నారసింహపురాణము/పంచమాశ్వాసము

నారసింహపురాణము

ఉత్తరభాగము

పంచమాశ్వాసము


క.

శ్రీశ్రితమందిర సంప, ద్వైశ్రవణవచోవిశేషవైచిత్రీచ
క్షుశ్రవణవృక్షపురా, ణశ్రుతిపూతాంతరంగ నరసయరంగా.

1


వ.

ఆకర్ణింపు మాశౌనకాదులకు నాదరప్రథితుం డై కథకుం డిట్లనియె నట్లు
నవ్యాక్షేపంబునం బుండరీకాక్షు నిరీక్షణంబు సిద్ధించుటకుఁ బ్రవృద్ధప్రహర్షు
లైన యమరవృషభు లాజగద్విభుం బ్రణామపూర్వకంబుగ నభినుతించిరి.

2


బ్రహ్మాదులు విష్ణుదేవు స్తుతియించుట

మ.

జయ నక్తంచరగర్వవంచక జగత్సాక్షీ సరోజాక్ష ని
ర్ణయముక్తవ్యవహారఘోరభవదూరా వార్ధిపర్యంక స
ర్వయతివ్రాతమనోగుహాహరికిశోరా శౌరి శార్ఙ్గీకృపా
శ్రయ విశ్వంభర చంద్రశేఖరసఖా చక్రాయుధా శాశ్వతా.

3


క.

లోకంబులు సృజియించుచు, లోకాంతర్వర్తనము విలోకించుచు ను
ల్లోకప్రక్రియ మను నిను, మాకు నుతియింపఁ దరమె మధునిర్మథనా.

4


క.

వేదంబు లేమి నేర్చు, న్నీదుమహామహిమఁ దెలియ నిశ్వాసములా
వేదంబు లెల్ల నీకు మ, హోదధిపర్యంక పంకజోదర కృష్ణా.

5


క.

అనుపమ మాద్య మమేయం, బనవధి నీతత్త్వవిభవ మైనంగానీ
జననీజనకులు నీవై , కని పెనుతువు గాదె ముజ్జగములు ముకుందా.

6


సీ.

నీకనుసన్నచే నిర్ణీత మయి కాదె యీయహోరాత్రంబు లేరుపడుట
నీపాదతీర్థంబు నెలకొంటచేఁ గాదె పాపంపు టసలెల్లఁ బలుచ నగుట
నీమాయఁబుట్టిన యీమూఁడుగుణములవలనఁ గాదే సృష్టి మొలచు టెల్ల
నీకృపావిభవ మస్తోకమౌటనె కాదె శిష్టరక్షణలీలఁ దుష్టి గనుట
నిన్ను నిదమిత్థ మగునని యెన్న నరిది, నీవిహారంబు లన్నియు నీకె చెల్లు
జలజదళనేత్ర నీరదశ్యామగాత్ర, సాధుజనమిత్ర, మదమత్తశత్రుజైత్ర.

7


చ.

అని కొనియాడుచున్నచతురాననముఖ్యులఁ గాంచి పద్మలో
చనుఁ డను మీముఖాబ్దములచందము ఱేపటిచంద్రునందమై

పినుఁగుఁదనంబు సూపె నన బిమ్మిటి యించుక దేఱి పల్క రా
మునులు నిలింపులున్ భవతమోహరు నయ్యహిరాజతల్పునిన్.

8


క.

నీ వంతర్యామివి యీ, జీవుల కందఱికి నీదు చిత్తంబున ల
క్ష్మీవర తోఁపనియది గల, దా వినవలతేని వినుము తత్క్రమ మెల్లన్.

9


చ.

అనిమొన నీవు నాఁ డటులు హాటకదైత్యుని గీ టణంచి త
త్తనయుని కైనయాపదలతండము నొండును జిక్కనీక పోఁ
జొనిపి కృపాకటాక్షములఁ జూచితి వారజనీచరార్భకున్
వనజదళాక్ష వాఁడె పగవాఁ డగుచు న్మము నేఁచె నీచుఁ డై.

10


క.

ఖలజనబోధంబులు విని, యలుకం బ్రహ్లాదుఁ డిప్పు డమరపథంబున్
బలిమిఁ గొని మమ్ము నిందఱ, నిలయములకుఁ బాపెఁ బాపనిశ్చితుఁ డగుచున్.

11


సీ.

ఇనరశ్ములకు నైన నెడ యించుకయు నీని కాఱడవులలోనఁ దూఱితూఱి
నక్రచక్రోదగ్రవిక్రాంతిఘోరంబు లేఱులఁ జేయీఁత నీఁదియీఁది
పులులు సింగంబు లెల్గులు సహచరులుగాఁ గొండలోయలలోనఁ గుందికుంది
యెట్టిచప్పుడు విన్న నిదె వచ్చె నమరారి పదపదం డని సారెఁ బఱచిపఱచి
కలఁగి తలగంప విరుగడ గాక వలస, చేయుచున్నార మిఁక నేమి చేయఁగలదు
శ్రీవధూనాథ వాని శిక్షించి మమ్ముఁ, గావఁగదవయ్య మా కేడుగడయు నీవ.

12


క.

అని విన్నవించు వేల్పుల, ననుకంపాసంపదభిమతాలోకనఖే
లనలాలనములఁ దాపం, బునకుం బాపుచు మురారి ముదమునఁ బలుకున్.

13


చ.

వెఱవకుఁ డేల యేఁ గలుగ వేదన మీ కసురారులార యే
నెఱుఁగుదు దైత్యనందనునహీనపరాక్రమ మింక వాని నే
నఱగఁగఁ బట్టి మీపదవు లన్నియుఁ గ్రమ్మఱ మీకు నిచ్చెద
న్మఱవుఁడు తొంటిదుఃఖములు [1]మాన్పుదు మానసపీడ లన్నియున్.

14


క.

ఎల్లింటి నేఁటిలోపల, నుల్లంబుల మీకు గలుగునుడు కార్చెద భీ
తిల్లకుఁ డని వేల్పుల శ్రీ, వల్లభుఁ డత్యాదరప్రవర్ధితమతి యై.

15


క.

తగ వీడుకొలుప వారున్, జగదీశ్వరుపలుకులకుఁ బ్రసన్నహృదయులై
మగిడిరి ప్రహ్లాదుని బలు, మగటిమి వారింపఁ దలఁచి మధుమథనుండున్.

16


నారాయణుఁడు వృద్ధబ్రాహ్మణవేషముఁ దాల్చుట

సీ.

తల మోచియున్న దుస్తరజరాభర మనఁ బాకపింగళజటాపటలి బిగియ
నొడలుగూనగుచుండ మెడయు లోనికిఁ బోయి జరఠకచ్ఛపరాజుచాయ దోఁపఁ

జేవెలుం గిడిచూడ నేవస్తుతతి యైన నవ్యక్తరూపమై యవధిఁ బోవఁ
జరణవిన్యాససౌష్ఠవ మఖిలంబును నాధారయష్టియం దత్తమిల్ల
నలిపలితకర్కశాంగంబు వణఁకుగదురఁ, గంఠబిలమున నుక్కిసగడలుకొనఁగ
వృద్ధభూసురవేషాభివృద్ధిఁ దాల్చి, నాకపురి కేగె నిందిరానాయకుండు.

17


క.

ఆపురములోనఁ బూర్వపుఁ, గాపరియును బోలె నొక్కకడ జీర్ణకుటీ
రాపాదనపరతంత్రుం, డై పరమబ్రహ్మనిష్ఠుఁ డై విహరించున్.

18


సీ.

ఆస్థానరత్నసింహాసనం బేయిందువదనకు నుత్ఫుల్లవనజవాటి
నవవిధానంబు లేనాగేంద్రయానకు లీలాకటాక్షమాలికలనిగ్గు
పుట్టిని ల్లేశరత్పుండరీకాక్షికి నమృతాభిరామ మౌనంబురాశి
కడుపు చల్లఁగఁ గన్నకొడు కేవధూటికి జగదేకవీరుండు శంబరారి
సరస మేయింతి విహరించు సౌధవాటి, పుణ్యములయిక్క యేభామభూరిమూర్తి
యమ్మహాలక్ష్మి వృద్ధాంగనాభిరామ, కలితయై కొల్చి యుండె నక్కపటవిప్రు.

19


క.

ముత్తవ్వయుఁ దాతయు నని, తత్తాదృక్పౌరజనులు తము మన్నింపం
బుత్తడిచూపులమగువయుఁ, జిత్తజజనకుండు దివి వసించిరి మఱియున్.

20


వ.

ఆశాంబరీభూసురుండు కాలనేమికి ననుకూలం డయ్యును విప్రచిత్తి చిత్తంబు
వడసియు శూర్పకర్ణునికి జుట్టఱికంబు నెఱపియు వృశ్చికరోమునకు వియ్యం
పువావి చూపియు వ్యాఘ్రదంష్ట్రునకు వశంవదుం డయ్యును గంకటునింట నుం
కువ గొనియుఁ గాలకేయునకుం గాలగతులు దెలిపియు వామనునకుఁ
బ్రేమాస్పదుం డయ్యును శంబరుం బాటించియు మఱియుఁ గలుగునిశాట
వీరులతోడఁ బోరామి యొనర్చుచు నుండె.

21


క.

తలలోపలినాలుక పూ, సలగ్రుచ్చినబొందు దుగ్ధసంయుతజలముం
బలెఁ గపటభూసురోత్తమ, కులతిలకము దనుజపతులఁ గొలిచి మెలంగున్.

22


సీ.

కార్తాంతికాకృతి గైకొని యొకచోట జ్యోతిరాగమములరీతు లెన్ను
నొకచోట వేఁకి వెచ్చకు నగదంకారుఁ డై మందు లిచ్చుచు నలవు నెఱపుఁ
బరమపాశుపతరూపముఁ దాల్చి యొకచోట శైవతత్త్వార్థవిస్తరము గఱపు
నొకచోటఁ బౌరాణికకులాగ్రగణ్యుఁ డై యితిహాసములఁ దెల్పు నెన్నియైన
యోగియై యోగశాస్త్రంబు లొక్కచోట, యోగవిదులకు నుపదేశ మొనరఁ జేయుఁ
గపటనటనానటుం డైన కంసవైరి, యాత్మనిశ్చిత మగు కార్య మైనదనుక.

23


క.

ఆచతురచరితుఁ డఖిలని, శాచరులకుఁ బూజ్యుఁ డగుచుఁ జరియించుసుధా
వీచివలమానమృదువా, చాచాతుర్యంబు శ్రవణసౌఖ్యము నొసఁగన్.

24

గీ.

పొడగనియె నంత నొకనాఁడు పుడమివేల్పు, నిండుగొలువుననున్న యాఖండలారి
విబుధవైరులు తనసాధువృత్త మెల్లఁ, బేరుకొని పేరుకొని కానిపించుకతన.

25


క.

నోరాఁగన్నులఁ జూచుచు, నారక్షోవరకుమారుఁ డవనీసుర బం
గారముగద్దియయం దిడి, గారవమునఁ బలుకు వినయగంభీరోక్తిన్.

26


క.

ఎందుండి రాక కాపుర, మెందులనో మీకుఁ గూర్చుహితు లిల్లాలు
న్నందనులు గలరె నిను నే, మందురు పే రెన్నుచోట ననఘవివేకా.

27


క.

నీవర్తనంబు నిఖలము, గైవారము సేయుచుండఁగా వినుచుందున్
ధావతి పడి, (?) యీక్రియ నుప, ధావన సేయంగనేల దనుజకులంబున్.

28


క.

సురకార్యార్థము వచ్చిన, పురుషుఁడవో కాక మమ్ముఁ బొడగని యేదే
పురుషార్థము మాచేఁ గని, మరలెదవో యనుడుఁ గపట మహిసురుఁ డనియెన్.

29


సీ.

