తెలుగువారి జానపద కళారూపాలు/పలు కళారూపాలను వర్ణించిన పాల్కురికి సోమన్న
పలు కళారూపాలను వర్ణించిన పాల్కురికి సోమన్న
మొదటి ప్రతాపరుద్రుని కాలంలో జీవించిన పాల్కురికి సోమనాథుడు, కాకతీయ యుగంలో గొప్ప విప్లవ కవిగా వర్థిల్లాడు. బసవ పురాణంలోను, పండితారాధ్యచరిత్రలోను ఆయన ఆ నాటి విశేషాలను ఎన్నో తెలియ జేశాడు. కళారూపాల ద్వార వీర శైవమతాన్ని ఎలా ప్రచారం చేసింది వివరించాడు. ఆ నాడు ఆచరణలో వున్న అనేక శాస్త్రీయ నాట్య కళా రూపాలను గూర్చి, దేశి కళారూపాలను గూర్చీ వివరించాడు.
- బసవ పురాణం చెప్పిన భక్తి పాటలు:
సోమనాథుని కాలానికి ముందే తుమ్మెద పదాలు, పర్వత పదాలు, శంకర పదాలు, నివాశిపదాలు, వాలేశు పదాలు, వెన్నెలపదాలు మొదలైన వెన్నో ఆచరణలో వుండేవి. కాని, ఈ పదాలన్నీ క్రమంగా నశించటం వల్ల జనసామాన్యంలో విద్యా ప్రచారానికి అవకాశాలు చాల వరకు తగ్గి పోయాయి. ప్రజల్లో ఎక్కువమంది పాటలకే ప్రాముఖ్యమిచ్చినట్లు బసవపురాణం లో ఈ క్రింది విధంగా ఉదహరించ బడింది.
మేటియై చను భక్తకూటువలందు - పాటలుగా గట్టి పాడెడు వారు,
ప్రస్తుతోక్తుల గద్యపద్య కావ్యముల విస్తారముగజేసి వినుతించు వారు,
అటుగాక సాంగభాషాంగక్రియాంగ-వటునాటకంబుల నటియించు వారు,
మునుమాడి వారు వీరనవనేలకూడి-కనుగొన రోళ్ళ రోకళ్ళ బాడెదరు.
భక్తకూటువులనే భజనమండలి సమాజాలు పాటలు కట్టి పాడుకోవడం, రోకటి పాటలు కట్టి పాడుకోవడం (రోకటి పాటలంటే దంపుళ్ళ పాటలు) ఆ నాటికే ఏర్పడ్డాయి. ఈ నాటికి ఈ పాటలు ప్రజాసామాన్యంలో దంపుళ్ళ పాటలు గాను, భజన సమాజాల్లో భక్తి గీతాలుగాను ఏర్పడి ఉన్నాయి. రోకటి పాటలను శివభక్తులు ఇండ్లలో వేదాల్లాగా వల్లించే వారట. శిరియాళచరిత్రను గురించి బసవ పురాణంలో__
కరమర్థి నూరూర శిరియాలు చరిత - పాటలుగా గట్టి పాడెడు వారు
అటుగాక సాంగభాషాంగ క్రియాంగ - పటునాటకంబుల నటియించువారు
శిరియాలు చరితను పాటలుగా గట్టి పాడటమే గాక, ఆ కాలంలో నాటక ప్రదర్శనాలు కూడ జరిగినట్లు పై ఉదాహరణల వల్ల తెలుస్తూ వుంది.
- పండితారాధ్య చరిత్రలో ప్రజాకళారూపాలు:
ఆ నాటి తెలుగు రచనల్లో కేవలం సూచనలే గాక, నృత్యకళకు సంబంధించిన అనేక వర్ణనలు మనకు లభిస్తాయి. సోమనాథుడు రచించిన పండితారాధ్య చరిత్ర పర్వతప్రకరణంలో నృత్య కళకు సంబంధించిన అనేక శాస్త్రీయ విషయాలనే గాక జాయప నృత్తరత్నావళిలో వర్ణించినట్లు జానపద నృత్యాలను కూడ వర్ణించాడు.
ఈ గ్రంథంలో సోమనాథుడు శ్రీశైలంలో శివరాత్రి మహోత్సవాలలో ప్రదర్శించే కళా రూపాల నన్నింటిని ఉదాహరించాడు. నృత్య కళకు, శైవ మతానికి పరస్పర సంబంధ మున్నట్లు కనబడుతూ వుంది. ప్రజాను రంజాకాలుగా వున్న ఆనాటి దేశీ నృత్యాలను ఆయన అద్భుతంగా వర్ణించాడు. యక్షగాన కళారూపాలను గూర్చి, దేశీ నాటక సంప్రదాయలను గూర్చి పండితారాధ్యచరిత్రలో ఈ విధంగా వర్ణించాడు.
- ఎన్నో ఆటలు - ఎన్నో నాటకాలు బహు నాటకములు:
ప్రమథపురాతన వటిచరిత్రములు-గ్రమమొంద బహునాటకము లాడు వారు
లలితాంగ రసకళాలంకారరేఖ - లలవడ బహురూప మాడెడువారు
గరణముల్, మొరవణుల్ గతులు జిత్రములు - నరుదుగ వెడ్డంగ మాడెడు వారు.
- ఆటలు:
అమరాంగనలు దివినాడెడు మాడ్కి -- సమరంగ గడలపైనాడెడు వారు
నావియద్గతి బక్షులాడెడునట్టి -- భానన మ్రోకులపై నాడు వారు.
