నరసభూపాలీయము
కావ్యాలంకారసంగ్రహము - తృతీయాశ్వాసము
.
|
రమణచరణసేవా
పారాయణ యుభయవంశపావన లక్కాం
బారచితభాగధేయ య
పారకృపాసరస యోబపార్థివనరసా.
| 1
|
తే. |
అవధరింపుము లక్ష్మలక్ష్యముల నెల్ల, నసఘ భవదీయనామధేయాంకితముగ
బహువిభక్తుల నొనరింతుఁ బద్యవితతి, నిచ్చటఁ బ్రబంధజీవితం బె ట్లటన్న.
| 2
|
తే. |
మహితకవితావిలాసినీ మధురతరవి, లాసవిన్యాసములలీల వాసి కెక్క
నవరసంబుల నెఱిఁగింతు నవరసార్థ, గుంభగంభీరతరవచోజృంభణముల.
| 3
|
క. |
పులకండంబులు గలిపిన, నలు పగుసలిలము రసాయనం బగుపగిదిన్
లలితవిభావాదులచే, నలఘు[1]తరస్థాయిభావ మమరున్ రసమై.
| 4
|
స్థాయిభావలక్షణము —
తే. |
గరిమ నదులెన్ని గలిసినఁ గప్పుకొనుచు, జలధి గనుపట్టురీతి [2]సంచారిభావ
సంచయము లెన్ని గలిపిన మించ నీక , తాన కనుపట్టుభావంబు స్థాయి దలఁప.
| 5
|
క. |
ధర శృంగారము హాస్యము, కరుణ[3]యు వీరము భయానకము బీభత్సం
బురురౌద్ర మద్భుతము శాం, తరసంబును రసము లనఁగఁ దనరుం గృతులన్.
| 6
|
క. |
రతిహాస[4]శోకయత్నము, లతిభీతి జుగుప్స రోష మచ్చెరువు శమం
బతులక్రమమున నివి సాం, ప్రతము రసస్థాయిభానభావనఁ జెందున్.
| 7
|
క. |
రసములకుఁ దొమ్మిదింటికిఁ, బొసఁగిన యీస్థాయిభావములకు నోనర్తున్
రసికతలక్షణలక్ష్యము, లసదృశరసశాస్త్రవేత్త లౌ నౌ ననఁగన్.
| 8
|
రతి —
క. |
రమణీమణులకుఁ [5]బురుషుల, కరయఁగ సంభోగవిషయ మగునభిలాష
స్ఫురణము మనములఁ బొడమిన, ధనలో నది రతి యనఁగఁ దగు నె ట్లన్నన్.
| 9
|
ఉ. |
చల్లదనంబె చంద్రునకుఁ జక్కదనంబె ప్రసూనధన్వికిన్
సల్లలితోరుసౌరభ మె చైత్రున కొక్కని కొక్క మేలిమే
తెల్లము గాక నాపతి యుదీర్ణగుణాఢ్యుఁడు నారసింహభూ
వల్లభుఁ డట్లు సర్వగుణవైభవ మెవ్వరికైనఁ గల్గుఁనే.
| 10
|
హాసము —
క. |
చేకొని [6]యహ్రరము లగు, నాకారవికారచేష్ట లాలోకింపన్,
గైకొను మనోవికాస, స్వీకారము హాస మయ్యె విను మె ట్లన్నన్.
| 11
|
చ. |
అదె యిదె వచ్చె వచ్చె నరసాధిపుదాడి యటంచుఁ బాళెము
ల్బెదరి బరీదుఁ డేఁగునెడఁ బెంపఱి ఖానులు వెన్కముందుగాఁ
గదిసి హయాళ నెక్కి హయకంధరము ల్పొడగాన కప్పుడే
చదిపిరి వాజిమస్తముల శత్రు లటంతు శ్రమింతు రెంతయున్.
| 12
|
శోకము —
క. |
హితజనవిర[7]హవ్యథచే, నతిశయ మై జనులమానసాంభోజమునన్
బ్రతిదినముఁ బొడవు దుఃఖం, బతిభూమి వహింప శోక మగు నె ట్లన్నన్.
| 13
|
చ. |
పతుల నృసింహశౌర్యశిఖిపాలుగఁ జేసినయట్టిపాపపు,
నృతధృతి కంతటం జలము జాఱదు మమ్మును దావపావక
ప్రగతులపాలు చేసె నని పల్మఱు రోదన మందువిద్విష
త్సతులకు బాష్పపూరములె చాలు వనానలమున్ హరింపఁగన్.
| 14
|
ఉత్సాహము —
క. |
అత్యున్నతలోకోత్తర, కృత్యంలులు నేను వేఁడి కృతకృత్యు లిలన్
నిత్యము దలఁచు ప్రయత్నం, బత్యంతోత్సాహ మయ్యె నది యె ట్లన్నన్.
| 15
|
మ. |
అసిఁ జెండాడి విపక్షపృక్షముల శౌర్యాగ్నిచ్ఛటం బేల్చి శ
స్త్రసరత్సీరములన్ రణోర్వితలమున్ సంక్షుణ్ణముం జేసి వై
ర్యసృగార్ద్రం బొనరించి ప్రోది గొన కుద్యత్కీర్తి సస్యౌఘము
ల్వెస సిద్ధించునె యంచుఁ బల్కు నరసోర్వీనాథుయోధావళుల్.
| 16
|
భయము —
క. |
క్రూరా[8]కారము చూచిన, నారయ[9] నే జనునిహృదయమందు ననర్థాం
కూరాశంకన మగు నది, ధారుణిలో భయ మనంగఁ దగు నె ట్లన్నన్.
| 17
|
చ. |
అనఘ నృసింహ నీయరి వనావళి కేఁగి గుహాగ్రసుప్తుఁ డై
యని మరలం గలం గని భయంపడి పాఱుచు నాజి కాదు కా
|
|
|
దని సతి దెల్పినం దెలియఁ డౌర నిషాదులఁ జాపహస్తులం
గని విపినేభపంక్తిఁ గని క్రమ్మఱ నాజియకాఁ దలంచుచున్.
| 18
|
జుగుప్స —
క. |
పలలాస్థిశోణితాదులఁ, బలమాఱును జూడ నరుచిభావము లోనం
దళుకొత్తు నిగర్హణ మది, తలపోయ జుగుప్స యనఁగఁ దగు నెట్లన్నన్.
| 19
|
చ. |
తలలు సరోజము ల్మెదడు తండము క్రొన్నురు వెంత్రజాలముల్
జలఫణు లస్థిఖండములు శంఖము లై తగు నెత్రుటేర్లలోఁ
గలభికపాలనౌచయము గ్రక్కున నెక్కి చరించు సంగర
స్థలుల నృసింహనిర్దళితశత్రు వసారసమస్తభూతముల్.
| 20
|
క్రోధము —
క. |
అపకారకారు లగునరు, లపరాధ మొనర్ప [10]నే మహామహునిమనం
బు పరిజ్వలితం బగు నది, యపరిమితక్రోధ మయ్యె నది యె ట్లన్నన్.
| 21
|
చ. |
స్థిరభుజవిక్రమక్రమనృసింహ నృసింహ భవత్కరాగ్రభీ
కరకరవాలసిద్ధుఁ డతిగాఢయశోరససిద్ధిఁ గోరి బం
ధురహయసింధురావళుల తోరణదుర్గకవర్గళోన్నతి
న్నరబలి వెట్టు దుర్మదసనాథరిపుక్షితినాథయూథమున్.