నాయిక్క వైకుంఠనగరంబు ననుఁ దను గాఁ జూచుచుండు శంకరసఖుండు
కులపాలికయుఁ గొడుకులుఁ గల్గి వర్తింతు నారాయణాహ్వయోన్నతుఁడ నేను
బరమర్షిహృదయపద్మంబులఁ గ్రీడింతుఁ బుణ్యతీర్థముల నేప్రొద్దు నిలుతు
శ్రుతులు సూనృతవాక్యరతులు దాత లలుబ్ధు లావులు నాదురూపాంతరములు
నీవు దేవేంద్రు గెలిచి తన్నిఖిలరాజ్య, వైభవశ్రీలఁ గొనియున్న వార్త లేను
గిన్నరీగీతికల వినుచున్నకతన, నిన్నుఁ జూచెద నని వచ్చి నిలిచి తచట.

30


చ.

అనిమిషమానమర్దనవిహారమున న్సడిసన్నయట్టి మీ
జనకునిఁ బోలి శత్రుజనసంహరణం బొనరించి వాలుము
మ్మొన నడిపించి తింటికి సముజ్జ్వలరాజ్యరమావిలాసముల్
దనుజకులేంద్ర యింత వలదా బలదారుణవృత్తి చూపఁగన్.

31


వృద్ధబ్రాహ్మణుఁడు ప్రహ్లాదుం బొగడుట

క.

అనిమొన నీశరసంహతిఁ, దనువు సిరిగి దేవభర్త తల వీడఁగ బ
ల్గును కెత్తినపుడు మనయీ, దనుజకులము నవ్వకున్నె దనుజాధీశా.

32


క.

పావకుఁడు నీకృపాణము, చేవిదళికదేహుఁ డగుచు శిథిలప్రభుఁడై
చేవ చెడి పోవునప్పుడు, భావములో నెన్ను నీప్రభావ మధీశా.

33


క.

అంతకుఁడు శాంతుఁడై నీ, దంతిఘటలకాలుమట్లఁ దనసైన్యము లిం
తింతలు శకలము లైపడ, నంతఃకరణమున వందఁడా సురవైరీ.

34


గీ.

కులమువాఁ డటంచుఁ గోణపుప్రాణాన, కలుగ కీవు బాడుదలయవట్టి
విడిచినట్టి నీదువీరంబు సారంబు, గౌరవంబు నెన్నఁగా వశంబె.

35

క.

జలధిపతిబలపరాక్రమ, ములు జలలిపులుగ నొనర్చి ముచ్చెరువుజలం
బులు ద్రావించిన నీయు, జ్జ్వలవిక్రమ ముగ్రతరము శత్రుధ్వంసీ.

36


క.

గంధవహుబాహుబలధౌ, రంధర్యము బుజలువైచి రక్షస్సేనా
సింధువు నుబ్బించిన నీ, బంధురరణకౌశలంబు ప్రస్తుతిఁ గనదే.

37


క.

ధననాథు నతని చెలికా, నినపోలెన్ భైక్షవృత్తి నిలిపితివి జనా
ర్దనుఁ డెన్ను నెపుడుఁ గూరుచు, జనములలో నీప్రభావసంపల్లీలల్.

38


క.

దానవకులవర్ధన యీ, శానశిరశ్చంద్రరేఖ సౌధస్థలసం
దానితదీపకళికగా, వేనిలిపితి వొక్కొ నిబిడవిక్రమగరిమన్.

39


క.

సురలోకము నరలోకము, నురగాధిపలోకమును సముజ్ఝితశత్రూ
త్కరముగఁ [2]బాలించెడునీ, విరివికి నొకకొదవ గలదు విను మెట్లనినన్.

40


క.

శ్రుతులకుఁ దత్తద్వితరణ, కృతులకు యతులకు నిలింపఖేతహతులకున్
శతపత్రలోచనుఁడు మూ, లతలం బగు [3]నారసాతలగభీరముగన్.

41


ఉ.

కావున నాదిమూలము నఖండపరాక్రమదాత్రధారచేఁ
దావు తెరల్చి తున్మక యుదగ్రము గాదు భవత్ప్రయత్న మో
దేవవిరోధి నిక్కము మదీయవచోవిభవంబు నిత్తెఱం
గీ వొనరించితేని గలఁడే నినుఁ బోలిన వీరుఁ డెయ్యెడన్.

42


క.

వామనసూచీముఖముఖు, లై మెలఁగెడు నీ ప్రధాను లనువాసరముం
దామెన్నుదు రీవిధము మ, నోమార్గములందు దితితనూభవతనయా.

43


వ.

అని యమ్మహాస్థానంబుఁ గలయం గనుంగొనుటయు నెల్లవారలుఁ డద్విప్ర
తల్లజప్రోక్తంబు లుత్తమోత్తమంబు లని దైత్యసత్తమునకు విన్నవించి రావం
చనా[4]చుంచురుండు వెండియు నిట్లనియె.

44


క.

బలముగలనాఁడ శత్రులఁ, బొలియింపఁగఁ దగు సమూలముగ వేరున్నం
దల లెత్తు వెండియును హల, హలనిభవీరారికులలయాసలకీలల్.

45


సీ.

వేదతుల్యములు మద్విమలవాక్యము లిందు సంశయింపకుము రాక్షసకులేంద్ర
హరి సురావళి కెట్లు నాధారమై యుండు నతని గెల్వకయున్న నమరపదము
చేకూడు టెల్ల నస్థిరము గావునఁ బ్రయత్నము సేయు తజ్జయోత్సాహమునకు
నామిత్ర మగు నైన నాళీకదళనేత్రు, మాయావి గాన నమ్మక చరింతు
ననినఁ బ్రహ్లాదుఁ డిట్లను నవనిదివిజ, వర్య నీపల్కు లెల్ల నవద్యదూర
తరము లెచ్చోట నుండు శ్రీ వరుఁడు నాదు, కట్టెదుర నిల్వకున్న నేకరణి గెల్తు.

46

చ.

జలముల నుండునో మఱి రసాతలగర్భముఁ దూరి యుండునో
కలుచన నొంటిగాఁ డగుచుఁ గాననవాటిక నుండునో మహీ
వలమయ (?) మైనకంబమునఁ బాయక యుండునొ యెందు నుండు నా
జరధరవర్ణుఁ డీ వెఱఁగఁ జాలుదు వొక్కొ తదాశ్రితస్థలుల్.

47


క.

నావిని మాయాభూసురు, డావిబుధద్రోహిఁ బలుకు నసురాధిప నీ
కావిష్ణు నేనె చూపెదఁ, గావలయున యేని వేగఁ గదలుట యొప్పున్.

48


చ.

అని తన కాప్తుఁ డై పలుకు నమ్మతకంపుఁబిసాళిపంకుఁ (?) బా
ఱునకు సురారి యిచ్చె నదరు ల్వెదచల్లు శరీరకాంతులం
దనరువధూజనంబుల మదావళపంక్తుల మేలితేజులన్
ధనకనకాంబరావళుల దాసజనంబుల సుప్రసన్నుఁ డై.

49


క.

అవి యెల్లఁ జూచి యి ట్లను, నవనీసురసూతి నగుచు నసురాధిప న
న్నవివేకిఁగాఁ దలంచితి, వివి నా కేమిటికి నిన్ను నే వేఁడితినే.

50


క.

జలములు వల్కలములు బం, డులుఁ గూరలుఁ గాక యతీకఠోరనియమశ
ష్కులు లై యుండెడువారికి, వలయునె బహువిధపదార్థవైభవసుఖముల్.

51


క.

పరపురుషార్థము సేయని, పురుషులజన్మంబుఁ బొల్లువోయినకొలుచున్
సరిగానఁ బరుల కుపకృతి, పొయింపఁగవలయు ననుచు బుద్ధిఁ దలంతున్.

52


క.

నీవస్తువు లివి నాయవి, గావా దేవా విధూతకైటభనిభసు
శ్రీవిభవ రిపుల గెలిచిన, య వేళ నొసంగవయ్య యఖిలార్థములున్.

53


క.

వైకుంఠనగరవస్తువు, లీకొలఁదులయవియ వాని నే నొనరింతు
న్నీకైవసముగ నిప్పుడ, నాకౌకప్రత్యనీకనాయక యనుడున్.

54


క.

విప్రునిసౌహార్దము నా, విప్రునివైరాగ్యగుణము విప్రునిమృదువా
క్యప్రౌఢియు మది మెచ్చుచు, నాప్రహ్లాదుండు నిశ్చితాశయుఁ డగుచున్.

55


క.

తనతనుసంభవుని విరో, చను బురరక్షకు నొసర్చి సైన్యసహితుఁ డై
దనుజుఁడు వైకుంఠపురం, బునకుం జను భూసురోత్తముఁడు తెరువొసఁగన్.

56


స్రగ్ధర.

హరిమీఁదం దాడి వెట్టెన్ హరిహయరిపుఁ డం చద్భుతాక్రాంతులై ని
ర్జరవైరుల్ భూరిభేరీస్వనములు చెలఁగన్ సర్వసైన్యంబుల న్భీ
కరలీలం ద్రోయఁ జేయం గలఁగె నభము దిగ్దంతు లూటాడెఁ దారా
పరిషత్తు ల్ముత్తియంబుల్ బలె ధరఁ దొరఁగెం బర్వె దుర్వారరేణుల్.

57


క.

భూమిపయిఁ బర్వతముల, పై మరుదధ్వంబుపై నపారములై సు
త్రామరిపువాహినులు చను, భీమగమనరేఖ జగము బిమ్మిటి గొలిపెన్.

58

ప్రహ్లాదుఁడు వైకుంఠముపై దాడి వెడలుట

సీ.

ఆకాశమండలం బనునుప్పుమున్నీటి కౌర్వాగ్నిశిఖ లయ్యె నాయుధములు
ముదురువెన్నెలగాయు ముక్తాతపత్రసంతతులు చంద్రాసవస్థలు ఘటించె
రవిమీఁద దండెత్తు రాహుగ్రహంబుల కరణిఁ బతాకానికాయ మడరె
భువనంబు లెల్ల నాపోశనంబుగ మ్రింగె జగతీరజఃకుంభజన్మమూర్తి
శబ్దమయములు గావించె సకలదిశలు, మురజఢక్కాహుడుక్కాదితరళరవము
లవనిదైవతదృష్టమార్గానుసరణ, మాచరించి సురారిసైన్యములు దరుమ.

59


క.

మాయావిప్రాకృతి యగు, నాయఖిలేశ్వరుఁడు నిర్జరాహితబలమున్
వేయాకర్షించె సహ, స్రాయుతయోజనము లొక్క యరనిమిషమునన్.

60


ఉ.

ఎక్కడఁ జూచిన న్వనము లెక్కడఁ జూచిన వాహినీకులం
బెక్కడఁ జూచిన మృగము లెక్కడఁ జూచిన దావపావకం
బెక్కడఁ జూచిన న్విషధరేశ్వరఫూత్కృతు లై మనోభయం
బెక్కఁగఁ జేసె దైత్యులకు నేగెడు మార్గము దుర్గమాకృతిన్.

61


క.

అంతర్ధానము నొందె ము, రాంతకుఁ డాఘట్టమున భయాకులమతులై
చింతాజలధి మునింగిరి, దంతావళతుల్యబలులు దైత్యాధీశుల్.

62


క.

అఫు డొకచీఁకటి దోఁచెం, జపలతరయమస్వపృప్రసర్పద్వీచీ
విపులం బై సంఛాదిత, విపులం బై గిళితవస్తువిస్తృతి యగుచున్.

63


శా.

దూరోత్సారితవామనత్వముగ రోధోరంధ్రనీరంధ్రమై
యారూపంబున నంధకార మధికం బై పర్వఁ దోడ్తోన గం
భీరధ్వానముతోడఁ బెల్లు విసరెం బెన్గాడ్పు భూమీరజో
ధారాసారపరంపరాస్థగితభూతవ్రాతదృక్పాత మై.

64


క.

వీచుబలుగాలిఁ దూలుచు, నేచినచీఁకటియుఁ గాఁగ నెదవడి గమన
శ్రీచాతుర్య మడంగి ని, శాచరవీరులు భయప్రసక్త హృదయు లై.

