నారసింహపురాణము
ఉత్తరభాగము
చతుర్థాశ్వాసము
క. |
శ్రీమహితరామమాదృ, గ్గ్రామక్షీరాంబురాశిరాకాచంద్రా
సామాద్యుపాయనయవి, ద్యామతినిస్తంద్ర రంగయప్రభుచంద్రా.
| 1
|
వ. |
ఆకర్ణింపు మాశౌనకాదిమహర్షులకు రోమహర్షణుం డిట్లనియె దేవరాతిప్రణీ
తం బగునీతివాక్యజాతం బంగీకరించి పంచజనపతిసంహరణపరాఙ్ముఖుం డై
శతమఖప్రముఖనిఖిలబర్హిర్ముఖవిదారణదారుణరణోత్కంఠుం డై దనుజకం
ఠీరవుండు సుఖం బుండునవసరంబున.
| 2
|
వర్షాకాలవర్ణనము
సీ. |
ప్రోగువైచినపద్మరాగఖండంబులగతి నింద్రగోపసంఘములు దనరె
గరుడపచ్చలడాలుఁ గన్నుగీటఁగఁజాలు లేఁతపచ్చిక పిసాళించి మించె
నీశానదిగ్వాయులేశంబు లొకకొన్ని భంజళిగతుల విభ్రమము చూపెఁ
బ్రథమోదబిందుసంపర్కంబు పుడమిమైపొక్కు లాఁపఁగఁ దైలపూర మయ్యె
గగనగోపాలకృష్ణశిఖాపరీత, పింఛవలయంబు వోలె దీపించె నింద్ర
చాపవల్లీమతల్లి వర్షాశిలాక, లాపములు రాలె మొగులుమొల్లములనుండి.
| 3
|
స్వాగతవృత్తము. |
వారిదఘోషము వారిరుహాక్షీ, వారమునల్కనివారణ సేయన్
సారరసోదయసంభ్రమలీలా, స్మేరముఖు ల్విలసిల్లి రధీశుల్.
| 4
|
సీ. |
ధళుధళుక్కున నింగిఁ దాటించెఁ బలుమాఱు లలితవిద్యున్నటీలాస్యకేళి
ఘుమఘుమ నురిమె దిక్కులు పిక్కటిల్లంగ భూధరస్థలులు నంభోధరములు
జలజలఁ దలలెత్తి చా లేరుపడియె విడూరభూస్థలుల వైడూర్యశిలలు
నకనక లిచ్చు మానసఖేదదశ డించి పురివిచ్చి యాడె నయ్యురగభోజి
పాంథమోహనమంత్రదీపములువోలెఁ, గడిమిపూఁజేరు లురవయ్యె గహనవీథి
గాఢవర్షాగమారంభగర్వరేఖ, యవనితాపనివారణం బాచరింప.
| 5
|
మ. |
గుడిచుట్టుం బలుమాలుఁ జందురుఁడు దిక్కుల్గొంచమై తోఁచెఁ గ
వ్వడినామంబులు వల్కి రెల్లసుజనుల్ వజ్రధ్వని న్వెచ్చి పె
క్కిడుమల్ గాంచిరి పాంథు లంధనిభ మయ్యెం జంతుసంచార మే
పడరెన్ జాతికిఁ బ్రీతి వాన జడిపింపం బోధముల్ చూపఁగన్.
| 6
|
స్రగ్ధర. |
మొరయ న్మండూకపంక్తుల్ మును రెసఁగ నహంబుల్ [1]తమిస్రాసమత్వా
దరణంబుం బొంద సింధూత్కరము జలనిధిం దార్కొనన్ జాజిపూచ
ప్పరము ల్భోగుల్ నుతింపం బరిపరిగతులం [2]బర్వపున్ గ్రాఁజపూవుల్
దొరఁగింపం బుప్పొడుల్ బంధుర మగుచు నిలం దోఁచె వర్షర్తు వందున్.
| 7
|
సీ. |
పెనుఁబాము వ్రేలఁగట్టినరీతిఁ గురిసెఁ గుంభద్రోణమగువృష్టిఁ బలుమొగుళ్లు
చను జారసంకేతనమునకుఁ బాంసులరేయిఁ జినుకు పంక ముఱుము చీఁక టనక
పుక్కిటిబంటి యౌ పొలపువెల్లికి నోర్చి మెలఁగఁజొచ్చిరి హాలికులు ప్రియమున
నాతపాకాంక్షమై నడవిలోపల గూడువడి మూకలై యుండె బలుమృగములు
నట్టి వర్షాగమంబున నసురభర్త, విజయయాత్రాసమారంభవృత్తి వదలి
సంకుమదమార్గమదలిప్తచతురయువతి, కుచపరీరంభశాలియై కుతుక మొందె.
| 8
|
క. |
పాపాంధకార మణఁచి ప్ర, దీపించు ప్రబోధచంద్రుతెలివియు పోలెం
జూపట్టె జలదసమయ, వ్యాపదఁ గడ కొత్తి శారదాగమ మంతన్.
| 9
|
సీ. |
తెలుమొగల్? చిలుకముక్కులఁబోలె [3]భంగభంగములయ్యె మువ్వన్నెగనపవిల్లు
తాండవక్రీడ ముక్తాశశి సోగకాసియ యూడ్చె శిఖి వనశ్రేణియందుఁ
గ్రేంకారశబ్దంబు లంకురించె మరాళజాతికిఁ గమలకాసారవారి
సప్తచ్ఛదక్షీరసౌరభం బై పర్వె గజకపోలముల వెక్కసపుమదము
పుట్టఁ [4]గోరాడె నాఁబోతు పొట్టకఱ్ఱ, లవిసె సస్యంబునకు నింకె నసలు నిసుక
వెరిఁగె నేఱుల ధౌతముకురసమాన, కాంతిఁ దిలకించెఁ బూర్ణరాకావిధుండు.
| 10
|
క. |
ఏలాలవంగతక్కో, [5]లాలీజాతీఫలప్రియంభావుకగం
ధాలీఢశిశిరమారుత, బాలక్రీడలు చెలంగెఁ బర్వతభూమిన్.
| 11
|
గీ. |
వేఁడియు మాంద్యమును లేక వెలుఁగుఱేఁడు, పసిగలోఁ గొను ధరఁగల్గురసములెల్లఁ
గ్రూరుఁడును శాంతుఁడును గాక కువలయేశుఁ, డవనిజనములచేఁ గప్ప మందినట్లు.
| 12
|
ప్రహ్లాదుఁడు స్వర్గముపై దాడి వెడలుట
గీ. |
అంకురించె మహోత్సాహ మవనిపతుల
డెందముల శత్రువిజయంబు నొందుకొఱకుఁ
బ్రజ్వలించు కృశానుపైఁ బ్రబలు నిబిడ
కీలయును బోలె దేజోవిశాల మగుచు.
| 13
|
శా. |
ఆ కాలంబున నొక్కనాఁడు చతురంగాభీలకోలాహలో
త్సేకం బంబుధిఘోషముం బొదువ నిస్త్రింశోగ్రరోషాగ్నియై
నాకౌకఃపతిమీఁద దాడి వెడలె న్నానాసురాధీశసే
నాకోటుల్ భజియింప నమ్మనుజభుఙ్నాథుం డసాధూద్ధతిన్.
| 14
|
సీ. |
ధణధణంధణమ్రోయు తమ్మటధ్వానంబు వ్రయ్యలుగా మిన్ను వ్రచ్చివైచె
నినమండలము గప్పె నిసుమంతయును గానరాకుండ సేనాపరాగరాజ
కనుమోడు పొదవించె ననిమిషాంగనలకు శాతాస్త్రచయ చాకచక్యగరిమ
భరము తాళఁగలేక ప్రథమకచ్ఛపరాజు వికలుఁడై యొక్కింత వెన్ను వంచె
మ్రొగ్గె దిగ్గజములు శైలములు చలించె, రాలెఁ దారలు జలరాశి దీటపడియె
దనుజనాయక దండయాత్రామహోగ్ర, వీరరసవిభ్రమస్ఫూర్తి గారుకొనఁగ.
| 15
|
క. |
ఆదేవవిభునిపైఁ బ్ర, హ్లాదుఁడు చనుపూన్కి వలవ దని పల్కెడుమ
ర్యాద ఘనఘటలఁ దోఁచె, న్మేదురనాదములు దిక్సమితి చెవుడుపడన్.
| 16
|
క. |
నభ మెల్ల నిండి రక్షో, విభుసైన్యము కామరూపవిభ్రమమున న
కుభితగతి వచ్చుపూనికి, సభయుంగావించెఁ బాకశాసను నంతన్.
| 17
|
చ. |
కొలువున నుండి దేవపతి కూర్చుదిశాపతులు న్మరుద్గణం
బులు వసురుద్రకోటులుఁ బ్రబుద్ధులు వృద్ధులు నైనవారు వీ
నుల నిడి మేలుమే లన వినూతనసూక్తుల దేవతాగురుం
బలుకు గభీర[6]కంఠరవభర్త్సితనీరదగర్జనంబుగన్.
| 18
|
మ. |
హరినామస్మరణంబు శ్రీహరిపదధ్యానానుసంధానమున్
హరిదాస్యంబు హరి న్భజించుటలు నిత్యాచారము ల్గాఁగ భూ
సురసంప్రీణనము న్సురావనము నస్తోకోన్నతిం జేయు లౌ
ల్యరజోగర్వవిముక్తబుద్ధి యగుఁ బ్రహ్లాదుం డభేదోన్నతిన్.
| 19
|
ఉత్సాహ. |
అతనిధర్మ మిన్నినాళ్లు నసురభయవిదూరతో
న్నతి వహించి విభవభోగనయసమున్నతిం జగ
త్రితయ ముదయ మొందె నిపుడు దివిజవిమతదుష్టవా
గ్వితతి నతఁడు సత్త్వగుణము విడిచి యడిచిపాటుతోడన్.
| 20
|
క. |
హరిమీఁద మనలమీఁదం, బరుషత వాటించెనఁట యపారబలముతో
నరుదెంచుచున్నవాఁ డట, కరణీయం బెద్దియో యకల్మషచరితా.
| 21
|
గీ. |
నక్క రేనుబండ్లు నమలంగ నొల్లని, వ్రతము పట్టి పిదపి బతము చెడిన
నీతి నిక్క మయ్యె దైతేయసూతిహృ, చ్ఛాంతి విడిచి దౌష్ట్యవంతుఁ డగుట.
