తెలుగువారి జానపద కళారూపాలు/బొమ్మలూ, తోలుబొమ్మలూ

బొమ్మలూ, తోలుబొమ్మలూ

ఆంధ్రదేశంలో ఆబాలగోపాలాన్ని అనందింపజేసి, అన్ని కళారూపాలతో పాటు దీర్ఘ కాలం దివ్యంగా వర్ధిల్లిన కళారూపం తోలుబొమ్మలాట.

సకల కళాసమన్వితం:

మన లలిత కళలకు ఈ కళ వుపాంగంగా వున్న, లలితకళలు అన్నీ ఈ ప్రదర్శనంలో మూర్తీ భవించి వున్నాయి. కావలసినంత కవిత్వం వుంది. సాహిత్యం వుంది. సంగీతం వుంది. శిల్ప, చిత్ర కళలు తొణికిస లాడుతూ వుంటాయి. కడుపుబ్బ నవ్వించే హాస్యారస ఘట్టాలున్నాయి. లలిత కళ లన్నిటిలోనూ ఈ ప్రదర్శనం ఎంతో కన్నుల పండువుగా వుంటుంది. బొమ్మలతో చక్కగా నాట్యం త్రొక్కిస్తారు. ఆపైన వెనుక నుంచి సూత్ర ధారుడు ఎంతో చాకచక్యంగా పాత్రాభినయం చేయిస్తూ వుంటాడు. నాటక ప్రదర్శనానికి ఎన్ని హంగులుండాలో దాదాపు అన్ని హంగులూ బొమ్మలాటలోను వుండాలి. ఇన్ని హంగుల్నీ వారు ఎక్కడ నుంచి పూర్తి చేసుకొంటారు? కిరాయి నటీ నటుల్ని ఎక్కడ నుంచీ దించరు. జట్టు పెద్దలు పురుష పాత్రలు, వారి స్త్రీలు స్త్రీ పాత్రలు వహిస్తారు. భర్త శ్రీరాముడుగా వాచికం చెప్పి పాట పాడితే, భార్య సీతగా వాచికం చెప్పి వంత పాడుతుంది. ఇక వారి బిడ్డలు బాలికల పాత్రలకు అభినయాన్నిస్తారు.


ఈ విధంగా అయాపాత్రల బొమ్మలు పుచ్చుకుని కార్య క్రమాన్ని దిగ్విజయంగా నడుపుతారు. తెరమీది బొమ్మలు ఎంత వుధృతంగా నాట్యం త్రొక్కుతూ వుంటాయో, లోపలి భాగంలో వున్న వ్వక్తులు కూడా దాదాపు అంతటి అభినయాన్నీ వ్వక్తం చేస్తూ వుంటారు.

దేశవ్యాప్తంగ బొమ్మలాటలు:

ఈ బొమ్మలాటలు - ఒక్క ఆంధ్ర దేశంలోనే కాకుండా పరిసర ప్రాంతాలైన మహారాష్ట్రం, మళయాళం, తమిళం, బెంగాల్ మొదలైన ప్రాతాల్లోనూ వ్యాపించి వున్నాయి. ఉత్తర దేశంలో 'కట్ పుత్లీ' అనే కొయ్య బొమ్మలాటలు, దక్షిణదేశంలో కీలు గుఱ్ఱపు బొమ్మలాటలూ, బొమ్మలాట్టం అనబడే కొయ్య బొమ్మలాటలు ప్రచారంలో వున్నాయి. ఈ నాడు మనం చూసే బొమ్మల వస్త్రధారణా, భూషణాలంకార పరిశోధనా చూస్తే - ఈ మాదిరి అలంకారం గల నాగరికత తంజావూరు ఆంధ్రరాజుల కాలంలోనిదిగాను, మహారాష్ట్ర రాజుల కాలంలోనిది గానూ నిదర్శనాలు కనిపిస్తున్నాయి.

తొలుబొమ్మలాటలు ప్రదర్శించే వారు చాలవరకు మరాఠీ వారు. వీరిని కన్నడంలో 'కిషేషిక్యాత ' జాతివారని, తమిళదేశంలో 'కెల్లెక్యాతవా 'రని, తెలుగు దేశంలో బొమ్మలాట వారని, చర్మ నాటకులనీ వ్వవహరిస్తున్నారు.

ఆంధ్రదేశంలో ప్రదర్శించే తోలుబొమ్మలాటలు మహారాష్ట్రం నుంచి సంక్రమించాయనే చరిత్ర కాధారాలున్నప్పటికీ, చాళుక్య రాజుల కాలంనాటికే తోలు బొమ్మలాట లాడినట్లు భారతం విరాట పర్వంలో వివరించబడింది. బొమ్మలాటలవారు బెల్గాం, కొల్హాపూర్స్, సతారా, పూనా, బిజాపూర్ ప్రాంతాల నుండి, పరిపాలకుల జైత్ర యత్రల్లోనూ, ఆయా దేశాలలో వచ్చిన విప్లవోద్యమాల మూలంగానూ వలస వచ్చారు.

శ్రీశైలం శివరాత్రి మహోత్సవాలలో తోలుబొమ్మలాటలు ప్రదర్శించి నట్లు పండితారాధ్య చరిత్ర పర్వత ప్రకరంలో పాల్కురికి సోమనాథుడు ఈ విధంగా వివరించాడు.

భారతాది కథల జీరమఱిగి - నారంగ బొమ్మల నాడించు వారు
గడు నద్భుతంబుగ గంబ సూత్రంబు లడరంగ బొమ్మల నాడించు వారు.