65


సీ.

అరదంబు లొరఁగిన నట్టిట్టు చనలేక విఫలప్రయత్నులై వెకలువారు
దంతిసంతతి పరిభ్రాంతి నిట్టట్టుగా మరలింపనేరక మరలువారు
సైంధవస్కంధంబు జడిసి వికీర్ణమై పోవ నొండనలేక పొగులువారుఁ
బత్తివిపత్తిసంప్రాప్తి చిత్తంబుల నొత్తరించిన నుడుకొందువారు
గొడుగులుఁ బతాకలును గూలఁ గుందువారుఁ, జామరధ్వంసమునకు వాచఱచువారు
నైరి ఘోరాంధకారవికారకలిత, గాఢవాత్యానిగుంభంబు గసిమసంగ.

66


క.

చెల్లాచెదరై దానవ, వల్లభుసైన్యములు వివ్వ వాసవరిపుఁ డు
ద్యల్లీల నిలిచె నొక్కఁడ, పొల్లెడలిన వెలయు ధాన్య పుంజమపోలెన్.

67

వ.

ఆప్రహ్లాదుం డప్రతర్కితవీరరసప్రసారుం డై మసారసారవర్ణంబును మహిత
జనయోగిహృదయాభ్యర్థంబును మంజులప్రభానుభావవికీర్ణంబు నగుతత్త్వం
బు సాత్త్వికబుద్ధిం దలంచుచుం గలంచునలఘుతమఃపుంజంబు గుఱించి విరించి
బాణప్రయోగంబు సేయుటయు.

68


క.

తమ మెల్ల నణఁగె వాయు, క్రమవిక్రమణంబు సడలెఁ గానఁగవచ్చెం
గమలాప్తబింబ ముజ్జ్వల, తమమై దివిఁ దోఁచెఁ జంద్రతారాచయఘుల్.

69


క.

ఆపన్నగవజ్రాయుధు, నాపన్నగశాయిఁ దలంచునంత నసురహృ
త్తాపంబు లణఁగెఁ జాలఁ బ్ర, దీపించెఁ బ్రబోధరవి యుదీర్ణప్రభుఁ డై.

70


గీ.

పొదివియున్నబలము లదవద యైపోవ, నుప్పుగల్లువోలె నొకఁడ నిలిచి
శాంతుఁ డగుచు నసుర చింతించుఁ దనలోన, దేవమతము వాసుదేవమహిమ.

71


సీ.

ఇంతయై యంతయై యేమియు నెఱుఁగని నావర్తనంబు లున్నతికిఁ దెచ్చెఁ
బ్రాణగొడ్డము లైన బలుసంకటంబులు పాయంగఁ ద్రోచి శోభనము నొసఁగెఁ
బరమతత్త్వ మెఱుంగు బ్రహ్మర్షికులములో నన్నగ్రగణ్యుగా నెన్ని మనిచె
నిబిడతామసగుణాన్విత మైనకులమునఁ బుట్టినాఁ డనక చేపట్టె నన్ను
నట్టి హరికిని భృత్యులౌ నమరవరుల, దుష్టజనబోధములు విని తూలఁజేసి
వాసివహియించియున్న నావరభుజోరు, శక్తి యి ట్లయ్యె ఖలులకు జయము గలదె.

72


సీ.

హరిదాసు లగువార లఖిలధర్మజ్ఞులు హరిదాసు లుజ్ఝితదురితభరులు
హరిదాసు లాగమోత్కంశుకపంజరుల్ హరిదాసు లురుకీర్తిహారయుతులు
హరిదాసు లనఘలు హరిదాసు లప్రమేయారంభతత్త్వనిత్యస్థలములు
హరిదాసు లెవ్వనియాలయంబులకైనఁ జనిరి వైకుంఠ మాస్థలము లెల్ల
నట్టిహరికిని దాసులై యతిశయిల్లు, వృత్రశాత్రవముఖులైన విబుధులకును
నెగ్గు సేసితిఁ గావున నిపుడు నాకు, నిట్టి దుర్దశ వాటిల్లె నేది గతియొ.

73


క.

దుర్బోధకరులు సఖులున్, మార్బలముల గెలువఁజాలు మత్పరికరమున్
నిర్బంధము నొందిరి భువ, నార్బుదసంక్షోభకృన్మహానిలవిహృతిన్.

74


క.

ఘోరవనంబులు నక్ర, క్రూరమహానదులు విపులకూటనగేంద్ర
క్ష్మారుహములు దక్కఁగ నె, వ్వారుం బొడసూప రెట్టివడువో యిచటన్.

75


క.

ఏ నెంతదవ్వు వచ్చితి, నో నాకము వెడలి మన్మనోగతఁ దత్సం
ధానము తోఁపదు వికలత, మానసమునఁ బర్వె నెట్టిమత మీమతమో.

76


ఉ.

నేరుపునేరము ల్కలపనేరఁడు సారసపత్రలోచనుం
డారజనీచరారిచరణాంబుజము ల్మది నిల్పియున్న నె

న్వారికి నైన నన్ను గెలువం దరమా పరమార్థసార్థగా
ధారభటీవిహారు లగు నాదిమును ల్విపదబ్ధిమగ్నులే.

77


ప్రహ్లాదుని పశ్చాత్తాపము

క.

కొడుకులు తప్పులు చేసిన, యెడవిడువం దగునె తండ్రి కిటువలెనే పో
బెడదలు గొలిపెడుభక్తుల, యెడవిసువక బుద్ధి యొసఁగు టిభవరదునకున్.

78


సీ.

సర్వాశయస్థాయి సర్వేశ సర్వజ్ఞ సామగానప్రియ సాధువినుత
నిర్మల నిరవద్య నిత్య నిశ్చలరూప నిరతిశయానంద నీరజాక్ష
పరమాత్మ పరమేశ పరతత్త్వపారగ పరమదయాలోల భక్తిగమ్య
కమఠాంగ కమలేశ కమలాసనార్చిత కామాదిశత్రుసంఘాతదమన
దేవ దేవేశ దేవారిదృగ్విదూర, సత్యసత్యామనోనాథ సాత్యకినుత
వసుమతీధర వసువంద్య వాసుదేవ, ప్రోవు మాపన్నిమగ్ను నాబోటివాని.

79


సీ.

నీమేటి నెమ్మేనిరోమకూపంబుల బ్రహ్మాండకోటు లుద్భవమునందె
నీపదాంబుజముల నేపారు మిన్నేఱు తివిరి కెందమ్ములఁ దేనె వోలె
మఱుఁగైన నీమహామాయాంధకారంబు చింపంగ లేరు నిలింపు లైన
సంవర్తవటపత్రశాయియౌ నీకన్ను మూయుట సృష్టియు మోడ్పు లయము
నయ్యె నిన్నెన్నగాఁ దరం బౌనె మౌని, మానసాంభోజకర్ణికామధులిహేంద్ర
నన్ను నాపన్నుఁ బ్రోవు సంపన్నకరుణ, నరుణకరచంద్రనేత్ర సత్యాకళత్ర.

80


క.

నాకున్ బుద్ధులు చెప్పిన, యాకోవిదవరుఁడ వీవ యటు గాకున్నన్
వీకున బహుయోజనమిత, మీకడ కెవ్వాఁడు దెచ్చు నీనాసేనన్.

81


శా.

ఓనాభీభవపద్మ యోభవహరా యోయోగిమోక్షప్రదా
యోనిత్యోన్నత యోనిశాచరహరా యోదీపకల్పద్రుమా
యోనమ్రప్రియ యోకృపాజలనిధీ యోభక్తిగమ్యోదయా
నీనామంబు నుతించువారలకు నిర్నిద్రత్వ మో టబ్రమే.

82


ఉ.

ధూసర యెందు వోయితివి ధూమ్రశిరోరుహ నీకుఁ బాడియే
కాసరనావాహనాదిసురగర్వ మడంపక పెంపు దింప ను
ల్లాసము నొందు నాతలంపులన్ ఫలితంబులు సేయ కోనర
గ్రాసకులంబు డంబు చెడఁగా నగునే తగునే తొలంగఁగన్.

83


క.

వచ్చితిఁ గడు దూరము నా, కిచ్చట నెవ్వారు గల రహీనకృపాఢ్యుల్
విచ్చలవిడిఁ బ్రేలెడు నా, నెచ్చెలిగమి యింత సేయునే దుర్బుద్ధిన్.

84

ప్రహ్లాదునికి విష్ణుమూర్తి ప్రత్యక్షమగుట

గీ.

అనుచు దానవకులసింహ మపుడు తోఁక
నీరుమోచి గజేంద్రుని గౌరవమున
శార్ఙ్గి గురియించి ఘోషించుసమయమున ము
రారి ప్రత్యక్షమయ్యె నయ్యనఘమతికి.

85


వ.

ఇట్లు సాక్షాత్కరించి యప్పుండరీకాక్షుండు పక్షీపరివృఢధృఢస్కంధారూఢుం
డై రోహణశిఖరిశిఖరావలంబి నీలాంబుదంబుచందంబున ననల్పసౌందర్య
మందిరుం డై యిందిరాదేవి పొలయలుకలకలకలం గలంగి యందంద వం
దనం బాచరింపం దదీయసీమంతసిందూరరజోరంజితంబు లనం గెంజాయ
రంజిల్లు చరణపల్లవంబులును నడుగునడుగునం బొడమన మిన్నేటితేటనీటం
బర్యటనంబు సేయు పాఠీనంబులపరిపాటిం బాటిల్లు చిందంపుమీలమేని
జాలిగల పొలపంబుఁ దెలుపుచు బలభిదాదిదివిజకిరీటకోటిమాణిక్యశా
ణోత్తేజనంబున రాజిల్లు చరణనఖరశిఖరంబులును గాంతిలీలాకలాచిక లైజాను
చ్చాయాద్విగుణితశోభాభిరామంబు లై యిలేందిరాకరారవిందోపలాలన
పరిస్పంద[5]మందిరంబు లై సొంపొందుజంఘల యలంఘ్యప్రభావిభవంబును
నభిరామనాభీకమలవిమలపరాగపరంపరా[6]విహితంబులగు నివి యన ధగ
ద్ధగని చిగురుపసిండికాసియ వాసికెక్కు చక్కని యూరుప్రదేశంబును
గాంభీర్యంబున నంభోజసంభవుం డొక్కచక్కిం జిక్కి చేవమ్రాను దొలఁచు
నలికలభంబు సులభగతి నతీతానాగతంబులు చింతింప నత్యంతకాంతి
మంతం బగుచు శోభిల్లు నాభిపల్వలంబును ద్రివళీవలయవలయితంబై
గుణత్రయవిచిత్రమూర్తి యగు మాయప్రోయాలునుం బోలేం గ్రాలుచు
గగనతలవివర్తం బై సూక్ష్మేక్షణలక్షితం బగునవలగ్నంబు [7]సొగుపును నగణిత
ముక్తాదామాభిరామం బై ప్రేమాస్పదం బగుచుం గందర్పకరకంబు బిబ్బో
కంబు [8]నాగడంబు సేయు కంధరాధౌరంధర్యంబును నాజానులంబితంబులై
తేజరిల్లుచు ననర్ఘ్యమణిమయముద్రికాముద్రితాంగుళీకిసలయంబులం బస
మీఱి శోభిల్లుచు నుల్లోకలావణ్యపణ్యస్థలంబు లగు నతిస్థూలబాహా
స్థూణంబులును సపరిక్షీణజలధరశకలకలితనభోభాగంబు బాగున సంచిత
శ్రీవత్సలాంఛనం బగువత్సప్రదేశంబునుం జంద్రమండలంబు బెండుపఱిచి
ముకురంబును వికవిక నగి జిగిదమ్మియెమ్మె లడంచి యుదంచితవిలోచనపుండ

రీకపలాశపేశలప్రభాభిరామం బై యుద్దామనిగమనిశ్వాసవికస్వరనాసా
పుటఘటితం బై కుటిలకుసుమశరశరాసనసౌభాగ్యభాసమానలతాలా
లితం బై మకరకుండలమండితగండస్థలం బై యఖండాఖండలకోదండఖండ
పరిహసనపండితకిరీటమండలం బై పదనుమీఱు వదనవనజంబునుం గలిగి
వేదలతావితానంబునకుం బాఁదును నస్తోకశాస్త్రనిస్త్రీంశంబునకు నొఱ
యును బురాణపరిణాహపరిణామంబునకు శరణంబును నితిహాసకిసలయంబు
లకు రసాలశాఖియు మంత్రంబులకు శుద్ధాంతంబును దంత్రంబులకుం దగిన
నెలవును యోగంబునకు భాగధేయంబును విజ్ఞానంబునకు నుపజ్ఞంబును వివే
కంబునకు నాకరంబును విభవంబులకుఁ బ్రభవస్థలంబును నైనరూపంబు దీపిం
పం బురుషోత్తముండు పురాణపురుషుండు భూతభవ్యభవనాథుండు భోగి
శాయి భూధరధరుండు మాధవుండు మధువైరి మథతకైటభుండు మందాకి
నీచరణుండు మఖఫలప్రదాత ప్రత్యక్షం బగుటయు నుక్షిప్తమానసవికారుం
డై హిరణ్యకశీపుకుమారుండు మారజనకునకుం బలుమాఱుం బ్రణమిల్లి
యిట్లని నుతించు.