| 22
|
క. |
నావిని చిత్రశిఖండిజుఁ, డావజ్రాయుధునిఁ బల్కు సమరాధిప ర
క్షోవరులకు నైజము దౌ, ష్ట్యావేశము శాంతిగుణము లాగంతుకముల్.
| 23
|
చ. |
హరికృప గల్లియున్ననిను నాయసురేశ్వరుఁ డేమి సేయు సం
గరము జయాజయంబులకుఁ గారణ మాతఁడు నిన్ను నోర్చిన
న్సురపురిఁ గొన్నినాళ్ళు నిలుచుం గదనంబున వాని నీవు ని
ష్ఠురగతి నోర్చితేని జయశోభనము ల్నినుఁ జేరు నారయన్.
| 24
|
గీ. |
ముట్టఁబడినపనికి నట్టిట్టు చనఁబోల, దసురఁ దాఁకి పొడువు మనము మిగిలి
చంపఁబొంచి యున్నజంతువుపట్టునఁ, దడయవలవన దాత్మ జడియవలదు.
| 25
|
క. |
గర్వించి యశోవా మృ, త్యుర్వా యని దివిజబలమహోగ్రాకృతి వై
గీర్వాణవిమతజలనిధి, పర్వతమై నిలువవయ్య పాకధ్వంసీ.
| 26
|
సీ. |
విమతేంధనముల వేలిమి వేల్వఁగాఁ జాలు ననవద్యతేజుఁ డీయనలుఁ డుండ
నిటలాక్షుమది యైనఁ కౌటిలి పోవఁగఁజేయు కఠినప్రచారుఁ డీకాలుఁ డుండ
దనవారిఁ దమివాసి యనిమిషావళిఁ గూడి వర్తించు నీకోణభర్త యుండ
సప్తసాగరరాజు సకలధర్మస్వరూపం బైన యీ పాశపాణి యుండ
గంధవహుఁ డుండ నియ్యల కాధినాథుఁ, డుండ ఖండేందుధరుఁ డుండ నురక నీకు
జంచలింపంగ నేల నిశాచరాత్మ, జాతమాత్రంబునకు వజ్రసాధనుండ.
| 27
|
క. |
హరి గలఁడు నీకు ని న్నొక, దరిఁ జేరుచుఁ గాని బెట్టిదపుఖేదములం
బొరయంగనీఁడు రక్షః, పరివృఢుఁ డన నెంత నీకుఁ బరబలభేదీ.
| 28
|
క. |
తనతండ్రి నంతవానిం, దునుమాడిన విష్ణుశక్తి తోర మనక య
మ్మనుజాశనుఁ డచ్యుతుపైఁ, గనలుట పులిమీఁద లేడి గవయుట గాదే.
| 29
|
గీ. |
అరులఁ జంపవలయు నరులచేఁ దా నైనఁ, జావవలయుఁ గాక శౌర్యఘనుల
కహితు లెదురునప్పు డట్టిట్టు చనరాదు, చనిరయేని గీర్తి పొనుఁగువడదె.
| 30
|
చ. |
ఘనులు ప్రియోక్తు లాడిన వికాసముఁ గాంతురు గాని దుర్జనుల్
చెనఁటులు నైన రక్కసులచిత్తము మెత్తన గాదు పోరికి
న్మన కిది వేళ గా దనిన మానరు గావున వైరివీరమ
ర్దన మొనరింపు దుర్దమవిధానదురావహశౌర్యశాలి వై.
| 31
|
వ. |
సామదానభేదంబు లొనరించుతఱి తప్పఁగ్రుంకిన యది నిరాతంకహృదయుండ
వె దండంబున విమతఖండం బొనరింపు మని యనిమిషపతికి బృహస్పతి నీతి
మార్గం బుపదేశించుసమయంబున.
| 32
|
గీ. |
చారు లరుగుదెంచి జంభారిఁ బొడగాంచి, ఘర్మసలిలబిందుకలితమూర్తు
లగుచు సంభ్రమోక్తు లడరంగ నిట్లని, రదరుగుండెతోడ బెదరిబెదరి.
| 33
|
సీ. |
పొడకట్టె భూరజఃపుంజంబు మాంజిష్టపటవితానముగ నంబరమునకును
గదిసె నాజానేయకంఖాణసంఘాత మనిలోచ్చలితవీచివనమువోలె
గంధాంధబంధురసింధురంబు లకాలజలదోదయుముఁ జేసె సకలదిశలు
గగనగంగాపయఃకాండ మంతయుఁ గ్రోలె నందితస్యందనోన్నతపతాక
లాయుధప్రభ లర్కాంశు లట్లు వెలిఁగె, భేరిభాంకార మబ్ధిగధీర మయ్యె
వచ్చెఁ బ్రహ్లాదుఁ డాదిత్యవంశవర్య, శాత్రవంబుననో మైత్రి జరపుటకునొ.
| 34
|
వ. |
అనిన నదరిపడి త్రిదశపతియుం గొలువువిరిసి కలయ నెఱసిన కోపంపుం
గెంపుపెంపున సొంపారి సహస్రలోచనంబులు గలుగు నిజశరీరంబు చెందమ్మి
కొలనిచందమ్మున సందంబుగం గుటిలతరభ్రుకుటిఘటనంబు నిటలంబున
నటింపఁ గటము లదరం బుటములు గొనునిట్టూర్పులు కందర్పహరకంఠ
సర్పంబుఁ దలపింప నలందిన హరిచందనంబుం దెరలించి ముంచుకొను
నులివేఁడిచెమటలు చొటచొట వడియ నిలువెడలి హజారంబున కెడ
గలుగ నిలిచి నిలింపులం బిలిచి పలలాశనసంహారంబునకు [7]సరంహంబుగం
బయనంబు గండని తానును భండనోచితశృంగారం బనంగీకారాంగీకా
రకలితంబు గైకొన్నవాఁడై వాఁడియు వేఁడియుం గలకులిశంబు జళిపించు
చుం గలధౌతకుధరతులితవపురుత్సేధంబును నగాధదాదానపాథఃపరంపరా
పారిప్లవభ్రమరసముదయంబును నుదితనిజనినదవిదళితబ్రహ్మాండకటాహం
బును హాటకఘంటికాఘణాత్కారఘోరవేగంబును నితాంతచతుర్దంత
కాంతిసంతానకల్పితాకాలచంద్రోదయంబునుం జారుతరావదాతచమర
వాలవల్లీవేల్లితగల్లస్థలంబును జిత్రకంబళకలనాభిరామోర్ధ్వకాయంబు
నగునైరావతంబు నెక్కి రక్కసులమూఁక దిక్కులు కలకలం బాలించుచు
నుండె నంతం దండోపతండంబులై యమరవీరులు సమరోత్సాహసంభ్రమ
భ్రమితహృదయంబుగం బదనుమీఱిన కరవాలంబులు శూలంబులు ఖేటం
బులుం గిరీటంబులు వారవాణంబులు బాణంబులుఁ జావంబులుం బ్రాసక
|
|
|
లాపంబులు దీపింపఁ గోపాటోపంబున నంబరంబు ఘూర్ణిల్లం బెట్టు పలుకుచు
నరదంబులు ద్విరదంబులు హయంబులుం బదాతిచయంబులు నయుత
నియుత లక్ష దశలక్షకో ట్యర్బుద న్యర్బుదప్రముఖంబు లగుసంఖ్యావిశేషం
బుల నుల్లంఘించి [8]క్రేళ్లుమెలంగం గసిమసంగి సింగంబులు గిరిగుహాంగ
ణంబులనుండి వెడలువడువున స్వర్గంబు వినిర్గమింపం దొడంగి రప్పు డుత్పా
తంబు లనేకంబులు గనుపట్టె నట్టు లయినను నెట్టవియసి గట్టిమనంబుతో
నదితిపట్టి చూపట్టి జయంతుం బురరక్షణంబునకు నియమించి చనుదెంచు
సమయంబున.
| 35
|
ఇంద్రుఁడు ప్రహ్లాదునిపై యుద్ధమునకు వచ్చుట
క. |
కనలుననో నైజగుణం, బుననో తనువందు నుష్ణము ఘనంబుగ న
య్యనలుం డేడికతత్తడిఁ, గొని దాఁటించుచు బలాంతకుని గని మ్రొక్కెన్.
| 36
|
చ. |
వగరుపుతేజి నెక్కి యిరువంకలం గింకరకోటి బింకముల్
నగవులు నట్టహాసములు నల్లనిమేనుల నుబ్బుగబ్బునై
మొగివిడ కేగుదేర దివిముట్టిన పట్టిన పోటుముట్టుతోఁ
బొగరున నేగుదెంచె రవిపుత్రుఁడు గోత్రవిరోధి డాయఁగన్.
| 37
|
గీ. |
ఆత్మతుల్యమూర్తి యగు రక్కసుని నెక్కి, ఘోరభంగి వాఁడికోఱ లెసఁగ
వివిధభూషణాస్త్రవిద్యోతితాంగుఁ డై, దానవుండు వేల్పుఱేనిఁ గదిసె.
| 38
|
శా. |
యాదోభేదము లెన్నియేని కొలువ న్వ్యాలోలపాశప్రభా
ప్రాదుర్భావము కల్పవహ్ని సుషమన్ భాసిల్ల సక్రోపవా
హ్యాదీర్ఘక్రమణప్లుతంబుల మనం బానందముం బొంద మాం
సాదధ్వంసనకాంక్ష మై నడచెఁ బాశాంకుం డశంకోద్ధతిన్.
| 39
|
క. |
గంధవహుండు [9]సుధాంథో, బంధురు నలరించెఁ జిత్రపర్యాయగతిన్
గంధాంధహరిణసైంధవ, ముం ధేయని పఱపి సైన్యముఖతిలకం బై.
| 40
|
గీ. |
గరుడగంధర్వకిన్నరగణము సిద్ధ
సాధ్యరక్షోబబలంబు లసంఖ్యములుగ
హయము దాఁటించుచును గదాభయదబాహుఁ
డగుచు విత్తేశుఁ డనికి నై యంగవించె.
| 41
|
క. |
ఈశానుఁ డేగుదెంచె శి, ఖాశీతమయూఖరేఖఁ గళలుబ్బఁగ బా
హాశూలప్రభ ప్రబల వృ, షేశనిశంకటవిహారహేలావశుఁ డై.
| 42
|
క. |
వసురుద్రాదిత్యులు తీ, వ్రసమీరక్షుభితవిలయవారిధు లన ను
ల్లసితోగ్రవీరరసకే, లీసహితగతి వచ్చి రఖిలలేఖోన్నతులై.
