నారాయణీయము/దశమ స్కంధము/42వ దశకము

||శ్రీమన్నారాయణీయము||
దశమ స్కంధము

42వ దశకము - శకటాసురవధ


42-1
కదాపి జన్మర్ క్షదినే తవ ప్రభో ।నిమంత్రితజ్ఞాతివధూ మహీసురా।
మహానసస్త్వాం సవిధే నిధాయ సా మహానసాదౌ వవృతే వ్రజేశ్వరీ॥
1 వ భావము.:-
ప్రభూ! నీ జన్మనక్షత్రముగల ఒకానొక శుభ దినమున నీ తల్లి యశోద తన బంధువులను, ఇతర గోపస్త్రీలను మరియు బ్రాహ్మణులను తన ఇంటికి ఆహ్వానించెను. అప్పుడు, పసిబాలుడవగు నిన్ను ఒకస్థలమున పరుండబెట్టి తాను వంట ఇంటి పనిలో నిమగ్నురాలయ్యెను. నీవు పరుండిన స్థలమునకు సమీపమున ఒక శకటము (బండి) ఉండెను.

42-2
తతో భవత్త్రాణనియుక్తబాలక ప్రభీతిసంక్రందనసంకులారవైః।
విమిశ్రమశ్రావి భవత్సమీపతః పరిస్ఫుటద్దారుచటచ్చటారవః॥
2వ భావము.:-
ప్రభూ! అంతలోనే, నిన్ను కనిపెట్టుకొని ఉండుటకు - యశోదచే నియోగించబడిన బాలురు కేకలువేయుచు భీతవహులై చేయు ఆక్రందనలు వినవచ్చెను. అదేసమయమున వారి ఆక్రందనలకు తోడుగా చెక్కలు పెళపెళమని ముక్కలై విరిగి పడిపోవుచున్న పెద్ద శబ్దము విన వచ్చెను.

42-3
తతస్తదాకర్ణనసంభ్రమశ్రమప్రకంపివక్షోజభరా వ్రజాంగనాః।
భవంతమంతర్దదృశుస్సమంతతో వినిష్పతద్దారుణదారుమధ్యగమ్॥
3వ భావము.:-
ప్రభూ! ఆ శబ్దము విని యశోద మరియు ఇతర గోపస్త్రీలు భయముతో - తత్తరపడుచూ తమ వక్షస్థలములు అదిరి పడుచుండగా శీఘ్రముగా పరుగు పరుగున అచ్చటకు వచ్చిరి. అచ్చట దారుణముగా - ముక్కలు ముక్కలుగా విరిగి పడియున్న శకటమును, ఆ విరిగిన ఆ కొయ్యముక్కల నడుమ (అమాయకముగా) పడుకొని ఉన్న నిన్నును చూచిరి.

42-4
శిశోరహో। కిం కిమభూదితి ద్రుతం ప్రధాన్య నందః పశుపాశ్చ భూసురాః।
భవంతమాలోక్య యశోదయా ధృతం సమాశ్వసన్నశ్రుజలార్ధ్రలోచనాః॥
4వ భావము.:-
"అయ్యో! పిల్లవానికి ఏమి జరిగెనో!" అని అనుకొనుచూ - నందుడు, గోపాలురు , బ్రాహ్మణులు కూడా అతి వేగముగా అచ్చటకు వచ్చిరి. యశోద నిన్ను ఎత్తుకొని లాలించుచుండుట చూచి వారి కన్నులు ఆనందాశ్రువులతో నిండిపోయెను.

42-5
కస్కోను కౌతస్కుత ఏష విస్మయో విశంకటం యచ్ఛకటం విపాటితమ్।
న కారణం కించిదిహేతి తే స్థితాః స్వనాసికాదత్తకరాస్త్వదీక్షకాః॥
5వ భావము.:-
"ఇదేమి? ఆశ్చర్యము! ఎట్లు జరిగినదిది? ఇంత పెద్దబండి ఏకారణములేకనే ఎట్లు విరిగి పడినది?" అని వారందరు ఆశ్చర్యచకితులయిరి; నిన్ను చూచుచు ముక్కులపై వేళ్ళు ఉంచుకొనిరి.


42-6
కుమారకస్యాస్య పయోధరార్ధినః ప్రరోదనే లోలపదాంబుజాహతమ్।
మయామయా దృష్టమనో విపర్యగాదితీశ। తే పాలకబాలకా జగుః॥
6వ భావము.:-
హరీ! నిన్ను కనిపెట్టుకొని ఉన్న ఆ గోపబాలకులు ఈ పిల్లవాడు పాలకొరకు తన కాళ్ళను జాడించుచూ ఏడవసాగెను. వాని పాదములు తగిలి ఈ బండి విరిగి పడెను. అది నేను చూచితిని అంటే..నేనూ చూచితిని అటూ వారెల్లరూ చెప్పసాగిరి.

