తిట్ల జ్ఞానము - దీవెనల అజ్ఞానము/మూడు విడచిన వాడు

మూడు విడచిన వాడు

ఇదే విధముగ పూర్వము బ్రహ్మయోగిని గురించి చెప్పిన మాట నేడు హేళనగ మాట్లడునట్లు మారిపోయినది. దైవమును చేరుటకు గీతలో బోధించబడిన మార్గమును రెండు యోగములుగ ఉన్నవి. అవియే ఒకటి బ్రహ్మయోగము, రెండు కర్మయోగము. కర్మయోగము బయటి ప్రపంచముతో సంబంధము పెట్టుకొని పనులు చేయుచు సాధారణ మనిషి ఉండునట్లు కనిపించునదికాగ, బ్రహ్మయోగము బయటి ప్రపంచముతో సంబంధము పెట్టుకోక ఏ పనులు చేయక లోపల నిశ్చలతగ ఉండునది. బ్రహ్మయోగికి ఐదు జ్ఞానేంద్రియములు పనిచేయవు. ఒక వేళ పనిచేసిన ఆ విషయములను గ్రహించు మనస్సు ఉండదు. అతని ముందర బంగారపు ముద్దపెట్టిన, గుండ్రని రాయిపెట్టిన సమానమే. అలాగే అతనిని పొగడిన దూషించిన అవేవి ఆయనకు తెలియవు, కావున ఏ దానికి స్పందన ఉండదు. అందువలన బ్రహ్మయోగి విషయము తెలిసినవారు అతనితో ఎవరు మాట్లాడలేరని, ఎవరైన మాట్లాడిన అతను తిరిగి మాట్లాడడని, కనుక అతనితో ఎవరు మాట్లాడుతారని అనెడివారు. బ్రహ్మయోగి తన శరీరములో మూడు గుణవిషయములతో సంబంధము లేకుండ ఉండును. కావున మూడు విడచినవాడని అతనిని అనెడివారు. లోపల మూడు గుణములు విడచినవాడు మరియు బయట ఎవరితోను సంబంధములేనివాడు కావున "మూడు విడచిన వానితో ఎవరు మాట్లాడుతారని" బ్రహ్మయోగిని గురించి అనెడివారు. బ్రహ్మయోగి యొక్క గొప్పతనమును గూర్చి చెప్పిన మాటను మూడు విడచినవాడని అనగ ఈనాడు ఆ మాటను ఇతరులను హేళనగ మాట్లాడుటకు ఉపయోగించుచున్నారు. చెప్పిన మాటను వినని వానిని, ఒప్పుకోనివానిని అవహేళనగ మాట్లాడునపుడు మాట్లాడువారు మూడంటే ఏమిటి? మూడిటిని విడువమంటే ఏమిటి? అని ఆలోచించడము లేదు. పాపము గూల అనుమాట దూషణలోనికి చేరకుండ మధ్యలో ఊతపదము లాగ నిలచిపోగా, బ్రహ్మయోగిని సూచించు వాక్యము హేళన వాక్యమై నిలచిపోయినది.


కాల అనగ హిందీభాషలో నలుపు అని అర్థము. కాలము అనగ తెలుగుభాషలో కనిపించనిదని మరియు కనిపించకుండ పోవడమని అర్థము. కాలమును పరమాత్మ స్వరూపమని చెప్పవచ్చును. కాలము మనముందరే గడచి పోవుచున్నప్పటికి ఇది పలానయని ఎవరు గుర్తించలేరు. చీకటిలో కలిసిపోతే ఏది తెలియదు మరియు అన్నిటిని కనిపించకుండ తనలో కలుపుకొనుచున్నది కావున నల్లని చీకటిని కాలమని చెప్పుకొనుచున్నాము. కాలము భవిష్యత్తును వర్తమానముగ చేస్తున్నది, వర్తమాన కాలమును భూతకాలముగ చేస్తున్నది. కంటికి కనిపించని కాలము కంటికి కనిపించు వాటిని, చెవుకు వినిపించు వాటిని ఏమాత్రము వినిపించకుండ కనిపించకుండ చేస్తున్నది. ఆ విధానముతోనే ఎంతో జ్ఞానము కాలక్రమమున తెలియకుండపోయినది. అదే విధముగనే జ్ఞానముతో కూడుకొన్న దీవెనలు అజ్ఞానముతో కూడుకొని దూషణలుగ మారిపోయినవి. అలా మారిపోయి అందరికి మద్యలో ఉన్న వాటిని కూడ తిరిగి లేకుండ చేయడము కాలము యొక్క పని. కావున దూషణలుగనున్న దీవెనలు చివరకు దూషణలుగ కూడ లేకుండ పోవుటకు ప్రారంభించాయి. ఎక్కడైన పల్లెప్రాంతములలో మిగిలియుండి, అదియు ఆడవారి నోటిలో మెదలుచున్న కొన్ని దూషణలను జ్ఞానము ప్రకారము దీవెనలని చెప్పుకొని, వాటికి తిరిగి క్రొత్తగ అర్థము తెచ్చుకొన్నాము. అలాగే కొన్ని దీవెనలను జ్ఞానము ప్రకారము దూషణలని చెప్పుకొని వాటికి నిజమైన అర్థము ఏమిగలదో తర్వాత పేజీలో చూస్తాము.

-***-