అనడాన్ని బట్టి శ్రీశైలం వెళ్ళే ద్రావిడ యాత్రికులతో బాటు పైవలస వచ్చిన బొమ్మలాట వారు కూడ వుండి వుండవచ్చు. దీనిని బట్టి ఆంధ్రదేశంలో కొన్ని వందల సంవత్సరాల ముందు నుంచే ఈ బొమ్మలాటలు ఆదరింప బడి ప్రజాభిమానం పొందుతూ వున్నాయని స్పష్టమౌతుంది.

మన వాజ్మయంలో పాల్కురికి సోమనాథుని కాలంనుండి తంజావూరు రఘునాథ రాయల కాలంవరకూ అనేక మంది కవులు బొమ్మలాటలను పేర్కొన్నారు. "ప్రతిమ లాడగ బట్టిన యట్లు" అని పల్నాటి చరిత్రలో శ్రీనాథ మహాకవి పేర్కొన్నాడు.

బొమ్మలాటల గురించి నాచన సోమన ఉత్తర హరివంశంలో__

"యంత్రకు డాడించి యవని ద్రోచిన వ్రాలు
బొమ్మల గతి రథపూగములను"

అని వివరించాడు. బొమ్మలాటల వారు గోన బుద్ధారెడ్డి రామాయణంలోని ద్విపదలను పాడేవారని సురవరం ప్రతాప రెడ్డిగారు 'సాంఘిక చరిత్ర ' లో వివరించారు. భాస్కర శతకాన్ని వ్రాసిందెప్పుడో తెలియదు గాని, అతని కాలంలో తోలుబొమ్మలాటలు వ్వాప్తిలో వున్నట్లు భాస్కర శతకంలో ఈ క్రింది పద్యం ద్వారా తెలియవస్తూంది.

"ఇంచుక నేర్పు చాలక విహీనత జెందిన నాకవిత్వమున్
మించు వహించె నీకతన మిక్కిలి; యెట్లన తోలు బొమ్మలన్
మంచి వివేకి వాని తెరమాటున నుండి ప్రశస్తిరీతి నా
డించిన నాడవే? జనుల డెందము నింపవె ప్రీతి భాస్కరా!"

యం.వి.రమణమూర్తి, హనుమంతుని తోలుబొమ్మ
శాసనాలు, తోలుబొమ్మలు:

తోలు బొమ్మలాటలను గురించి అనేక శాసనాల్లో వుదహరింప బడి వుండి. బొమ్మలాట వారిని గురించి చాగంటి శేషయ్యగారు ఒక శాసనాన్ని బయట పెట్టారు. కడప జిల్లా కమలాపురం తాలుకా చిడిపిరాల అన్న గ్రామాన్ని చంద్రయ్యా, బొమ్మలాట అమృతకవీ అనే వారిద్దరూ తెర నాటకాలాడడానికి పెద చెట్టెయ్య అనే ఆయనకు దానం ఇచ్చినట్లు శాసనంలో వుంది.

ముక్కామల భూదాన శాసనం:

అలాగే క్రీ॥శ॥1208 లో దుర్జయాన్వయులైన విప్పరుల కొండప, గుండప నాయకుల ముక్కామల భూదాన శాసనంలో, సూత్రదారి బోమలయ అనే ఆయన ప్రతి గృహీతగా పేర్కొనబడ్డాడు. అతను బొమ్మలాట వాడే కావచ్చని యస్వీ జోగారావుగారు వ్రాస్తున్నారు.

గూడూరు శాసనం:

ఇంకా కాకతీయులకు సంబంధించిన తెలంగాణా శాసనాలలో వరంగల్ జిల్లా గూడూరు శాసనం ఒకటి ఈ బొమ్మలాట సమాచారాన్ని తెలియజేస్తూంది. శాసనం చివరి భాగంలో సూత్రదారి కొమ్మోజనహా బరహా అని వుంది. అంటే సూత్రధారి కొమ్మోజు వ్రాసినదన్న మాట. ఇది తెలుగు శాసనం.

అలాగే పానుగల్లు శాసనంలో సూత్ర ధారి బ్రహ్మోజు బెరసిన సూత్ర ధారుల కాస్యపల్లిని బానుగంట దళవృత్తి పుడపండ్లు 20. భీమ సముద్రము వెనుక పుడమఱుతరు అని వుంది.

కొమ్మోజు, బ్రమ్మోజు:

పై సూత్రధారులు కొమ్మోజు, బ్రహ్మోజు అనే పేర్లను బట్టి బొమ్మలాట వారని తెలుసుకోవచ్చు. అంతేగాక పై పేరులను బట్టి వీరు తప్పక మహారాష్ట్రులే ఐవుండవచ్చు.

అంతేగాక వారుపయోగించిన మాటల బరహా, బెరసిన అన్నవి కన్నడ భాషకు చెందినవి. దీనిని బట్టి మనకు విశదమయ్యే దేమంటే మరాటీ బొమ్మలాట వారు దేశదేశాలు తిరిగారు. అలాగే వీరు కన్నడ దేశం కూడా సంచారం చేశారు. అంతే గాక మహారాష్ట్రపు సరిహద్దు నున్న దేశం కన్నడ దేశం. అందువల్ల వీరికి ఆ బరహా, బెరసిన అనే కన్నడ మాటలు కూడ వచ్చి వుండవచ్చు. దేశ దిమ్మరులులైన వారికి ఆయా భాషలు వంటబట్టడం సహజమే.

అరెకాపులు, గంధోళీలు:

ఈ బొమ్మలాటలాడే వారిని అరెకాపు లంటారు. ఈ ఆరెకాపులు ఈ నాటిఒకీ మహారాష్ట్ర దేశంలో వున్నారు. అక్కడ వారి పేరు గంధోలీ లంటారు. ఈ నాడు తెలుగు దేశపు బొమ్మలాటల వారందరూ ఒకనాడు మహారాష్ట్రులే. ఈ నాటికీ బొమ్మ లాటలల వారు బయట ఎంత తెలుగు మాట్లాడినా ఇంట్లో మాత్రం మరాఠీ భాషనే మాట్లాడుతూ వుంటారు. అంతేగాక మరాఠీ బొమ్మలాటలో వుండే హాస్య పాత్రధారి గంధోలి గాడికి, మన జుట్టు పోలిగాడికి చాల దగ్గర సంబంధముంది. ఒకే రకమైన హాస్యమూ వేషధారణలో పోలికలూ వున్నాయి.