| 43
|
క. |
వీరాలాపంబులు ఘీం, కారంబులు హేషితములుఁ గలయ బెరయుటన్
ధీరంబు లయ్యెఁ దూర్య, స్ఫారారావములు త్రిదశబలములలోనన్.
| 44
|
క. |
పొగలేనిమంట లొక్కట, బుగులుకొనియె నాయుధములఁ బున్నమరేలన్
జిగిదేఱు లేఁతవెన్నెల, మొగడలక్రియ నఖిలసుభటముఖరుచు లలరెన్.
| 45
|
క. |
నలువదినాలుగుయోజన, ములవెడలుపు నిడుపుఁ గలిగి భువనభయద మై
వెలిఁగె న్శకటవ్యూహా, కలన మరుద్బలము కంఠగర్జలు చెలగన్.
| 46
|
వ. |
అందు నవగ్రహంబులు దక్షిణచక్రంబును విశ్వేదేవతలు వామచక్రంబును
సిద్ధసాధ్యసమూహంబులు నొగలును నశేషమంత్రంబులును సమస్తాభిచారిక
క్రియాకలాపంబులును సకలయోగవిద్యారహస్యంబులును నాభిఫలకంబును
ధర్మం బిరుసుం గా నిర్మథితనిఖిలవిమతహృదయం బై యమ్మహావ్యూహం
బుత్సాహసాహసికత్వంబుల నొత్తరించె నత్తఱి నుత్తాలరోషానలజ్వాలాభీలం
బై ప్రహ్లాదవాహినియు సూచీముఖ శూర్పకర్ణ శంబర దీర్ఘజంఘ కాలకేయ
కాలదంష్ట్ర దంతవక్త్ర వృశ్చికరోమ ధూమ్రాక్ష కపిలాక్ష వామనప్రముఖాఖిల
శతమఖవిరోధియూథమేదురం బై దురంబునకు నంగవించె ని ట్లుభయసైన్యం
బులుఁ దారసించు నవరసంబున వాసవుం డాసురబలంబును నిజమాయా
బలంబునం జేసి ధూసరధరారజోవిసరప్రసరణం బగు సమీరణంబుఁ బుట్టించు
టయు నమ్మాయగాలి యుద్వేలం బై తధ్వరూధిని నొత్తరించుకొని యుత్తర
దిక్కునకుం బోవ నూకుటయు సోకోర్చి లోకత్రయగీతకీర్తి యగు దానవ
చక్రవర్తి శాంబరీచక్రిశతంబులఁ బుట్టించుటయు నాబుసకొట్టుందెట్టుపలు
బి ట్టలమి యక్కపటపవనంబు నపహరించె నప్పుడు.
| 47
|
క. |
కలయంగ [10]బెరసె నిరువాఁ, గలఘుతరాయుధవిఘట్టనానలకణముల్
జలజల రాలఁగఁ గోలా, హలహాలాహలవిదారితాఖిలదిశమై.
| 48
|
గీ. |
కరులుఁ గరులు హరులు హరులును రథులును,రథులు భటులు భటులు రణము సేయు
నుద్దవిడి సహింస [11]కూటాడ, బ్రహ్మాండమండలంబు తొంటిమట్టుఁ గడచె.
| 49
|
క. |
తెగియెడుతలలును దెగి ధర, జిగినగవులతోడ రాలి చెన్నగు తలలున్
సగము తెగుతలలుఁ గలిగెం, బొగరున ననిసేయు రెండుమూఁకలయందున్.
| 50
|
గీ. |
మీఁదిమూఁకుళ్లు దెఱచిన మెఱుఁగు లురక
[12]దొంగలించెడురత్నపంక్తులునుబోలెఁ
గఠినహేతుల నుపరిభాగములు [13]ద్రెవ్వి
కాఱెఁ గరికుంభమౌక్తికోత్కరము గరము.
| 51
|
క. |
ముంగాలుగొరిసె లసిహతు, లం గెడపిన మ్రొగ్గె నురుబలము గలిగియు ను
త్తుంగతురంగశరీరము, లంగద వజ్రాభిహతనగాగ్రము లనఁగన్.
| 52
|
క. |
ఘోరానిలవిఘటితరం, భారణ్యము వోలె సాయకాసారము చేఁ
దేరుగమి చిక్కుజీరై, వైరూప్యము నొంది తొంటివన్నియ దఱిగెన్.
| 53
|
గీ. |
కదిసి కత్తుల కింతింతకండ లగుచు, నంటుకొని పోవు నుభయసైన్యముల భటుల
కాయ మీచాయదని పోరఁగానఁబడమి, నచ్చెరువు సేసె దివిఁ జూచునచ్చరలకు.
| 54
|
ఉ. |
తాలతమాలనీలనసుధారజ మాకస మాక్రమించి పా
తాళము వేళ్లచేఁ బొదివి దట్టదనంబున బిట్టు పర్వఁ ద
న్మూలముఁ ద్రెంచె శాతశరముద్గరచక్రగదాత్రిశూలభి
న్నాలఘుయోధయూథవపురస్రపయోధివధూసహస్రముల్.
| 55
|
ఉ. |
పోకుము పోకు మోరి యనఁ బో నిదె వచ్చితిరా యటంచు వై
రాకులచిత్తనృత్తి నుభయధ్వజినీభటకోటి వోర న
య్యాకస మెంత గల్గు నది యంతయు నిండెఁ గబంధమాలికల్
కోకిలవర్ణ మయ్యె నసికుంతరజఃపిహితాఖిలాండమున్.
| 56
|
ఉ. |
వాహనహీనులయ్యు వసివాడక మిన్నులు చూడ కుద్భటో
త్సాహసమగ్రచిత్తముల దైర్యము శౌర్యము నావహిల్ల బా
హాహవదోహళత్వముగ నచ్చెరుపా టొనరించి రమ్మహా
వ్యూహయుగోగ్రవీరులు వయోబలపౌరుషగాఢమూర్తు లై.
| 57
|
క. |
త్రాసునఁ దూఁచినకైవడి, వాసవసేనయును నసురవరుసేనయు న
త్రాసగతి హెచ్చుగుందులు, వాసిన సమరేఖ రణము పాటించుతఱిన్.
| 58
|
క. |
కరిఁ గొలిపి కులిశధారలు, గరళంబుల నుమియ దివిజగణములతోడన్
హరిహయుఁడు చుట్టుకొనియెం, బరిపంథిబలంబు విజయపటహము లులియన్.
| 59
|
సీ. |
కరవాలదండభీకరవేల్లనంబుల గళనాళములు బిట్టు నులిచి త్రెంచి
చక్రిచక్రోపమస్పర్శంబు లగుపాదహతులఁ గందనగాయ లట్లు రాచి
|
|
|
శూలిశూలాగ్రనిష్ఠురదంతముఖములఁ బొడవుగా నందంద పొడిచి యెత్తి
యడ్డతాఁకుల నేనుఁ గైన హయం బైన రథ మైన మృదులచూర్ణముగ మెదిపి
తిరిగె నైరావణము మహాసురబలంబుఁ, జొరుగుఁ జేయుచుఁ గ్రొత్తనెత్తురులు మెదడుఁ
గండలును గొండలై నిండియుండ దివిజ, మండలాధీశుడెందంబు నిండ ముదము.
| 60
|
క. |
తెరలిన నిజసైన్యంబుల, మరలిచికొని యసురభటసమాజము లొదివె
న్సురబలము నాసురోద్ధతి, ధరణీతల మదరఁ ద్రిదశధామము చెదరన్.
| 61
|
సీ. |
సూచీముఖుండును శూర్పకర్ణుండును శంబరుండును సురేశ్వరునితోడఁ
గాలకేయుండును గాలదంష్ట్రుండును నక్రదంతుఁడు గంధవహునితోడఁ
గల్పకేతుండును గంకటాహ్వయుఁడును వామనుండును సమవర్తితోడ
వృశ్చికరోముండు వికటసత్త్వుండును గపిలాక్షుఁడును జలాధిపునితోడ
ఖరుఁడు బలియును గుహ్యకేశ్వరునితోడ, దీర్ఘజంఘద్విమూర్ధ్ను లాదితిజుతోడఁ
దవిలి ధూమ్రాక్షదూషణుల్ శివునితోడ, నఖిలరాక్షససైన్యంబు లగ్నితోడ.
| 62
|
వ. |
ఘోరాకారంబులం బోరం దొడంగి రప్పు డాసూచీముఖశూర్పకర్ణశంబ
రులు శంబధరుం బొదివి పొది వివ్వక వెనుకదివ్వక వేసరక విసువక వెలియం
బాఱక విపాఠాసారంబు తోరంబుగ జోరనఁ గుడిసి తత్కరిశిరంబు శిలీ
ముఖవిద్ధంబు సేయుటయుఁ గ్రుద్ధంబై యాసిద్ధసింధురంబు శూర్శకర్ణుసువర్ణ
స్యందనంబు నమందవేగంబునం గడనొగలు నట్టి బిట్టు వీచి వైచుటయు
నన్నిశాచరుండు పిశాచబలప్రయత్నంబున రథాంతరసంపాదనలంపటుం డై
నిలింపులగుంపుల కుఱికి వేఱొక్కచక్కిఁ జిక్కుపఱుచుచుండె సూచీముఖుం
డేచినఁ బ్రాచీదిశీగీశ్వరుండు [14]భాస్కరకరధారాధాళధళ్యతస్కరంబు లగు
శరంబులు శరధరమాలికావిభూషణం బగు భీషణకార్ముకంబునం గీలు
కొలిపి కరి నంటఁగొలిపి యతం డేయుసాయకంబులు పాయం దట్టుచుఁ
బతాకావిదళనం బొనరించుటయు నమ్మదవదసురవిసరపతి సురపతికిం గాలా
యసనారాచంబున ఫాలతలంబునం గీలాలధార వొడమించి యార్చినం
బేర్చినకోపంబునం జాపం బెత్తి యాదేవోత్తముండు [15]చిత్తజల్లు పగిదిఁ గ్రొత్త
లగుపుత్తడిపింజియలతూపులు పింజపింజయుఁ గొనం బఱపుటయు నయ్యుర
వడికిం జాలక మెరపడి వీడనాడి యాసూదిముక్కురక్కసుం డూడనింబాడె
శంబరుం డంబరంబునం బన్ని శాంబరీసహస్రంబులం బొడమించుటయు
|
|
|
వేల్పుటొడయం డనల్పక్రోధంబున నయ్యాతుధాను గంధర్వాస్త్రప్రయో
గంబున నంధునిం గావించి శంఖంబు పూరించె నంత.