86


దండకము.

శ్రీమానినీప్రాణనాథా నమద్భక్తయూథా త్రిలోకైకరక్షాసమాసక్త
చిత్తా యియత్తావిదూరప్రచారా మహీమానచోరా మురారాతి నీరీతి
యేవంవిధం బంచు నెంచంగరా దచ్యుతా సచ్చిదానందకందా ముకుందా
భుజంగేంద్రపర్యంక యీజంగమస్థావరాకార యౌ సృష్టి విస్పష్ట యై ఫుఫ్వు
నం దావియుం బోలె నీమూర్తిలోఁ గానిపించు న్విరించి స్తుతా విస్తృతం
బైన నీమూయ కన్మూయఁగా నెవ్వఁ డోపు న్విభూతవ్యపాయా జపాయోగ
విస్మేర మై మీఱు కాశ్మీరఖండంబునన్ రక్తిమవ్యక్తి జొత్తిల్లులీలన్ గుణ
శ్రేణి శ్రేష్ఠు న్నినుం గప్పి యుండు న్మణీకుండలస్ఫారగండస్థలా పుండరీ
కాక్ష యక్షీణజన్మాంతరాభ్యార్జితానేకపాపాటవీవాటికల్ వీటిఁబోవు న్భవ
న్నామవర్ణావళీపావకజ్వాలచే మేలుగాంక్షించు దుశ్శీలుఁ డైన న్నిను న్లెస్సగా
నేకవారంబు హృత్కీలితుం జేయఁగాఁజాలినన్ జాలిఁ బోఁ ద్రోలి యుల్లోక
సౌఖ్యోన్నతి న్ముఖ్యవృత్తిం గన న్నేర్చు నన్న న్సదా నిన్ను నర్చించు
వర్చోనిధు ల్భాగ్యసంపన్ను లౌనంచుఁ గీర్తింపఁగా నేల సద్గీతకీర్తీ మరుచ్ఛక్ర
వర్తీ భవత్సేవ బల్నావగాదా భవాంభోధి దాఁటింప వేదౌఘపాటచ్చర
ధ్వంసి హింసాదిదుష్కర్మము ల్మాని సంసారి యయ్యు న్నినుం గొల్చియే
నిల్చి నిష్ఠాగరిష్ఠుండ నై నిర్మమత్వంబునన్ ధర్మసంపాది నై యుండి యట్లుం

డఁగా లేక పల్గాకినాకాహితాకానీకము ల్పర్వ నిర్బంధముం జేసి దుర్బుద్ధి నుద్బు
ద్ధముం జేయఁ గ్రుద్ధుండ నై మీఱి వృద్ధశ్రవున్ బద్ధవైరంబునన్ యుద్ధ
కేళి న్విభాళించితిం గ్రించ నై వంచనాచుంచురత్వంబున న్నీపదాంభోజము
ల్పూజ గావింపఁగా లేక చీకాకులం బొందితి న్వందితి న్నేఁడు పెన్నాటకం
బైన యామేటిపెంజీఁకటి న్వీఁక దక్కెన్ భయం బుత్కటం బయ్యెఁ జిత్తంబు
కృత్తంబు గాఁబోలుఁ దూలెం గరాళంబు లౌచున్ సురాళంబుమై వాలు
మద్వాహినీజాలముం దూలముం బోలె దిక్కూలముల్ చేరెఁ గారుణ్యముం
జేయవే ఫుణ్యసంపాదకా సంపదేకాశ్రయా యాశ్రమస్థైర్యనిర్వాహకా
సత్వసంవేద్యవిద్యానిధీ భూసురేంద్రప్రియా యాసురప్రాణనీర్మోచకా మేచ
కాకార నాకానిదుర్వృత్తము ల్గత్తిరింపింపవే యుత్తరింతున్ షడూర్మిస్ఫుర
ద్గర్వవార్వల్లభుం బ్రల్లదంబుం గడం ద్రోచి నీముద్రల న్మోచి నీవారికి న్నీకు
నుం దప్పి యుప్పొంగ నెవ్వేళలన్ భవ్యదివ్యాస్త్రస్వాహాస్వధారూపతాపత్ర
యోచ్చాటనావ్యగ్ర ఘోరాగ్రహగ్రాహమస్తచ్ఛిదాకౌశలోదారఖేదార
రచ్ఛన్నహృత్కుంభిసంభావనాసంభ్రమారూఢగాఢప్రబోధా, సుధాశీతళా
దేవదేవా నమస్తే నమస్తే నమః.

87


మ.

అని నక్తంచరరాజనందనుఁడు దీనాకారుఁ డై ప్రస్తుతిం
చినఁ బంచాస్త్రగురుండు భూరికరుణాసిక్తేక్షణాంభోజుఁ డై
యనఘాత్మా యిటు రమ్ము ర మ్మనుచు డాయం బిల్చి తన్మస్తకం
బునఁ గీలించె రమాకుచద్వయకుభృద్భూన్యస్తమున్ హస్తమున్.

88


వ.

ఇట్లు హస్తివరదుండు హస్తమస్తకసంయోగంబు సేయుటయు నయ్యమరారి
కొమరారి విమలతరనిజహృదయమణిముకురోదరప్రతిఫలితలలితప్రబోధ
మాధురీసాధురీతిప్రసారుం డై సంసారపాండిత్యంబున వెండియు నయ్యండ
జాధిపస్కంధారూఢునకు గాఢభక్తిం బ్రణామంబు లాచరించి వాచాలతాచ
మత్కారంబులు మెఱయ నప్పరమపురుషుం బురుషత్రయస్వరూపుం బరా
పరుం బొగడు నవసరంబున నగణితజలధరజాలవినీలం బగు నంధకారం
బున్మూలితం బయ్యె నుత్తాలంబు లై యొత్తరించుసప్తమారుతప్రకాండంబు
లొండొండ చండివడి యథాపూర్వప్రధావనంబున బరిమీఱుట మాని
మేనులకుం దనుపు సొనిపె నుత్పాదితగగనకోటరవిపాటనంబులగు సికతా
వర్షంబులు పరిహృతంబు లయ్యె నయ్యెడ.

89

సీ.

ఎక్కడఁ జూచిన నిందిరాసుందరీప్రతిమపురంధ్రీప్రపంచలక్ష్మి
యొక్కడఁ జూచిన హేలాలసత్కీరపరభృతాకీర్ణకల్పద్రుమంబు
లెక్కడఁ జూచిన నినతాళమున జాలువాఱు సిద్ధరసప్రవాహకోటి
యొక్కడఁ జూచిన నిభతురంగస్యందనామందభటసముద్దామగరిమ
గలయ నెక్కడఁ జూచినఁ గమలగర్భ, శంభుజంభారిముఖ్యనిర్జరకులంబు
గలిగి రెండవవైకుంఠకటక మనఁగ, నాప్రదేశంబు తోఁచె నయ్యసురపతికి.

90


క.

తనమంత్రులఁ దనసేనలఁ, దనమిత్రులఁ గాంచె నచట దనుజేంద్రుఁడు చూ
పనిమిషముగ నిష్కంపిత, తనుఁడై చిత్తరువు కరణిఁ దా వెఱఁగందెన్.

91


క.

మును దనుఁ గొనివచ్చిన వి, ప్రునిరూపము గానవచ్చెఁ బురుషోత్తము మే
నున నట్టి చంద మంతయుఁ, గని ప్రహ్లాదుండు మస్తకచలన మమరన్.

92


వ.

ఆవిశేషంబు లన్నియు శేషశయనుశాంబరీసమాడంరంబు లని మనంబు
నం దలంచుచు నంబుజాక్షు గుఱించి మఱియు నిట్లనియె.

93


ఉ.

నేరము చేసి యే నిఖిలనిర్జరలోకము శోకమంద దు
ర్వారమదాతిరేకమున వాలుట మాన్పఁ దలంచి నన్ను మా
యారచనాంబురాశికిని నగ్గముచేసితి నాత్మసంభవుల్
నేరకయున్న నేర్పుఁ గరుణించుఁ గదా జనకుండు శ్రీనిధీ.

94


గీ.

పన్నగములచేత బహుపాశములచేత, నాయుధములచేత నగ్నిచేత
నన్నుఁ గాచినట్టి నరమృగాధిప నీకు, నెగ్గు చేసినాఁడ హీనబుద్ధి.

95


క.

ఖలజనదుర్బోధంబులఁ, గలఁగె మనను బోధమహిమ కనుమూసె మదం
బొలసె మహీసురసురపూ, జలు దినదినమునకు నీరసములై తోఁచెన్.

96


వ.

సకలాంతర్యామివి సర్వసాక్షి వణురేణుతృణకాష్ఠంబులయం దధిష్ఠింతు
వీసృష్టిచేష్టాప్రకారంబు నీకుఁ గటాక్షమాత్రంబు నవధింపుము.

97


సీ.

గురునింద గావించు క్రూరాత్ముఁ డేనియు బ్రహఘ్నుఁ డేనియుఁ బతితుఁ డయినఁ
జండాలపాషండసంగతుం డేనియు మద్యపానాసక్తిమత్తుఁ డైన
జెనకరానివధూటిఁ బెనకినవాఁ డైన సజ్జనపీడాప్రసక్తుఁ డైన
విశ్వసించినవారి వెతవెట్టు బలుఁడైన దుర్మదాంధుఁ డైన ద్రోహి యైన
బహువిధమృషాప్రలాపలంపటుఁడ యైనఁ, బుండరీకాక్ష నీపదంబులు దలంచు
వాడు నీవాఁడు నీకూర్చువారివాఁడు, వానికైవసములు ముక్తివైభవములు.

98


క.

కుపథంబులం జరియింపక, విపరీతమతానుభవము వీక్షింపక మీ
కృప గలిగెనేని మనుజుం, డపవర్గసుఖంబు నొందు నఖిలాండపతీ.

99

మ.

వికలాంగు ల్విషమప్రచారులు రుజావిద్దుల్ వినేత్రుల్ జడుల్
వికటాచారులు విత్తవర్జితులు మద్వేలక్షుభాపీడితుల్
సకలాన్నగ్రసనాభిముఖ్యనిరతుల్ చండాలకల్పుల్ రమా
ముకురాస్యారమణా నినుంగనని దుమ్ముల్ ధర్మసంస్థాపకా.

100


సీ.

సింహాసనస్థులై సిరుల నించినవారు భోగసంపదలచేఁ బొదలువారు
బహుపుత్రపౌత్రలాభము గల్గి మనువారు విద్యానవద్యులై వెలయువారు
సప్తసంతానప్రశస్తి గల్గినవారు ప్రత్యర్థిసార్థంబుఁ బఱపువారు
తాపత్రయవ్యథోవృత్తి నెఱుంగనివారు నిష్టాన్నదాతలై యెసఁగువారు
భవదుదారాంఘ్రిభక్తిసంపన్ను లగుచు, మించి తొలిమేన మిమ్ము సేవించినారు
వామన ముకుంద గోవింద వాసుదేవ, నలినదళనేత్ర పావనోన్నతచరిత్ర.