రకరకాల జాతులు, పేర్లు:

కాని దక్షిణ దేశంలోని బొమ్మలాట ప్రదర్శకులందరూ మహారాష్ట్ర జాతికి సంబంధించిన వారని చెప్పలేము. మైసూరు ప్రాంతంలో వూరు జంగాలు, బొందాయి, మైసూరు సరిహద్దు ప్రాంతాల్లో కుతుబువారు, మధుర, తంజావూరు ప్రాంతాలలో కుత్తాడీ లనే నట్టువ జాతివారు, బళ్ళారి జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో బలిజలు, విశాఖ జిల్లాలో ఈటె బొందలీ తెగల వారు, గోదావరి మండలంలో తెలుగు గొల్లలూ, గుంపు తెగలవారు, జంగాలు మొదలైనవారు కూడ వున్నారు.

బొమ్మలాటల వారి కేంద్రాలు:

ఈ బొమ్మలాటల కుటుంబాల వారి నివాసాలు ఆంధ్ర దేశంలో విశాఖ పట్టణం జిల్లాలో సర్వసిద్ధి,శృంగవరపు కోట, కళ్ళేపల్లి ఆగ్రహారం, గోదావరి జిల్లాలో మండపేట, అంగర, ఎలమంచిలి, తణుకు, నెల్లూరు జిల్లాలో సింగరాయ కొండ, కర్నూలు జిల్లాలో రాయదుర్గం, బెళగల్లు, అనంతపురం జిల్లాలో కడమల కుంట, అవులన్న, జరుట్ల రామపురం, బళ్ళారి జిల్లా సొండూరు. తోరణగల్లు, బొమ్మలాట పల్లి మొదలైనవి. ఆ ప్రాంతాలలో బొమ్మలాటల వారు ఎక్కువగా వున్నారు. కాకినాడ వద్ద మాధవ పట్నంలో మాత్రం ఈ కుటుంబాలవారు చాల మంది వున్నారు.

బొమ్మలాట పల్లి:

బొమ్మలాట లాడేవారు ఎక్కువ మంది వుండడం వల్లనే ఈ గ్రామానికి బొమ్మలాట పల్లి అనే పేరు వచ్చింది. బొమ్మలాట పల్లి బళ్ళారి జిల్లాకు చెందిన గ్రామం.

ఇక్కడున్న బొమ్మలాట వారిలో మహారాష్ట్ర వాసనలు చాల వున్నాయి. వీరిని బొందలీ క్షత్రియు లంటారు. గంధోలి అనే శబ్ద వికృతే బొందలీ అని కూడ వాడుక వుంది. ఈ నాటికీ వీరు బొమ్మలాటల్ని ప్రదర్శిస్తున్నారు.

ముఖ్యంగా వీరు ప్రదర్శించే కథా ఇతివృత్తాలు భారత రామాయణ గాధలకు సంబంధించినవి. లంకాదహనం, మైరావణ చరిత్ర, ఇంద్రజిత్తు వధ, యయాతి కథ, కీచక వధ, దుశ్శాసన కథ, ప్రహ్లాద చరిత్ర, రంగనాథ రామాయణం మొదలైనవే కాక, దేశీయ కథలైన దేసింగు రాజు కథ, పల్నాటి వీర చరిత్ర, కరెభంటన కథ , కుమార రాముని కథలను కూడ ప్రదర్శిస్తూవుంటారు.

రామనాటకం:

తోలుబొమ్మల ఆటలు ఆడేవారి సాహిత్యమంటూ మనకు ఈనాడు ఏదీ లభ్యం కాదు. కాని వారు యక్షగానాలనే బొమ్మలాట సాహిత్యంగా కూడ ఉపయోగించుకున్నారు. క్రీస్తు శకం 1850 ప్రాంతాల్లో గంజాం జిల్లా గుజ్జువాడ నివాసి మరింగంటి భట్టరు రామానుజాచార్యుల శ్రీరామ నాటకం బొమ్మలాటగా ప్రసిద్ధి జెందింది. ఇందులో కథ ముఖ్యంగా లక్ష్మణ మూర్చ. ఇందులోని పాటలూ, పద్యాలూ, దరువులూ మొదలైనవి మాధవపట్నం బొమ్మలాట వారి లక్ష్మణ మూర్చలో కనబడతాయి. భట్టరు రామానుజాచార్యులు వ్రాసిన తాళపత్ర ప్రతి చెన్నపురి ప్రాచ్యలిఖిత గ్రంథాలయంలో వుంది.

బాణాసుర నాటకం:

1893 లో కోట వెంకటప్పయ్య శాస్త్రిగారనే ఆయన బాణాసుర నాటకాన్ని రచించాడు. వీరి నివాస స్థలం పర్లాకిమిడికి దగ్గరలో వున్న పాత పట్నం గ్రామం. ఆయన ఆ నాటకానికి పీఠిక వ్రాస్తూ "ఈ గేయ ప్రబంధము చర్మ విగ్రహముల చేత ఆడించుటకును, వేషములు ధరించి నాటక మాడుటకును అనువుకూలముగ నుండునట్లు రచింపుడని నా మిత్రులు కొందరు ప్రోత్సాహ పఱచి నందున నేనిందుల కియ్యకొంటి" నని వ్రాశారు. దీనిని 1894 లో ఇండియన్ లా ప్రెస్ లో ముద్రించారు. వీరు బాణాసుర నాటకంలో తోలు బొమ్మల జుట్టుపోలిగాడి మాదిరి 'లొట్టకిత్తడు', 'రత్నాల పోలిగాడు' అనే రెండు హాస్య పాత్రల్ని సృష్టించారు.

