దశకుమారచరిత్రము/పంచమాశ్వాసము

పంచమాశ్వాసము

శ్రీ యుతున కర్థిజనరా
     ధేయునకు నపారవిభవదేవేంద్రునకున్
     దోయజభవనిభునకుఁ గరు
     ణాయత్తాత్మునకుఁ దిక్కనామాత్యునకున్.1
వ. రాజవాహనమహీవల్లభునకుం దనచరితంబు చెప్పం దలంచి
     యధరాసనుం డగుచు నపహారవర్మ యి ట్లనియె. 2
సీ. ధరణీశ! నాఁడు వింధ్యములోన మము డించి
                    పోయిన నీచొప్పు రోయఁ దిరిగి
     యందఱు నెచ్చెలు లఖలదేశములకు
                    నరిగిన నేను నియ్యంగదేశ
     మునకు నేతెంచి సజ్జనుఁడు మరీచి వి
                    జ్ఞానలోచనుఁడు విశాలబుద్ధి
     గంగాతటంబునఁ గాననాంతరమున
                    వసియించు నని యెల్లవారిచేత
తే. వినుట నమ్మునిచే భవద్విధ మెఱుంగఁ
     (దలఁచి) తత్తపోవనములోపలికి నరిగి
     విన్ననై వెల్లఁబాఱుచు నున్నవాని
     దైన్యపరిగతముఖు నొక్కతపసిఁ గంటి3
క. కనుఁగొని మరీచి యనియెడు
     మునినాయకు పాదపద్మములు దర్శింపం

     జనుదెంచితి నాపుణ్యా
     త్ముని యున్నెడ సూపు నాకు మోదం బెసఁగన్.4
వ. అని యడిగి వెండియు ని ట్లంటి.5
ఆ. అతఁడు దివ్యబోధయుతమానసుం డని
     జనులు చెప్ప వింటి ననఘ! యతని
     వలన నాదు కూర్మిచెలిశుభాశుభములు
     గోరి వినుట నామనోరథంబు.6
చ. అన విని యాతఁ డి ట్లనియె నారయ నమ్ముని యట్టివాఁ డగున్
     విను మొకకారణంబున వివేకవిహీనతఁ బొంది యత్తపో
     ధనవిభవంబు గోలుపడి దైన్యదశాపరిపాకతప్తచే
     తనుఁ డగుచున్నవాఁడు విదితంబుగ నత్తెఱ గెల్లఁ జెప్పెదన్.7
వ. అది యెట్లనిన నొక్కనాఁ డిత్తరుమూలవేదికాతలంబున
     నత్తపోధనుండు సుఖాసీనుం డై యున్న యవసరంబున
     (నొక్కయువతి) యొక్కతియ సనుదెంచి ప్రణమిల్లి నిలిచిన
     యనంతరంబ తద్బంధువర్గం బెల్ల దానిపిఱుందన పఱతెంచి
     యుమ్మలికంబు దోఁప నొండొరులం గడవ దండప్రణామంబు
     సేసి నిలిచిన యెడ నవ్వెలంది విషాదంబును లజ్జయుఁ దోఁప
     నిట్లనియె.8
క. ఈసంస్కృతిదుఃఖమునకు
     వేసరి పరలోకసౌఖ్యవిపులప్రీతిం
     జేసి భవత్పాదంబులు
     డాసితిఁ గరుణింపు మక్కటా! యని నన్నున్.9

ఆ. అనిన దానిబడిన యరుగుదెంచిన బంధు
     జనులలోన నొక్క జఱభి మ్రొక్కి
     యిట్టు లనియె దేవ! యిది నాదు నందన
     వేశ్యధర్మ ముచితవృత్తి మాకు.10
వ. ఇక్కోమలి కులాచారంబులు డిగంద్రావి.11
క. తపమునకు వచ్చె నాపై
     నపరాధము వెట్టి లంజియల తల్లులు సే
     యుపనులు వెలిగా నొండక
     విపరీతము లేదు దాని వినుము మునీంద్రా!12
క. తనయఁ గని గారవంబున
     ననుదినమును సావధాన యై యొడికమునం
     బెనిచి పదంబడి యలజ
     వ్వన మగుటయు వేడ్కతోడ వారజముఖికిన్.13
సీ. పరిమితాహారంబు వాటించి యొడియంగ
                    ముల నాఁడునాఁటికి నలుగువెట్టి
     చదురైన మాటలు సడిసన్నఁ జెప్పి శృం
                    గారంబు గావించు క్రమము దెలిపి
     మెత్తని విద్యలు మేలుగా నెఱిఁగించి
                    యుపచారములు సేయు నొఱపు గఱపి
     సౌభాగ్యమునకునుం జాలిన నోములు
                    నోమించి పడయంగ నూలుకొలిపి
తే. పేరుఁ బెంపునుఁ గలవాఁడు ప్రియముతోడ
     నడిగి పుత్తెంచెనేని నెయ్యం బెఱింగి

     రేపు మాపని యాసలు చూపిచూపి
     యింపు పుట్టించి తుదిఁ బిలుపింపవలయు.14
క. ధనవంతుఁ డైనవానిం
     దన యిచ్చన దిరుగువాని దానగుణమునం
     బనుపడువానిం గైకొని
     యనుపంగావలయుఁ గూఁతు నాతనికడకున్.15
క. మగలం బలువురఁ దన్నుం
     దగిలింపఁగ నొఱవు గఱపి తా నొక్కనిపైఁ
     దగులము సేసిన నొకమెయి
     మగిడింపుచుఁ గూఁతుఁ బడపు మరపఁగవలయున్.16
సీ. ఒరుఁ డొసంగినయీగి పురుడు సూపుచు లోభి
                    చే నర్థ మొయ్యనఁ జేఁదికొనుచుఁ
     బురుడు సూపిననైనఁ బుడుక నేరనివాని
                    సంగడిఁ బొచ్చెపో నాఁగికొనుచు
     నాఁగిన సరకు సేయనివాని ధనము భూ
                    తలనాథునకుఁ జెప్పి బలిమిఁ గొనుచు
     ధన మెల్ల నిచ్చి పేదఱిక మొందినవాని
                    కీగిగా ధన మిచ్చి యేదికొనుచుఁ
తే. బందువులు శోభనంబులు బహువిధంబు
     లైన నోములు సమకట్టి జానుమీఱి
     యల్లుతండంబుచే ధన మెల్లఁ గొనుచు
     మెలఁగుటలు వారసతుల తల్లులకుఁ బనులు.17
ఉ. కావున నివ్విధంబునన గారవ మొప్పఁగ నేఁటిదాఁక వే
     శ్యావలిలోనఁ దన్ను వెలయం గొనియాడితి నేఁ డళీకసం

