తెలుగువారి జానపద కళారూపాలు/వాయుజన్య శబ్ద వాయిద్యాలు

వాయుజన్య శబ్ద వాయిద్యాలు


నాగస్వరం:

ఎరుకలలో ఒక కులమైన పాముల వాళ్ళు వాయించే వాద్యమిది. పాములను ఆడించడానికి ఇది ఉపయోగ పడుతుంది. త్రాచువంటి పాములను సైతం పాముల వాళ్ళు నాగ స్వరంతో మచ్చిక చేస్తారు.

డగుల బరాయి:

ఇది వెదురుతో చేసిన వాయిద్యమే గాని పిల్లన గ్రోవి కంటే పెద్దది. దీని పొడవు 16 అంగుళాల నుంచి 20 అంగుళాల వరకు ఉంటుంది. రెండు నుంచి మూడు అంగుళాల వ్వాసం వుంటుంది. దీనికి మధ్యలో పది పన్నెండు అంగుళాల చాలు వుంటుంది. ఈ పెద్ద చాలుకు రెండు వైపుల పొడుగు పాటి చిన్న రంద్రాలు వుంటాయి. డంగు అనే ఒక కొయ్యముక్క సహాయంతో ధ్వనిని జనింప చేస్తారు. ఈ వాయిద్యాన్ని విడిగా కాకుండా అనేక ఇతర వాయిద్యాలతో పాటు ఉపయోగిస్తారు.

వెదురు పిల్లన గ్రోవి:

గోదావరి ప్రాంతంలో ఎక్కువ గ్రామాలలో ఇది బహుళ ప్రచారంలో వుంది. ఇతర చోట్ల కూడ పల్లె ప్రజలు అభిమానించే వెదురు వాయిద్యమిది. వూదే చోట ఒక రంధ్రమూ, మధ్య నుంచి రెండవ చివరి వరకు ఐదు చిన్న రంధ్రాలు వుంటాయి సాధారణంగా ఇది 21 సెంటి మీటర్ల పొడవు వుంటుంది.

తేతిడి:

సవరలు ఉపయోగించే ఈ వాయిద్యం గేదె కొమ్ముతో తయారు చేసినది. దీని పొడవు 12 నుంచి 15 అంగుళాల వరకూ వుంటుంది. సన్నగా చివరన వుండే వెదురుతో చేసిన సన్నని గొట్టాన్ని పేకగా అమర్చుతారు. బాగా దుమ్ము పట్టి వూది నప్పుడు పెద్దగా శబ్దం వస్తుంది.

పనార్:

పన్నెండు అంగుళాల పొడవు ఒక అంగుళం వ్వాసం కలిగిన ఈ వాద్యాన్ని కూడ సవరలు ఉపయోగిస్తారు. దీనికి ఒక వైపు మూసి వుంటుంది. రెండవవైపు ఖాళీగా వుంటుంది. మూసిన వైపు దీర్ఘ చతురస్రాకారంగా ఒక చిన్న రంధ్రం వుంటుంది. తాటాకు బద్దను మైనంతో రంధ్రం వద్ద అతికిస్తారు. తాటాకు బద్ద కదలిక ద్వారా రంధ్రం పరిమాణాన్ని మార్చుతుండవచ్చు. ఎడమ చేతి బొటన వ్రేలు ఇతర వ్రేళ్ళ మధ్య పట్టుకుని పెదిమల దగ్గరగా వుంచి ఈ వాద్యం నుంచి శబ్దాన్ని ధ్వనింప చేస్తారు.

రెండవ రకం పనార్:

తెలుగు దేశంలో ఇంకా అనేక చోట్ల ప్రచారంలో వున్న పిల్లన గ్రోవి. ఇది ఒక చివరన వున్న రంధ్రం నుండి ఊదుతూ కుడి చేతి వ్రేళ్ళ తోనూ, ఎడమ చేతి వ్రేళ్ళతోనూ శబ్దంలో మార్పులు తీసుకురావచ్చు. వివాహాది శుభ కార్యాల సమయంలోనూ, విశ్రాంతిగా వుండే సమయంలోనూ ఈ వాయిద్యాన్ని వాయించటం పరిపాటి.

