నారాయణీయము/చతుర్థ స్కంధము/18వ దశకము

||శ్రీమన్నారాయణీయము||
చతుర్ధ స్కంధము

18వ దశకము - పృథు చరిత్రము వర్ణనం

18-1-శ్లో.
జాతస్య ధ్రువకుల ఏవ తుంగకీర్తేః
అంగస్య వ్యజని సుతస్స వేననామా।
తద్దోషవ్యథితమతిః స రాజవర్యః
త్వత్పాదే నిహితమనా వనం గతో౾ భూత్।।
1వ భావము:
ధ్రువుడు పరమపదమును సాధించిన మహాత్ముడు. ధ్రువుని తదనంతరము జన్మించిన ‘అంగుడు‘ ఉన్నత కీర్తిని పొందెను. అతని పుత్రుడగు ‘వేనుడు‘ దుశ్శీలుడై తన దుర్గుణములతో తండ్రి అయిన ‘అంగుని‘కి మిక్కిలి వ్యధను కలిగించెను. పుత్రుని దుర్మార్గపు ప్రవర్తనకు విరక్తుడై, అంగుడు - శ్రీహరీ! నీ పాదపద్మములందు తన చిత్తమును నిలిపి, రాజ్యమును త్యజించి -వనవాసమున కేగెను.

18-2-శ్లో.
పాపో౾పి క్షితితలపాలనాయ వేనః
పౌరాద్తైరుపనిహితః కఠోరవీర్యః।
సర్వేభ్యో నిజబలమేన సంప్రశంసన్
భూచక్రే తన యజనాన్యయం న్యరౌత్సీత్।।
2వ భావము:
‘అంగుడు‘ అరణ్యమునకు వెళ్ళగా - తదుపరి, పురజనులు ‘వేనుడు‘ని రాజ్యపాలకునిగా చేసిరి. పాపాత్ముడగు ‘వేనుడు‘ నిరంకుశుడై ప్రజాకంఠకుడుగా పరిపాలించసాగెను. భూమండలమున ప్రజలెవ్వరూ (శ్రీహరికై) యజ్ఞయాగాదులు చేయరాదని కట్టడి చేసెను.

18-3-శ్లో.
సంప్రాప్తే హితకథనాయ తాపసౌఘే
మత్తో౾న్యో భువనపతిర్న కశ్చనేతి।
త్వన్నిందావచనపరో మునీశ్వరైస్తైః
శాపాగ్నౌ శలభదశామనాయి వేనః।।
3వ భావము:
ప్రభూ! అప్పుడు దురహంకారియగు ‘వేనుని‘ వద్దకు మనులెల్లరు వెళ్ళి - 'ధర్మముగా పరిపాలించమనియు, భగవత్ప్రీతి కొరకు యజ్ఞయాగాదులు చేయవలయు ననియు, దేవతలను నిరసించుట తగదనియూ' హితము పలికిరి. 'రాజే సర్వదేవమయుడని' తన బలమును తానే ప్రశంసించుకొనుచూ (గర్వాంధుడైన) ‘వేనుడు‘ వారి హితోక్తులను తిరస్కరించెను. లోకమున తనకన్న గొప్ప ఆరాధ్యపురుషుడు లేడని పలుకుచూ మునీశ్వరులను నిందించసాగెను. అంతట - కోపోద్రిక్తులైన మునీశ్వరుల శాపాగ్నికి ఆ‘వేనుడు‘ శలభమువలె హతమయ్యెను.

18-4-శ్లో.
తన్నాశాత్ ఖిలజనభీరుకైర్మునీంద్రైః
తన్మాత్రా చిరపరిరక్షితే తదంగే।
త్యక్తాఘే పరిమథితాదథోరుదండాత్
దోర్దండే పరిమథితే త్వమావిరాసీః।।
4వ భావము:
వేనుడు హతమొందిన పిమ్మట, రాజులేని రాజ్యమున, దుష్టజనులు చేయు అరాచకములను చూచి, మునీంద్రులు కలతనొందిదిరి. ‘వేనుని‘ తల్లి వేనుడి (విగత) శరీరమును తన యోగమంత్రశక్తితో కాపాడుకొనుచుండెను. మునీంద్రులు రాజ్యపరిరక్షణార్దమై, 'విగత వేనుడి‘ శరీరము నందలి ‘ఊరువు‘ భాగమును మధించి ఆ శరీరమును పవిత్రము చేసిరి. అనంతరము 'బాహువులను' మధించిరి. అంతట ప్రభూ! నీవు (పృథువుగా) జన్మించితివి.

18-5-శ్లో.
విఖ్యాతః పృథురితి తాపసోపదిష్టైః
సూతాద్యైః పరిణుత భావిభూరివీర్యః
వేనార్త్యా కబలితసంపదం ధరిత్రీం
ఆక్రాంతాం నిజధనుషా సమామకార్షీః।।
5వ భావము:
'జన్మించిన శిశువు శ్రీమన్నారాయణాంశ సంభూతడనియు, పృథువు అను నామమున ప్రఖ్యాతిగాంచు ననియు, ఆ నామమునకు సార్ధకత కలుగుననియు‘ మునీశ్వరులు నిన్ను కీర్తించిరి. వారి ప్రేరణచే సూతాదులు ( సూత మాగధులు - స్తుతి వచనములను పఠించువారు) భవిష్యత్తున ‘పృథుచక్రవర్తి‘ పరాక్రమమున జరగబోవు మహాకార్యములను స్తుతించిరి. అప్పటికే - 'వేనుడి‘ దుష్పరిపాలనతో భూసారమంతయూ హరించవేయబడినది. పృథుచక్రవర్తి నామమున జన్మించిన నారాయణమూర్తీ! నీవు నీధనస్సుతో ప్రథమముగా భూమండలమును సమతలము గావించితివి.