సంతవేలూరు కుశలవుల నాటకం:

అలాగే వీణె సుబ్బరాజు, గాజుల పెండ్లూరి శేషగిరి రాజు అనే ఇరువురు కవులు కలిసి సంత వేలూరు కుశలవుల నాటకాన్ని, ఆరు రాత్రిళ్ళు ప్రదర్శించడానికి అనువుగా వ్రాశారు. దీనిని బొమ్మలాటగాను, వీథి నాటకంగాను, యక్షగానంగా కూడ ప్రదర్శించేవారట. 'బొమ్మలాట హాస్య నాటక' మనే కేతిగాని పెళ్ళి ఇతి వృత్తంగా గల తాళపత్ర నాటకం మద్రాసు ప్రాచ్య లిఖిత గ్రంధాలయంలో వుంది. తోలుబొమ్మల్ని ఎక్కడో మార్కెట్టుల్లో కొన్నుక్కు రారు. ఈ బొమ్మలను తయారు చేసే చిత్రకారులు వారి వారి దళంలోనే వుంటారు. ఎప్పుడు బొమ్మ అవసరమనుకుంటే అప్పుడు అప్పటి కప్పుడు తయారు చేసుకుంటారు. ఈ బొమ్మలు మేక చర్మంతోనూ, జింక చర్మంతోను, దుప్పి చర్మంతోనూ తయారు చేస్తారు.

పాత్రలకు తగిన ప్రతిమలు:

బొమ్మలాట కథా విధానంలో వచ్చే ఉద్దాత్తమైన పాత్రలన్నింటికీ రాముడు, కృష్ణుడు, విష్ణువు, ఇంద్రుడు, దేవతలు, సీత, సావిత్రి, ద్రౌపది మొదలైన పాత్ర లన్నింటికీ జింక చర్మాన్ని ఉపయోగిస్తారు. జింక చర్మాన్ని పూజా సమయాలలో ఎంత పవిత్రంగా ఉపయోగిస్తామే, అలాగే వారుకూడా ఆ చర్మాన్ని ఎంతో పవిత్రంగా ఎంచుకుంటారు. రాక్షస పాత్రలకు, దుష్ట పాత్రలకు ఇంకా మిగిలిన చిల్లర పాత్రలకు మేక చర్మాన్ని ఉపయోగిస్తారు. ఈ విధంగా పాత్రల పవిత్రతను బట్టి చర్మాలను వుపయోగిస్తారు.

బొమ్మల సౌందర్యం:

పైన వుదహరించిన చర్మాలను సేకరించి చక్కగా శుద్ధి చేసి, చర్మంలో వున్న దుర్వాసన నంతటినీ పోగొట్టి, వారికి కావలసిన బొమ్మల సైజుకు చక్కగా గీత గీసి దానిని సొంపుగా కత్తిరించి చిత్ర విచిత్ర మైన రంగులను అద్దుతారు. రంగుల్ని అద్దడంలో కూడ పాత్ర ఔచిత్యాన్ని బట్టే రంగుల్ని చిత్రిస్తారు. ప్రథమ, మద్యమ, ఉత్తమ పురుష లక్షణాలతోనూ, పద్మిని, చిత్తిని, శంకిని మొదలైన నాయకీ, నాయకులకుండే భేదాలను రంగుల్లో చిత్రిస్తారు.

ముఖ్య పాత్రలు అంటే ప్రదర్శనంలో చివరంటా వచ్చే పాత్రలు, ఆయా రంగాలలో ఘట్టాల ననుసరించి ఒకే పాత్ర నాలుగు రకాలుగా తయారు చేసుకుంటారు. ఉదాహరణకు __ బాల్యంలో రాముడు, అడవిలో రాముడు, యుద్దంలో రాముడు, పట్టాభిరాముడు, ఈ విధంగా ఆయా దశల ననుసరించి చిత్ర్రాలను తయారు చేసుకుంటారు.

హంగులు, ఆయుధాలు, అలంకారాలు:

ఇక ప్రదర్శనానికి కావలసిన పరికరాలను, మిగిలిన హంగులన్నింటినీ కూడ తయారు చేసుకుంటారు. రథాలు, గుఱ్ఱాలు, అంబులు, బాణాలు, గదలు, ఈటెలు, సైన్యం మొదలైన వాటినన్నిటినీ కూడ తయారు చేసుకుని ప్రదర్శనం రోజున వివరంగా విడదీసి ప్రదర్శన గమనాన్ని బట్టి ఈ బొమ్మలన్నిటినీ సక్రమంగా, సిద్ధంగా అమర్చి పెట్టుకుని, ఒక బొమ్మ తరువాత మరొక బొమ్మను తెరమీదీకి ఎక్కించి కథను ముందుకు నడుపించుతారు. ఈ బొమ్మల్నిగానీ, పరికరాలను గానీ విడివిడిగా సూస్తే ఏదో తోళ్ళ ముక్కల్లాగ కనిపిస్తాయి. వీటి సహజమైన అందం ఆముదపు దీపాల వెలుగులో తెరమీదే చూడాలి. ఎంతో రమణీయంగా వుంటాయి. కష్టమో, నష్టమో పడి ఒక్కసారి ఈ బొమ్మల్ని తయారు చేసుకుంటే ఇంక అవి 20 సంవత్సరాలవరకూ చెక్కు చెదరకుండా వుంటాయి. ఒక వేళ మధ్య మధ్య కొన్ని బొమ్మలు శిధిలమైతే వాటిని అప్పటి కప్పుడు పూర్తి చేసుకుంటారు . ఈ బొమ్మల్ని అన్నిటికన్నా పెద్ద సైజు బొమ్మకు తగినంత వెడల్పూ, పొడవూగల మేదర పెట్టెల్లో అమరుస్తారు. ఒక్కో ప్రదర్శనానికి ఒక్కొక్క పెట్టెను వుంచు కుంటారు.

