తెలుగువారి జానపద కళారూపాలు/సంగీతసాగరం విజయనగరం

సంగీతసాగరం విజయనగరం


విజయనగర చక్రవర్తుల కాలంలో నాట్యకళతో పాటు, సంగీత విద్యకూడ ఎంతో అభివృద్ధి పొందింది. హరిహర బుక్కరాయలకు గురువైన విద్యారణ్యస్వామి 'సంగీతసార'మనే ఒకసంగీత ఉద్గ్రంథాన్ని రచించాడు. ఆ గ్రంథంలో 267 భాగాలను గురించి విపులంగా వ్రాయబడిందట.

అలాగే ప్రౌఢదేవ రాయల కొలువులో వున్న కల్లనాథుడు శార్ ఙ్గదేవుని 'సంగీత రత్నాకర'మనే గ్రంథానికి వ్యాఖ్య వ్రాశాడు.

రెండవ రాయల కాలంలో, ముల్‌బాగల్ మండలేశ్వరుడైన సాళువ గోపతిప్ప సంగీత, నాట్య, తాళ, అలంకార శాస్త్ర గ్రంథాలు వ్రాసినట్లు తెలుస్తూవుంది. వామనుని కావ్యాలంకార గ్రంథానికి 'కామధేను' అనే వ్యాఖ్యానాన్ని రచించాడు. 'తాళదీపిక' అనే గ్రంథాన్నీ సంతరించాడు.

కవిరాట్టే కాదు, సంగీత సామ్రాట్టు క్కూడా:

శ్రీకృష్ణదేవరాయలు సంగీత విద్యలో కూడ ప్రజ్ఞావంతుడు. రామరాయల వలేనే కృష్ణ దేవరాయలు కూడా శ్రావ్యంగా పాడగల్గిన నేర్పరి. కృష్ణదేవరాయలు గాన కళలో ప్రజ్ఞాధురీణుడని కృష్ణాపుర శాసనంలో ఉదహరింపబడింది.

కృష్ణ దేవరాయలు బాల్యంలోనే కృష్ణుడనే ఓ సంగీత శాస్త్రకారుని వద్ద సంగీతాన్ని సాంప్రదాయకంగా అభ్యసించినట్లూ, ఆయనకు మడులు, మాన్యాలు, వజ్రహారాలు బహూకరించినట్లూ కన్నడ గ్రంథమైన రాఘవేంద్ర విజయం తెలుపుతూ వుంది.

కట్టుదిట్టమైన కర్ణాటక సంగీతం:

విజయనగర చక్రవర్తుల కాలంలో సంగీతం శాస్త్రయుక్తంగా అభివృద్ధి పొందినది. ఈ విధంగా కర్నాటక ప్రాంతంలో కట్టుదిట్టంగా సంగీతం అభివృద్ధి పొందడంవల్లనే ఈ సంగీతానికి కర్ణాటక సంగీతం, కర్నాటక సాంప్రదాయం అన్న పేరు నాటి నుంచి నేటి వరకూ దక్షిణ హిందూ దేశంలో అధిక ప్రచారంలో వుంది. విజయనగర రాజుల హయాములో దేవాలయాలలో దేవదాసీలు నృత్యాన్నీ, తద్వారా గానాన్నీ ప్రదర్శించే వారు. ఆ యా ఋతువుల ననుసరించి ఋతువర్ణనలతో ఒక్కొక్క ఋతువునకి ఒక్కొక్క రాగం పాడుతూ వుండేవారు.

రాయలు గానకళను ఎంతగానో పోషించాడు. సంగీత విద్వాంసుల్ని పోషించి వారికి అవ్వారిగా ధర్మాలను చేశాడు. అన్య రాష్ట్రాలనుంచి వచ్చిన అనేక మంది సంగీత విద్వాంసుల్ని ఆదరించి, గౌరవించి, సన్మానించాడు. ఇలా వచ్చిన వారిలో ఒరిస్సా రాష్ట్రం నుంచి వచ్చిన లక్ష్మీనారాయణ పండితుడొకడు. ఈయన 'సంగీత సూర్వోదయ' మనే గ్రంధాన్ని వ్రాశాడు. ఈయన కొంత కాలం రాజాంత:పురంలో సంగీత శాస్త్ర అధ్యాపకుడుగాను పని చేశాడు.

