నారాయణీయము/ఏకాదశ స్కంధము/95వ దశకము
ఏకాదశ స్కంధము
95- వ దశకము - ధ్యానయోగము
95-1
ఆదౌ హైరణ్యగర్భీం తనుమవికలజీవాత్మికామాస్థితస్త్వం
జీవత్వం ప్రాప్య మాయాగుణగణఖచితో వర్తసే విశ్వయోనే।
తత్రోద్వృద్ధేన సత్త్వేన తు గుణయుగళం భక్తిభావం గతేన
ఛిత్త్వా సత్త్వం చ హిత్వా పునరనుపహితో వర్తితాహే త్వమేవ॥
1వ భావము :-
భగవాన్! సృష్టిప్రారంభమునకు ముందు నీవు హిరణ్యగర్భుడవై; జీవాత్మ, పరమాత్మ అను విభజనలేక ఏకీకృత తత్వముతో నుంటివి. పిదప మాయ, ఆ మాయ అంశతో త్రిగుణాత్మకమయిన జీవుని రూపము ఉద్భవింవించినవి. భక్తిసాధనతో జీవునిలో సత్వగుణము పెంపొంది రజోతమోగుణములు హరించును; క్రమక్రమముగా ఆ సత్వగుణము సహితము జీవుని విడిచిపెట్టును; ఆ జీవునిలో జీవాత్మాపరమాత్మా అను భేధభావము తొలగి ప్రభూ! నీలో ఐక్యమగును.
95-2
సత్త్వోన్మేషాత్ కదాచిత్ ఖలు విషయరసే దోషబోధే౾పి భూమన్।
భూయో౾ప్యేషు ప్రవృత్తి స్సతమసి రజసి ప్రోద్ధతే దుర్నివారా।
చిత్తం తావద్గుణాశ్చగ్రథితమిహ మిథస్తాని సర్వాణి రోద్ధుం
తుర్యే త్వయ్యేక భక్తిశ్శరణమితి భవాన్ హంసరూపీ న్యగాదీత్॥
2వ భావము :-
భగవాన్! నీయెడల భక్తికలిగినచో, జీవునికి సత్వగుణము వృద్ధిచెంది ప్రాపంచిక విషయాసక్తి దోషభూయిష్టమని తెలియును. ఆయినప్పటికినీ, చిత్తము త్రిగుణములు పరస్పరాశ్రయములుగుటచే జీవునికి తన చిత్తమున కలుగు రజోతమోగుణముల ప్రభావమును నిలువరించుట కష్టసాధ్యమగును; తిరిగి తిరిగి ప్రాపంచిక ఆసక్తులకు ఆకర్షితుడగుచుండును. ఆవిధముగా ఆకర్షితుడు కాకుండుటకు నిన్ను శరణువేడి నీయెడ తురీయతత్వమగు భక్తికలిగియుండుటయే మార్గమని, ప్రభూ! హంసరూపము ధరించి నీవు బోధించితివి.
95-3
సంతి శ్రేయాంసి భూయాంస్యపి రుచిభిదయా కర్మిణాం నిర్మితాని
క్షుద్రానందాశ్చ సాంతా బహువిధగతయః కృష్ణ తేభ్యో భవేయుః।
త్వం చాచఖ్యాథ సఖ్యే నను మహితతమాం శ్రేయసాం భక్తిమేకాం
త్వద్భక్త్యానందతుల్యః ఖలు విషయజుషాం సమ్మదః కేన వా స్యాత్॥
3వ భావము :-
భగవాన్! జీవులు ముక్తినిపొందుటకు వారివారి బుద్ధి, గుణములకు అనుగుణముగా ఆచరించగల కర్మాచరణ మార్గములు పెక్కుగలవు. వాటిలో క్షుద్రమయినవి, అశాశ్వతమగు ఆనందమును ఒసగునవి కూడా కొన్ని కలవు. సకలమార్గమలలోను, ప్రభూ! కృష్ణా! శాశ్వతమయినది, ఉత్తమమయినది, పరమానందమునివ్వగలిగినది - ఒక్క భక్తిమార్గమేనని నీవు నీ స్నేహితుడగు ఉద్ధవునికి భోధించితివి. ఎందరో జీవులు అశాశ్వతమగు విషయార్ధములను కోరి వివిధ కర్మమార్గములను అనుసరింతురు; అట్టివారికి ముక్తి ఎట్లు లభించును?