బహిరంగ ప్రదర్శనశాల:

ఈ బొమ్మలాట ప్రదర్శకులు ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి బండ్లమీద ప్రయాణం చేస్తారు. ఒక్కొక్క దళానికి ఒకటి గాని, రెండు గాని బండ్లు వుంటాయి. ఒక బండి మీద సామానులు, రెండవ బండిమీద మనుషులు ప్రయాణం చేస్తారు.

గ్రామంలో ప్రవేశించి పెద్దల్ని, పిన్నల్ని కలుసుకుని పరిచయం చేసుకుంటారు. అందరూ కూర్చోవటానికి అనువుగా వున్న బహిరంగ స్థలంలో పందిరి ప్రారంబించి, మూడు ప్రక్కలా మూయబడి ఒక ప్రక్కన తెర కట్టడానికి వీలుగా పందిరి వేస్తారు. ఈ పందిరి కొంచెం ముందుకు వాలి వుండేటట్లు కడతారు. ఇలా కట్టడం వల్ల వారు ఆడించే బొమ్మలు జారిపోకుండా వుంటాయి. పందిరి లోపలి భాగంలో వారి మొత్తం సామగ్రీ, పిల్లలూ, భార్యలూ, సంసారమంతా అందులోనే వున్నదా అనిపిస్తుంది. వెనుక పక్క కూడా మూతతో అందరూ లోపలే వుంటారు. లోపలి ప్రక్క తెరను ఆనుకుని ఒక పెద్ద బల్లను వేస్తారు.

వరుసగా ఆముదపు దీపాలను అమరుస్తారు. ఈనాడు కొందరు పెట్రోమాక్సు లైట్లను వాడుతున్నారు. కాంతి తగ్గకుండా ఎప్పుడూ ఒకరు ఆముదపు దీపాల ఒత్తులు ఎగదోస్తూ, కొరతబడ్డ ఆముదాన్ని పూర్తిచేస్తూ వుంటాడు. దీపాల కాంతి తగ్గితే బొమ్మల అందచందాలు తగ్గుతాయి.

తెరమీద బొమ్మలతో ప్రదర్శన ప్రారంభం:

ప్రదర్శనం ప్రారంభించే రోజున 'ఈరాత్రికి బొమ్మలాట వుందహో ' అని చాటింపు ద్వారాగాని, ఇంటింటికీ వెళ్ళి చెప్పడం ద్వారా గాని అందరికీ ఈ వర్తమానం చెలియ జేయ బడుతుంది.

బొమ్మలాటకు తెర సిద్ధం చేసిన తరువాత ప్రప్రథమంగా విఘ్నేశ్వరుని బొమ్మను తెరకు మధ్యగా ఎక్కించి వుంచుతారు. ఒక పక్క మాత్రం దిష్టిబొమ్మ నొకదానిని, రెండవ ప్రక్క జుట్టుపోలిగాణ్ణి ఎక్కించి వుంచుతారు.

తోలుబొమ్మల్ని తెరమీద ఆడించడానికి వీలుగా ఒక వెదురుబద్దను బొమ్మకు మధ్యభాగంలో కడతారు. బొమ్మను ఆడించాలంటే ఈ బద్దే ఆధారం. బొమ్మను ఆడించే సమయంలో చేతిని తెరమీదకు ఏ మాత్రం రానీయరు. ఒక వేళ వస్తే మనిషి బొమ్మ కనబడుతుంది. అందువల్ల దూరంగా వుండి ఒక చేతిలో బొమ్మను బట్టి రెండవ చేతిలో మరో చిన్న కొంకి గల బద్దను పట్టుకొని బొమ్మ యొక్క చేతులకు తగిలించి, సంభాషణల ప్రకారం బొమ్మల్ని కదిలిస్తూ వుంటారు. కాళ్ళు మాత్రం ఎటుబడితే అటు కదిలే లాగా మన దసరా వుత్సవాల్లో పిల్లలు పుచ్చుకునే కోతి బొమ్మ మాదిరి కీలు కూలు వద్దా రంధ్రాలు పొడిచి ఎటు పడితే అటు తిరగడానికి వీలుగా అమరుస్తారు. ఒక వేళ తెరమీద బొమ్మ కొంచెంసేపు చలనం లేకుండా వుండాలంటే ఒక తుమ్మముల్లుతో నాటు వేసి బొమ్మను తెరమీద నిలబెడతారు. ఒక్కొక్కసారి ఒకే వ్వక్తి రెండేసి బొమ్మల్ని కూడ ఆడిస్తూ ఉంటాడు.

విఘ్నేశ్వర పూజ:

ప్రదర్శన ప్రారంభంలో తోడిరాగంతో కూడిన మంగళహారతి పాడుతారు. ఏ విఘ్నాలు కలుగకుండా విఘ్నేశ్వరుని ప్రార్థిస్తారు. తరువాత సభావర్ణన చేస్తూ పాట పాడుతారు. "అందరూ వచ్చారా? కరణంగారొచ్చారా? మున్సిఫ్ గారొచ్చారా? పండితులంతా వచ్చారా? పెద్దరెడ్డి వచ్చాడా?" అంటూ హెచ్చరించి ప్రేక్షకుల్ని అదుపులో పెట్టుకుంటారు.

