తెలుగువారి జానపద కళారూపాలు/చాళుక్య చోళుల సొంపు పెంపులు

చాళుక్య చోళుల సొంపుపెంపులు

చాళుక్యరాజులు (32 మంది క్రీ.శ. 824 నుండి 1118 వరకు 500 సంవత్సరాలు ఆంధ్రదేశాన్ని నిరాఘాటంగా పరిపాలించారు. పూర్వ చాళుక్యుల్లో మొడటి చాళుక్య భీముడు క్రీ.శ. 910 ప్రాంతంలో విజయవాడ ఇంద్రకీలాద్రి పర్వతంమీద శివాలయాన్ని కట్టించి అందులో పార్థివేశ్వరస్వామిని ప్రతిష్టించాడు.

ఈ చాళుక్య భీమునికి లలిత కళల్లో అభిమానం ఎక్కువ. గాంధర్వ నాట్యవిద్యల్లో అభిరుచి ఎక్కువ. సమస్త గాందర్వ విద్యావిశారద యగు చల్లవ అనే వారవిలాసిని ఆయన ఆస్థానంలో వర్థిల్లింది. చల్లవ తండ్రి మల్లప్ప సంగీత శాస్త్రంలో ఆరితేరిన విద్వాంసుడు. ఆనాటి గాయక శిఖామణుల్లో మల్లప్ప తుంబురుడని ప్రఖ్యాతి వహించాడు.

చాళుక్యభీముని కాలంలో సంగీతంతో పాటు సాహిత్యంకూడ పెంపొందింది. భట్టవామనుడనే కవి ఈయన ఆస్థాన కవిగా వుండి కావ్యాలంకార సూత్రమనే అలంకార శాస్త్ర గ్రంథాన్ని రచించాడని కొందరు చరిత్రకారుల ఆభిప్రాయం.

కళ్యాణి చాళుక్యుల, కళా విన్యాసం:

క్రీస్తుశకం 1126 నుండి 1139 వరకు మూడవ సోమేశ్వరుడు (విక్రమాదిత్యుని కుమారుడు) భూలోకమల్ల బిరుదుతో 13 సంవత్సరాలు రాజ్య పాలన చేశాడు. ఈతడు సర్వజ్ఞ చక్రవర్తి అని బిరుదు పొందాడు. అభిలషితార్థ చింతామణి అనే సకల భారత విజ్ఞాన ఖనియైన గ్రంథాన్ని రచించాడు. ఈయన అనేక మంది కవులను పోషించాడు. జాయన సేనాని నృత్తరత్నావళిలో చాళుక్య సోమేశ్వరుడు ముందెప్పుడో కళ్యాణ కటకంలో భూతమాతృ మహోత్సవంలో 'భిల్లి' వేషం ధరించి, నృత్యగానాలు చేసే ఒక స్త్రీని చూసి మెచ్చుకున్నాడని, ఆ నృత్యమే గొండలి, లేక గొండగి అయి, తరువాత అదే గొండ్లి అయినదని వివరించాడు. మూడవ సోమే శ్వరుడు స్వయంగా నాట్యాచార్యుడు. వట్టపు, గొండ్లి అనే నృత్యంలోని దోషాలను ఎవరో అడుగగా, దోషాలను సరిదిద్ది ఆడి చూపించాడు. నాటి రాణులూ సంగీత, నృత్త, వాద్యాది విద్యల్లో ఆరితేరిన వారు.

గౌడుగీతాలు, ఊయల పాటలూ:

చాళుక్య రాజు దేసి కవితను ఆంధ్ర దేశంలో నిలిపారనీ, కవిత్వంలోనూ దేసి, మార్గరీతులున్నట్లూ నన్నె చోడుడు కుమార సంభవంలో తెలియజేశాడు. కుమార సంభవమే ఆంధ్రుల మొట్టమొదటి ప్రబంధంగా పేర్కొనవచ్చు. చాళుక్యరాజుల కాలంలో ప్రజలు ఊయల పాటల్ని, గౌడు గీతాలను పాడుతూ వుండేవారని అభిలషితార్థ చింతామణిలో ఉదహరింపడింది.