రాయల బాటే రామరాజు బాట:

ఆశియ రామరాజు రామయామాత్యుడనే సంగీత విద్వాంసుని తన కుమార్తెలకు సంగీతం నేర్పటానికి నియోగించాడు. రామయామాత్యుడు 'స్వరమేళ కళానిధి' అనే ఒక ప్రమాణ గ్రంథాన్ని సంస్కృతంలో వ్రాశాడు. ఈ గ్రంథాన్ని అనుసరించే కర్ణాటక సంగీత సాంప్రదాయాలన్నీ ఏర్పడినవట.

పుండలీకవిఠలు డనే ఆయన ఉత్తర హిందూస్థానం వెళ్ళి అక్కడ 'నర్తక నిర్ణయం. అనే నాట్యశాస్త్రాన్ని రచించి అక్బర్ చక్రవర్తి ఆస్థానంలో గౌరవ సత్కారాల్ని పొందాడు

కృష్ణదేవరాయల సిబ్బందిలో ఒకడైన నాదెండ్ల గోపన్న మంత్రి ప్రభోద చంద్రోదయ మనే ఆధ్యాత్మిక రూపకానికి వ్యాఖ్య రచించాడు. అతడు నాట్యశాస్త్ర గ్రంథ కర్తలలో శృంగనాచార్యుని నామం రెండు మూడు మారులు ఉదాహరించాడు.

హరిహరరాయల కుమారుడైన 'విరూపాక్షరాయలు' విద్యారణ్య యతీంద్రుల శిష్యుడు. ఇతడు సంస్కృత భాషలో నారాయణ విలాసం, ఉన్మత్తరాఘవం అనే రెండు నాటకాలు రచించాడు.

సంగీత రత్నాకర సౌరభం:

ఇమ్మడి ప్రౌఢదేవరాయ లనబడే మల్లికార్జున దేవరాయల కాలంలో (క్రీ.శ. 1416-1465) చతుర కల్లినాథుడు రచించిన కళానిధి నామం గల సంగీత రత్నాకర వ్యాఖ్యానం విజయనగర రాజుల కాలంలో వెలువడిన గ్రంథాలలో వుత్తమమైంది.

రెందవ దేవరాయల కాలంలో దుర్గ పాలకుడైన గోపేంద్ర తిప్పరాజు 'తాళ ' దీపిక, అనే ప్రత్యేక తాళ లక్షణ గ్రంథాన్ని రచించాడు.

కళింగాధిపతియైన వీరరుద్ర గజపతి, కృష్ణదేవరాయల పోషణలో వున్న లొల్ల లక్ష్మీధరుడు తన పూర్యులలో అయిదవ తరంవాడైన విరించి మిశ్రుడు 'భరార్ణవ పోత' మనే నాట్యగ్రంథాన్ని రచించినట్లు తన సౌందర్య లహరి వ్యాఖ్యానంలో ఉదహరించాడు.

దేవాలయానికి దివ్యదానం తెచ్చిన దేదాసి:

క్రీ.శ. 1433-34 స॥రంలో మడమను గ్రామంలో అగ్నీశ్వర దేవాలయానికి దేవాసి 'అరంవళత్త నాచ్చియార్ ' అనే తమిళ దేశపు దేవదాసి. ఆమె రెండవ దేవరాయల్ని దర్శించి, అతని వలన ఒక దేవాలయం కొరకు దానం పొందింది. రాయల కాలంలో దేవదాసీలు నాట్య కళలో అద్భుతమైన ప్రావీణ్యాన్ని కలిగి వుండే వారు. రాజాదరణకు పాత్రమైన దేవదాసీలు గృహాలేకాక గృహారామాలను కూడ స్వంతంగా కలిగివుండే వారు

విజయనగర రాజధాని హంపిలో వున్న శిల్పసంపదలో గాయక, నర్తక, నర్తకీ బృందాలు సంప్రదాయ శుద్ధమైన భరతనాట్య భంగిమలతో బహు సంఖ్యలు విరాజిల్లుతున్నాయి. కోలాటపు కోపుల శిల్పాలు అనేకం గోడలమీద చెక్కబడి వున్నాయి..

బయలాటల బంగారు ప్రదర్శనాలు:

రాయల కాలంలో దేవాలయాల ముందు జరిగే బహిరంగ నాట్య ప్రదర్శనాలకు రాజులు కూడా హాజరవుతూ వుండేవారు. విఠలస్వామి దేవాలయంలో నాట్య ప్రదర్శనాలు వీక్షించడానికి వచ్చే రాజులకు ఎత్తైన వేదికలపై ఒక సింహాసనం అమర్చబడి వుండేది. నృత్యం చేసే నర్తకీమణులులు, వివిధ వాద్యకారుల భంగిమలు వున్న ఈ వేదికపై ఉన్న సింహసనంలో రాయలు ఆసీనులయ్యేవారు.