     భావనుఁ డైన యొక్కరునిపాలికి లోలతఁ బోవ వచ్చినం
     బోవకు మంటి నావుడుఁ దపోవనభూమికి వచ్చెఁ జెచ్చెరన్.18
తే. తపము వడయుదు నని వెఱ్ఱితనము మిగిలి
     వినదు నామాట దేవ! నీ వనునయించి
     యెన్ని భంగులనైన [1][ను హితము సెప్పి
     కూఁతు నింటికిఁ బంపి మాకులము నిలుపు.19
మ. అని దైన్యంబున వేశ్యమాత మిగులం బ్రార్థింప నార్ద్రాత్ముఁడై
     వనవాసంబునఁ గష్టముం దపము సాఫల్యంబునుం జెప్పి జ
     వ్వని నవ్వేశ్య బహుప్రకారముల నిర్బంధించి పొమ్మన్న న
     మ్మునివాక్యంబుల నాలకించి యనియెం బూఁబోఁడి నారూఢిగన్.20
క. దేవా! మీపదసేవను
     భావించియ వచ్చియుంటి వలదని యనుచో
     బావకుఁడే శరణం బగుఁ
     దావక సన్నిధిన] యింత తథ్యము సుమ్మీ!21
వ. అనిన విని యొం డెట్టియుం బలుకనేరక దానితల్లి మొగంబు
     గనుంగొని యమ్ముని యిట్లనియె.22
ఉ. కోపము పొంగుఁ గ్రుంగు నొకకొన్నిదినంబులు కాననాంతర
     వ్యాపితఖేద మొందిన నవశ్యము నంత ననంతదుఃఖసం
     తాపిత యై తుదిం దెలిసి తాన మదిం దలపోసి చూచి ని

     ల్పోపక వచ్చు నింద్రియసుఖోత్సుకమైన తలంపుపెంపునన్.23
క. మీ రొం డెద్దియుఁ జెప్పక
     బోరనఁ బొం డనిన వారు పోయినతుది నా
     చారవిశారద యై ముని
     నారాధింపం దొడంగె నమ్మగువ దగన్.24
వ. ఒక్కనాఁ డయ్యింతి యేకాంతంబునం జతుర్వర్గవిషయంబు
     లగు సంభాషణంబులు పుట్టించిన యెడం దదాలాపమాధు
     ర్యంబునం ధైర్యం బెడలి యత్తపోధనుండు కామప్రకా
     రంబు దానివలనం దెలియం దలంచి తక్కినపురుషార్థమ్ములు
     వేఱవేఱ దాని కెఱింగించి యుల్లంబున ననురాగంబు గదుర
     నల్లన యిట్లనియె.25
క. కామం బను పురుషార్థము
     నామము వినియు నిది దక్క నలినానన! యే
     నేమియు నెఱుంగఁ జెపుమా
     యేమిట నది నడుచు సిద్ధి యెమ్మెయిఁ బొందున్.26
తే. అనిన విని వికసిల్లి యిట్లనియె నింతి
     యేను మీకు నెఱింగింప నెంతదాన
     నైన నామది నెఱిఁగినయంతవట్టు
     విన్నవించెద నేర్పడ వినుఁడు దాని.27
చ. అలరులుఁ బూఁత లంబరము లాభరణంబులు దమ్ములంబు నె
     చ్చెలులు మృదూపధానములు సెజ్జలుఁ గేలిగృహంబులాదిగాఁ
     గలుగు పదార్థము ల్నడుపుఁ గామము దాను మనోహరంబు త

     త్ఫలమగు సౌఖ్యసిద్ధిఁ దెలుపన్ వశమే యనుభూతిఁ దక్కఁగన్.28
క. అనిన విని యత్తపోధను
     డనయము రాగాంధుఁ డగుచు నంగనతో ని
     ట్లనియెం గామంబున వ
     ర్తనమును సిద్ధియునుఁ జూపు తరుణీ! నాకున్.29
వ. అనవుడు నవ్వనిత యతనిధృతి గోలుపోవుట యెఱింగి
     తేఁకువ సెడి యిట్లనియె.30
క. రమణీయములగు నుపకర
     ణములన కామము ప్రవర్ధనం బగు నని యే
     నమితకృపాకర! చెప్పనె
     సముచితముగ రండు నాదు సదనంబునకున్.31
క. అచట మనోహరవస్తు
     ప్రచయంబునఁ గామతంత్రపాండిత్యము మీ
     కుచితంబుగఁ దెలిపెఁద ద
     ద్రచనకు సిద్ధికి మనంబు ప్రమదం బొందన్.32
వ. మీ రందు వేంచేయుటకు నామీఁదికారుణ్యంబు కారణం
     బుగా నెపంబు వెట్టి జనుల వంచించి వాంఛితంబు సఫలంబు
     సేసికొని మగుడ వత్తు మనవుడు ననంగవికారపారవశ్యం
     బున నొడంబడి చుంబకశిలాప్రతిమం దగులునయోరూపం
     బునుంబోలె ముని తనపజ్జ నరుగుదేరం దరుణి రాజ
     మందిరంబునకుం జని యంగనాపరివృతుం డగుచు నున్న
     యంగాధీశ్వరునకుం బ్రణమిల్లిన నమ్మహీవల్లభుండు విస్మితుం
     డగుచు నయ్యిరువురం గనుంగొని యిమ్మహాముని యిట