18-6-శ్లో.
భూయస్తాం నిజకులముఖ్య వత్సయుక్తైః
దేవాద్యైః సముచితచారుభాజనేషు,।
అన్నాదీన్యభిలషితాని యాని తాని
స్వచ్ఛందం సురభి తనూమదూదుహస్త్వమ్।।
6వ భావము:
అనంతరము - భూమి నీప్రేరణచే ‘ సురభి‘ అను నామమున ‘కామధేనువు‘ రూపమును ధరించినది. ప్రధాన దేవతలు గోవత్సములు (ఆవు దూడలు) కాగా-ఇతర దేవతలు సముచిత పాత్రలు చేతపట్టిరి. నీవు వారిచేత ‘ఆహారమయక్షీరమును‘ మరియు ఇతర 'అభిలిషిత పదార్ధమయ క్షీరములను' వారిచే పితికించితివి. శ్రీహరీ! ఇది యంతయూ నీ సంకల్పమువలననే జరిగినది.

18-7-శ్లో.
ఆత్మానం యజతి ముఖైస్త్వయి త్రిధామన్
ఆరబ్దే శతతమ వాజిమేధ యాగే।
స్పర్ధాళుః శతమఖ ఏత్య నీచవేషో
హృత్వా౾శ్వం తవ తనయాత్ పరాజితో౾భూత్।।
7వ భావము:
పరమాత్మా! త్రిలోకాధిపతివైన నీవు, పృథుచక్రవర్తి రూపమున శతాశ్వమేధ యాగములను ఆచరించుచూ నూరవ యజ్ఞమును ప్రారంభించితివి. అదిచూచి, నూరుయజ్ఞములు చేసి ‘శతమఖుడ‘ని పేరొందిన ఇంద్రుడు నీవు అట్లు యజ్ఞముచేయుట సహించలేకపోయెను. తన మనస్సున ఏర్పడిన స్పర్ధభావముచే (నీ యజ్ఞమును భంగపరచవలెనని) నీచవేషముతో నీ యజ్ఞాశ్వమును అపహరించెను. అయిననూ, నీకుమారుని చేతిలో అతడు పరాజితుడయ్యెను.

18-8-శ్లో.
దేవేంద్రం ముహురితి వాజినం హరంతం
వహ్నౌ తం మునివరమండలే జుహూషౌ।
రుంధానే కమలభవే క్రతోస్సమాప్తౌ
సాక్షాత్ త్వం మధురిపుమైక్షథాః స్వయం స్వమ్।।
8వ భావము:
నారాయణమూర్తీ! పృథువు రూపముననున్న నీవు యాగము చేయుచున్నప్పుడు విడచు యాగాశ్వములను ఇంద్రుడు అపహరించుచు - నీ యజ్ఞమునకు విఘ్నము కలిగించుచుండెను. అట్టి విఘ్నముకలిగించు ఇంద్రుడినే – అగ్ని యందు హవిస్సుగా వేయవలెనని మునీశ్వరులు సంకల్పించిరి. అంతట బ్రహ్మదేముడు ప్రత్యక్షమై ఆప్రయత్నమును విరమింపజేసి, నీయజ్ఞక్రతువును పూర్తి గావించెను. ‘మధు‘దైత్య సంహారీ - శ్రీహరీ! పృథునామమున జన్మించిన నీవు నీ నిజరూపమును ఆ చక్రవర్తికి దర్శంపజేసితివి.

18-9-శ్లో.
తద్దత్తం వరముపలభ్య భక్తిమేకాం
గంగాంతే విహితపదః కదాపి దేవ।
సత్రస్థం మునినివహం హితాని శంసన్
ఐక్షిష్ఠాః సనకముఖాన్ మునీన్ పురస్తాత్।।
9వ భావము:
అట్లు విష్ణువు సాక్షాత్కరించి వరము అనుగ్రహించగా, విష్ణుభక్తి పరాయణుడవై, పృథునామధారివైన నీవు గంగానదీతీరమున నివాసమేర్పరుచుకొని, హితవచనములను పలుకుచూ - మునిసమూహముతో కలిసి సత్రయాగమును అనుష్టించితివి. ఆ సమయమున, సనకాది మహామునులు నీవద్దకు వచ్చిరి.

18-10-శ్లో.
విజ్ఞానం సనకముఖోదితం దధానః
స్వాత్మానం స్వయమగమో వనాంతాసేవీ।
తత్తాదృక్ పృథువపురీశ! సత్వరం మే
రోగౌఘం ప్రశమయ వాతగేహవాసిన్।
10వ భావము:
సనత్కుమారుడు ఆత్మజ్ఞానమును భోధించెను. ఏకాగ్రచిత్తముతో ఆత్మనిష్టుడైన పృథువు, వానప్రస్థాశ్రమమును స్వీకరించి వనములకేగి -తపస్సాచరించి ఆపై పరమాత్మలో ఐక్యమయ్యెను. పృథుచక్రవర్తి రూపమున జన్మించిన ఓ శ్రీహరీ! గురవాయూరు పురవాసా! శ్రీఘ్రమే నారోగమును హరించి నాకు ధృఢ భక్తిని ప్రసాదించుము.

చతుర్థ స్కంధము
18వ దశకము సమాప్తము.

-x-
 

Lalitha53 (చర్చ) 16:00, 9 మార్చి 2018 (UTC)