ఈ గ్రంథమును రచించిన కవి ధరణీదేవుల రామయమంత్రి. నియోగిబ్రాహ్మణుఁడు. ఈతని తాత తిమ్మయమంత్రి. తండ్రి నాగయమంత్రి. తల్లి ఫణియమ్మ, ఈ గ్రంథమునందు శ్రీమహావిష్ణుని దశావతారములును గూర్చినకథ చెప్పఁబడినది. పదియవతారముల కథను బదియాశ్వాసములలో నిమిడ్చినాఁడు. రామావతారకథ రెం డాశ్వాసములక్రిందను, బుద్ధకల్క్యవతారములు రెంటికథను నొక్కయాశ్వాసముక్రిందనుఁ జెప్పినాఁడు. రామావతారకథవంటి పెద్దదియైనను బలరామావతారకథను రెండాశ్వాసములక్రింద రచియింపలేదు గాని, కృష్ణచరిత్రమును రెండవభాగముగా విభజించినట్లున్నది. ఈగ్రంథము మగదల కృష్ణమంత్రి కంకితము చేసినాఁడు. ఈకృష్ణమంత్రి నెల్లూరిమండలములోని ప్రళయకావేరిపట్టణములో గతశతాబ్దాంతము దొలాందావారికి ద్విభాషిగా నుండెనని యాంధ్రకవులచరిత్రమునఁ దెలియవచ్చుచున్నది. గత శతాబ్దాంతమనఁగా, నాంధ్రకవులచరిత్రమే 19-వ శతాబ్దాంతమందు రచియింపఁబడి యుండుట చేత 18-వ శతాబ్దాంత మనుకొనవలయును. మఱియుఁ బుష్పగిరి తిమ్మన్న, కంకంటి పాపరాజులు రామయమంత్రికి సమకాలికులైనట్లు తెల్పుచు వారివిషయము 1790 ప్రాంతముననని కవుల చరిత్రము వ్రాయుట కూడ దీని కాధారము.

ఈ రామమంత్రి సంస్కృతప్రాకృతాద్యష్టభాషలు నేర్చినవాఁడు. అట్టివానికిఁ దెనుఁగుకవిత్వము లెక్కలోనిదిగాదు. పూర్వకవులు సంస్కృతముతోపాటు స్వభాషను గూడఁ గృషి చేయుచుండెడివారు. పెద్దపెద్ద పండితులయొద్దఁ గాశి మొదలగుతావులఁ జదువుకొనివచ్చి (సంస్కృతమును) యింటికడ మాతృభాషను బరిశ్రమ చేయువారు కావచ్చును. కవులు చేయు గురుస్తుతి సంస్కృతవిద్యాభ్యాసము చేయించిన గురువులస్తుతియనియే తలఁపవచ్చును. ఈవిషయ మింతకంటె నిక్కడ నప్రస్తుతము. ఈకవి సంస్కృతమును దెనుఁగును చక్కఁగా గ్రంథమం దంతటను వాడినాఁడు. సంస్కృతవాక్యములను దెనుఁగుపద్యములనడుమ “అద్యభవే త్తవ సర్వమంగళావాప్తిః”అటంచు నీరీతిగాను జేర్చును. పాణౌకృతి, నాభౌసరోజుఁడు, దంభూతవామాంగుఁడు - మొదలగుపదములఁ బ్రయోగించెను. తెనుఁగునను గూడ నపూర్వపదప్రయోగము గావించినాఁడు కాని యందందు, “అదేమే వైరినెన్నేవు, నవ్వేరెవరైన, ఇంట్లో వారికి దుఃఖించ ఇట్టి వ్యాకరణవిరుద్ధపదములు కలవు. లోకో క్తులు జాతీయములు చక్కగా వాడినాఁడు. “ముక్కునగవ్వగుట్టి నిను ముందుగ నీడిచి - అబలలము మూఁడుమాటల నాఱుతప్పులు.” ఇట్టిసహజములును, “ఆయంభోదములఁ జూచి చెర్వుజలమాద్యంతంబుఁ జల్లింతురే ” ఇట్టి స్వతంత్రములు నగు లోకోక్తులను బ్రయోగించినాఁడు. పాఠకులకు విదితము కాఁగలవని యిట విస్తరింపలేదు. సంస్కృతాంధ్రములు రెంట నీతని కవిత్వము, వర్ణనలు, కల్పనలు, మృదుమధురములు రసానుగుణములునుగా నుండును. స్వభావవర్ణముల కీతఁడు పెట్టినది పేరు. యమకములు, సంత్రనియమములు, గర్భకవిత్వము, బంధకవిత్వముఁ జక్కగ నభ్యసించినవాఁడు. స్తుతిసమయములలోఁ బలువురచే బలువితముల నాయారీతి గర్భబంధకవిత్వముం జెప్పించినాఁడు. పాఠకులు చిత్తగింతురు గాక! అదితిచేఁ బ్రాకృత సీసపద్యముతో విష్ణుస్తుతి చేయించి, స్త్రీ కావుననేమో ఇ ట్లప్రాకృతగుణాతీతయగు నదితి ప్రాకృతగుణాతీతుని (బ్రాకృతమున) వర్ణించినట్లు నుడివినాఁడు. ఆంజనేయునిచే శ్రీరాముని ఉత్పలమాలికలో మంజుభాషిణి యను వృత్తముం గూర్చి స్తుతి చేయించి రామునిచే నాతనికవిత్వమునకు మెప్పించి సీతచే ముత్యాలహారము నిప్పించినాఁడు. ఈతఁడే పక్షపాతము నసూయయులేని కవి. తానొక ప్రభువునొద్దఁ గవిత్వము చెప్పి జాంబూనదాంబరమణిభూషణాదులం గొనుకవి తనవంటి కవులకును ప్రభు సంస్థానములలోఁ జెప్పి యిప్పించిననేగదా కీర్తికలుగును, ఇక్కవి తెనుఁగుప్రాకృతము సంస్కృతము పదములే కాక అన్నగళు (అఱవము) చికరాయపట్టము (కన్నడము) సాహెబూ (హిందుస్తానీ) పదములనుగూడ వాడినాఁడు.

