దశకుమారచరిత్రము/షష్ఠాశ్వాసము
షష్ఠాశ్వాసము
శ్రీకాంతచరణయుగళీ
కోకనదమధువ్రతునకు గుణజాలికర
త్నాకరునకు మదనసమా
నాకృతిహృద్యునకుఁ దిక్కనామాత్యునకున్.1
వ. అతని కి ట్లని విన్నపంబు సేయుము.2
క. వసుధేశ! బహుధనంబుల
వసుమతిలో, బేరు గొన్న వసుమిత్రున కే
కసుతుఁడ ధనమిత్రుడఁ ద
ద్వసునిచయం బెల్లఁ గీర్తివాంఛానిరతిన్.3
వ. అర్థివర్గంబున కిచ్చి పదంపడి పేదఱిమి కారణంబుగాఁ బురం
బులో దైన్యవృత్తిం జరింపం జాలక వనాంతరంబునకుం
జని నిజశిరఃకృంతనోద్యుక్తుండ నైన యవసరంబున.4
చ. జడలును బూది బొక్కణము జన్నిదముం బులితోలు చీరయుం
గొడుగును గ్రిక్కయున్ వెదురుగోలయుఁ గృష్ణమృగాజినంబుఁ బొ
ల్పడరఁగఁ దాల్చి దృష్టిగతుఁడైన నిశాకరమౌళి వోలె నా
కడ నొకతాపసోత్తముఁడు గ్రక్కున వచ్చి కృపాసమేతుఁ డై.5
శా. వాలుం గేలున నంటఁ బట్టుకొని జీవం బింత నిస్సారమే?
యేలా? సాహస మింత క్రూరమతి వై యేకాంత మిక్కానలోఁ
గాలిం బుచ్చెదు పౌరుషం బిది వినం గానం గడున్ దోస మీ
బేలుం జెయ్ది కతంబు చెప్పు నిను సంప్రీతాత్మునిం జేయుదున్.6
చ. అనవుడు లేమికంటె నరయన్ మృతి మే లగు నర్థసంయుతుం
డని మును నాకు నిచ్చె నొకయంగన బేదఱికంబు గాంచి త
జ్జనకుఁడు వేఱ యొక్కనికి సంపద గల్గుట నీఁ దలంచినం
గని ప్రతికార మెద్దియునుఁ గానక కానకు వచ్చి చెచ్చెరన్.7
వ. సాహసంబున నిజశిరఃఖండనంబు సేయుట కనుమతించితి ననిన.8
క. దరహాసము సేయుచు నా
కరవాలము పుచ్చివైచి కరతలమున నా
కరయుగళ మలమి పట్టుచుఁ
గరుణ నతం డిట్టు లనియె గారవ మెసఁగన్.9
క. తనుఁ దానె హత్య చేసిన
మనుజున కిహపరసుఖములు మాలుట తథ్యం
బన వినవె? యిట్టి పాతక
మునకుం దొడరుదురె! యింత మూర్ఖులు గలరే!10
క. వెడఁగుఁదన ముడుగు ధనములు
పడయు నుపాయములు గలవు బహువిధములఁ దా
మెడఁ దునిమివైచి క్రమ్మఱ
నొడఁగూర్చి సజీవుఁ జేయ నొఱుపులు గలవే.11
వ. ఇవ్విధంబునం బలికి యనంతరంబ చర్మభస్త్రిక చూపి యిది
కల్పక్రమంబున లక్షదాయి యై యుండు దీనివలన నర్థంబు
వడయు నుపాయంబు సెప్పెద విను మని యిట్లనియె.12
క. వణిజులకు నొండె నొండెను
గణికలకుం గాని దీనఁ గాంచిన లాభం
బణుమాత్ర మైన నొరులకు
గణియింపఁగ రాదు వా రకల్మషబుద్ధిన్.13
సీ. ధర్మమార్గంబునం దడవినసొ మ్మెల్ల
ధరణీసురల కర్థి దాన మిచ్చి
యన్యాయమునఁ గొన్న యర్థంబు దమచేతఁ
గోల్పడ్డవారికె కోరి యిచ్చి
తొలుతగా నొకతీర్థజలములం బరిశుద్ధ
దేహు లై తగ నిష్ఠ దేవపూజ
లొనరించి నాఁ డెల్ల నుపవాసముగ నుండి
యజినరత్నమునకు నర్చ లిచ్చి
తే. యొండు దలఁపుఁ దలంపక నిండుమనము
తోడ నున్నంత మఱునాడు తోలుతి త్తి
లక్షధన మిచ్చుఁ బ్రథమకల్పమున కిదియ
తెఱఁగు నెలనెల నియతి మై మఱియుఁ గోరి.14
క. వ్యయ మై మిగిలిన ధనములు
దయ భూసురకోటి కిచ్చి తా రవని గుశా
శయనమున నున్న నాల
క్షయుఁ దప్పక యిచ్చుచుండు శాశ్వతవృత్తిన్.15
తే. అని కృపారసపరిపూరితాత్ముఁ డగుచు
నన్నుఁ గనుఁగొని వెండియు నమ్మఁ బలికి
యతివిచిత్రచరిత్రుఁ డై యాక్షణంబ
తపసి దర్శనమార్గంబు దప్పఁ గ్రుంకె.16
సీ. ఇత్తెఱంగున నమ్మునీంద్రుచేఁ గాననాం
తరమున నజినరత్నంబు వడసి
సాహసికత్వంబు సాలించి యింటికిఁ
జనుదెంచి యత్యంతసమ్మదమున
మేలు చేరిన మహీపాలున కెఱిఁగించి
యనుభవించుట నీతి యని తలంచి
ధరణీశ! నీకు నింతయుఁ జెప్ప వచ్చితి
నుత్తమద్రవ్య మై యున్న దీని
తే. నెన్నిభంగులనైన న న్నేమఱించి
కొనఁగఁ దలతు రనేకులు క్రూరకర్ము
లట్లు గావునఁ గరుణ నీ వరసి వారి
చేతఁ గోల్పడకుండ రక్షింపవలయు.17
క. ఇది విన్నపంబు క్రమ మి
ట్లు దడంబడ కధిపుమ్రోల లోకులు వినఁగా
మృదువాక్యంబులఁ బలుకుము
మది దీనికి సమ్మతించు మనుజాధిపుఁడున్.18
వ. పదంపడి [1]కార్యచాతుర్యంబునం బౌరులధనంబు లప
హరించి.19
ఆ. అజినరత్నలబ్ధ మైనధనం బను
పేర ననుభవించి చోరవృత్తి
నొరు లెఱుంగకుండఁ బురములో మనకు వ
ర్తింపవచ్చు సంశయింపవలదు.20
క. ధనవంతుఁ డైన నిన్నుం
గని మీమామయును నిచ్చుఁ గన్నియ నిది దా
ననుమానింపఁగ వలవదు
కినియవలయు నర్థపతికి గీ డొనరింపన్.21
క. చలమున మనముం దగు మా
యలు పెట్టుచు గాసి సేసి యాతనికలిమిం
బొలియింత మిదియ కర్జము
తలకొను మీపనికి నొండు దలఁ పుడిగి మదిన్.22
వ. అని కఱపి పుచ్చిన ధనమిత్రుండును మదుక్తప్రకారం బను
ష్ఠించి యతిప్రకాశంబుగా నమ్మహీశ్వరుకారుణ్యంబు వడసి
వచ్చి విచ్చలవిడి నభిమతభోగంబు లనుభవించుచుండి.23
క. మును చెలియైన విమర్దకుఁ
డను భాగమువానిఁ బిలిచి యర్థ మతనికిం
దనివోవ నిచ్చి తగ నేఁ
బనిచితిఁ గపటమున నర్థపతిఁ గొలువంగన్.24
వ. పనిచిన.25
ఉ. వేడుకతో విమర్దకుఁడు విశ్వసనీయుఁ డనంగఁ జూచి తా
నీడయుఁబోలెఁ దోఁ దిరిగి నెయ్యముకల్మివిధంబు దెల్పఁగా
నీ డగు మాటలం బనుల నిచ్చలు నిచ్చకు వచ్చుభంగి గి
ల్బాడి తదంతరంగము బయల్పడ మా కెఱిఁగించు నిచ్చలున్.26
వ. అంత నొక్కనాఁడు.27
తే. కామమంజరి చెలియలు కమలనయన
రాగమంజరి యనియెడు తీఁగఁబోఁడి
యొక్క సత్సభ నర్తించుచున్న నేము
నచటి కరిగితి మర్థితో నాట చూడ.28
వ. చని యవలోకించుచుండి.29
ఉ. దానితనూవిలాసములు దానియపాంగవిలోకనంబులున్
దానిమృదుప్రియోక్తులును దానివివేకము దానిగానవి
ద్యానుగవర్తనంబు హృదయంబున నెక్కొన నప్పు డచ్చటం
దేనియఁ బడ్డ యీఁగగతి ధీరతఁ గోల్పడి బిట్టు [2]చొక్కితిన్.30
క. మగువయు నాదెస చిత్తము
దగులంగా నృత్తచతురతావైభవముల్
డిగ విడిచి మదనుబారికి
నగపడి పవనావధుతలతాకృతి యయ్యెన్.31
వ. అయ్యతివ యతిచతుర గావున నిజప్రకృతి బయల్పడకుండ
వృత్తప్రకారంబు నడపి తత్సమయావసానంబున విలోల
మానసంబున బోటికత్తియలు దోడ్కొనిపోవ నరిగె నేను
నుదారకు నర్మాలాపంబులకు సిగ్గును మదనతాపంబునకు
బెగ్గలంబు నొందు డెందంబుతోడ మందిరంబునకుం జను
దెంచి సముచితకరణీయంబు లెట్టకేనియు నాచరించు.32
ఉ. భావజు బాణపంచకముబారికి వెన్నెలవెల్లివారికిన్
గోపపికవ్రజంబునునుఁగూఁతకుఁ దుమ్మెదపిండుమ్రోఁతకున్
