తెలుగువారి జానపద కళారూపాలు/గంగవెఱ్ఱి నెత్తించే గంగమ్మ జాతర్లు

గంగవెఱ్ఱి నెత్తించే గంగమ్మ జాతర్లు


ఆంధ్ర దేశంలో ఈ ప్రాంతానికి వెళ్ళినా, గంగానమ్మ, పోలేరమ్మ, మాచమ్మ, మరిడమ్మ, మహాలక్ష్మమ్మ, మహంకాళమ్మ మొదలైన ఎన్నో పేర్లతో ఈ జాతర్లు జరుగుతూ వుంటాయి. ఇది తరతరాలుగా జరుగుతున్న జాతర్లు. ప్రజలు ఎంతో మనశ్శాంతిని పొందుతూ వుంటారు.

అలా రాయలసీమలో కూడ ఏ మూల ప్రాంతానికి వెళ్ళినా కనిపించే దేవత గంగమ్మ అనీ, సాధారణంగా ప్రతీ గ్రామానికీ ఒక గంగమ్మ వుంటుందనీ, కొన్ని వూళ్ళకు ఇద్దరేసి గంగమ్మ లుంటారనీ, ఒకరు బ్రాహ్మణాది జాత్రర్లకూ, మరొకరు హరిజనులకు వుంటారనీ, అలాంటిది కాక ఒక్క, కాళాహస్తిలో మాత్రం ఏడుగురు గంగమ్మ లున్నారనీ ఉస్మానియా యూనివర్శిటీ తెలుగు శాఖ రీసెర్చి స్కాలర్ మాదిరెడ్డి అండమ్మ గారు తెలుగు పత్రికలో వివరించారు.

జాతర నిర్ణయం:

గంగమ్మ జాతర జరపాలంటే పెద్దలందరూ సమావేశమై ఒక తేదీని నిర్ణయించి ఆ విషయాన్ని చాటింపు ద్వారా గ్రామ ప్రజలకు తెలియ చేసి గంగమ్మలను స్థాపించే మూడు రోజులు ముందుగా అంటే డిసెంబరు నెల రెండవ ఆదివారం అర్థ రాత్రిని 12 గంటలకు చాటింపు వేస్తారు. ఇది జరిగిన తరువాత ఆ వూరి వారు ఎక్కడ వున్నా జాతర సమయానికి చేరుకుంటారు. కుమ్మరి వచ్చి మట్టితో ఒక్కో వీథికి ఒక్కొక్క గంగమ్మ చొప్పున ఏడు వీథులకూ ఏడు గంగమ్మలను తయారు చేసి, ముఖ్యంగా ఇది కాళహస్తి విషయం. ముత్యాలమ్మ గుడి వీథిలోనూ, పూసల వీధిలోనూ, సన్నిధి వీధిలోనూ, గుడి వీధి, గాంధీ వీథి, కొత్త పేట వీథి ఇలా గంగమ్మలతో పాటు ప్రతి గంగమ్మకూ ఇద్దరేసి ఉప గంగమ్మల చొప్పునా 14 ఉప గంగమ్మలను కూడ అందంగా తయారు చేసి పసుపు కుంకాలతో పూలతో అలంకరించి, దాగెర అనే వెదురు గంపలో వేపాకు పెట్టి దాని పైన మూడు గంగల్ని పెడతారు.

అర్థరాత్రి గంగమ్మ:

అలంకారాలు ముగిసేటప్పటికి అర్థ రాత్రి అవుతుంది. గంగమిట్ట దగ్గరకు గంగలు చేరగానే పంబల వాడు గంగమ్మ కథను క్లుప్తంగా చెపుతాడు. ఆ తరువాత చిన్నకోడి మెడ విరిచి అగరం ఇస్తారు. ఏడుగురు గంగమ్మలకు, రజకులు (చాకలి వారు) ఏడు కుంభాలు పెడతారు. ఈ కుంభాలకు కావలసిన సరంజామానంతా ఇస్తారు. కుంభంపైన, ములగ ఆకు కూర, వంకాయ కూర, ఎండు చేపల పులుసు పెడతారు. ప్రతి కుంభం పైన పిండి దీపం వెలిగించి పొట్టేళ్ళను బలి ఇస్తారు.

