నారాయణీయము/దశమ స్కంధము/58వ దశకము

||శ్రీమన్నారాయణీయము||
దశమ స్కంధము

58వ దశకము - దావానలమునుండి గోవులను గోపాలకులను సంరక్షించుట


58-1
త్వయి విహరణలోలే బాలజాలైః ప్రలంబ-
ప్రమథన సవిలంబే ధేనవః స్త్వెరచారాః ।
తృణకుతుకనివిష్టా దూరదూరం చరంత్యః
కిమపి విపీనమైషికాఖ్యమీషాంబభూవుః॥
1వ భావము :-
భగవాన్! నీవు - నీతోటి గోపబాలకులతో కలిసి భాండీరవృక్షముచెంత ఆటలలో మునిగియున్నప్పుడును మరియు 'ప్రలంబాసురుని' బలరాముడు వధించు సమయమునను - మీతో వచ్చిన గోవులు, పచ్చిక మేతకై అటునిటు తిరుగుచూ మీకు దూరముగా పోయినవి; పోయి - పోయి, అవి - 'ఐషికము' అను ఒక వనమును ప్రవేశించినవి.

58-2
అనధిగతనిదాఘక్రౌర్యబృందావనాంతాద్
బహిరిదముపయాతాః కాననం ధేనవస్తాః।
తవ విరహవిషణ్ణా ఊష్మలగ్రీష్మతాప-
ప్రసరవిసరదమ్భస్యాకులాః స్తమ్భమాపుః॥
2వ భావము :-
బృందావనము - వేసవివేడి కానరాని చల్లని ప్రదేశము. 'ఐషికము' - బృందావనమునకు కడు దూరము; మీదుమిక్కిలి వేడి ప్రదేశము. ఆ ఎండవేడిమిని గోవులు తట్టుకొనలేకపోయెను. తాపమధికమై దప్పికయగుటచేతనూ, మీరెవరూ దరిదాపులలో కనబడక పోవుటచేతను, అవి మిక్కిలి కలతచెంది (ప్రభూ! కృష్ణా! నిన్నే తలచుకొనుచూ) అచ్చటనే నిలిచిపోయినవి.
 
58-3
తదను సహ సహాయైర్దూరమన్విష్య శౌరే।
గలితసరణి ముంజారణ్యసంజాత ఖేదమ్।
పశుకులమభివీక్ష్య క్షిప్రమానేతుమారాత్
త్వయి గతవతి హీహీ సర్వతో ౾గ్నిర్జజృంభే॥
3వ భావము :-
ప్రభూ! (ప్రలంబాసుర సంహారము తరువాత) నీవు నీ సహచరులతో కలిసి గోమందల కొరకు వెతుకసాగితివి. వెతుకుచువెతుకుచూ మీరు 'ముంజారణ్యమును' ప్రవేశించిరి; అచ్చట (ఐషిక వనమున) అలసటతో డస్సిపోయి నిలిచియున్న గోవులను చూచిరి. మీరు మీ గోగణములను చేరీచేరగనే - ఆ అరణ్యమున అగ్ని రగిలి అన్నివైపులా వ్యాపించసాగెను. అయ్యో! ఇది ఎంత కష్టమోకదా! కృష్ణా!
 
58-4
సకలహరితి దీప్తే ఘోరభాంకారభీమే
శిఖిని విహితమార్గా అర్ధదగ్ధా ఇవార్తాః।
అహహ భువనబంధో। పాహి పాహీతి సర్వే।
శరణముపగతాస్త్వాం తాపహార్తారమేకమ్॥
4 వ భావము :-
ప్రభూ! 'ముంజారణ్యమున' రగుల్కొనిన మంటలు - అన్నిదిక్కులకు వ్యాపించుచుండగా, ఆ భీకర దావాగ్నినుండి వెలువడు శబ్దములు - కడు భీతి కలిగించుచుండెను; వేడి అధికమై గోవులు - గోపాలురు మిక్కిలి బాధకు లోనగుచుండిరి. తమకష్టములను తీర్చగలవాడివి నీవేనని (మనసా వాచా) నమ్మిన ఆ గోపాలురు - "సకలభువనములను రక్షించు భువనబంధో! మమ్ము రక్షింపుము" అని (ముక్తకంఠముతో) కృష్ణా! నిన్ను శరణుజొచ్చిరి.

58-5
అలమలమతిభీత్యా సర్వతో మీలయధ్వం
దృశమితి తవ వాచా మీలితాక్షేషు తేషు-।
క్వ ను దవదహనో౾సౌ కుత్ర ముంజాటవీ సా
సపది వవృతిరే తే హంత భాండీరదేశే॥
5వ భావము :-
భగవాన్! అంతట నీవు ఆ గోపాలురతో - "భయపడవలదు. మీ కన్నులను మూసుకొనండి" అని వారికి చెప్పితివి. నీ ఆ దేశానుసారమూ వారు కన్నులను మూసుకొనిరి. ఆ గోపాలురు కన్నులను మూసితెరిచి చూచినంతనే, ప్రభూ! ఆ దావాగ్ని ఎటుపోయెనో ఏమో! వారందరూ ముంజాటవిలో లేరు; వారు వారిగోవులతో 'భాండీరవృక్ష ప్రాంతమున' నిలిచి యుండిరి.
 