మావిడిమోఁకలేఁదలిరుమంటకుఁ గోర్కులు కోసితింటకున్
భావగతుల్ కరం బలరఁ బల్వగలం దురపిల్లుచుండితిన్.33
వ. మఱునాడు.34
క. సంతాపవేదనాభర
మంతయు మది నిగుడ మందిరారామసరః
ప్రాంతలతాగృహమున నే
కాంతమ యేఁ జిగరుసెజ్జ నలయుచు నున్నన్.35
క. మారవికారప్రతికృతి
పారంగతుఁ డంతరంగబంధుఁడు కరుణా
పూరితసరళస్వాంతుఁ డు
దారకుఁ డేతెంచి కాంచి తా ని ట్లనియెన్.36
మ. చెలికాఁడా! భవదీయచిత్తమునకుం జేడ్పాటు వాటిల్లెఁ గో
మలియాలోలకటాక్షవీక్షణములన్ మందస్మితజ్యోత్స్నలం
దెలియం జూచితి నాసరోజముఖియుం దెల్లంబు గావించె సం
చలతం బొందెడు వృత్తభంగుల నిజస్వాంతంబు చిక్కంతయున్.37
క. ఇరువుర చిత్తంబులు నొం
డొరువులపై నిట్లు దగిలి యున్నకతమునన్
సరసమగు పొందు చేయఁగ
వెర వగు నెబ్భంగి నైన వేగమ నీకున్.38
వ. అని పలుకుటయు.39
తే. కాంత యెఱిఁగియు నామదిఁ గాంతతగులు
కలిమి నమ్మంగఁ జాలక తలరుచున్న
చిత్త మొక్కింత యూఱడి సేదదేరి
యెలమి పొందంగ నతనితో నిట్టు లంటి.40
క. నీయట్టి [3]సఖుఁడు జగమున
నేయెడలం గలఁడె కూర్మి యెసకం బెసఁగం
దోయజముఖి ననుఁ గూర్పుము
కాయజుపెందాల్మి గాసి కాకుండంగన్.41
వ. అనిన విని ధనమిత్రుండు మైత్రి వాటించి యప్పనిఁ బూని
నన్ను నూఱడం బలికి యొకింత నితర్కించి యిట్లనియె.42
ఉ. వేవురు సెప్పినన్ వినక వేశ్యలచొప్పునఁ బోక యర్థముల్
ప్రోవులు వై చినం గొనక రూపగుణాస్పదమైనఁ జూచి మ
ద్భావము పొందు ముం దెఱుగఁ బోఁడిగఁ బెండ్లికి నియ్యకొందు నం
చావనితాలలామ దెగనాడి విటావలి నొల్ల దెన్నఁడున్.43
వ. ఇవ్విధంబునం బ్రతినలు పట్టియున్న కూఁతు ననేకవిధంబుల
బోధించి (త్రిప్పఁ)జాలక తల్లి యుల్లంబునం దల్లడిల్లి మహీ
శ్వరుం గానం జని దేవా! దేవరపిన్నవరవుడు రాగమంజరి
లంజియలచొప్పు దప్పి వివిధధనంబు లిచ్చు భుజంగకోటి
నొల్లక తనవలచువాని నెవ్వనినేనియుం బెండ్లియగుదు నని
ప్రతిజ్ఞ చేసి మాచేత మాన్పరాకున్నయది మరులుఁదనం
బున నింక నొక్కని తెప్పునం బడి పోవంగలయది గావున
మమ్ముం గరుణించి యి ట్లని యాజ్ఞ సేయవలయు మాధవ
సేన వెలిగా రాగమంజరి నెవ్వఁడు గోరువాఁడు నా చేత
నర్థప్రాణాభిమానంబుల దండితుం డగువాఁ డని చాటించు
నది యని దండప్రణామంబు చేసిన నతండును సకలజనం
బులు నెఱుంగునట్లు సాటించిన నది కారణంబుగా విట
జనంబులు విచ్చలవిడి నమ్మదిరాక్షి యెదురం బొలయ మా
టాడ నెత్తరువునం జేరంగ నోడుదురు [4]మనతెఱం గెట్లో
యని శంకించెద ననిన విని యిట్లంటి.44
తే. చేయుకార్య మెయ్యది యను చింత యేల
చెలువ నాదెసఁ దగులుట చెప్పి తీవ
యిట్లు దలఁపులు దలకూరు నెగ్గులాడు
తల్లి నొకభంగి వంచించి యెల్ల రెఱుఁగ.45
వ. అది యెట్లం టేని.46
క. ఆనందంబున మాధవ
నేనకు మనతోలుతిత్తి చేర్చెద నని సం
ధానము పుచ్చి తదాత్మజ
నే నడిగెదఁ గపటవిద్య లెన్నటి కింకన్.47
వ. అని నిశ్చయించి వారియింటికడ నుచితసమయంబుల నెడ
యాడి పొడసూపి యెఱింగించుకొని యజ్జఱభిపాలికిం జని.48
తే. తగిలి ధనమిత్రు నజినరత్నంబు మీకు
నేన మ్రుచ్చిలి యిచ్చెదఁ బూని మీరు
రాగమంజరిఁ జిత్తానురాగ మెసఁగ
నాకు నిండని పుచ్చితి నయము మెఱసి.49
వ. అదియును నప్పలుకులకు మోసపోయి చర్మభస్త్రికవలనం
ధనదానంబులు సేయువిధం బడిగి పుత్తెంచినలోకం బెఱుంగ
నుదారకుండు విన్నవించిన తెరం గెఱుంగుదుర కదా
తమజాతికిం గోమట్లకు నిదిపసిండి యొసంగుట నిశ్చయంబు
దీనిం గైకొని రహస్యంబుగాఁ గల్పవిధానంబు నడపునది
యని పుచ్చికొన నియ్యకొలిపి మేము నిద్దఱముం గార్యా
లోచనంబు సేసి యర్థపతికి నపాయంబగునట్టి యుపాయం
బుం గని దనమిత్రునకుం గుబేరదత్తతనయం జేర్చికొనుట
ప్రకాశంబుగా నడపువార మై తదనురూపంబు లైన కరణీ
యంబులు నడపం బ్రవరిల్లుచుం దొల్లి మాపంపున నర్థపతిం
గొల్చి యలవడ మెలంగి యాప్తుండపోలె నున్న విమర్ద
కుం బిలిచి కఱపి నియోగించిన వాఁడును బలువురుఁ గూడి
యున్నయెడ నుదారకుం జేరి యి ట్లనియె.50
క. తివిరి యొకరుండు ము న్నుం
కువ వెట్టినదాని నడుగఁ గూడునె కలవా
రవుదురు గా కవ్విధమున
నవియంగాఁ బడుట కర్జ మగునే మీకున్.51
వ. న న్నేలినవానిం జీరికింగొనక కులపాలిక కట్టడతలఁపు వినుము.52
తే. అర్థపతి (నాబహిః)ప్రాణ మగుట యెపుడు
నెఱుఁగవే దానికొఱకుఁ జిచ్చుఱికియైనఁ
బాప మొనరించి యైనను నోపి నిన్ను
మసఁగి మర్దింపకున్నె విమర్దకుండు.53
ఆ. తోలుతిత్తి వడసి తోరంపుఁగాఁప వై
నీవు చిఱుమ నేల నేఁటిరాత్రి
కంటఁ బిడుకఁ బ్రామి గర్వంబు గిర్వంబు
నుడుప నైతినేని నొట్టువెట్టు.54
క. అని బెట్టిదములు పలికిన
విని సభ్యులు తన్నుఁ గినియ వెండియు నచ్చో
ననుచితములు పలుకుచుఁ బో
యె నతం డుద్ధతుఁడపోలె నెక్కడకేనిన్.55
క. అరిగిన నుదారకుండును
బరిభూతుఁడపోలె సాధుభావముతోడన్
దొరల కెఱిఁగించి వారలఁ
గరి గొని యేతెంచె నింటికడకుఁ గడంకన్.56
వ. అంత.57
క. జక్కవలు చెదరఁ గమలము
లొక్కమొగిన్ మొగుడఁ గైరవోత్కరములకున్
మక్కువలఁ దేంట్లు ముసరఁగఁ
గ్రక్కున నినుఁ డపరశిఖరికడకుం జనియెన్.58
వ. తదనంతరంబ.59
ఉ. దూరమునం బదార్థములు దోఁపక యుండఁగ మున్ను పర్వినన్
జేరువవానిఁ గన్మఱువు సేయుచు లోచనవృత్తి మాన్పుచున్
జారులు చోరులుం గరము సంతస మందఁగఁ జీకువాలు పెం
పారె జగంబు బెగ్గలము నచ్చెరుపాటునుఁ బొంద సాంద్ర మై.60
వ. అట్టియెడ.61
క. మామందిరంబుకుడ్యం
బేమిరువురుఁ గూడి కన్న మిడి యడుగుల చొ
ప్పేమియు నెఱుఁగకయుండం
గా మాటితి మప్పు డేను గడు నుత్సుకతన్.62
సీ. ధనమిత్రునకు నందుఁ జనియెద నని చెప్పి
నవ్వుచు నజినరత్నంబు పుచ్చి
కొని మత్ప్రియాగృహంబున కేఁగి యచ్చోట
మున్న సంకేతించి యున్నయెడకుఁ
జొచ్చి మాధవసేన నిచ్చమై నల్లన
తెలిపి దానికి దోలుతిత్తి యిచ్చి
కామమంజరికి నొక్కతెకు నెఱింగించి
రాగమంజరి ననురాగ మెసఁగ
తే. నపుడ వరియించి వారల యనుమతమున
నేను నదియును మాయింటి కేగుదెంచి
మదనుఁ జరితార్థుఁ గావించి మగుడ మగువ