రాయల కాలంలోని ప్రాచీన శిల్పాలలో నాట్య కత్తెలు మహమ్మదీయ స్త్రీలు ధరించే పైజామాలను ధరించి, శరీరంపై చాల ఆభరణాలు ధరించినట్లు కొన్ని చెక్కబడి వున్నాయి.

దేదీప్యమానంగా వెలిగిన కళామూర్తులు:

ఆ రోజులలో గాయకులకు సంఘంలో ఎక్కువ గౌరవం వుండేదట. ఆ నాటి వాద్య పరికరాలలో వీణకు ఎక్కువ ప్రాముఖ్యమున్నట్లు అనేక ప్రబంధాలలో ఉదహరింపబడి వుంది. అనేక మంది గాయకులూ, సంగీత విద్వాంసులూ ఉత్తర హిందూ దేశంలో పర్యటించి, అనేక రాజాస్థానాలలో తమ విద్యను ప్రదర్శించి పోటీలలొ నెగ్గి విజయనగరానికి పేరు ప్రఖ్యాతుల్ని తీసుకువచ్చారు. సంగీత రత్నాకరం వ్రాసిన విఠలుని తండ్రి 22 రాగాలలో విశేష ప్రవీణతను సంపాదించి గురజాత్ మాండ్వీ సుల్తానును మెప్పించి వేయి తులాల బంగారాన్ని పారితోషికంగా పొందాడట. ఈ విధంగా విజయనగర చక్రవర్తులు కవి, పండిత, గాయక, నటీనటులను, శిల్పులను పోషించారు.

రంగరాజా, రంజకం కుప్పాయి:

శ్రీకృష్ణదేవరాయల నగరులోని నాట్యశాలలో కృష్ణదేవరాయలు స్వయంగా సంగీత నాట్యాలను ఆభ్యసించినట్లు చరిత్రాధారల వల్ల తెలుస్తూ వుంది. రాయల కొలువు తీర్చివుండగా రంజకం శ్రీరంగ రాజు, రంగరాజు కుమార్తె రంజకం కుప్పాయి, నట్టువ నాగయ్య మొదలైన వారు నృత్య, నాటకాలను ప్రదర్శించేవారట.

దశరా వేడుకల్లో జెట్టీలు కుస్తీలను ప్రదర్శించే వారట. రాత్రిపూట బాణాసంచాలను కాలుస్తూ వుండేవారట. నానా విగ్రహాల ఆకారంలో వున్న బాణాసంచాలు పట పట మంటూ ఆకాశాని కెగిరి పగులుతూ వుండేవట.

రాయల కాలంలో ఒక్కొక్క ఋతువులొ ఒక్కొక్క రాగానికి ప్రాముఖ్యముండేదట. వసంత కాలంలో హిందోళరాగం పాడినట్లు ఆముక్త మాల్యదలో వుదహరింప బడి వుంది.

తిరుపతి వచ్చిన దివ్యతారలు:

అచ్యుత రాయల పరిపాలనలో నృత్యకళ ఆభివృద్ధి పొందింది. ఆయన అస్తానంలో అనేక మంది నర్తకీమణులు పోషింప బడ్డారు. ఆనాడు అనేక నర్తకీమణులు తిరుపతి దేవస్థానానికి పంపబడినట్లు దేవస్థానంవారు ప్రకటించిన ఒక శాసనాన్ని బట్టి తెలుస్తూవుంది.

ఆరోజుల్లో పురుషులే స్త్రీ వేషాలు ధరించే వారనీ, నాట్యపు పోటీలు జరిగేవనీ, నిపుణులు ఉత్తమ మధ్యమాది నృత్య నిర్ణయాలను చేసినట్లూ, మృదంగం, దండెతాళం, బురుమకిన్నెర, సన్నగాళే వీణ, ముఖవీణ, వాగ్రోలుడోలు, మౌరి, భేరి, గౌరు, గుమ్మెట, తమ్మెటం, దుక్కి, డక్కి, చక్కి, చయ్యంకి, మొదలైన వాయిద్యాలుండేవనీ ఆముక్తమాల్యదలో వుదహరింపబడింది.

పెద్దన మనుచరిత్ర నాలుగ ఆశ్వాసంలో స్వారోచిపుర ప్రవేశ సందర్భాన "చిలకలకొల్కి కల్కి యొక చేడియ నాటక శాల మేడపై నిలువున నాడుచుండి" రని ఒక పద్యంలోనాటకశాలను పేర్కొన్నాడు.