| 63
|
ఉ. |
మ్రుక్కడిమూఁక లన్ని పయి ముంచిన మించినకోపరేఖ నా
పొక్కువెలుంగు కాఱడవిఁ బోలె నరాళకరాళహేతి యై
రక్కసిమూఁకఁ జక్కడిచి రక్తమయంబుగఁ జేసె నేల న
ల్దిక్కులఁ బాఱఁజొచ్చె నతిదీనము లై హతశేషసైన్యముల్.
| 64
|
వ. |
కల్పకేతుకంకటవానునులు వైవస్వతుం బొదివి యనశ్వరపౌరుషంబునం బెనం
గం గన లధికం బై జముండు భండనంబు ప్రచండభంగికంబుగం గావించె
నయ్యిరుదెఱుంగునుం గ్రేడింపక క్రీడాకందుకఖేలనప్రాయంబుగం గాయ
పతితసుభటశిరఃస్తోయజంబుల ధరణీతలంబుం గప్పుచు నుప్పొంగె నయ్యెడ.
| 65
|
గీ. |
దీర్ఘజిహ్వాద్విమూర్ధ్ను లాదితితనూజు, నేసి రేసిన రేసిన హృదయ మదర
నదరిపడి వార లెక్కినమదగజంబు, నశ్వరత్నంబుఁ దునుమాడె నసురభర్త.
| 66
|
క. |
వా రంతఁబోక ఘోరా, కారంబుల నతనిరెండుకడల నిలిచి దు
ర్వారతరవారినిఁ గరా, చూరిని నొప్పింప నతఁడు సొరిగెం బెలుచున్.
| 67
|
క. |
కోణపుఁడు మూర్చ దెలిసి కృ, పాణహతి న్వారి విపులబాహామధ్య
క్షోణులు వేసిన ధరణీ, రేణువునం బ్రుంగు డైరి త్రిదశవిరోధుల్.
| 68
|
వ. |
ఇట్లు ప్రాణాపాయప్రాయంబగు నైరృతిచేతిహేతిపాతంబున భూతలపతితు లై
యెట్టకేలకుం దెలిసి యలసి యయ్యసురవరు లిరువును దురంబునకుం
దొలఁగి పఱచి రంత నంతకాకారు లయి నీరధిపతిం బొదివి వికటసత్త్వ
వృశ్చికరోమ కపిలాక్షులు నిశితక్షురప్రంబులం గప్పిన యాదఃపతి ప్రతి
విశిఖపరంపరల నాతెంపరులపెం పుడిపె గంధవహవేగంబునకు నోర్వక
విముక్తగర్వు లై కాలకేయ కాలదంష్ట్ర వక్రదంతులు దిగంతంబులం బరిభ్ర
మింపం దొడంగి రయ్యెడ.
| 69
|
క. |
ఖరబలులు బలవదాహవ, ఖరు లై క్ష్వేళార్భటీముఖరు లై యలకే
శ్వరుఁ బొదివిరి యరదంబుల, పరుషరవము విండ్లయులివు ప్రతిభయములుగన్.
| 70
|
గీ. |
వారితోఁ గూడి శస్త్రాస్త్రవారవాణ, వరశిరస్త్రాణధరులు దుర్వారబలులు
రాక్షసులు గొంద రాధనాధ్యక్షుమీఁద,నురవడించిరి భూరజం బుత్కటముగ.
| 71
|
వ. |
యక్షాధ్యక్షుండును యక్షరాక్షసకిన్నరబలంబులతోఁ జలంబు మెఱసి హరిం
బఱపి పరుషగదాదండంబుల నఱకియు సురియల నసువులు వెఱికియు
|
|
|
శరంబుల నురంబులు చించియుఁ బరశువులఁ బర్శుకంబులు మురియం
జేసియు నత్తళంబుల నొత్తియుఁ బ్రాసంబులం ద్రాసంబు నొందించియుఁ
జక్రంబులం జక్కుసేసియు ముసలంబులం గసిమసంగియు నొక్కఁడయ్యునుం
బెక్కురూపంబులు దాల్చి పొల్చి నిల్చినయట్లుండె. నుండుటయు.
| 72
|
శా. |
ఒల్లంబోయినసేనఁ గన్గొని ఖరుం డుగ్రాస్త్రపంక్తిం దలల్
డొల్లంజేయుచు యక్షరాడ్బలము [16]బిట్టుంజందము న్మాన్చి చే
విల్లాఖండలచాపలీల వెలుఁగ న్విత్తేశ్వరుం డాసి క్రో
ధోల్లాసంబున నార్చుచుం బలుకు విద్యుద్భీమదంష్ట్రాస్యుఁ డై.
| 73
|
ఉ. |
కోమటిబింక మేమిటికి ఘోరపరాక్రమ మైన రాక్షస
స్తోమముఁ గిట్టుటెల్ల నిది దోమలు సామజరాజిఁ దాఁకి సం
గ్రామము సేయుచంద మగుఁ గాదె ధనాధిప బుద్ధి గల్గిన
న్వే మగుడంగఁ బాడి యవేకమున న్నెఱిదప్పుఁ గార్యముల్.
| 74
|
గీ. |
గుహ్యకేశాభిధానంబు గ్రుడ్డిగ్రవ్వఁ, బోలుపడ గ్రుడ్డు హేయమౌ పొడవు గల్గు
నీదుపోటును గలిగిన నేఁటినుండి, కలుగకుండునె జగములోఁ గప్పకాటు.
| 75
|
ఉ. |
నావిని విత్తనాథుఁడును నంజుడు నెత్తురుఁ గ్రొవ్వు నాని పె
న్గావర మెత్తి పల్కెదవు కష్టనిశాచర లావు గల్గినం
బోవక పోరు న న్నెదిరి పోటునకై [17]యఱుక్రమ్మి వచ్చి యే
లా వదరంగ దుర్వచనలాలసు మెత్తురె శౌర్యవిత్తముల్.
| 76
|
క. |
నీరజ్జు లణఁచి పుచ్చెద, నొరోరీ నిలువు మనుచు నుజ్ఝితగదుఁ డై
యారాక్షసు ముంచె సారా, సారంబున యక్షరాజు చాపము మెఱయన్.
| 77
|
క. |
హరిచిత్రగతులు మెఱయఁగఁ, బరిపంధిరథాశ్వపంక్తి బడలువఱచి ని
ష్ఠురభల్లంబున నొక్కట, హరసఖుఁ డసురేంద్రసూతు నసువులఁ బాపెన్.
| 78
|
మ. |
విరథుం డై దనుజాధినాథుఁడు మహవేగంబుతో ధారుణీ
ధరకూటంబుననుండి డిగ్గు మదవద్దంతావళారాతిభీ
కరరేఖ న్వసుధాస్థలంబునకుఁ జక్కం దాఁటి యక్షేశుబల్
తురగంబు న్నిజముష్టి నొంచుటయు నెత్తుర్గక్కి నానీతియున్.
| 79
|
క. |
కనుచదరి హయము గూలిన, ధననాథుఁడు విల్లు విడిచి దారుణగదఁ గై
కొని యసురకడకు వ్రేసిన, వెనుక కొదిఁగె నతఁడు ధాతువికలత్వమునన్.
| 80
|
క. |
తనయన్న కైనదుర్దశఁ గని బలిదానవుఁడు తనదుకనకరథంబున్
ధనపతి కభిముఖముగ సూ, తునిచేఁ జేయించి వింటఁ దూపులు గురిసెన్.
| 81
|
క. |
గద విసరి యంపపదుపులు, విదళించుచు యక్షరాజు నెసఁ గదిసి హస
ద్వదనముగఁ బగఱయరదముఁ, జిదురుపలుగఁ జేయు టధికచిత్రం బయ్యెన్.
| 82
|
క. |
అన్నయుఁ దమ్ముఁడు నీదశ, గిన్నరపతిచేతఁ బొంది కృతనిశ్చయు లై
మిన్నంట నార్చి వేఱొక, పన్నినరథ మెక్కి కేలిబలువిం డ్లుఱుమన్.
| 83
|
క. |
శరములు గురియుచు ధరణీ, చరుఁ డగువిత్తాధినాథు జన మడఁచినఁ గి
న్నరవిభుఁడు దెరలుటయుఁ ద, త్పరమసఖుఁడు రుద్రుఁ డేచి ప్రమథావృతుఁడై.
| 84
|
గీ. |
తొలుతఁ దనమీఁద ధూమ్రాక్షదూషణాఖ్య
లసురవర్యులు గవిసిన నదియు సరకు
గొనక నిజసఖరక్ష కై యనికి నఱిమె
ఖరబలులమీఁద వృషభవల్గనము లలర.
| 85
|
శా. |
ఆయీశానుఁడు శూలహస్తులుఁ గపాలాలంకృతుల్ కృత్తివా
సోయుక్తుల్ భసితాంగరాగులును జక్షుఃశ్రోత్రహారుల్ ఘన
చ్ఛాయగ్రీవులు నైనకింకరుల నిచ్ఛారూపులం బంప న
మ్మాయాసంగరకోవిదుల్ గదిసి నిర్మర్యాదనాదోగ్రు లై.
| 86
|
సీ. |
పులులఁ బుట్టించియు నెలుఁగులఁ జూపియు గజములఁ గొల్సియుఁ గాలసర్ప
సమితి నాడించియుఁ జండానిలంబులు విసరఁజేసియు రాలు నిసుముఁ గురియు
మొగులుమొత్తంబుల మునుమాది గల్పించియును నంధకారంబు గొనలు సాగఁ
బ్రబలించియును నస్థిపలలమేదోమజ్జరాసులు వెనిచియు రాసభోగ్ర
నాదములు దీటుకొలిపియు నవకబంధ, బంధురముగను నానభఃపథము ముసుఁగు
వడనొనర్చియుఁ బోరి రపారశౌర్య, ధుర్యులై రాక్షసేంద్రులు తొట్రుకొనఁగ.
| 87
|
క. |
మాయాసంగరమున వి, చ్ఛాయం బగునసురబలముఁ జదియఁగ నలకా
నాయకుడు మోదె గదఁ గొని, యాయీశానుఁడును నసురహరణ మొనర్చెన్.
