నారాయణీయము/ఏకాదశ స్కంధము/96వ దశకము

||శ్రీమన్నారాయణీయము||

ఏకాదశ స్కంధము

96- వ దశకము - భగవద్విభూతి-భక్తియోగము



96-1
త్వంహి బ్రహ్మైవ సాక్షాత్ పరమురుమహిమన్నక్షరాణామకారః
తారో మంత్రేషు రాజ్ఞాం మనురసి మునిషు త్వం భృగుర్నారదో౾పి।
ప్రహ్లాదో దానవానాం పశుషు చ శురభిః పక్షిణాం వైనతేయో
నాగానామస్యనంతః సురసరిదపి చ స్రోతసాం విశ్వమూర్తే।
1వ భావము :-
భగవాన్! కృష్ణా! నీవు సాక్షాత్తూ పరబ్రహ్మస్వరూపుడవు. విశ్వరూపివి. సకలరూపములలో వ్యాపించియున్న మహిమాన్వితుడవు. అక్షరములలో నీవు అకారమువు. మంత్రములలో ప్రణవమువి. రాజులలో మనువువు. మునులలో భృగువువు మరియు నారదమునివియూ నీవే. దానవులలో ప్రహ్లాదుడు, పశువులలో కామధేనువు, పక్షులలో గరుత్మంతుడు, నదులలో గంగానదిరూపముతో ఉన్నదికూడా ప్రభూ! నీవే!

96-2
బ్రహ్మణ్యానాం బలిస్త్వం క్రతుషు చ జపయజ్ఞో౾సి వీరేషు పార్థో
భక్తానాముద్ధవస్త్వం బలమసి బలినాం ధామ తేజస్వినాం త్వమ్।
నాస్త్వంతస్త్వద్విభూతేర్వికసదతిశయం వస్తుసర్వం త్వమేవ
త్వం జీవస్త్వం ప్రధానం యదిహ భవదృతే తన్న కించిత్ ప్రపంచే॥
2వ భావము :-
భగవాన్! కృష్ణా! బ్రాహ్మణులను ఆదరించువారిలో బలిచక్రవర్తి రూపమునను, యజ్ఞములలో జపయజ్ఞముగను, వీరులలో అర్జునునిగను, భక్తులలో ఉద్ధవునిగను, బలవంతులలో శక్తిరూపముగను, జీవులలో తేజస్సు రూపముననూ నీవే ఉంటివి. నీ మహిమాన్విత రూపములు అనంతములు. సర్వమునందు ప్రకాశించుచున్న రూపమూ నీదే. జీవుడువీ నీవే. ప్రకృతివీ నీవే. ప్రభూ! నీవుకానిది, నీవులేనిది ఏమియునూ లేదు.

96-3
ధర్మం వర్ణాశ్రమాణాం శ్రుతిపథవిహితం త్వత్పరత్వేన భక్త్యా
కుర్వంతో౾ంతర్విరాగే వికసతి శనకైస్సంత్యజంతో లభంతే।
సత్తాస్ఫూర్తిప్రియత్వాత్మకమఖిలపదార్థేషు భిన్నేష్వభిన్నం
నిర్మూలం విశ్వమూలం పరమమహమితి త్వద్విబోధం విశుద్ధమ్॥
3వ భావము :-
భగవాన్! కృష్ణా! భక్తియోగముననున్న సాధకుడు ప్రారంభమున వేదవిహితమార్గమగు వర్ణాశ్రమధర్మములను శ్రద్ధగా నిర్వర్తించుచు క్రమక్రమముగా వైరాగ్యసిద్ధికలిగి కర్మలను వదిలివేయును. 'సకలపదార్ధములలోను భిన్న భిన్నరూపములలోనున్నది వాస్తవమునకు అభిన్నమయినది; విశ్వమంతటకు కారణమయినది, సర్వాత్మకమయినది, ఉనికి ప్రకాశము ఆనందరూపములలో సర్వమునందు వ్యాపించియున్న పరమాత్మను నేనే!' అను నీ శుద్ధతత్వజ్ఞానమును తుదకు సాధకుడు పొందును.

