తెలుగుతల్లి/సంపుటము 1/నవంబరు 1937/ఆంధ్రరాష్ట్ర మహాసభా సమావేశము

ఆంధ్రరాష్ట్ర మహాసభా సమావేశము

అక్టోబరు 25, 26, 27, తేదులలో బెజవాడయందు బ్రహ్మాండమగు సభలు జరిగినవి. రాయలసీమ వాసులను గొందఱిని పిలిచికొనివెళ్లి అసాధారణ మన్ననల దనిపి ఉత్తరాంధ్రులు తమపని నెఱవేరినదని తమ్ముదామభినందించుకొని మురిసిరి. ఏడుచుబిడ్డకు వెలగపండును జూపినట్లు సమయోచితముగ ననేక వాగ్దానములు జేసిరి;- ధన్యులు.

    "ఎప్పటికెయ్యది ప్రస్తుత
     మప్పటికామాటలాడి యన్యులమనముల్
     నొప్పింపక తానొవ్వక
     తప్పించుక తిరుగువారు".

ఆంధ్రరాష్ట్రము మనకందఱకుగావలయునని యున్నది. కాని, ఇదివఱకు రాయలనాటి ప్రజల విరసించి యధ:కరించి ద్వేషబీజముల మహావృక్షము లగునంతవఱకు బెంచి పెద్దసేసి యుండిన సంగతి ఏనుగులనెక్కి యూరేగిన నాయకులు మఱచినారనిన నది వారి దోష మెట్లగును? మహాభారతము శాంతిపర్వమున దిక్కయజ్వ

    "నెయ్యము సెడిననుమాటల
     తియ్యదనమువట్టి పగమదిన్ మరచినజా
     వయ్యెం జేటయ్యె గలక
     యయ్యె నొకటిమూడుగాక యదిమేలగునే?

     పగయుగల్గెనేని పాయునె, గూఢమై
     మ్రాననగ్నియున్న మాడ్కినుండు
     గాననమ్మిబేల కాలాంతరంబున
     నైనజెడును సందియంబువలదు||

     వినుచల్లని మాటలలో
     మునిగియలుక గుబ్బతిలు సముద్రజలములో
     ననయుండి యాఱకెప్పుడు
     గనగనమను బాడబాగ్ని కరణినరేంద్రా"

అని రాజనీతిని బ్రసాదియున్నారు. ఇది పరస్పరము "ఉత్తరాదివారును దక్షిణాదివారును" గమనింపవలసియున్నది. ఆంధ్రరాష్ట్రము వచ్చినదనుకొందుము. జనసంఖ్య విషయమునను, ఆదాయముపట్లను ఉత్తరాంధ్రులు పైచేయి గైకొనక తప్పదు. ఈరెండునులేని రాయలనాడువారు తమతో సమభాగము ననుభవించుటయనిన నది ఉత్తరాదివారికి మనసొప్పదు. అందువలన మరల మరల నంత:కలహము లేర్పడక తీఱదు. అట్టి "ఇంటిలోనిపోరు" దప్పించుకొను మార్గములేదు. బేలింపులకు బేలుపోయిన మననాయకు లీవిషయమును ముందాలోచనజేయవలెను. కీడెంచి మేలెంచవలయునను సూత్రము మన కిప్పట్టున గొలికిపూస.

________