     రాకకుం గారణం బేమి యని యక్కోమలి నడిగిన న
     క్కొలువులో నొక్కలేమ లేచి యిట్లనియె.33
క. వనమున కరిగి మరీచిని
     మనసిజమదమత్తుఁ జేసి మనవీటికిఁ దె
     చ్చినవనితకు వరువుడ నని
     జననాథా! పన్నిదంబు సఱచినదానన్.34
సీ. నాతోడఁ బురుడించు నాతు లందఱు వినఁ
                    బ్రతినలు గొని వనాభ్యంతరమున
     కరిగి మేడ్పఱచి కామాతురుఁ జేసి యి
                    మ్మునినాథు నిట దెచ్చె ముదముతోడఁ
     గావున నేఁ డాదిగాఁ గామమంజరి
                    వరుసతోఁ బనిచినవరవుఁబనులు
     దప్పక చేయుచు దాసినై యుండెద
                    ననవుడు జననాథుఁ డపహసించె
తే. నాతు లందఱు మునిఁ జూచి నవ్వఁదొడఁగి
     రతఁడు లజ్జించి క్రమ్మఱి యరుగుదెంచె
     నిట్టి పాలసుఁ జూడంగ నేల నీకు
     నెఱుఁగఁ జెప్పెద విను మాతఁ డేన సుమ్ము.35
వ. ఈదృశుండైన నావలన సాధించు మనోరథంబునుం గలదె
     యైనను.36
క. కలఁగినచిత్తము దృఢముగ
     నిలిపి విచారించి యేను నీచెలికాఁ డి
     మ్ముల నున్న చంద మేర్పడఁ
     దెలిపెద నేతెమ్ము కొన్నిదివసంబులకున్.37

వ. అనిన విని విషాచం బంది సుందరులదెస యాసక్తి యింత
     కీ డగునే యని తలంచుచు సవినయంబుగా నమ్మునిపతికిం
     బ్రణమిల్లి.38
తే. వీడుకొని వచ్చివచ్చి యవ్వీటియొద్ద
     భాసురంబైన యొక జైనపల్లెపొంతఁ
     ద్రోవచేరువఁ గొండొక మ్రానిక్రేవఁ
     జూడఁ బొలుపారి తనుపగు నీడ నిలిచి.39
సీ. భూరేణుపటలంటు పొదివిన వక్షంబుఁ
                    గన్నీటఁ దోడ్తోడఁ గడుగువాని
     డాకేలు సెక్కున డాపిడి తనలోనఁ
                    దలపోసి తలపోసి యలయువాని
     ధరలోనఁ గలుగు నొప్పరమిండలకు నెల్ల
                    మొరలు నాఁ జాలిన మూర్తివాని
     బరివోవ నూఁచినఁ బలుచనై తలమీఁదఁ
                    దూఁగాడు వెండ్రుకతోఁకవానిఁ
తే. గూటికుంచెయు వెడచింపిచేట కెలన
     దొంతిబుఱ్ఱల చిక్కంబు పొంతఁ బెట్టి
     వగలఁ బొగిలెడువాని నిర్వాణి నొక్క
     తరుణతాపసిఁ గాంచితి ధరణినాథ!40
క. కని కృపయు వితర్కము నా
     మనమున ముప్పిరిగొనం గ్రమంబున నే నా
     తనికొలఁది దెలియుతలఁపున
     జనపాలకతిలక! డాయఁ జని యి ట్లంటిన్.41

తే. ఎగ్గు గాదేని యెఱిఁగింపు మిష్ట మేని
     నిన్ను నడిగెద నొకమాట నిష్ఠ నిట్లు
     తపసివేషంబు గైకొని తగవుగాని
     శోకమున నేల పొగిలెదు నాకుఁ జెపుమ!42
వ. అనిన నతం డి ట్లనియె నే నీచంపానగరంబున సంపన్నుం
     డైన నిధిపాలుం డను వైశ్యు నగ్రనందనుండ వసుపాలితుం
     డును విరూపకుండును నను నామద్వయంబులకు ననురూ
     పంబు లైన ధనరూపంబులు గలుగువాఁడ నిందొక్కరుండు
     సుందరక నామధేయుండు సుందరాకారంబు గలిగి హీన
     ధనుం డగువాఁడు గలండు నాకును వానికి ధనరూపంబుల
     నీసువైరంబు గావింపం దలంచి వైరోపజీవులయిన సౌరధూ
     ర్తులు వేశ్యావిషయంబు లైన యాలాపంబులు ప్రసంగించి.43
క. ధనమునకు రూప మధికము
     ధన మధికము రూపమునకు ధనమును రూపం
     బును సరి యని పలుకుచు దు
     ర్జనభావము వెలయ వాదు సమకట్టి రొగిన్.44
ఉ. సుందరకుండు నేనును నసూయతనంబున వారిత్రిప్పులం
     గ్రందొనరించి యొండొరులఁ గష్టపుఁదిట్టులు దిట్టుచున్నచో
     నందఱు గూడి యొక్కసమయంబు క్రమంబున నిశ్చయించి మా
     మంచట మాన్చి యి ట్లనిరి మానుగఁ దా రనుకూలశత్రు లై.45
క. ధనవంతుడు రూపసియును
     మనమునఁ దలపోయ నధికమాన్యులు ప్రౌఢాం

     గన నెమ్మది కనురాగము
     పొనరింపఁగఁ జాలు నతఁడ పురుషుం డెందున్.46
వ. కావున.47
తే. లక్ష్మికూరిమిసుతు రాజ్యలక్ష్మివోని
     కామమంజరి యను వారకాంత గలదు
     దానిచేత మీయర్థసౌందర్యతార
     తమ్య మేర్పడు మీరలు దాని కిపుడు.48
వ. రో యిచ్చి పుచ్చుం డిదియ సర్వజనసమ్మతంబైన కార్యం
     బిట్లు సేయనినాఁడు మీయన్యోన్యవివాదంబులకు నిర్ణ
     యింప నశక్యం బని యొక్కశుభగపతాక గల్పించి కుంటె
     నీలుగా నిరువుల సమకట్టి.49
క. మీరలు వీ రిద్దఱికై
     యారాజీవాక్షియింటి కరిగి ప్రియముమైఁ
     జేరి చతురు లై రో యీఁ
     గోరుట యెఱిఁగించుటయునుఁ గోమలి ప్రీతిన్.50
ఉ. ఎవ్వనిదూతఁ గైకొనియె నెవ్వనియున్నెడ కేగుదెంచెఁ దా
     నెవ్వానిఁ బ్రీతిఁ గైకొనియె నెవ్వనితోఁ బలికెం బ్రియంబుమై
     నెవ్వనిచెట్టఁ బట్టెఁ దగ నెవ్వని నింటికిఁ బిల్చె వాఁడు నేఁ
     డివ్విజయధ్వజంబునకు నీశుఁ డగున్ సుభగత్వ మేర్పడన్.51
వ. అని పలికినం గపటమతు లైన విటజనంబుల మాటలకుం
     దగులువడి మచ్చరంబున నజ్జోటికూటంబు వాటింపం
     దలంచి యేము గుంటెనీయులం బుచ్చిన నచ్చెలువయు.52

