నవవికస్వర దివ్య సౌందర్య మూర్తి


నవవికస్వర దివ్య సౌందర్య మూర్తి

విశ్వసుందరి పరమ పవిత్రమూర్తి

ఉదయలక్ష్మి యవతరించె; నెదురు వోయి

స్వాగతం బిమ్ము గీతికా ప్రసవ మొసగి!


అవిరళ స్వేచ్ఛ వెన్కముం దరయ బోక

వారిదమ్ములు చిత్ర కాశ్మీర రుచుల

బూని విహరించు పశ్చిమ భూధరమున;

రజని రా నున్న దంచు తెల్పంగ రాదె?


శ్యామ లాంబర పరిణాహ సరసిలోన

ప్రణయ లీలా విహర విలాసిను లగు

తారకల గాంచుమా! నీ హృదయము నందు

భావ నక్షత్ర కాంతులు పర్వు నేమొ!