ననిచిపుచ్చితి వేకువ యయ్యె నంత.63
క. మును నిగిడెడు నరుణాంశులు
వనజంబుల కెంపు గలసి వన్నియ మిగులం
దనుఁ గని లోకం బలరఁగ
నినుఁ డుదయాచలముశిఖర మెక్కెం బ్రీతిన్.64
వ. ఇట్లు సూర్యోదయం బగుటయుం దత్కాలోచితకరణీ
యంబు లాచరించి యిల్లు మ్రుచ్చులు చొచ్చుట పొరు
విండ్లవారు విన నాఘోషించి రాజు నవసరం బెఱింగి
యేను గఱపి వుచ్చ నుదారకుండు నగరికిం జని తన
యజినరత్నంబు కన్నంబునం బోయె నని ఖిన్నవదనుం డై
విన్నవించి వెండియు ని ట్లనియె.65
క. కారణము లేక నాతో
వైరము గొని యర్థపతి వివేకవిహీనుం
డై రేయుఁబగలు నుడుగక
పోరాడుచు నుండు నర్థమున గర్వమునన్.66
క. అతనికిఁ బ్రాణముకంటెను
హితుఁడు విమర్దకుఁడు పౌరు లెల్లను వినఁగా
నతిమానుషములు పలికెను
గతభయుఁ డై క్రొవ్వి గన్నుఁ గానక నన్నున్.67
వ. అని పలికి సభ్యులు దన్ను వారించుచుండ నంతం దని
వోవక.68
ఆ. తోలుతిత్తి వడసి తోరంపుఁగాఁప వై
నీవు చిఱుమ నేల నేటిరాత్రి
కంటఁబిడుకఁ బ్రామి గర్వంబు గిర్వంబు
నుడుప నైతినేని నొట్టువెట్టు.69
వ. అని యిడుపులు సాటుచుం జనియె.70
క. కావున నాతఁడు మ్రు చ్చగు
నావిజ్ఞాపనము బొం కనం జన దిటమీఁ
దే వెఱతు విన్నవింపఁగ
నావుడుఁ గరుణించి ధరణినాథుం డనియెన్.71
చ. అడలఁగ నేల యీక్షణమ యర్థపతిం బిలిపించి తెల్లఁగా
నడిగెదఁ జొప్పు దప్ప నతఁ డాడిన నప్పుడ పట్టి కట్టి పెన్
మడువునఁ ద్రొక్కఁ బంచెద విమర్దకు నాలుక వ్రయ్యఁ గోసి త్రు
ళ్ళడచెదఁ జర్మరత్నము రయంబునఁ దెచ్చెద నీకు నిచ్చెదన్.72
మ. అని యర్థాధిపతుల్యు నర్థపతి నన్యాయాత్మునింగా మనం
బున గాఢంబుగ నిశ్చయించి యలుకన్ భూపాలకుం డప్పు డా
తని నచ్చోటికిఁ బిల్వఁ బంచి మృదులోదారోక్తి శోభిల్ల ని
ట్లనియె న్నీకు విమర్దకుం డను భటుం డాప్తుం డటే? చెప్పుమా.73
క. నావుడుఁ బతితలఁ పెఱుఁగక
దేవా! యగు ననిన రా జతిత్వరితముగన్
రావింపు మనుడుఁ బోయె ని
జావాసంబునకు నతని నారసి తేరన్.74
వ. చని యయ్యెడం గానక వానిగృహంబునుం దత్సంచారప్ర
దేశంబులు నరసియుం గపటప్రకారం బని యెఱుంగ వెరవు
లేక పురంబు గలయం బరిభ్రమించి తల్లడం బడర మహీ
వల్లభుకడకు మరలం జనుదెంచి దేవా! వాని వెనకితిం గాన
ననినఁ గోపించి యతం డర్థపతిం జెరసాలు ద్రోపించె నిట
కామమంజరి చర్మభస్త్రికాకల్పక్రమం బాచరింపం దొడంగి
యన్యాయార్జితధనంబు లయ్యైవారిక యిచ్చుచుండి జిన
మునివేషంబున నున్న విరూపకు రావించి వాని వసునిచయం
బెల్ల నిచ్చి వసుపాలితనామం బన్వర్థంబు గావించిన వాఁడు
ను మదీయోపాయలబ్ధధనుం డై నావలనం బ్రీతిం
బొంది నిజవ్యవహారంబుల వర్తిల్లుచుండె నజ్జఱభిజంతయు
నజినరత్నమోహాశంజేసి కలకలిమి యెల్ల మృద్భాండ
శేషంబుగా వ్యయంబు సేసెం దత్సమయంబున నేను విచా
రించి యింక నొండుభంగి సేయక యెడ సేసితినేనిం దోలు
తిత్తి పసిండి గురియుట బొం కగు టెఱింగినఁ గర్జంబు
గా దని యొక్కయుపాయంబు దలంచి ధనమిత్రుం గఱపి
పుచ్చిన వాఁడును జనపతిపాలికిం బోయి నాసొమ్ము చేరిన
దెస కొంత యెఱింగితిం బోలునేని నవధరింపు మనుచుం
దండప్రణామంబు సేసి చేతులు మోడ్చి యి ట్లనియె.75
మ. ధరణీవల్లభ! విన్నపంబు ధనలుబ్ధస్వాంత యై లోభమం
జరి నాఁ బేర్కొను కామమంజరి కృపాసంపూర్ణచిత్తంబుతో
విరియం జల్లెడు వేనవేలు విధి నుర్విం బేద లై యున్నభూ
సురబృందమ్ములమీఁద నచ్చెరువుగా సొ మ్మెల్ల నానాటికిన్.76
తే. అజినరత్నకల్పంబుల కనుగుణంబు
లైన చెయ్వులు మాధవసేనయింటఁ
జెల్లుచున్నవి వీటివా రెల్ల నెఱుఁగ
దేవ! [5]యిట నిర్ణయింపంగ నీవ నేర్తు.77
క. అనిన నది వోలు మ్రుచ్చిమి
ధనములు లంజియలఁ జేరుఁ దథ్యముగా నో
పునె యరసి చూత మని య
మ్మనుజేంద్రుఁడు పిలువఁబంచె మాధవసేనన్.78
క. అదియును గార్యముఖం బి
ట్టిది యని తా నెఱుఁగ కునికి డెందములోనన్
బెదరక తొల్లిటిక్రియ నృప
సదనమునకుఁ బోవ నధికసరభసవృత్తిన్.79
వ. ఉన్నట్టియెడ నంతకుమున్న చొచ్చి యేమి పుట్టునో యని
యేను మాధవసేనమందిరంబునన యునికిం జేసి.80
క. చదురుందనమున మును దా
మదిఁ గనిన యుపాయ మీసమయమునఁ దగఁ జే
యుదు నని యేకాంతంబున
ముదిజఱభిం బిలిచి నివుణముగ నిట్లంటిన్.81
తే. వెల్లవిరిగాఁగ భూజను లెల్ల నెఱుఁగ
మీరు దానధర్మంబులు మేర దప్పఁ
జేసి యేకాంత మంతయుఁ గాసి పెట్టఁ
గడఁగి చిడిముడిపడుటయ కారణముగ.82
వ. చర్మరత్నంబు మీ యొద్దన యునికి యూహించి పిలువఁ
బంచెనోయని శంకి చెదం గల్పక్రమంబున నడపుటకు
మీరునుం గడువేగిరపడితిరి రాజులు తొడరిన ధనంబు
లొప్పింపవలయు వసుమతీశ్వరుండు నిన్ను రావించినపని
యదిగాక తప్పెనేనియు మనభాగ్యంబయ్యెడు నిదియ యగు
నేని యేమి సేయంగలవార మనిన విని మాధవసేన వడవడ
వడంకుచుఁ గామమంజరిం గూడఁ బిలిచి యిత్తెరం గెల్ల
నెఱింగించి శంకాకులమానస యయ్యె నంత నదియునుం
దానును నాతో ని ట్లనిరి.83
మ. ఇది నేఁ జెప్పినయట్ల వెల్ల విరియయ్యెన్ గూఢకార్యంబు వో
లదు నాఁ బోలు ననా దురాశలకు మూలం బయ్యె లోభంబు రా
జదయుం డై పొడువుండుకొట్టుఁ డని యాయాసంబునం బెట్టినం
దుది నీ కిచ్చు తెఱంగు చెప్పవలయున్ ద్రోహంబు గాకుండఁగన్.84
వ. అనిన నే నిట్లంటి.85
ఆ. ఏను జోరవృత్తి నిచ్చితినేనియు
మేలివస్తు వైన తోలుతిత్తి
డక్కు నెట్టు మీకుఁ గుక్కకుఁ డెంకాయ
దక్క దనిన పలుకు నిక్క మయ్యె.86
ఆ. నయము సూపియైన భయముననైనను
ధరణివిభుఁడు దాని నరయనట్టు
లడఁపరాక యిచ్చునప్పుడు ననుఁ జూపి
యిచ్చి యేమి వడయవచ్చు మీకు.87
వ. అని మాధవసేన మొగంబు చూచి మఱియు నిట్లంటి.88
క. ఇది మిముఁ జేరినవిధ మె
య్యది యని భూవిభుఁడు మిమ్ము నడిగిన మదిలో
బెదరక లంజెలతల్లుల
చదురుఁదనము మెఱయవలయు సభ లియ్యకొనన్.89
ఉ. కావున వేయు నేటికిఁ బ్రకాశముగా మును తస్కరత్వసం
భావితుడైన యర్థపతిపై నిడి మ్రుచ్చిమి నన్నుఁ దప్పఁగాఁ
ద్రోవుము దిట్టవై వెఱపుతో నటు సేయఁగఁ జాలకుండినన్
భూవరుచే తలన్ బ్రదుకఁబోలునె మీకును నాకు నెమ్మెయిన్.