మ. సభలో నాకడ కేగుదెంచి నిజదృగ్జాలంబు నీలోత్పల
     ప్రభల న్నింపఁగ [2]మోవి లేనగ విగుర్పన్ నన్ను వీక్షించి మ
     త్సుభగత్వంబు [3]నుతించి సుందరకుఁ దేజోహీనుఁ గావించినన్
     సభికవ్రాతము పిచ్చలించె నను నాసొస్తోత్రవాక్యంబులన్.53
వ. అప్పు డత్యంతరాగాక్రాంతచిత్తుడనైన నన్నుం దన
     యింటికిం దోడ్కొని చని సముచితకరణీయంబులను మదన
     వికారానురూపప్రకారంబులను నాసక్తుం జేసి.54
క. నాయింటి మొల్లమునకును
     నా యొడలికిఁ బ్రాణములకు నావారికిఁ దా
     నాయిక యై (వల) నేర్పడ
     నాయంబుజనేత్ర నన్ను నడగో ల్గొనియెన్.55
క. ధన మంతయుఁ గొని కతిపయ
     దినములలో గోఁచి యిచ్చి ధృతి మాల్చి మడిం
     గనికరము మాలి కోమలి
     వినువారలు గేలిగొనఁగ వెడలం ద్రోచెన్.56
వ. అట్టియెడ.57
క. గురుజనధిక్కరణంబులు
     పురజనపరిహాసవచనములు బంధుజన
     స్ఫురితోల్లాసములు వినఁగ
     విరసము లగుటయు విషాదవేదనతోడన్.58
క. మిండాట మాడి పొలిసిన
     మిండలకును జైనవృత్తి మే లని మదిలో

     నొండు తలఁ పుడిగి జినముని
     మండలికృప వడసి యొక్క మాంత్రికుచేతన్.59
వ. దీక్షితుండ నై దౌర్భాగ్యంబు కారణంబుగాఁ బుట్టిన వైరా
     గ్యంబునం గట్టిన కచ్చడంబునుం బుచ్చివైచి జైనవర్తనం
     బులు నిర్వర్తింపం దొడంగి నడపం జాలక వనంబులోపలం
     దన వలచినట్లు దిరుగు కరి పట్టువడి యాఁకటి కోర్వక తల
     రువిధంబున.60
సీ. అందంద బూడిద యప్పళించుచు వెండ్రు
                    కలు పీఁకు వేదన కలసియలసి
     కడుపార నశనంబు గానక తొల్లింటి
                     కడుపు లారట దోఁపఁ గుందికుంది
     నిరతంబు బ్రహ్మాదిసురకోటి నిందించు
                    దోసంబు మదిఁ దలపోసిపోసి
     శీతాతపంబులచే రేయుఁ బగలును
                    బెగడొంది తోడోడ వగచినగచి
ఆ. ధనము గోలుపోక కనయంబు వెరవేది
     యిహపరార్థసుఖము లెడలియెడలి
     యేడ్చుచున్నవాఁడ నేమని చెప్పుదు
     నన్నఁ గరుణ నిట్టు లంటి నేను.61
ఉ. సమ్మద మంది కొన్నిదివసంబులు వేదన దక్కి నిల్వు నీ
     సొమ్మది యెంత యెంతయునుఁ జోద్యతరంబుగఁ దెచ్చి నీదుపా
     దమ్ములకుం బ్రియం బడరఁ దల్లియుఁ దానును మ్రొక్కి వేశ్య గై
     కొమ్మని యిచ్చునట్లుగను గోరి యుపాయము సేయ నోపుదున్.62

వ. అని యి ట్లూఱడిలం బలికి నీ వీజైనపల్లియ వసియింపు మని
     నియమించి యచ్చోటు వాసి నగరంబు దరియం జనిచని
     యొక్క యెడ నక్షధూర్తుల వెంటంగని యచ్చోటింబోయి.63
సీ. [4](ఇరవారు నిరువదియేను జూదములందు
                    నెనలేని నేర్పరితనము చూపి)
     క్రైయధికంబుగఁ గల్లసారెలు వైచి
                    యెక్కుదాయంబుల యెడలు గడపి
     యరుదైన తాలుకతనము పాసికలను
                    వలసినదాయంబు వైచికొనుచుఁ
     దప్పనాడినఁ గని తప్పార్ప వచ్చిన
                    లేదు లే దని తుది వాదు వెట్టి
తే. చావునకుఁ దెగినంతియ సంభ్రమించి
     సత్యములు సేసి సభికుల సాక్షి గోరి
     యంతఁ బోవక తద్వాదు లైనవారిఁ
     బాడి యడుగుచు మందట లాడియాడి.64
సీ. బలియుఁ డోడినధనములు గొనఁజాలక
                    పుడికిన(దానితోఁ) బోవువారు
     ననదలు గెలిచి వారడిగిన నేమియు
                    విడువక ధనములు వడయువారు
     నోడిన ధన మింక నాడినం గాని యేఁ
                    బెట్టఁ జూ పొమ్మని పెనఁచువారు

     గెలిచినధన మెల్లఁ బలకప్పె నప్పుడ
                    పెట్టక పోనీక కట్టువారు
తే. బొత్తుగా నాడి యోటమి పొత్తువారి
     మీఁద లెక్కించి వంచన మెఱయువారు
     లంచములు గొని యెడం బొరలంగఁ బలికి
     పెద్దవెలయాటఁ దెగ గెలిపించువారు.65
వ. ఇ ట్లనేకప్రకారంబుల నక్షకేలిం దగిలి యున్నవారలం
     గనుంగొనుసమయంబున నొక్కరుండు దనకు వచ్చిన
     దాయంబు దప్ప నాడంబోయిన.66
తే. ఆట చూపంగఁ దగమి నే నల్ల నవ్వి
     యతనిమోము వీక్షించిన నాగ్రహమున
     నెదిరిజూదరి కనుఁగవ నెఱ్ఱ మిగుల
     నన్నుఁ గనలునఁ దేరకొనంగఁ జూచి.67
ఆ. వలను మెఱసినట్టివాఁడన పోలె నై
     యాట చూసి తిపుడు తేటపడఁగ
     వాఁడు నేరఁ డీవు వలఁతివి నాతోడ
     నాడు మనిన భాగి యనుమతమున.68
క. సారెలుఁ బలకయుఁ గైకొని
     నేరిమి మై నాడి ధనము నెరయఁగఁ గొని దు
     ర్వారుం డగు నాజూదరి
     నోరు మడిచి తద్ జ్ఞజనవినుతి చెలఁగంగన్.69
వ. భాగంబు మేరకొలందికి మిక్కిలి యిచ్చి తక్కినధనంబు
     సగంబు చాగంబు సేసి విమర్దకాహ్వయుఁడైన యబ్భాగి
     వేడుకపడి తనయింటికిం బిలిచినం బోయి సముచితమజ్జన