ఆటకు తగ్గ పాడలు, పాటకు తగ్గ మోతలు:

పాట పాడేవారు, హార్మోనియం వాయించే వారూ, తాళం వేసే వారూ, మద్దెల కొట్టేవారూ, అదనపు మోతల్నిచ్చేవారూ, వంతపాటలు పాడేవారూ అందరూ లోపలే కూర్చుంటారు. పిల్లల పడకలూ, వుయ్యాలలూ అన్నీ నేపథ్యంలోనే అమర్చుకుంటారు.

వీరికి హార్మోనియం శ్రుతిగా వుంటుంది. తాళాలుంటాయి. హార్మోనియం, తాళాలు, మద్దెల వాయించే వ్వక్తులు కూడ వెనుక వంత పాట పాడుతూ వుంటారు. అంతేకాదు వాళ్ళ కాళ్ళ క్రింద బల్లచెక్కలుంటాయి. ఆ యా ఘట్టాల ననుసరించి ఈ చెక్కలను త్రొక్కుతూ వుంటారు. ముఖ్యంగా రథాలు, గుఱ్ఱాలు, పరుగు లెత్తేటప్పుడూ, యుద్ధఘట్టాలలోనూ ఈ చెక్కలు టకటకా త్రొక్కుతూవుంటే బలే రసవత్తరంగా వుంటుంది.

అంతేగాక నగరా మోతలకు ఖాళీ డబ్బాలు వుపయోగిస్తారు. పిడుగులు పడ్డట్టూ, వురుములు వురిమినట్టు డబ్బాలను మోగిస్తారు. ఈ విధంగా వారు ప్రదర్శననాన్ని జయప్రదంగా రక్తి కట్టిస్తారు. ఆట ఆడినంత సేపూ పరస్పర సహకారం వారిలో కనబడుతుంది. అందువల్లనే వారి ప్రదర్శనాలు అంత బాగా రక్తి కడతాయి.

ఆటగాండ్లు అష్టావధానం:

ముఖ్యంగా ఏ వ్వక్తి బొమ్మల్ని ఆడిస్తాడో ఆ వ్వక్తి నోటితొ పాట పాడుతూ పాటకు తగిన విధంగా బొమ్మను ఆడిస్తాడు. సంభాషణలకు కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తాడు. ఇక రెండు బొమ్మల్నీ ఆడించే సమయంలో బొమ్మల మధ్య వచ్చే పోరాటంలో, రెండు బొమ్మల్ని రెండు చేతులతో కొట్టిస్తాడు. అలా కొట్టడంలో సమయానికి క్రింద బల్ల చెక్క టకామని త్రొక్కుతాడు. నిజంగా పాత్రలు కొట్టు కున్నట్టే వుంటుంది. ఈ సమయంలో ఇతర వంతదారులు కావలసిన అల్లరి, హంగామా చేస్తారు. ఒక యుద్ధ ఘట్టం వచ్చిందంటే, డోళ్ళు, డబ్బాలూ, ఈలలూ కేకలతో వాన కురిసి వెలిసినట్లు చేస్తారు. ఈ విధంగా వారు ప్రదర్శనను సమిష్టి కృషితో జయప్రదంగా నిర్వహించి ప్రేక్షకుల్ని మెప్పిస్తారు.

బొమ్మలాటకు బ్రహ్మ:

నాటకానికి దర్శకుడు ఎంత అవసరమో అలాగే ఈ బొమ్మలాటలకు బ్రహ్మ లాంటి వాడు సూత్రధారుడు. తెరలోపల నుండి ప్రదర్శనాన్ని వరుసక్రమంలో నడిపే బాధ్యతలన్నీ ఈతని మీదే వుంటాయి. మిగతా వారందరూ ఈతనిని అనుసరిస్తూ వుంటారు. ఈ సూత్రధారుడు సంస్కృత రూపకాలలోనూ, తెలుగు భాగవతాలలోనూ, యక్ష గానాలలోనూ, నాటకాలలోనూ కూడ ప్రాముఖ్యం వహిస్తూ వచ్చాడు.

బొమ్మలాట సూత్రధారుడు కొన్ని శ్లోకాలు చదివి, ఆ శ్లోకాల అర్థాన్ని మరలా తెలుగులో అందరికీ అర్థమయ్యే స్థాయిలో విపులీకరిస్తాడు. కొన్ని పద్యాలనూ, గేయాలనూ అతి మృదు మధురంగా ఇతను పాడితే మిగిలిన వారు, పై శృతిలో ఆలాపిస్తారు. వచనాన్ని కూడ రాగయుక్తంగా చదువుతారు. ఆయా పాత్రల ఔచిత్యానికి భంగం లేకుండా గొంతులు మారుస్తూ వుంటారు. సూత్రధారుడు అడుగుడుగునా ప్రేక్షకుల యొక్క ఆదరణను గమనించి, కథను సాగించి విజయం పొందుతాడు.

ప్రదర్శనం, ప్రేక్షకుల హడావిడి:

తోలుబొమ్మలాట ప్రదర్శిస్తున్నారని తెలిస్తే చాలు, గ్రామ చుట్టు ప్రక్కలున్న పెద్దలు, పిల్లలూ, స్త్రీలూ అందరూ హెచ్చు తగ్గుల భేదాలు లేకుండా ఒకరికంటే ఒక ముందుకు వచ్చి కూర్చుంటారు. కథా ప్రారంభం నుండి ఆసాంతం వరకూ రెప్ప వాల్చకుండా చూస్తూ కూర్చుంటారు. ప్రతి ఘట్టంలోనూ వారు కదిలి పోతారు. హాస్య ఘట్టాలలో ఎంతగా పగలబడి నవ్వుతారో అలాగే కష్టాలతో కూడుకున్న ఘట్టాల్లో కళ్ళవెంట నీరు కారుస్తారు. ఇక దౌర్జన్యం ఘట్టాలలోనూ, దుర్మార్గపు సన్నివేశాలలోనూ, ఆయా పాత్రలమీద పళ్ళు పటపాటా కొరుకుతారు. ఈ విధంగా పండితుల మొదలు పామరుల వరకు ఆబాల గోపాలం ఆనందంతో మునిగి పోతారు.

