నారాయణీయము/చతుర్థ స్కంధము/17వ దశకము

||శ్రీమన్నారాయణీయము||
చతుర్ధ స్కంధము

17వ దశకము - ధ్రువ చరితము వర్ణనం

17-1-శ్లో.
ఉత్తానపాదనృపతేర్మనునందనస్య
జాయా బభూవ సురుచిర్నితరామభీష్టా।
అన్యా సునీతిరితి భర్తురనాదృతా సా
త్వామేవ నిత్యమగతిశ్సరణం గతా౾భూత్।।
1వ. భావము
స్వాయంభువు మనువు పుత్రుడగు ఉత్తనపాదునకు సురుచి మరియు సునీతి అను వారిరువురు భార్యలు. వారిలో సురుచియందు అత్యనురక్తుడై, ఉత్తనపాదుడు సునీతిని నిరాదరించుచుండెను. గత్యంతరములేని సునీతి - నారాయణమూర్తీ! నిన్నే శరణు జొచ్చెను.

17-2-శ్లో.
అంకే పితుస్సురుచిపుత్రకముత్తమం తం
దృష్ట్వాధ్రువః కిల సునీతిసుతో౾ధిరోక్ష్యన్।
ఆచిక్షిపే కిల శిశుః సుతారాం సురుచ్యా
దుస్సంత్యజా ఖలు భవద్విముఖైరసూయా।।
2వ. భావము
సురుచి కుమారుడగు ఉత్తముడు తండ్రి ఒడిలో కూర్చునియుండుట చూచి, ఒకానొక దినమున సునీతి కుమారుడగు ధ్రువుడు తానుకూడా తండ్రిఒడిలో కూర్చుండవలెనని ఉబలాటపడెను. అందుకు ఎంతమాత్రము ఓర్వని సురుచి, బాలుడైన ధ్రువుని అధిక్షేపించెను. ప్రభూ! భగవద్భక్తులు కానిచో వారిని అసూయ వీడదు కదా!

17-3-శ్లో.
త్వన్మోహితే పితరిపశ్యతి దారవశ్యే
దూరందురుక్తినిహతః స గతో నిజాంబామ్।
సా౾ పి స్వకర్మగతిసంతరణాయ పుంసాం
త్వత్పాదమేవ శరణం శిశవే శశంస।।
3వ. భావము
తండ్రిని చేరనీయక - సురిచి పలికిన దుర్భాషలు ములుకులై, ధ్రువుని హృదయమును గాయపరచెను. భగవాన్! (నీ) మాయామోహకారణమున ఉత్తానపాదుడు - భార్యావశుడై, ధ్రువుని ఆదరింపలేకపోయెను. తండ్రి నిరాదరణకు గురియైన ధ్రువుడు తల్లినిచేరి విలపించెను. సునీతి ధ్రువుని ఊరడించి - “జీవుడు పూర్వజన్మమున చేయు కర్మ ఫలితమును ఈ జన్మమున అనుభవించును (స్వకార్మానుగతి). శ్రీహరి చరణములను శరణు వేడుటయే దుఖఃనివారణోపాయ” మని అతనికి భోధించెను.

17-4-శ్లో.
ఆకర్ణ్య సో ౾ పి భవదర్చననిశ్చితాత్మా
మానీ నిరేత్య నగరాత్ కిల పంచవర్షః।
సందృష్టనారదనివేదితమంత్రమార్గః
త్వామారరాధ తపసా మధుకాననాంతే।।
4వ. భావము
భగవాన్! ధ్రువుడు - ఐదు సంవత్సరముల బాలుడే అయిననూ అభిమానవంతుడు. సురుచి ఓర్వలేమి వాక్కులను సహించలేక (జీర్ణించుకొనలేక) పోయెను. తల్లి భోదనతో ఉత్తేజితుడై, నిన్ను అర్చించవలెనను ధృఢచిత్తముతో నగరమును వీడి తపోవనమునకు పోసాగెను. మార్గమధ్యమున నారదమహర్షి కనిపించి, మధువనమునకు వెళ్ళి తపస్సు చేయమని చెప్పి, ధ్రువునికి ‘ద్వాదశాక్షరీ‘ మంత్రమునుపదేశించెను.

