నాగర సర్వస్వం/పరవనితా భేదాలు
వారు మహాత్ములు. ఇక పరవనితను పొందకపోతే ప్రాణం పోతుందన్న దశయందు మాత్రమే పరవనితాసక్తులయ్యేవారు ఉత్తములు. పరవనితను పొందకపోతే తన ప్రాణానికి కలిగే ముప్పు ఏమీ లేకపోయినా దుర్వాంఛాపూర్తికై కంటబడిన ప్రతికాంత కొరకు ప్రాకులాడేవారు అధములు. ఈవరుసలో ద్వితీయుల నుద్దేశించి మాత్రమే కామశాస్త్రములయందు పరదారగమనము చెప్పబడ్డది.
పరదారాగమనము కామశాస్త్రాలలో చెప్పబడుటలో వేరొక ప్రధానోద్దేశము స్వభార్యారక్షణము, తాను పరస్త్రీ కొరకు ప్రయత్నించకపోయినా పరుడెవరో దుష్టుడు తన భార్యపై కన్నువైచి యత్నించవచ్చు. వానియొక్క యత్నస్వరూపం తెలిస్తే ఆదియందే తాను జాగ్రత్త పడడానికి వీలు. ఆయత్న స్వరూపము తెలియాలి అంటే పరదారగమన విధులెట్టివో తాను తెలిసికొనాలికదా ! అట్టి తెలివిడి అందరకు కలిగించుటకే శాస్త్రములలో పరదారగమనం చెప్పబడ్డది. ఈదృష్టితో చూస్తే పరదారగమన మన్న విషయం ధర్మానికి ఎంత రక్షాకవచమై ఉన్నదో, కామశాస్త్రగ్రంథాలలో దీని స్థానం ఎంత ఉన్నతమో వెల్లడి అవుతుంది.
అదీకాక ఇతర శాస్త్రాలవలెనే ఈశాస్త్రముకూడ ఋషులచే ప్రవచించబడినదే కాని యెవరో సాధారణులు చెప్పినదికాదు. అందుచే ఈవిషయమును అగౌరవపరచుట అవివేకము. ప్రాణాపాయస్థితిలో ప్రాణరక్షణకు, స్వభార్యాశీల రక్షణకు ఉపయోగించే పరస్త్రీగమన విధానాలు ఈ ప్రకరణంలో తెలుపబడుతున్నాయి.
పరవనితా భేదాలు :
స్త్రీలు అయత్నసాధ్యలు, సాధ్యులు, అసాధ్యులు అని మూడు రకాలుగా ఉన్నారు. ఏప్రయత్నము అక్కరలేకయే సులభంగా పరపురుషునకు వశమయ్యే స్త్రీలు ఆయత్నసాధ్యలు. వీరినే సులభసాధ్యలు అని కూడ అంటారు. కొంత ప్రయత్నంతో పరపురుషునకు లొంగివచ్చే స్త్రీలు సాధ్యలు. వీరిని ప్రయత్నసాధ్యలు అనికూడ అంటారు. ఎంత ప్రయత్నించినా లొంగని వనితలు అసాధ్యలు అనబడతారు. ఈ అసాధ్యల విషయంలో తనక్షేమం కోరుకునే వాడెవడూ యెట్టి ప్రయత్నము చేయకూడదు. ఇక తప్పనిసరి అయిన వేళ ఎవరైనా ప్రయత్నిస్తే ' చావుతప్పి కన్నులొట్టవోయి నదన్న ' సామెతగా వారు చేజిక్కుతారేమోకాని ఆపద్రహితంగా అరచేతిలోనికి వచ్చి వ్రాలడం అన్నది జరుగదు.
ఈ విధంగా పరవనితలు మూడు రకాలుగా ఉన్నందున పురుషుడు తానుకోరే స్త్రీ వీరిలో ఏరకానికి చెందినదో తెలిసికొనడం అవసరం. అందుచే మూడురకాలుగా ఉన్న ఈవనితల లక్షణాలు చెప్పబడుతున్నాయి.
సులభసాధ్యలైన స్త్రీలు
ఏ ప్రయత్నము చేయనక్కర లేకయే పరపురుషునకు లొంగే స్త్రీలు ఆ పరపురుషుని ఎదుట శంకలేకుండా వర్తిస్తారు. 'చూస్తే చూడనియ్యి ' అన్నట్లు తమ స్తనాలను, చంకలను, ఉదరభాగాన్ని (కడుపు) పరపురుషుల ఎదుట మాటిమాటికీ వెల్లడిస్తారు. పరపురుషుని వంకకు సాభిప్రాయంగా చూస్తూ తమపిల్లలను కౌగలించుకొని ముద్దుపెట్టుకొనడం కూడ వీరి లక్షణాలలో ఒకటి.
వీరు పరపురుషుని ఎదుట తమ రెండుచేతులను పైకెత్తి జడ ముడివిప్పి తిరుగముడి వేసుకొనడానికి సిగ్గుపడరు, సరికదా ప్రత్యేకంగా అతని ఎదుటకువచ్చి జుట్టు ముడి సరిగావున్న ఒకసారివిప్పి తిరుగముడి వేసుకొంటారు. జుట్టుముడి విప్పాలన్నప్పుడు రెండుచేతులు పైకిలేవాలి. అలా లేచినపుడు స్త్రీయొక్క స్తనాలు, చంకలు స్ఫుటంగా వెల్లడి అవుతాయి. పరపురుషుల ఎదుట కులస్త్రీలు ఎన్నడూ ఈవిధంగా తమ అవయవాలను వెల్లడించరు. సులభసాధ్యలైన స్తీలు మాత్రమే ఈవిధంగా ఆచరిస్తారు. వీరు పరపురుషుని యెదుట అతడు చూస్తూ ఉండగా తమ స్తనాదులవంకకు మాటిమాటికి చూచుకొంటారు. తమ కంటిరెప్పలపై వ్రేలుంచి మాటిమాటికి తుడుచుకొనుటకూడ వీరి చేష్టలలో ఒకటి.