భోగంపడుచుల రంరరంగ వైభోగాలు:
ఆనాడు ఆటపాటలకు భోగంవారే ప్రధానంగా వుపయోగ పడేవారు. భోగం వారి సమ్మేళనాన్ని మేళమనే పిలుస్తూ వుండేవారు. ఈ నాటికీ అనుగాతంశృ భోగం

వాళ్ళని భోగం మేళమని పిలుస్తూ వున్నారు. ప్రతి మేళానికి ఆటలోనూ, పాటలోను, అభినయంలోనూ, అనుభవంలోను ఆరితేరిన ఒక వృద్ధవేశ్యమాత పెద్దగా వుంటూ మేళాన్ని సక్రమ పద్ధతుల్లో నిర్వహించి, నాయకత్వం వహించి మిగతా వేశ్యలైన నాట్య సుందరీమణులను కలిసి కట్టుగా నడిపేది. అందులో వెనుక పాట పాడేవారు కొందరు ఆ పాటకు అభినయం చేస్తూ ప్రేక్షకుల ముందుకు వెళ్ళి నాట్యం చేసే వారు.

కృష్ణదేవరాయల కాలంలో దేవదాసీలు ప్రముఖ స్థానాన్ని అలంకరించారు. నాట్య కళయందు ప్రజ్ఞానిథులుగా వెలుగొందారు. రాయల దర్బారులోను, రాణివాసపు మందిరాలలోను, దేవస్థానలలోను, వీథి మంటపాలలోను, ఎటుచూసినా దేవదాసీ సుందరాంగనలు నాట్య, నాటక, గాన మాధుర్యాలను వెదజల్లారు.

అగ్రస్థానం వహించిన అద్వితీయ తారలు:

భోగంవారని పిలువబడే ఈ దేవదాసీలు రాయల సామ్రాజ్యంలో మహోన్నత మైన స్థానాన్ని సంపాదించుకున్నారు. దేవదాసీలకు అన్ని సమయాల్లోనూ, రాయల అంత:పుర సౌధాలలోనికి ప్రవేశముండేది. కొంత మంది వేశ్యలు రాణుల వద్ద దాసీలుగాను వుండేవారు. వసంతోత్సవాలలో - ఎటు చూచినా దేవదాసీలు వసంతాలను వెదజల్లేవాట.

ఆనాడు ఆస్థాన శిల్పులు దేవాలయాలమీదా, వారి మహాసౌధాలమీదా, కుడ్యాలమీదా, స్థంభాలమీదా ఆ దేవదాసీల నాట్య భంగిమాలను, వివిధ అభినయాలనూ వేషభూషణ అలంకారలతో సహా చిత్రించారు. కొన్ని చిత్రాలు నగ్నంగా కూడ చెక్కబడి వున్నాయి. హంపీ హజారా రాజాలాయం ముఖ ద్వారం వద్దనూ, ఆలయం లోనూ, స్తంభాలపైనా నాట్యకత్తెల యొక్క ఇటువంటి చిత్రాలు మనకు కనబడుతున్నాయి. ఈ విధంగా దేవదాసీ నాట్యకళను రాయలు ఎంతగానో ఆదరించాడు.

దేవతా సన్నిధిలో దివ్యప్రదర్శనం:

ఆనాటి భోగం పడుచులు తొలిసారి దేవతా సన్నిధిలో నాట్యంచేసి తరువాత నాట్యాన్ని వృత్తిగా స్వీకరించే వారు. రాజులు భోగం వారి సంగీనృత్యాలను మెచ్చు కుని, ఆసందర్భంలో కవులకు, కళాకారులకు 1116 దీనార్లు ఇచ్చేవారట. ఇందుకు ఉదాహరణగా:__

ఆపుడాచోళ వసుంధరాధిపతి నానానర్ఘ్య భూషంబరా
ది పదార్థ ప్రకరంబు త్యాగమహిగా దీనారము ల్వేయునూ
ట పదహార్లుం గృపజేసి.

అని వైజయంతిలో వివరించారు.