| 88
|
వ. |
ఇవ్విధంబున నవ్విబుధయోధులచే విచ్చియుం జచ్చియు వ్రీలియుం దూ
లియు వెఱచియుం బూరిగఱచియు మరలియుం దెరలియు నోటరియుం
బోటువడియు మ్రందియుం గుందియు మ్రగ్గియు మ్రొగ్గియు నలసియు
సొలసియు నసురవిసరంబు పసచెడి దశదిశలకుం బాఱినయెడ వారవా
ణంబు లవారణంబు లై మావంతులు లేమిం దమయంత విభ్రాంతంబు లై
|
|
|
వంతల దుంతలుంబోలెఁ గాంతి దఱిఁగి [18]సురిగ హరిగ కరవాలంబు గిరుసు
పంకిణియు డొంకెన జముదాడి కొంగవాలు హలాయుధంబు మొదలుగా
నాయుధంబులు విడిచి పదాతు లనవదాతవదను లై పెదవులు దడుపుచు
నొదిఁగిరి రాహుత్తవిహీనంబు లగు మరుత్తమావులు ప్రోవులుగట్టి కల్యాణ
పల్యాణప్రముఖంబు లగు సవరణలతోడ నేడఁజూచినం దామయై సము
ద్రంబునందు నవిసినకలంబుల చందంబున యథాయథ లై యవధిం బొరలెఁ
బృథులంబు లగురథంబు లుపభుక్తపూర్వపుణ్యఫల పురుషవిముక్త సురపుర
విమానంబులుం బోలె నవమానంబులకు నధిష్ఠానంబు లగుచు నున్నయవి
యున్నయట్లనె వన్నె దఱిఁగి యొఱగెఁ గామలకుఁ బాసిన హేమచ్ఛత్రంబులు
మృత్యుభుక్తిపాత్రంబులు భుక్త్యంతంబునం బోవైచిన యని యివి యన రవణంబు
లుడిగి బెడంగు దఱిఁగె నంచలు చంచువులం ద్రుంచివైచిన నెండవడి
బడలు పుండరీకంబులలాగున ననాళంబు లగుచమరవాలంబులు సమర
సరిత్తీరంబునకు జరత్కాశప్రసూనంబు లై ది...... నుడిగి కానంబడియెఁ
గంకణాంగదగ్రైవేయకటకతులాకోటికోటులు విటతాటం బై యుత్పాతకాల
పతితమహోల్కాజాలంబుల గేలిసేయుచు నేలయెల్లనుం దామ యై యప
హృతరామణీయకంబు లై విశీర్ణంబు లయ్యె నెత్తు రొత్తరించె నెమ్ములు దుమ్ము
లయ్యెఁ గండలు గుండుగూలెఁ బ్రేగులు ప్రోగువడియె వాద్యంబులు ప్రద్యో
తంబయ్యె(?) నెయ్యెడఁ జూచిన దయ్యంపుగుంపులు క్రొత్తయెఱచిగరచిలు
పులు(?) మేయుచు నర్తింపం దొడంగె నయ్యెడ.
| 89
|
సీ. |
గగనగంగాపయఃకాండంబుఁ గబళించు నిబిడధరారేణునిచయధార
గుభుగుభుల్లున హరిత్కోణసామజకర్ణవిదళనం బొనరించురొదలకతన
వియదంబురాశినవీనవిద్రుమలతాతతి యైనయాయుధద్యుతివిభూతి
నజునిసర్గమునందు నవతారమందు జంతువులట్లు తలచూపు వివిధసేన
రాక్షసోద్రేకనిర్వాపణక్షణోగ్రు, డగు సహస్రాక్షుదృష్టికి నపగతారి
యయ్యు భువనంబు శాత్రవవ్యాప్తమైన, కరణిఁ గనుపట్టె ఘూర్ణితాకార మగుచు.
| 90
|
క. |
మరుదీశవిశ్వవసుకి, న్నరనరగంధర్వయక్షనాగఖచరు లా
హరిహయునిరుగడల భయం, కరరోషోదగ్రు లగుచుఁ గమియుట యొప్పెన్.
| 91
|
క. |
పాకారి యిట్లు విజయ, శ్రీకాంతుం డగుచు నడువఁ జెదరి బెదరి ముం
జీకాకుపడినరక్షో, నీకిని ప్రహ్లాదుఁ గాంచి నివ్వెఱ గదురన్.
| 92
|
సీ. |
వీరరసోధన్యవికృతియందలి [19]జున్నువడువున నురువులు వొడమ నోళ్ల
విజయాదిగుణములు వెడలుచో నడరెడు కన్నీరుక్రియ ఘర్మకణము లురులఁ
బరిపంథిపదములఁ బడితి మిట్లనులీలఁ బడుచు లేచుచుచున్న భంగ మెసఁగ
నినకరంబుల జిరింగిన తమోదేహజక్షతములక్రియఁ బోటుగం ట్లెసంగఁ
బాదహతి నేల వ్రక్కలువార గళిత, ఖడ్గవల్లులు పదకంటకములు గాఁగ
నాహిరణ్యకశిపుసూను నపుడు గాంచి, పలికి రొక్కట దేగులపరికరంబు.
| 93
|
శా. |
దేవా దేవవిభుండు దిక్పతులు నుద్రేకించి బాహార్గళ
వ్యానల్గత్కరవాలదీప్తులు ధరాస్వర్లోకము ల్నిండ వీ
రావేశంబున రాక్షసధ్వజినిఁ బాయంజేసెఁ గయ్యానకు
న్నీవైదగ్ధ్యము చూపఁగాఁ దగు బలోన్మేషంబుఁ బోషించుచున్.
| 94
|
క. |
నావుడు నేవోసిన జి, హ్వావలి వెలయంగ వెలుఁగునగ్నియ పోలెన్
దైవతవిమతుఁడు తెల్లని, మావుపయి న్నిలిచి శత్రుమర్దనపరుఁ డై.
| 95
|
వ. |
త్రోచి నడచె నయ్యెడ ననీచంబు లగు చమూసమూహంబు లుభయపక్షం
బులయవియు నభయోల్లాసంబునం దారసించి పోరునెడ.
| 96
|
సీ. |
ధరణీపరాగ మంతయు నొక్కగ్రుక్కగాఁ గొనియె నూతనరక్తఘనరసంబు
శాకినీఢాకినీలోకంబు లిచ్ఛానురూపవర్తనముల నేపుచూపెఁ
గరవాలలూనభీకరశిరఃపంక్తులు పక్వతాళీఫలభ్రాంతిఁ జూపె
నొఱగునేనుంగులుఁ బఱచునశ్వంబులు విఱుగుతేరులుఁ గనువేఁదు ఱొసఁగెఁ
గెడసె గొడుగులు వడిగాలు వడియెఁ బడగ, లఖిలదిక్కులు ఘూర్ణిల్లె నా హిరణ్య
కశిపుసంభవుఁ డత్యుగ్రగమనరేఖ, నమరవాహినిమీఁద బిట్టుఱుముటయును.
| 97
|
గీ. |
అప్పుడు ప్రహ్లాదుఁ డనిపని కగ్గలింపఁ, దొలుతళ విఱిగినబలములు తోడుచూపె
నిందుబింబంబు హెచ్చునుగుందుహేతు, వులుపయోధుల నుబ్బింపఁ జులుకఁజేయ.
| 98
|
క. |
అనలయమదనుజవరుణప, వనధనదేశాను లపుడు వజ్రాయుధు దూఁ
కొని కదనమునకు నఱిమిరి, యనిమిషసైన్యములు నడిచె నత్యుగ్రములై.
| 99
|
క. |
ఆసేనకు నాసేనకు, నాసురగతి సనుర మయ్యె నసిముసలగదా
ప్రాసకరవాలధారో, ల్కాసమితి జగత్త్రయంబుఁ గనుమూయింపన్.
| 100
|
సీ. |
విలుమ్రోఁత లార్పులు వేదండఘీంకృతు లశ్వహేషితములు నఖలవాద్య
హృద్యస్వనంబులు నేకీభవింపఁ జుక్కలు రాలె నెత్తురు గ్రక్కె మొగులు
|
|
|
యోగనిద్రాసక్తి నురగేంద్రశాయియౌ నీలపర్ణుఁడు బిట్టు మేలుకొనియె
నభవుఁ గౌఁగిటఁ జేర్చె నచలరాజతనూజ కైలాసశైలంబు కంపమొందె
ధాతదిట దప్పె వేదమంత్రములయందు, సప్తవాయుప్రచారంబు చండివడియె
బీడువాఱిన యద్దంపుబిల్లవోలె, హల్లకారాతిబింబంబు క్రేళ్లుమలఁగె.
| 101
|
క. |
ఆయెడఁ బ్రహ్లాదుఁడు కా, లాయసనారాచధార లమరబలముపైఁ
గోయని యార్చుచు సింగిణి, మ్రోయించుచుఁ గురిసె భువనములు ఘూర్ణిల్లన్.
| 102
|
వ. |
సూచీముఖ శూర్పకర్ణ శంబర కాలకేయ కాలదంష్ట్ర వృశ్చికరోమ ధూ
మ్రాక్ష కపిలాక్ష వామనదందశూకప్రముఖప్రథమబర్హిర్ముఖులు శతమఖుం
బొదివి రాజానుమతంబున నాజినైపుణంబు మెఱయుటయు హరిహయుండు
కుండలితకోదండుం డై వేదండంబు దీకొలిపి కాకోలకీలికీలాకలాపరూపంబు
లగుతూపుల నాపిశితాశనులం గసిమసంగుటయు సింగంబుకరణిం బొంగి
యసాదసంగరాహ్లాదుం డగు ప్రహ్లాదుండు పాదరసంబుకరణిం ద్రొక్కనిచో
టులు ద్రొక్కుచు నుక్కు మెఱయుతురంగమంబుం బంచవిధగతితరంగితంబు
గం గదలించి తనపేరు ముదలించి యదలించి ప్రదరపంచకంబున నహ
ల్యావంచకు నొంచియు సప్తసాయకంబుల సప్తజిహ్వు రంహంబు నాఁగియు
మూఁడువాడితూపుల నంతకుఁ బ్రశాంతుం గావించియు నిశాటువిపాట
దశకంబునం బాటితలలాటతలుం జేసియుఁ బాశపాణి నాశుగననకంబున
నవకంబు చెఱచియుఁ బవనుఁ బవనజనంబు లగుపండ్రెడువెడందవాఁడితూ
వుల నే పణంచియు ధనదు నెనిమిదివిశిఖంబులఁ బిశితమయశరీరుం గావిం
చియు నీశానుం గృశానుజ్వాలాచటులంబు లగుబలుగోలలు పదునొకంట
గెంటించియు మిన్నంట నార్చి పేర్చిన [20]దివిజనివహంబు లుపచితాగ్రహంబు
లుగం బొంగారి చెలంగె.
