తెలుగువారి జానపద కళారూపాలు/తెలగ దాసరులే, గంటె భాగవతులు

తెలగ దాసరులే, గంటె భాగవతులు

శాస్త్రీయంగా యక్షగానాలను ప్రదర్శించే కూచిపూడి వారు వేరు. జీవనోపాధిగా మిగిలిన ఈ కళను నమ్ముకొని జీవయాత్ర కొనసాగిస్తున్న ఈ సంచార తెగ వేరు. వీరు తెలగ దాసరులు. తెలంగాణా లోని నల్లగొండ, ఖమ్మం, వరంగల్, హైదరాబాదు జిల్లాలలో ఎక్కువగా నివసిస్తున్నారు.

గంటె భాగవతులు:

వీరిని గంటే భాగవతులని కూడా పిలుస్తారు. పెట్రోమాక్సులైట్లు, ఎలక్ట్రిక్ లైట్లు లేని ఆ రోజుల్లో పెద్ద పెద్ద గరిటెల్లో (అంటే గెంటెల్లో) ఆముదం పోసి అందులో వత్తుల్ని నానబెట్టి వెలిగించి ఆ వెలుగులో వీథి నాటకాలను ప్రదర్శించే వారట. అందుకే వీరికి గంటె భాగవతులనే పేరు కూడా వచ్చింది.

నాగరికత పెరిగిన తరువాత అనేక కళలు ఎలా కాలగర్భంలో కలిసిపొయ్యాయో ఈ కళ కూడ నానాటికి నశించిపోతూ వుంది. ప్రయాణ సౌకర్యాలు సరిగా లేని ఆ రోజుల్లో ఈ ప్రదర్శనాలను చూడటానికి పల్లెల ప్రాంతాల నుండి ప్రజలు తండోపతండాలుగా వచ్చి ఈ ప్రదర్శనం చూసి ఆనందించే వాళ్ళు. అయినా ఈ కళ ఏ ఆదరణా నోచుకోక పోయినా ఇంకా కొన వూపిరితో కొట్టుకుంటూ వుంది.

వారి ప్రదర్శనాలు:

గంటే భాగవతులు, రామనాటకం. సావిత్రి, సారంగ ధర, గయోపాఖ్యానం, లక్షణ భరణీయం, శశి రేఖా పరిణయం, గరుడాచలం, ప్రహ్లద, జయంత,జయపాల, సిరియాళ, గజగౌరి, అదృష్ట బాలచంద్ర మొదలైన పౌరాణిక జానపద యక్షగానాలను ప్రదర్శిస్తారు.

సంక్రాంతి మొదలు ఉగాది వరకూ రోజువిడిచి రోజు ప్రదర్శనాలు జరుగుతాయి. పల్లెల్లో వున్న మోతుబరి ఆసాములు ఇరవై ముప్పై రూపాయలిచ్చి, ప్రద్రర్శనాలను ఏర్పాటు చేస్తారు. గ్రామ ప్రజలందరూ ఉచితంగానే ఈ ప్రదర్శనాలను చూచి ఆనందిస్తారు. పర్వదినాలలో కూలీలు కూడ వీరి చేత నాటకాలు వేయిస్తారు.

దేశ సంచారులు:

వీరి వీధి నాటకాలు తోలుబొమ్మలాటలను పోలి వుంటాయి. బొమ్మలాటల్లో గందోళి గాడు బంగారక్క బొమ్మల రూపంలో హాస్యాన్ని అందిస్తే, ఈ నాటకాలలో గందోళిగాడు, బంగారక్క పాత్రలను మనుషులే ధరించి హాస్యాన్ని అందిస్తారు.

ప్రతి జట్టుకు పది మంది కళాకారు లుంటారు. ఒక కుటుంబంగా వుండి ప్రదర్శనల లిచ్చుకుంటూ ఒక వూరి నుండి మరో వూరికి పోతూ వుంటారు.

వారి ప్రదర్శనానికి అండగా హార్మోనియంను శృతిగా వాడుకుంటూ మద్దెల తాళాల సహాయంతో వేష ధారులు శ్రావ్యంగా కీర్తనలు పాడుతూ ప్రేక్షకులను ఆనంద పరుస్తారు.

నేపథ్యంలో, ఉపోద్ఘాతం:

వీరి ప్రదర్శనాల్లో ఒక పాత్ర రంగ ప్రవేశం చేసే ముందు, తెర లోనే చాల సేపటి వరకూ వుండి ఉపోధ్ఘాతం వినిపించటం వీరి సాంప్రదాయం. రంగం మీదనున్న పాత్ర ధారి ఆలపించే కీర్తనలను పునరుక్తిగా తక్కిన కళాకారులు సామూహింగా గానం చేస్తారు. కీర్తనలలోని సాహిత్యానికి అనుగుణంగా అభినయిస్తూ, ప్రేక్షకులను మంత్ర ముగ్ధుల్ని చేస్తారు. పురుషులే స్త్రీ పాత్రలను ధరిస్తారు. వీరి ప్రదర్శనాల్లో పాత్రలు ధరించిన మునిసంపుల గ్రామానికి చెందిన రావుల కోదండం, బసవ బోయిన సవారి రాజు నాయక పాత్రల్లోనూ, మాదగాని పాపయ్య స్త్రీ పాత్రలోనూ ప్రసిద్ధులని గర్వంగా చెప్పుకుంటారు.

వీరి స్త్రీలు తట్ట నెత్తిన పెట్టుకుని, అద్దాలు, దువ్వెనలు, సబ్బులు, గాజులు, రిబ్బన్లు, పౌడర్లు, పిన్నులు మొదలైన స్త్రీలకు కావలసిన వస్తువుల్ని అమ్ముకుంటూ, కుటుంబ పోషణ భారాన్ని పంచుకుంటారు.

పూర్వం ఈ భాగవతులకు భూస్వాములు, జమీందారులు మడి మాన్యాలిచ్చి ప్రోత్సహించేవారు. ఈ నాడు ఆ మాన్యాల నన్నిటినీ పోగొట్టుకుని నూన్య హస్తాలతో దుర్భరమైన పేదరికాన్ని అనుభవిస్తున్నారని ఒక వ్యాసంలో దిలావర్ గారు ఉదహరించారు.

దాసర్లు:

తెలంగాణా లోని దాసర్లు సర్కాంధ్రలో దాసర్లు కారు. సర్కారాంధ్రలో బిక్షమెత్తె హరిదాసుళ్ళు, వైద్యంచేసే హరిజన దాసర్లూ (దాసుళ్ళు) వున్నారు. తెలంగాణాలోని వారు హరిజనులకు గురువులు. వీరిని మిత్తుల అయ్యవార్లు అంటారు. సర్కారాంధ్రలో వైష్ణవ గురువులకు ఎంత గౌరవం వుండేదో, ఈ మిత్తుల అయ్యవార్లకు తెలంగాణా హరిదాసుల్లో అంత గౌరవం వుంది.

వీరు కేవలం గురువులే కాక, వీరిలో చాలమంది కళాకారులు కూడా. వీరు వీథి నాటకాలు ఆడతారు. వీరి ముఖ్య నాటకం గరుడాచలం. వీరి వద్ద ఒక విధమైన తంబురా వుంటుంది.

దాన్నిసన్నని గజ్జెలతో వాయిస్తారు. దాని నుండి తంబురా ధ్వనే కాకుండా, మృదంగ ద్వని కూడ వస్తుంది. వీరిలో కొంతమంది సాంప్రదాయక యక్షగానాన్ని కూడా ప్రదర్శిస్తారు.