తెలుగువారి జానపద కళారూపాలు/రాయలసీమ జానపద కళారూపాలు
రాయలసీమ జానపద కళారూపాలు
రాయలసీమలో యక్షగానాల తరువాత "వీథి నాటకాలు, బుర్ర కథలు, విచిత్ర వేషాలు, తోలు బొమ్మలాటలు, హరికథలు" మొదలైనవి విరివిగా ప్రదర్శిస్తూ వుండేవారు. వీటినే బయలాటలనీ, బయలు నాటకాలనీ అనే వారు. వీటిని మాలపల్లెలో వున్న దాసరులు అనే వారు ప్రదర్శిస్తూ వుండేవారు. వీరిని దాసుళ్లనీ, దాసరులనీ కొమ్మాయి దాసుళ్ళనీ, మాల దాసరులనీ పిలువబడుతూ వుండేవారు. హరిజనుల్లో ఒక తెగగానూ వారిలో అతీతులుగానూ వుండేవారు. శూద్ర జాతులు బ్రాహ్మణులను కూడా గూడెపు ప్రజలు గౌరవిస్తారు. ఒకనాడు వీటిని దాసరులే ప్రదర్శించినా, ఈనాడు అనేక మంది వాటిని ప్రదర్శిస్తూ జీవయాత్ర చేస్తున్నారు.
- కంఠస్థంగా వున్న కళారూపాలు:
వీరు ప్రదర్శించే నాటకాలు అన్నీ వ్రాతప్రతులుగానో, లేక తాటియాకుల గ్రంథాల్లోనో లేక ప్రత్యేక వ్వక్తుల కంఠస్థంగానో నిలచి వున్నాయి. ఒక్కొక్క దేశంలో వున్న ముఖ్య నాయకునికి అనేక నాటకాలు కంఠస్థం అయివుంటాయి. అతను మరణిస్తే, అతినితోపాటే ఆ నాటకాలు కూడ అంతరిస్తాయి. ఈ విధంగా మన ప్రాచీన యక్షగాన సాహిత్యం, బయలు నాటకాల సాహ్యిత్యం అంతా శిథిలమైంది. అయినా ఇప్పటికీ రాయలసీమ పల్లెల్లో అనేక బయలు నాటకాలు ప్రచారంలో వున్నాయి. అవి కూడ కొన్ని అచ్చులో లేవనే చెప్పవచ్చు. వాటిలో కొన్ని మచ్చుకు ఈ క్రింద ఉదహారిస్తాను.
- నాటి మేటి నాటకాలు:
దొడ్డ కవి వ్రాసిన "సుగ్రీవ విజయం" కుమ్మారి బాలయ్య వ్రాసిన "సారంగధర " రుద్ర కవి వ్రాసిన "శశిరేఖా పరిణయం" బెడుదూరు రంగాచార్యులు రామాచార్యులు వ్రాసిన "హరిశ్చంద్ర", వేములపల్లి కృష్ణమాచార్యుల "విరాట పర్వం" నరసింహారెడ్డి వ్రాసిన "చుక్కలూరు రామనాటకం." యాదవదాసు రచించిన "గరుడాచల యక్షగానం." మొదలైన పైన వివరంచిన నాటకాలన్నీ నేటి రాయలసీమలో ప్రచారంలో వున్నాయి. ఇవి అన్నీ కూడ పురాణకథా వస్తువులతో కూడినవే. అయినా పల్లె ప్రజలకు అర్థ మయ్యే శైలిలో వ్రాయబడ్డాయి. అంతేగాక ప్రదర్శనా క్రమంలో ప్రతి మాటా అర్థమయ్యేటట్లు విడమర్చి చెప్పేవారు. అందు వల్ల చదువురాని ప్రేక్షకునికి కూడ ఆర్థమయ్యేది. అందుకు ఉదాహరణ యాదవదాసు రచించిన గరుడాచల యక్ష గానంలో__
బాణమెయ్యగలా మృగముల
బట్టి త్రుంచ గలవా
నాణెము తోడున్నత జారుడు బండల
మీది కెక్క గలవా
మృగముల బట్టెదనే నేన్
నగముల తిరిగెదనే
- నలుగురు కూడె నడిబజారులో నాటక ప్రదర్శన:
పై విధంగా పాత్రల మధ్య సంవాదం జరుగుతుంది. ప్రదర్శనాల పద్ధతి. ఊరు మధ్య పెద్ద బజారులో నలుగురూ సమకూడే ప్రదేశంలో పెద్ద
గడలతో వందిరి వేసి చుట్టూ మామిడి తోరణాలు గట్టి పందిరిలో ఎత్తుగా దిబ్బ పోసి ప్రదర్శనానికి ముందు మద్దెల తాళాలతో కొంచెం సందడి చేసేవాళ్ళు. అంతకు ముందు ప్రదర్శన కారులు ఇంటింటికీ వెళ్ళి రాత్రి ప్రదర్శనానికి రమ్మనమని ఆహ్వానించేవారు. ప్రదర్శనానికి లైట్లు వుండేవి కావు. తెరలు వుండేవి కావు. తెరలకు బదులు దుప్పట్లు ఉపయోగించే వారు. లైట్లకు బదులు దివిటీలు వెలిగించే వారు. కొన్నాళ్ళు కిరసనాయిలు ఇలాయి కఱ్ఱలు వెలిగించే వారు. గ్యాసు లైట్లు వచ్చిన తరువాత పై విధానాలు పోయాయి.