| 22
|
విస్మయము —
క. |
వివిధాపూర్వము లగువ, స్తువులు గనుంగొనినయెడల సుజనునిమది[11]లో
దవిలిన [12]ప్రమోదవిస్తర, మవిరళవిస్మయ మనంగ నగు నె ట్లన్నన్.
| 23
|
చ. |
ధరణి నృసింహభూవరుప్రతాపమహాతప మబ్జజాండక
ర్పరములు నిండి తీవ్రగతి బర్వ నఖర్వసగర్వవైరిభూ
వరులు వడంక సాగుదు రవార్యనవవ్యజనాతపత్రవై
ఖరులు దొలంగఁ జేయుదురు కన్నులఁ జీఁకటి కప్పుచుండఁగన్.
| 24
|
శమము —
క. |
నిరుపమవైరాగ్యాదుల, కిర వై నిశ్చలత పూని హృదయము తిర మై
నరులకుఁ బరిణతిఁ జెందిన, ధరలో నది శమ మనంగఁ దగు నె ట్లన్నన్.
| 25
|
ఉ. |
హోరభవాదిదుఃఖములఁ గుందఁగ నీక నృసింహుఁ డౌర దు
ర్వారఫలప్రదం బగువిరక్తిసుఖం బొనరించె నంచు నీ
వైరులు మౌను లై విపినవాటిని నీవ గురుండ వంచు నీ
పేరిటి యక్షరంబులె జపింతురు శ్రీనరసింహభూవరా.
| 26
|
స్థాయిభావకారణము —
క. |
ఈరసముల కుత్పాదన, కారణము విభావ మనఁగ గల దది ద్వివిధం
బై రంజిలు నాలంబన, మారయ నుద్దీపనంబు ననఁ[13]గ ధరిత్రిన్.
| 27
|
విభావస్వరూపము —
క. |
వనితయుఁ [14]బతియును నాలం, బన మగు నుద్దీపనంబు ప్రాయంబును సొ
మ్మును జేష్టయు మదనాదులు, ననఁ దగు నేర్పఱుతు వీని కగులక్ష్యంబుల్.
| 28
|
ఆలంబనవిభావము —
చ. |
అలరురతిన్ రతీశు దమయంతి నలు న్నలు వొంద ముందు గా
నలువ సృజించి యుందుకతనం దనచేయళు కెల్లఁ దీఱి నే
ర్పలవడ నీలతాంగి నరసాధిప నిన్నును గూర్చి ప్రేమసం
కలికముగాఁ దంపతులు గా నొనరింపఁగఁ బోలు నెంతయున్.
| 29
|
ఉద్దీపనవిభావము — ప్రాయము
మ. |
వరవక్త్రేందువిలాసకృన్ననవయోవర్షావససానంబుసం
దరుణీశైశవసింధు లింకునెడఁ దత్తత్కాలలక్ష్యంబు లౌ
సరసాంతస్థితగండశైలము లనం జందోయి యంతంతకుం
బరఁగుం దత్క్రమశోభరేఖ లనఁ గన్పట్టు వ్వళీపుంజముల్.
| 30
|
సొమ్ము —
క. |
వెలఁదికి మణితాటంకము, లలరున్ దిగ్విజయకాంక్ష నతనుఁడు చూపుం
జిలుకులు నిశాతములుగా, నలవడ వడిఁ దీడుశాణ యంత్రము లనఁగన్.
| 31
|
చేష్ట —
చ. |
సుదతి నృసింహుని న్మరల చూచె విలాసవివర్తితాస్య యై
వదలనిప్రేమ వెన్తవిలి వచ్చె ముఖేందుఁ డటంచు భీతిచేఁ
జెదరి గిరీంద్రదుర్గములు సేరినచీఁకటి వోలె వాసనా
స్పద మగువాలుఁగొప్పు వలిచన్నులపై నసియాడుచుండఁగన్.
| 32
|
తటస్థములు —
చ. |
చిగురుఁగటారితోఁ జెఱకుసింగిణితో నలరంపగుంపుతో
నిగనిగమించుచెంగలువ నేజముతోలో పడిఁ జిల్కతేజిపై
మగఁటిమి నెక్కి శూరుఁ డయి మారుఁడు కోకిలకంఠకాహళుల్
నెగడ లతాంగిపై వెడలె నేఁడు నృసింహ యె ఱుంగఁ జెప్పితిన్.
| 33
|
క. |
కారణ మైనవిభావము, చే రస ముత్చన్న మైనఁ జెలఁగెడిదానం
బ్రారూఢకటాక్షాదిక, మారయ ననుభావ మయ్యె నది యె ట్లన్నన్.
| 34
|
చ. |
అలసాలోలము లై యచంచలము లై యాకేకరాగ్రంబు లై
యలఘువ్రీడము లై యనిందితము లై యానందపూర్ణంబు లై
సులభాసూయము లై సుతీక్ష్ణరుచు లై సువ్యక్తరాగంబు లై
చెలువం బొందెడుచూపు లింతి నెఱసెన్ శ్రీనారసింహేంద్రుపైన్.
| 35
|
క. |
పరగతసుఖదుఃఖాదుల, నరయఁగ భావించి యట్ల యలరుట సత్త్వ
స్ఫురణము తద్భవభావము, లరయఁగ సాత్త్వికము లయ్యె నవి యె ట్లన్నన్.
| 36
|
ఉ. |
స్తంభ మచంచలత్వ మవశత్వ మగున్ బ్రళయంబు దృగ్జలో
జ్జృంభణ మశ్రు వౌఁ జెమట స్వేదము గద్గదవాక్యవైఖరీ
గుంభము నిస్వరత్వము తగుం బులకం బన రోమహర్షణా
రంభము కంప మౌ వడఁకు రామకుఁ బాండురుచుల్ వివర్ణతల్.
| 37
|
క. |
తలఁపఁగ రసకార్యము లై, జలజాక్షులయందుఁ బొడము సాత్త్వికభావం
బుల కెనిమిదింటి కేర్పడ, నలరింతుం గడఁకతో నుదాహరణంబుల్.
| 38
|
స్తంభము —
చ. |
కలికి నృసింహభూవరునిఁ గన్గొని నిశ్చలగాత్రవల్లి యై
యలరు విలాసచేష్ట లొలయం గలయంగ నటింపఁ జేయునా
వలపులసూత్రధారుఁ డనవద్యనృపాకృతిఁ జూచి తాను ని
శ్చలత వహింపఁగాఁ గదలఁ జాలనిజంత్రపుబొమ్మయో యనన్.
| 39
|
ప్రళయము —
ఉ. |
ఇత్తఱి నీతలోదరి వహించె నచేతనవృత్తి శారదా
చిత్తముఁ జూరగొన్న నరసింహుడు నేఁడు నియోగపాండు వౌ
గుత్తపుగుబ్బలాఁడి పలుకుంజవరాలివలెం జెలంగఁగా
నిత్తరళాక్షిచిత్తము నహీనరసోన్నతిఁ జూఱవెట్టెనో.
| 40
|
చ. |
మగువకు నంగజానలసమగ్రము లౌనులివేఁడియూరుపుం
బొగ లెగయ న్జనించుగతి ముత్తెపుఁజిప్పలఁ బోలు ఱెప్పల
న్నెగడునుదశ్రుపూరములు నేత్రసరోరుహనాళచాతురిం
డిగియె నృసింహ యింకఁ దరుణీమణిఁ గౌఁగిట నాదరింపుమీ.