వినోదాలను వర్ణించిన నన్నెచోడుడు:

ఆ రోజుల్లో బాలబాలికలు చిలక బొమ్మల్ని, దంతపు బొమ్మల్ని, తోలు బొమ్మల్ని, తయారు చేసి ఆడుతూ వుండేవారట. నన్నెచోడుడు తన కుమార సంభవం లో ప్రప్రథమంగా రంభ నాట్య వర్ణనను గురించి ప్రస్తావించాడు. ఆనాటి వినోదాల్లో అనేకం నేటివరకూ నిలిచి వున్నాయి. ఆనాడు అంకమల్ల వినోదం, కోళ్ళ పందాలు, లావక పిట్ట కొట్లాటలు, మేషమహిష యుద్ధాలు, పాపురాల పోట్లాటలు, గీత వాద్య నృత్యాలు, కథలు, ప్రహేళికలు, చదరంగం, పాములాటలు, మోడీలు, గౌడి, మాద్వి మొదలైన వెన్నో వున్నట్లు అభిలషితార్థ చింతామణి నుండి సురవరం ప్రతాప రెడ్డి గారు ఆంధ్రుల సాంఘిక చరిత్రలో ఉదహరించారు.

సానుల్ని పోషించిన చాళుక్య చోళులు:

చాళుక్య చోళయుగంలో రాజులు యుద్ధంలో విజయం పొందినప్పుడు వారి విజయ పరంపరల ఆనందంలో శివ, విష్ణు విగ్రహాలను ప్రతిష్టింప జేసి ఆలయాలను నిర్మించడంతో పాటు, స్వామివారి ధూప, దీప నైవేద్యాది అంగ, రంగ వైభోగాల నిమిత్తం సాని, మాని, నిబంధనకారులను దాసరి నాయకము లేర్పాటు చేసి వృత్తులిచ్చి క్షేత్రవైభవాన్ని పెంచారు.

ఈ రీతిగా ఈ కాలంలో దేవాలయాలలో సంగీతం, నాట్యం, శిల్పం, చిత్రలేఖనం, సాహిత్యాది లలితకళలను అఖండంగా పోషించాడు. ఆయన తన ఆస్థానం ఒక ప్రదర్శనశాలగాను, విద్యాస్థానం గాను అలంకరించాడు. ఆయన ఏర్పాటు చేసిన దేవాలయాలలో మూడువందలమంది సానులు, మూడువందల మంది మానులు కలిసి దేవాలయ కార్యాలయాలను నిర్వహించేవారట.

ఆటకత్తెల కోలాటాలు:

సామర్లకోట భీమేశ్వరాలయంలోని నందిమండప స్తంభాలమీద చెక్కబడిన గాయకీ, నర్తకీ, శిల్ప ప్రతిమలు ఆ కాలపు తూర్పు చాళుక్య శిల్ప కళకు ముఖ్య లక్షణాలు. ఇక్కడ హల్లీసకమనే దేశీ లాస్యం (కోలాటం) చూపబడింది. ఇందులోని ఆటకత్తెలు జతలు జతలుగా చీలి ఆటయెక్క లయ కనుగుణంగా కోలాటపు కోలలతో తాళం వేస్తున్నట్లుంది.

ద్రాక్షారామంలోను, సామర్ల కోట, భీమవరంలోనూ గల భీమేశ్వరాలయాలలో కోలాటం వేసే నర్తకీ మణుల ప్రతిమల వరుసలను స్థంభాలమీద చూడవచ్చు. సంగీతం, నృత్యం మొదలైన లలిత కళల మీద ఆకాలంలో ప్రజల కుండిన ఆదరణను వ్వక్తంచేసే ఇటువంటి శిల్ప కల్పన తరువాత శతాబ్దాలలో ఇంతకంటే అధిక ప్రజాదరణకు పాత్రమై వుండటం విజయనగర చరిత్ర వల్ల తెలుస్తూ వుంది. ద్రాక్షారామ భీమేశ్వారలాయాన్ని 10 వ శతాబ్దంలో చాళుక్య భీమరాజు నిర్మించాడని ప్రతీతి.

అవతరించిన ఆదినన్నయ మహాభారతం:

ఒక విశిష్టమైన జాతిగా చాళుక్యరాజుల కాలంలో ఆంధ్రులు స్థిరపడ్డారు. తూర్పు చాళుక్య రాజైన రాజరాజనరేంద్రుడు రాజమహేంద్రవరం రాజధానిగా వేంగీ దేశాన్ని క్రీ॥శ॥ 1022 నుండి 1063 వరకూ పాలించాడు. అన్నదమ్ముల కలహాలతో వేసారిపోయిన రాజరాజనరేంద్రుడు అన్నదమ్ముల కలహగాథైన మహాభారతగాథను ఆస్థానకవియైన నన్నయ భట్టారకునిచే వ్రాయించడానికి 1050 ప్రాంతంలో పూనుకున్నాడు. కాని ఆంధ్ర మహాభారతం అసలు నన్నయ ప్రారంభించినా ఏ కారణాల వల్లనో ఆ తరువాత రెండువందల సంవత్సరాలకు _ 1260 లో కాకతీయ గణపతి చక్రవర్తి ఆస్థానంలో ఉన్న తిక్కన ఆ మహాభారతాన్ని పూర్తిచేశాడు. ఈ విధంగా మహాభారతం తెలుగు గడ్డమీద అవతరించింది.