96-4
జ్ఞానం కర్మాపి భక్తిస్త్రితయమిహ భవత్ప్రాపకం తత్ర తావత్
నిర్విణ్ణానామశేషే విషయ ఇహ భవేత్ జ్ఞానయోగే౾ధికారః।
సక్తానాం కర్మయోగస్త్వయి హి వినిహితో యే తు నాత్యంతసక్తాః
నాప్యతంతం విరక్తాస్త్వయి చ ధృతరసా భక్తియోగో హ్యామీషామ్॥
4వ భావము :-
భగవాన్! కృష్ణా! జ్ఞానము, భక్తి, కర్మము అనునవి నిన్ను చేరు సాధనములు. సకలవిషయములయందు ఆసక్తివదిలి నీ తత్వజ్ఞానసాధనయందు మాత్రమే నిమగ్నులయి జ్ఞానయోగులు జ్ఞానమార్గమున నిన్నుచేరుదురు. తమ కర్మమార్గమును వదలక తమ సకలకర్మఫలమును నీకే అర్పించి కర్మయోగులు కర్మమార్గమున నిన్ను చేరుదురు. కర్మాచరణయెడ అత్యంత ఆసక్తికాని లేదా అత్యంత విరక్తిగానిలేని నీ భక్తులు, ప్రభూ! భక్తిమార్గమున నిన్నుచేరుదురు.

96-5
జ్ఞానం త్వద్భక్తతాం వా లఘు సుకృతవశాన్మర్త్యలోకే లభంతే
తస్మాత్తత్య్రైవ జన్మ స్పృహయతి భగవన్। నాకగో నారకో వా।
ఆవిష్టం మాం తు దైవద్భవజలనిధిపోతాయితే మర్త్యదేహే
త్వం కృత్వా కర్ణధారం గురుమనుగుణవాతాయితస్తారయేథాః॥
5వ భావము :-
భగవాన్! కృష్ణా! మానవులు మాత్రమే వారివారి పుణ్యకర్మల ఫలితముగా నీతత్వజ్ఞానమునుగాని, భక్తినిగాని పొందగలుగుదురు. అందులకే నరకవాసి అయినను, స్వర్గవాసి అయిననూ మానవజన్మను కోరుకొనుచుందురు. దేవా! అదృష్టవశమున నేను మానవజన్మను పొందితిని. ప్రభూ! నీవే నాకు గురువుగాను, నాదేహమను నావకు నావికుడుగాను, ఆ నావకు అనుకూలముగావీచు వాయువుగాను అయి నన్ను సంసారసాగరమును దాటించుము.

96-6
అవ్యక్తం మార్గయంతః శ్రుతిభిరపి నయైః కేవలజ్ఞానలుబ్ధాః
క్లిశ్యంతే౾తీవ సిద్ధిం బహుతరజనుషామంత ఏవాప్నువంతి।
దూరస్థః కర్మయోగో౾పి చ పరమఫలే నన్వయం భక్తియోగః
త్వామూలాదేవ హృద్యస్త్వరితమయి భవత్ప్రాపకో వర్ధతాం మే॥
6వ భావము :-
భగవాన్! కృష్ణా! నీ అవ్యక్త బ్రహ్మతత్వమును పొందుటకై కొందరు మానవులు వేదములుచూపిన సాధనామార్గమగు నైతికజీవనమును గడుపుచు జ్ఞానమార్గమున సాధనచేయుటకై శ్రమించుచు అనేకజన్మలుఎత్తి, అనంతరము మోక్షమును పొందుచుందురు. కర్మయోగమువలనకూడా పరమఫలము (మోక్షము) పొందుట సులభసాధ్యముకాదు. కాని, ప్రభూ! నీ భక్తిమార్గము హృద్యమయినది; నీ అనుగ్రహమును త్వరితముగా అనుగ్రహించునది. అట్టి భక్తియోగము నాయందు వృద్ధిచెందుగాక!

96-7
జ్ఞానాయైవాతియత్నం మునిరపవదతే బ్రహ్మతత్త్వం తు శృణ్వన్
గాఢం త్వత్పాదభక్తిం శరణమయతి యస్తస్య ముక్తిః కరాగ్రే।
త్వద్ధ్యానే౾పీహ తుల్యా పునరసుకరతా చిత్తచాంచల్యహేతోః
అభ్యాసాదాశు శక్యం తదపి వశయితుం త్వత్కృపాచారుతాభ్యామ్॥
7వ భావము :-
భగవాన్! కృష్ణా! వ్యాసమహర్షి జ్ఞానమార్గమున తత్వజ్ఞానముపొందు ప్రయత్నముకన్ననూ నీ అనుగ్రహముపొందుటకు భక్తిసాధనాయోగమే ఉత్తమమయినది అని తెలిపెను. ప్రభూ! భక్తితో నీ తత్వమువిని తత్వజ్ఞానసిద్ధిపొందువారికి, నీవేశరణు అని నిన్నుఆశ్రయించినవారికీ మోక్షము వారిచేతియందే ఉన్నంత సులభసాధ్యమగును. భక్తిని ఆశ్రయించిననూ తమచిత్తమును నీయందు స్థిరముగా నిలుపుకొనలేనివారికి జ్ఞానమార్గములోవలెనే మోక్షసిద్ధి కష్టసాధ్యమగును. తమచిత్తమును వశపరచుకొని భక్తియోగమున సాధనచేయుటకై నిన్నుధ్యానించువారు త్వరితగతిని నీఅనుగ్రహమునకు పాత్రులగుదురు.