జుట్టుపోలిగాడు, బంగారక్క:

ఈ బొమ్మలాట ప్రదర్శనాలను ఇంత ఆపేక్షగా ప్రజలు చూడడానికి కారణం లేక పోలేదు. తెలుగు నాట బొమ్మల ప్రదర్శనాలలో విచిత్రమైన హాస్య పాత్రలను చూపుతారు. ఈ పాత్రలు కథా ప్రారంభం నుండి కథాంతం వరకూ అడుగడుగునా కథాగమనంతో ఒక ఘట్టం అయిన తరువాతి రెండవ ఘట్టం ప్రారభమయ్యే వ్వవధిలో ప్రత్యక్షమౌతూ వుంటాయి. ఆ పాత్రలే జుట్టుపోలిగాడు, బంగారక్క. ఈ రెండు పాత్రలూ హాస్యం ద్వారా, దీర్ఘ కాలం ప్రదర్శించే ప్రదర్శనంలో మధ్య మధ్య వారిని కడుపుబ్బ నవ్వించి నిద్రమత్తు వదలగొడుతూ వుంటాయి. ఈ పాత్రల హాస్యం బహు మోటుగా వుంటుంది. నవ్వుతో కడుపు చెక్కలయ్యే పనులు ఈ బొమ్మలతో చేస్తారు. సమాజంలో వున్న కుళ్ళును, ఈ బొమ్మలను అడ్డంగా పెట్టుకుని కుళ్ళగిస్తూ వుంటారు. మధ్య మధ్య విసుర్లూ విసురుతూ వుంటారు.

మరో బపూన్ అల్లాటప్పగాడు:

తోలుబొమ్మలాటల్లో హాస్యం ఎంతవర కెళ్ళిందో అల్లటప్పగాడిని గురించి తెలుసుకుంటే బోధపడుతుంది. జుట్టుపోలిగాడు, బంగారక్క కాక వీడు మూడవ వాడు. వీడి పాత్ర ఎటువంటిదంటే 'తాడెక్కే వాడుంటే వాడి తల దన్నే వాడుంటా' డనే సామెత ప్రకారం పైరెండు పాత్రలనూ తలతన్నేవాడు. ఈ అల్లాటప్పగాడు. ప్రదర్శనంలో బంగారక్కను గడసరి పెండ్లాంగా సృష్టిస్తారు. ఈమెకు, పోలిగాడికి నిరంతరం కయ్యం నడుస్తూ వుంటుండి. కాసేపు రెండు పాత్రలూ అతి విచిత్రంగా అసభ్య శృంగారాన్ని అభినయిస్తాయి. కొంచెంసేపు పోట్లాట, మరల రాజీ, ఇంతలో పోలిగాడు అంతర్థానం. ఈ సమయంలో అల్లటప్పగాడు బంగారక్క దగ్గర ప్రత్యక్షమౌతాడు. బంగారక్కకు, అల్లాటప్పకు సంబంధాన్ని కుదురుస్తాడు. రెండు పాత్రలూ మంచి శృంగారపు పట్టులో వుండగా మరో పాత్ర ప్రవేసిస్తుంది. అది కేతిగాని పాత్ర.

కేతిగాడు:

కేతిగాడి పాత్ర అతి విచిత్రమైంది. అన్నీ బొమ్మలకన్నా కేతిగాడి బొమ్మ చిన్నది. ఎక్కడ బడితే అక్కడ, ఎప్పుడు బడితే అప్పుడు పానకంలో పుల్లలాగ ఒక అడుగు చోటు తెరమీద వుంటే చాలు హఠాత్తుగా ప్రవేశిస్తాడు. శృంగార ఘట్టంలో వున్న అల్లాటప్ప గాణ్ణి టకీమని ఒక్క దెబ్బ కొడతాడు కేతిగాడు. వెంటనే అంతర్ధానమౌతాడు అల్లాటప్పా. ఇంకేముంది కేతిగాడు బంగారక్కను ఏడిపిస్తాడు. ఇలాంటి ఘట్టాలు ప్రదర్శనంలో వచ్చే వ్వవధిని కమ్మివేస్తూ వుంటాయి. చాలమంది ప్రేక్షకులు కథకంటే హాస్య పాత్రల ప్రవేశం కొరకే ఎదురు చూస్తూ వుంటారు. అందువల్లనే ప్రదర్శనం తెల్లావార్లూ ప్రదర్శించినా విసుగుజెందరు.

వానలు రాకపోతే, వాటమైన కిటుకు:

గ్రామాల్లో ముఖ్యంగా వ్వవసాయ తరుణం అయిపోయిన తరువాత ఈ బొమ్మలాటల ప్రదర్శనాలు జరుగుతూ వుంటాయి. బొమ్మలాటల్ని ప్రదర్శించడంలో జాన పదులకు కొన్ని నమ్మకాలు కూడ వున్నాయి. ఉత్తర గోగ్రహణం కథ ఆడిస్తే వర్షాలు కురుస్తాయని, వర్షాలు లేని ప్రాంతంలో ఆ ఆటలను ఆడిస్తూ వుంటారు. ఈ నాటికీ కాకినాడ ప్రాంతంలో వర్షాలు కురవనప్పుడల్లా దగ్గరలో వున్న మాధవపట్నం బొమ్మలాట వారిని ఆహ్వానించి శ్రీ ధేనువు కొండ వెంకయ్యగారు రచించిన ఉత్తర గోగ్రహాణాన్నీ, విరాటపర్వాన్నీ ప్రదర్శిస్తారు.