ఈ తతంగమంతా పూర్తి అయిన తరువాత గ్రామంలో గంగమ్మలను దించుకోవడానికి ప్రతి వీథి లోనూ ఒక గుడిని నిర్మిస్తారు. ఆ గుడిని పందిరిగా వేసి, వేపాకులు వ్రేలాడ గట్టి గుడిని అలంకరిస్తారు.

ఏడుగురు రజకులూ గంగమ్మలను ఎత్తు కుంటారు. మేళ తాళాలతో, ఆట, పాటలతో ముందుగా ముత్యాలమ్మ గుడి వద్దకు వస్తారు. పంబల వాడు కోడి మెడను విరిచి హారం ఇస్తాడు.

ఇలా గంగమ్మలు వచ్చే దారిలో ప్రతి చోటా రజకులు జంతు బలులతో రక్త తర్పణం చేస్తారు. ముత్యాలమ్మ గుడి వద్ద ఆ వీథి గంగమ్మ దిగగానే, ఏ వీధి గంగమ్మ ఆవీథికి వెళ్ళి పోతుంది. ప్రతి వీథి గంగమ్మ ఆ వీధిలోని వారు జంతువుల్ని బలి ఇస్తారు.

ముత్యాలమ్మ గుడి వద్ద దిగిన గంగమ్మను శక్తివంతమైన దానినిగా భావిస్తారు. అందుకే ఆమెను ముందుగా ప్రతిష్టిస్తారు.

నట్టింటి పోలేరమ్మ:

గ్రామంలో గంగమ్మలను స్థాపించిన తరువాత, చిన్నలూ, పెద్దలూ చుట్టాలతో ఇల్లు నిండి పోతుంది. అందరూ క్రొత్త బట్టల్ని ధరించి అమిత వుత్సాహంతో వుంటారు. ప్రతి ఇంటిలోనూ నట్టింట పోలేరమ్మను ఎవరికి వారు ఒక గోడకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ...మూడు విస్తళ్ళలో కుంభం కూడును పెట్టి పైన గంగమ్మల పెట్టిన మాదిరే కూరలను పెడతారు. పిండితో చేసిన ప్రమిదల్లో మూడు దీపాలు వెలిగించి మూడు విస్తళ్ళల్లో పెడతారు. గంగమ్మ కదిలే వరకూ ఈ దీపాలు ఆరిపోకుండా చూస్తారు. వారికున్న మ్రొక్కులన్నిటినీ తీర్చుకుంటారు. చీరెను నెట్టి కోరికలు కోరుకుంటారు.

అంతే కాక ఒక కుండలో అఖండలం వెలిగించి, నట్టింటి పోలేరమ్మ వద్ద పెడతారు. తరువాత ముత్తైదువలు దానిని ఎత్తుకు వెళ్ళి గంగమ్మ వద్ద మూడు ప్రదక్షిణాలు చేసి కుండను ఎత్తి పగల కొడతారు. పగిలిన రెండు మూడు పెంకుల్ని ఇంటికి తెచ్చుకుంటారు. పగిలిన పెంకులు ఇంట్లో వుంటే ఏ ఆపదా రాదని అలా చేస్తారు.

గంగమ్మను కదిలించిన తరువాత ఇంటిలో గోడకు పెట్టిన పోలేరమ్మ బొట్టును తుడిచి వేస్తారు.

వెంకటగిరిలో ఈ పోలేరమ్మ జాతరను వైభవంగాజరుపుతారు. వెంకటగిరి పోలేరమ్మను గోడకు పెట్టే బొట్లుతో కాకుండా నట్టింటిలో పీట వేసి పీట పైన బోనం కుండను గాని, దీపాన్ని గానీ పెట్టి దానిని దేవతగా పూజిస్తారు. అస్పృశ్యుడు, ప్రవేశార్హత లేని ఆసాది ఆరోజున నట్టింటి లోకి గంగమ్మ ప్రతీకగా భావించే త్రిశూలంతో ప్రవేసిస్తాడు. ఇంటి వారిని అదిరించి బెదిరించి కట్నాలు కానుకలు వసూలు చేసు కుంటాడు.