96-8
నిర్విణ్ణః కర్మమార్గే ఖలు విషమతమే త్వత్కథాదౌ చ గాఢం
జాతశ్రద్ధో౾పి కామానయి భువనపతే। నైవ శక్నోమి హాతుమ్।
తద్భూయో నిశ్చయేన త్వయి నిహితమనా దోషబుద్ధ్యా భజంస్తాన్
పుష్ణీయాం భక్తిమేవ త్వయి హృదయగతే మంక్షునంక్ష్యంతి సంగాః॥
8వ భావము :-
భగవాన్! కృష్ణా! నేను కర్మమార్గమునందు నిరాసక్తుడను; నేను భక్తిమార్గమున నిమగ్నమయున చిత్తముతో నీ మహత్యములు వినుటయందు ఆసక్తిని, శ్రద్ధను కలిగియుంటిని. అయిననూ నామనస్సును వివిధ కోరికలయెడ వశమగుటను నిలువరించుట కష్టమగుచున్నది. అయిననూ నేను విషయాసక్తి దోషభూయిష్టమను ఎరుకగలిగి అనాసక్తముగా కర్మలను ఆచరించెదను; నా అంతఃకరణలో నీయెడ భక్తిని వృద్ధిచేసుకొనెదను. ప్రభూ! నీవు నాహృదయమున నిలిచినచో నా విషయాసక్తులన్నియు శీఘ్రమే తొలగిపోవును.

96-9
కశ్చిత్ క్లేశార్జితార్థక్షయవిమలమతిర్నుద్యమానో జనౌఘైః
ప్రాగేవం ప్రాహ విప్రో న ఖలు మమ జనః కాలకర్మ గ్రహా వా।
చేతో మే దుఃఖహేతుస్తదిహ గుణగణం భావయత్ సర్వకారీ-
త్యుక్త్వా శాంతో గతస్త్వాం మమ చ కురు విభో। తాదృశీం చిత్తశాంతిమ్॥
9వ భావము :-
భగవాన్! కృష్ణా! ఒకప్పుడొక విప్రుడు తనకష్టార్జితమయున సంపదను పోగొట్టుకొనెనని దుఃఖితుడయ్యెను. అప్పుడు ఆ విప్రుని మనస్సు విరక్తితో నిర్మలమయ్యెను. తనను వివిధరకములుగా ప్రశ్నించుచున్న జనులతో వివేకముపొందిన ఆ విప్రుడు ఇట్లుపలికెను. "మన దుఃఖమునకు ఇతర జనులుకాని, కాలముకర్మముగాని, గ్రహములుకాని కారణముకాదు. సత్వ, రజో, తమోగుణాన్విత వశమయున మనచిత్తమే దానికి కారణము!", అని పలికి ప్రశాంతచిత్తముతో ఆ విప్రుడు నీ భక్తుడయ్యెను. ప్రభూ! నాకునూ అట్టిభక్తిని ప్రసాదించుము.

96-10
ఐలః ప్రాగుర్వశీం ప్రత్యతివివశమనాః సేవమానశ్చిరం తాం।
గాఢం నిర్విద్య భూయో యువతిసుఖమిదం క్షుద్రమేవేతి గాయన్।
త్వద్భక్తిం ప్రాప్య పూర్ణస్సుఖతరమచరత్ తద్వదుద్ధూతసంగం
భక్తోత్తంసం క్రియా మాం పవనపురపతే। హంత మే రుంధి రోగాన్॥
10వ భావము :-
భగవాన్! కృష్ణా! పూర్వము 'ఐలుడు (పురూరవుడు)' ఊర్వశికి ఆకర్షితుడై చిరకాలము ఆమెతో గడిపి ఆపైన విరక్తుడై సర్వసంగపరిత్యక్తుడయ్యెను; నీయందు పరిపూర్ణభక్తినిపొంది నీ భక్తోత్తముడై తన శేష జీవితమును గడిపెను. ఐలునికివలె నాకును అట్టిభక్తిని ప్రసాదించుము. గురవాయూరు పురాధీశా! నా రోగమునుహరించుము.

ఏకాదశ స్కంధము పరిపూర్ణం

96వ దశకము సమాప్తము

-x-