- హంగామాతో రంగస్థల హంగులు:
ఈ యక్షగానాల్లో స్త్రీ పాత్రలు పురుషులే ధరించేవారు. భుజ కీర్తులు ధరించేవారు. కిరిటీలు పక్షుల రెక్కలతో సొంపుగా తయారు చేసేవారు. వేషధారణలో ఆయా రసాలకు తగిన ఎరుపు, పశుపు, పచ్చ రంగులను ఉపయోగించేవారు. ప్రతి పాత్ర ప్రవేశానికి ఒక హంగామా చేసేవారు. ఈ విధంగా ప్రేక్షకుల్లో కొత్త ఉత్సాహాన్ని రేకెత్తించేవారు. ముఖ్యంగా ప్రధాన పాత్రలు యముడు, కంసుడు, రావణుడు మొదలైన పాత్ర ప్రవేశాల్లో నిప్పులు గ్రక్కుతూ పాత్రలు వచ్చేవి. రంగస్థలం పైకి పాత్ర రాగానే తెర పట్టి, తెర వెనుక పాత్రధారుల నుంచి తెర ముందు విధూషకుడు వచ్చి పాత్రధారిని ప్రేక్షకులకు ఎరుక పర్చడానికి అహా, ఈ సభా
రంగమునకు విచ్చేసిసిన అమాత్యులెవరండీ? అని ప్రశ్నిస్తే వెంటనే లోపల వున్న పాత్ర ధారి ఏ వుద్దేశ్యంతో ప్రవేశించనున్నాడో అంతా పూసగ్రుచ్చినట్లుగా పాత్ర పరిచయం చేసేవారు. ఆ తరువాత నాటక ప్రారంభం. నటుడు వల్లించిన ప్రతి పాటకూ హంగుదార్లు వంత పాడుతూ నానా హంగామా చేస్తారు. ఈ విధంగా నాటకాన్ని రక్తికి తీసుకువస్తారు. ఈ విధమైన బయలు నాటకాలు రాయలసీమలో అన్ని పల్లె ప్రాంతాల్లోనూ ప్రదర్శింపబడుతూ వుండేవి.
- వెదురు చాపల వీథినాటక రంగస్థలం:
ఆనాడు రాయలసీమలో నాటకాలు ప్రదర్శించటానికి తగిన ప్రదర్శన శాలలు లేవు. వెదురు చాపలు, తడికెలూ, గోనె సంచుల కప్పులతో నాటక శాలలు నిర్మించేవారు. ప్రతి నాటక సమాజమూ మంచి క్రమశిక్షణతో రంగస్థలాన్ని పవిత్రంగా ఎంచేవారు. నాటకాలలో వాయిద్యాలుగా హర్మోనియం, తబలా, మృదంగం, ఫిడేలు ఉపయోగించేవారు. వేష ధారణలో సఫేదు, అర్థళం వుపయోగించేవారు. ఉత్తమ పాత్రలన్నిటికీ విలువైన చెంకీ కోటులను, మంచి తలపాగాలను తురాయిలనూ ఉపయోగించేవారు. విగ్గులకు బదులుగా వారి వారి శిరోజాలనే విగ్గులుగా పెంచుకునేవారు.
- బళ్ళారికి పేరు తెచ్చిన బయలాటలు:
పూర్వం నుంచీ బళ్ళారి ప్రాంతంలో బయలాట అనే జానపద కళారూపం బహుళ ప్రచారంలో వుండేది. ఆంధ్రప్రదేశపు వీధి నాటక ప్రదర్శనానికి, ఈ బయలాట ప్రదర్శనానికి ఎంతో సన్నిహిత సంబంధముంది. ఈ నాటికీ ఈ కళారూపం బళ్ళారి చుట్టు ప్రక్కల గ్రామాల్లో ప్రదర్శింప బడుతూ వుంది.
ఒకప్పుడు బళ్ళారిలో "జనల్ ఘాట్" , "మేఘాట్" అనే రెండు పెద్ద
బయలాట కంపెనీలను 'గరుడచేడు హనుమంతప్ప','సామసాగరం వెంకణ్ణ' కురుగోడు దొడ్దకవి మొదలైన వారు నడుపుతూ వుండేవారు. వీరు కన్నడిగులు.