| 41
|
స్వేదము —
చ. |
పతికిఁ జెమర్చె మేను జలజాతరళాక్షి చతుస్సముద్రము
ద్రితవసుధాధురంధరుని శ్రీనరసింహుని భావవీథిలోఁ
|
|
|
బ్రతిదినము న్వహించు నతిభారము వంకనొ కాక సంతతా
పతదసమాస్త్రశస్త్రభవపావకకీలలవేఁడివంకనో.
| 42
|
చ. |
అమరఁ బరాంగనానఖముఖాంకితుఁ డైననృసింహభూరుం
గమలదళాక్షి చూచి తమక్మమున దూఱెద నన్న గద్గద
త్వమునఁ బొసంగ నయ్యె సతివాక్యము లాంతర మై చెలంగు నె
య్యము హృదయేశు దూఱవల దంచు నిరోధ మొనర్చెనో యనన్.
| 43
|
రోమాంచము —
చ. |
కలికి నృసింహునిం దలఁపఁ గా నెలమిం బులకప్రకాండము
ల్మొలచె మనోజహాలికుఁడు మోద మెసంగఁ గురంగనాభిపం
కిల మగునింతిగాత్ర మనుక్షేత్రమున న్వెలయంగఁ జేయున
స్ఖలితమనోనునోరథనికాయము లీరిక లెత్తెనో యనన్.
| 44
|
కంపము —
చ. |
చెన్నగు శ్రీనృసింహవిభుఁ జిత్రపటంబున వ్రాసి బింకపుం
జన్నులమీఁద జేర్చుకొని చాల వడంకఁ దొడంగె బాల దాఁ
గన్నులవింటివాఁడు త్రిజగంబు జయించెద నంచుఁ గోరి చే
నున్నకృపాణవల్లిక మహోజ్జ్వలత న్జళిపించెనో యనన్.
| 45
|
వైవర్ణ్యము —
ఉ. |
మానవతీలలామ యసమానసముజ్జ్వలగాత్రవల్లిపైఁ
గానఁగ నయ్యెఁ బాండుతరకాంతి నిరంతర మై మనంబునన్
శ్రీనరసింహభూవరు ధరింపఁగఁ దద్వదనేందుమండలీ
మౌనితచంద్రికారససమాజము పైపయిఁ బర్వెనో యనన్.
| 46
|
క. |
ఆహరహము రసోత్పత్తికి, సహాయభావంబు లెలమి సంచారు లగున్
మహి నవి ముప్పదిమూఁ డై, మహితము లగు వీనికిం గ్రమం బేర్పఱతున్.
| 47
|
శా. |
నిర్వేదశ్రమదైన్యజాడ్యములు గ్లానిత్రాసశంకార్తిరు
డ్గర్వావేగధృతిస్మృతు ల్చపలతోగ్రత్వావహిత్థాత్రపాం
తర్వైక్లబ్యమదోత్సుకత్వ మతినిద్రామోహబోధాంతము
ల్సర్వాలస్యవితర్కసుప్త్యసహతాధ్యానభ్రమాపస్మృతుల్.
| 48
|
క. |
ఈవరుసఁ ద్రయస్త్రిరిశ, ద్భావములకు లక్షణము లుదాహరణంబుల్
వావిరి నొనర్తు నీయెడఁ, గేవలశృంగారసూత్రకీలితఫణితిన్.
| 49
|
క. |
నిరుపమదుఃఖేర్ష్యాదుల, నిరతము జనియించునరతి నిర్వేద మగున్
సురతగమనాదిసంభవ, సరసస్వేదాంబులహరిశ్రమ మె ట్లన్నన్.
| 50
|
నిర్వేదము —
క. |
శిలలు మణిభూషణంబులు, చెలు వగుహారములు జలధిఁ జిందినచినుకుల్
తలిరాకుఁబోఁడి నా కగు, సులభదయానిధి నృసింహుఁ జూడక యున్నన్.
| 51
|
శ్రమము —
క. |
నరసేంద్రుఁ జూడ రయమున, నరుదెంచి లతాంగి శ్రమజలాపూరిత యై
సరసేందుకిరణపరిణతిఁ, గరఁగిన నెలచట్టుబొమ్మకైవడి నమరెన్.
| 52
|
క. |
బల మఱి యరికిన్ దయ రాఁ, బలుకుట దైన్యం బనంగ బరఁగు న్మదిలో
గలకోరిక చేకూఱిన, నల వెఱుఁగక యునికి జాగ్య మగు నె ట్లన్నన్.
| 53
|
దైన్యము —
క. |
మదన మదిరాక్షి లక్ష్యుమె, మొదలఁ బురాంతకుని నీళ్లు మోయించిన నీ
కిది మొదలు కరుణఁ జూడుము, సుదతి న్నరసింహుఁ గూర్పు సుకృతము గల్గున్.
| 54
|
క. |
కడు శక్తి యెడలి బడలిక, నడలుట యది గ్లాని యయ్యె నాకస్మిక మై
పొడము భయంబునఁ జిత్తము, తడఁబడు టది త్రాస మనఁగఁ దగు నె ట్లన్నన్.
| 55
|
గ్లాని —
క. |
నిండదె బడలిక మును చను, కుండలబరు వాఁగలేని కోమలిమేనం
గొండంతవలపు పుట్టిన, గండరగండాంక యోబఘననరసింహా.
| 56
|
త్రాసము —
క. |
మరుఁ జిత్రలిఖితుఁ గని బి, త్తరి వెఱవఁ బరాగభూతిఁ దగ నిడి చిగురా
కరయ దిగఁ దుడిచి యలులకు, విరిబోనము వోయఁ దెలిసె వెఱపు నృసింహా.
| 57
|
క. |
తనకు ననిష్టం బగునో, యని గొదుకుట శంక హృదయమందలి తాపం
బినుమడి యై వెలిఁ బర్విన, ననయముఁ దనుపీడ యార్తి యగు నె ట్లన్నన్.
| 58
|
శంక —
క. |
చిలుకలపలుకో యని విన, నలుకుం జెలిపలుకుఁ దలఁకు నద్దము చూడం
గలువలచెలికాఁడో యని, చెలువ వియోగంబుకతన శ్రీనరసింహా.
| 59
|
ఆర్తి —
క. |
బెడిదపు మదనజ్వరమున, మిడిసి పడున్ హారలతలు మృగలోచనకున్
వెడవిలుతు వింటికోలల, నడువున సతి నింక నేఁచ వలదు నృసింహా.
| 60
|
క. |
ఎందును గృతాపరాధుల, యందు మనం బెరియ రోష మగు నది యొరులన్
నిందించి తన్నుఁ బొగడ న, మంచోన్నతి గర్వ మయ్యె మహి నె ట్లన్నన్.
| 61
|
రోషము —
క. |
నిలునిలు మనంగ యెచటికిఁ, దొలఁగెదు నరసింహుఁ డింతితోఁ గూడినఁ జా
లలరు భవదీయచాపము, కలుగానుగఁ ద్రిప్పి పిప్పిగాఁ గావింతున్.
| 62
|
గర్వము —
క. |
ప్రతియె కలంకాంకితునకు , సతి యగురోహిణియు నతనుసతి యగురతియుం
జతురనృసింహునిఁ జెందిన, యతిధన్యకు నాకు ననుచు నంగన నవ్వెన్.
| 63
|
క. |
క్రమమున నిష్టానిష్టా, గమజమనస్సంభ్రమంబు గన నావేగం
బమరఁగ మనము కృతార్థ, త్వముఁ జెందిన ధృతి యనంగఁ దగు నె ట్లన్నన్.
