తెలుగువారి జానపద కళారూపాలు/ముద్దుల యెద్దుల గంగిరెద్దాటలు

ముద్దుల యెద్దుల గంగిరెద్దాటలు

గంగిరెద్దుల వాడు కావర మణచి
ముకుతాడు పొడిచి పోటెద్దులట్లు

అని పలనాటి వీర చరిత్రలో శ్రీనాథుడు ఉదహరించడాన్ని బట్టి అతిప్రాచీన కాలం నుంచీ ఈ గంగిరెద్దాటలు ప్రచారంలో వున్నాయని తెలుసుకోవచ్చు.

డూ డూ బసవన్నా ఇటురారా బసవన్నా
వురుకుతు రారన్నా రారన్న బసవన్నా
అమ్మవారికీ దండం బెట్టు అయ్యగారికీ దండం బెట్టు
మునసబు గారికి దండంబెట్టూ
కరణం గారికి దండంబెట్టూ
రారా బసవన్నా, రారా బసవన్నా....

అంటూ

ఈ ఇంటికి మేలు జరుగుతాదని చెప్పు, మంచి జరుగుతాదని చెప్పు అంటూ గంగిరెద్దులతో తలలను ఊపిస్తారు.

ఒక నాటి కళారూపం:

ఒకనాడు దేదీప్యమానంగా వెలిగిన గంగిరెద్దాటలు వ్యాచకవృత్తిని అవలంబించినా అవి విద్వత్తును ప్రదర్శించే గంగిరెద్దుల మేళంగానూ, ప్రజలను వినోదపర్చి ఆనందింప చేసే కళారూపంగానూ ఖ్యాతి వహించింది.

గంగిరెద్దుల మేళాల వారు, రెండు మూడు కుటుంబాలు కలిసి అయిదారు అందమైన బలిసిన గంగిరెద్దులతో దండుగా బయలు దేరి ఆంధ్ర దేశంలో ఆ మూల నుంచి ఈ మూల వరకూ మకాంలు వేస్తూ జీవయాత్రలు చేసే వారు.

ఒకప్పుడు రాజులూ జమీందారులూ వారి వారి ప్రాంగణాలలో గంగిరెద్దుల ప్రవర్తనాన్ని ఏర్పాటు చేసుకుని వినోదించే వారు.

గంగిరెద్దుల వారు ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో కూడ వున్నారు. అయితే వారిలో ఎక్కువ మంది తెలుగు భాషనే మాట్లాడుతారు.

వీరికి ఒక వూరనేది లేదు. పర్వ దినాలలోనూ, ముఖ్యంగా రైతులకు పంటలన్నీ చేతికి వచ్చి పని పాటలు లేని సమయాల్లోనూ, సంక్రాంతి పండుగ దినాలలోనూ వీథుల వెంట బయలుదేరుతారు.

ఆటను నేర్పటం.

వయసులో వున్న కోడె గిత్తల్ని తీసుకువచ్చి, వాటి ముక్కులకు ముకుతాడు పొడిచి వాటి పొగరుబోతుతనాన్ని అణగ గొట్టి, వాటిని లొంగ దీసుకుని, చెప్పినట్ట్లు చేసేలా తయారు చేసే వారు. ఉదాహరణకు సర్కస్ జంతువులకు తరిఫీదు ఇచ్చినట్లు.

ఇలా వాటిని కొన్ని మాసాల పాటు మచ్చిక చేసుకునే వారు. వాయిద్యానికి అనుకూలంగా అడుగులు వేయించటం, పరుగెత్తించటం, పడుకోబెట్టటం, అటూ ఇటూ దొర్లటం, మూడు కాళ్ళ మీద నుంచో పెట్టటం, చిట్టి అడుగులతో నృత్యం చేయటం, డూడూ బసవన్నా, రారా బసవన్నా అంటూ వాటిని పరుగులు పెట్టించటం, కొన్ని ప్రశ్నలు వేసి వాటికి సమాధానంగా తల వూపించటం, సలాం చేయమంటే కాలు పైకెత్తి సలాం చేయటం, ఇలా ఎన్నో విద్యల్ని కొన్ని మాసాల పాటు నేర్పి వీథిలోకి తీసుకువస్తారు.