- తోలుబొమ్మలాటలు:
భారతాదికథల జీరమఱుగుల - నారంగబొమ్మలాడించు వారు
గడునద్భుతంబుగ గంబసూత్రంబు లడారంగ బొమ్మల నాడించు వారు.
- యక్షగానాలు:
నాగట గంధర్వ యక్షవిద్యాధ - రాదులై పాడెడు నాడెడు వారు
విధమున బ్రచ్ఛన్న వేషముల్ దాల్చి యధికోత్సవము గులు కాడునట్లాడు.
- జంతు నృత్య విన్యాసాలు:
పాలు పారుదండనంబులు నొప్ప హంస - గతియును, మాతంగ గతియును వృషభ
గతియును, మర్కట గతియును మేష - గతియును, మయూర గతియును భోగి గతియును , నాబెక్కు గతులు, నొప్పారు,
రంభయాదిగ నప్సరస్సమూహంబు - గుంభినీసతులతో గూడియాడంగ
జప్పట్లు వెట్టంగ జక్కన లేచి- యప్పాట వెడయాట లాడెడు వారు
వేడుకతో జిందు నాడంగ వచ్చి - కోడంగి యాటల గునిసెడు వారు
భ్రమరముల్ సాళెముల్ బయకముల్ మెరసి - రమణ బంచాసి పేరణి యాడువారు.
ఈ విధంగా పండితరాధ్య చరిత్రలో సోమనాథుడు దేశి కళారూపాలను గురించి వర్ణించాడు. వెడయాట (వికట నర్తనం), చిందుకోడంగియాటలు, కోణంగి యాట (ఇది హాస్య నృత్యం) పేరణి, బహునాటకములు, బహురూపులు, వెడ్డంగము, అమర గంధర్వాంగనల నృత్యానుకరణలు, పక్షుల ఆటలు, గడాటలు, దొమ్మరాటలు, భారతాది కథల చాయాచిత్రాలు, బొమ్మలాటలు, పగటివేషాలు, మొదలైన వాటి నన్నిటినీ వర్ణించాడు. అంతే గాక నర్తకుల వేషభాషలను గురించి ఈ క్రింది విధగా వివరించాడు.
- నట్టువకత్తెల కట్టుబట్టల సోయగాలు:
నట్టువకత్తెలు ఆకాలంలో అర్థోరుకములు (చల్లడాలు) ధరించేవారట. అనాటి ప్రదర్శనాలలో, నర్తకుల రంగ ప్రవేశంతో నర్తనగానం ప్రదర్శింప బడేదట. దీనినే పూర్వరంగమని పేర్కొన్నారు.
అనంతరం నర్తకుల తెర వెడలిన తరువాత కన్నులూ, కనుబొమలూ మెదలైన అంగ, ప్రత్యంగ, ఉపాంగచలనాదుల ద్వారా అభినయాన్ని ప్రదర్శించేవారు. తరువాత జంత్ర సంగీత గమకాలతోనూ, వివిధ వాద్యాల దేశి నామాలలోనూ వర్ణించేవారు.
ఆనాటి నర్తకుల నర్తన తీరును ఉత్తేజంగా కావ్వ ధోరణిలో వివరించారు. ఈ వర్ణనలో రకరకాల నృత్య రీతులు వర్ణించాడు. ఒంటికాలి నడక, మోకాటి నడక, మరగాళ్ళపై నడక, కూర్చుండే ముందుకు నడుచుట, రొమ్ములతో ప్రాకుట, గిరగిర తిరిగే నృత్యానికి బ్రమర నృత్యమని పేరు. ఈ నృత్యాన్ని ఈనాడూ అరుదుగా చేస్తూనే వున్నారు.
అంతే గాక అనేక విధాలైన ఇతర నృత్య భేదాలను గూర్చీ, వివిధ కథలను వివరించే నాటక ప్రదర్శనాలను కూడ వర్ణించాడు. ఆ నాటి వాడుకలో నున్న నాట్య కళా చరిత్రను గురించి సోమనాథుడు ఎన్నో అమూల్యమైన విషయాలను మనకు అందించాడు.
దేశిలాస్యాంగాలను వర్ణించిన సోమనాథుడు వివిదాంగాల పట్టిక నిచ్చాడు. హంస, నెమలి, పాము, ఎద్దు, కోతి, మేక మొదలైన పక్షుల, మృగాల వాటి గతుల ననుసరించి చేసే నృత్యాల పట్టిక నిచ్చారు.
- బసవపురాణంలో జానపద కళలు:
సోమనాథుడు బసవ పురాణంలో కూడ కళలను గురించి వర్ణించాడు. బసవని వివాహ ఘట్టంలో కోలాటము, గొండ్లి, పేరణీ మొదలైన దేశి రూపకాలను పేర్కొన్నాడు.
జాతిగీతాలైన ఆనంగీతాలు, శంకర గీతాలు వర్ణించాడు. బసవని కళ్యాణ పురప్రవేశ సమయంలో పేరణి ప్రస్తావన వుంది. ఇది సౌరాష్ట్ర నర్తనాచార్యుల సాంప్రాదాయాను సారంగా నర్తించినట్లుంది.
ఇంకా పూర్వ సంగీతం, తెర తీయడం, దేశీ లాస్యంగాలు, ముఖరసం, సౌష్ఠవం, లలి, భావం, ధూకళి, ఝుంకళి, విభ్రమం, రేఖ మొదలైన వాటి ప్రస్తావన కూడ వుంది. ఈ విధంగా సోమనాథుడు ఆనాటి విషయాలను ఎన్నింటినో పొందుపరిచాడని వి. రాఘవన్ గారు 'తెలుగు సంస్కృతి ' లో ఉదాహరించారు.