| 64
|
ఆవేగము —
క. |
సతి హారము నిడ నెడలే, కతనునితనుసిద్ధిఁ గోరి యల రతి వ్రతసం
గతి నక్షసరము గైకొను, గతిఁ గేలన దాల్చి సృపతిఁ గనుఁగొన నరిగెన్.
| 65
|
ధృతి —
క. |
నరసేంద్రుడు రా కుండినఁ, బరువడి భావింపఁ గలుగు భాగ్యమె చాలుం
జరితార్థ నైతి మరునకు, గిరివరుఁ బ్రియ మేల పల్కఁ గీడ్పడి నాకున్.
| 66
|
క. |
స్మృతి యగుఁ బూర్వానుభవ, స్మృతి రాగద్వేషజనితచేష్టాద్యనవ
స్థితి చాపల మెగ్గొదవిన, నతిచండత యుగ్రభావ మగు నె ట్లన్నన్.
| 67
|
స్మృతి —
క. |
నాఁటిపరిరంభసౌఖ్యము, నేటిబలెం బాయ దాత్మ
నిండి తొలఁకుచున్
బోటి నృసింహునిఁ బాయని, పాటలసుమగంధు లెంత భాగ్యాధికలో.
| 68
|
చాపలము —
క. |
వనిత నృసింహునిఁ గనుఁగొని, చనుగుబ్బలమీఁదివలువ చక్కఁగ దిద్దున్
జనఁ జూచు మరల జెలితోఁ, బనిలేమియుఁ బలుకు నురముపయిఁ జెయి సేర్చున్.
| 69
|
ఉగ్రత —
క. |
వలదు వల దేఁచఁ గలువల, చెలికాఁడ నృసింహుఁ గూర్పుచెలిఁ గాకున్నన్
బొలఁతుక నిట్టూర్పుఁబొగ, ల్వెలువడి నీబింబ మెల్ల వెస మాయించున్,.
| 70
|
క. |
భువిలో నాకృతిగోపన, మవహిత్థ మనంగ ముడుఁగు టది ద్రపమతికిన్
వివిధోపాయాభావా, ద్యనిరతభంగము విషాద మగు నె ట్లన్నన్.
| 71
|
అవహిత్థ —
క. |
హారములు గరఁగ నరస, క్ష్మారమణునిఁ బాడి యొక్కసతి పులుకలు మై
నీరిక లెత్తిన దాఁచును, సారెకు హారాంబుజనితశైత్యం బనుచున్.
| 72
|
క. |
వనిత నృసింహేంద్రుఁ బరా, కునఁ బేర్కొని శిరము ఇంవంచుకొనుఁ జెలియెదుటన్
గనిపించే భావ మని మో, మనయముఁ గుచదుర్గవసతి నాఁగినభంగిన్.
| 73
|
విషాదము —
క. |
అలరులు మరువమ్ములు హిమ, జల మిందుకరోదికంబు శత్రువు దలఁపం
జల గాడ్పు శ్రీనృసింహుం, డలిగినవాఁ డెట్లు మాను నతివకుఁ గాఁకల్.
| 74
|
క. |
మదము మదిరాదికృతస, మ్మదమోహవ్యతికరంబు మఱి యౌత్సుక్యం
బదన సమయాక్షమత్వము, నది నర్థవినిర్ణయంబు మతి యె ట్లన్నన్.
| 75
|
మదము —
క. |
అమరునృసింహునివనమున, నమితాసవరసము లాని యలియౌవతముల్
భ్రమియించు నాడుఁ బాడును, రమణులతోఁ గూడి సాంద్రరాగప్రౌఢిన్.
| 76
|
ఔత్సుక్యము —
క. |
వరుఁ బిలువఁబనిచి యెపుడెపు, డరుదెంచునొ యనుచుఁ దలఁచి యభిముఖియగుబి
త్తరి యింతపరాకైనను, నరయఁ దదాలోకవిఘ్న మగు ననుభీతిన్.
| 77
|
మతి —
క. |
చెలువరో శ్రీనరసింహుం, డలనాఁటి నృసింహమూర్తి యగుఁ గాకున్నన్
దలఁచినతావుల నెల్లను, నెలకొని సాన్నిధ్య మొందునిపుణత గలదే.
| 78
|
క. |
జగతిం జిత్తనిమీలన, మగు నిద్ర యనంగ మూర్ఛ నందుట మోహం
బగు బోధ మెఱుకఁ జెందుట, యగణితమృతియత్న మంత మగు నె ట్లన్నన్.
| 79
|
నిద్ర —
క. |
కలనైన శ్రీనృసింహునిఁ, గలయం గల నంచుఁ గలికి కన్నులు మొగిచెం
జెలి బాహ్యేంద్రియపథమున, నలరు మనం బరుగకుండ నాగిఁనభంగిన్.
| 80
|
మోహము —
క. |
అతనుశరహతుల సొరిగెను, సతి విరహతపస్సమాధిజనితవ్రత యై
ధృతి శ్రీనృసింహుఁ దలఁపఁగ, మతి తన్మయమగుచు మేనుమఱచినభంగిన్.
| 81
|
బోధము —
క. |
తరణీకులాధీశయశ, స్తరుణి జడత్వంబు మాని సంఫుల్లసితాం
బురుహాక్షియు జృంభిత యై, చిరగతి మేల్కనియె శ్రీనృసింహుడు గలుగన్.
| 82
|
మృతి —
క. |
వల పెఱిఁగి రాఁడు కౌఁగిట, నలమఁడు నరసావనీంద్రుఁ డని వగవఁజుమీ
చెలులను జిలుకయు నెవ్వతి, వల నగునో యనుచుఁ గొంత వగచెద నాత్మన్.
| 83
|
క. |
ముద మిష్టలాభస, మ్మద మగుఁ గర్తవ్యకార్య మందోద్యోగం
బది యలసత సందేహా, భ్యుదయబహుత్వము వితర్క మొగి నె ట్లన్నన్.
| 84
|
ముదము —
క. |
అలు లై కింశుకశిఖిలోఁ, జెలఁగుచు ము న్నెంతతపముఁ జేసెనొ చెలి నే
నలి నరసింహుని యురమునఁ, జెలు వగుచెంగల్వదండ చేరువ గలిగెన్.
| 85
|
ఆలస్యము —
క. |
చెలు లాహారాదులకుం, బిలిచిన నరగంటఁ జూచుఁ బ్రియుఁడు నృసింహుం
డలఘునృపకుంజురుం డని, యలికుంతల కుంభినీత్వ మందెనొ తానున్.
| 86
|
వితర్కము —
క. |
చలు లెఱుఁగ రాదు భావము, చెలు లెఱుఁగక యున్న మరునిచే రాయిడి యౌఁ
జెలులును మన సొక టైనను, వల పెఱిఁగి నృసింహవిభుఁడు వచ్చునొ రాఁడో.
| 87
|
క. |
అతినిద్ర సుప్తి యితరుల, యతిశయము సహింపకుండు టది యీర్ష్య యగున్
హితవస్తువు చేకూడమి, నతులాధ్యానంబు చింత యగు నె ట్లన్నన్.
| 88
|
సుప్తి —
క. |
లలన నృసింహుని కౌగిట, నలసియొ పవ లెల్ల నిద్ర నందెడి నెలమిన్
నెలపొందున రే ముద్దులు, గులికి పగ ల్నిద్రవోవు కుముదినివోలెన్.
| 89
|
అసూయ —
క. |
ఈవికొలఁదంతె తన మే, లేవేళను బాండుశోభ యెనయే నాకున్
వావిరిఁ గీర్త్యంగన యని, శ్రీ వెలయు నృసింహునొద్దఁ జిరతరలీలన్.