| 103
|
చ. |
మరలక రాక్షసేశ్వరకుమారుఁడు భల్లయుగంబు నేసి ని
ర్జరపతికేతనంబును నిశాకరవిస్ఫురదాతపత్రము
న్మురియలు సేసి వేఱొక యమోఘశరంబున విల్లు ద్రుంప న
చ్చెరు వెదఁ బిచ్చలింపఁగ శచీవిభుఁ డన్యధనుర్లతాగ్రుఁ డై.
| 104
|
ఇంద్రుఁడు ప్రహ్లాదునకు బోధించుట
క. |
శర మరివోసి చతుర్దం, తరుచిరదంతావళాద్రి ధారాధరమౌ
గరువంపుమేను వెలయఁగఁ, బరిపంథిం బలుకుఁ బ్రౌఢభాషారభటిన్.
| 105
|
క. |
భగవత్పదయుగభక్తియు, సుగుణంబులు విడిచి నీకు సురసైన్యముతోఁ
దగునే కయ్యము సేయఁగ, నగవే లోకంబు లసురనాయక నిన్నున్.
| 106
|
గీ. |
కప్పయెలుఁగుపాముగతి మేఁకవన్నియ, పులి విధాన నీవు పొంచి యుండి
సురల భూమిసురులఁ జుఱవుచ్చుటకు నిది, వేళ యయ్యెఁ గాదె వినయదూర.
| 107
|
సీ. |
పుల్లకండపుఁగొండ పొడిసేసి చల్లిన నుప్పు మానునె లవణోదవేల
ప్రోది నావులపాలు పోసి పెంచిన నైనఁ దొలఁగునే పాముకోఱల విషంబు
నిండఁ బాదునఁ దేనె నించి పెంచినయేని వెడచేఁదు మానునే వేఁపమ్రాను
కప్పురం బెరువుగా గుప్పళంచిననాఁడు నుల్లిదుర్గంధంబు నోసరిలునె
తఱచు మెఱుఁగిడ్డ నిత్త డిత్తడియె కాక , హాటకాభరణాకార మందునోటు
చదువు లేరాళముగఁ జాలఁ జదువుచున్నఁ, దొలుతవేల్పులఁ బాయునే దుర్గుణంబు.
| 108
|
చ. |
జనకుఁడు కోప మెత్తి నినుఁ జంపఁ గడంగి నిశాటవీరులం
బనిచిన వారు తీవ్రతరబాధల నొంప దృఢానుకంప న
వ్వననిధిశాయి గాచె దగవా పగవాఁడవె పోలె నాజనా
ర్దనుదెస నీసడించెదవు దానవనాయక నీకు నాయమే.
| 109
|
ఉ. |
అక్షతదానవైభవవిహారుల కేనియు ధర్మసంహితా
ధ్యక్షులకైన నాత్మవిదు లైనమహాత్ముల కైన నెందుఁ బ్ర
త్యక్షముగాని విష్ణుఁడు ప్రియంబున బాలుఁడ వంచు నిన్ను సం
రక్షితుఁ జేసెఁ గాక యసురస్థితి సైఁచునె దానవారికిన్.
| 110
|
శా. |
ఆకంజాక్షకళావిశేష మతిరమ్యం బై భవన్మూర్తియం
దేకాలంబు వసించి యున్నకతనన్ హేమాసురప్రేషితా
నేకాభీలనిశాటహేతివితతున్ హేలాసరోజాతప
త్రాకారంబులఁ గప్పెఁ గాదె మును ని న్నాహా వివేకింపవే.
| 111
|
చ. |
హరిపదభక్తియుక్తి విడనాడి నిశాచరబోధయూథముం
బిరిగొని రాజ్యగర్వమున మీఁదటికార్యము నెన్నలేక యీ
బరువలఁ గూడి సత్యమును బాడియుఁ దప్పి చరించునీకు మా
కరివరదుండు తోడగునె కల్గునె భద్రము లెందుఁ బోయినన్.
| 112
|
చ. |
పెనగొని నీవు నే ననఁగ భేద మొకింతయు లేక ప్రాణముం
ధనువును బోలె నున్నయెడ ధర్మపథస్థితిఁ దప్పఁ ద్రొక్కి నీ
ననిమిషలోకకాంక్ష మది నందితివేనియు నేల కల్గుఁ గో
రినకొలఁదిన్ ఫలించునె యరీణరమాతరుణీవిలాసముల్.
| 113
|
సీ. |
ఘ్రాణకోణాగ్రనిర్గళదుగ్రపవనార్తిఁ గనకాద్రిముఖగిరుల్ గాతుకలఁగ
దంష్ట్రావిటంకసంతతి వహ్నికణములు గుమురులై నలుగడఁ గొండ్లిసూపఁ
జరణాభిహతి విశ్వధరణీతలము వ్రస్సివ్రయ్య లై యురగవర్గములఁ జూప
భ్రుకుటీభయంకరాద్భుతముఖాంబుజమున మూఁడుకన్నులు ఱెప్పమూయకలర
హరి నృసింహావతారువిస్ఫురణ మెఱయఁ, గంబమునఁ బుట్టి మీతండ్రి గఠిననఖర
శిఖలఁ జెండాడునపుడు నీచేర్వదొరలుఁ, [21]ధూళి బ్రుంగిరొ గగనంబు దూఁటి చనిరొ.
| 114
|
క. |
కూటికి నీటికినై నిను, మాటికిమాటికినిఁ గపటమార్గంబున జం
జాటములఁ ద్రిప్పు దుష్టని, శాటులపొం దేల నీకు ననఘవిచారా.
| 115
|
సీ. |
శ్రీవత్సకౌస్తుభశ్రీసమావృతవక్షు నంభోరుహాక్షుఁ గృపార్ద్రవీక్షు
నాశ్రితావనదక్షు వీలు నాదిమధ్యాంతవిరహితుని యోగముద్రాసహితుని
బ్రహ్మరుద్రాదిభర్మకిరీటకోటిసంఘటితరత్నప్రభాకవచితాంఘ్రి
నఖిలజగత్పూర్ణు నసితనారసవర్ణు యిమనోభ్యర్ణు లాలితసుపర్ణు
నాదిదేవు సమస్తేంద్రియార్థగమ్యు, సౌమ్యు ధృతశంఖచక్రు శ్రీరమ్యమూర్తి
విడిచితివి గాన నింక నీవిభవ మెల్ల, దినదినంబున కవధిమై జను నిజంబు.
| 116
|
వ. |
అని పురందరుండు వలికిన హిరణ్యకశిపునందనుం డిట్లనియె.
| 117
|
చ. |
హరికిని నీకు నేమి పని యాయన న న్నెఱుఁ గే నెఱుంగుదున్
హరి నటు లుండనిమ్ము తులువాఁ బలువా దొనరింపఁ బోవునే
పరుషవిరోధియూథకృతబాధలు యోధులు మెచ్చ నాపయిం
గరిఁ బురికొల్పు పొల్పమరఁ గయ్యము సేయుము. వేయు నేటికిన్.
| 118
|
గీ. |
శూద్రవృత్తి గాఁగ సురలోకసౌఖ్యంబు, లిన్నినాళ్లు నీవ యేకహేళిఁ
గైవసంబు చేసి తీవలదా యింక, నాకు నేలుబడికి నాకపురము.
| 119
|
క. |
చిలువదొర లిచ్చి రందఱు, బలిపద్మము తనకు వసుధ వాయక నాయీ
వలమూఁపునందు నున్నది, కులిశాయుధ నాకమేలుకొదవయ తక్కున్.
| 120
|
గీ. |
అడిచిపడకుము నాకంబు విడిచి వేగ, నీదుకుళకంబు నీవును నేఁడె వెడలు
మద్భుజాయత్త మమరధామంబు నీకు, నన్యవిత్తాపహరణంబు ధన్య మగునె.
| 121
|
క. |
తొడివినజో డే విడువం, బొడిచి యొడిచి వేల్పుగములఁ బోనొత్తి రయం
బడర సుధాశనలోకము, గడిమేరగఁ దోరణంబు గట్టక వింటే.
| 122
|
క. |
నీ వేగుము వలసినకడ, కీవిబుధావాస మేన యేలెద ననుడున్
దేవేంద్రుఁ డాగ్రహంబున, దేవారిం జూచి పలుకు ధృతపవి యగుచున్.
| 123
|
క. |
గుడినుండి కోయఁ జూచెదు, గుడిత్రాళ్లను మమ్ముఁ గూడుకొని వర్తిలి మా
కడఁ జెట్టుగట్టి పొత్తునఁ, గుడిచితి విన్నాళ్లు దుష్టగుణ మిది తగునే.
| 124
|
క. |
భల్లూకచర్మ ముదికినఁ, దెల్ల నగునె దుష్టకష్టదితికులజుఁడ వీ
వుల్లంఘించుచు సుమనో, వాల్లభ్యము నొందఁగలవె వక్రవిచారా.
| 125
|
వ. |
అనిన దనుజరాజతనూజుం డొం డాడనేరక వదనమండలంబు వంచి మిన్నక
యుండినం దద్వైలక్ష్యం బుపలక్షించి యతనిపితృవ్యుం డగు ధూమ్రాక్షుండు
సహస్రాక్షుతో నిట్లనియె.
| 126
|
ప్రహ్లాదుండు నిరుత్తరుం డైన నింద్రునకు ధూమ్రాక్షుం డుత్తర మిచ్చుట
ఉ. |
మాటలు నేర్తు నే ననుచు మాటికి మాటికి నుగ్రసంగరా
స్ఫోటితశత్రు వైన దనుపుత్రకుమారను మీఱి పల్కుఝం
ఝాటము గీటముం దగునె యద్భుతవిక్రమశాలికి న్నిరా
ఘాటభుజాసిపాటవము గల్గినఁ జూపుము శక్ర యిక్కడన్.
| 127
|
సీ. |
నాకపట్టన మెల్ల [22]డాకమై భేదించి నందనవనమును నఱకివైచి
సిద్ధరసంబులు చీకాకుపడఁజేసి తెఱవల నందఱఁ జెఱలువట్టి
హరిదంతిదంతకుంతాగ్రంబు లగలించి గ్రొచ్చి పెన్నిధు లెల్లఁ గొల్లలాడి
పరమేశసఖుని పుష్పకము గైకొని జగద్విదితంబుగా నేకవీరుఁ డైన
యాహిరణ్యకశిపుఁడు మాయామనుష్య, మృగముచే దైవవశమునఁ దెగినకతన
నేఁడు ఱెక్కలు వచ్చెనే నిర్జరులకు, నీకు నాకేశ యింత [23]యుత్సేక మేల.