101


సీ.

నారాయణాయ కిన్నరవరోరగయక్షసేవితాయ మునీంద్రభావితాయ
నారాయణాయ నానాభవక్లేశవిదారణాయ సమస్తకారణాయ
నారాయణాయ పన్నగరాజపర్యంకబంధురాయ విభిన్నసింధురాయ
నారాయణాయ గండస్థలాంచితరత్నకుండలాయ మహాస్త్రమండలాయ
జలధరశ్యామవర్ణాయ శాశ్వతాయ, కంజహస్తాయ శస్తాయ గతభవాయ
తేనమో యనిపల్కు సాత్త్వికుల కిహముఁ, బరముఁ గరతలమాణిక్యపరికరంబు.

102


క.

దండించు నన్ను నెన్నే, దుండగములు చేసినాఁడ ధూర్జటిసఖ దో
ర్దండశితచక్రధారా, చండిమచే ననుడు భుజగశయనుఁడు నగుచున్.

103


క.

ఆలింగనంబు చేసెఁ గృ, పాలింగితహృదయుఁ డగుచు నసురేంద్రసుతున్
లోలవిలోచనపాండుర, నాళీకములందుఁ గరుణ నవకము మీఱన్.

104


క.

హరిగాత్రస్పర్శంబున, సురవైరిమనంబు బోధశోభిత మయ్యెం
దరుణారుణకిరణకిరణ, పరిణతి వికసనమునొందు పద్మమువోలెన్.

105


వ.

అప్పు డప్పుండరీకాక్షుండు చక్షుశ్రవఃపరివృఢసింహాసనాసీనుం డై హిరణ్య
కశిపుసూనుం దనకుడితొడమీఁదఁ గూర్చుండ నిడికొని తదీయకపోలస్థలం
బులు పుడుకుచు లజ్జావైవర్ణ్యంబు నుజ్జగింపించి బొజ్జగిలిగింత లిడుచుఁ
గొడుకు ముద్దాడువడు వడరం గొంతసేపు వింతవిలాసంబుల భాసమానుం
డై యయ్యమరాంతకున కి ట్లనియె.

106


క.

ఏ మీవు చేయుదువు సు, త్రామాహితదుష్టజనపరంపరకఱపుల్
నీమది తమోమయంబుగ, నీమాడ్కి నొనర్చె దీని కేటికి వగవన్.

107

ఉ.

పుట్టిననాఁటనుండియును బుణ్యచరిత్రుఁడ వైనయట్టి నీ
పట్టున నొక్కతప్పు గనుపట్టినఁ గానఁగఁ బాడి గాక యి
ట్టట్టన నేర్తునే తనయునందలినేరమి తండ్రి సైఁచి చే
పట్టక మానునే విమతభంజన సజ్జనచిత్తరంజనా.

108


క.

దనుజస్వభావమున నీ, మనస్సున నొక్కొక్కమాఱు మద ముదయించుం
గనుగలిగి తద్వికారముఁ, బెనుపక కడ కొత్తవయ్య పేర్చిన తెలివిన్.

109


క.

నామీఁది భక్తి దృఢతర, మై మది నొలయంగఁజేయు మంతశ్శత్రు
స్తోమువిదారణకారణ, ధీమహిమ సముద్ధరించి త్రిదశారాతీ.

110


గీ.

సురవిరోధంబు మానుము సురలు ధరణి, సురులు ధర్మేతిహాసముల్ శ్రుతులు ననఁగ
మచ్ఛరీరాంతరము లివి మది నెఱింగి, చాలఁ బాటింపవయ్య విశాలకీర్తి.

111


వ.

అనినం బ్రహ్లాదుం డాహ్లాదమధుహృదయం డగుమధుమథనుతో ని
ట్లనియె.

112


క.

ధన మొల్ల ధాన్య మొల్లం, దనయుల నే నొల్ల రాజ్యతంత్రము నొల్లన్
వననిధిశయాన నీపద, వనజంబులమీఁదిభక్తి వదలమి యీవే.

113


వ.

దేవా యేవిధంబున భక్తులకు నీయందలిభక్తి నిబిడసన్నాహంబై యుండు
ననిన నతనికి శతపత్రలోచనుం డిట్లనియె.

114


సీ.

సంతతాచారసంక్తాత్ము లగువారు నుసలక సత్యంబు నొడువువారు
నభ్యాగతార్చనం బాచరించెడు వారు నిగమార్థముల యూఁది నిలుచువారు
దుర్జనసంసర్గదోష మొల్లనివారు పరకామినీకాంక్షఁ బాయువారుఁ
గలనైన నాఁకొన్నకడుపుఁ జూడనివారు గురుసపర్యాసక్తిఁ గొఱలువారు
నిత్యనైమిత్తికముల యన్నింటియందుఁ, బట్టువదలక నిష్ఠఁ జూపట్టువారు
నాదుభక్తులు వారలనడక యిట్టి, దద్భుతవివేకకలితతత్త్వావలోక.

115


క.

మద్భక్తులకును బరమప, దోద్భాసిసుఖంబు నొందు నుత్సవము మదిం
బ్రోద్భవమగునేనియు నది, సద్భావంబున నొనర్తు జాడ్యవిదూరా.

116


వ.

మఱియు మన్మంత్రజాపకులును మన్నామస్మరణస్ఫురణాభిరామహృదయులును
మద్వ్రతాచరణపరిణతనియమకృశీభూతశరీరులును మత్పూజాప్రయోజన
విరాజమానులును మత్కథాశ్రవణప్రవణకర్ణకుహరులును, మద్రూపాంత
రంబు లగుమహీసురులు మాననీయు లని మన్నించుమహామహులును మత్ప
దంబు బ్రాపింతు రాపద్మభవఫాలలోచన బలవిరోధిపవనసఖ భానుమత్సూ
ను పలలాశన పాశధరపరిమళరథ భర్గసఖప్రముఖనిఖలనిలింపులును యక్ష

పక్షిరక్షో గంధర్వసిద్ధసాధ్యతపోధనాది వివిధామరవిశేషంబులును మదాజ్ఞా
చక్రంబునం బరిభ్రమించుచుండుదు రేను భానుకోటిప్రభాసమానం
బును శ్రీసమేతంబును సుధాజలధిమధ్యమణిమండపవిహారియును మారుత
భుగధీశ్వరతలిమతలవలమానంబు నైన పురుషాకారంబు తోరంబుగ నుదార
భుజావిజృంభితప్రహరణోద్భాసినై వర్తింతు నామూర్తి విస్ఫూర్తి నీవంటి
పావనహృదయులు దక్కఁ దక్కినవా రెఱుంగరు, నాయందలిభక్తి యవ్యభి
చారిణి యగుటకు నుపాయంబులు గొన్ని గల వవి వినిపింతు విను మని దనుజ
మర్దనుం డనిమిషమర్దనునితో నిట్లనియె.

117


క.

ధరణి మదర్పితముగ నా, చరితం బగు వ్రతము మోక్షసాధక మై సు
స్థిరలక్ష్మీకర మై సం, గరజయదం బగుచు నుండుఁ గల్మషరహితా.

118


క.

వివిధవ్రతములలోపల, రవి గ్రహములయందు మించు రహి వహియించున్
భువనంబుల హరివాసర, మవదాతయశోవిలాసహసితశశాంకా.

119


గీ.

బహువిధానేకవిభవసంప్రాప్తికరము, కలుషతిమిరౌఘవిచ్ఛేదకారణంబు
భర్గసంసేవ్య మపవర్గవర్గదాయి, సువ్రతం బగు నేకాదశీవ్రతంబు.

120


క.

భాసురముక్తిరమాము, క్తాసర మై సకలసౌఖ్యకమలశ్రేణీ
కేసర మై చెన్నగుహరి, వాసర మావ్రతము సలుపపలయు మహాత్మా.

121


వ.

ఏతన్నిమిత్తంబుగ నొక్కయితిహాసంబు గల దాకర్ణింపు మని గోకర్ణశయనుం
డాకర్ణకుతూహలపరవశుం డగు దైతేయప్రసూతితో ని ట్లనియె, మున్నఖిల
విభవవిభర్త్సితనిర్జరావసధంబగు గూర్జరదేశంబున శరచ్చంద్రం బనునొక్క
పురవరంబు వెలయుం దదధీశ్వరుండు.

122

శ్రీహరి ప్రహ్లాదునకు హరివాసరమహిమఁ జెప్పుట

సీ.

కడవీను లంటినకన్నుదోయికి దృష్టి సకలశాస్త్రార్థదర్శనము గాఁగఁ
బొంకంబు లై యొప్పు భుజశిఖరముల కాతతభూషవసుమతీభృతియ కాఁగ
మేరుసన్నిభమైన మెఱుఁగునెమ్మేనికి గవచంబు వినయసంకలన గాఁగ
హస్తిగంభీరమా యానలక్ష్మికి నొప్పు మేరసూటిని నేర్పు మెలఁపు గాఁగ
నెలసెఁ గద నాభిముఖశత్రుకలభ నిటల, విఘటనారంభశుంభన్నవీనతరకృ
పాణవల్లీపరిష్కృతపాణితలుఁడు, భోజుఁ డనురాజు ధిషణాసరోజసూతి.

123


క.

అతనికిఁ బురోహితుం డై, సతతోన్నతి వెలయు విష్ణుశర్ముఁ డనఁగ ను
న్నతివడయు భూసురేంద్రుడు, శతమఖునకు గురుఁడు వోలె సాధువినతుఁడై.

124

ఉ.

వేదపురాణశాస్త్రపదవిం దుదివిన్కి యెఱింగి ధర్మసం
పాదితయాగతంత్రుఁ డయి బాంధవపోషణకామధేను వై
నా దెసఁ గల్గు భక్తికతన న్విలసిల్లె నతండు తొల్లి ప్ర
హ్లాద పటుప్రసాదనిఖిలస్తుతభూరిదయామయాశయా.

125


వ.

ఆవిష్ణుశర్మ తనధర్మపత్నియందు మందేహుం డునందనుం గాంచి యావి
ర్బూతబుధగ్రహుండగు సుధాకిరణుకరణిం బరిణమించె నావిప్రకుమారుండు.

126


క.

కాలోపనీతుఁడై గురు, జాలంబులయొద్ద జదివె సకలాగమముల్
నాళీకగర్భుసన్నిధిఁ, దాలిమి మును భృగువుచదువు తాత్పర్యమునన్.

127


శా.

వాచాచాతురి వక్కాణించు సభలన్ నేపధ్యహృద్యంబుగాఁ
దూచాతప్పఁడు వేదవాదములయందు న్నవ్యకావ్యోదయ
శ్రీచాతుర్యము సంఘటించు దృహిణస్త్రీమూర్తి విస్ఫూర్తి యై
భూచక్రస్తుతుఁ డైనవిప్రతనయుం బోలంగలే రెవ్వరున్.

128


వ.

ఆమందేహుండు సదసత్సందేహగోచరావలగ్న యై సులగ్న యనుపేరి పురం
ధ్రిం బెండ్లియై నిజజ్యేష్ఠభ్రాతలగు విధాతృధాతృ సంయాతి యయా త్యను
యాతి భూతి ప్రభూతిచ్యవనులకు నవిధేయుం డై వివిధవిభవానుభవంబుల
నభినవయౌవనసౌభాగ్యంబు సఫలంబుగఁ జేయుచు నుండె.

129


సీ.