| 90
|
క. |
సతి చెక్కిటఁ జెయి సేర్పఁగ, నతులకరాంగుళులు సాంజనాశ్రుయుతము లై
రతిపతి బాసట మించిన, శితపంచశరమ్ము లనఁగఁ జెలగు నృసింహా.
| 91
|
క. |
అనయంబుఁ జేతనాచే, తనసదృశమనోశ్రమంబు ధర నున్మాదం
బనఁ బొల్చు ధాతుచలనము, దనర నపస్మార మనఁగఁ దగు నె ట్లన్నన్.
| 92
|
ఉన్మాదము —
క. |
నినుఁ బ్రార్థించెద భ్రమరమ, చని నరసింహేంద్రఁ దెమ్ము చన వల దోహో
చనిన నృపాలుముఖాంబుజ, ఘనవాసనఁ దగిలి నీవు గ్రమ్మఱవు గదా.
| 93
|
అపస్మృతి —
క. |
మదనగ్రహంబు సోఁకెను, సుదతీమణి దీర్ఘదృష్టిఁ జూచెడుఁ జెలులన్
ముద మొదవ రక్షఁ గట్టుఁడు, మదవతికి నృసింహనామమంత్రముకతనన్.
| 94
|
క. |
ఇరవగు నీభావంబులు, పరఁగెడు ననుభావములు విభావంబులు న
న్యరసంబులకుం గల వవి, విరచింపఁగ నొల్ల నిందు విస్తరభీతిన్.
| 95
|
తే. |
ఇంక శృంగార చేష్టల నేర్పరింతు, నవి నష్టాదశాఖ్య లై యలరుచుండు
లలితగతి వీనినామముల్ లక్షణములు, క్రమముతోఁ దెల్పి వీనిలక్ష్యము లొనర్తు.
| 96
|
క. |
ఇల భావహావహేలా, విలాసమాధుర్యధైర్యవిభ్రమలీలా
కిలికించితమోట్టాయిత, లలితాదులు చేష్ట లగుఁ దలంపఁగ మఱియున్.
| 97
|
తే. |
వెలయు బిబ్బోకవిచ్ఛిత్తి విహృతచకిత, హసితకుట్టమితకుతూహలాదు లనఁగఁ
గలవు మఱి యందు భావంబు వెలయుచుండు, మహి రసజ్ఞానయోగ్యతామాత్ర మగుచు.
| 98
|
క. |
అది యీషద్వ్యక్తముగా, సుదతులయెడ హావ మయ్యె సువ్యక్తం బై
పొదలిన ననుగతంబును, నది మిక్కిలి హేల యయ్యె నది యె ట్లన్నన్.
| 99
|
భావము —
చ. |
వరుఁ డని పేర్కొన్న న్శిరము వాంచుఁ దలోదరి సాలభంజికా
పరిణయవేళ నెచ్చెలులఁ బాయక యెప్పటియట్ల కేళికాం
తర మొనరింపఁ బోదు చనె నా యెదఁ బయ్యెదఁ జేర్చి సిగ్గనం
బరఁగుఁ బ్రియాంగనానుకృతి భావన కేలికిఁ గాఁగ నిచ్చలున్.
| 100
|
హావము —
చ. |
పడఁతి నృసింహుగీతములు పాడెడువేళ నృసింహునామము
న్నుడుపదు సిగ్గుతో గురుజను ల్నరనాథుగుణప్రశంస లే
ర్పడ నొనరించుచో నుచితభక్మెయి న్గురుసేవ సేయుకై
వడి వడి నాలకించుఁ దల వాంచుఁ బరా కగుఁ గొంత వింతగన్.
| 101
|
హేల —
ఉ. |
మేలము లాడుచుం గడు సమేలము లై చెలు లెల్లఁ గూడి యో
బాలిక శ్రీనృసింహనరపాలు వరించెదవే యటన్న నీ
లాలక యంగవల్లిఁ బు కాంకురము ల్నన లొత్త నే మనం
జాలక యూరకుండె ననిశంబు త్రపావృత యై[15]న కైవడిన్.
| 102
|
క. |
పతిఁ గనఁ దాత్కాలిక మగు, నతులవికారము విలాస మగు సొమ్ములు లే
కతిరమ్యత్వము దలఁపఁగ, నతివలకు న్మధురభావ మగు నె ట్లన్నన్.
| 103
|
విలాసము —
క. |
ఇరుగడల వెడలి సుడిగొని, తరళము లై వెలికి బెళికి తళతళ మనుచున్
బరఁగును దారపుఁజూపుల, హరిణాక్షి నృసింహవిభుని కారతి సేసెన్.
| 104
|
మాధుర్యము —
చ. |
కనుఁగవకెంపు సార్ద్రనఖగౌరతియుం జెలు వొందు నొక్కయం
గన రతివేగశీర్ణమణికంకణనూపురహారవల్లి యై
మునుపటికన్నఁ బొల్పగు సముజ్జ్వలతం దగెఁ బాండుపత్త్ర యై
కొనల నిగిర్చి యున్నయతికోమలవల్లిమతల్లియో యనన్.
| 105
|
క. |
కులశీలాద్యవిలంఘన, మిల ధైర్యం బొడలఁ దొడవు లిడఁ దడఁబడినన్
వెలయఁగ విభ్రమ మధిపుని, యలఘుగుణానుకృతి లీల యగు నె ట్లన్నన్.
| 106
|
ధైర్యము —
మ. |
అతులైశ్వర్యసమగ్రుఁ డైననరసింహాధీశ్వరుం డేడ నీ
పితృవాచాపరతంత్ర నైవ్రతతతిం బెం పొందు నేనేడ నా
క్షితిపాలాగ్రణిపైఁ బ్రసక్తముగ నాచిత్తంబు సంధించినాఁ
డతనుం డక్కరొ నేఁటనుండి విషమాస్త్రాభిఖ్యుఁడౌ నెంతయున్.
| 107
|
విభ్రమము —
చ. |
అదన నృసింహభూమిరమణాగ్రణి వచ్చిన సంభ్రమంబుతో
సుదతి నభోవలగ్నమునఁ జుక్కలపేరిటికంఠమాలయుం
బొదలుకుచాచలంబుల సముజ్జ్వలమేఖలయున్ ధరింపఁగా
నది క్రమ మయ్యెఁ దొయ్యలికి నక్రమ మయ్యె విలాసవైఖరిన్.
| 108
|
లీల —
చ. |
ధర నకలంకభావమునఁ దామరసాహితునిన్ జయించు నా
హరిపదసక్తయై వెలుఁగు నారయఁ బ్రాజ్ఞులకు న్వసుంధరా
సురతరునూతనాభ్యుదయశోభ యొనర్చు యశఃపురంధ్రి యా
వరుఁ డగు శ్రీనృసింహుగుణవాసనఁ దానుఁ జెలంగుకైవడిన్.
| 109
|
క. |
అళు కలుక ముదము నశ్రువు, గలిసినఁ గిలికించితంబు గడు నిష్టకథా
దుల నింగిత మెఱిఁగించుట, దలఁపఁగ మోట్టాయితంబు దగు నె ట్లన్నన్.
| 110
|
కిలికించితము —
చ. |
పతి రచితాగసుం డదిరిపాటున వచ్చి దృఢోపగూహన
స్థితి నధరప్రవాళము గ్రసింప ససంభ్రమలోలహస్త యై
మతకరి చాలుఁ జాలు నిఁక మాదెస రాకు మటంచు నల్కతో
నతివ బొమ ల్ముడించె నయనాంబువు ఱెప్పల నప్పళించుచున్.