వినోదాన్ని వెలిగించిన విప్రవినోదులు:

ఈనాటి ఆంధ్రదేశంలో ఎక్కడో చెదురు మదురుగా తప్ప, ఈ విప్రవినోదం ప్రచారంలో వుందని చెప్పలేం. కాని, 1600-1700 సంవత్సరాలలో ఈ వినోదాలు బహుళ వ్వాప్తిలో వున్నాయి. అంటే అది విజయనగర సామ్రాజ్య కాలం. విప్రులనగా బ్రాహ్మణులు. వారు వినోదం చేయడం వలన విప్ర వినోదమని పేరు వచ్చింది. బ్రాహ్మణులలో ఒక జాతి బ్రాహ్మణులు, దేవతోపాసన వలనో, మంత్ర తంత్రాల వలనో చిత్ర విచిత్రమైన గారడీలు చేస్తూ వుంటారు. గుంటుపల్లి ముత్తరాజనే విప్ర వినోది గోలకొండ సుల్తానుల తుది కాలంలో వున్నట్లు, ఆయనను గురించి ఒక చాటువు వున్నట్లు ప్రతాపరెడ్డి గారు తమ సాంఘిక చరిత్రలో తెలియజేశారు.

సంతతమారగించు నెడ సజ్జనకోటుల పూజ సేయు శ్రీ
మంతుడు గుంటుపల్లి కులమంత్రి శిఖామణి ముత్తమంత్రి దౌ
బంతియె బంతిగాక, కడు పంద గులాముల బంతులెల్ల మాల్
బంతులు, దుక్కిటెడ్లయెడ బంతులు, విప్రవినోదిగారడీ
బంతులు దొంగవాండ్ర ములుబంతులు సుమ్ము ధరాతలంబునన్

ప్రజల పాలిటి పండగైన జాతీయ జాతర్లు:

ఆ రోజుల్లో మూఢనమ్మకాలు ఎక్కువగా వుండి జాతర్లు జరుగుతూ వుండేవి. ఇవి ఎంతో ఆడంబరంగాను జరిగేవి. వీటిని ప్రజలు ఎంతో పర్వంగా ఎంచేవారు. ఈ సమయంలో యక్షగంధర్వ వేషాలు ధరించి, నృత్యంచేస్తూ వుండే వారు. ఇందువల్ల కురవంజి రూపాన్ని యక్షగానంగా పిలిచేవారు. వీటిని ఆనాడు వేశ్యలు కూడ ప్రదర్శించేవారు. కళావంతుల్లో ఒక తెగను జక్కుల జాతివారు అని పిలుస్తూ వుండేవారు.

నాటి దాసరులు:

విజయనగర సామ్రాజ్య కాలంలో ఈ పేరుతో కొందరు శంఖుచక్రాలు కలిగి, ఇత్తడితో చేయబడిన కుండలాలు ధరించి, జింక కొమ్ములు, అలుగులు, మొగిలి యాకుల గొడుగు, గుఱ్ఱపు వెంట్రుకలతో తయారు చేయబడిన విసనకఱ్ఱ , తోలతిత్తి, చిట్టి తాళాలు, చంకన బుట్ట, మెడలో తులసి వేర్లు, మొహాన తెల్లని పంగనామాలు మొదలైన వేషధారణ కలవారై, బాండాలిక అనే కిన్నెరను వాయిస్తూ పదాలను పాడుతూ, మాలమాదిగ గురువులు గానూ పౌరోహితులుగాను వుంటూ యాచిస్తూ వుండేవారని ఆముక్త మాల్యద లో వివరించ బడింది.

ఎందరికో ఎరుక చెప్పిన ఎరుకలసాని:

ఎరుకలసాని పూర్యకాలంలో ఎరుక చెప్పడంద్వారా సంఘంలో మంచి పలుకుబడిని, ప్రాబల్యాన్నీ కలిగివుండేది. రాజాధిరాజులూ, రాణులూ, పండితులూ మెదలైన వారంతా ఎరుకలసాని సోదెకు చెవులు తెగ కోసుకొని, ఆమెను ఆహ్వానించి, ఎరుక చెప్పించుకుని అనేక పారితోషికాలను ఇచ్చేవారు. ఎరుకలసాని ఏ సంస్థానంలో ప్రవేశించాలన్నా - ఏ అభ్యంతరమూ లేక దర్శనానికి అనుమతి ఇచ్చేవారు.

ఈ ఎరుకలసాని సమాజంలో ఎంత పలుకుబడిని సంపాదించిందో, అంతటి స్థానాన్ని ఆనాటి సాహిత్యంలోనూ, కళారూపాల్లో కూడ పొంది, ప్రత్యేకం ఒక పాత్రగానూ వర్థిల్లింది. ఆనాటి ప్రతి కురవంజిలోనూ, యక్షగానాల్లోను ఎరుకసాని ఒక పాత్రగా ప్రవేశించి నాయికికో, నాయకులకో ఎరుక చెప్పి నిష్క్రమించేది.