అనుదినాభ్యంగంబు నభినవధౌతవస్త్రాదరణంబు ననర్ఘ్యరత్న
భూషణాకలనంబు భూరిసౌరభగంధసారకస్తూరికాచర్చ వికచ
విచికిలదామసంవేల్లనంబును బరమాన్నభోజనమును నాటపాట
లాసన్నతీర్థయాత్రానుకూల్యంబును దుర్ద్యూతకేళియు ధూర్తరతియుఁ
గలిగి దుర్వారసంసారగౌరవంబు, దలఁపఁ డొకనాఁడు వేదశాస్త్రములు విడిచి
వీటఁ గ్రుమ్మరు విటవేషవిలసనమున, దేహవన్మన్మథుండు మందేహుఁ డకట.

130


క.

పొదువుకొని వత్తు రన్నలు, తుదిపుట్టువుగాన వాని దుశ్చేష్టలు నె
మ్మదిఁ దలపోయక యట్లనె, వదినెలు వాటింతు రాకువాళపుమఱఁదిన్.

131


క.

చిల్లరచేఁతల నిల్లుం, బొల్లుం జెల్లుగ వెఱంజి భూసురసూనుం
డుల్లోకవృత్తిరోవెల, పల్లవపాణులకు నొసఁగుఁ బ్రల్లద మొదవన్.

132


సీ.

పలుదెఱంగుల బుద్ధి దెలిపి రన్నలు సారె రీతి గా దనిరి తండ్రియును దల్లి
ముట్టనాడిరి కూర్చుచుట్టంబు లెల్లరు సరిగృహమేధు లసహ్యపడిరి
గురువులు చెక్కిలిగొట్టి వారించిరి సజ్జను లిది దురాచార మనిరి
పలుచగాఁ జూచిరి ప్రభువురాణువవార లోవనివారు బిట్టుబ్బినగిరి

యెవ్వ రెటువలె బోధించి రేధమాన, శేముషీగౌరవంబునఁ జిక్కఁబట్టి
యంతకంతకు నతఁడుకామాంధకార, కలితలోచనుఁ డగుఁగాని కాఁడు సుమతి.

133


క.

కుసులకు విఱిగిరి దుష్ట, వ్యసనము విడలేక తిరుగువానిపయిన్ భ్రా
తృసమూహంబును బాంధవ, విసరము గురుజనులు గూర్చు వియ్యపుఁబ్రజలున్.

134


గీ.

ఉరగదష్టాంగుళముఁ ద్రుంచి యుఱకపాఱ, వైచుకైవడి నన్నీచు వదలవిడిచి
యింటివారెల్ల సుఖముండి రంటుకొనిన, తెవులువాసినకరణి నోధీరచరిత.

135


శా.

ఆమందేహుఁడు బంధుముక్తుఁ డయి చింతాక్రాంతసంతాపమూ
ర్ఛామగ్నాశయుఁ డై చరించుటలు కర్ణాకర్ణిన్ భోజధా
త్రీమందార మెఱింగి వానిఁ గరుణాదృష్ణి న్నిరీక్షించి శి
క్షామంజూక్తుల బుద్ధి చెప్పి నిజాపార్శ్వస్థాయిగాఁ జేయుడున్.

136


క.

రాతిరి పగలును వినయో, పేతుం డై సేవ చేసెఁ బృథివీనాథుం
బోతర ముడిగి మహీసుర, సూతి మధుచ్ఛన్న మైనసురియయుఁ బోలెన్.

137


వ.

ఇట్లు విష్ణుశర్మమీఁది కూర్మికతన భోజుం డావిప్రతనూజుం బాటించుచు నుండి
కతిపయసంవత్సరంబు లరిగినం దదనంతరంబ యొక్కకందువయందు.

138


క.

ఆమందేహున కిచ్చెన్, భూమీవిభుఁ డగ్రహారములకును దేవ
గ్రామంబులకును సమమతి, వై మేరలు నడుపు మనుచు నధికారంబున్.

139


గీ.

ఇచ్చి ముద్దుటుంగ్ర మిచ్చి వారక మిచ్చి, యందలంబు వెట్టి యనుచుటయును
గుజనుఁ డతఁడు బ్రహకూఁకటి ముట్టి భూ, పాలు వీడుకొని యపారముహిమ.

140


మ.

కరణంబు ల్పరిహాసకు ల్కవిజను ల్కార్తాంతికు ల్గాయకు
ల్దొరపోతు ల్పరివారము న్సఖులు మంత్రు ల్కర్తకర్మజ్ఞులుం
దెరువు ల్వెట్టి పదార్థము ల్దిగుచు యుక్తిప్రౌఢులు న్మున్ను ము
ష్కరు లెల్లం దనవంటివారు గొలువంగా సంభృతోత్సాహుఁడై.

141


క.

సురభూసురభూములపై, హరిణాశ్రితవనము సొచ్చు వ్యాఘ్రమపోలెన్
ధరణీసురసూతి క్రుమ్మరి, పరుసఁదనము మీఱఁ బారుపత్తెము సేయున్.

142


సీ.

పూర్వంపుటధికారిపురుషులమీఁది ముత్తండలన్నియుసు జిత్రముగ నొడిచి
వాచాలు రగుచుఁ జావడి నిరంకుశవృత్తిఁ దనరుగ్రామణులకు జనవు లొసఁగి
సందుగొందులను లంచపుముఖంబున మాటుపడు నపరాధంపుబెడఁద లరసి
యొక్కని వెఱపించి యొక్కని మన్నించి యొకఁడు గానకయుండ నొకనిమనవి
చనవు లేకాంతమున విని సకలజనులఁ, గైవసంబుగఁ జేసె భూదేవదేవ
సీమవారల నాధూర్తశేఖరుండు, రేయుఁ బవలును గనుఱెప్ప వేయికిట్లు.

143

క.

సంతాపము నొందించు మి, థోంతఃకలహమున నగ్రహారద్విజులన్
సంతతవిత్తార్జన బహు, చింతాపరతంత్రుఁ డగుచు క్షితిసురుఁ డెపుడున్.

144


క.

విందులు వెట్టియు ముడుపులు, సందుల దోఁపియును సేవ సలిపియు ధరణీ
బృందారకు లెల్లప్పుడు, మందేహుని గొలిచి రిండ్లు మఱచి గుణాఢ్యా.

145


క.

దేవస్థానంబుల ని, చ్ఛావృత్తిఁ జరించు నతఁడు చంచలతురగ
వ్యావల్గనములు మెఱయఁగఁ, గైవారము సేయ వందిగణ మిరుగడలన్.

146


సీ.

పునుఁగుఁ గస్తురియుఁ గప్పురముఁ గుంకుమగంధసారఖండములు పన్నీరు మొదలు
సురభివస్తువు లెల్ల శోధించి శోధించి మేలైనయవి తనపాల నిలిపి
రత్నభూషణముల రాయిఱప్పలు మంచియవి యెల్లగిలుబాడియందుకుఁ బ్రతి
యమరించి జీర్ణంబు లగువానిఁ బెట్టెల నించి నూతనపటీనికరమెల్ల
దనదుబొక్కస మింటికిఁ దార్చి పెరుఁగుఁ, బాలు నేతులు బియ్యము ల్పప్పుఁగూర
కాయగుడములు ఖండశర్కరయుఁ దేనె, లాత్మగృహముననుండి రాహవణుపఱిచి.

147


క.

శ్రీవిష్ణుస్థానములకు, శైవాలయములకు శక్తిసదనంబులకున్
లేవడి సేయుచుఁ బాత్రుల, హావళిఁ బెట్టుచు మెలంగు నతఁ డనుదినమున్.

148


సీ.

మెఱికలు మలిగండ్లు బెరసినక్రొత్తనూకలు పుప్పిగాఱుపెసలును గసరు
నెయ్యియు నూనియ [9]నెలనాళ్లనుండియుఁ బులిసి బూరటలాడు బూఁజుపెరుఁగు
నూరెల్ల నొల్లని కూరగాయలు త్రప్పలవుమిరియంబులు జవుటియుప్పు
సౌరభం బెడలినసంభారములు నేఱుఁబిడుకలుఁ జనిచెడ్డ గుడము వరటి
చెడినపుళిపండు గాని యచెడుగు దేవ, తోపహారంబులకు ననర్ఘోజ్జ్వలార్హ
భోజ్యముల నంపఁ డొకనాఁడుఁ బూర్వకాల, కలితమర్యాద లుడిగె వేల్పులకు నెల్ల.

149


క.

తొల్లింటి కట్టుమట్ల, మ్మల్లము లన్నియును నమ్మి ముడుపులు సేయు
న్వల్లడికాఁడై తప్పులుఁ, గల్లలుఁ బ్రజలందుఁ దెలుపుఁ గలుగకయున్నన్.

150


క.

తనకొలువును దనపైఁ బెనఁ, చినపదములపాటలును రచింపఁగ దినముల్
చనుఁ గాని మేళమున క, య్యనిమిషసేవకుము గలుగ వవకాశంబుల్.

151


సీ.

ఉప్పెనవోయెఁ బయోదధిక్షౌద్రఘృతంబులు దధ్యోదనంబు లుడిగెఁ
బిండివంటలు కథాబీజమాత్రమె చిక్కె జఱపు లన్నియుఁ బనిచెఱపులయ్యెఁ
బర్వోత్సవంబు లంబరపుష్పదశ నొందె గీతవాద్యంబులు కెళవు దొలఁగె
శాసనస్థగ్రామచయసమాగతవస్తువిస్తార మంతయు నస్తమించె

ధూపదీపంబు లడఁగె దుత్తూరగోక్షు, రకలితార్కనికుంజపూర్ణంబు లగుచుఁ
[10]బాపరిండ్లయ్యె గుళ్ల యభ్యంతరంబు, లాతఁ డధికార మొనరించునవసరమున.

152


క.

సురభూసురపీడనమునఁ, బొరసిన విత్తంబు వానిఁ బొందక పెఱకై
సురిగె నొకకొంత వేశ్యా, శరణములకుఁ గొంత చోరజనవశ మయ్యెన్.

153


గీ.

చెట్టుఁ దిన్నపురుగుఁ బట్టి పీడించినఁ, బసరు వెడలుగాక పసిమి గలదె
దూఱు దక్కెఁ గాని దుర్బ్రాహ్మణునకును, నార్జితార్థకోటి యంట దింత.

154


క.

త్రిచతుర్వర్షములకు నీ, ప్రచయము దేవాలయంబు ప్రజలు నొకటి యై
కుచరిత్రుఁ డైనమందే, హుచరిత మాభోజపతికి నొగి నెఱిఁగింపన్.

155


వ.

కాలాకారుండై యభ్భూపాలుండు కోపించి యాకాపురుషు రావించి వాని
వలన దేవతాసేవకులును భూదేవనివహంబునుం గలుగరూపించిన యపరా
ధంబు సైరింప నేరక చక్షుర్దండయోగ్యుండ యేనియు నయ్యయోగ్యు నప
విత్రాంకకళంకాంకితశరీరుం గావించి తనయేలుభూవలయంబునకుం బాపు
టయు నాపాపస్రవణుండు.

156


క.

బహుదేశంబులవెంటన్, బహిష్కృతుం డగుట మాటుపఱిచి చరించున్
మహిసురచండాలుఁడు స, ద్గృహమేధుల యిండ్లఁ దిండి దినుఁ బలుమాఱున్.

157


గీ.

జఘనకీలితసలిలకషాయపటము, నుత్తరీయంబు మెడవంపు నొరగుశిఖయు
నిటలమున గంగమట్టియు నీరపూర్ణ, కుండికయునై చరించుఁబాషండుఁ డతఁడు.

158


చ.

అతఁ డట నొక్కనాఁడు విపినాంతకమార్గమునందుఁ బోవుచుం
బ్రతిభయభానుదీధితులఁ బర్వినదాహము నోర్వలేక శీ
తతరజలంబు నారయుచుఁ దత్సవిధంబునఁ గాంచె నొక్కహం
సతుములమాంసలంబు జలజాతనివాసముఁ జారుహాసమున్.

159


వ.