శృంగారవర్ణనములకుఁ గడఁగెనా యీతని కొడలు తెలియదనుట సాహసము కాఁగూడదు. బాలురగు రామలక్ష్మణుల యొద్ద విశ్వామిత్రుని చేత నహల్యచరిత్రమును బచ్చిపచ్చిగా వర్ణింపించినాఁడు. ఇంద్రునిచేష్టలు మానవసామాన్యముగా నున్న వనిపించినాఁడు, కృష్ణుఁడు, గోపికలు, వీరలవిషయము చెప్ప నక్కఱయే లేదు. ఏవిషయముననుగూడ శృంగారించి చెప్పఁజూచును, అదితి స్త్రీ, యీమె చేసిన విష్ణుస్తుతిలోఁ గూడ "ళచ్ఛిత్థణాహేయలలిఅహత్థపయోఅ ” (లక్ష్మీస్తనాధేయ లలిత హస్తపయోజ) అనిపించినాఁడు. కొన్నితావులఁ జెప్పవలసినవిషయము తగ్గించి వర్ణనలు విస్తరించినాఁడు. కవులనఁగా వర్ణించువారేకాని స్థలము, సమయము, తదుచితముగూడ నాలోచించుచుండవలయును. ఇందేకాదు, ఈవిషయము సర్వసామాన్యముగాఁ గథనుమాత్రమే తెల్పవలసిన పురాణములలోఁ గూడఁ బూర్వులిట్లే సమయోచితముచూడకుండ వర్ణించియున్నారు. రామపరశురాముల సంభాషణము చాలఁ దగ్గించినాఁడు. బుద్ధినిబోధలు క్రొత్తవి యంతగా లేవు. ఇట్టులే పాఠకులు చదివిన నాయాస్థానముల విశదము కాఁగలదు.

ఈ గ్రంథమును బ్రకటించుటకు బహుప్రతులలో సరిచూడవలసివచ్చినది.

1. ఆంధ్రసాహిత్యపరిషత్తులోని పీఁచుకాగితములప్రతి - ఇది నలనామ సం॥ మాఖ బ 10 జయవారమున దుగ్గిరాల చినసుబ్బయ్యగారి కుమారుఁడు నరసింహముగారు బందరు ఖొజ్జిల్లిపేఁటలో నివసించు భూమకరు సీనయ్యగారను శ్రీనివాసరావుగారి ప్రతినిజూచి వ్రాసినది. (2) పరిషత్తులోని తాళపత్రప్రతి - అఱవదేశపుది. కోరప్పటి వేంకటరామయ్యగా రిచ్చినది. ఈ రెంటిలో నక్కడక్కడఁ గొన్నిభాగములు లేవు.

2. దొరతనము వారి ఓరియంటల్ లైబ్రరిలోఁ గొన్నిటీకలు గొన్నిమూలమాత్రములును గలవు. అందును రెండుతాళపత్రప్రతులు పూర్తిగానున్నవి. తక్కినవి యసంపూర్ణవ్రతులు, టీకలలో మూఁడునాలుగాశ్వాసములకు టీకలు లేవు. పంచమాశ్వాసములోని ప్రాకృతసీసము వ్రాయకుండ విడిచిపెట్టఁబడియెను. ఒకకాగితము మూలములోనే యాపద్యము విడిచి స్థలముమాత్రము వదలినారు. పూర్ణగ్రంథములలోఁ బాఠభేదములు ననర్థములు వ్రాఁతతప్పులు మెండుగానున్నవి.

ఈదశావతారచరిత్రమును బుష్పగిరితిమ్మన్న రచియించెనను వాడుక గలదు గాని రచననుబట్టి యిది తిమ్మన్నకవిత్వముగాఁ దోఁపదనియు నట్లు వదంతిపుట్టుటకుఁ గారణము కనఁబడదనియు రా. బ. వీరేశలింగము పంతులుగారు వ్రాసినారు.

ఈ పుస్తకమునఁ జాలఁభాగము చక్కఁజేసి ముద్రించినారము. అయినను లోపము లింక నుండవచ్చును. ఆలోపములను బాఠకులు దెల్పిన రెండవసారి ముద్రించునపుడు తప్పక సవరించెదము, పాఠకబృందము మేము శీఘ్రకాలములో ద్వితీయముద్రణము గావించున ట్లాశీర్వదించునుగాక!

తండయార్పేట,

ఇట్లు,

చెన్నపురి. 6-2-1926.

వావిళ్ల. రామస్వామిశాస్త్రులు ఆండ్ సన్స్.