     భోజనంబు లాచరించి ధనంబు సవరింప మనంబునం జలం
     బెత్తి మ్రుచ్చిమి వెలిగా శీఘ్రోపాయం బొండు లేదని
     నిశ్చయించి.70
ఉ. వానికతంబునం బురమువారలలోపల నర్థవంతులన్
     హీనుల నేర్పడం దెలిసి యిండులకందువ కేఁగి పొందులుం
     గోనలుఁ జూచునంత రని గ్రుంకి పదంపడి తోడుతోడఁ బె
     ల్లె నిఖిలంబునుం దనమయంబుగ సంతమసంబు వచ్చినన్.71
చ. పొయి తల నీలిదిం డొలికిబూడిద ముండులబంతి గాలచీ
     రయు సెలగోల కత్తి భ్రమరమ్ముల క్రోలును మైలమందు గొ
     య్యయు నురి గ్రొంకి నారసము నాదిగఁ గల్గిన సాధనంబుల
     న్నియు సమకూరఁ జేసికొని నేర్పున నేఁగితి మ్రుచ్చు ప్రొద్దునన్72
క. చని గంటి పెట్టి యే నొక
     ధనవంతుని యిల్లు సొచ్చి ధనమంతయుఁ గై
     కొని వచ్చివచ్చి మణిగణ
     కనదాకల్పయగు నొక్కకాంతం గంటిన్.73
వ. కని డాయం బోయి.74
శా. ఈకాంతం బగు భూషణప్రతతితో నీచీఁకటిన్ శంక లే
     కేకాంతంబున నిట్టి నట్టనడురే యెచ్చోటికిం బోయె దా
     లోకింపం గడుఁ జోద్యమైనయది వాలుంగంటి! సంప్రీతితో
     నాకుం జెప్పుము నావుడున్ వడఁకు మేనం బుట్టఁగా ని ట్లనున్.75
శా. అన్నా! యిన్నగరంబులోపల ధనాధ్యక్షుండునుంబోలె సం
     పన్నశ్రీయుతుఁ డై వణిగ్జనులలోఁ బ్రఖ్యాతచారిత్రుఁ డై

     యెన్నంజాలు కుబేరదత్తసుత నే నింసార మాతండ్రి తా
     నన్నుం బెండిలి సేయ వేడ్క పడి నానాబంధుసంప్రీతితోన్.76
క. ధనమిత్రుం డను సెట్టికి
     నను వాగ్దత్తంబు సేసినం దద్గుణవ
     ర్తనరూపవిలాసంబులు
     వినియుం గనియును మనంబు వేడుక పొందెన్.77
వ. అంత.78
క. తనతండ్రి యైన వసుమి
     త్రునిపిమ్మట నతులకీర్తిదోహలి యై త
     ద్ధనవర్గంబుం గతిపయ
     దినములలోనన యతండు దీనుల కిచ్చెన్.79
వ. ఇ ట్లుదారతారూఢుం డై నూరిజనంబులచేత నుదారుం
     డను పేరు వడసి.80
క. తనకుఁ గల యర్థ మంతయు
     ననురాగముతోడ నిచ్చి యర్థులచే ని
     ర్ధనవృత్తిఁ జెట్ట గొనియెనొ
     యనఁగ నుదారుండు లేమి కనుగల మయ్యెన్.81
వ. ఇవ్విధంబున హీనధనుం డైన నీ నొల్లక మదీయజన
     కుండు.82
క. అర్థపతి యనఁగ నిం దొకఁ
     డర్థపతిప్రతిముఁ డున్న నతనికి సతిఁ గాఁ
     బ్రార్థించి యిచ్చువాఁ డై
     యర్థాదేశమున నుచిత మారయఁ డయ్యెన్.83

క. ఇమ్మెయి మజ్జనకుఁడు న
     న్నమ్మికొనం దలఁచి పరిణయానుగుణోద్యో
     గమ్ము ప్రవర్తిల్లఁగఁ గడు
     నెమ్మిగ నర్థపతితోడ నెయ్య మొనర్చెన్.84
క. తెలతెలవేగెడునప్పుడు
     తలఁబ్రాలకు లగ్న మనినఁ దద్వార్తకు బె
     గ్గిలి కెల నెఱుంగకుండన్
     వెలలితి ధనమిత్రుమీఁది వేడుకపేర్మిన్.85
క. కావున నాయభిమానము
     గావుము భూషణము లెల్లఁ గైకొని నన్నుం
     బోవిడువు మనుచుఁ దొడవులు
     ప్రో విడి యొప్పించి యశ్రుపూరము లొలుకన్.86
వ. ప్రార్థించుటయును సకరుణం బైన యంతఃకరణంబుతోడ.87
సీ. ధనమిత్రు గుణము లావనితచేఁ జెవులార
                    విని వానిఁ గనుఁగొను వేడ్క దగిలి
     మును వసుపాలితు ధనము వెడ్డునఁ గొన్న
                    తరుణి మేడ్పెట్టెడు వెరవు గొఱలి
     ప్రాభవంబున నర్థపతి యన్యభామిని
                    నడిగిన వానిత్రు ళ్లడఁపఁ దలఁచి
     కోరిక తుద ముట్ట నీరజాననఁ దగు
                    మగనితో నొడఁగూర్చి మనుపఁ జూచి
తే. వెఱవ వలవదు నీ వని వెలఁదిమనము
     భీతి యంతయుఁ బెడఁబాపి ప్రియునికడకు