నన్నయ చెప్పిన నాటకానుభవాలు :

నన్నయ కాలానికే భానుడు, కాశిదాసు, శూద్రకకవి, శ్రీ హర్షుడు, భవభూతి, మొదలైన ప్రసిద్ధ నాటక కర్తల నాటకాలు వ్వాప్తిలో వున్నాయి. కాళిదాసుని శాకుంతలంతోనూ, భవభూతి ఉత్తర రామచరిత్రం తోను తనకు సంబంధ మున్నట్లు నన్నయ రచనల్లో కనబడుతూ వుంది.

నన్నయ కాలంలో నాటక ప్రదర్శనాలు జరుగుతూ వుండే ననడానికి ఉదాహరణగా, రాజరాజనరేంద్రుడు తనతో చెప్పినట్లు నన్నయ మహాభారతం అవతారికలో

చ॥విమలమతిన్ బురాణములు వింటి ననేకము, లర్థధర్మశా
స్త్రముల తెఱం గెఱింగితి, నుదాత్తరసాన్వి త కావ్వనాటక
క్రమములు పెక్కు సూచితి, జగత్పరి పూజ్యములైన ఈశ్వరా
గమములయందు నిల్పితి ప్రకాశముగా హృదయంబు భక్తితోన్.

అని ఉదహరించాడు. ఆ కాలంలో పురాణ పఠన శ్రవణం, శాస్త్రాలను గురిచి తెలుసు కోవడం, నాటకాలను చూడడం మెదలైనవి వున్నట్లే కాక , కన్నులారా నాటకాలను చూసినట్లు రాజరాజనరేంద్రుడు చెప్పడమే ఆ కాలంలో నాటకా లున్నాయనడానికి బలమైన నిదర్శనం.

తిక్కన సోమయాజి భారతం విరాట పర్వలో ఉత్తర నేర్చుకున్న విద్యల్ని వర్ణిస్తూ దండలాసకం, కుండలి, ప్రెక్కణం, ప్రేరణం మొదలైన నాట్య భేదాల్ని పేర్కొన్నాడు. విరాట ఉద్యోగ పర్వాలలో నాట్య,నాటకాల ప్రసక్తి కొల్లలుగా వున్నాయి. ఆనాడు తోలు బొమ్మలు ఆడినట్లూ భారతం విరాట పర్వంలో ( 3 -164) వివరించ బడింది.

పిచ్చిగుంటులు చెప్పిన పల్నాటి వీర చరిత్ర:

వేంగీ చాళుక్యరాజుల పరిపాలన క్రీ.శ. 1100 తో అంతమైన తరువాత, చోళ, చాళుక్య మైత్రి ఫలితంగా రాజరాజనరేంద్రుని సంతతి వారు కాంచీ నగరంలో పరిపాలన ప్రారంభించారు. ఈ తరుణంలో ఆంధ్రదేశంలో వెలనాటి చోడుల ఆధిపత్యాన అనేక మంది సామంత రాజులు పరిపాలించారు. నిజానికి వీరంతా సర్వ స్వతంత్రులు. ఈ చిన్న రాజ్యాల మద్య అనేక తగాదాలు, వైషమ్యాలు పెరిగిపోయి, 1172, 1882 మధ్య కాలంలో గుంటూరు జిల్లా పల్నాడు తాలూకా కార్యంపూడిలో పల్నాటి యుద్ధంగా పరిణమించింది.

పల్నాటి వీర చరిత్రను గురించి ఆంధ్రదేశంలో తెలియని వారెవరూ లేరు. ఈ వీరకథను పలనాటిలో పర్యటించిన శ్రీనాథ మహాకవి ద్విపద కావ్యంగా రచించాడు. దీనిని ఆంధ్రదేశంలో జానపద గాయకులైన పిచ్చుగుంటల వారు విపరీతంగా ప్రచారంలోకి తీసుకువచ్చారు.