క. నను నొక మెయిఁ గాచిన నీ
తనయయు మది సంతసించు దానికినై జీ
వన మే వెదకుదుఁ బదపడి
మనుగడ దొరకొనుఁ గ్రమక్రమంబున మనకున్.91
వ. అనిన విని మాధవసేన నాచెప్పినది కార్యంబుగాఁ గైకొని
యిట్ల చేయుదాన నని పూని నగరికి నరిగి నరపతియాస్థా
నంబు దఱియం జొచ్చి నిర్వికార యై ప్రణమిల్లిన సంతసిల్లి
సింహవర్మ యమ్మాధవసేనం జూచి యి ట్లనియె.92
తే. మీగృహంబున నీధనమిత్రు నజిన
రత్న మున్నది దెలియ నారసి యెఱింగి
నిన్ను రాఁబంచితిమి నీవు నున్న రూప
మేర్పడఁగఁ జెప్పు మది మీకు నెట్లు సేరె?93
వ. అనిన విని యదియును దేవా! దేవర పిలిచి యడుగ బొంకు
పలుకుట ప్రాణగొడ్డంబు చర్మభస్త్రిక మా యొద్ద నునికిగల
దవధరింపు మని యి ట్లనియె.94
సీ. అన్నంబు వెట్టి తెక్కలిగొని యంకంబు
పలువురతో నాడి బందివట్టి
జూదంబునకుఁ జొచ్చి చూఱకాండ్రం గూడి
పరదేశముల కేఁగి తెరువు లడిచి
యాలి రో యిడి తల్లి నాఁగి బిడ్డల నమ్మి
కన్నతండ్రులతోడఁ గయ్య మాడి
రాజులఁ గొల్చి క్రూరంపుఁజెయ్వులు సేసి
లజ్జాభిమానంబు లుజ్జగించి
తే. ధనము లార్జించి మిండాటమునకుఁ జొచ్చి
యిచ్చఁ గ్రీడింతు రింతవ ట్లెఱిఁగి యెఱిఁగి
యజినరత్నంబు మీ కిచ్చినాతఁ డెవ్వఁ
డతని నెఱిఁగింపు మని నన్ను నడుగఁ దగునె.95
క. అనవుడు నది యగు నైనను
మన సెఱిఁగిన తెఱఁగు నీకు మా టిడఁగావ
చ్చునె చెప్పకున్నఁ ద ప్పని
మనుజాధిపుఁ డాజ్ఞ సేసె మాధవసేనన్.96
వ. ఆజఱభి భయంబు నటించుచు ని ట్లనియె.97
ఉ. ఈతఁడు మాకు నిట్టి ధన మిచ్చినవాఁ డను టెల్ల లంజికా
మాతకు నీతి గా దుచితమార్గము దప్పుటఁ దిట్టుపాటు నీ
చేతఁ బరాభవంబు పడి చెప్పుట కష్టము చెప్పకుండ రా
దీతెఱఁ గెల్లఁ జెప్పెద మహీశ్వర! యెయ్యది యెట్లు వోయినన్.98
క. నాకూతుబొజుఁగు వినుము నృ
పా! కట విటవైశ్యుఁ డర్థపతి యను నాతం
డేకతమ యజినరత్నము
చీఁకటి నొకనాఁడు దెచ్చి చెచ్చెర నిచ్చెన్.99
క. అనిన విని యర్థపతిఁ దలఁ
దునిమించెద ననియె నలుకతో నధిపతి యా
తనికిఁ గృప పుట్ట నయ్యెడ
ధనమిత్రుఁడు సాఁగి మొక్క తా ని ట్లనియెన్.100
చ. వణిజులు తప్పు చేసినను వారల దండువ పెట్టఁ బంచి త
న్మణికనకాదివస్తువులు [6]మానక గైకొని వీటిలో సుహృ
ద్గణములఁ బొందకుండ నెడ గా నడుపం దగుఁగాక వారు దు
ర్గుణు లని మేదినీశ్వరుఁడు కోపమునం దెగఁజూడఁ బాడియే?101
క. అను పలుకు లమ్మహీశుఁడు
విని యతని దయాగుణంబు వేడుకతోడన్
గొనియాడి యర్థపతి ని
ర్ధనుఁ జేయుచుఁ బురము వెడలఁ దడయక యడిచెన్.102
వ. ఇట్లు నిష్కారణంబుగ నాదుమాయోపాయంబుల మోస
పోయి సింహవర్మ యర్థపతిం దండించి యజినరత్నంబు
కల్పక్రమంబున దరిద్రి యైన మాధవసేనకు వానియర్థంబు
నందుఁ గొండొక నిచ్చి దానియింట నున్న చర్మభస్త్రికఁ
దెప్పించి ధనమిత్రున కిప్పించిన నేము రహస్యంబున నమ్మహీ
పతిమాధవసేనార్థపతుల నపహసింపుచు నిశ్చింతంబున
నుండితిమి తదనంతరంబ కతిపయదినంబులకుఁ గుబేరదత్తు
నకు నభిమతార్థంబు లొసంగి యుదారకుండు కులపాలికం
బరిణయం బయ్యె నేనును రాగమంజరివలన భోగాయత్త
చిత్తుండ నై నానాఁటికి.103
క. పురుషార్థము వెలిగా నీ
పురమున ధనవంతు లైన పురుషుల నెల్లన్
దిరేపరులఁ జేసి మ్రుచ్చిమి
వెరవున నిక్కంపు సాధువేషముతోడన్.104
వ. ఇట్లు కుశలుండ నై వర్తిల్లుచుండియు నగపడ్డతెఱం గవ
ధరింపుము.105
మ. మనుజుం డెంతటివాడు దైవకృతముల్ మానింప లే డొక్కనాఁ
డనురాగంబున మద్యపానరతిమై నన్యోన్యగండూషసం
జనితప్రీతి మనోరమాసహిత మిచ్ఛాలీల వర్తిల్లి చే
తనవైకల్యముఁ బొంద నిల్వెడలి యుద్యత్తీవ్రఖడ్గంబుతోన్.106
వ. అర్ధరాత్రసమయంబున రాజవీధిం జనిచని యొక్కయెడ.107
మ. మదిరోన్మాదము మిక్కుటం బగుడు నున్మార్గప్రవర్తుండ నై
యిది కార్యం బవకార్య మిట్టి దని యూహింపం దలం పేది బె
ట్టిదు లై వచ్చుచునున్న యారెకులఁ గంటిం [7]గంటి నేఁడెందు వ
చ్చెద రంచుం జనఁ జొచ్చి యల్కక కరాసిం గ్రూరచేష్టుండ నై.108
క. కొందఱఁ జంపియుఁ గొందఱ
జిందఱవందఱలుగాఁగఁ జెడఁ దోలియు ను
న్నం దొలఁగియున్న యారెకు
లందఱు నొండొరులఁ గూడి యతివేగమునన్.109
క. పఱతెంచి పట్టి యెమ్ములు
నెఱచియు నొక్కంతగాఁగ నీడ్చియుఁ బెలుచం
జఱచియుఁ బొడిచియుఁ దాఁచియు
గుఱుమూఁకలు గూడఁ గిట్టికొని తమలోనన్.110
వ. మదీయవృత్తాంతంబు సెప్పికొనుచున్నంత.111
క. ఒడ లెఱఁగి విధికృతమునకు
గడుఁ జోద్యం బంది పూర్వకర్మఫలంబుల్
గుడువక పో నని చిత్తము
నొడఁబఱచుచు బ్రతుకునొఱపు లూహించునెడన్.112
వ. రాగమంజరియాప్తపరిచారికయు గూఢకృత్యనిపుణయు
శంఖసంభాషణయు నగు సృగాలిక యనునది నావెనుక
వచ్చినం జూచి తత్కాలోచితంబగు నొక్కయుపాయంబు
గని యది డాయం జనుదెంచిన దానిమొగంబు గనుంగొని
నీవు పిఱుందన పఱతెంచినదానికిం [8]బే రేమి మత్ప్రాణ
వల్లభ యగు రాగమంజరితోడ నాకుం గృత్రిమమిత్రుండైన
ధనమిత్రునకు సమాగమంబు సేసితివి గావున వానియజిన
రత్నంబును ని న్నేలినదాని యాభరణంబులు నపహరించితిఁ
బెక్కుచోట్లు మ్రుచ్చిలి తెచ్చిన ధనంబులు ప్రాణభయం
బునం జూపితినేనియు రెండుదెఱుంగులు నొప్పింపం జలంబు
సాధ్యం బయ్యె నింక నెట్టైనను వగపు లేదు నీయడియాస
లుడిగి పొమ్మనిన నదియును నప్పటిచావు దప్పింపఁ దలవరు