గంగిరెద్దుల అలంకారం:

గంగిరెద్దుల్ని స్వంత బిడ్డల్లా చూస్తారు. వాటిని ఎన్నో రకాలుగా అలంకారిస్తారు. మూపురం వద్ద నుండి తోక వరకూ ఎంతో అందంగా రంగు రంగులతో కుట్టిన బొంతను కప్పుతారు. రంగులతో కొమ్ములను అలంకరిస్తారు. కొమ్ము చివర ధగధగ మెరిసే ఇత్తడి గొట్టాలను తొడుగుతారు. మూతికి తోలుతో కుట్టబడిన శికమారును కడతారు. నొసటి భాగాన అందమైన తోలు కుచ్చులను కడతారు. మూపురాన్ని రంగు పంచెతో అలంకరించి ఒక దండను దిగ వేస్తారు. పొట్ట చుట్టూ తగరపు పువ్వులతో కుట్టిన తోలు బెల్టును కడతారు. కాళ్ళకు గజ్జెలు కడతారు.అప్పుడు చూడాలి ఆ బసవన్నల అందం. సాక్షాత్తూ నందికేశ్వరుని పోలి వుంటుంది.

ఆడించే వారి హంగులు:

గంగిరెద్దుల వారి హంగులు, శ్రుతి సన్నాయి బూర, డోలు, చేతిలో కంచుతో చేయబడిన చిన్న చేగంట, వేషధారణలో నెత్తికి రంగుల తలగుడ్డ మూతిమీద కోర మీసాలు, చెవులకు కమ్మల జోడు, వారు వీరు ఇచ్చిన పాత కోటు, భుజంమీద కండువా, చేతికి వెండి మురుగులు, నుదురున పంగనామంతో సైకిల్ పంచ కట్టుకట్టి ఆకర్షణీయంగా తయారౌతారు.

సుందర ప్రదర్శనం:

గంగిరెద్దుల వారికి ప్రతి వూరిలోనూ మధ్యనున్న పెద్ద బజారే వారికి రంగస్థలం. ముందుగా గ్రామంలో ప్రవేశించి, గ్రామ పెద్దల నాశ్రయించి వారి అనుమతితో ప్రదర్శనం ఏర్పాటు చేసుకుంటారు.వారి వాయిద్యాలతో రణగొణ ధ్వనులు చేసి ప్రజలను రప్పిస్తారు. ఆ రోజుల్లో గంగిరెద్దుల ఆటలంటే మహదానందంతో హాజరయ్యేవారు.

ప్రేక్షకులందరూ మూగిన తరువాత గంగిరెద్దులను మేళతాళాలతో బరినంతా తిప్పుతూ స్వాగతం పలికిస్తారు. ఎద్దు నోటిలో మెడను ఇరికించి అదృశ్యాన్ని అందరికీ చూపిస్తారు. వాయిద్యానికి అనుకూలంగా గజ్జెల కాళ్ళతో నృత్యం చేసేది, పడుకోమంటే పడుకునేది, లేవమంటే లేచేది, అయ్యగారికి దండం పెట్టమంటే నమ్రతతో తలవంచేది. అయ్యగారికి శుభం కలుగుతుందా? అనుకున్న పనులు జరుగుతాయా అంటే అవునన్నట్టు తల వూపుతుంది. వాడు అడిగిన ప్రతిదానికీ తల వూపడాన్ని బట్టే ఒక సామెత పుట్టిందనుకుంటా.

మనవాళ్ళు అంటూ వుంటారు. ఏమిటిరా అడిగిన ప్రతిదానికీ గంగిరెద్దులా తల వూపుతావు. నోటితో సమాధానం చెప్పరా అని. అది ఏనాడో పుట్టిన సామెత.