విజయనగర సామ్రాజ్య కాలంలో ఎరుకత ముఖ్య పాత్ర వహించింది. ఎరుకల యెక్క వేషధారణను గురించి ఆముక్త మాల్యదలో వివరించ బడది. ఎరుకత

వన్నెల రవికను తొడిగి, ముంజేతులకూ, ముఖంపైణా పచ్చబొట్లతో, కురుమాపు పైటలో చిన్న బుడుతణ్ణి మూపున కట్టుకొని, తరతరాలనాటి పైడి బుట్ట నెత్తిన బెట్టుకుని, కనుబొమల సందున నామం పెట్టి, నొసట విభూతి పెట్టి, కన్నులకు కాటుక పెట్టేది. దారి కట్టు, మొనకట్టు, కనికట్టు, స్త్రీ వశ్యం కలిగించే తాయిత్తుల్నీ, ఏరుల్నీ అమ్ముకునేది. దీనిని కురవంజి అని కూడ సంబోధించే వారు. ఆనాడు కురవంజి ఆటలు కూడ విరివిగా జరుగుతూ వుండేవి. ఉదాహరణకు యాదవదాసు వ్రాసిన గరుడాచల యక్షగానంలో లక్ష్మీదేవి తెర వెడలిన తరువాత, ఎరుకల నాంచారిని ద్వారపాలకుడు ఈ విధంగా పరిచయం చేశాడు.

తెరవెడలిన నాంచారి:

కం.తరుణిరొ తెరకును వెళ్ళుము
కరుణతో మీ కథలు మాకు కమలదళాక్షి
నరగున జెప్పుము మ్రొక్కుము
ఎరుకల నాంచారుబొమ్మ వెలదిరో రమ్మా॥

అని ఎరుకల నాంచారును ప్రవేశ పెడతాడు.

ఎరుక ఎరుకోయమ్మ - అవ్వోళ్ళయ్య ॥ఎ॥
ఎరుకచే జగమంత - వెలుగుచు నుండును.
మరుక తిరిగేటి మగువను వినవమ్మ ॥ఎ॥
ఏడు కొండలమీద ఎక్కింది ఎరుక.
జోడు గుండ్లమీద కూడిందె ఎరుక ॥ఎ॥

అంటూ ఈ నాంచారు ఒక కీర్తన పాడుతుంది.

 ఎరుక జెప్పితి వినవమ్మా - ఓ ముద్దులగుమ్మా
కరుణతో కలదే కనకపు బొమ్మా ॥
ఎరుకా, ఎరుకా, ఏడు జగములు
మురియుచు నీరీతి ధనముచ్చట జెప్పెద

అంటు వుండగా లక్ష్మీదేవి యెటువలెనో చెప్పవమ్మా' అంటుంది. ఈ విధంగా ఆనాటి కురవంజి లోను, యక్షగానంలోనూ, ఈ ఎరుకలసాని ప్రాముఖ్యం ఎంతగానో వుండేది.

యక్షులైన వారే జక్కులవారు:

విజయనగర చక్రవర్తుల కాలంలో ఇతర కళారూపాలతో పాటు వర్థిల్లిన కళారూపం యక్షగానం. మన ప్రాచీన కళారూపాల్లో అతి ప్రాచీనమయినది యక్షగానం. ఇది ఆంధ్ర, కర్ణాటక, తమిళ రాజ్యాలలో అతి విస్తారంగా వ్వాప్తిలోకి వచ్చింది. ఒకనాడు యక్ష గాన వాజ్మయం దక్షిణ భారతదేశమంతటా దేదీప్య మానంగా వెలుగొందింది.

16వ శతాబ్దంలో యక్షగాన చరిత్రలో ఓ నూతన శకం ప్రారంభమైంది. సుప్రసిద్ధులైన కవి గాయకులనేకులు యక్షగానాల్ని రచించారు. రారాజులు వారికి వుత్సాహాన్నిచ్చి వారిని పోషించారు. 1506 మొదలు 1509 వరకు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన శ్రీ కృష్ణదేవరాయల అన్నగారు వీర నరసింహ రాయలు యక్షగాన రచయితలను, ప్రదర్శకులను చాల గౌరవించేవాడట. క్రీ.శ, 1514 లో కర్నూలు జిల్లా చెరువు బెళగల్లు గ్రామంలో తాయికొండ నాటక ప్రదర్శనాన్నిచ్చిన చేగయ్య కుమారుడు నట్టువ నాగయ్యకును, పాత్రిగ నటించిన పోతవర గ్రామ వాస్తవ్యుడు నట్టువ తిమ్మయ్య కుమార్తెకును ఆ వూరి కరణం తిరువత్తూరు సోమరను కుమారడున బసవరసు కొంత భూమిని దానమిచ్చినట్లు తెలుస్తూంది. తాయికొండ నాటక ప్రదర్శనాన్నిచ్చిన వారు ఆనాటి కర్నూలు జిల్లా వారేనని భారతిలో నేలటూరి వెంకట రమణయ్యగారు వుదాహరించారు.