వినోదాల వర్ణనలో శ్రీనాథుని కవితా వైభవం:

పలనాడులో గురజాల రాజాధానిగా పరిపాలించిన నలగామరాజు దర్బారులో జరిగే అనాటి సంతీత నృత్య వాద్య విశేషాలను శ్రీనాథుడు ఈ విధంగా వర్ణించాడు:

వింతగా గాయనుల్ వీణలు బూని - తంత్రులు బిగియించి తగ సుతిబెట్ట
సరిగమేళములైన స్వరసప్తకంబు - ఆరోహణావారోహణ భేదములను
బహునాగ సంప్రాప్తి వట్టుగా జేర్చి - సంచారి సంస్థాయి సరస భావముల
మృదుతర శబ్దార్థ మిళితమైనట్టి - ఘనతరాలంకార గతిపరంపరలు.

నాట్య మేళమువారి, నవ విలాసాలు:

ముార్ఛనల్ మొదలైన ముఖ్య ధర్మములు - జంతగాత్రంబులు జంటగావించి
చెలగి యెండిన చెట్లు చిగిరించునట్లు - పాడిరి తమతమ ప్రావీణ్య మెసగ
పాకశాసను కొల్వుపగిది నున్నట్టి వేళ -నేతెంచిరి విద్యాధికతను
నాట్యమేళమువారు నవ విలాసముల- వచ్చి నమ్రత మ్రొక్కి ప్రక్కగా నిల్వ
ఘనవైభవంబున కామ భూవిభుడు- నవ్వుచు సెలవెచ్చె నాట్యంబు చేయ
న(?)ర మృదంగములెస్స వాయించు- మేటి కుడి భాగమున యందు కుదురుగా నెలిచె..
తాళమానజ్ఞులు దాపటి దిశను- నిలిచి రుత్సాహంబు నేరుపు మీర
ముఖ వీణ వాయించు ముఖ్యు డొక్కండు- రాగ మాలాపించు రమణు లిద్దరును

నిండువేడుకతోడ నిలిచిరి వెనుక - కంజలోచన యను ఘనమైన పాత్ర
మదను పట్టపు దంతి మంజుల వానణి - భరతశాస్త్రోచిత బహురాగమలను
గరిమతో నేర్చి కంతు బాణంబు - వచ్చి సభాసదుల్ వర్ణించి చూడ
నిలిచి నాట్యమునకు నేర్పరియైన - వేత్రపాణికి దగ వినయంబు జూపి
అతడొనంగిన గజ్జె లతి భక్తి తోడ - పాదములంగట్టి పంచ వర్ణముల
కాశ గట్టిగ గట్టి కడు జవం బడర - మద్దెల తాళాల మధ్య నిల్చుండి
ఓరచూపున రాజు నొయ్యనజీచి - సమపాదయుతమైన స్థానకస్థితిని
తాత్పర్యమున దేవతలకును మొక్కి - పుష్పాంజలి యొసంగి పూని నాట్యంబు
సమకట్టి నాదంబు సభయెల్లగ్రమ్మ - కైకోలు విడుదలల్ ఘనకళాశైలి
కైముడి కట్నముల్ కనుపింప జేసి - వెలయంగ తొమ్మిది విధములయినట్టి
భూచారి నాట్యంబు ఒందుగా సలిపి - పదునారు విధములైన పరగినయట్టి
ఆకాశచారియు నమరంగనాడి -అంగహారాఖ్య గలట్టి నాట్యంబు
విదితమౌ తొమ్మిది విధముల నాడి -గతి చారి భేదముల్ గనుపడునట్టు
భ్రమణ సంయుత దీప్తపటిమమీరంగ - పాణిభేదములను బాటించి చూపి
స్థానకనంచయ నంయుక్తి యమర -ప్రేరణిదేశిని ప్రేంఖణసుద్ద
దండికాకుండలి తగు బాహుచారి - సప్తాతాండవములు సల్పె చిత్రముగ
సభవారా లాశ్చర్య సంయుక్తులైరె - తరువాత నిరుమేల దగు చెలు లమర
నంయుతా సంయుతా చలన సంకుచిత - నానార్థకరములు నాట్య హస్తములు
శిరమును చూపులు చెక్కిళ్ళు బొములు - దంతోష్టకంఠముల్ తగు చుబుకంబు
ముఖరాగపక్షముల్ మెదలుగా నెన్న - అంగంబులారు ఉపొంగంబు లారు
ప్రత్యంగనముదయం బారునుంగూడి -యెనిమిది పది యగు నెసగు నంగంబు
లమరంగ నభినయం బాశ్చర్యముగను - మాచెర్ల చెన్నుని మహిమంబు తెలుపు
ఆంధ్ర సంస్కృత వాజ్మయాది గీతముల - భావంబు లెస్సగా ప్రకటంబు చేయ
చూచి రంభాదులు చోద్యంబు నొంది - శిరసులు వంచియు సిగ్గును జెంది
రప్పుడు భూమీశుడాదరం బొప్ప - వస్త్ర భూషణములు వారల కిచ్చి.
భట్టునురమ్మని పంపించెనంత__

