దినము దినమెల్ల నైదాఘ తీక్ష్ణ భాను


దినము దినమెల్ల నైదాఘ తీక్ష్ణ భాను

భీకర కరానలచ్ఛట వేగి వేగి

శీతల నిశా ప్రశాంత శయ్యా తలాన

నిట్టె కనుమోడ్చె గాదె నా హృదయసుమము!

అలసటం దూలి, నిర్జీవ మటుల సోలి,

జాలి గొల్పును గాదె! నీ వేల స్వప్న

మటుల లోలోన కలచి, చీకటి ముసుంగు

నొత్తిగిల ద్రోసి, వదలని పొత్తు గోరి

తొంగి తొంగి చూచెద వయ్యొ దుఃఖమా! యొ

కించు కైనను జాలి వహించ వేమి?

సగము వాడిన మృదుల పుష్పమ్ము సుమ్ము,

నిదుర పోనిమ్ము లేకున్న నేల వ్రాలు!