| 111
|
మోట్టాయితము —
చ. |
చెలులు నృసింహుగీతమును జేరిక గా నపరంజివీణెలో
పలఁ బలికింప నూర్చుచును బాలిక యూర్పులచేత దీపికా
కలిక చలింప నెచ్చెలులు గంటిరె మీమృదుగానలక్ష్మికిం
దెలియఁగ మెచ్చుచున్నయది దీవియ యంచు హసించు నెంతయున్.
| 112
|
క. |
భాసురతమవల్లీవి, న్యాసము లలితము సొమ్ము లల్పము లయ్యున్
భాసిల్లెడుశృంగారవి, కాసము విచ్ఛిత్తి యయ్యెఁ గన నె ట్లన్నన్.
| 113
|
లలితము —
చ. |
వడియు శ్రమంబుతోడి భుజవల్లి మృదంగముమీఁదఁ జేర్చి కీ
లెడలిననూపురంబు ఘటియింపగ దూతికరారవిందమం
దడుగిడి కంపితస్తనరయంబున నూర్పరదోఁప నింతి య
య్యెడ నటియించి నిల్చె సభ యెల్ల ననంగునిపాలు సేయుచున్.
| 114
|
విచ్ఛిత్తి —
చ. |
పరిమితభూషణంబులును ఫాలముపై నెలవంకనామముం
బరఁగ నొయారి యై నయనపర్వ మొనర్చె వధూలలామ తా
విరళగణేయతారలు నవీనతరేందుకలావిలాసము
న్వరుస వెలుంగఁగా విదియనాఁటివిభావరి వొల్చుకైవడిన్.
| 115
|
క. |
వరునికథయం దనాదర, మరయఁగ బిబ్బోక మయ్యె ననుమతిఁ బలుకం
దర మగు తగువేళల ను, త్తర మొసఁగమి విహృత మనఁగఁ దగు నె ట్లన్నన్.
| 116
|
బిబ్బోకము —
చ. |
అతఁడు గుణాభిరాముఁ డతఁ డంగజసన్నిభుఁ డంచు నెచ్చెలు
ల్పతి యగు శ్రీనృసింహనరపాలు నుతింప లతాంగి నీటుతో
శ్రుతులఁ గరాంగుళు ల్సొనిపె శోభనతచ్చరితాభిపూర్ణ మై
యతిశయ మందుకర్ణయుగమం దవకాశ మొనర్చుకైవడిన్.
| 117
|
విహృతము —
ఉ. |
బాలిక యల్కతో మరలి పల్కక యుండియుఁ బ్రాణనాథుఁ డ
వ్వేళ క్షుతం బొనర్పఁ గడువేగ చిరాయు వటంచుఁ బల్కఁగాఁ
జాలక రోషముం బ్రణయసంభ్రమము న్మది దొమ్ములాడ నీ
లాలకకుండలద్వయ ముదగ్రగతిన్ ఘటియించె వీనులన్.
| 118
|
క. |
అలుకుట చకితము నవ్వుచు, నలరుట హసితంబు రతుల నతిసమ్మర్దో
జ్జ్వలసౌఖ్యము కుట్టమితము, లలనకుఁ జపలత కుతూహలం బె ట్లన్నన్.
| 119
|
చకితము —
చ. |
అడు గిడి నిల్చు నిల్చి చెలి కానలు పెట్టు నదల్చు సిగ్గునం
దడఁబడుఁ గాంతుఁ డున్నమణిధామ మొగిం జొరఁ జాల కెంతయు
న్వడఁకు గృహంటు సొచ్చియుఁ గవాటముదాపున నిల్చు నెచ్చెలు
ల్వడిఁ జనఁ జూచినం బెనఁగు వారిజలోచన మౌగ్ధ్యసంపదన్.
| 120
|
హసితము —
చ. |
సదనసరోజవాసనకు వచ్చినతేఁటి నదల్చి చూడఁగా
నది యసితోత్పలంబు లని యక్షుల వ్రాలఁగఁ జే విదుర్పఁగా
నది మరలం బయోజ మని హస్తయుగంబున వ్రాలె నవ్వె న
మ్మదవతి యేమి సేసినను మాన ది దేమి యటంచు నెంతయున్.
| 121
|
చ. |
కెరలి ప్రియుండు మోవిపయిఁ గెంపులు నింపుటఁ బారవశ్యత
త్పరత నెఱుంగలేక పిదప న్నిలువద్దము చూచి సిగ్గునం
దరుణి చెలు ల్గనుంగొనినఁ దా రిఁక నే మని యాడుకొందురో
వరుని నటంచుఁ జిల్కకు నవారణ ముద్దులు వెట్టు సారెకున్.
| 122
|
కుతూహలము —
చ. |
కలికి నృసింహభూవిభునిఁ గాంచి నవప్రణయాభిరామ యై
కలితకరాబ్జకేళి కమలంబు రమింపఁగఁ జేసె విభ్రమం
బలవడఁ బ్రాణనాథ హృదయాబ్జము ని న్నెడఁబాయ లేక యి
ట్లెలమి భ్రమించుచున్న దని యేర్పడఁ జెప్పెడిచంద మందఁగన్.
| 123
|
తే. |
మఱియు శృంగార మంగనామణులయందు, నంకురితపల్లవితపుష్పితాదిభేద
వర్ణితాకృతి యై దళావస్థ [16]లయ్యె, వీనినామక్రమంబులు విస్తరింతు.
| 124
|
క. |
ఇలఁ జూచుట చింతించుట, తలఁచుట గుణవినుతి యరతి తాపము లజ్జా
స్ఖలనము గమనము మూర్ఛయు, నల ధన్యత యన నవస్థ లగు నె ట్లన్నన్.
| 125
|
చక్షుఃప్రీతి —
మ. |
అనురాగాంబుధి యుబ్బి వెల్వడినయ ట్లాపూర్ణఘర్మాంబువుల్
దనువల్లిం డిగజాఱఁ గన్నుఁగవ లేఁదళ్కు ల్పిసాళించుచున్
ననవిల్కానిపురప్రవేశకలనానాళీకదామంబు లై
తనరం గోమలి నిన్నుఁ జూచె నరసేంద్రా సాంద్రతేజోనిధీ.
| 126
|
చింత —
మ. |
అరవిందంబు విలాసమందిరము నీహారాంశుఁ డేకోదరుం
డరయ న్గోత్రవిరోధ మేటికి ననర్హం బంచు నూహించి యి
|
|
|
ర్వురఁ బొందించుపయోధికన్యక్రియఁ జేర్చుం గేలు గండస్థలిం
దరుణీరత్నము చింతచేత నరసేంద్రా సాంద్రతేజోనిధీ.
| 127
|
సంస్కృతి —
మ. |
వరభూషాదులపై మనం బిడక దృగ్వ్యాపార మెంతేఁ బర
స్పరసందర్శననాతిభిన్న మయి చూపట్టంగఁ గార్యాంతర
స్మరణం బేమియు లేక నిశ్చలత నీ సాంగత్యముం గోరి మా
హరిణీలోచన యాత్మయందు నరసేంద్రా నిన్ను భావించెరా.
| 128
|
గుణకీర్తనము —
మ. |
పలుకుం దో డగువీణలోఁ జెలియ నీపై గీతము ల్మీటఁ దొ
య్యలిమైనీడ మెఱుంగుఁగాయ నిరవై యవ్వీణలో వాణియో
లలితాంగీ మనచిత్తముం బ్రియుఁడు కొల్ల ల్వెట్టెఁగా యంచు వె
ల్పలికిం దాను బుసాడ వచ్చె ననఁ గన్పట్టు న్నృసింహాధిపా.