58-6
జయజయ తవ మాయా కేయమీశేతి తేషాం
నుతిభిరుది తహాసో బద్ధనానావిలాసః।
పునరపి విపినాంతే ప్రాచరః పాటలాది-
ప్రసవనికరమాత్రగ్రాహ్య ఘర్మానుభావే॥
6 వ భావము :-
భగవాన్! ఆ గోవులను- గోపాలురను నీవు రక్షించగనే వారు - "కృష్ణా! నీకు జయము! జయము!" అని పలుకుచూ నీ లీలలను ప్రశంసించిరి. వారి ప్రశంసలను చిరునవ్వుతో స్వీకరించుచు నీవు (బృందావన) అరణ్యప్రాంతమున వారితో కలిసి విహరించసాగితివి. వేసవి కాలమునకు గుర్తుగా - వేసవికాలమున మాత్రమే పుష్పించు - 'పాటల పుష్పములుతో' ఆ అడవి విలసిల్లెను. చల్లని పిల్ల గాలులు వీచు - చుండగా ప్రభూ! నీవు ఆ అరణ్యమున విహరించితివి.
 
58-7
త్వయి విముఖమివోచ్పైస్తాపబారం వహంతం
తవ భుజవదుదంచద్భూరితేజః ప్రవాహం।
తవ భజనవదంతః పంకముచ్ఛోషయంతం
తపసమయమీనైషీర్యామునేషు స్థలేషు॥
7వ భావము :-
భగవాన్! ఆ వేసవికాలపు ఎండ - నీయందు విముఖుల - అంతఃకరణవలె – భారముగా నుండెను. ఎండ తీవ్రతకు - ఎండిన నదిలోని పంకము (బురద మట్టి) - నీ భక్తుల హృదయములోని - పాపపంకిలమును హరించిన - ప్రగాఢ భక్తివలె నుండెను. తీవ్రముగా ప్రసరించుచున్న ఆ సూర్యకిరణములు - నీ బాహువులనుండి ప్రసరించుచున్న తేజస్సులవలె నుండెను. అటువంటి వేసవి కాలమున - ప్రభూ! నీవు (నీ సహచరులతో కలిసి) యమునానదీతీరమున విహరించితివి.
 
58-8
తదను జలదజాలైః త్వద్వపుస్తుల్యభాభిః।
వికసదమలవిద్యుత్పీతవాసోవిలాసైః।
సకలభువనభాజాం హర్షదాం వర్షవేళాం
క్షితిధరకుహరేషు స్వైరవాసీ వ్యనైషీః॥
8వ భావము :-
భగవాన్! ఇట్లుండగా, నీ శరీరకాంతినిబోలిన - నీలిమేఘములు ఆకాశమున వ్యాపించెను; నీవు ధరించిన పీతాంబరమువలె - శోభిల్లుచూ - ఆ మేఘముల నడుమ మెరుపులు మెరవసాగినవి. సకలజీవులకు ఆనందము కలిగించుచూ - వర్షాకాలము ఆరంభమయ్యెను. అప్పుడు, ప్రభూ! నీవు నీ సహచరులతో కలిసి పర్వతగుహలయందు తిరుగుచూ గడిపితివి.
 
58-9
కుహరతలనివిష్టం త్వాం గరిష్ఠం గిరీంద్రః
శిఖికులనవకేకాకాకుభిః స్తోత్రకారీ।
స్ఫుటకుటజకదంబస్తోమపుష్పాంజలిం చ
ప్రవిదధదనుభేజే దేవ।గోవర్ధనో౾సౌ॥
9వ భావము :-
భగవాన్! అప్పుడు, నీ మహత్తును ఎరిగిన గోవర్ధన గిరీంద్రుడు, మయూరములుచేయు 'కేకా' ధ్వనులతో నిన్ను స్తుతించెను; పర్వతముపై పుష్పించిన మల్లెలు, కదంబము మొదలగు పుష్పములను, ప్రభూ! నీపై కురిపించుచూ నిన్ను అర్చించెను.
 
58-10
అథ శరదము పేతాం తాం భవద్భక్తచేతో-
విమల సలిలపూరం మానయన్ కాననేషు।
తృణమమలవనాంతే చారు సంచారయన్ గాః
పవనపురపతే। త్వం దేహి మే దేహసౌఖ్యమ్॥
10వ భావము :-
అనంతరము - శరదృతువు ప్రవేశించినది. శరదృతువు ప్రవేశముతో ప్రభూ! నీ భక్తుని నిర్మలమైన అంతరంగమువలె నదులలోని జలములు స్వచ్చముగా నుండెను. ఆ స్వచ్చనదీజల తీరములలోను, అచ్చటి పచ్చిక బయళ్ళులోనూ భగవాన్! నీవు మనోహరరూపముతో - ఇతర గోపాలురతో కలిసి గోవులను మేపుచూ సంచరించితివి. అట్టి మహత్యము కలిగిన గురవాయూరు పురాధీశా! నాకు ఆరోగ్యమును ప్రసాదించుము. నన్ను రక్షించుము.
 
దశమ స్కంధము
58వ దశకము సమాప్తము.
-x-