తెలుగువారి జానపద కళారూపాలు/జంతర్ మంతర్ జంతరు పెట్టె
జంతర్ మంతర్ జంతరు పెట్టె
ఆంధ్రదేశంలో పర్వదినాలలో, జాతర్లలో, తిరునాళ్ళలో ఈ జంతరు పెట్టె పైసా తమాషా చూపిస్తూ వుంటారు. పిన్నలు మొదలు పెద్దలు వరకూ, ఈ వింత తమాషాను చూస్తారు.
పెద్దల కంటే పిల్లల్నే ఎక్కువ ఆకర్షిస్తుందీ జంతరు పెట్టె. ఇది నాలుగు పలకల గల ఒక పెద్ద పెట్టె. ఆ పెట్టెను చూపరులు ఆకర్షించేటట్లు రకరకాల అందాలను చేకూర్చి ఆకర్షవంతంగా తయారు చేస్తారు. ఆ పెట్టెకు మూడు కాళ్ళు గల స్టాండును, చూడటానికి అనువై నంత ఏత్తులో నిలబెడతారు. ఆ పెట్టెకు ఒక ప్రక్కన లోపల చూపించే బొమ్మలను చూడటానికి వీలుగా ఒక రంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. రెండవ ప్రక్కన బొమ్మలు చూపించే వాడు నిలబడి వరుసగా పేర్చిన బొమ్మలను నడుపుతూ వుంటాడు. మరొకడు తాళం కొడుతూ రాబోయే బొమ్మను గురించి కాశీ పట్నం చూడర బాబూ అంటే బొమ్మతో కాశీ విశ్వనాథుని దేవాలయమూ గంగానదీ కనిపిస్తాయి. పాటను బట్టి బొమ్మ తరువాత బొమ్మను చూపిస్తూ వుంటారు. ఒక్కరే బొమ్మను చూడటానికి అవకాశ ముంటుంది. ఇలా బొమ్మను చూపిస్తూ వుంటారు. ఒక్కరే బొమ్మను చూడటానికి అవకాశ ముంటుంది. ఇలా బొమ్మను చూసే వాణ్ణి. తాళం కొట్టేవాడు కాశీ పట్నం చూశావా అంటూ ప్రశ్నిస్తే, ఆ చూశానంటూ తల పూతుతాడు. అలా కొన్ని బొమ్మలను చూపిస్తాడు. ఈలోగా చాల మంది పిల్లలూ పెద్ద వాళ్ళు గుమి కూడతారు. ఎప్పుడెప్పుడు చూడాలా అని వాళ్ళూ వువ్విళ్ళూరుతారు. ఇలా ఒకరి తరువాత మరొకరు డబ్బులిచ్చి బొమ్మలను చూపిస్తారు. ఇలా రామాయణం, భారతానికి సంబంధించిన బొమ్మలనూ, పిల్లలకు వినోదం కలిగించే కోతుల్నీ, కొంగల్నీ, జంతువుల్నీ కూడ చూపిస్తూ వుంటారు. ఇలా అందర్నీ ఆకర్షించేటట్లుగా రకరకాల బొమ్మలను అమరుస్తారు. దీనిని పట్టపగలే పదర్శిస్తారు. ఎక్కడ పడితే అక్కడికి, జనం వున్న చోటికల్లా మారుస్తూ వుంటారు. లోపల బొమ్మలు కదలక పోయినా, బొమ్మలు కదులుతున్నత అంగికాభినయాన్ని హంగుదార్లు చేస్తూ వుంటారు. ఇలా వారు ఒక వూరి నుంచి మరో వూరికి సంచారం చేస్తూ పొట్టపోసుకుంటూ వుంటారు.
జంతరులో వున్న ఒకే ఒక ఆకర్షణ పెట్టెలో ఏ బొమ్మలున్నాయేనన్న ఆసక్తిని కలిగించటం వారు పాడే పాటలో వచ్చే కథనంతా బొమ్మలలో చూపిస్తారు. ప్రదర్శనాన్ని ఇలా ప్రారంభిస్తారు.
పైన తమాషా చూడరబాబు
ఏమి లాహిరిగ వున్నది చూడు
ఏమి తమాషా లున్నయి చూడు
జంతర్ మంతర్ చూడర బాబు
జిబిజిబికిరి జిబిజిబికిరి జా .............. ॥పైన॥
కాశీ పట్నం చూడర బాబు
విశ్వనాథుని చూడ బాబు
కలకలలాడే గంగా నదినీ
కన్నుల పండగ చూడర బాబూ.......॥పైన॥
హరిశ్చంద్రుడు సత్యం కోసం
ఆలిబిడ్దలను అమ్మిన చోటూ
అడుగడుగుడుగో విశ్వేశ్వరుడు
హర హర యనుచును భక్తులు చూడు
చూచి మోక్షం పొందర బాబు..........॥పైన॥
హస్తినాపుర పట్నం చూడు
పాండవు లేలిన పట్నం చూడు
తాజమహలు చూడర బాబు
ఎర్రకోటను చూడర బాబు................... ॥పైన॥
ఇలా ఆయా ప్రాంతాల విశిష్టతను వివరిస్తూ, కళ్ళకు కట్టినట్లు వినిపిస్తూ చూపిస్తారు. ఇదే కళారూపాన్ని ఆంధ్ర ప్రజా నాట్య మండలి, ప్రాంతాల్లో వున్న దేశ పరిస్థితుల్ని వర్ణిస్తూ ప్రజాకవి కోగంటి గోపాలకృష్ణయ్య గారు ఇలా వ్రాశారు.
లాయరమ్మ లాయరో
లాయంపెట్టి చూడర బాబు
జంతరు పెట్టె చూడర బాబు .....................॥ జిబిజిబిరికి జా॥
ఎంత లాయరు గున్నదో చూడు
భారత దేశపు తీరును చూడు
భరత మాత కష్టాలను చూడు
భోరుభోరున ఏడ్చేను చూడు............. ॥ జిబిజిబిరికి జా॥
నల్లధనంతో సంచుల నింపి
కొల్లగొట్టిన ఘనులను చూడు
ధరలను పెంచిన ధనికుల చూడు
తాతా బిర్లా తరముల నుండి
మోస పోయిన మనుజుల చూడు
ఢిల్లీ పట్నం చూడర బాబు
ఎఱ్ఱకోటను చూడర బాబు
తెల్ల దొరలను చూడర బాబు
గాంధీ తాతను చూడర బాబు
జిన్నా సాబును చూడర బాబు...
అంటూ ఇలా దేశ పరిస్థితుల్ని వర్ణిస్తూ, తిండి దొంగల్నీ, లంచగొండుల్నీ, దుండగుల్నీ, దోపిడి దారుల్నీ బయట పెడుతూ దేశ భక్తిని ప్రబోధిస్తూ, చివరికి దుర్మార్గుల్ని ఇలా దుయ్య బట్టేవారు.
ఆడందం ఆరిపోను
ఆడి సోకు మాడి పోను
ఆడి బ్రతుకు కాలి పోను
ఆడి జన్మ ఆరిపోను........ ॥లాయరమ్మ లాయరో
లాయరమ్మ లాయరో॥.
అంటూ ప్రజలను వినోదపరుస్తూ, మరొ ప్రక్క విజ్ఞానపర్చేవారు. ఇది నాటి ప్రజా నాట్య మండలి కానుక.