రామ లక్ష్మణులు:

ఈ ఎద్దులను రామ లక్ష్మణులుగా ఎంచి పేర్లు పెట్టి పిలుస్తారు. వాటిని బసవేశ్వరుడుగా పిలుస్తారు. రాముడుగా సీతగా ఎంచి కళ్యాణం జరుపుతారు. ప్రేక్షకులు కూడ వాటిని రామలక్ష్మణులుగా ఎంచి భక్తి భావంతో వాటికి ధాన్యాన్ని తినిపించడం, అరటి పళ్ళు పెట్టటం చేస్తారు. ఇలా గంటన్నర కాలం కనువిందుగా ప్రదర్శనం జరుగు తుంది.

గంగిరెద్దుల విన్యాసంలో మధ్య మధ్య పాటలు పాడతారు. వాయిద్యాలకు తగినట్లు వాళ్ళ పిల్లలతో మొగ్గలు వేయిస్తారు. మధ్య మధ్య ప్రేక్షకులను చూచి సమయానుకూలంగా ఛలోక్తులను విసురుతారు.

అలాగే ప్రదర్శనం చూచి ముగ్ధులైన ప్రేక్షకుల నుంచి విరాళాలను దండుకుంటారు. బసవన్నా ఈ బాబు నీకు పది రూపాయలిస్తున్నారంటే అక్కడికికి పరుగెత్తుకొస్తుంది. రామన్నా ఈ బాబు నీ వీపుమీద కండువా కప్పుతానంటున్నాడు ఇలా పేరు పేరునా పిలిచి ప్రేక్షకులను మోమోట పెట్టి విరాళాలు గుంజుతారు.

తరువాత ఇంటింటికీ తిరిగి ధాన్యము బట్టలూ, డబ్బులూ ఎద్దులకు మేతా సంపాదించుకుంటారు. ఇలా ఎద్దులను బ్రతికిస్తూ తద్వారా వారు బ్రతుకుతూ దేశ సంచారం చేసేవారు. ఎద్దుల్లో ఏదైనా ఎద్దు చనిపోతే వారి బిడ్డల్లో ఒక బిడ్డ పోయినట్లుగా భావించి దానికి పూజలన్నీ జరిపించి భక్తిభావంతో ఖననం చేస్తారు.

అయితే ఈ నాడు వీరి గంగిరెద్దుల విద్యక్షీణించి పోయి సామూహిక ప్రదర్శనాలు నశించి కేవలం పొట్ట పోసుకోవడానికి ఒక ఎద్దుతో వూరూరా, ఇల్లిల్లూ తిరుగు తున్నారు. ఇలా కాల ప్రవాహంలో సామూహిక గంగి రెద్దాటలు నశించి పోయాయి.

గజాసురుడు, గఆంగిరెద్దుల వారు:

అసలీ గంగిరెద్దుల వారికి కథకు మూల మేమిటయ్యా అని ప్రశ్నిస్తే వారు చెప్పిన కథాంశాన్ని కె.వి. హనుమంత రావు గారు ఆంధ్రప్రభలో ఈ విధంగా వివరించారు.

పూర్వం గజాసురుడనే రాక్షసుడు శివుని కటాక్షం కోసం ఘోరమైన తపస్సు చేశాడట. శివుడు ప్రత్యక్షమై ఏమి కావాలని వరమడిగాడట: అందుకు గజాసురుడు మీరు నా గర్భంలో ప్రవేశించి, పూజలందుకో మంటాడట. అందుకు శివుడు అంగీకరించి అతని గర్భంలో ప్రవేశిస్తాడట. అంతర్థానమైన పతి దేవుని జాడ తెలియక పార్వతీ దేవి దుఃఖించి గజాసురుని గర్భంలో వున్నట్లు తెలుసుకుని పతిని విముక్తిని చేయమని విష్ణుమూర్తిని వేడుకుంటుందట. అప్పుడు విష్ణువు గంగిరెద్దుల మేళాన్ని రూపకల్పన చేశాడట. నందికేశ్వరుణ్ణి గంగి రెద్దుగా అలంకరించి బ్రహ్మాది దేవతలతో వివిధ వాయిద్యాలను ధరింపచేసి, తాను మేళానికి నాయకత్వం వహించి _ గజాసుర పురానికి చేరి గంగిరెద్దుల ఆటను నిర్వహిస్తాడట.