| 129
|
ఆరతి —
మ. |
నిరతం బాత్మకరాంఘ్రిబాహునఖకాంతిస్ఫూర్తికిం దిగ్గు డై
శరణం బొందు ప్రవాళపద్మబిసపుష్పశ్రేణికిం గ్రమ్మఱన్
శరణం బందుట హీన మంచునొ మదిన్ శైత్యోపచారక్రియా
గరిమం బొల్లదు మానినీమణి కడంకన్ శ్రీనృసింహాధిపా.
| 130
|
తాపమ్ము —
మ. |
ధవళాక్షీమణిమేను హేమలతయ న్తత్త్వంబు ము న్నెల్లఁ ద
త్కవిలోకోక్తియటంచు నుంటి నది తథ్యం బయ్యె నె ట్లన్న భ
వ్యవియోగానలతప్త మై నిబిడబాష్పాసిక్త మై డస్సియు
న్నవశోభాతిశయంబుఁ జెందె నరసేంద్రా సాంద్రతేజోనిధీ.
| 131
|
లజ్జాత్యాగము —
మ. |
చెలి నీమూర్తి లిఖించి చిత్రఫలకం జెన్నొందుబాష్పాంబుపి
చ్ఛిల మౌపయ్యెదమీఁదఁ జేర్చుకొన నాచిత్రం బలక్ష్యంబుగా
బళిరే కట్టినచీరయుం బగయ కాఁ బాటించె దైవం బటం
చలినీలాలక యార్తిఁ జెందు నరసింహా యింకఁ బాలింపుమీ.
| 132
|
గమనము —
మ. |
చెలుల న్వంచన చేసి యొక్కతయ తాఁ జెన్నొంద నీయొద్దకు
న్నలినాక్షీమణి రాఁ దలంచి నవరత్నప్రోతసౌధాంగణ
|
|
|
స్థలుల న్వె న్చని వచ్చునిర్మలతనుచ్ఛాయ న్నిరీక్షించి నె
చ్చెలి యేతెంచె నెఱుఁగఁ బోలు నని నిల్చెన్ శ్రీనృసింహాధిపా.
| 133
|
మూర్ఛ —
మ. |
బలితం బైనయనంగవేదనలచేఁ బల్మాఱు నిల్పోప లే
కలినీలాలకప్రాణము ల్వెడలి నేత్రాంభోజమార్గంబునం
గలయం బ్రాఁకుచు వచ్చి య న్నెలవునం గన్నీటియే ఱడ్డ మై
నిలుప న్నిల్చె నృసింహభూరమణ మన్నింపంగఁ బా డింతటన్.
| 134
|
ధన్యత —
మ. |
శుకవర్గం బొకమాటలో మెలఁగె నాసూనాయుధుం డాంతరం
గికుఁ డై యుండె మరాళ మొక్కనడకం గ్రేళ్ళుబ్బి వర్తించెఁ బా
యక వేడ్క న్సుముఖత్వ మొందె కశి మాయబ్జాక్షి నేమంబుతో
నకలంకస్థితి నీవు గూడ నరసింహా రాజకంఠీరవా.
| 135
|
తే. |
తెలియ శృంగార మిదియును ద్వివిధ మగుచుఁ, బరఁగు సంభోగవిప్రలంభంబు లనఁగ
నందు బహుభేదముల నగణ్యంబు గాక, యేకవిధ మయ్యె సంభోగ మె ట్లటన్న.
| 136
|
సంభోగము —
మ. |
మరుఁ డాచార్యుఁడు గా విశీర్ణకబరీమాల్యాళి పుష్పాంజలి
స్ఫురణ ల్గాఁ దదుపేతభృంగనినదస్తోమంబు గానంబు గా
వరమంజీరరవంబు తాళగతి గా వర్ధిల్లుశాతోదరీ
సురతవ్యత్యయవేగతాండవ మొనర్చుం జింతితాభీష్టముల్.
| 137
|
క. |
పురుషులకుఁ దలోదరులకు, నరయంగా విప్రలంభ మభిలాషేర్ష్యా
విరహప్రవాసకారణ, పరిణతిచే నాల్గుగతులఁ బరఁగుచు నుండున్.
| 138
|
క. |
కలయుటకు మున్ను కోరిక, యిల నభిలాషంబు మాన మీర్ష్య విరహ మౌఁ
గలసి యెడఁబాయ హృదయో, త్కలికప్రవాసము విదేశగతి యె ట్లన్నన్.
| 139
|
అభిలాషము —
చ. |
అనయము శ్రీనృసింహులలితాంకతలంబున నుండ వచ్చునా
యనమునఖాంకసంగతుల నందఁగ వచ్చు నృపాలమాళితోఁ
జనువునఁ గుల్క వచ్చు గుణసంగతి మెచ్చులు చూప వచ్చునో
వనజదళాక్షి యాకనకవల్లిక నైనను ధన్య నౌదు గా.
| 140
|
ఈర్ష్య —
మ. |
వదనాగ్రంబున వాణి యున్నది మము న్వాక్రువ్వ నీ దిందిరా
మదిరాక్షీమణి యున్నదక్షుల మము న్మన్నించి వీక్షింప నీ
దదియుంగాక నృసింహ నీవిపులబాహోశ్లేష మే నొంద నో
ర్వదు భూదేవి బహుప్రియారత నినుం బ్రార్థింప నిం కేటికిన్.
| 141
|
విరహము —
ఉ. |
నెచ్చలు లీనృసింహధరణీవరుఁ దెచ్చెద మంచుఁ బోయి రా
రిచ్చట నీవునుం గరుణ యించుక లే కలరంపగుంపులం
గ్రుచ్చెద వేల మత్ప్రియునిఁ గూర్పుము మన్మథ నీకుఁ దద్విభుం
దెచ్చుటకై యొసంగెద మదీయకటాక్షము లన్జయాస్త్రముల్.
| 142
|
ప్రవాసము —
చ. |
చిరయశ యోబభూవరనృసింహ భవద్రిపుకాంత కాననాం
తరమున కేఁగి యందు నిజనాథునిఁ గానక మన్మథార్తయై
వరుని సరోజపత్త్రమున వ్రాయునెడం గరము ల్సెమర్పఁగా
నరయ నిజాంగకంబె పగ యయ్యె నటంచుఁ దలంచు దైవమున్.
| 143
|
క. |
పలువుర కొకభామినిపైఁ, దలఁపును నొకవారసతికిఁ దగఁ బలువురపై
వలపును మృగవిహగాదుల, కెలవు రసాభాస మయ్యె క్షితి నె ట్లన్నన్.
| 144
|
రసాభాసము —
చ. |
అలఘువిశీర్ణపక్షయుగ మై యమితోన్నమితోర్ధ్వకాయ మై
గళరవము ల్దలిర్పఁ బ్రియకాంతకు ముద్దులు వెట్టి యుబ్బునం
బలమఱు మేడపై కెగసి పక్షము ద్రిప్పుచుఁ గుంచితాస్య మై
పొలఁతుకఁ బిల్చు విభ్రమకపోతము హుంకృతనాదమాధురిన్.
| 145
|
క. |
భావింప భావశాంతియు, భావోదయ భావసంధి భావశబలతల్
భావం బడఁగుట పుట్టుట, ద్వైవిధ్యము బహుత యనఁగఁ దగు నె ట్లన్నన్.