కాంచి యానష్టపూర్వద్విజుండు సంతుష్టహృదయుండై యథేష్టంబుగ నక్కొ
లన జలజపరాగపరంపరావాసితంబులు నతిశీతలంబులును మధురసుధారస
ప్రాయంబు లగుతోయంబు లాని మేనికిం దనుపు వచ్చుటయు నచ్చట
వియచ్చరతరునిభం బగు సురపొన్నగున్నమ్రానినీడం గోడెవయసు విపిన
పవనశిశువులు విసర సొగపు నొందుచుఁ గొంతతడవు మార్గశ్రాంతి నపన
యించుచు నుండి నప్పుడు.

160


సీ.

ముదురుచీఁకటినిగ్గుమ్రుగ్గులన్నియుఁ గూడి నిలిచెఁ బొమ్మననొప్పు వలుదకొప్పు
పైపొర తనుదానె పాయ వెలుంగొందు ముగ్ధచంద్రుని బోలు మొగము మేలు

మరుమేడపసిఁడికుంభములఁ దప్పులుపట్టు సౌభాగ్యసంధాయి చన్నుదోయి
యిసుకదిబ్బలమించు నిసుమంత గావించు చక్షుఃప్రియకరంబు జఘనభరము
వలుదతొడలును గలహంసలలితగతియు
మృదుమృణాలాభబాహుసంపదయు సింహ
సదృశమధ్యంబుగల యొక్కశబరబర్హ
కబర యేతెంచెఁ బుష్కరాకరమునకును.

161


క.

ఏతెంచి తజ్జలంబుల, నారమణీమణి యొనర్చె నవగాహము ని
ర్ధూతరజోవిక్రియయై, ధౌతస్మరహేతినోలు తను వలరంగన్.

162


వ.

ఇట్లు రజస్వల యగు నావికస్వరపికస్వర నావనస్నానానంతరంబున నవ్వేశం
తంబు వెడలి యొక్కకడం గడలి వెలువడి నిలిచిన మదిరాదేవియం బో
లెఁ ద్రిభువనోన్మాదకారిణి యై హరినీలనీలపరంపరాసంపదభిరామం బగు
కుంతలస్తోమంబుం దడి యార్చుచుం బటాంతరస్వీకారంబున రాకాశశాంక
చంద్రికాసాంద్ర యగు శరద్రాత్రిం బురణించుచు విలసిల్లు నవసరంబున.

163


గీ.

తెరువు నడచి యలసి సురపొన్నక్రొన్నీడఁ, దూఁగువట్టియున్న తొలుతకులము
నతఁడు కన్ను విచ్చి యయ్యింతి నీక్షించె, నదియుఁ జూచె మోహనాంగు నతని.

164


క.

కంతుండు తమ్మిపూబలు, గొంతంబున గంటిచేసెఁ గువలయగంధా
స్వాంతంబు విప్రుడెందముఁ, గాంతారైకాంతభూమిఁ గవకవనగుచున్.

165


క.

అఘటనఘటనాచాతు, ర్యఘనుం డగువిధికతమున బ్రాహణకులుఁడున్
జఘనవినిర్జితపులినయు, నఘదూరా కూడి మాడి యన్యోన్యంబున్.

166


వ.

నిధువనక్రీడాలంపటులై తెంపు మెఱసి సహాసన సహభోజన సహవిహరణ
పరాయణులై యొక్కపక్కణంబునం బెక్కేం డ్లధివసించి రి ట్లాపాపకా
రులు కాఁపురంబు సేయు కాలంబున.

167


క.

హరిణములఁ జంపి యమ్మియుఁ, దెరువాటులు గొట్టిదోఁచి తెచ్చియుఁ గనకాం
బరములఁ దనుపుచునుండెం, దరుణిం బతి మదనరాగతత్పరమతియై.

168


క.

వాఁడంత వయసుదిరిగినఁ, బోఁడిమి చెడి కాలుఁ గేలుఁ బ్రుంగుడువడి క్రొ
వ్వేఁడిమి దఱిఁగిన నిప్పును, వీఁడనఁగా నుండెఁ జెంచువెలఁదియు ముదిసెన్.

169


క.

గరు బేఱి తినుచు బ్రదికిరి, పురుషార్థవిదూరు లయిన పొలతియుఁ బతియున్
సరిముదిసి బ్రహ్మలిఖితము, హరునకు నేనియును దాఁట నలవియె తండ్రీ.

170


సీ.

పుట్టఁడా తా నేమి భూసురాన్వయమున, సాధువంద్యుఁడు విష్ణుశర్మయందుఁ
జదువఁడా తా నేమి చతురాగమంబులు నామూలచూడ ముద్యన్మనీష

వెలయఁడా తా నేమి విభవదేవేంద్రుఁ డై యభినతార్థశ్రేణు లనుభవించి
యుండఁడా తా నేమి యుర్వీతలాధీశునాస్థానమున సింహ మద్రిఁబోలె
నట్టిమందేహుఁ డతిదుర్లభాగ్రవర్ణ, కర్మనిర్ముక్తుఁడై చెంచుగబ్బిగుబ్బ
లానికతమునఁ బాతిత్యలీనుఁ డయ్యె, నెవ్వ డెటువంటివాఁ డౌనొ యెఱుఁగరాదు.

171


వ.

అంత నొక్కనాఁడు.

172


ఉ.

పండితపుండరీకుడు తపఁకృశదేహుఁడు తీర్థకుండికా
దండలసత్కరాంబుజుడు దాంతియు శాంతియుఁ గల్గినట్టి వి
ప్రుండొకరుండు వచ్చె మృగరు టికానకున్
గండకిఁ దీర్థమాడుకుతుకంబు మెయిం బయిత్రోవ గావునన్.

173


గీ.

వచ్చి మధ్యాహ్నవేళ నవ్వైష్ణవుండు, నచలఝరవారి ననగాహ మాచరించి
యాహ్నికక్రియ డు నొక్క, వటతలంబునఁ గూర్చుండి వాడుదేరి.

174


మ.

కలుషధ్వాంతనిదాఘఘర్మరుచి లోకఖ్యాత మంతారిపు
జ్వలనజ్వాలఘనాఘనోదయము మోక్షశ్రీల స్థలీ
తిలకం బాశ్రితరక్షణక్రమకళాదివ్యద్రువాటంబు నాఁ
గలయేకాదశి నాఁడ యౌటకు శిరఃకంపంబు గావించుచున్.

175


సీ.

శరభశార్దూలకాసరఘోరమైన యీవన మెట్లు దాఁటిపోవచ్చు నొంటి
నటవీగజము చేయు హావళిచే యథాయథలైరి తనతోడి యనుఁగు లెల్ల
నొక్కపక్కణమైన నిక్కానఁ బొడగాన రాదు నిర్జనమైన బ్రహ్మసృష్టి
గాఁబోలు నిచ్చోటు గాఢసాధ్వసమున జడిసి మిక్కిలిఁ జిక్కువడియె మనసు
శార్ఙ్గికారాధనము సేయుజాడ యెట్లు, రాత్రి జాగర మొనరించుక్రమముఁ దెలియ
నిమ్మహాపుణ్యవాసరం బెవ్విధమున, నాకు నొడఁగూడునొక్కొ యిన్నాళ్లవలెనె.

176


గీ.

అనుచుఁ జింతించు వాసుదేవాహ్వయంబు, గలుగునవ్విప్రువీనుల నెలసె నొక్క
జనకలకలంబు నీచభాషావికీర్ణ, వర్ణవైకల్యరూక్షమై వరవిచార.

177


క.

ఆజాడ పట్టుకొని యా, తేజోనిధి యరిగి యగ్రదిక్కునఁ గాంచెన్
భూజననుత శరహతనా, నాజంతుక్షతజచిక్కణముఁ బక్కణమున్.

178


వ.

కని యయ్యనఘమానసుండు హరిణహింసాభూయిష్టం బగునానిష్ఠురప్రదే
శంబు డాయం జని గాలి యెగువ నిలిచి యందలి పొలసుకంపు నిజనాసా
పుటకుటీరకుటుంబి గాకుండ నొక్కగండశిలామధ్యస్థలం బధిష్టించి యా
శబరాలయంబుఁ గాచు ప్రధానశబరివలన నిజశరీరరక్ష యొనరింపం గలవాఁ
డై యొక్కింతసేపు కాలూఁదునంత.

179

సీ.

శణలతావల్కసంచయసితచ్ఛాయమౌ సరపవెండ్రుకముడిశిరమువాఁడు
పాముమేనును బోలె బర్బరస్పర్శమౌ తో లెముకలనంటి తూలువాఁడు
ముడుసులు గొరుకంగ మొఱవలువోయిన యఱుగుడుఁబండ్లనో రడరువాఁడు
బలితంపు విలబద్ద గిలుబాడి చేసిన యష్టిచుట్టినగాఢముష్టివాఁడు
చెట్టుచేమలుఁ దూఱి యిట్టట్టు దిరుగఁ, బగిలి యెఱమన్ను గప్పినపదయుగంబు
వాఁడు మందేహుఁ డావిప్రవరుని డాయ, వచ్చి కరములు మోడ్చి దీవనలు వడసి.

180


గీ.

అతని కనుసన్నఁ గూర్చుండె నంతికమున, నష్టపూర్వద్విజుండు తన్నవ్యదివ్య
గాత్రపవమానసంవర్కగౌరవమునఁ, బాపబంధంబు లొక్కింతపట్లు వీడ.

181


సీ.

అడిగె మందేహుఁ డయ్యవనీసురశ్రేష్ఠుఁ డరుదెంచుటకు హేతు వానుపూర్వి
నడిగినఁ దెల్పె నాయయ్య గండకి కేగుపనియు నన్యేభసంభవభయంబుఁ
దెలిపిన వాఁడు నాదేవోపముని దెచ్చి విమలగోమయగోముఖములఁ బూత
మగువర్ణమయగృహాభ్యంతమున నిల్పె నిల్పిన నందు నానిగమవేది
లోహతామాత్రసంచియు దేహతాప, హారియగు నాతపత్రంబు నంఘ్రిరక్ష
లాది నిజసాధనము లెల్లె నర్హభంగి, దగినచోటుల నునిచి చిత్తంబు దేఱి.

182


గీ.

కొంతవడి విశ్రమించెఁ గుకూలకీలి
కీలనిభతాప మగునెండ వ్రాలుదనుక
బోయయును బోయప్రోయాలుఁ జేయఁదగిన
యూడిగంబులు సేయుచు నుపచరింప.

183


వ.

మందేహుండు దేహధారిణి యగు ధర్మదేవతయునుంబోని యానిష్ఠాగరిష్ఠు
నకుఁ బచ్చితేనియలు దెచ్చి యిచ్చియును వెదురుబియ్యంబు లుపదచే
సియు వన్యఫలంబు లెన్నియు సమర్పించియు శ్రీఖండలతాఖండంబులు కడ
కునకు నొడఁగూర్చియు వనమహిషవిసాణవిశకలితశైలశిలాపట్టంబుల నట్టు
కట్టిన గుగ్గులునిర్యాసకల్కంబు లిచ్చియుఁ బ్రక్షాళితకరచరణవదనుండై
కొదమనెత్తావు లొత్తరించు తులసీపలాశపల్లవంబులును వివిధవీరుదుల్లసిత
ప్రసవవిసరంబులును బర్ణపుటికల ఘటియించి యావటించియు దేవా నీ వీ
వనచరభయంబు దక్కి సావధానుండ వై మాధవారాధనం బొనరింపు
మని సభార్యుండై తదభిరక్షణదీక్షితుండై యున్నంత గభస్తిమంతుం డస్త
గిరి యవ్వలికిం జను నవసరంబున.

184


గీ.

శబరపరివృఢనిర్దిష్టసారసాక, రాంబుధారల సాంధ్యకృత్యములు దీర్చి
కమ్మపిచ్చుకవాతినెత్తమివిరులు, గలువపువ్వులు శుద్ధోదకములుఁ దెచ్చి.

185

క.

తొలుక్రొత్తగారనూనియఁ, దళకొత్తించెం బ్రదీపదామకములు త
న్నిలయాంతరమున జ్వాలా, వలయాహతతరుణతిమిరవైషమ్యముగన్.

186


గీ.