     నడవఁ బనిచి పై చీర నత్తొడవు లెల్ల
     ముడిచి యేనును దోడన నడుచునపుడు.88
వ. సముచిత సంభాషణంబులలోన నబ్బాలిక పేరు కులపాలిక
     యగుటయు నెఱింగితి నట్టియెడ.89
తే. కోలదివియలవెలుఁగు దిక్కులకు నిగిడి
     తొడరి పురవీథిఁ జీకటిఁ దొలఁగఁ దోలఁ
     బటురయంబునఁ దలవరిబలము రాక
     చూచి యొక్కింత చిత్తసంక్షోభ మెసఁగ.90
సీ. ఈబాలయును నేను నెదురుగాఁ బోయిన
                    నలజడిఁ బెట్టుదు రని తలంచి
     యిక్కొమ్మ నడపించునెడ వీరిఁ బఱపుదు
                    ననుట మోఱక మగునని తలంచి
     యీ లేమయును నేను నోలంబు సొచ్చినఁ
                    గనిరేని నవకార్య మని తలంచి
     యిన్నాతిఁ దిగఁద్రావి యేను బాఱిన మగ
                    తనము నిష్ఫల మగు నని తలంచి
తే. తప్పఁ గ్రుంకెడు వెర వాత్మఁ దలఁచితలఁచి
     యీయవస్థకు నూహింప నిదియ మాకు
     బ్రదుకుఁదెరు వగు నని సుఖోపాయవృత్తి
     గాంచి యిట్లని పలికితిఁ గాంతతోడ.91
తే. విషము భావించికొని పడి వీథి నేను
     బొరలుచుండెద నిది పోలుఁ బోల దనక
     యెదురుగాఁ బోయి వెడయేడ్పు లేడ్చి వారి
     తోడ ని ట్లని పల్కుమీ తోయజాక్షి!92

శా. ఏ మీవీటికి వచ్చి నేఁడు చొరఁ జో టెచ్చోట లే కార్తిమై
     నీ మార్గంబునపొంత నీయరుఁగుపై నిచ్చోట నిద్రింప మ
     త్స్యామిం గ్రూరమహోరగంబు గఱచెం దద్వేదనాలీఢుఁ డై
     తా మూర్ఛిల్లినవాఁడు వీఁడె విషవైద్యం బిచ్చి రక్షింపరే!93
వ. అను మని పనిచి యేసును లాలాజలార్ద్రంబైన వదనగహ్వ
     రంబును భూరేణుదూషితంబైన కేశకలాపంబును, వైవర్ణ్య
     కలితంబు లైన యంగంబులుం దాల్చి.94
క. మున్ను విష మెక్కినట్లన
     కన్నులు దెఱవక శరీరగతవాయువులన్
     సన్నముగ నడపికొని యా
     సన్నమరణుకరణి ధరణిశయనుఁడ నైతిన్.95
వ. అంత నాయారెకులు చేరం జనుదెంచిన నయ్యింతియు
     గత్యంతరాభాసంబు కారణంబుగా ధీర యై మదుక్తప్రకా
     రంబునం బలికిన నంకదఱు ముసరికొని చూచుసమయంబున.96
ఉ. వారలలోన నొక్కరుఁడు వైద్యవిధిజ్ఞుడు మంత్రతంత్రసం
     స్కారపరాయణుఁడు కృతకంబులు నిక్కమ కాఁ దలంచి దు
     ష్టోరగదష్టుఁ డయ్యె నని యోడకు కోమలి! యీక్షణంబ ని,
      ద్రారతు నిద్రఁ దెల్పినవిధంబున నీపతి మూర్ఛఁ దేర్చెదన్.97
క. అనుచుఁ దగ డాసి చేష్టలు
     కనుఁగొని ప్రజ విరియ నడచి గారుడమంత్రం
     బున దోషంబుం దీర్చెద
     నని యిడుమలు గుడిచి మంత్ర మఫలం బైనన్.98

ఆ. మందు నలిచి కన్నులం దిడి ముక్కునఁ
     బిడిచి చెవులఁ బోసి యొడలఁ దుడిచి
     విషము డిగనిభంగి విషవాది గని విస్మ
     యంబు పొంది యిట్టు లనియె సతికి.99
ఉ. కోమలి! పూర్వజన్మమునఁ గ్రూరపుఁజెయ్వులు పామురూపమై
     యేమఱి యున్నఁ బట్టికొనియెం దలపోయఁగ నిక్కువంబు నీ
     స్వమి గతాసుఁ డయ్యెఁ బురసంహరుఁ డైన బురాకృతంబులం
     దా మిగులంగ నేర్చునె వృథారుదితంబులు తక్కు మిక్కడన్.100
వ. ధీరతాపరిణతంబగు నంతఃకరణంబు తోడుగా విధివర్తనం
     బప్రతికర్తవ్యం బగుట దలంచి యాపద కోర్చి భవత్స్వామి
     కళేబరంబుకడ నిలువుము రేపకడ చనుదెంచి యగ్ని
     సంస్కారంబు సేయించెద మని చెప్పి తానునుం దోడి
     వారును నెడ దవ్వుగాఁ జనినయనంతరంబ యేను నొక్క
     యింటిపంచ డాఁచిన మదీయోపకరణంబులు నత్తరుణియా
     భరణంబులుం బుచ్చికొని యుదారు నగారంబునకుం జని.101
ఆ. అతని నిద్ర దెల్పి యంగనారత్నంబు
     చూపుటయును జాలఁ జోద్య మంది
     నన్నుఁ జూచి పలికె నన్న! నీ వెవ్వడ
     వీలతాంగిఁ దెచ్చు టేమివిధము.102
వ. అనినం గలరూ పెఱింగింపం దలంచి యి ట్లంటి.103
ఉ. ఏ నొకతస్కరుండఁ గడు నేకత మీవిరిఁబోఁడి చీఁకటిం
     దాను భవత్సమాగమసుధారసలాలసమానసంబుతో
     మానము జాయఁ బెట్టి కుసుమవదరుం డొకరుండ తోడుగా