ఈ నృత్యంలో ముఖవీణలు వాయించే బారని, మృదంగ విద్వాంసుల్ని, లయ ప్రకారం తాళం వేయగల తాళమానజ్ఙల్ని, బహురాగాలను అన్ని స్థాయిలలోను పాడగల ప్రజ్ఞావంతుల్ని జంట గాత్రాలు కలిపి రాగం ఆలాపించే రమణుల గూర్చి కూడా వివరింఛాడు శ్రీనాథుడు.
శైవ, వైష్ణవ మతాల చైతన్యం:

ఇంతటి లలితకళావికాసంతో వర్థిల్లిన పలనాటి సీమలో అన్నదమ్ముల కలహాల కారణంగా పల్నాటి యుద్ధం ప్రారంభమైంది. పల్నటి యుద్ధానికి కేవలం రాజకీయ కారణాలే కాక సాంఘికమైన ప్రాధాన్యం కూడ ఎంతో వుంది. రామానుజుని వైష్ణవ మతం 11వ శతాబ్దంలో తమిళదేశంలో ప్రారంభమై ఆంధ్రదేశంలో ప్రవేశిస్తే, బసవయ్య వీరశైవ మతం 12 వ శతాబ్దంలో కన్నడ దేశంలో ప్రారంభమై ఆంధ్రదేశంలో ప్రవేశించింది. ఈ రెండుమతాల ప్రాబల్యమూ పలనాటి యుద్ధం మీద చాల వుంది.

వైష్ణవ మతం ఆంధ్ర దేశంలో ప్రవేశించక ముందు నుంచీ శైవమతం చాలకాలంగా ఆంధ్రదేశంలో ప్రచారంలో వుంది. చాళుక్యరాజులు ఎక్కవమంది శైవమతాన్ని ప్రోత్సహిస్తే తెలుగు చోడులు శైవ, వైష్ణవ మతాలు రెంటినీ సమన్యయ దృష్టితో ఆదరించారు.

ఈ మతాలు విజృంభణ ఆనాటి సాంఘిక ఆచార వ్వవహారాలలో, సంగీతంలో, నృత్యంలో సాహిత్యంలో, దేవాలయ వాస్తు నిర్మాణంలో, శిల్పంలోనూ ఎంతో మార్పు తీసుకు వచ్చింది.

శైవ మత చిద్విలాసాలు:

విష్ణుకుండిన వంశం తరువాత ఆంధ్ర దేశాన్ని పరిపాలించిన పూర్వ చాళుక్యులు వైదిక మార్గ నిరతులైనప్పటికి ఈ వంశంవారిలో చాల మంది శైవమతాన్ని అవలంబించిన పరమమహేశ్వరులున్నారు. వీరి కాలంలో ఇతర ప్రాంతాల నుండి పాశుపతి శివాచార్యులు తెలుగు దేశానికి వచ్చి, పాశుపత శైవ సంప్రదాయాన్ని వ్వాపింప జేసి శివాలయాల్లో స్థానాపతులుగా వున్నారు. అట్టి వారిలో మొట్టమొదటి సారిగా తెలుగు శాసనాలలో తెలిపినవారు వామశివ, పురుషశివ అనే పేర్లు గల శివాచార్యులు. వీరు చాళుక్య కులజుడైన మంగి యువరాజు పుత్రుడైన విష్ణు వర్థనుని శాసనాలలో పేర్కొనబడ్డారు. ఆయన ఏలూరు దగ్గర ఉన్న వసంతవాడ గ్రామం లోని శివాలయత్రయానికి, వాద్య, వాదక, గాయక, నటకాచార్య విలాసిని జనభృతి నిమిత్తం 'పవన్ ధూ 'రను ప్రాచీననామం గల వసంతవాడలో కొంత భూమిని దానం చేసి దానశాసనం వ్రాయించి ఆ శివాచార్యులపరంగా ఇచ్చియున్నాడు.

శైవమతం భక్తి సాంప్రదాయంగా వ్వాపించడంతో శివలీలలు పాడటం, అభినయించటం, శివకథలు ఆడటం, వాడుకలోకి వచ్చి నాట్య సంగీత కళలు వృద్ధి పొందాయి. శివాలయాల్లో అంతకు పూర్వం పెద్ద పెద్ద మండపాలుండేవి కావు. ఇప్పుడు వాటిలో నాట్య, సంగీత మండపాలు ఏర్పడినాయి.