| 128
|
శా. |
ఆదైత్యేంద్రుకుమారుఁ డై వెలయు ప్రహ్లాదుం డమర్యాద బా
హాదర్పంబున నెల్లభూపతులఁ గయ్యాలం దిగంద్రోచి నేఁ
డీ దేవావసధంబుఁ గైకొనఁగ ని ట్లేతెంచె నీవిక్రమ
శ్రీదాక్షిణ్యపరాయణుం గెలువ నేర్తే ధూర్తచర్యానిధీ.
| 129
|
చ. |
సురవర నీపరాక్రమముచొప్పు సమస్తము నీఱు గప్ప సం
గరమున దానవాకలితకర్కశబాణము లోర్వలేక బ
ల్బిరు దని విష్ణుఁ జూపి వెఱపించెద విక్కడ మమ్ము నక్కటా
యురుతలపాదఘట్టనల నూఁగునె తూఁగునె సాలసాలముల్.
| 130
|
క. |
త్రిజగములుఁ జుట్టి యెవ్వఁడు, భుజబలమున నాక్రమించుఁ బూర్ణోదయుఁ డై
విజయంబుఁ గన్నయవ్విభు, భజియింతురు దేవుఁ డనుచుఁ బ్రజ లమరేంద్రా.
| 131
|
గీ. |
మాట లేల శక్ర మగుడుము ప్రాణంబు, గాచుకొనుము గాక కదనవీథి
నిలువ గలిగితేని నేఁ డెఱుంగఁగవచ్చు, నిర్జరారిబలము నీబలంబు.
| 132
|
సీ. |
అదె చూడు మంబోధు లాపోశనము చేసి త్రావనోపిన కాలదంష్ట్రబలుల
నాలోకనముచేయు మఖిలమత్తారిదంతావళహర్యక్షు డందశూకు
వీక్షింపు మంభోరుహాక్షుతోఁ బెనఁగంగఁ జాలిన కపిలాక్షశంబరులను
దర్శింపు మఖిలదిగ్దంతి దంతము లూడఁ దిగిచి పాఱఁగ వైచు గగనచరుని
వీరలయ కాదు ప్రహ్లాదవీట వీరి, కినుమణుంగగు దైత్యు లనేకు లున్న
వారు నీపౌరుషం బింక వారిమీఁదఁ, బ్రతిఫలింపదు చనుము నిర్జరవరేణ్య.
| 133
|
చ. |
అనఁ గనలెత్తి దేవవిభుఁ డాశుగవేగసముజ్జ్వలాశుగం
బున దను భూపితృవ్యుశిరముం గరముధ్ధతిఁ దున్మెఁ దున్మ ద
ద్ఘనతరరక్తధార దివి గట్టి నభోవలయాతపత్రకీ
లనమునఁ బొల్చు విద్రుమశలాకయుఁ బోలెఁ ద్రిలోకభీమమై.
| 134
|
గీ. |
పొదివి దిక్పాలసంఘంబు పోసరింప, వాసవుం డెసరేఁగి దైవతవిరోధి
వరవరూధినిఁ జెండాడె వనద ముగ్ర, సృష్టి బద్మాటవుల నొంచువిధముగదుర.
| 135
|
చ. |
తనపినతండ్రిఁ జంపిన సుధాభుగధీశ్వరుమీఁదఁ గల్పవ
హ్నినిభకటాక్షవీక్షణము నించి దితిప్రభవాత్మజుండు ఘో
రనినదచాపవల్లరిఁ గరంబునఁ బానకకీలవోలె శో
భనరుచియై వెలుంగ లయభానుసమానవిభాభిరాముఁ డై.
| 136
|
స్రగ్ధర. |
శరము ల్పుంఖానుపుంఖోచ్చలితగతి నభశ్చారి యై తూఱనేయం
గరిరాజుం గొల్పి దైత్యోత్కరము నుఱిచి రక్తప్రవాహంబు లుర్విం
దొరుఁగంగాఁ జేసి యేసెన్ దురధిగమజయోద్యోగపద్యావిహార
స్ఫురణ దేవేంద్రుఁ డగ్నిస్ఫురదిషువితతు ల్భూతము ల్ఫీతి నొందన్.
| 137
|
క. |
జంభారి వైచె దితిసుత, డింభకుమీఁదన్ శతఘ్ని డెప్పర మగుసం
రంభంబునఁ దత్కీలా, సంభారము భువనములకు సాధ్వస మొసఁగన్.
| 138
|
క. |
శూలమున నసుర దానిం, దూలిచి లయకాలకుపితధూర్జటివోలెం
గ్రాలఁగఁ గనుఁగొని విశిఖ, జ్వాలల జంభారి దివిజశత్రుం బొదివెన్.
| 139
|
చ. |
పొదివినఁ గోపమెత్తి దితిపుత్రతనూభవుఁ డాబిడౌజుహ
స్తిదళన మాచరించి నలుదిక్కుల ఘూర్ణిలు సేన మానసం
పద పదలింప నిర్ణరసమాజము లార్వ బలారి కూల్చె నొ
ప్పిద మగుతత్కిరీటముఁ గృపీటభవోపమకాంతికూటమున్.
| 140
|
క. |
కరిపతి దూలిన నిర్జర, [24]పరివృఢుఁ డరదంబు నెక్కి భాసిల్లుటయున్
హరి డిగ్గి దానవాధీ, శ్వరుఁడు న్రథమెక్కె, విజయశంఖము లులియన్.
| 141
|
వ. |
పావకపాథోధిపతి ప్రముఖదిక్పాలపాలితం బగుగరుడగంధర్వకిన్నరకింపురుష
సేనాకలాపంబు లాపురందరుం బొదివికొని యుండెఁ, గాలజంఘ కాలదంష్ట్ర
కాలకేయ శంబర దీర్ఘజంఘ సూచీముఖ వామనాది పలాదులు, ప్రహ్లాదునకు
బాసట యై యాహ్లాదంబు సేయుచుండి రయ్యెడ.
| 142
|
సీ. |
జంభశుద్ధాంతరాజనిభాననాఘనస్తనహారహారియై తనకు నెద్ది
పాకకోకస్తనీశోకానలోద్భూతిసామిధేనీస్ఫూర్తి జరగు నెద్ది
బలవధూదరహాసభాసమానమృణాళఖండనహంసమై యుండు నెద్ది
నముచిమానవతీజనప్రేక్షణాంజనతిమిరేందుకాంతియై యమరు నెద్ది
యట్టివజ్రంబుఁ గెంగేల హరిహయుండు, పూనుటయుఁ బాశుపత మెత్తెఁ బూర్వదివిజుఁ
డమ్మహాయోధవీరులయాగ్రహమున, నిగ్రహము నొందె నల భూతనివహమెల్ల.
| 143
|
క. |
బలరిపువజ్రము దానవ, కులతిలకము పాశుపతము గొదకొని పెనఁగన్
జలజల విలయానలకణ, ములు దొరఁగెన్ జగము లొరగె మురముర వెరిఁగెన్.
| 144
|
వ. |
అయ్యవసరంబున నయ్యాతుధానప్రధానపురుషు లగువామన వ్యాఘ్రగ
మన శిఖావళప్రముఖు లగునిశాచరవీరులు ఘోరాకారు లై గండశిలల
ఱువ్వియుఁ గొండ లెత్తి వైచియుఁ దరుషండంబుల నొండొండ మోదియు
నాదిత్య [25]వరూధినికి నిరోధంబు [26]గావించి రప్పు డప్పూర్వకకుప్పతియను
మతి ననలుండు కనలి విశాలజ్వాలాజాలంబు నిగిడించినం జిమిడియుఁ
జీకాకుపడియునుం గమరియుం గాలుమట్లం బోయియును నుడికియు నోటఱి
యుం గలంగియు నలంగియుం గూలియుం దూలియు వావిచ్చియు నొచ్చి
యుఁ బూర్వవియచ్చరనికరంబు కరంబు సంక్షోభించె నాసంరంభంబు జగ
త్రయసంధినిర్భేదననిష్ఠురం బగుచు నుండె వెండియు.
| 145
|
గీ. |
దేవవిభుతోడ దానవాధిపుఁడు పోరెఁ, గడిమిఁగరితోడఁ బోరుసింగంబుఁబోలె
మదము విడనాడి సత్త్వసామగ్రి విడిచి, విఱిగె విబుధేంద్రుఁ డసురేంద్రువేగమునకు.
| 146
|
క. |
సురపతి దెరలినఁ దెరలె, న్సురబలములు జలధియుబ్బు సొరిగినతరిఁ బూఁ
దెరలు గరువంబు సడలిన, వెరవునఁ జింతావివర్ణవివృతముఖము లై.
| 147
|
గీ. |
ఆహిరణ్యకశిపునాత్మసంభవుఁ డాప్త, బలముతోడ బాహుబలముతోడ
సురపురంబు సొచ్చి సుఖముండె ననుటయు, శౌనకాదిమునివితాన మపుడు.
| 148
|
వ. |
పరమాశ్చర్యనిర్మగ్నమానసం బై హర్షోత్కర్షంబున రోమహర్షణుం బలికె
నయ్యా యయ్యాతుధానునకుం బురుహూతుండు విరుగుట నిగమవిరుద్ధం
బిది యేకరణి సిద్ధాంతీకరించి నాక్రుచ్చితి రనవుడు నతం డమ్మునివేతండ
తండంబుతో నిట్లనియె.
| 149
|
చ. |
కలదు రహస్య మాదివిజకాంతుఁడు ము న్నొకనాఁడు కొల్వులో
పల విభవాభిరాముఁ డయి భాసిలుచుండఁగ నట్టిచోటికి
న్విలయకృశానుసన్నిభనవీనరుచిం జను పెందెంచె మౌను లిం
పలరుచుఁ గొల్వఁ గోపనమహాముని భీమతరప్రభావుఁ డై.
| 150
|
క. |
అరిమర్దనంబు రాజ్య, స్ఫురకణంబును గలుగుకతనఁ బొంగారి సురే
శ్వరుఁ డాదుర్వాసోముని, వరుఁ బూజింపక వికారవశుఁ డై యుండన్.
| 151
|
వ. |
సమూలఘాతంబుగ నిఖిలసురసంఘాతంబు మమ్మాలింపం జాలియు నాకా
లాంతకనిభుండు వేళాగుణంబున శాంతుం డై శచీకాంతు నైశ్వర్యంబు నిశా
చరాయత్తం బగుఁగాక యని తన చిత్తంబులోనం దలంచి చనియెం గావున
దేవపతికి నియ్యవమానంబు వాటిల్లె నదియునుం గాక.
| 152
|
క. |
ఆరీతివీరుతో సరి, పోరినదేవేంద్రుమహిమఁ బొగడఁగఁ దగదే
మారుతముమీఁద వేఱొక, మారుతమఱుగ్రమ్మినట్టిమతమై తోఁచెన్.