     రా నడుమం గనుంగొని కరంబు విషాదము పొంది
     యత్తఱిన్.104
క. ఇముద్దియదెస యక్కటి
     కమ్మును భవదీయసఖ్యకౌతూహలమున్
     నెమ్మనిఁ బిరిగొనుటయు నా
     యిమ్ములఁ జను టుడిగి రాక యిది మిత్రనిధీ!105
క. అని యింతిచీరతల ముడి
     చిన మణిమండలము లతనిచే నిచ్చితిఁ ద
     ద్ఘనఘృణినికరము చీఁకటి
     వెనుకొని విరియించె గగనవీథులఁ బర్వన్.106
వ. ఇచ్చుటయు.107
క. తొడవులు గైకొని మదిలో
     ముడివడు సంభ్రమము హర్షమును లజ్జయు నె
     క్కుడు వినయంబును మోమున
     నడరంగా నిట్టు లనియె నాతఁడు నాతోన్.108
తే. నీవు నాప్రాణసమయైన నెలఁతఁ దెచ్చి
     యిచ్చి వాకట్టి తేను నీయెదుర నింకఁ
     బ్రియము లేమేని పలికినఁ బేలుఁదనమ
     యింత నిక్కువ మూహింప నెట్టు లనిన.109
క. పొచ్చెంబు లేని మగటిమి
     నిచ్చోటికి నింతిఁ దెచ్చు టిది యంతయుఁ దా
     నచ్చెరు వని పలుకుదు నటె
     యచ్చుగ నైజంబు దలఁప నద్భుతకరమే.110

క. ప్రాణసమానం దెచ్చితి
     ప్రాణము రక్షించి తింకఁ బ్రతికారము నా
     ప్రాణమ యని నీయిచ్చిన
     ప్రాణము నీ కిత్తు ననుట పౌరుష మగునే.111
క. ఇమ్ముల నీసుకృతమున
     కమ్ముడువోయెడు భటుండ నయ్యెద విస్ఫా
     రమ్ముగ నాపలుకులు సదృ
     శమ్మున నేఁ బలుకు టరయ సముచిత మగునే.112
వ. ఉపకారంబునకుం బ్రత్యుపకారంబు గావింపం బూని పలుక
     నశక్యంబు సేఁతయంతదవ్వు భవద్భృత్యనిర్విశేషంబున
     నేఁడు మొదలుగా నరసికొని యుండు మని వినయావనత
     శిరస్కుం డై కేలు మొగిచి వెండియు నిట్లనియె.113
క. విను దీని తల్లిదండ్రుల
     యనుమతి వెలిగా వివాహ మగుట చనదు
     రును నాకు నీరు; గొనిపో
     దునె యొం డొకభూమికైన దుఃఖము లడఁగన్.114
వ. అని విషణ్ణవదనుం డై పలికినం దదీయహితలేశంబు నిర్వ
     హింపం దలంచి యిట్లంటిఁ బురుషునకు నిట్టివిచారంబు
     పౌరుషంబునకు నూనం బదియునుం గాక.115
ఉ. బాలికసౌకుమార్యము నపారనిరంతరకాననోగ్రశా
     ర్దూలమదేభసింహపరిదూషితమార్గములం దలంచినం
     బోలునె నీవిచార మిది పోలదు పోవుట బుద్ధి గాదు నీ
     కేల చలింప నేఁ గలుగ నీ సతి నీసతిఁ జేసి నిల్పెదన్.116

వ. ఇట్లూఱడం బలికిన నేఁటి లగ్నంబు దప్పుటకుం దగినవిఘ్నం
     బాచరించి పదంపడి కార్యాలోచనంబు సేసికొంద మీ
     లలన నీతలంపులోనిదయగుటం జేసి వలసినయప్పు డిష్టంబగు
     తెఱంగు గావించుకొన నగు దీనిచిత్తంబు నీదెసం గలు
     గుటయు నిది సాహసంబున నియ్యెడకు వచ్చుటయు వీరు
     వా రెఱింగిరేనిం గార్యంబు దప్పుం గావున నిప్పుడు యి
     ప్పొలఁతి నిజగృహంబున కనుపవలయు వివాహప్రత్యూహం
     బును జౌర్యంబుననకాని యీయావేగంబున నొం డుపాయం
     బు గలుగనేర దీవేళయం దిదియ వెరవుగాఁ జొత్తమని నిశ్చ
     యించి కుబేరదత్తు గృహంబునకుం జని యక్కన్నియ లో
     నగుట కారణంబుగా నేము నిర్భయంబున.117
ఉ. కన్నము వెట్టి యింటఁ గల కాంచనరౌప్యవిభూషణాదు లె
     ల్ల న్నిమిషంబులోన వెడలం గొనిపోయి యడంచి వచ్చి య
     క్కన్నియ నూఱడం బలికి క్రంతల నల్లన నేఁగి యేఁగి యు
     ద్యన్నిశితాసిఖేటకశరాసనబాణసనాథపాణులన్.118
క. ఆరెకులం గని భయ మెడం
     గూరక యుండియును మాఱుకొనక పఱచినన్
     వారలు వెన్నడిఁ దఱిమిరి
     పౌరులు గలబెల యనంగఁ బటువేగమునన్.119
వ. ఇవ్విధంబునం దలవరులు వెను తగుల ముట్టంబడి పాఱు
     చున్న సమయంబున.120
క. తెరువుబడి నొక్కయున్మద
     కరిపతి యుండంగ దాని గనుఁగొని కలఁకం

     బొరయని మనంబుకలిమిం
     బరమోపాయంబు గాంచి బంధుఁడు నేనున్.121
ఆ. అగ్గజంబు నెక్కి హాస్తికుచేతియం
     కుశము దివిచి పుచ్చికొని రయమున
     నతనిఁ గూలఁ ద్రోచి యారక్షిబలముపై
     గొలుపుటయును నదియు గోలుమసఁగి.122
సీ. ఎడలేనిక్రంతల నెగిచి చాల్పడఁ ద్రోచి
                    చరణాగ్రమున బారి చమరిచమరి
     కడకాళ్ల నందంద యొడిసి చేకుఱఁ బట్టి
                    విసరి కంబములతో వేసి వేసి
     గోడలదాపున గుమిగట్టి నిలిచినఁ
                    బ్రక్కలం జదియంగఁ బ్రామిప్రామి
     యీడఁబోవక చక్క నెదిరిన బిరుదులఁ
                    గొమ్ముల గుదివడ గ్రుచ్చిగ్రుచ్చి
ఆ. కసిమసంగి విలయకాలకాలుని లీలఁ
     దఱిమి వారి నెల్లఁ దనమదంబు
     పెల్లునం జెలంగి పీనుంగుపెంటగా
     నగ్గజంబు చంపె నప్పు డేను.123
వ. వెరవున నమ్మదకరి మరల్చి పెండ్లి గజిబిజి సేయుటకుం గుబే
     రదత్తు గృహంబు కన్నంబున గాసి సేయుటయ కాక యర్థ
     పతియిల్లును వారణంబుఁ గొల్పి పరిపఱి సేయం గంటి మని
     సంతసిల్లి యుదారకుండు కందువ యెఱుంగుటం జేసి.124
ఆ. పరిణయోత్సవమునఁ బరిశోభితం బగు
     తద్గృహంబుమీఁద దంతిఁ బఱపి