ఆ దేవాలయాలలో స్వామి అర్చనావసరాన శివలీలలు పాడి ఆభినయించ డానికి పాత్రధారులు నియమితులై వుండేవారు. స్వామి వారి అంగ,రంగ, వైభోగాల నిమిత్తం శ్రీమంతులు, మహారాజులు, సామంతులు, మాండలికులూ మాన్యాలను దానం చేయడం ఆచారమైంది. ఆనాడు దేవాలయాలు సంగీత, నాట్య కళలనూ, విద్యలకూ ఆధారభూతమైనాయి.

దేశికవితను పండించిన శైవకవులు:

శైవ, వైష్ణవ మతాల ప్రాబల్యం వచ్చిన తరువాత సాహిత్యంలోనూ, నాటా రచనలోను, గేయ వాజ్మయంలో కూడ పెద్ద మార్పు రాసాగింది. గేయరచననూ, సంగీతానికి తెలుగు భాష అనుకూలంగా వుందడం వల్ల జనసామాన్యానికి అర్థమయ్యే రీతుల్లో శైవకవులు, శైవమత ప్రచారంకోసం, వచన నాటకాల్ని వదిలి పద్యరచనతో కూడుకున్న వాజ్మయాన్ని సృష్టించారు.

అంతేగాక ఆనాడు దేశీయ నాటక రచనకు దారి చూపించిన వారు కూడ శివకవులే, జనసామాన్యాన్ని తేలిక పద్దతుల్లో ఆకర్షించటానికి వారు సంస్కృత నాటాకాల పద్ధతిని మాని, దేసీపద్ధతినీ ప్రారంభించారు.

పంక్తి బాహ్యులు:

దేశీనాటకాలు మాత్రం ప్రజాసామాన్యంలో ప్రదర్శింపబడేవి. ఈ నాటకాలను శైవమత ప్రచారకులు ఎక్కువ వ్వాప్తిలోకి తెచ్చారు. దేశి నాటకాలు పురాతన కాలం నుంచీ ప్రజాసామాన్యం యెక్క అభిమానాన్ని చూరగొన్నవి. దేశీనాటక సాంప్రదాయాలు చాలవరకు శివకవులు ఆధ్వర్యంలోనో వర్థిల్లాయి. అవి బహుజన రంజకంగానూ, తేలిక పద్ధతిలోను సామాన్య ప్రజలకు అర్థమయ్యే శైలిలోనూ వ్రాయబడ్డాయి. ఆనాడు ఆర్య సాంప్రదాయం ప్రకారం నాటకాలాడే నటకులను పంక్తి బాహ్యులుగా నిర్ణయించారు. అటువంటి వారికి సంఘంలో గౌరవ మర్యాదలు శూన్యం.

అందరూ ఆదరించిన దేశినాటకాలు

కాని శైవ మతాన్ని అవలంబించిన వారికి గాని, ఏ విధమైన జాతివివక్షణా లేని జంగాలకు గాని ఇటువంటి నిర్ణయాలను, విధి నిషేదాజ్ఞలను వారు పాటించలేదు. అంతే గాక శైవమతాన్ని అవలంబించిన బ్రాహ్మణాది అగ్ర వర్ణాల వారికి కూడ ఏ విధమైన పట్టింపూ లేక పోవడం వల్ల అగ్ర జాతుల వారందరూ దేశీ నాటకాలనే ప్రదర్శించారు.

ఇక్కడ గమనించవలసిన విషయ మేమంటే శైవ భక్తులైన జంగాలు మొదలైన వారు శివ సంబంధమైన కథా ఇతివృత్తాలనే తీసుకొని రచనలు సాగించారు. వేరు కథా వస్తువుల్ని వారు స్వీకరించ లేదు. నాటకాలాడడంలో జంగము వారు ముఖ్యులని కృష్ణ దేవరాయల కాలంలో వున్న బైచరాజు వేంకటనాథ కవి 'కడివోని తెఱ నాటకపు టూరిజంగాలు ' అని పేర్కొన్నాడు.

పై విషయాన్ని బట్టి శైవ సంబంధమైన ఇతి వృత్తాలు గల నాటకాలే ప్రథమంగా వ్రాయబడ్డాయని చెప్ప వచ్చు.