95-4
త్వద్భక్త్యా తుష్టబుద్ధేస్సుఖమిహ చరతో విచ్యుతాశస్య చాశాః
సర్వాః స్యుః సౌఖ్యమయ్యః సలిల కుహరగస్యేవ తోయైకమయ్యః।
సో౾యం ఖల్వింద్రలోకం కమలజభవనం యోగసిద్ధీశ్చ హృద్యాః
నాకాంక్షత్యేతదాస్తాం స్వయమనుపతితే మోక్షసౌఖ్యే౾ప్యనీహః॥
4వ భావము :-
భగవాన్! నీయందు స్థిరమయున భక్తికలిగి సమాహితచిత్తుడయిన భక్తుడు పరమానందమును అనుభవించును. ప్రాపంచిక విషయములయెడ ఆశవిడనాడినవానికి సర్వము ఆనందమయముగా తోచును. లోతయిన నదీజలములో మునిగిన వానికి సర్వము జలమయముగా తోచినట్లు, నీ భక్తిలో తన్మయమయినవానికి సర్వమూ భగవన్మయముగా తోచును. అట్టి భక్తుడు యోగసిద్ధులను గాని, ఇంద్ర లోకమును గాని, బ్రహ్మదేముని సత్యలోకమును గాని వాంఛింపడు; అప్రయత్నముగా సిద్ధించు మోక్షమును సహితము కోరడు.
95-5
త్వద్భక్తో బాధ్యమానో౾పి చ విషయరసైరింద్రియాశాంతిహేతోః
భక్త్యైవాక్రమ్యమాణైః పునరపి ఖలు తైర్దుర్బలైర్నాభిజయ్యః।
సప్తార్చిర్దీపితార్చిర్దహతి కిల యథా భూరిదారు ప్రపంచం
త్వద్భక్త్యోఘే తథైవ ప్రదహతి దురితం దుర్మదః క్వేంద్రియాణామ్॥
5వ భావము :-
భగవాన్! నీ భక్తుడు ఎప్పుడయినను ఇంద్రియనిగ్రహము సడలి, భౌతిక సుఖములయెడ ఆసక్తి కలిగి అశాంతికి లోనయినచో, మరుక్షణమే నీయందు అతనికిగల భక్తి అతని చిత్తమును ఆవరించును; అతని ఇంద్రియములు దుర్భలము కాకుండా కాపాడును. మండుచున్న అగ్ని కట్టెలమోపు ఎంత పెద్దదయినను దానిని ఎట్లు దహించివేయునో అట్లే భక్తియను అగ్ని నీ భక్తుల కర్మఫలమును సహితము దహించుననగా ఇంద్రియ మదము భక్తుని ఏమిచేయగలదు?
95-6
చిత్తార్ధీభావముచ్చైర్వపుషి చ పులకం హర్షభాష్పం చ హిత్వా
చిత్తం శుద్ధ్యేత్ కథం వా కిము బహుతపసా విద్యయా వీతభక్తేః।
త్వద్గాథాస్వాదసిద్ధాంజనసతతమరీమృజ్యమానో౾యమాత్మా
చక్షుర్వత్ తత్త్వసూక్ష్మం భజతి న తు తథాభ్యస్తయా తర్కకోట్యా॥
6వ భావము :-
భగవాన్! భక్తితో ఆర్ధ్రతకలగని హృదయము, పులకాంకితముకాని శరీరము, ఆనందబాష్పములురాలని కన్నులు కల భక్తుని చిత్తము ఎట్లు పరిశుద్ధమగును. భక్తిలేని విద్యాతపస్సులవలన ప్రయోజనమేమి? సిద్ధాంజనముతో పరిశుభ్రపరచబడిన నయనములకు వాస్తవరూపము ఎట్లు యథతధముగా కనిపించునో అట్లే, నీ భక్తివలన చిత్తశుద్ధికలిగిన భక్తుని ఆత్మకు నీ సూక్ష్మతత్వరూపదర్శనము సహితము కలుగును. కోట్లాది తర్కచర్చలు చేసిననూ అట్టిసిద్ధి కలుగదు!
