తెలుగువారి జానపద కళారూపాలు/పీఠిక
నే నెందుకు రాయాలి?
అసలు ఈ పని నే నెందుకు చేయాలని నటరత్నాల గ్రంథంలో నన్ను నేనే ప్రశ్నించుకున్నాను. ఆ ప్రశ్నే మళ్ళీ ఇక్కడ కూడా వేసుకుంటున్నాను. అవును ఈ పని నేనెందుకు చేయాలి?
నాటకం, సినిమా, రేడియో, టీవి, వీడియో, ఆడియో లేని నా చిన్ననాడు పల్లె ప్రజలను అలరించి, ఆనందపర్చి, ఆనందడోలికలో ఊగులాడించి, ఈనాడు కాలగర్భంలో కలిసిపోతున్న నాటి జానపద కళారూపాలు, నన్ను ఉత్తేజ పర్చాయి. ప్రభావితుణ్ణి చేశాయి.
ఆ నాటి ప్రదర్శనాలను రాత్రి తెల్లవార్లూ కూర్చుని చూశాను. ఎన్ని కళా రూపాలు? ఎంత గొప్ప ప్రదర్శనాలు? వారు ఎంత గొప్ప కళాకారులు.
పది రూపాయల కోసం, పట్టెడన్నం కోసం వారు ఎంత నిస్వార్థంగా కళకు సేవ చేసారు? నా నటజీవితానికి తొలి రేఖలు దిద్దింది వారే. వారే నా మార్గదర్శకులు, వారే నా గురుదేవులు. నాకే కాదు నా ముందు తరాలవారికి, ఆ మాటకొస్తే ఈ తరం కళాకారులకు కూడ వారే కళామూర్తులు.
రెండువేల సంవత్సరాల ఆంధ్రుల సాంస్కృతీ వికాసంలో, నాటకరంగం ప్రారంభమయ్యే నాటికీ, తరువాత కాలానికి, ప్రతీకలుగా నిలిచివున్న జానపద కళారూపాలను, ఎందరు మహామహులు సృష్టించారో? ఎంతమంది కథలు వ్రాసి, కవిత లల్లి, కాలప్రవాహంలో కలిసిపొయ్యారో? ఎంతమంది కళాకారులు ప్రదర్శనాల సేవలో తరించి,తరించి అందుకే అంకితమై అంతరించి పొయ్యారో, ఆ అభాగ్యులను గురించి పట్టించుకున్న వారే లేకపొయ్యారు.
ఒకనాడు జాతినంతా ఉర్రూత లూగించిన జానపద కళారూపాలు, ఈ నాడు అంతరించి పోతున్నాయి. ఆ కళాకారులు అన్నమో రామచంద్రా యంటూ వీధుల్లో ముష్టెత్తుకుంటున్నారు. అందరిచేతా చీదరింపబడుతూ బ్రతుకుతున్నారు. ఒకనాడు దేశానికి జాతికి విజ్ఞాన వినోదా వికాసాలను కలిగించిన, ఆ మహోన్నత కళాకారుల నేటి దుస్థితి ఇది. అందుకే ఆ అపూర్వ కళారూపాలను ఆ కళాహృదయాలను, ఒక చోటకు చేర్చి, దేశానికి, ప్రజలకు తెలియ చెయ్యాలనిపించింది. ఇంతవరకు గట్టిగా ఆ ప్రయత్నం చేసినవారు లేరు. సంగీత నాటక అకాడమీ లాంటి సంస్థ ఏవో రెండు సదస్సులు జరిపి రెండు సావనీర్లు ప్రచురించటం తప్పా వాటి గురించి అంతగా పట్టించుకున్నట్లు కనిపించదు.
ఎంతో మంది పరిశోధక విద్యార్థులు, జానపద విజ్ఞానంగురించి యం.ఫిల్. , పి.హెచ్.డిల కొరకు పరిశోధన చేశారే తప్పా, జానపద కళారూపాలకు సంబందించిన సమాచారం గురించి పరిశోధన చేయటం జరగలేదు.
జానపద కళారూపాలను సేకరించి ఒక చోటకు చేర్చి ప్రచురించిన ఈ తెలుగువారి జానపద కళారూపాలు గ్రంథమే ఈ కోవలో ప్రప్రథమ గ్రంథం.
ఎక్కడెక్కడో మారుమూల నున్న కళారూపాలను సాధ్యమైనంతవరకు ఏర్చి కూర్చిన జానపద కళారూపాల మాల ఇది. ఇది నా ప్రథమ ప్రయత్నం కాబట్టి ఇందులో కొన్ని కళారూపాలు చేరి వుండక పోవచ్చు. ఈ ప్రయత్నాన్ని భావి రచయితలు ఇంకా ముందుకు తీసుకుపోగలరని ఆశిస్తున్నాను.
ఈ నా కృషిలో ఎన్నో గ్రంథాలు, పత్రికలు నాకు తోడ్పడ్డాయి. ఇది నా ఒక్కడి ప్రతిభా కాదు. ఎందరో మహానుభావులతో కూడిన అందరిదీ ఈ కృషి.
ఈ నాడు పేరిణి నృత్యాన్ని శాస్త్రీయ కళారూపంగా నటరాజ రామకృష్ణగారు తీర్చి దిద్దారు. అలాగే కొంతమంది హరికథా గానం కూచిపూడి నృత్యం దేవదాసీ నృత్యం మొదలైనవి కూడా శాస్త్రీయ కళారూపాల్లాగానే భావిస్తున్నారు.
