరరూపమది!).
 
59-5
మారబాణధుతఖేచరీకులం నిర్వికారపశుపక్షిమండలమ్।
ద్రావణం చ దృషదామపి ప్రభో।తావకం వ్యజని వేణుకూజితమ్॥
5వ భావము. :-
భగవాన్! శిలలను సహితము కరిగించునట్టి నీవేణుగానమును విని, ఆకాశమున సంచరించు దేవతాస్త్రీల హృదయములు వివశమగుచుండెను. పశుపక్ష్యాదులు సహితము నిర్వికారముగా నిలిచిపోవుచుండెను.
 
59-6
వేణురంధ్రతరలాంగుళీదళం తాళసంచలితపాదపల్లవమ్।
తత్ స్థితం తవ పరోక్షమప్యహో సంవిచింత్య ముముహుర్ర్వజాంగనాః।
6వ భావము. :-
భగవాన్! వనములో వేణుగానము చేయునప్పుడు - నీవు ప్రత్యక్షముగా గోపికలకు కనిపించక పోయిననూ - 'వారి ఎదుటనే నీవు గానము చేయుచున్నట్లును, ఆ గానము చేయునప్పుడు - వేణువుపై కదలే నీ చేతివేళ్ళ కదిలికలను, నృత్యానుగుణముగా నర్తించు నీ పాదముల కదలికలను ఊహించుకొనుచూ - వారు తన్మయత్వము చెందుచుండిరి.
 
59-7
నిర్విశంకభవదంగదర్శినీః ఖేచరీః ఖగమృగాన్ పశూనపి।
త్వత్పదప్రణయి కాననం చ తాః ధన్యధన్యమితి నన్వమానయన్॥
7వ భావము. :-
భగవాన్! ఆ గోపకాంతలు - "నీ పాదస్పర్శకు నోచుకొనిన ఆ అరణ్యము, అచ్చట సంచరించు మృగములు, ఆకాశమున తిరుగుచున్న దేవతాస్త్రీలు, పక్షులు - ఏ సంకోచములేకుండగనే నిన్ను దర్శించుచుండిరి; వారు నీచేత అనుగ్రహించబడినారు", అని ప్రశంసించుచుండిరి
 
59-8
ఆపిబేయమధురామృతం కదా వేణుభుక్తరసశేషమేకదా।దూరతో బత కృతం దురాశయేత్యాకులా ముహరిమాః సమాముహన్॥
8వ భావము. :-
భగవాన్! "నీవు వేణుగానము చేయునప్పుడు ఆ వేణువు నీ అధరామృతమును పీల్చివేయగా - ఏ కొంచెమయినను మిగిలినచో అది త్రాగవలెనని - తాము ఉవ్విళ్ళూరుట దురాశ కాదుకదా!"- అని, ఆ గోపవనితలు పదేపదే తలచుకొనుచూ నిస్పృహ చెందుచుండిరి.
 
59-9
ప్రత్యహం చ పునరిత్థమంగనాశ్చిత్తయోనిజనితాదనుగ్రహాత్।
బద్ధరాగవివశాస్త్వయి ప్రబో। నిత్యమాపురిహ కృత్యమూఢతామ్॥
9వ భావము. :-
ప్రభూ! ఆ గోపికలు ప్రతిదినము ఈ విధముగా నిన్ను ఊహించుకొనుచూ - మన్మధప్రభావమునకు లోనగుచుండిరి; నీయెడల ప్రేమానురాగబద్ధులై తమ నిత్యదైనిందన కార్యక్రమములను సహితము ఉపేక్షించుచుండిరి; వారు నీ అనుగ్రహమునకు పాత్రులయ్యిరి.
 
59-10
రాగస్తావజ్జాయతే హి స్వభావాన్మోక్షోపాయో యత్నతః స్యాన్న వా స్యాత్।
తాసాం త్వేకం తద్ ద్వయం లబ్ధమాసీద్ భాగ్యం భాగ్యం పాహి మాం మారుతేజః॥
దశమ స్కంధము
10వ భావము. :-
భగవాన్! స్త్రీపురుషులనడుమ ప్రేమ సహజజనితము. మోక్షమొసగు భక్తి - సాధనతో కూడా సాధ్యము కాకపోవచ్చును. కాని, ప్రభూ! ఈ గోపికలది ఏమి భాగ్యము! పురుషుడవగు నీయెడల వారికి ప్రేమ మరియు పరమాత్ముడవగు నీయందు వారికి గాఢభక్తి సహజముగనే లభింపజేసితివి. అట్టి మహనీయుడవగు గురవాయూరు పురాధీశా! నా రోగమును తగ్గించుము. నన్ను రక్షించుము.
 
59వ దశకము సమాప్తము.
-x-