వైష్ణవమతం - కళా పోషణ:
పదకొండవ శతాబ్ధంలో దేవాలయ నిర్మాణంలో పెంపు కలిగింది. అంత వరకూ ఒక గర్భ గృహమూ, అంతరాళికమూ, ముఖమండపాలాతో వున్న దేవాలయాలలో ప్రధాన దైవాలకే కాక, పరివారాలకు కూడ గృహాలేర్పడ్డాయి. పన్నిద్దరాళ్వారులను విష్ణు భక్తులు పన్నెండవ శతాబ్ధంలో విష్ణ్వాలయాలలో విగ్రహా రూపంగా ప్రవేశించారు. దేవాలయ విన్యాసాలలో కళ్యాణ మండపం, సభా మండపం, నాట్య మండపం, మొదలైన అనేక మండపాలు అంతర్భాగా లైనాయి. నాట్య, సంగీత, చిత్రకళా నిలయమై దేవాలయం ఒక కళా పోషక సంస్థ ఐంది.
శైవం, వైష్ణవం చేరదీసిన నాట్యం:

శైవం, వీరశైవం, వైష్ణవం విజృంభించిన కాలంలో, దేశంలో అనేకమైన శైవ, వైష్ణవ దేవాలయాలు ఏర్పడ్డాయి. ఈ ఆలయాలన్నీ సంగీత నాట్యాలను ఎక్కువగా ఆదరించాయి. ప్రతి ఆలయంలో దేవ పూజా సమయంలో నాట్యం జరిగేది. ఉత్సవ సమయాల్లో ప్రత్యేకమైన ప్రదర్శనాలు జరిగేవి. ప్రతి దేవాలయంలోను నాట్య మండపాలుండేవి. అనేక మంది గాయకులు, వాద్యకులూ, నర్తకీ, నర్తకులూ దేవాలయ సిబ్బందిలో ఒక భాగంగా వుండేవారు. అనేక మంది శిల్పులు దేవాలయలమీద, స్థంభాల మీదా, గోడల మీదా, ద్వార బంధాల మీడా అనేకమైన భరత నాట్య కళారీతుల్ని చెక్కి నాట్యకళా సేవ చేసారు.

అంతమైన అన్నదమ్ముల కలహం:

పల్నాటి యుద్ధంవల్ల అపార జననష్టం కలిగింది. ఇరుపక్షాలకూ తోడ్పడిన అనేక మంది చిన్న చిన్న సామంత రాజు లందరూ ఈ యుద్ధంలో నాశన మయ్యారు. ప్రజలు అనేక కష్టనష్టాలకు గురైనారు. సుస్థిర మైన ప్రభుత్యం కోసం ఎదురు చూడసాగారు. ఈ పరిస్థితిని గమనించిన కాకతీయులు దిగ్విజయ యాత్రలు ప్రారంబించి, సామంత రాజులందరినీ ఓడించి ఆంధ్ర దేశాన్నంతా తమ ఏలుబడి క్రింద ఐక్యం చేసి సుమారు 200 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశారు.

పల్నాటియుద్ధం నాటికే ఆంధ్రప్రదేశమంతటా బహుళవ్యాప్తి పొందిన వీరశైవమతం కాకతీయులకాలంలో 1200-1300 సంవత్సరాల మధ్య ఎంత వుధృతంగా వ్యాపించిందో ముందు చూడగలం

దేవాలయాలకు దిగివచ్చిన నాట్యకళ:

ఏ రాజులు ఏ కళాసాంప్రదాయాన్ని పోషించారో, ఏ శిల్పులు ఏ శిల్పాన్ని మలిచారో, ఏ కళాకారులు ఏ నృత్యాలను ప్రదర్శించారో మనకు సరియైన సాక్ష్యాధారాలు లేకపోయినా, నేటి ఆంధ్రదేశంలో ఉన్న పురాతన దేవాలయాలన్నిటిమీదా నాట్య శిల్పాలు చెక్కబడి మనకు దర్శన మిస్తున్నాయి. ఒననాడు వుధృతంగా ఆంధ్రదేశంలో అభివృద్ధి పొందిన నాట్యకళకు సాక్ష్యాధారాలు ఈ శిల్పాలే. నాటి దేవాలయాలు హిందు సంస్కృతినీ లలితకళా సాంప్రదాయాలను చిత్రిస్తున్నాయి.

ఆనాడు దేవస్థాన నాటక రంగస్థలంలో దేవదాసీలు ఏయే భంగిమలో నృత్యాలను ప్రర్శించేవారో ఆ రూపాలన్నిటిని శిల్పులు సుందరంగా మలిచారు. ముఖ్యంగా దేవాలయాల్లో దేవదాసీల ఆరాధన నృత్యాలు జరిగేవి. దైవ సన్నిధిలో దైవాన్ని స్త్రోతం చేస్తూ నృత్య గానాలు జరిపేవారు. శైవ దేవాలయాల్లో శైవ సాంప్రదాయాన్నీ, వైష్ణవ దేవాలయాల్లో వైష్ణవ సాంప్రదాయాన్ని ప్రదర్శించేవారు. దేవాలయ శిల్పంలో నృత్య కళ కిచ్చిన ప్రాముఖ్యాన్ని బట్టి లలిత కళా పోషణ ఆ నాడు ఎంతగా జరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు.