లకు ధనంబునాస సూపుటకు నాఘటించినకపటసూత్రంబు
గనుంగొని దైన్యంబు భావించి.113
సీ. ధనమిత్రు నజినరత్నంబు గ్రమ్మఱ వాని
కిచ్చిన నోకటి మే లీనినాఁడు
రెండు మే లది యటు లుండని [9]మ్మేను ని
న్నర్ధితో వేఁడెద నాదరింపు
చిరకాలపరిచర్య చేసిన రాగమం
జరికి నీ వొకతప్పు సైఁపవలయు
దొడవులు వెలియైనఁ బడపు పుట్టదు వెల
యాలికి నింతయు నాత్మ నెఱిఁగి
తే. యీరసము దలపోయక యీవు తొల్లి
మెలఁత ప్రీతితోఁ జేసిన మేలు దలఁచి
యకట! యిచ్చోట నడఁచితి ననుచు దాని
నిక్క మెఱిఁగింపు మని చాఁగి మ్రొక్కుటయును.114
వ. ఏను గరుణ భావించికొని తొడవులున్న కందువ సెప్పెద
ర మ్మని సృగాలికం జేరం బిలిచి నా బ్రతుకుఁదెరువునకుం
దగినమాటలు గఱపి యి ట్లంటి నిమ్మాటలు ధనమిత్రునకుం
జెప్పునది యీవృత్తాంతంబు రాగమంజరికి నెఱింగించునది
నీవు క్రమ్మఱ వచ్చి తొడవులు గాననిదాన వై నన్ను
దూరి పలుకునది యని యప్పటికిం దోఁచిన కార్యంబు గఱ
పెద ననిన నది తొడవులు గనినయదియ పోలె సంతోషిం
చుచు నన్ను దీవించి చనియె నారెకులు నాచేత ధనంబులు
చూపించుకొనువా రై పతి కెఱింగించువా రై సంకలియలం
బెట్టిరి మఱునాఁడు కారాగృహాధ్యక్షుండగు కాంతకుం డను
వాఁడు నాకడకుం జనుదెంచి.115
ఉ. తర్జనసాంత్వనక్రియల దండము సామముఁ జూపిచూపి చౌ
ర్యార్జితమైన సొమ్ము గొనునాస ననేకము లాడి యస్మదీ
యోర్జితగర్వయుక్తకఠినోక్తులకుం జిఱునవ్వు నవ్వుచున్
గర్జము చెప్పి నామనసు గానక యప్పుడె పోయె గ్రక్కునన్.116
ఉ. అక్కట! మాయ వెట్టి కలయాభరణంబులు దెచ్చి దిట్టయై
నిక్కమపోలె న న్బిలిచి నెట్టన కందువ చెప్పినట్లు వే
ఱొక్కెడ చూపె వీడు మొఱయో యనుచుం జెఱసాలలోనికిన్
గ్రక్కున నేఁగుదెంచిన సృగాలికఁ జూచి తలారు లందఱున్.117
తే. మంచి నిక్కముగలవాని మాట నమ్మి
తొడవులకుఁ బోయి తేర్పడ నడుగు మింక
నైన నెట్లునుఁ జెప్పక మానఁ డాతఁ
డని యనేకవిధంబుల నపహసింప.118
క. పడఁతుకయును దీనత న .
న్నడుగుచు నుండంగ నేను నది యెఱుఁగవు గా
వెడమాట లాడి పెద్దయుఁ
దడ వునిచితి దాని నచటఁ దగ వై యుండన్.119
వ. ఆలోన నదియు నల్లన నాతోడ నిట్లనియె దైవంబు నీ కను
కూలం బయ్యె వెఱవకుండు మె ట్లనిన నేను నీపనిచినట్లు
ధనమిత్రు పాలికిం జని మద్యపానంబునం బుట్టిన యున్మాదం
బునుం దన్మూలంబగు నవమానంబునుం జెప్పి నీవు రాజు
సన్నిధికిం బోయి దేవా! తొల్లి యర్థపతి యపహరించిన యజిన
రత్నంబును నీకారుణ్యంబునం జేరె నిప్పుడు రాగమంజరికి
మగం డైనవాఁ డొక్కజూదరి నాకుం గపటమిత్రుం డై
యుండి మిన్నక నన్ను వానితోడి పొందు గల్పించి యెగ్గు
లాడి నాయజినరత్నంబును రాగమంజరియాభరణంబులు
మ్రుచ్చిలికొని పోయి రాగమంజరిపరిచారికకుం దొడవు
లున్న కందువ సెప్పె నజినరత్నంబుఁ గను తెఱంగు దేవర యవ
ధరింపవలయు నని విన్నపంబు సేయు మివ్విధం బొనర్చిన
నీచెలికానికిం బ్రాణభయం బెడయు నంతకు నాతండును
దగిన కపటోపాయం బొనర్చికొన నేర్చు నని యెఱింగించిన
వాఁడును నట్ల చేసె రాగమంజరియునుం దలవరులచేత నీ
పట్టువడుట నావలన విని వికలచిత్త యై భవదీయచాతుర్యం
బున మరణంబు దప్పి యుండుటకుం గొండొక యూఱడిల్లి
యున్నయది యని యారెకులసందడిమాటల క్రందునం
జెప్పిన నేనును బ్రియం బంది తలవరులు విన నాజఱభి పలు
మాఱు నెడఁదాఁకుటకుం దగినయట్టి వెడము లొడ్డి పలికి
సృగాలిక నెడ గూర్చికొనుచుండితిఁ బదంపడి శృంఖలా
మోక్షణంబునకు నొక వెరవు గాంచి తగినయవసరంబున
నమ్మగువ కి ట్లంటి.120
సీ. భూనాథనందన యైన యంబాలికఁ
జేరి నీ వొకభంగిఁ జెలిమి చేసి
యయ్యింతికడ నిల్చి యనువునఁ గాంతకు
నకు మది [10]రాగంబు నాటుకొలిపి
యది యెఱుంగకయుండ నతనికిఁ దమకంబు
నానాఁటి కెక్కింపు దాన మనకు
వలయుకార్యంబుల వల నగు నింతయు
రాగమంజరి కనురాగ మెసఁగఁ
తే. జెప్పికొని దానియనుమతిఁ జిగురుఁబోఁడిఁ
గాంచి తగునుపాయనములు గారవమున
మాటిమాటికి నిచ్చుచు మచ్చికయును
బ్రియము పుట్టించి వర్తింపు నయము మెఱసి.121
క. అని పనిచిన నవుఁ గా కని
చని కతిపయదివసములకుఁ జనుదెంచి ప్రియం
బున నేకాంతపుసమయము
గని యి ట్లని చెప్పె నాసృగాలిక నాతోన్.122
క. అలవడ నంబాలిక నేఁ
గొలిచితి నీపనిచినట్ల కుసుమాయుధు త్రి
ప్పులఁ బెట్టితిఁ గాంతకు నీ
తలఁపు తలఁపు గూడె వినుము తద్విధ మెల్లన్.123
వ. ఒక్కనాఁ డొక్కతియ పరిసరంబున వర్తింప నమ్ముద్దియ
సౌధోపరిభాగంబుజాలకంబుచక్కటి నడయాడు నవ
సరంబునం గాంతకుండు న న్నరసి యచ్చేరువ నొరసికొని
యరుగుచుండం గని నాచేయం బూనిన కపటసంవిధానం
బున కిదియ యవసరం బని తలంచి వలభివలమానపారా
వతప్రహారవ్యాజంబున నతనిం జెంగలువపువ్వున వైచుచు
నప్పు డపహాసవచనంబుల నంబాలిక నగిపించిన వాఁడును
దానికిఁ బొంగిపోయి యక్కుమారి దన్ను వైచి నగుటకుం
గూర్మి పొంపిరివోవ.124
సీ. కనకంపుఁగోరతోఁ దనతమ్మ యిచ్చినఁ
గొనిపోయి నడుమన కూలఁ జల్లి
భూపాలనందన పుత్తెంచె నీ కని
నాతమ్మ యింపార నమలఁ బెట్టి
తలపువ్వు లొసఁగినఁ దలవీటనే వైచి
యిచ్చి వచ్చితి నని మెచ్చు వడసి
నాతలపువ్వులు నలినాయతేక్షణ
తలపువ్వు లని తెచ్చి తనకు నిచ్చి
ఆ. కపట మెఱుఁగకుండఁ గాంతకుఁ గాంతకు