     క్రుమ్మి చింద మార్చి గూలంగఁ ద్రోపించి
     పురసమీపవిపినభూమిఁ జొచ్చి.125
క. తరుశాఖాలంబితకర
     చరణుల మై యచట నాగజంబు విడిచి మం
     దిరమున కరిగితిమి రహః
     పరతంత్రత నంతటం బ్రభాతం బయ్యెన్.126
వ. తదనంతరంబ.127
సీ. ప్రాచీనశైలాగ్రభాగస్థమగు నశో
                    కంబునఁ జిగురుజొంపం బనంగ
     వర్షాధిపతి యని వాసవుఁ గొలునఁ జే
                    రిన యింద్రగోపకశ్రేణి యనఁగ
     నురుతరపూర్వభూధరము నెత్తంబున
                    బొలుచు గైరికగండశిల యనంగఁ
     గాశ్మీరపటమునఁ గావించి సురపతి
                    విడిచి యాడెడు వాలుఁబడగ యనఁగ
తే. నరుణకిరణుండు దోతెంచె నంబుజాత
     నర్మసచివస్మితాపాదనంబునందుఁ
     జతురుఁ డై యుష్ణకరములఁ జక్రవాక
     తాప ముడుపుట నాశ్చర్యధాముఁ డగుచు.128
వ. అయ్యవసరంబున నేను దినముఖోచితక్రియలు నిర్వర్తించి
     యస్మదీయవర్తనంబులం దుములబహుళంబైన నగరంబు
     గలయం గనుంగొనుచుం గుబేరదత్తు మందిరంబునకుం జని
     కన్నపుమాటలఁ గ్రందుకొన నొండొరులతో నాడుసందడి
     నిలిచి.129

సీ. ఇమ్మూక లిబ్బంగి నింటిలోఁ దిరుగంగ
                    సరకు సేయక వచ్చు టరిది గాదె
     సందడి గ్రబ్బడి పొంది పె క్కోలంబు
                    లరసి కన్నము పెట్టు టరిది గాదె
     తనయిల్లు తాను జొచ్చినయట్ల సొచ్చి సొ
                    మ్మంతయుఁ దెచ్చుట యరిది గాదె
     డిగఁద్రావి పోవక యగపడ్డ వస్తువు
                    లన్నియుఁ గొనిపోక యరిది గాదె
ఆ. బాపు! కన్నకాఁడ! బాపు! నిశ్శంకుఁడ!
     బాపు! బల్లిదుండ ! బాపు! మ్రుచ్చ!
     యనుచుఁ బౌరు లెల్ల తగ్గించి యగ్గించి
     వినుతి సేయుచుండ వింటి నచట.130
వ. అట్టి సమయంబున నయ్యర్థపతి యయ్యెడకుం జనుదెంచి
     వివాహవిఘ్నఖిన్నుం డైన తనమామ నుచితాలాపంబులం
     దేర్చి భూషణాంబరాదు లొసంగి సాంవత్సరికుల రావించి
     లగ్నాంతరం బడిగిన వారును మాసావధిగా నిశ్చయించిన
     విని చనియె నేనునుం దదనంతరంబ యరిగి యుదారకున
     కుం దద్వృత్తాంతం బంతయు నెఱింగించి యెల్లకార్యంబు
     లకు ననుగుణంబుగా మనంబున నొక్కతెఱంగు నిశ్చయించి
     మఱియు నతనితో నిట్లంటి.131
క. విను మనమ్రుచ్చిమి సొమ్ములు
     మనుజేంద్రుఁడు పౌరజనసమాజము నెఱుఁగం
     దనరిన వైభవమున నను
     దినము ననుభవించునట్టి తెఱఁగు వయస్యా!132

క. ఒక చర్మభస్త్రి రుచిరక
     నకరేఖలు గలుగఁ జేసి నరనాయకుసా
     లికి గొనిచని నిశ్శంకత
     నకుటిలమతివోలెఁ దత్సభాంతరభూమిన్.133
ఉ. నిర్మలమార్గవృత్తిరమణీయునకున్ సతతాధ్వరక్రియా
     కర్మఠపాణిపద్మునకుఁ గావ్యకళాజనిభూమికిం దమో
     దుర్మదవిస్ఫురజ్వకృతదూరంచారున కంతరద్విష
     న్నిర్మథనప్రభావమహనీయవివేకవిశాలబుద్ధికిన్.134
క. నిఖిలకళాసంవేదికి
     మఖసంతోషితమరుత్సమాజునకుఁ గృపా
     సఖచిత్తునకు నుదారున
     కఖల జగత్పూర్ణకీర్తి కద్భుతమతికిన్.135
మాలిని. వినయనిధికి నానావేదవేదాంగతత్త్వ
     జ్ఞునకు నియమతుష్యత్సూరి కవ్యాజలీలా
     మనసిజునకు లక్ష్మీమందిరాత్మీయవంశాం
     బునిధిశశికి హృద్యస్ఫూర్తిసత్కీర్తి కుర్విన్.136
గద్యము. ఇది సకలసుకవి ప్రసాదవిభవ విలస దభినవదండి
     నామధేయవిఖ్యాత కేతనార్యప్రణీతం బైన దశకుమార
     చరిత్రం బను మహాకావ్యంబునందుఁ బంచమాశ్వాసము.

  1. ఇచట కుండలీకరణము చేయఁబడిన భాగము వ్రాఁతప్రతిలో లేకుండుటంకేసి యీషన్మూలాధారముతోఁ గథాసందర్భమునఁ బూరింపఁబడినది.
  2. మేలి
  3. నటించి
  4. ఈ కుండలీకృతభాగము వ్రాతఁప్రతిలో లేనందున మూలాధారమునఁ బూరింపబడినది.