అటులు మత్పూజనోన్ముఖుం డగుచు వాసు, దేవుఁ డిట్లను మందేహుదిక్కుఁ జూచి
యన్న హరివాసరంబు నేఁ డవధిఁ బోక, జరగె నీకతమున నీకు జయముగలదు.

187


గీ.

నిదురగాచియుండు మదగజంబు లొనర్చు, భయము గలదో యేమొ పక్కణమున
రేయి నాల్గుజాలుఁ జేయంగవలయు జా, గరణ మచ్యుతునకుఁ గౌతుకముగ.

188


వ.

అనిన విని వాఁడు వల్లె యని సభల్లంబుగ విల్లెక్కుద్రోచి పల్లియలోని
నల్లమందిం గొందఱఁ బిలిపించుకొని తదన్వితుండై యతిచండంబు లగు
శార్దూలశరభసింహసింధురాది సత్త్వంబులువచ్చుత్రోవ లరయుచుం గావలి
కిం జాలియుండె నాభూసురపుండరీకుండు.

189


క.

అభిషేకప్రసవార్చా, విభవంబుల ధూపదీపవిలసనముల సా
రభరితఫలపానకములం, ద్రిభువనసుత నాకు నధికతృప్తి యొనర్చెన్.

190


క.

కుముదోన్మీలన మాదియుఁ, గమలవికాసంబు తుదియుఁ గా యామవతిన్
మము నర్చించెఁ బ్రజాగర, ణముతో భూసురుఁడు మదిఁ గనగ భయలవమున్.

191


క.

బోయయు బోయతయును నా, బోయకుఁ గలసఖులు రేయుప్రొ ద్దంతయుఁ గ
న్మూయక యాయకలంకుఁడు, చేయు మదర్చనము వినుతిసేయుచు నుండన్.

192


శా.

భానుం డగ్రకుభృన్మణీమకుట మై భాసిల్ల నుత్ఫుల్లప
ద్మానీకం బగునొక్కనిర్ఝరమునం దావిప్రుఁ డర్థిం గృత
స్నానుం డై దివసాననార్హవిధి నిష్ఠాయుక్తుఁ డ్రై చేసి పూ
ర్ణానందంబున నింటికిం జని మదీయస్తోత్రము ల్సల్పుచున్.

193


వ.

అవసధశుద్ధి గావించి యథాసంభవపదార్థంబుల నన్నసంపాదనం బొనరించి
కృతపారణుండై లేచి వార్చి వనపవనకిశోరప్రసారశమితశరీరగ్లానియై తులసీప
లాశచర్వణం బాచరించుచు నాచెంచునకు భుక్తావశిష్టంబు లగుబోజ్యంబు
లొసంగుటయుఁ బొంగి యంగనాసహితుండై యాగహనచరుం డది యెల్ల
నుపయోగించి యమహీసురపంచాననుం గొనిచని యాదిమార్గంబు పట్టించి
మరలె నాధరణీసురుండును గండకీతటంబునం గొండొకకాలం బధివసించి
సాధకులచేత నతిదుస్సాధ్యం బగు లక్ష్మీనారాయణశ్రీమూర్తి సాలగ్రామ
శైలగర్భంబునం గొని తెప్పించి కృతకృత్యుండై నిజావాసంబుం బ్రవేశించెఁ
దదనంతరంబ యిచ్చట.

194

శా.

ఆమందేహుఁడు దేహబంధనముఁ బాయం డాయఁగా వచ్చి రు
ర్దామక్రోధకషాయలోచనులు హస్తన్యస్తభీమాయుధ
స్తోముల్ సామజనీలవర్ణులు మదాంధుల్ బంధురక్రూరదం
ష్ట్రామాద్యత్తటిదుక్రవక్త్రులు వివస్వత్సూనుసేనాధిపుల్.

195


వ.

వచ్చి యుచ్చైస్వరంబుల నార్చుచు నాపతితు భూపతితుఁ జేసి పొరలిం
చుచు నీతెంపరి పరిత్యక్తకులాచారుం డనియును నీనిష్ఠురుండు తిష్ఠన్మూత్రుం
డనియు నీయభాగ్యుండు గురుపరిత్యాగశీలుం డనియును నీపన్న దురా
న్నభోజి యనియు నీకఱటి పరకామినీపరిచయపరిణతుం డనియును నియ్యధ
ముండు మధుమథనమన్మథాంతకప్రముఃఖనిఖిలనిర్జరద్రోహి యనియును నీపిచ్చ
కుక్కచ్చుమోచిన నీచుం డనియును ననేకప్రకారంబులఁ గర్ణకఠోరంబు
లాడుచు వరుణపాశకీలితుం జేసి యమావసధంబునకుం గొనిపోవుమధ్య
మార్గంబు నవరోధించి మత్ప్రేరితు లగుపారిషదు లావైవస్వతసేవకులం
బోవం దఱిమి యఱిముఱిం బేర్చి యుదర్చిరుజ్జ్వలం బగువిమానంబున
నావిష్ణుశర్మసూను నారోహణంబు చేయించి నాయున్నయెడకుం దెచ్చిన
నేనును నానిష్కళంకునకుఁ బుష్కలం బగు శంకుకర్ణాభిధానం బొనరించి
వైకుంఠగోపురద్వారపరిరక్షణపట్టభద్రుంగాఁ జేసితి నీవిశేషం బశేషపాపా
చరణనిపుణుండ యేనియు నాధరణీసురునకు నమేఘవర్ణోదయంబును నప్ర
సనతరుఫలంబునుంబోలె నకారణప్రాప్తం బగు నేకాదశీజాగరణపుణ్యం
బునం బ్రాపించెం గావున.......................................
........హ్లాదంబున నుపదేశించి యాకాంచనవసనుండు వెండియు.

196


సీ.

......................దశితిథిఁ బావనస్నానశోభనశరీరు
డగుచు గీ............................................
.........................ముండి బహుప్రకార, పూజలును
జాగరణమున........................................
......................రణసద్వైష్ణవులును దాను.

197


గీ.

బాలురును వృద్ధులున...................................
...................ల్లరికర్తనంబు............................

198


సీ.

ధరణి గంగాదితీర్థజలాంతరంబు...........................
ము బ్రహ్మాప్రతిష్ఠాదిబహువిధసప్తసంతానసంజనిత.................
.........................................దత్తాన్నదానమునకు
సాటిగాదని శ్రుతికోటి చాటుచుండు.............................

199

గీ.

.....................శయము
విష్ణుదేవుండు దెలుప నవ్విజయశాలి
తద్వ్రత మొనర్చు తలఁపుఁ జిత్తమున నిలిపె
హరియు రావించె నింద్రాదిసురకులంబు.

200


వ.

రావించి యద్దేవవిరోధివలస విరోధం బుడివించి విబుధాధిపతికి నవిహతస్వ
ర్గాధిపత్యం బేకాతపవారణంబుగా నొసంగి యసురవరునకు వసుధావల
యం బొసంగి మున్ను యథాయథలై చనిన దేవతాయూథంబులం బిలి
పించి యథాస్థానంబులం బ్రతిష్ఠించి ప్రహ్లాదుం గౌఁగిలించికొని మర్యాదో
ల్లంఘనంబు చేయకు విశృంఖలవృత్తి మత్తిల్లకు శాంతస్వభావంబున నభ్రాం
తుండవై మహీమండలంబుఁ బాలింపు మని యనిచిన ననిచినవినయంబున
ననిమిషు లావనజోదరునాదరంబు వడసి తమతమనిలుకడల కరిగి రంత.

201


మ.

పులుఁగుందత్తడి పుట్టుమచ్చ బలిశంపుం గెంపు బల్నెట్టెముం
దెలిదమ్మిం గలలోఁతుపొక్కిలియు నింతిందాల్చు పేరక్కు నా
సలిలారామనికాశయు (?) న్మొసలివాచౌకట్లు రాకాసిమేఁ
తలచు ట్టల్గును గల్గువేల్పు చనియెం దా నేలు వెల్దీవికిన్.

202


క.

హరియాజ్ఞ నేలె సుస్థిర, తరముగ ధరణీతలంబు దానవపతి ని
ర్జరవిభుఁ డనువాసరముం, బరమాప్లుం డగుచు నతనిపాలనె నిలిచెన్.

203


వ.

అని యి ట్లమ్మహర్షులకు రోమహర్షణుండు శరభనృసింహసంవాదంబును బ్రహ్లా
దకథాకథనంబును నెఱింగించిన నావిరించినిభు లన్నీవారముష్టింపచు నారా
ధించి ప్రహృష్టహృదయులై యతనివలన నిహపరసాధనంబు లగుశ్రీమ
దష్టాక్షరీప్రముఖవైష్ణవమంత్రరహస్యంబులు దెలిసి విలసిల్లి రాకథకుండును
యథేచ్ఛావృత్తిం బృథివీతలంబున మెలంగుచునుండె నని.

204


క.

ఈప్రహ్లాదచరిత్రము, భూప్రజలు పఠించి సకలబుధవర్ణితకీ
ర్తిప్రాప్తియు నిహపరసౌ, ఖ్యప్రీతియుఁ గలిగి సిరులఁ గాంతురు వరుసన్.

205


క.

రాజన్యకకరతలవి, భ్రాజితజంబీరగౌరఫలసంకాశా
రాజత్కీర్తివిరాజిత, రాజార్థకిరీటనిర్జరధునీకాశా!

206


మ.

హనుమాంబారమణీమణీసుహృదయామ్రారామపుంస్కోకిలా
ఘనధాటీముఖఘోటికాకఠినరింఖాసంఘసంభూత పాం
సునికాయాంతరితాంతరిక్ష సుకవిస్తోత్రార్హచారిత్ర దు
ర్దనశిక్షాగుణదశ విక్రమకరాంచన్మత్తకంఠీరవా.

207

మత్తకోకిల.

భూరిసత్యసమేతభాషణ భూజనప్రజపోషణా
.........................ర్జనతరమోహితా
భీరుమానసభీతివారణ భీమదోర్బలవారణా
దారుణారితమోనభోమణి దండనాథశిరోమణీ.

208


గద్యము.

ఇది శ్రీహనుమత్కటాక్షలబ్ధవరప్రసాదసహజసారస్వతచంద్రనామాంక
భారద్వాజసగోత్రపవిత్ర రామవిద్వన్మణికుమా రాష్టఘంటావధానపర
మేశ్వర హరిభట్టారకప్రణీతం బైన శ్రీనరసింహపురాణోక్తం బగునుత్తర
భాగంబునందు వాసవప్రముఖులైన దివౌకసులు నాళీకనాభుపాలికిం
జని ప్రహ్లాదువలనఁ దారు పడినఖేదం బెఱింగించుటయు నయ్యాది
దేవుండు దేవతాననలాలనుండై యసురవరుపాలికి వృద్ధవిప్రవేషంబు
నం జనుదెంచి యతనికి వైకుంఠంబుమీఁదికిఁ గార్యానుబద్ధుం డగుట
కుపదేశించియు వైకుంఠంబుపైకి దండు తర్లించుకపోయి మధ్యేమా
ర్గంబున మాయగప్పుటయుఁ బ్రహ్లాదుండు నివ్వెరగంది పూర్వజ్ఞానా
యత్తచిత్తుఁడై శ్రీహరిభజన సేయుటయు నంత హరి ప్రత్యక్షంబై
ప్రహ్లాదు గారవించి హరిదూషణనివారణం బగుటకు మోక్షపదంబగు
నేకాదశీవ్రతమహత్త్వం బుపదేశించుటయు నింద్రప్రహ్లాదుల కాహ్లాద
కరంబు సేయుటయు నన్నకథలంగల పంచమాశ్వాసము సర్వంబును
సంపూర్ణము.

  1. మానుడు
  2. పాలింప్పెడు
  3. సౌరసాతలగభీ
  4. చుంచురుండు అనియే వేఱొక్కచోటనుంగలదు.
  5. మందిరంబ్బులంబ్బులై
  6. బహితంబ్బు
  7. సోగిపును
  8. నాగంబ్బుశేయు
  9. లెన్నాళ్లనుండియు
  10. పాపయిండ్లయ్యె