బాలు చేసి చాల బేలు వెట్టి
యిత్తెఱంగు దెలియ నెఱిఁగింప వచ్చితిఁ
జెప్పు మింక నేమి సేయుదాన.125
వ. అనవుడు.126
క. నీవెరవుకలిమికిం దగ
దైవం బనుకూల మయ్యెఁ దడయక యింకం
గావింపు కొఱఁతకార్యము
దీవసమున నాతలంపు దీర్చెద నేనున్.127
క. విను మాతెఱంగు నీ వా
తనికడకుం బోయి నళినదళలోచనపొం
దున కెప్పు డెచట నను వగు
నని యాలోచనము సేసి యాసమయమునన్.128
వ. ఇట్లనుము.129
క. నీవున్న చోటి కాచెలిఁ
దేవచ్చునె యెల్లభంగి దేవర కవయం
గా వలయు నేనిఁ దగఁ గ
న్యావాసము సొరుము నీవ యనువైనగతిన్.130
చ. అదియును నెల్లభంగి వెర వారసి చూచితి నొండు లేదు బె
ట్టిదుఁ డగువాఁడు గన్న మిడి డెప్పర మేమియు లేకయుండ నం
చెద నని పూనెనేనిఁ దగఁ జేకుఱుఁ గోర్కి తొడంగు దీనికిన్
మదనునిచేత నమ్మగువ మానము దూలకమున్న గ్రక్కునన్.131
వ. మనకుంగన్నఁపుమ్రుచ్చు మంచివాఁడు కలిగెనేని మనో
రథంబు సాధింప నగు నను మని కఱపి పనిచిన నదియునుం
జని కాంతకుతోడం జతురంబుగాఁ బలికిన వాఁడును నదియ
కార్యంబుగాఁ గొని సంతసిల్లి సృగాలిక కి ట్లనియె.132
సీ. వీఁడు మ్రు చ్చగు నని వెఱవక పలుక సం
శయ మగు సాధువేషంబువాఁడు
గాలికిఁ జొరరాని కందువ లైన నొ
య్యనఁ జొర వెరపరి యైనవాఁడు
ద్రవ్యంబు డిగఁ ద్రావు దానగుణంబుఁ దా
నేర్చి కైకొనిపోవ నేర్చువాఁడు
ముట్టినఁ గలగొన్న మ్రుచ్చు విధమున మై
సూపక [11]తిరిగిపో నోపువాఁడు
తే. తన్ను వెదకెడివారికిఁ దాన తోడు
నడచి చదురుఁ డై మేడ్పడి యడుగువాఁడు
సూవె మీతొడవులు వెలిచూప కిపుడు
సంకలియ నున్న యాతండు సరసిజాక్షి!133
వ. అతని బుజ్జగించి లోను చేసికొని చెఱ విఱుగఁ జేసెద నని
వెడ్డువెట్టి కన్నంబు పెట్టించికొని రాజునకుం జెప్పి యిప్పుడ
సంకలియ పుచ్చి యనిచి పుచ్చెద నని యూఱడించి మగుడ
శృంఖలాయమితుం గావించి సురంగముఖంబునం జొచ్చి
యచ్చెలువచిత్తంబు చిత్తభవకేళిచాతుర్యంబున నాఁచికొని
నిగూఢనిపుణత్వంబు మెఱయం జనుదెంచెదఁ బదంపడి
వానిం జంపించునట్టి తెఱుంగు మాటలు మనుజేశ్వరునకుం
జెప్పి మెడ గోసి వైచెద నట్లుగాక తక్కినమ్రుచ్చుచేత
మనరహస్యంబు వెల్లివిరి యగు. నిశ్చయించి యట్లు సేయు
దము నీవ యప్పటియట్ల చని తొడవు లడుగు చుండు నే
నిదె వచ్చెద నని పుత్తెంచిన నదియును.134
క. చనుదెంచి నాకు నింతయు
మునుమున్న యెఱుంగఁ జెప్పె మోదంబున నే
నును నాదుకోర్కి చేకుఱె
నని పొంగియు మోము తొంటియట్లన యుండన్.135
వ. ఏమియు నెఱుంగనివాఁడన పోలె నున్నంత.136
క. తనతలఁ పొడఁగూడెనె యని
మనమున సంతసము పేర్మి వెలయుచు వేవే
చనుదెంచెం జెఱసాలకు
ననుఁ జూచుచుఁ గాంతకుండు నగుమొగ మొప్పన్.137
వ. ఇట్లు చనుదెంచి యాజఱభి పలుమాఱును దొడరు తొడ
వుల పెనఁకువఁ దీర్చుటకు ననునొంటిమెయి శాసించువాఁడు
నుం బోలెఁ బరిసరవర్తుల నెడ గలుగం బుచ్చి చేరి యల్లన
ని ట్లనియె138
తే. నిన్ను నమ్మితి నామది నున్న తెఱఁగు
నీకు నంతయుఁ జెప్పెద నాకు నొక్క
హితవు గావింపు మేదినీపతికిఁ జెప్పి
ప్రీతి యొసఁగంగ నిను విడిపింతు నేను.139
క. అనిన విని యట్ల చేసెద
నని పూనితి నాఁటిరాత్రి యతఁడును బ్రీతిన్
నను విగళితనిగళునిఁ గా
నొనరించి సురంగ సేయ నొక్కెడ సూపెన్.140
వ. చూపిన నేనునుఁ గాంతకుండును నిగూఢంబుగా మున్ను
దెచ్చిన కన్నపుఁగొయ్య పుచ్చికొని కట్టాయతం బై సృగా
లికాసమేతుం డగు నతండును గాఁపువాఁడు గా నిర్భయం
బున గంటి నాచూచినచక్కటికిం ద్రవ్వికొని కన్యాంతః
పురంబు కొలందికిఁ గొండొక నిలిపి మగుడం జనుదెంచిన.141
క. చొరువకు నెంతయుఁ దనకును
వెర వని నాచేతఁ దెలియ విని వెడ్డున నన్
మరలు గొలుపు వాఁ డై భూ
వరునకు నెఱిఁగించి విడుచువాఁడన యనుచున్.142
తే. సంకలియఁ బెట్ట వచ్చిన శంక లేక
గుండెతల బిట్టు దన్నినఁ గూలుటయును
రభసమున వానిమొలకఠారమ్ము పెఱికి
శిరము గోసితిఁ బలువడి నురముఁ ద్రొక్కి.143
వ. ఇట్లు దెగం జూచి వానిచిటికెనవ్రేల నొక్కముద్రిక మం
చిది యున్నం బుచ్చికొని భయవిస్మయాకులితచిత్త యైన
సృగాలిక నాలోకించి తగినమాటల బెదరు వాపి కొండొక
సే పిచ్చట నిలువు మిదె వచ్చెద నని చెప్పి.144
చ. బ్రదికితి నింక సంకలియ వాసినచోటికిఁ బోదుఁ గాక నా
కిది యది యేల నాక ధరణీశ్వరనందనఁ జూచు వేడ్క నె
మ్మది బిరిగొన్న మున్ సనినమార్గమునన్ జని యాకొఱంతయున్
బెదరక త్రవ్వి చొచ్చి రమణీయవిహారగృహాంతరంబునన్.145
క. అనుచారిణీజనంబులు
దనచుట్టును నిద్ర సేయఁ దల్పతలమునన్
దొనఁ బెట్టిన మదనశరము
ననుఁ గై నిద్రించుచున్న యట్టి లతాంగిన్.146
చ. కనుఁగొనునంత నామనసుఁ గన్నులు మన్మథుఁ డింతిపాలు చే
సిన మెలఁగంగ లేక గతచేష్టుఁడ నై యిది నిద్రవోవుచో
మనమున కింత పుట్టె గరిమం బగు విభ్రమ మంగకంబు నొం
దినతఱిఁ జూచువారలకు ధీరత యెక్కడి దంచు లోలతన్.147
తే. తమక మడరిన యప్పుడ తలిరుఁబోఁడిఁ
గవయఁ జూచియు ధృతి యూఁడి కార్య మరసి
నిద్ర దెలుపుట యుడిగి నా నెమ్మనమునఁ
గొందలముతోడి తలఁపులు సందడింప.148
వ. ఇట్లని యూహించితి.149
ఉ. చూడ్కులఁ జిత్తవృత్తి గని చొచ్చి నయంబుగ మాటిమాటికిన్
వేడ్కలు బెంచి యింపులగు విన్ననువుల్ దగఁ జేసిచేసి యా
మాడ్కి సరోజలోచనల మచ్చికమై నెలయించి యిక్కకుం
