నవ్విపోదురు గాక నా కేటి సిగ్గు?


నవ్విపోదురు గాక నా కేటి సిగ్గు?

నా యిచ్ఛయే గాక నా కేటి వెరపు?

కలవిహంగమ పక్షముల దేలియాడి

తారకా మణులలో తారనై మెరసి

మాయ మయ్యెదను నా మధురగానమున!

నవ్విపోదురు గాక నా కేటి సిగ్గు?


మొయిలు దోనెలలోన పయనం బొనర్చి

మిన్నెల్ల విహరించి మెరపునై మెరసి

పొడుచు చిన్కునై పడిపోదు నిలకు

నవ్విపోదురు గాక నా కేటి సిగ్గు?


తెలిమబ్బు తెరచాటు చెలి చందమామ

జతగూడి దోబూచి సరసాల నాడి

దిగిరాను దిగిరాను దివినుండి భువికి

నవ్విపోదురు గాక నా కేటి సిగ్గు?


శీకరంబులతోడ చిరుమీలతోడ

నవమౌక్తికములతో నాట్యమ్ము లాడి

జలధి గర్భమ్ము లోపల మున్గిపోదు

నవ్విపోదురు గాక నా కేటి సిగ్గు?


పరువెత్తి పరువెత్తి పవనునితోడ

తరుశాఖ దూరి పత్రములను జేరి

ప్రణయ రహస్యాలు పల్కుచు నుందు;

నవ్విపోదురు గాక నా కేటి సిగ్గు?


అలరుపడంతి జక్కిలిగింత వెట్టి

విరిచేడె పులకింప సరసను బాడి

మరియొక్క ననతోడ మంతనం బాడి

వేరొక్క సుమకాంత వ్రీడ బో గొట్టి

క్రొందేనె సోనల గ్రోలి సోలుటకు

పూవు పూవునకును పోవుచునుందు;

నవ్విపోదురు గాక నా కేటి సిగ్గు?


పక్షి నయ్యెద చిన్ని ఋక్ష మయ్యెదను

మధుప మయ్యెద చందమామ నయ్యెదను

మేఘ మయ్యెద వింత మెరపు నయ్యెదను

అలరు నయ్యెద చిగురాకు నయ్యెదను

పాట నయ్యెద కొండవాగు నయ్యెదను

పవన మయ్యెద వార్దిభంగ మయ్యెదను

ఏలొకో యెప్పుడో యెటులనో గాని

మాయ మయ్యెద నేను మారిపోయెదను.

నవ్విపోదురు గాక నా కేటి సిగ్గు?

నా యిచ్ఛయే గాక నా కేటి వెరపు?