17-5-శ్లో.
తాతే విషణ్ణహృదయే నగరీం గతేన
శ్రీనారదేన పరిసాంత్వితచిత్తవృత్తౌ।
బాలస్త్వదర్పితమనాః క్రమవర్ధితేన
నిన్యే కఠోరతపసా కిల పంచమాసాన్।।
5వ. భావము
ధ్రువుడు నగరము విడిచివెళ్ళిన అనంతరము ఉత్తానపాదుని హృదయము చింతాక్రాంతమయ్యెను., నారదమహర్షి ఊరడించగా - ప్రశాంతచిత్తుడయ్యెను. శ్రీహరీ! బాలుడగు ధ్రువుడు తన మనస్సున నీరూపమును నిలుపుకొని క్రమక్రమముగా కఠోర తపస్సునాచరించెను. అట్లు అయిదు మాసములు గడిచినవి.

17-6-శ్లో.
తావత్ తపోబలనిరుచ్ఛ్వసితే దిగంతే
దేవార్థితస్త్వముదయత్కరుణార్ధ్రచేతాః¬।
త్వద్రూపచిద్రసనిలీనమతేః పురస్తాత్
ఆవిర్భభూవిథ విభో! గరుడాధిరూఢః
6వ. భావము
ధ్రువునికి తపోబలమువలన ‘ధారణాయోగము‘ సిద్ధించెను. ఆబాలుడు చేయు ‘ప్రాణనిరోధ క్రియ‘చే సకలదిక్కులనుండు జీవులకు ఉచ్వాస నిశ్వాసలు స్తంభించినవి. అప్పుడు దేవతలు ప్రార్ధించగా, కరణార్ధ్ర చిత్తుడువైన నీవు - తన చిత్తమున నీరూపమునే నిలుపుకొని లీనమై ఆనందము పొందుచున్న ధ్రువుని ఎదుట గరుడ వాహనుడవై సాక్షాత్కరించితివి.

17-7-శ్లో.
త్వద్దర్శనప్రమదభారతరంగితం తం
దృగ్భ్యాం నిమగ్నమివ రూపరసాయనే తే।
తుష్టూషమాణమవగమ్య కపోలదేశే
సంస్పృష్టవానసి దరేణ తథా౾౾దరేణ।।
7వ. భావము
ప్రభూ! నిన్ను దర్శించినంతనే ధ్రువుని హృదయము ఆనంద తరంగ భరితమయ్యెను. నీ రూపమునే తదేకధ్యానముతో చూచుటవలన కన్నులు ఆర్ధ్రమయ్యెను. సంతోషముతో నిన్ను స్తుతింపవలయునని కోరుచున్న ధ్రువుని మనసెరిగిన నీవు, ఆదరముతో అతని కపోలమును నీవేదమయ శంఖముతో స్పృశించితివి.

17-8-శ్లో.
తావద్విబోధవిమలం ప్రణువంతమేనం
ఆభాషథాస్త్వమవగమ్య తదీయభావమ్।
రాజ్యం చిరం సమనుభూయ భజస్వ భూయః
సర్వోత్తరం ధ్రువపదం వినివృత్తిహీనమ్।।
8వ. భావము
ప్రభూ! నీవు శంఖముతో స్పృశించినంతనే ఆ ప్రభావమున ధ్రువుడు తత్వజ్ఞానమును పొంది నిర్మలాంతఃకరుణుడై నిన్ను స్తుతించెను. ధ్రువుని అభీష్టమెరిగిన నీవు అతనితో - “వత్సా! చిరకాలము రాజ్యపాలన గావించి తదనంతరము సర్వోన్నతమైనది మరియు పునరావృత్తరహితమైనది అగు ధృవపదమను పొందెదవు“. అని పలికి ధ్రువుని అనుగ్రహించితివి.