దోడ్కొని పోయి కాక మరుతోడి యలంతలు తీర్పవచ్చునే.150
మ. నడురే యిప్పుడు నిద్ర దెల్పుటయుఁ గన్యారత్న ముద్వేగముం
దొడర న్వింతతనంబునం బరిజనస్తోమంబు మేల్కాంచి సం
దడి సేయం దగ దిప్పుడీయబలఁ జెంతం జేరఁగావచ్చు టే
ర్పడఁగా నొక్కతెఱంగు చేసి చనినన్ రంజింపవచ్చుం దుదిన్.151
వ. ఏమియుపాయంబులనైనఁ బిదపఁ గార్యసిద్ధికిం దగినభంగి
చూచికొందు నని కందర్పు కారించుట కోర్చి శయ్యసమీ
పంబున నున్న పలకయుం జిత్రోపకరణంబులుం బుచ్చుకొని
నిద్రానిమీలితయైన యంబాలికారూపంబు చిత్రించి తత్ప
దానతంబుగా మదీయరూపంబును వ్రాసి యచ్చేరువ
నొక్క పద్యంబు లిఖించితి నది యెట్టి దనిన.152
తే. తరుణి! తగుబంట నీపదాంబురుహములకు
మ్రొక్కి యే విన్నవించితి నొక్కమాట
యెలమి రతి సల్పి నాయురస్స్థలముమీఁదఁ
దక్కఁ దక్కొంట నిద్రింపఁ దగునె? నీకు.153
వ. తదనతరంబ కాంచనపేటికాసమర్పితంబైన తాంబూలంబు
పుచ్చికొని తద్రసంబున సుధాభిత్తిం జక్రవాకమిథునంబు
చందంబుగా నుమిసి యంతం దనివోవక.154
క. మెలపున నయ్యంగనయం
గుళి నొకయుంగరము పుచ్చికొని యవుడు మదం
గుళిముద్ర దాని వేలం
జెలువుగ నేఁ దొడిగితిం బ్రసిద్ధము గాఁగన్.155
వ. అంత నే[12]ను వెడలివచ్చి యట మున్ను గాచికొని యుండు
చండసేనుం డనువానిఁ బిలిచి కాంతకు చావు చూపి
వీనిం బొడిచినవాఁడవు నీవు గాఁ జెప్పికొనుము నాయునికి
రాజు నెఱుంగుం గావున ధనమిత్రు నజినరత్నంబు మ్రుచ్చి
లికొని సంకలియ నున్న మ్రుచ్చుం బనిచి కన్నంబు పెట్టి
కొని కాంతకుండు కన్యాంతఃపురంబు సొరఁబాఱ నిరువురం
బొదివితి వాఁడు దప్పిపోయె వీఁ డగపడె నని జనపతికి
విన్నవించి మన్నన పడయుము నేఁడు మొదులుగాఁ బ్రాణ
సఖుండ వై యుండుము వలయుకార్యంబులకు నీకు నేనును
నాకు నీవునుం గా వర్తిల్లుదము సృగాలిక నెరవుగాఁ దలం
పక నాతోడిద కా విచారింపు మని కలయం బలికి యొం
డొరులుం బ్రమాణంబులు చేసికొని యాలింగనపూర్వకం
బుగా వీడుకొని యమ్మగువ వెనుకఁ జనుదేర నింటికిం జని
చని రాజమార్గంబునం దలవరుల నెదురం గని యొండు
తెఱంగున మొరంగి పోవమికి విచారించి మరులుఁదనం
బెక్కించికొనియెద నని దాని కెఱింగించి.156
సీ. చే సంకు వట్టుచుఁ జిడుపలు వెదకుచు
నొరిగాల దేవుచు నులికిపడుచు
విందులు విందులు విందు లంచును బఱ
తెంచి మ్రాఁకులు గౌఁగిలించుకొనుచు
మునుకుచు వెలుఁగుతో ముచ్చట లాడుచుఁ
బొరిపొరిఁ గూయుచు బొబ్బ లిడుచుఁ
గలమాట లాడుచు మొలపుండ్లమల్లనిఁ
బాడుచు నొడ లెల్ల బరికికొనుచు
తే. నేవముగ ఱొమ్ముపై నిండఁ ద్రేవు డొలుక
నన్న! కుడుములు దినవన్న! యనుచు డాసి
గుండ్రగ్రుడ్లను జూపుచు గునిసిగునిసి
బయలు నవ్వుచు బడుకిళ్ళు వాచికొనుచు.157
క. చనుట గనుఁగొని సృగాలిక
యనుమానము లేక వెనుక నతిరభసమునం
జనుదెంచి యారెకుల కి
ట్లనియెను శోకంబు గదిరినదియును బోలెన్.158
ఉ. పెక్కుదినంబు లేనిఁ జెఱఁ బెట్టితి నిప్పుడు వీనిమాటలం
జక్కన వెఱ్ఱి దీఱె నని సంకిల పుచ్చిన పాపజాతి నే
నెక్కడ సొచ్చుదాన మరు లెత్తి తనూజుఁడు పాఱుచున్నవాఁ
డక్కట! వానిఁ బట్టుకొనుఁడన్న కృపాపరులార! మ్రొక్కెదన్.159
వ. అనవుడు వార లి ట్లనిరి.160
క. చెఱ నున్నమరులుఁగొడుకుం
దెఱఁ గెఱుఁగక విడిచి వెనుకఁ దిరిగెద వింకన్
బఱచునెడ బట్టఁ జని యే
మఱిముఱిఁ [13]బోటాటు పడమె యాతనిచేతన్.161
వ. అనిన విని నే నయ్యారెకులదిక్కు మరలి.162
తే. నేలఁ జేతులు సమరి మై నిక్క మెల్ల
నలచి యుంకంచి యవుడులు గఱచుటయును
వార లద్దిరా! యని విచ్చి వలియ బాఱఁ
దోలికోని వారి నిలిపితి నూల వొడిచి.163
వ. దానికి వార లందఱుం బెలుచ నవ్వుచు నరిగిన.164
క. మరులుఁదన మచ్చుపడ ని
ప్పరుసునఁ దలవరుల మొఱఁగి పాఱితి నిద్రా
పరవశజనమగు హృదయే
శ్వరిసదనంబునకు మిగుల సంభ్రమలీలన్.165
వ. చని సృగాలికయుం దోన చనం బ్రవేశించి యమ్మెలంతుక
నిద్ర దెలిపి సంభ్రమంబునం జేర విరహవివర్ధితరాగమనో
హరంబును నాపదుద్ధరణహర్షిత్కర్షంబును నైన తదీయ
సమాగమం బనుభవించి మఱునాఁ డస్మదీయనివాసంబున
కరిగి సఖుం గలసి నిగూఢంబుగాఁ జరింపుచు రాగమంజరి
వలని మచ్చికయును రాజనందనదెస తగులంబును నుల్లం
బున నాటువడం జిక్కువడియు నత్తెఱం గెఱుకపడకయుండ
మదనకళాచాతుర్యధుర్యుండ నై వర్తించుచుండితి నక్కడఁ
జండసేనుండును గాంతకుమరణంబు కారణంబుగాఁ బతిచే
నతనిపదంబు వడసె నేనును సామదానంబుల సృగాలిక వశ
వర్తినిం గాఁ జేసికొని నాయంతర్గతం బెఱింగించి దానితో
ని ట్లంటి.166
తే. రాజనందనపాలికి రమణ నరిగి
యసువు గాంచియు నల్లన యరసి బెరసి
మనరహస్యంబు చెప్పక మగువచంద
మెల్ల నేర్పడ మెయిమెయి నెఱిఁగి రమ్ము.167
వ. అని పనిచిన నదియునుం జని కొండొకసేపునకు మగిడి వచ్చి
యి ట్లనియె.168
క. అంబాలికఁ జూచితి నది
శంబరరిపుసాయకముల సందడిఁ బడి యు
ల్లంబునఁ దల్లడ మందుచుఁ
బంబిన తమకంబు తేటపడ ని ట్లనియెన్.169
సీ. చెలియ! నీ కొక్కటి చెప్పెద విను మది
యింతకుమును బోటు లెఱుఁగ రేను
వేగుఁబోకటఁ గను విచ్చి పర్యంకంబు
చేరువఁ బడియున్న చిత్రఫలక
మందు నిద్రాసక్తి నవతరిల్లిన నాదు
రూపున కాదట మ్రొక్కినట్టి
యతిమనోహరపురుషాకృతియునుఁ బ్రీతిఁ