కానీ ఆనాడు, గొండ్లి, పేరిణి, ప్రేంఖణము మొదలైన వాటిని జాయపసేనాని దేశి కళారూపాలుగానే వర్ణించాడు. కూచిపూడి నృత్యం, హరికథా గానం, దేవదాసీ నృత్యం జానపద కళారూపాలుగానే వర్థిల్లాయి. జానపద కళారూపాల తరువాత వచ్చినవే శాస్త్రీయ కళారూపాలు. జానపదకళారూపం లేకుండా శాస్త్రీయకళారూపం లేదు. అందువల్ల ఈ కళారూపాలను జానపద కళారూపాలుగానే వివరించాను.
అలాగే ఆ యా కళారూపాలకు సంబందించిన బొమ్మలు కొంతవరకు సేకరించగలిగాను. లభ్యమైన కొద్ది మంది కళామూర్తుల ఫోటోలు మాత్రం ప్రచురించగలిగాను. ఈ నా ప్రయత్నంలో ఏ కళాకారుణ్ణి కావాలని విస్మరించలేదు.
జానపద కళారూపాలను వెలుగులోకి తేవాలని, తహతహ లాడిన కళాభిమానులు ఎందరో వున్నారు. అలాటి వారిలో డా॥ కె.వి. గోపాలస్వామి, పి.యస్.అర్. అప్పారావు, డా॥ బి. కృష్టంరాజు, ఎ.ఆర్.కృష్ణ, గోపాలరాజ్ భట్, డా॥ మొదలి నాగభూషణసర్మ , డా॥ అత్తిలి కృష్ణారావు., శ్రీ లక్ష్మీకాంత మోహన్, ప్రయాగ నరసింహశాస్త్రి, డా॥జయధీర్ తిరుమలరావు, వింజమూరు సీతాదేవి, అనసూయా దేవి, రాంబట్ల, జమున, వరదా ఆదినారాయణ, దూడల శంకరయ్య, భాగవతుల రామకోటయ్య, ఇంద్ర సేనారెడ్డి, పులికంటి కృష్ణారెడ్డి, లక్ష్మీనరసయ్య, కోసూరి పున్నయ్య, అరవేటి శ్రినివాసులు, మొదలైన ఎందరో కాదు మరెందరో కృషి చేశారు. వారందరికి వందనాలు.
నా ఈ గ్రంథాన్ని తమ ప్రచురణగా స్వీకరించిన తెలుగు విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షులు ఆచార్య డా॥ సి.నారాయణ రెడ్డి గారికి, రిజిస్ట్రారు డా: ఎన్. శివరామ మూర్తిగారికి, ప్రస్తుత రిజిస్ట్రారు డా॥ బి. రామకృష్ణా రెడ్డిగారికి, ప్రత్యేక నిర్వహణాదికారి శ్రీ గోవిందరాజు రామకృష్ణా రావు గారికి, ప్రచురణల విభాగం నిర్వహకులు డా॥ టి గౌరి శంకర్ గారికి, ప్రచురణల విభాగపు పరిశీలకులకూ కృతజ్ఞతలు.
ఈ గ్రంథానికి రేఖా చిత్రాలను గీసి అందించిన ప్రసిద్ధ చిత్రకారులైన గంగాధర్, టి. వెంకటరావు, ఆంధ్రప్రభ చిత్రకారుడు కీ॥శే॥ ఆనంద్ కూ___
అత్యంత ఆదరాభిమానాలతో ముఖచిత్రాన్ని గీసి ఇచ్చిన సుప్రసిద్ధ చిత్ర కారులు డా॥ బాపు గారికి నా ఆభినందనలు.
రచయితగా నా యీ ప్రయత్నానికి, కృషికి, ఉడతా భక్తిగా ఆర్థిక సహాయం అందించిన తిరుమల, తిరుపతి దేవస్థానం వారికి, గ్రంథాన్ని సుందరంగా ముద్రించిన క్రాంతి ప్రెస్ శ్రీధర్ గారికి, నాటక జానపద కళారంగాలలో నేను చేస్తున్న కృషికి, ప్రారంభంనుండీ నా వెన్ను తట్టి నన్ను ఉత్సాహపర్చిన డా॥ అక్కినేని నాగేశ్వర రావు, డా॥ యన్, టి రామరావు, డా॥ గుమ్మడి, శ్రీ పివి ఆర్ కె. ప్రసాద్, డా॥ వేణుమాధన్, సవేరా అధిపతి శ్రీ ఎ. వెంకట కృష్ణారెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపు కుంటున్నాను.
రాజకీయాలకు, కళలకూ, అంకితమైన నా జీవితంలో అజ్ఞాత హస్తంగా నిలిసి నాకు అండదండ లందించిన నాజీవిత భాగస్వామి, నా అర్థాంగి సీతారత్నంకు అభినందనాలు చెప్పకుండా వుండలేను.
జానపద కళా రూపాలలో, కళాసేవలో అవిశ్రాంతంగా కృషి చేసి అనంతాకాశంలో కలిసిపోయిన అజ్ఞాత కళాకారులందరికీ నా జోహారులు.