శ్రీశైల దేవస్థానంలో పూర్వం శృంగనాట్యం, సప్తలాస్యం ప్రదర్శించి నట్లు ఆలయ శిల్పాన్ని బట్టి పూర్వం శైవసాంప్రదాయ నృత్యాలు జరిగినట్లు తెలుస్తూ వుంది. భామాకలాపం, గొల్ల కలాప ఇతి వృత్తాలు శ్రీశైల భ్రమరాంబస్తవంతో ప్రదర్శింప బడేవి.

దేవాలయాల్లో - దేవదాసీ నృత్యాలు:

ఇలాగే ఆంధ్రదేశంలో ఈ క్రింద వుదాహరించిన ఆ యా ప్రాంతాల్లో దేవాలయ నృత్య కళ అభివృద్ధి చెందింది.

పిఠాపురం, కుంతి మాధవుని దేవాలయంలో వైష్ణవ సాంప్రదాయ నృత్యాలైన భామాకలాపం, గొల్ల కలాపం ప్రదర్శింపబడేవి.

తిరుపతి వేంకటేశ్వర దేవస్థానం వైష్ణవ సాంప్రదాయానికి చెందినప్పటికీ, ఇక్కడ నృత్య విద్యావికాసం అంతగా కనిపించడం లేదు. కాని గాన పద్దతికి సంబంధించిన రచనలు మాత్రం కొల్లలుగా వున్నాయి. తాళ్ళపాక అన్నమాచార్యులు వేంకటేశ్వరుని పై రచించిన సంకీర్తనలు ఆ కోవకు చెందినవే.

శ్రీకాకుళం ఆంధ్రమహావిష్ణు దేవాలయంలో వైష్ణవ సాంప్రదాయంలో ఆరాధన నృత్యకళ అభివృద్ధి చెందింది.

బాపట్ల భావనారాయణస్వామి దేవస్థానంలో సిద్ధాబత్తుని వారు వైష్ణవ సంప్రదాయానుసారం శాస్త్రీయ నృత్య కళను రూపొందించారు. శ్రీకాకుళం జిల్లాలో వున్న మరో పెద్ద క్షేత్రం శ్రీకూర్మం. ఇది వైష్ణవ సాంప్రదాయానికి సంబందించిన క్షేత్రమైనప్పటికీ, నృత్యానికి సంబంధించిన భజన సంప్రదాయం ఇక్కడ ప్రచారంలో కొచ్చింది.

మాచెర్ల శైవ, వైష్ణవ సాంప్రదాయలకు పుట్టినిల్లు. రెండు మతాల వారూ చెన్నకేశ్వర దేవాలయం లోనూ, వీరభద్రేశ్వరాలయం లోనూ, వారి వారి సాంప్రదాయాల ననుసరించి నృత్య కళను కేళిక పద్ధతిలో ఆరాధించారు.

చెయ్యూరు నందికేశ్వరస్వామి దేవాలయం శైవ సంప్రదాయానికి సంబంధించినది. ఈ ఆలయంలో వాద్య విశేషాలతో ఆరాధన నృత్యాలు జరిగేవి. యక్షగాన పద్దతి ప్రదర్శనలు కూడ జరిగేవి. ఈ స్వామి పైన అనేక భక్తి రచనలున్నాయి.

జొన్నవాడ అంబ దేవస్థానంలో శైవ సాంప్రదాయాల ననుసరించి అంబను స్తుతిస్తూ నృత్య ప్రదర్శనాలు జరిగేవి.

కాళహస్తి దేవాలయంలో శైవ సాంప్రదాయ నృత్యాలు జరిగేవి.

మార్కాపురం వైష్ణవ దేవాలయంలో కేళిక పద్దతిలో ఆరాధన నృత్యాలు జరిగేవి

ఈ విధంగా ఆంధ్రదేశపు నాలుగు చెరుగులా అనేక దేవాలయాలున్నాయి. అన్ని ఆలయాలలోను, శైవ వైష్ణవ సాంప్రదాయాల ననుసరించి నాట్య శిల్పాలున్నాయి. వీటిని పరిశోధించటం ఎంతైనా అవసరం. ఇప్పటికే ఈ పరిశోధనలో పండిపోయిన నటరాజ రామకృష్ణగారు ఎంతైనా అభినందనీయులు.