| 153
|
క. |
గురువులయెడ విప్రులయెడఁ, బరిభవ మొనరించువాని భాగ్యశ్రీ న
శ్వర యగు గాలి నిడినదీ, పరుచియునుం బోలెఁ దరళభావోదయ యై.
| 154
|
వ. |
ఇవ్విధంబున విబుధమానమర్దననిర్దయుం డగు పూర్వగీర్వాణశ్రేష్ఠుండు నిష్ఠుర
పరాక్రమక్రీడావశీకృతలోకత్రయుం డై నాకం బేకాతపవారణంబుగ నేలు
చుం బెద్దకాలం బుండె నాఖండలుండును నఖండశోకవ్యాకులహృదయుం
డై నాకౌకోలోకంబుతోడ లోకాలోకగుహాగేహంబుల దేహంబులు చొ
నిపి వనరుచు నపజయక్లేశంబున గాసిల్లుచు నుండె నంత నొక్కనాఁడు.
| 155
|
స్వర్గం బేలు ప్రహ్లాదునికడకు శుక్రాచార్యులు వచ్చుట
సీ. |
నెమ్మనితేజంబు నింగి యంతయు మ్రింగి వేఱొక్కసూర్యునివిధము సేయఁ
గరకల్పశాఖావికస్వరఫలలీల నిద్దంపుతీర్థకుండిక వెలుంగఁ
బరమపావనదృక్ప్రభావిభావంబున నజ్ఞులకును బోధ మావహిల్లఁ
గొలిచివచ్చిన శిష్యకులము బ్రహ్మ భజించు దివ్యమౌనులలీల దేజరిల్లఁ
జుక్క తెగి పడినట్టులు శుక్రుఁ డాత్మ, భవనవాటిక సొచ్చి రాఁ బ్రథమదివిజ
పుంగవుఁడు నిర్బరానందపులకితాంగుఁ డగుచుఁ బూజించె నాదేశికాగ్రగణ్యు.
| 156
|
క. |
పూజించి తెచ్చి నిజమృగ, రాజమణిపీఠి నునిచి ప్రాంజలి యగుచున్
వేజాడల నుతియించెఁ బ, యోజాసనుఁ బొగడు నిగమమో యితఁ డనఁగన్.
| 157
|
ఉ. |
ఆదర మొప్ప శుక్రుఁ డమరాహితనందను నిందుకాంతసం
పాదితపీఠిపై నునిచి పల్కు హిరణ్యనిశాటపుత్ర యా
హ్లాద మొనర్చె నీచరిత మంతయు మాకు నశేషశోకవి
చ్ఛేదిని యయ్యె నీభుజవిశేషవిజృంభితశక్తి యుక్తియున్.
| 158
|
మ. |
జనకుం జంపిన క్రించు వీఁ డని రమాజాని న్విసర్జించి నీ
యనిఁగుందమ్ములు నెల్లబాంధవులు గాఢానందపాథోధిమ
జ్జనముం జేయ మహేంద్రు గెల్చి త్రిదివేశత్వంబునుం బొంది వం
దనము ల్గొంటివి శత్రుజాలములచేతన్ ధూతధూర్తప్రజా.
| 159
|
సీ. |
నీప్రతాపము నోర్వనేరక రిపులక్ష్మి నీవెల్లగొడుగుక్రొన్నీడ నిలిచె
నీకృపాణీధార నిచ్చెనగా నెక్కె సీవలపటిమూఁపు నేలగోల
నీగుణగంధ మానెడువేడ్క సుజనషట్పదములు నీదండఁ బాయ వెపుడు
నీవితీర్ణికి నోడి నీరాకరము నీదుదానాంబుధారలఁ దగులుకొనియె
నిన్ను వర్ణింప నెవ్వారు నేర్చువారు, దానవాన్వయసౌధకార్తస్వరఘట
నిన్నుఁ జూచినదివసంబు నిఖలభోగ, భాగ్యసౌభాగ్యములకుఁ జేపట్టు గాదె.
| 160
|
క. |
నీరాంజలిఁ దృష్ణాతుర, పూరుషు లాసించులీలఁ బోరుల నిన్నున్
వైరిజనహరణమునకుం, గోరెడుమాకోర్కె నేఁడు కొనసాగెఁజుమీ.
| 161
|
క. |
మాదానవపతి నాతో, నాదగునందనులు వినయనయశాలులు ప్ర
హ్లాదుఁ డనుహ్లాదుఁడు సం, హ్లాదుఁడు హ్లాదుండు ననుట నవి ఫలియించెన్.
| 162
|
క. |
హరిహయశిఖయమసురరిపు, శరధిపపవమానశంభుసఖశంకరులన్
దురమునఁ గింకరులం బలె, శరతాడనపీడ నొంపఁ జను నీ కనఘా.
| 163
|
క. |
వంచినతల యెత్తనిన, క్తంచరులకు నేఁడు గలిగె దానవవర య
భ్యంచిత జము నీదుభు, జాంచలకరవాలకీల యలరుటకతనన్.
| 164
|
శా. |
పాతాళంబును భూతలంబు దివియుం బాలించె మీతండ్రి నీ
వాతీండ్ర న్వెలుఁ గొందియున్కి సుభటాహ్లాదంబు నొందించె నీ
వాతంకంబులు మాన్చి రక్షణము సేయం బాడి యీదానన
వ్రాతంబుం బరిపంథిమర్దనవిధావైదగ్ధ్యహృద్యంబుగన్.
| 165
|
క. |
నావిని ప్రహ్లాదుఁడు ర, క్షోవంశాచార్యుఁ బల్కు సుజనస్తుత నీ
పావనకటాక్షవీక్షా, శ్రీవైభవ మిట్లు నాకు సిరు లొనగూర్చెన్.
| 166
|
క. |
నాతరమా పోతరమున, ఘాతుకు లై యున్న సురలఁ గసిమసఁగఁగ ను
ద్యోతితభవదనుకంపా, ఖ్యాతియె యనిఁ దనకు వజ్రకవచం బయ్యెన్.
| 167
|
చ. |
అనవుఁడు నల్ల నవ్వి దనుజాన్వయదేశికుఁ డమ్మహాత్ముహ
స్తనలినలాలనంబునఁ బ్రసన్నమతి న్మెయి డుల్పి మౌళి మూ
ర్కొని పులకించి హర్షరసగుంభితబాష్పకణార్ద్రనేత్రుఁ డై
ఘననిభకంఠనిస్వనముగా బలుకు న్సభికు ల్నుతింపఁగన్.
| 168
|
శా. |
అన్నా వెన్నుని నమ్మగా వలదు మాయానాట్యకేళీరతుం
డన్నారాయణుఁ డాదితేయులకు రంధ్రాన్వేషసంపాదియై
యిన్నీసంపద లన్నియుం [27]గిలిబి తానిచ్చు న్నిజం బీవు సం
పన్నప్రౌఢి వహించి యేమఱకుమీ ప్రత్యర్థికృత్యంబులన్.
| 169
|
క. |
అని బుద్ధి చెప్పి ప్రహ్లా, దుని వీడ్కొని శుక్రుఁ డరిగె దుర్దమతేజో
దినకరబింబము మిన్నున, గనగనయని వెలుఁగ నయనకౌతుకకరుఁడై.
| 170
|
వ. |
ప్రహ్లాదుండు నసాదప్రమోదమేదురహృదయుండై దనుజగురువచనరచన
వలన జాగరూకుం డై నాగలోక నరావాస నాకపురంబు లేకచ్ఛత్రంబుగా
నేలుచు నుండె నిట్లు బహుతిథం బగు కాలం బతీతం బగుటయు నగధరుండు
నగవిరోధిప్రముఖబర్హికులపరాభవప్రతీకారంబు నిజాంతఃకరణంబునం జిం
తించి కృతనిశ్చయుండై యుండె నంత నొక్కనాఁడు.
| 171
|
క. |
ఊదరదాఁకినకుడ్యవి, భేదకతతివోలెఁ బాకభిన్ముఖదివిజుల్
వేదనలఁ బొరలి రాప్ర, హ్లాదునిచే నిజవిభూతి యపహృత యగుటన్.
| 172
|
గీ. |
అఖిలలోకరక్షుఁ డగుపుండరీకాక్షు, శరణు చొరఁ దలంచి సురలు మునులు
సత్యలోకనాథుసమ్ముఖమ్మున కేగి, యతఁడుఁ దారుఁ గూడి యాక్షణంబ.
| 173
|
వ. |
వైకుంఠవాసు వాసుదేవు వనధరశ్యాము వనమాలి వందారుమందారం
బుం గనుంగొని రెట్లనిన.
| 174
|
క. |
శరణాగతపరిరక్షణ, కరణా ఋగ్వేదిజననికాయాభరణా
పరిణాహిశుభవ్యంజన, చరణా రణదళితశత్రుచయసంసరణా.
| 175
|
ఉ. |
నీరధిరాడ్గభీర హిమనిర్మలకీర్తివిహార సజ్జనా
ధార సురాద్రిధీర హరిదత్తవిచార కవీంద్రబృందమం
దార విరోధినీరదకదంబసమీర సమస్తపుణ్యవి
స్తార కృపాప్రపూర ఘనధామవిభాకర శోభనాకరా.
| 176
|
భుజంగప్రయాతము. |
మహౌదార్యశీలా సమాఖ్యాలవాలా
మహోవీతిహోత్రా రమావత్కళత్రా
సహాసావలోకా రసాపుణ్యపాకా
గృహీతాశ్రితాళీ నికృత్తాఘపాళీ.
| 177
|
గద్యము. |
ఇది శ్రీహనుమత్కటాక్షలబ్ధవరప్రసాదసహజసారస్వతచంద్రనామాంక
భారద్వాజసగోత్రపవిత్ర రామవిద్వన్మణికుమా రాష్టఘంటావధానపరమే
శ్వర హరిభట్టారకప్రణీతం బైన నరసింహపురాణోక్తం బగు నుత్తరభాగంబు
నందు వర్షాదశవర్ణనంబును బ్రహ్లాదుండు సంక్రందనుమీఁద దండు వెడలు
టయు నసురవరచకితుం డై యాఖండలుండు చిత్రశిఖండిప్రసూతివినీతిమార్గం
బడుగుటయును, సురాసురయుద్ధంబును నందు వృద్ధశ్రవుపలాయనంబును
దితిసుతసూతి నాకలోకం బేలుటయు ననుకథలంగల చతుర్థాశ్వాసము.
|
|