ఈ విషయం గజాసురుని చెవులబడి తన సమక్షంలో ఆ ఆటను ప్రదర్శించమని కోరుతాడట. అందుకోసమే ఎదురు చూచిన విష్ణుమూర్తి అద్భుతంగా ఆటను నిర్వహిస్తాడట. గజాసురుడు ఆనందభరితుడై ఏం కావాలో కోరుకో మంటాడట.

తన పాచిక పారిందనుకున్న హరి... ఇది శివుని వాహనమైన నంది తన స్వామికి దూరమై విలపిస్తూ వుంది. ఆ స్వామిని నంది కడకు చేరనియ్యి అని కోరతాడట.

ఆలోచనలో పడ్డ గజాసురుడు, ఇతను అసుర సంహారి యైన చక్రధారి అనీ, ఇక తనకు మృత్యువు తప్పదనీ తెలుసు కున్న గజాసురుడు శివుని ప్రార్థించి, నందీశ్వరునికి ఎదురుగా నిలుస్తాడట.

అంతలో విష్ణుమూర్తి నందిని ప్రేరేపించగా, కొమ్ములతో గజాసురుణ్ణి కుమ్మగా గజాసురుని గర్భం నుండి శివుడు బయట పడతాడట.

ఆడిన మాట తప్పని గజాసురుని శిరస్సు అన్ని లోకాల్లో పూజలందుకుంటుందనీ, అతని చర్మాన్ని తాను మేన ధరిస్తాననీ చెప్పి శివుడు గజాసురునికి శివైక్యాన్ని ప్రసాదిస్తాడట. ఇదీ గంగిరెద్దులవారి కథ.

విలక్షణ వీథి భాగవతం తూర్పు భాగవతం

ఆంధ్ర దేశంలో ప్రఖ్యాతి వహించిన వీధి భాగవతాలలో కూచిపూడి వీధి భాగవతాలలో కూచిపూడి వీథి భాగవతాలు గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాయి. వీరే కాక గొల్ల భాగవతులూ, యానాది భాగవతులూ, మాల భాగవతులూ, చిందు భాగవతులూ మొదలైన వారూ భాగవతాలను ప్రదర్శించారు

ఆనంద గజపతీ, ఆదిభట్లవారూ:

పై వారే కాక ఉత్తరాంధ్ర దేశంలో విశాఖపట్టణం, శ్రీకాకులం, గంజాం, కోరాపుట్టి మొదలైన ప్రాంతాల్లో తూర్పు భాగవతమనే భాగవతం ప్రచారంలో వుంది. ఇది సామాన్య ప్రజానీకాన్నే కాక, పండితుల్ని, విద్వాంసుల్నీ, కవుల్నీ, గాయకుల్నీ ఆకర్షించడమే కాక ఇది ఒక విశిష్ట నర్తన రీతి గానూ, సంగీత సాంప్రదాయం గానూ, మృదంగ బానీగానూ ఈ నాటకం పోషింపబడుతూ వుందని శ్రీ గరిమెళ్ళ రామమూర్తి, శ్రీ డి.వై. సంపత్ కుమార్ గారలు తెలియ చేస్తున్నారు.

ఇది పైన సూచించిన ఆయా ప్రాంతాలలో తిరునాళ్ళలోనూ, అమ్మవారి జాతర్లలోనూ, ఈ భాగవాతాలు ప్రదర్శింప బడి ప్రజాభిమానాన్ని చూరగొన్నాయి. పండితులైన హరికథా పితామహుడు అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు, ఆనంద గజపతి మహారాజు లాంటి కళా పోషకుల ఆదరాభిమానాల్ని చూరగొనడమే కాక ఎందరో ఉత్తమ భాగవత కళాకారులకు సింహతలాటాలను ఘంటా కంకణాలనూ కలియుగ సత్యభామ__ పండిత సత్యభామ__అభినయ సత్యభామ __ గాన కోకిల __ వసంత గాన కోకిల మొదలైన బిరుదులను గూడ ప్రసాదించారు.