గనుఁగొని యెంతయుఁ గౌతుకమున
ఆ. దానిఁ బుచ్చికొని హృదయమున నొక్కటఁ
బ్రేమవిస్మయములు పిరిగొనంగఁ
గలయఁ జూచి దానికెలన లఘించిన
హృద్యమైన పద్య మేను గంటి.170
వ. కని తదీయార్థంబు నిరూపించిన.171
ఉ. ఏయెడ కేఁగుదెంచినను నేర్పడఁ గల్గొని చిత్రనైపుణ
శ్రీ యలవాటు చూపి తనచిత్తము దర్పకతీవ్రబాణతూ
ణాయిత మైనభంగి నిపుణంబుగ నా కెఱిఁగింపఁగోరి యీ
రే యొకరుండు వ్రాసె నధరికృతమన్మథుఁ డాతఁ డెవ్వఁడో.172
వ. అని వితర్కించుచుం చత్కాలజనితంబగు పరావలోకన
శంకాంకురంబునం బ్రచ్ఛదపటంబు పలకకు మాటు సేసి
నలుదిక్కులుఁ గలయం గనుంగొని కుడ్యంబునఁ దాంబూల
రసనిష్టీవననిర్మితం బైన చిత్రచక్రవాకమిథునం బవలోకించి
నదియునుం దత్కృతంబ కాఁ దలంచి దినముఖోచితకరణీ
యంబు లొకభంగి నాచరింపుచు నావ్రేల నొక్కవింత
ముద్రిక యున్న దాని వానివ్రేలియుంగరంబ కా నిశ్చయించి.173
క. మొగముపయి నప్పళింతును
బిగియారఁగఁ గౌఁగిలింతు బింబాధరసం
గిగఁ జేయుదు మారుఁడు విలుఁ
దెగఁ గొని యలరంపవానఁ దేల్చుచునుండన్.174
వ. అని చెప్పి యయ్యంగుళీయకంబును జిత్రఫలకముం జూపి
తత్ప్రాంతలిఖితం బైన పద్యంబునుం జదివించి నన్నుం
గలుపుకొని యి ట్లనియె.175
క. మన కెయ్యది కార్యం బా
తని నెమ్మయి నెఱుఁగవచ్చుఁ దగులంబున నె
మ్మన మురియఁ జొచ్చె మరుచే
సిన యీ తొడుసులకు నేమి సేయుదు నింకన్.176
వ. అని చలించిన.177
క మానవుఁ డైన నమర్త్యుం
డైనను గంధర్వుఁడైన యక్షుండైనన్
మానిని! యీరూపంబున
వానిం గొనివత్తు నీకు వల నేర్పడఁగన్.178
వ. అని పూనివచ్చితి నిటమీదం జేయవలయు తెఱంగు చెప్పు
మనిన సృగాలికం గౌఁగిలించుకొని సంభావించి యంబా
లికాసమాగమంబు సుకరంబు గా నూఱడిల్లి యాలోన
నెల్లరసంబులం గడచి హృదయంబునం గదురు దేవరవలని
తలంపునం జేసి యుదారకసహితుండ నై మరీచిపాలికిం జని
యమ్మహామునివలన భవద్దర్శనంబు కుఱంగటఁ గా నెఱింగి
సంతసిల్లి మగుడ వచ్చి నిపుణోపాయనిగూఢంబుగాఁ
గన్యాంతఃపురప్రవేశంబునకుం బ్రవర్తించి.179
సీ. కాంతకు పదవి నాకతమునం బడసిన
వాఁడు నమ్మినతాఁపికాఁడు గాఁగ
హితయును జాతుర్యవతియును నైన సృ
గాలిక తా నెడకత్తె గాఁగ
మున్ను నా పెట్టిన కన్నంబు నచ్చోటు
చొరవకునిమ్మగు తెరువు గాఁగ
నిద్రావసరమున నెలఁతసౌందర్యంబు ,
తొడరిన చిత్తంబు తోడు గాఁగఁ
ఆ. జొచ్చి వనితమనముఁ జొచ్చి క్రీడకుఁ జొచ్చి
యిచ్చ మెఱిసి ననుపు నిచ్చ క్రొత్త
చేసికొనుచుఁ జతురచేష్టల విహరించి
యొరు లెఱుంగకుండ నున్న యంత.180
క. ఆవనితయొప్పు లోకుల
చే వినుటం జండవర్మ చిత్తజు పటుబా
శావళిఁ దూలి సబలుఁ డై
వావిరి నడతెంచె సింహవర్మునిమీఁదన్.181
ఆ. వచ్చి కోటచుట్టు ముచ్చుట్టు వారంగఁ
బన్ని బిడ్డ నడిగి పనుచుటయును
నియ్యకొనక వెడలి యేపునఁ దలపడి
యతఁడు పట్టువడియె నతనిచేత.182
వ. చండవర్మయు నంబాలికవలని తగులంబు కారణంబుగాఁ
జంపాపతిం జంప నొల్లక శృంఖలానియమితుం జేసి యొక్క
లగ్నంబున నప్పొలంతిం బరిగ్రహించువాఁడై విభవంబు
మెఱసి వివాహగేహంబు చేరు నవసరంబున.183
క. ఏ నియ్యంబుజనేత్ర ని
ధానము సాధించినట్లు తగఁ బొందితి ని
స్సీ నాకన్నుల యెదురను
వీనికి నా లగునె నేను విడిచెద ననుచున్.184
చ. వెఱ పను పేరు చిత్తమున వీసమునంతయు లేక శత్రుపెం
పుఱక మహోగ్రకోపరస మొక్కఁడు తోడుగ సాహసంబునన్
గుఱుచకటార మే నతని గూఢముగాఁ గొనిపోయి చొచ్చి క్రి
క్కిఱిసినమూఁకలో నతని గీటడఁగం దెగఁ జూచి ద్రోచితిన్.185
వ. ఇవ్విధంబున మర్దించి.186
క. క్రందున నెఱ కైదువు గొని
కొంచఱ నొప్పించి పొదివి కొన్నిబలంబుల్
చిందఱవందఱగా నే
నందఱఁ దోలితిఁ బరాక్రమైకపరుఁడ నై.187
ఆ. ఇట్లు తోలి బీర మేపార నిలిచి త
త్కలకలమున భీతిఁ గదిరి తలఁకు
పడఁతి నూఱడిల్లఁ బలుకుచు మీఁదికా
ర్యంబు దలఁచుచున్న యవసరమున.188
చ. వగవ మనుష్యమాత్రమున వారికి దుష్కర మైనయట్టి యీ
మగతన మెవ్వఁ డిప్పుడు సమస్తజనస్తుతి కారణంబుగా
విగతభయాత్ముఁ డై నెఱపె వేగమ వాఁ డిట యేఁగుదెంచి తా
మొగపడునేని నియ్యెడ సముద్ధతి గైకొని కాతు నాతనిన్.189
వ. అని యిట్లు.190
క. కర్ణరసాయన మై య
భ్యర్ణంబున వెడలు వీరభూషణ మే నా
కర్ణించి వచ్చి నినుఁ గని
పూర్ణమనోరథుఁడ నైతి భువనైకనిధీ!191
క. అని చెప్పిన విని విస్మయ
మునుఁ బ్రీతియుఁ దనదుచిత్తమునఁ బెనగొన న
మ్మనుజేంద్రుఁ డతని సంభా
వనమున లజ్జాననమ్రవదనుం జేసెన్.192
వ. తదనంతరంబ.193
మ. ధనితాసంభవహర్షవర్షవికసద్ధాత్రీసురున్ విశ్వభూ
జనితాహ్లాదనసాంద్రనిర్మలయశశ్చంద్రాతపున్ గూఢసం
జనితాక్షీణవివేకవైభవనిరస్తన్ఫూర్జదంహోబలున్
వనితాబృందనవీనమానసభవున్ వందారుమందారునిన్.194
క. శ్రుతిసుభగమూర్తి నిఖిలా
మితమోదావహచరిత్రు మిత్రోదయజృం
భితహృదయపద్ముఁ బద్మా
తతనయను వచస్సమగ్రతాచతురాస్యున్.195
మాలిని. జలజసుభగనేత్రున్ సౌరవిద్యాపవిత్రున్
సులభసుగుణచిత్తున్ సోమభృద్భక్తిమత్తున్
గలివిలసనదూరున్ గామినీచిత్తచోరున్
గులజలరుహభానున్ గొమ్మనామాత్యసూనున్.196
గద్యము. ఇది సకలసుకవిజనప్రసాదవిభవ విలస దభినవదండి
నామధేయవిఖ్యాత కేతనార్యప్రణీతం బైన దశకుమార
చరిత్రం బను మహాకావ్యంబునందు షష్ఠాశ్వాసము.