గణాచారులు:

గంగమ్మలు దిగినప్పటి నుంచీ గంగమ్మల వద్ద జరిగే హడావిడి ఇంతా అంతా అని చెప్పలేం. ప్రతి వారికీ గంగమ్మ ఆవహించినట్లు గణాచారులై పోతారు. అట్టహాసంతో ఆవేశంతో వూగి పోతారు. ఈలలు, కేకలు, గణాచారుల గంతులు, ఆసాదుల డప్పు వాయిద్యాలు ఎవరికి తోచినట్లు వారు నృత్యాలు, కొందరు గంగను స్తుతించడం, కొందరు తిట్టటం, కొందరు ఆవేశంతో ఏడుస్తారు. కొందరు భూమి మీద సాష్టాంగ పడి పోతారు. పంబల వారిని ప్రశ్న లడుగుతారు. గంగమ్మ ముందు దుత్తల్ని పగుల గొడతారు. ఊరంతా ఈ కోలా హలంలో మునిగి పోతారు. ఈ సందడిలో ఎందరో మత్తుగా త్రాగి చిందులు, గంతులూ వేస్తూ అట్టహాసం చేస్తారు.

గంగమ్మను కదిలించగానే జ్యోతిని ఎత్తుకుని ముత్యాలమ్మ గుడిని చేరిన రజకులు నిద్ర మత్తులో త్రాగిన మైకంలో, ఎర్రబడ్డ కళ్ళతో జ్యోతి ఎగదోస్తూ, అది ఆరి పోకుండా కాపాడుతూ వుంటారు.

ఆయా వీధుల వారు ఒక్కొక్క గంగమ్మను రథంపై పెట్టుకుని బయలుదేరుతారు. ఆ రథాలను విద్యుద్దీపాలతో అలంకరించి, బాజా బజంత్రీలతో తప్పెట్ల వాయిద్యాలతో ఆటలతో పాటలతో ముత్యాలమ్మ గుడి వద్దకు చేరుకుంటారు. ఈ వుత్సవం ఒక పట్టాభి షేక మహోత్సవంలా వుంటుంది. రజకులు మాత్రం సాంప్రదాయపు కాగడాల తోనే వుంటారు.

ఎరుపెక్కిన ముత్యాలమ్మ:

దేదీప్య మానంగా ప్రజ్వరిల్లుతున్న ఏడు జ్యోతుల వెలుతురు పసుపు కుంకాలతో ఎరుపెక్కిన ముత్యాలమ్మ ముఖం ఎఱ్ఱగా మారిపోతుంది. భయాన్నీ భక్తినీ కలుగ జేస్తుంది. పూజారి ఆమెను ప్రసన్నం చేసు కోవడానికి ప్రయత్నం చేస్తాడు. కుంభం కూడుపెట్టిన తరువాత గంగమ్మలను రజకులు ఎత్తుకుంటారు.ఆసాదివారు అనుసరిస్తారు. వారు ముందుగా గంగ మిట్టవద్దకు వెళ్ళి,అక్కడనుంచే సువర్ణముఖినదీ తీరానికి వెళతారు.ఆసాది వాడు బూతుపదాలు పాడుతూ వెళతాడు.జనం కూడ అతనిని అనుసరిస్తారు. దీవెన పదాలు పాడిన తరువాత గంగలను స్వర్ణముఖిలో నిమజ్జనం చేస్తారు.

ఇలా పూర్వ సంప్రదాయంతో తరతరాలుగా వస్తున్న ఈ గంగ జాతర్లను జరుపుతూ ఆ వుత్యాహంలో ఎన్నో జానపద గేయాలను, జానపద నృత్యాలను, జానపద వాయిద్యాలను ప్రయోగించి వుత్సవాలను జరుపుకుంటున్నారు.

కాలంమారిన దృష్ట్యా నాగరికత అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో ఈ గంగజాతర్లు కొంచెం తగ్గినా వెనుకబడ్డ గ్రామాలలోనూ, వెనుకబడ్డ జాతుల లోను ఈ గంగజాతర్లను భక్తిభావంతో చేస్తూనేవున్నారు.మన జానపద విజ్ఞానానికి గుర్తులు గంగ జాతర్లు.