43-7
భియా తదా కించిదజానతామిదం కుమారకానామతిదుర్ఘటం వచః
భవత్ప్రభావా విదురైరి తీరితం మనాగివాశంక్యత దృష్టపూతనైః॥
7వ భావము.:-
భగవాన్! నీ పాదతాకిడికి ఆ శకటము విరిగి పడెనని ఆ గోపబాలకులు చెప్పగా వినిన ఆ వ్రజములోని గోపాలురు కొందరు విశ్వసించలేకపోయిరి. నీ మహిమ తెలియని ఆ గోపాలురు అదియొక దుర్ఘటన అని తలచిరి. కాని దుష్ట పూతన సంఘటనను చూచినవారు మాత్రము ఆ గోపబాలకుల మాటలను విశ్వసించి అది అట్లే జరిగి ఉండవచ్చునని తలచిరి.

42-8
ప్రవాళ తామ్రం కిమిదం పదం క్షతం సరోజరమ్యౌ ను కరౌ విరాజితౌ।
ఇతి ప్రసర్పత్కరుణాతరంగితాస్త్వదంగమాపస్పృశురంగనాజనాః॥
8వ భావము.:-
ప్రభూ! "చిగురుటాకులవంటి ఎఱ్ఱని నీ పాదములకు ఏమి దెబ్బ తగిలెనో! పద్మములవంటి నీ చేతులకు ఏమి గాయమాయెనో!" అని అనుకొనుచు - ఆ గోపాంగనలు దయార్ద్రహృదయులైరి; మనసున కరుణా తరంగములు పొంగగా నీ శరీరమును ప్రేమతో నిమరసాగిరి.

42-9
అయే సుతందేహి జగత్పతేః కృపాతరంగపాతాత్ పరిపాతమధ్య మే।
ఇతి స్మ సంగృహ్య పితా త్వదంగకం ముహుర్ముహుః శ్లిష్యతి జాతకంటకః॥
9వ భావము.:-
భగవాన్! నీ తండ్రి నందగోపాలుడు ఆనందముతో - "పరమాత్మా! నీ కరుణ చేతనే నా పుత్రుడు రక్షించబడెను", అని పలుకుచూ, "ఓ యశోదా! పుత్రుడిని నాకు ఇమ్ము!" అని తన చేతులలోనికి - నిన్ను తీసుకొని తన శరీరము గగుర్పొడుచుండగా నిన్ను పదే పదే కౌగలించుకొనెను.

42-10
అనోనిలీనః కిల హంతుమాగతః సురారిరేవం భవతా విహింసితః।
రజో౾పి నో దృష్టమముష్య తత్కథం సశుద్ధసత్త్వే త్వయి లీనవాన్ ధృవమ్॥
10వ భావము.:-
భగవాన్! శకటరూపమున నిన్ను వధించుటకు వచ్చిన శకటాసురుని నీవు వధించితివి. "లేశ మాత్రము రజోగుణము చూపకపోయినను ఆ శకటాసురునికి నీ వలన మరణము సంభవించెను. అది ఎట్లు సాధ్యమయ్యెను? శుద్ధ సత్వగుణరూపుడవయిన నీ దరి చేరగనే అతను (నీ అనుగ్రహముతో) గుణరహితుడై నీలో లయమయి యుండవచ్చును".

42-11
ప్రపూజితైస్తత్ర తతో ద్విజాతి భిర్విశేషతో లంభితమంగళాశిషః ।
వ్రజం నిజైర్బాల్యరసైర్విమోహయన్ మరుత్పురాధీశ। రుజాం జహీహి మే॥
11 వ భావము.:-
ప్రభూ! ఆ సంఘటనానంతరము, యశోదా నందగోపాలురు - ద్విజులను ఆహ్వానించిరి; వారిని పూజించి వారిచే నీకు దీవెనలు ఇప్పించిరి. తిరిగి నీవు నీ బాల్యచేష్టలతో, క్రీడలతో వ్రజమునందలి ప్రజలను సమ్మోహితులను చేయసాగితివి. అట్టి గురవాయూరు పురాధీశా! నా వ్యాధిని తొలగించమని నిన్ను ప్రార్ధించుచున్నాను.

దశమ స్కంధము
42వ దశకము సమాప్తము.
-x-