స్థనాలకు పన్ను విధించిన సంబెట గురవరాజు:
కూచిపూడి భాగవతులను గురించి, వారి పూర్వ చరిత్రను గురించి మాచుపల్లి కైఫీయత్తులో 1502 నాటికే సవిస్తరంగా వ్రాయబడి వుంది. ఆ రోజుల్లో సంబెట గురవ రాజనే సామంత రాజు

విజయనగర చక్రవర్తుల పాలనలో రాజ్యం చేస్తూ వుండేవాడు. ఆయన ప్రజలను నానా చిత్రహింసలకు గురిచేస్తూ దుర్భరంగా పరిపాలిస్తున్నాడు. సకాలానికి ఎవరైతే శిస్తు చెల్లించరో వారి స్త్రీలను బలవంతంగా కోటకు తీసుకవచ్చి ఆ స్త్రీల స్తనాలను చిరుతలు పట్టించి వారివద్ద శిస్తుల్ని వసూలు చేసే వాడట. కూచిపూడి కళాకారులు దేశాటనం చేస్తూ గురవరాజు రాజ్యం నుంచే ప్రయాణిస్తూ ఆయన యెక్క హింసా కాండను కళ్ళార చూచి, ఆ దృశ్యాన్నంతనీ కథారూపంలో పెట్టి ప్రదర్శనాలిచ్చుకుంటూ విజయనగర వీరనరసింహ రాయల ఆస్థానానికి చేరుకున్నారు.

కేళికలతోనే కావ రందించిన కూచి పూడి కళాకారులు:

కూచిపూడి కళాకారులు రాయల వారిని కేళిక అడిగారు. ఆనాటికే కూచిపూడి విద్వాంసుల యెక్క కళా విశిష్టతల్ని విన్న అరాయల వారు ప్రదర్శనానికి సెలవిచ్చారు. ప్రదర్శన ప్రారంభమైంది. ప్రదర్శనంలో మన కళాకారులు గురవరాసు ప్రభుత్వ పాలనా విధానాన్నే ప్రదర్శించడం మొదలు పెట్టారు.

ప్రథమంగా గురవరాజు వేష ధారణతో ఒక నటుడు ప్రవేశమై, రాయల సమక్షంలో స్త్రీల స్తనాలకు చిరుతలు పట్టించి తహశ్మీలు సొమ్ము ఇవ్వవలసిందని హింసపెట్టాడు.

రాయలవారు గురవరాజు పరిపాలనా విశేషాలను తెలుసుకున్నారు. ఆ రాత్రి ప్రదర్శన పూర్తి అయీ అవగానే దర్బారు ఏర్పాటు చేసి సైన్యాన్ని తరలించి గురవరాజు పరిపాలనను అంత మొందించే, ఈ విషయాన్ని ప్రదర్శన రూపంలో చిత్రించి కనువిప్పు కలిగించిన కళాకారులను వేనోళ్ళ పొగిడి కానుకలిచ్చి, అగ్ర హారలిచ్చి పంపారు. వారి సంస్థానంలో కళాకారులను పోషించారు.

శిల్ప కళతో పాటు చేయి చేయిగా చిత్రకళ - సకల కళా సమంవితం - విరూపణ్ణ లేపాక్షీ:

ఆ కాలంలో శిల్పకళతో పాటు చిత్రకళ కూడ అభివృద్ధి చెందింది. విజయనగర చక్రవర్తి యైన అచ్యుత రాయల కాలంలో హిందూపురానికి 9 మైళ్ళ దూరంలో లేపాక్షి అనే చోట పెనుగొండ విరూపణ్ణ అనే రాయల వారి ఉద్యోగీ, అతని సోదరుడైన వీరణ్ణ నాయకుడూ లేపాక్షి నగర నిర్మాణానికి కారకులని తెలుస్తూ వుంది.

