నారాయణీయము/దశమ స్కంధము/43వ దశకము
||శ్రీమన్నారాయణీయము||
దశమ స్కంధము
43వ దశకము - తృణావర్తసంహారము
43-1
త్వామేకదా గురుమరుత్పురనాథ। వోఢుం
గాఢాధిరూఢగరిమాణమపారయంతీ।
మాతా నిధాయ శయనే 'కిమిదంబతే’ తి
ధ్యాయంత్యచేష్టత గృహేషు నివిష్టశంకా॥
1వ భావము:-
భగవాన్! ఒకనాడు నీ తల్లి నిన్ను ఎత్తుకొని ఉండగా నీ శరీరము ఆమెకు భారముగా తోచెను; క్రమక్రమముగా బరువు అధికమగుచు ఆమె నిన్ను మోయలేనంత భారము కాసాగెను. నీతల్లి ఆశ్చర్యపడి నిన్ను అచ్చటనే ఒక శయ్యపై పరుండజేసి - నీ గురించే యోచనచేయుచూ ఇంటిపనులలో నిమగ్నురాలయ్యెను.
43-2
తావద్విదూరముపకర్ణితఘోరఘోష-
వ్యాజృంభిపాంసుపటలీపరిపూరితాశః।
వాత్యా వపుస్స కిల దైత్యవరస్తృణావ
ర్తాఖ్యో జహార జనమానసహారిణం త్వామ్॥
2వ భావము:-
భగవాన్! అంతలోనే దట్టమైన ధూళిరేపుచు పెద్దగా గాలివీచు శబ్దము వినవచ్చెను. ఆ ధూళిని రేపుచున్న సుడిగాలి దిక్కులను పిక్కటిల్లజేయు ధ్వనితో నింగికి వ్యాపించెను. అలా సుడిగాలి రూపమున అచ్చటకు వచ్చినవాడు 'తృణావర్తుడు' అను గొప్ప రాక్షసుడు. వచ్చి జనుల మనస్సును హరించు నిన్ను తృటిలో అపహరించుకు పోయెను.
43-3
ఉద్దామపాంసుతిమిరాహృతదృష్టిపాతే
ద్రష్టుం కిమప్యకుశలే పశుపాలలోకే।
హా బాలకస్య కిమతి త్వదుపాంతమాప్తా
మాతా భవంతమవిలోక్య భృశం రురోద॥
3వ భావము:-
భగవాన్! సుడిగాలిరూపమున నీ వద్దకు వచ్చిన ఆ అసురుడగు తృణావర్తుడు - నిన్ను అపహరించుకొని పోవుచుండగా పెద్ద గాలిదుమారము ఏర్పడెను. దట్టమైన ధూళి ఆకాశపర్యంతము క్రమ్మివేయగా ఏర్పడిన ఆ చీకటిలో గోపాలురు ఏమియు చూడలేకపోయిరి. నీ తల్లి యశోద నీకు ఏమి ఆపదకలిగెనో! అని కలవరపడుచు వేగముగా నిన్ను చేరుటకు వచ్చెను. కాని నీవు అచ్చట లేకపోవుటచే ఆమె బిగ్గరగా రోదించసాగెను.
43-4
తావత్ స దానవవరో౾పి చ దీనమూర్తిః
భావత్క భారపరిధారణలూనవేగః ।
సంకోచమాప తదను క్షతపాంసుఘోషే
ఘోషే వ్యతాయత భవజ్జననీనినాదః॥
4వ భావము:-
భగవాన్! ఆ దానవ ప్రముఖుడగు తృణావర్తుడు నిన్నట్లు ఎత్తుకొనిపోవుచుండగా నీ భారము పెరగసాగెను. నీ బరువు భరించలేక అతని వేగము తగ్గెను. దానితో దర్పముడిగినవాడై వ్యాకులపడ సాగెను. అంతట, ధూళిని రేపుచూ విజృంభించిన ఆ గాలిదుమారముచేయు ధ్వని తగ్గెను; రేపల్లెలో కూడా ఆ ధ్వని తగ్గి - నీ తల్లి యశోదచేయు రోదన ధ్వని అధికముగా వినవచ్చెను.
43-5
రోదోపకర్ణనవశాదుపగమ్య గేహం
క్రందత్సు నందముఖగోపకులేషు దీనః।
త్వాం దానవస్త్వఖిలముక్తికరం ముముక్షుః
త్వయ్యప్రముంచతి పపాత వియత్ప్రదేశాత్॥
5వ భావము:-
ప్రభూ! ఆ యశోదాదేవి రోదనధ్వని విని - నందుడు, గోపాలురు అచ్చటకు చేరిరి. వారునూ నీకొరకు రోదించసాగిరి. తృణావర్త రాక్షసుడు నీ భారమును భరించలేక పూర్తిగా శక్తిహీనుడయ్యెను. దానితో నిన్ను విడువదలచెను. సకల ప్రాణులకు ఐహిక బంధములనుండి విముక్తిని ప్రసాదించు పరమాత్మా! ఆ అసురుడు నిన్ను విడిచిపెట్టదలచినను - నీవుమాత్రము ఆ అసురునిని వదలకపోవుటచే (నీ బరువును మోయలేక) ఆ తృణావర్తుడు ఆకాశమునుండి దబ్బున నేలపైబడెను.