17-9-శ్లో.
ఇత్యూచుషి త్వయి గతే నృపనందనో౾సౌ
ఆనందితాఖిలజనో నగరీముపేతః।
రేమే చిరం భవదనుగ్రహపూర్ణకామః
తాతే గతే చ వనమాదృతరాజ్యభారః।।
9వ. భావము
ప్రభూ! ఆవిధముగా ధ్రువుని అనుగ్రహించి నీవు అంతర్ధానమైతివి. అనంతరము ధ్రవుడు తనరాకకై ఎదురుచూచుచున్న సకలజనులకు ఆనందము కలిగించుచూ నగరమును చేరెను. నీ అనుగ్రహముచే సకలాభీష్టములు నెరవేరగా ధ్రువుడు సంతోషముతో జీవించెను. తండ్రియగు ఉత్తానపాదుడు వానప్రస్థము స్వీకరించి అడవులకేగగా రాజ్యభారమును స్వీకరించి, ధ్రువుడు - చిరకాలము, ఆదరమున ప్రజలను పరిపాలించెను.

17-10-శ్లో.
యక్షేణ దేవ! నిహతే పునరుత్తమే౾ స్మిన్
యక్ష్దైస్సయుద్ధనిరతో విరతో మనూక్త్యా।
శాంత్యా ప్రసన్నహృదయాత్ ధనదాదుపేతాత్
త్వద్భక్తిమేవ సుదృఢామవృణోన్మహాత్మా।।
10వ. భావము
దేవా! ఇట్లుండగా ఒకనాడు, ధ్రువుని సోదరుడగు ‘ఉత్తముడిని' ఒక యక్షుడు సంహరించెను. అప్పుడు ధ్రువుడు యక్షులతో యుద్ధము చేసెను. భీకరమైన ఆపోరు ధీర్ఘకాలము కొనసాగుచుండగా ‘స్వాయంభువు మనువు‘ తన మనుమడైన ధ్రువుని వద్దకు వచ్చి, యుద్ధమును నిలిపి వేయమని పలికి; "రోషమును - క్రోధమును" త్యజించమని ఉపదేశించెను. పితామహుని ఉపదేశమును స్వీకరించి ధ్రువుడు యుద్ధవిరక్తుడయ్యెను. శాంతముతో యుద్ధమునాపిన ధ్రువుడు, యక్షరాజగు కుబేరుని అనుగ్రహమును పొందెను. కుబేరుడు వరముకోరుకొనమనగా, ప్రభూ! మహాత్ముడైన ధ్రువుడు నీయందు ధృడభక్తిని మాత్రమే కోరుకొనెను.

17-11-శ్లో.
అంతే భవత్పురుషనీతవిమానయాతో,
మాత్రా సమం ధృవపదే ముదితో ౾ యమాస్తే।
ఏవం స్వభృత్యజనపాలనలోలధీస్త్వం,
వాతాలయాధిప! నిరుంధి మమామయౌఘాన్।
11వ. భావము
అంత్యకాలమున ధ్రువుని కొరకు నీవు నీ సేవకులను (విష్ణు దూతలను), విమానమునూ పంపితివి. ధ్రువుడు తన తల్లితో కలిసి ఆ విమానమున పయనించి ‘విష్ణు పదమును‘ చేరి అచట ఆనందముతోనుండెను (ధ్రువుడు నెలకొనిన స్థానమగుటచే విష్ణు పదము - ధ్రువ పదమని పేరుగాంచినది). భక్తులపాలిట దయార్ధ్ర హృదయుడవై యుండు గురవాయూరు పురాధీశా! రోగమును నివారించమని నిన్ను ప్రార్దించుచున్నాను.

చతుర్థ స్కంధము
17వ దశకము సమాప్తము.

-x-
 

Lalitha53 (చర్చ) 16:00, 9 మార్చి 2018 (UTC)