95-7
ధ్యానం తే శీలయేయం సమతసుఖబద్ధాసనో నాసికాగ్ర-
న్యస్తాక్షః పూరకాద్యైర్జితపవనపథశ్చిత్తపద్మం త్వవాంచమ్।
ఊర్ధ్వాగ్రం భావయిత్వా రవివిధుశిఖినస్సంవిచింత్యోపరిష్టాత్
తత్రస్థం భావయే త్వాం సజలజలధరశ్యామలం కోమలాంగమ్॥
7వ భావము :-
భగవాన్! సౌకర్యకరమగు ఎత్తయిన ఆసనమున కూర్చొని నిన్ను ధ్యానించుటకు ఉపక్రమించెదను. నాసికాగ్రమున నాదృష్టిని నిలిపి పూరకము, కుంభకము, రేచకము మొదలగు ప్రక్రియలతో నా ప్రాణవాయువును నియంత్రించెదను. అధోఃముఖముగా నున్న నాహృదయ పద్మమును ఊర్ధ్వముఖముగా ఊహించెదను. ఆ హృదయపద్మముపై వరుసగా సూర్యుడు, చంద్రుడు మరియు అగ్నిని భావనచేసి, వారికిపైన నీలిమేఘశ్చాయగల నీ కోమలరూపమును నా చిత్తమున స్థిరముగా నిలిపుకొని ప్రభూ! నిన్ను ధ్యానింతును.
95-8
ఆనీలశ్లక్షకేశం జ్వలితమకరసత్కుండలం మందహాస
స్యందార్ధ్రం కౌస్తుభశ్రీ పరిగతవనమాలోరుహారాభిరామమ్।
శ్రీవత్సాంకం సుబాహుం మృదులసదుదరం కాంచనచ్ఛాయచేలం
చారుస్నిగ్ధోరుమంభోరుహలలితపదం భావయే౾హం భవంతమ్॥
8వ భావము :-
భగవాన్! నల్లని సుందరమయిన కేశములతో, మకరకుండల ప్రకాశితమగు కర్ణములతో, ఆర్ధ్రతనిండిన మందహాసముతో, వనమాలతో, కౌస్తుభమణితో, శ్రీవత్సశోభిత వక్షస్థలముతో, ఆయుధములు ధరించిన బాహువులతో, మృదువయిన ఉదరముతో పట్టుపీతాంబర ధారివై, ప్రభూ! బలిష్టమగు కాళ్ళు, పద్మములవంటి పాదములు కలిగిన నీ సుందర మనోహర రూపమును నా చిత్తమున భావనచేయుచు ధ్యానించెదను.
95-9
సర్వాంగేష్వంగ రంగత్కుతుకమితి ముహుర్ధారయన్నీశ। చిత్తం
తత్రాప్యేకత్ర యుంజే వదనసరసిజే సుందరే మందహాసే।
తత్రాలీనం తు చేతః పరమసుఖచిదద్వైతరూపే వితన్వన్
అన్యన్నో చింతయేయం ముహురితి సముపారూఢయోగో భవేయమ్॥
9వ భావము :-
భగవాన్! నీ సర్వావయవములను తదేకదృష్టితో నా చిత్తమున నిలుపుకొనెదను; మందస్మిత మనోహరమగు నీ ముఖారవిందమును ఏకాగ్రచిత్తముతో తలచెదను. ఆ నీ రూపమును సాక్షాత్కరింపజేసుకొని, ప్రభూ! నీ పరమానంద అద్వైతరూపమును ధ్యానింతును. వేరేమియూ తలచను. అట్టి ధృఢమయిన యోగముకొరకు మరల మరల సాధనచేయుదును.
95-10
ఇత్థం త్వద్ధ్యానయోగే సతి పునరణిమాద్యష్టసంసిద్ధయస్తాః
దూరశ్రుత్యాదయో౾పి హ్యాహమహమికయా సంపతేయుర్మురారే।
త్వత్సంప్రాస్తౌ విలంబావహమఖిలమిదం నాద్రియే కామయే౾హం
త్వామేవానందపూర్ణం పవనపురపతే। పాహి మాం సర్వతాపాత్॥
10వ భావము :-
భగవాన్! ఈ విధమగు ధ్యానసాధన చేసినచో అణిమాది అష్టసిద్ధులు సిద్ధించును; దూరశ్రవణాది శక్తులు, నేను నేను అనుచూ వచ్చిచేరును. అవి సిద్ధించవచ్చునేమో గాని, ప్రభూ! నిన్ను చేరుటలో మాత్రము కాలయాపన జరుగును. అట్టివానిని నేను కోరను; పరమానందరూపుడవగు నిన్నుమాత్రమే కోరుదును. గురవాయూరు పురనాథా! నన్ను నా రోగబారినుండి రక్షించుము.
95వ దశకము సమాప్తము
-x-