43-6
రోదాకులాస్తదను గోపగణా బహిష్ఠ-
పాషాణపృష్టభువి దేహమతిస్థవిష్టమ్।
ప్త్రైక్షంత హంత నిపతంతమముష్యవక్ష-
స్యక్షీణమేవ చ భవంతమలం హసంతమ్॥
6వ భావము:-
మిక్కిలి ఆందోళనచెంది రోదించుచున్న ఆ గోకుల జనులకు - ఆ తృణావర్త రాక్షసుడు పెను శరీరముతో రేపల్లె వెలుపలగల ఒక పెద్దబండరాతిపై పడుచుండుట కనిపించెను. ప్రభూ! ఆశ్చర్యము! నీవు ఆ అసురుని వక్షస్థలమన - ఏగాయములేక , చిరుధరహాసము చిందించుచు సురక్షితముగా వారికి కనిపించితివి.
43-7
గ్రావప్రపాతపరిపిష్టగరిష్ఠదేహ-
భ్రష్టాసుదుష్టదనుజోపరి ధృష్టహాసమ్।
ఆఘ్నానమంబుజకరేణ భవంతమేత్య
గోపా దధుర్గిరివరాదివ నీలరత్నమ్॥
7వ భావము:-
బండరాతిపై పడుటచే అతిపెద్ద శరీరాకృతి కలిగిన ఆ దుష్టరాక్షసుని అవయవములు ముక్కలు ముక్కలుకాగా అతడు మరణించెను. ఆ రాక్షసుని వక్షస్థలముపై - నీవు చిరునవ్వులొలకించుచు, పద్మములవంటి నీ చిరు హస్తములతో వాని వక్షస్థలమున తట్టుచూ వారికి కన్పించితివి. మహాపర్వతము నుండి నీలమణిని తీసుకొని వచ్చిన రీతిగా, అప్పుడు ఆ నందుడు ఇతర గోపాలురు ఆ అసురుని వక్షస్థలమునుండి, ప్రభూ! నిన్ను తెచ్చుకొనిరి.
43-8
ఏకైకమాశు పరిగృహ్య నికామానందం
నందాదిగోపపరిరబ్దవిచుంబితాంగమ్।
ఆదాతుకామపరిశంకితగోపనారీ
హస్తాంబుజప్రపతితం ప్రణుమో భవంతమ్॥
8వ భావము:-
ప్రభూ! ఒకరితరువాత ఇంకొకరు - నందుడు మొదలగు గోకులవాసులు నిన్ను కౌగలించుకొనుచు, ముద్దాడుచూ ఆనందించసాగిరి. పద్మములవంటి తమ హస్తములతో గోపాంగనలు ఒకరినుండి మరియొకరు నిన్ను తీసుకొనుచు - ఎత్తుకొనుచు - ఆత్రుతగా ఒకరినుండి ఇంకొకరు అందుకొనుచు ఉండిరి. అప్పుడు నీవు గాలిలో ఎగురుచు పడుచు ఎగురి పడుచుంటివా! అనునట్లు కనిపించితివి. భగవాన్! అట్టి నిన్ను స్తుతింతును.
43-9
భూయో ౾పి కిన్ను కృణుమః ప్రణతార్తి హరీ
గోవింద ఏవ పరిపాలయతాత్ సుతం నః।
ఇత్యాదిమాతరపితృప్రముఖైస్తదానీం
సంప్రార్థితస్త్వదవనాయ విభో। త్వమేవ॥
9వ భావము:-
"చేతులుఎత్తి నమస్కరించు భక్తుల వ్యథలను తొలగించు గోవిందుడిని - మా పుత్రుని రక్షింపమని పదేపదే వేడుకొనుట తప్ప మేము ఇంకేమి చేయగలము?" అని అనుచూ - అట్టి ప్రార్థనలతో - నీ తల్లితండ్రులు - మిగిలినవారూ ఆ సమయమున నీ రక్షణకై - నిన్నే ప్రార్ధించసాగిరి.
43-10
వాతాత్మకం దనుజమేవమయి ప్రధున్వన్
వాతోద్భవాన్ మమ గదాన్ కిము నో ధునోషి।
కిం వా కరోమి పునరప్యనిలాలయేశ।
నిశ్శేషరోగశమనం ముహురర్థయే త్వామ్॥
10వ భావము:-
గాలిరూపమున వచ్చిన (తృణావర్త) రాక్షసుని సంహరించిన ఓ! గురవాయూరుపురాధీశా! ఆ గాలివలె నన్ను భాదించుచున్న - నాఈ క్లేశమును నీవు ఎందుకు హరించుటలేదు? నారోగమును నిశ్శేషముగా హరించమని ప్రార్ధించుటకన్నా ప్రభూ! నేను ఇంకేమి చేయగలను?
దశమ స్కంధము
43వ దశకము సమాప్తము.
-x-