దేశదిమ్మర్లు:

బొమ్మలాట లాడేవారు వూరు తరువాత వూరు చాంద్రాయణం చేసుకుంటూ ప్రదర్శనలిచ్చుకుంటూ దేశదిమ్మర్లుగా తిరుగుతూ వుంటారు. చావులు, పుట్టుకలూ, వివాహాలూ, వేడుకలూ అన్నీ దానిలోనే జరిగిపోతూ వుంటాయి.

వీరిలో ఒక్కొక్కరికి ఇద్దరు ముగ్గురు భార్యలు కూడ వుంటారు. ఇలా వుండటం వారికి తప్పు కాదు. కారణం ఈ స్త్రీలందరూ ప్రదర్శనంలో పాటలు పాడటానికి, బొమ్మల నాడించటానికి ఉపయోగపడతారు. అందువల్ల బయటనుంచి కిరాయికి నటుల్ని తెచ్చుకోవాలిసిన అవసరం వుండదు. అంతే గాక ప్రదర్శనం రోజున ఒకరికి జబ్బు చేసినా, గొంతు పోయినా ప్రదర్శనం ఆగదు. ఈ బాధ్యతలు అదనంగా వున్న స్త్రీలు పంచు కుంటారు. బొమ్మలాట వారిలో పురుషుల కంటే స్త్రీలే ఎక్కువ మంది వుంటారు. ఎంత మంది వున్నా వారి కంఠాలన్నీ కోకిల కంఠాలే. పుట్టుక తోనే వారికి ఆ లక్షణాలు అబ్బుతాయా అన్నట్లుంది.

తోలుబొమ్మలు ఒకనాడు తెలుగు విజ్ఞాన వికాసాలకు పట్టుగొమ్మలు. తోలు బొమ్మల్ని ఆనాడు ప్రజలు ఎంతగానో పోషించారు. రాను రాను నాటకాలు అభివృద్ధి లోకి రావడంవల్లా, సినిమా కళ అభివృద్ధి చెందటం వల్లా ఈ కళ కొంతవరకు దెబ్బతిని పోయిందని చెప్పవచ్చు.

ఆనాటి తోలుబొమ్మలాటవారిలో ఎంతో సంగీతం, సాహిత్యం, శిల్పం మొదలైన వాటిలో విద్వాంసులుండేవారు. ఈ నాడు అటువంటి వారు తగ్గిపోయారు. ఉన్న కొద్దిమందీ నాశిరకం ప్రదర్శనాల నిస్తున్నారు.

ఆచార్య యం. వి. రమణమూర్తి:

శిథిలమైన తోలుబొమ్మలాటలను ఆధునిక రీతిలో పునరుద్ధరించటానికి కాకినాడ వాస్తవ్యులు యం.వి.రమణమూర్తిగారు ఎంతో కాలంగా కృషి చేస్తున్నారు. వీరికి భారత ప్రభుత్వం రెండు సంవత్సరాలు స్కాలర్ షిప్ ఇచ్చి, తోలు బొమ్మల పరిశోధనకు అవకాశం కల్పించారు. రమణ మూర్తి గారు దాదాపు 15 సంవత్సరాలు ఈ కృషిలో వుండి అనేక మహాసభల్లోనూ, ప్రముఖ నాయకుల సమక్షంలోనూ, విదేశీ రాయ బారుల సమక్షంలోనూ ప్రదర్శించి, ఆనాటి తోలుబొమ్మల ఆట విశిష్టతను చాటారు. బొమ్మల ప్రదర్శనంలో పూర్వం ఉపయోగించే ఆముదపు దీపాలను తొలగించి, ట్యూబులైటుల ద్వార ప్రదర్సిస్తున్నారు. తెరకు కూడ ఇనుప గొట్టాల ఫ్రేమును తయారు చేసి, ప్రదర్శనాన్ని అవలీలగా ప్రదర్శించే ఏర్పాటు చేశారు. తోలుబొమ్మలతో పాటు గ్లోవీ బొమ్మలను కూడ (గ్లోవీపపెట్సు) ప్రదర్శిస్తున్నారు.

ఎం.వి.రమణమూర్తి

ఎక్కువ మంది హంగు దారులు అవసరం లేకుండా కథావృత్తాన్నంతా టేపురికార్డు చేసి బొమ్మలను ఆడించడానికి మాత్రం ఇద్దరు ముగ్గురు మనుషులతో ప్రదర్శనాలు సాగిస్తున్నారు. కథల్లో లంకాదహనం మొదలైన పౌరాణిక గాథలతోపాటు పంచతంత్ర కథలు, కుటుంబ నియంత్రణ మొదలైన ఇతివృత్తాలకు సరిపడే బొమ్మలను తయారు చేసి ప్రదర్శనాల నిచ్చారు.

కొంతకాలం వారు మద్రాసు అడయారులో సెంట్రల్ లెదర్ రీసెర్చి ఇన్ స్టిట్యూట్ లో, బొమ్మల పరిశోధనలో ఆచార్యులుగా పని చేశారు. బొమ్మలను తయారు చేయటంలో తరిఫీదు ఇచ్చారు. బొమ్మలను తయారు చేయడంలో ఆధునికమైన పరికరాలను వుపయోగించారు. ఎన్నో బొమ్మలను ఇతర రాష్ట్రాలకు, ఇతరదేశాలకు ఎగుమతి చేశారు. వీరికి సహాయంగా సీత, ఇతర కుటుంబ సభ్యులు ఎంతగానో సహాయ పడ్డారు. రమణ మూర్తిగారు కీర్తిశేషులయ్యారు.