విరూపణ్ణ లేపాక్షిలో కట్టించిన వీరభద్రేశ్వరాలయంలో ఒక నాట్య మంటపం వుంది. అందులో శివుని నటరాజమూర్తిని, గాయక బృందంతో పాటు అప్సరసలను ప్రదర్శించే శిల్పఫలకాలున్నాయి. ఈ దేవాలయంలో అపూర్వమైన నాట్య విజ్ఞానం వెల్లి విరుస్తూ వుంది; నృత్యం చేస్తున్న నాట్య కత్తెలతోను, మార్దంగిక వాద్య కారులతోను దేవ గాయక బృందాలతోనూ శిల్ప కళామయమైన స్తంభాలు నిలబడి ఈ నాటికీ మనకు దర్శనమిస్తున్నాయి.


సృష్టికర్తమైన బ్రహ్మదేవుడు మృదంగ వాయిద్యం వాయిస్తున్నట్లూ, నందికేశ్వరుడు హుడుక్క వాయిద్యాన్ని ప్రయోగిస్తున్నట్టూ, తుంబురుడు వీణా తంత్రుల్ని మీటుతున్నట్లూ, దేవనర్తకి యైన రంభ నృత్యం చేస్తున్నట్లూ మన చూడగలం.

నాటి జానపద కళల తియ్యందనాలు:

చంద్రశేఖర శతకాన్ని వ్రాసిన చంద్రశేఖరుడు తాను వ్రాసిన శతకంలో తాను చూసిన ఆనాటి జానపద కళారూపాలను ఎన్నింటినో వర్ణించాడు. ఈతడు వాడిన భాషను బట్టి ఇతడు నెల్లూరు ప్రాంతం వాడు కావచ్చని ప్రతాపరెడ్డి గారు తమ సాంఘిక చరిత్రలో వుదాహరించారు. చంద్రశేఖరుడు 17 వ శతాబ్దం వాడని వూహించ వచ్చు. అంటే విజయనగర సామరాజ్యం దాదాపు అంతరించిన కాలం. ఆ నాటి ఆచార వ్వవహారాలను వెక్కిరించి తన రచన ద్వారా హేళన చేశాడు. ఈయన తందాన కథలను గూర్చి, జంగం కథలను గూర్చి, భాగవతులను గూర్చి, పంబలవారిని గూర్చి చమత్కార మైన భాషలో వుదాహరించాడు. భోగం ఆటలను గూర్చి ఈ విధంగా వర్ణించాడు.

భోగం మేళం:

సేరువ వాడపల్లి నరిసిమ్ముడి తీరతమోయి బోగమ
 మ్మోరులయాట సూస్తి దనిముంగల దేముడెంత, ఇద్దెలో
తీరు, పయాస గంటి, వొకతిత్తి గుకిన్కిక కూడెవాని కా
లూరికె మొక్క బుద్దెగు నహోయను మూర్ఖుడు చంద్రశేఖరా.

.
తందాన కథలు:

ఇంటిని తిమ్మ రాజు కత ఇంటిని ఈర్ల కథాప్రసంగముల్
ఇంటిని పాదు లాలి,
ఇబమింటిని నాయకురాలి శౌర్రెమె
ప్పంటికి నంది వాక్యముల పొందు
చెర్రితల నాదు భాగ్యమెన్నంటికి గల్గనోయును నవజ్ఞుడు
మూర్ఖుడు చంద్రశేఖర.

భాగోతులు:

రాతిరి సూస్తి యేసములు రమ్మెముగా గురులాన మొన్న బా
గోతుల సత్తెబామ యన గూడని తాపములెల్లసేసె మా
పాతకురాలు రాద వల వచ్చము రుక్మిణి సుద్దికిష్టమం
టీ తీరుగ నంచు వచియించును మూర్ఖుడు చంద్రశేఖరా.

పంబలవారు, జాతర్లు:

ఇరిదిగసూస్తిరీరతము లెన్నెనో యావనగొండ గంగ జా
తర సరిరావు పంబులును తప్పెటలున్ కొముగాండ్ల సిండ్లసం
బర మదిదెల్పు మింకొక పబాచము రంకులరాటమెక్కి నే
తిరిగిన సాటిరాదని నుతించును మూర్ఖుడు చంద్రశేఖరా.

ఈ విధంగా 1336 లో ప్రారంభమైన విజయనగర సామ్రాజ్యం మూడు వందల సంవత్సరాల పాటు నిలబడి, నశించింది. దక్షిణ హిందూ దేశమంతా రెండు వందల సంవత్సరాలు వీరు పాలించారు. ముఖ్యంగా ఆంధ్రదేశంలో విజయనగర రాజ్య కాలం ఒక విధంగా స్వర్ణయుగం.