| 146
|
భావశాంతి —
చ. |
తలఁపఁగ రాజశేఖరుఁ డతండు తలోదరి సర్వమంగళా
కలితవు నీవు మీర లొకగాత్రముకైవడిఁ గూడి మాడుచుం
జెలఁగుట యొప్పుఁగా కలుగఁ జెల్లునె మీ కని బోటి మ్రొక్కఁగా
లలనకుఁ దోఁచె బాష్పసలిలంబు నివారితమానపంక మై.
| 147
|
భావోదయము —
ఉ. |
మేలము లాడువేళల సమేలము లై చెలు లెల్ఁల గూడి యో
బాలిక శ్రీనృసింహనరపాలు వరించెదవే యటన్న నీ
|
|
|
లాలకయంగవల్లిఁ బులకాంకురము ల్ననలొత్త నే మనం
జాలక యూరకుండె ననిశంబు [17]వినమ్రముఖాంబుజాత యై.
| 148
|
భావసంధి —
మ. |
హరి కానంగ శరాళి యై యరికవేలాభీలదివ్యాశుగో
త్కర మై శౌరికిఁ బాటలాబ్జకలికాదామంబు లై వైరికి
న్నిరతాగ్నిప్రభ లై వెలుంగునరకానీకాధికోల్లాసభా
సురసత్యారమణీకటాక్షములు ప్రోచున్ శ్రీనృసింహాధిపున్.
| 149
|
భావశబలత —
మ. |
చెలు లేమందురొ భావవీథి నకటా శ్రీనారసింహేంద్రుకౌఁ
గిలి నా కెన్నఁడు గల్గునో నృపతితోఁ గ్రీడింపఁగాఁ బోవుచం
చలపుంజిత్తము నేమి సేయుదు గురు న్సద్భక్తిఁ బ్రార్థింతునో
యల ప్రాణేశ్వరుఁ జూడ కున్నఁ బరితాపాటోపము ల్మానునే.
| 150
|
నవరససంకరము —
మ. |
జయలక్ష్మీరత మై ప్రతాపయుత మై శత్రుచ్ఛిదాధుర్య మై
ప్రయతార్తావన మై కపీంద్రగతి యై రక్త్రార్ద్ర మై నిర్ఘనో
దయవిద్యున్నిభ మై సకంప మయి వందారుస్పృహాశూన్య మై
నయ మొప్ప న్నరసింహుఖడ్గ మమరు న్నానారసప్రక్రియన్.
| 151
|
రసాధిదేవతలు —
సీ. |
హరికి శృంగారలీలాధిపత్య మొనర్చు, గణనాథు హాస్యసంగతునిఁ జేయు
నలికలోచనునిపై నధికరౌద్రము నిల్పు, శక్రుపై వీరరసంబు నెఱపు
యమునిపై[18]ని దయామయత్వంబు ఘటియించు, జగతి మహాకాలు సభయుఁజేయు
శర్వరీంద్రుని జుగుప్సారసాన్వితుఁ జేయు, శతధృతి నద్భుతాన్వితు నొనర్చు
|
|
తే. |
శాంతి బ్రహ్మంబు జేర్చు నిచ్చలు నృసింహు, భువనభరణంబు నరవిఘ్ననివహహరణ
మీశతయు భోగము ననేకనృపతిహృతియు, ననియు యశమును మతియు బోధాతిశయము.
| 152
|
సీ. |
మరకతానీకదంభమున శృంగారంబు, హాస్యంబు ముక్తాఫలౌఘరుచులఁ
గరుణ[19]విద్రుమవర్ణగౌరవచ్ఛలమున, రౌద్రంబు కురువిందరత్నకలన
|
|
|
వీరంబు గోమేధికారోపితస్ఫూర్తి, భయము వైదూర్యశోభామిషమున
భీభత్స మింద్రనీలాభాగుణంబున, శాంతి నిర్మలహీర కాంతిగతుల
|
|
తే. |
నద్భుతము పుష్యరాగరాగాపదేశ, విలసితంబున సాకారవృత్తిఁ గాంచి
నవరసంబులు వొల్చు నీ భవనవీథిఁ, బ్రబల సుబలనృసింహ యోబయనృసింహ.
| 153
|
క. |
[20]కరుణాభయబీభత్సము, ఖరసంబులు శోకభీతిగాఢజుగుప్సా
కరములు గా నరసము లై, తిర మగు నె ట్లన్న దీనిఁ దెలిపెద వరుసన్.
| 154
|
ఉ. |
భావ మలంక్రియాగుణవిభాసిత మై వికసద్రసోదయ
శ్రీవినివారితేతరవిశేషనివేదన మై యెలర్ప నీ
వావిరి దుఃఖ మైన సుఖవైభవ మైన విటీవిటాలియం
దావలఁ బూర్ల మై సహృదయాత్మలఁ గేవలహర్ష మై తగున్.
| 155
|
తే. |
అలపదార్థంబు లగువిభావానుభావ, సాత్త్వికాదులఁ గూడి రసత్వ మొందు
నవనిభావంబు వాక్యార్థ మనఁగ నెగడి, తంతువుల గూడి పట మనఁ దనరుకరణి.
| 156
|
మ. |
రమణీయోల్బణతాసమేత మగు నీరత్యాదిభావాబ్ధిలో
నమరం బుట్టుచు మున్గుచుం దగుఁ దరంగారూఢి సంచారిసం
ఘము లేతత్ప్రతిపన్న మౌరసము తత్కాలంబునం దైన స
త్యము రామాదులయంద నాట్యమున సభ్యావాస మై భాసిలున్.
| 157
|
శా. |
లేఖేశ ప్రతిమానవైభవ భవాశ్లిష్టస్రవంతీమరు
చ్ఛాఖిస్పర్థి యశఃపరంపరపరక్ష్మాపాలకప్రాజ్యరా
జ్యాఖర్వస్మయపుంజభంజనకృపాణాకల్పకల్పాంతవే
లాఖేలత్ప్రబలార్కకర్కశమహోలంఘిప్రతాపోదయా.
| 158
|
అచలజిహ్వము —
క. |
భోగాంబువాహవాహవి, భాగేహాభావు కాంగభావభవమహా
భాగమహీభాగమహా, భోగావహబాహుభోగిపుంగవభోగా.
| 159
|
కవిరాజవిరాజితము. |
నిరుపమరూప దిలీప మనూపమనీతికలాపకలాపధర
స్మరణభవానుభవానిశమానితమానసపద్మ సపద్మరటి
త్కరినరఘోటకకోటికరంభితకాంతనిశాంతనిశాంతమహా
హరిహయదిక్తరణీస్ఫురణైకవిభాధికలాభకలాభననా.
| 160
|
గద్యము. |
ఇది శ్రీహనుమత్ప్రసాదలబ్ధకవితాసారసారస్వతాలంకారనిరంకుశప్రతి
భాబంధుర ప్రబంధపఠనరచనాధురంధర ప్రబంధాంక వేంకటరాయభూషణసు
పుత్త్ర తిమ్మరాజపౌత్త్ర సకలభాషావిశేషనిరుపమావధానశారదామూర్తిమూర్తి
ప్రణీతం బైనకావ్యాలంకారసంగ్రహం బనుమహాప్రబంధంబునందు రసస్థాయి
సామాన్యలక్షణంబును దద్బహూకరణంబును విభవానుభావసంచారిభావప్ర
పంచంబును శృంగారచేష్టాప్రకరణంబును నవనిర్ణ యంబును సంభోగ విప్రలం
భభేదంబును రసాభాసభావశాంతిభావోదయభావసంధీభావశబనతాసంకరతలును
రసవర్ణాధిదేవతావిశేషంబును నన్నది తృతీయాశ్వాసము.
|
|