నాగర సర్వస్వం/స్వభార్యారక్షణ

వివరించి వివరించి - ఆదూతిక ఆయువతి మనస్సు స్వాధీనం తప్పునట్లు, ఆ పరపురుషునిపై లగ్నమగునట్లు చేయాలి. ఈ పనిచేస్తూ దూతిక అనుక్షణము ఆవనితయొక్క మనస్సులోని భావాలను ఆమె ముఖలక్షణాలద్వారా గ్రహిస్తూ తగినట్లు వ్యవహరించాలి అప్పుడా యువతి మానసంలో మన్మధుడు తిష్ఠ వేసుకొని కూర్చుంటాడు, ఆమెలో కామాగ్ని ప్రజ్వరిల్లుతుంది. అపుడామె బిగింపు విడచి తన అంగీకారము నామెకు తెలుపుటయేకాక తల్లివెంట బిడ్డ నడచినట్లు దూతిక వెంటనడచి వెడుతుంది.

ఈపనిని సాధించుటకు దూతికకు ఎంతకాలం పడుతుంది? అన్న విషయం ఆదూతిక నేర్పుమీది ఆపరవనితయొక్క బిగింపుమీద ఆధారపడిఉంటుంది. దూతిక నేర్పుకలదై ఉండి ఆ పరవనితలో బిగింపు తక్కువగావుంటే ఒకటి రెండురోజులలోనే కార్యం సఫలంకావచ్చును. అట్లుకాక ఆపరవనితలో బిగింపు ఎక్కువగాఉంటే దూతిక అప్పుడప్పుడువెళ్ళి తనకార్యానికి అనుకూలములైన మాటలు చెబుతూ క్రమంగా కార్య సాఫాల్యాన్ని సాధించాలి.

ఈవిధంగా పరస్త్రీలకొరకై లోకంలో ప్రయత్నించడం జరుగుతూఉంటుంది. కనుక పురుషుడు తనభార్యను కాపాడుకొనడంలో శ్రద్ధకలవాడైయుండాలి.

స్వభార్యాలక్షణోపాయములు

పురుషుడు భార్యతో పరుషంగా మాట్లాడకూడదు. ఆమెను ప్రేమగా ఆదరిస్తూ ఆమెతో ఏవిషయంచెప్పినా, మృదువుగా మధురంగా చెప్పాలి. ఊరిబయట తోటలలో విహరించడానికి తీర్ధాలలో సంచరించడానికి, సామూహిక ఉత్సావలలో పాల్గొనడానికి భార్యను పురుషుడు నిషేధించాలేకాని అనుమతించకూడదు. ఒకవేళ అనుమతించినా తాను ఏమరుపాటు వహించరాదు. అంతేకాదు, ఇరుగుపొరుగుల తగవులాటలోకూడ తన భార్య పాల్గొనకుండా పురుషుడు జాగ్రత్త తీసుకొనాలి. తీర్థయాత్ర లయందు, మాటిమాటికి మిక్కిలి తరచుగా బంధువుల ఇండ్లకు వెళ్ళివచ్చుటయందుకూడ పురుషుడు భార్యారక్షణంలో కనుగలిగి, సాధ్యమైనంతవరకు అట్టి యాత్రలను రాకపోకలను నిషేధించాలి. ఇక తనభార్య పొలమునకు వెళ్ళి పనిచేసి వచ్చేదై ఉన్నపుడు పురుషుడు నిత్యము జాగ్రతకలవాడైఉండాలి. అతడు దుశ్చరిత్రలైన వనితలతో తనభార్యను కలిసి తిరుగనీయరాదు.

ఏమంటే - ఆమె భార్య స్వయంగా మంచినడవడి కలదై ఉన్నప్పటికి తన యెవనోద్రికం వలనకాని ఇతరుల ప్రయత్నాల వలన గాని శీలాన్ని కోల్పోవచ్చును. ఒక్కొక్కప్పుడు ఆమె శీలాన్ని ఆమెకు దగ్గరబంధువులైనవారే హరించవచ్చును. 'నీకుపుణ్యంఉంటుంది అంగీకరించు, అంగీకరించకపోతే నేను చచ్చిపోతాను, ఈపాపం నీకు వస్తుంది' - అంటూ పుణ్య పాపాలను అడ్డంపెట్టుకొనికూడ ఆమె శీలాన్ని ఎవరైనా పాడుజేయవచ్చును. ధనాశ కల్పించి శీలభ్రష్టను చేయవచ్చు. నూతిక ఏవో కల్లబొల్లికబురులు చెప్పి, ఆమెకు ఏదో స్వర్గసౌఖ్యం అరచేతిలోచూపిస్తే గూడ ఆమె దారితప్పవచ్చును. అందుచే వారు దారితప్పడానికి ఉన్న అవకాశములన్నిటియందును పురుషుడు జాగరూకుడై ఉండాలి. అంతేకాని 'నాభార్యశీలవతి, పతివ్రత' అనుకొని కండ్లుమూసుకొని కూర్చుంటే ఆవలివాడు చాతుర్యంతో ఆమెశీలాన్ని హరించవచ్చును. తీరాచేసి జరుగకూడని ఆపని (శీలంచెడడం) జరిగినమీదట ఈభర్తఏమిచేసినా ప్రయోజనం శూన్యమే. అందుచే స్వభార్యా శీలరక్షణంలో ప్రతిపురుషుడు అప్రమత్తుడై ఉండాలి. సుందరులైన పురుషుల ఎదుట ఆమెచేష్టలు ఎలాఉన్నాయి. అన్నవిషయం వివేకంతో పరిశీలిస్తూ ఉండాలి.

ఇలా చెప్పబడ్డదికదా అని భార్యను ఎల్లపుడు అనుమానిస్తూ ఆమెకు కాలు కదపడానికికూడ అవకాశమీయక భర్తద్వారాపాలకుడై కూర్చుంటే - ఆమె ఎవరిద్వారానో ప్రేరితయైకాక తనంత తానే ఈ పెడదారిలో ప్రవేశిస్తుంది. అందుచే భార్యకు తగినంత స్వాతంత్ర్యం ఇచ్చి, ఆమె శీలరక్షణ విషయంలో జాగరూకుడై ఉండాలేకాని ఆమెను హింసించడం మొదటికే మోసంతెస్తుందని పురుషుడు గ్రహించాలి.


★ ★ ★