తంత్రీ వాయిద్యాలు

కిన్నెర:

ఇది అనేక తంత్రులు కలిగిన సంగీత వాయిద్యం. ఉత్తారాదిన కొన్ని గిరిజన జాతులలో వాడుకలో వున్న కిన్నెర వాయిద్యాన్ని పోలి వుంటుంది. ఇంచుమించు గిటారు లాగ వుంటుంది. లోపల ఖాళీగా వున్న సుమారు 20 అంగుళాల వెదురు పై మైనంతో మధ్యగా నాలుగు మెట్లను అతికిస్తారు.

మెట్లపై నుండి రెండు తంత్రులను బిగిస్తారు. వెదురుకు ఒక చివర స్వర పేటిక వుంటుంది.

కింగ్రి:

మూడు తంత్రులూ, చర్మం బిగించిన స్వరపేటిక ఈ వాయిద్యంలో ముఖ్య

భాగాలు. స్వర పేటికను చదరంగా కొయ్యతో తయారు చేస్తారు. ఫిడేలు వలె వుండే ఈ వాయిద్యాన్ని అత్యంత విలువైనదిగా పరిగణిస్తారు. వర్థానులలో అందరి కంటె ప్రముఖుడైన వ్వక్తి ఈ వాయిద్యాన్ని వాయిస్తాడు. ఆ సమయంలో చిన్నవారు తప్పెట్లు వాయిస్తూ బాణాలు వూదుతారు.

సిరిసిరి మువ్వల చిరుతల రామాయణం

చిరుతల రామాయణం తెలంగాణా ప్రాంతంలో చాల వ్వాప్తిలో వుంది. ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలో చిరుతల రామాయణం అతి ప్రాచీన కళారూపం. పల్లెల్లోని శ్రామిక యువకులు ముప్పై నలబై మంది కలిసి వేసవి కాలంలో ఒక గురువును నియమించుకుని చిరుతల రామాయణాన్ని నేర్చుకుంటారు.

ఊరు బయట విశాలమైన స్థలంలో ఒక కర్ర పాతి, దానికి జండాలు కట్టి, చిరుతలు పట్టుకుని, కాళ్ళకు గజ్జెలు కట్టుకుని పాట పాడుతూ నృత్యం చేస్తారు. న్యాయానికి ఇది మన కోలాటం లాంటిదే అయితే వీరు ముఖ్యంగా కోలాటం పాటలు కంటే చిరుతలతో నృత్యం చేస్తూ రామాయణ భారత కథలను తీసుకుని బృంద సభ్యులే పాత్రలుగా వ్వవహరించటం వల్ల దీనికి చిరుతల రామాయణమని పేరు వచ్చింది.

పాత్రల ఎంపిక:

ప్రథమంలో బృంద సభ్యుల అకారాల ననుసరించి, పాత్రలను ఎంపిక చేస్తారు. తరువాత వేషధారణ లేకుండానే ప్రతి పాత్రకూ పాటను నేర్పుతాడు. ప్రతి పాత్రధారికీ క్షుణ్ణంగా పాట వచ్చి తీరాలి. ఈ విధంగా ఒక మాసం రోజులు గురువు బృంద సభ్యులతో రామాయణం శిక్షణ ఇస్తాడు. అభ్యాసం అయిన తరువాత రామ పట్టాభిషేకం వుంటుంది. ముఖ్యంగా సీతారామ పాత్రలు ధరించేవారు. ధనవంతుల ఇళ్ళలో చీరలు, పంచెలు, నగలు సంపాదించి వేషధారణను సమకూర్చుకుంటారు.